పవన్‌ Vs లోకేష్‌.. బాబు ప్లాన్‌ ఫలించినట్టేనా? | CM Chandrababu Given 10th Rank To Pawan Kalyan | Sakshi
Sakshi News home page

పవన్‌ Vs లోకేష్‌.. బాబు ప్లాన్‌ ఫలించినట్టేనా?

Published Fri, Feb 7 2025 12:38 PM | Last Updated on Fri, Feb 7 2025 1:02 PM

CM Chandrababu Given 10th Rank To Pawan Kalyan

చంద్రబాబు చేసేది చౌకబారు రాజకీయం.. చిల్లర వ్యవహారాలు కానీ బిల్డప్పులు మాత్రం అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయి. దేశంలో ఏ ముఖ్యమంత్రి.. ఇంతవరకు ఏ ప్రధానమంత్రి కూడా చేయని విధంగా పాలన సాగిస్తున్నట్లు ఆయన ప్రచారం చేసుకుంటారు. ఎప్పట్లానే చంద్రబాబు మంత్రులకు ర్యాంకింగ్స్ ఇచ్చారు. మంత్రుల పనితీరుకు ప్రాతిపదిక ఏమిటో.. వారి ర్యాంకింగ్స్‌ ఏ అంశాల మీదుగా నిర్ణయించి ఇచ్చారన్నది ఆయనకు తప్ప వేరే ఎవరికీ తెలియదు.

మొత్తానికి క్యాబినెట్‌లోని పాతిక మంది మంత్రులకు చంద్రబాబు ర్యాంకింగ్‌ ఇచ్చేశారు. అందులో ఎన్ఎండీ ఫరూక్ మొదటి ర్యాంకులో ఉండగా జనసేనకు చెందిన కందుల దుర్గేష్ రెండో ర్యాంకులో ఉన్నారు.. చంద్రబాబు ఆరో స్థానంలో ఉండగా లోకేష్‌కు ఎనిమిది ర్యాంకు దక్కింది.. అన్నింటికీ మించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదో స్థానంలో నిలిచారు. అన్ని శాఖలను సమన్వయం చేస్తూ అందరి పనితీరును మదింపు చేసే చంద్రబాబు ఆరో ర్యాంకులో నిలవడం ఏమిటో మరి విచిత్రంగా ఉంది.

మంత్రులు అందరికన్నా ఎక్కువ అని ఫీలయ్యే లోకేష్ అన్ని శాఖలను సమన్వయం పేరిట కెలికేస్తున్నారు. ఒక పవన్ కళ్యాణ్ చూస్తున్న పంచాయతీరాజ్ శాఖ మినహా ఇతర అన్ని శాఖల్లోనూ లోకేష్ పెత్తనం సాగుతోంది. ఆయన ఆఫీస్ నుంచి ఫోన్ వెళ్తే ఏ మంత్రి కూడా కిక్కురుమనే పరిస్థితి లేదు.. ఆయన అనధికారికంగా సీఎంగా కొనసాగుతున్నారు.. ఢిల్లీ వెళ్లి పెద్దలను కలవాలన్నా.. దావోస్ వంటి సదస్సుల్లో పెద్దపెద్ద సీఈఓలతో చర్చలు జరపాలన్న లోకేష్ మాత్రమే సీన్‌లో ఉంటారు. ప్రధాని మోదీతో వేదిక పంచుకోవాలన్నా లోకేష్‌కి అగ్ర తాంబూలం ఉంటుంది. మరి ఇంత గొప్పగా ప్రధాన పాత్ర పోషిస్తున్న లోకేష్‌కు ఆరో ర్యాంకు ఇవ్వడం ఏంటి?.

పవన్‌ను వెనక్కి నెట్టేశారా!
మిగతా మంత్రుల ర్యాంకింగ్స్‌ ఎలా ఉన్నా కూటమిలో ఉంటూ ఇండిపెండెంట్‌గా ఎదగాలని.. సొంత మార్క్ చూపాలని ఆరాటపడుతున్న పవన్ కళ్యాణ్‌ను మాత్రం ఏకంగా 10వ స్థానానికి నెట్టేశారు చంద్రబాబు. ఢిల్లీ పెద్దల కనుసన్నల్లో నడుస్తూ తన పాలిట కంట్లో నలుసుగా మారుతున్నారు అని పవన్‌పై ఇప్పటికే చంద్రబాబు నిఘా వేశారు అని అంటున్నారు. ఈ తరుణంలోనే పవన్ కళ్యాణ్ గత పది రోజులుగా జ్వరం పేరిట సెలవులో ఉన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనకుండా దూరంగా ఉంటూ వస్తున్నారు. అంతేకాకుండా హోం మంత్రి అనిత.. టీటీడీ చైర్మన్ నాయుడు వంటి వారి విషయంలో పవన్ చేసిన కామెంట్లు కూటమి ప్రభుత్వాన్ని ఇరుక్కుని పెట్టాయి. పవన్‌ను అలాగే వదిలేస్తే శల్య సారథ్యం వహించి కూటమి రథాన్ని ఏదో రోజు బోల్తా కొట్టిస్తారు అనే భయం ఉన్న చంద్రబాబు ఇప్పుడు పవన్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా పథకాలు వేస్తున్నట్లు తెలుస్తోంది.

అందుకే, పవన్.. మీ పనితీరు ఏం బాలేదు చూసావా.. ఏకంగా పదో ర్యాంకులో ఉన్నావు. నువ్వు డల్ స్టూడెంట్‌వి అని చెప్పే క్రమంలోనే ఏకంగా ఆయనను వెనక్కి నెట్టేసి డిఫెన్స్‌లో పడేశారని టీడీపీ అంతర్గత సమాచారం చెబుతోంది. నువ్వు బయట అరవడానికి  తప్ప పరిపాలన.. రాజకీయాలు.. అడ్మినిస్ట్రేషన్ ఇవేం నీకు చేతకాదు అని పవన్‌కు చెప్పకనే చెప్పారు అని అంటున్నారు. తనను అన్ని రకాలుగా కార్నర్ చేస్తున్న చంద్రబాబును పవన్ ఏ విధంగా కంట్రోల్ చేస్తారు.. కూటమి ప్రభుత్వంపై ఏ విధంగా తన సొంత ముద్ర వేసుకుంటారన్నది చూడాల్సి ఉంది. 
-సిమ్మాదిరప్పన్న. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement