సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత సారథ్యంలోని ఆ పార్టీ అనుబంధ మహిళా విభాగానికి గిన్నిస్ రికార్డు వరించింది. ఆ విభాగం నేతృత్వంలో నిర్వహించిన మహిళా వైద్య శిబిరానికి వచ్చిన విశేష స్పందన గిన్నిస్ బుక్‌లోకి ఎక్కింది.ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్నాడీఎంకే మహిళా విభాగం నేతృత్వంలో వైద్య శిబిరాల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. సేవ కార్యక్రమాల రూపంలో కాకుండా మహిళలకు ఎదురవుతున్న బ్రెస్ట్ క్యాన్సర్ నివారణ లక్ష్యంగా వైద్య శిబిరాల్ని అన్ని జిల్లాల్లోనూ ఏర్పాటు చేశారు. ఈ శిబిరాలకు విశేష స్పందన వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20 వేల మంది వరకు మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధిత పరీక్షలు నిర్వహించారు. ఇందులో ధర్మపురిలో నిర్వహించిన వైద్య శిబిరం రికార్డుకు ఎక్కింది.
ఇది వరకు ఒకే రోజు వైద్య శిబిరం ద్వారా ఒకే ప్రాంతంలో 971 మంది మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధిత పరీక్షలు చేయించుకున్నారు. ఇది గిన్నిస్ రికార్డులు చోటు దక్కించుకుని ఉంది. అయితే, అన్నాడీఎంకే మహిళా విభాగం నేతృత్వంలో ధర్మపురిలో నిర్వహించిన శిబిరంలో ఏకంగా 2037 మంది మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధిత పరీక్షలు నిర్వహించుకున్నారు. ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు దృష్టికి చేరింది. అన్నాడీఎంకే మహిళా విభాగం ధర్మపురిలో నిర్వహించిన శిబిరాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు వర్గాలు పరిశీలించాయి. గతంలో ఉన్న రికార్డును తిరగ రాస్తూ, ఈ వైద్య శిబిరంలో పరీక్షలు నిర్వహించడంతో తాజా శిబిరం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కింది.
ఇందుకు తగ్గ సర్టిఫికెట్‌ను అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు ప్రకటించారు. ఆ సర్టిఫికెట్‌ను స్వయంగా అందించేందుకు ఆ రికార్డు ప్రతినిధి లూషియా సిలికాక్ లిజీ చెన్నైకు వచ్చారు. అయితే, జయలలితను కలుసుకునే అవకాశం లేని దృష్ట్యా, ఆమె తరపున ఆ రికార్డును మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎంపీ శశికళ పుష్పకు అందజేశారు. ఉదయం రాయపేటలోని పార్టీ కార్యాలయంలో ఈ రికార్డును శశికళ పుష్పకు అందించినానంతరం లూషియా సిలికాక్ లిజీ మాట్లాడుతూ, బ్రెస్ట్ క్యాన్సర్ వైద్య శిబిరాన్ని కోసం ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే వర్గాలు చేస్తున్న సేవలను గుర్తు చేస్తూ, ప్రశంసలు కురిపిం చారు. ఈ కార్యక్రమంలో అన్నాడీఎంకే నాయకురాలు విశాలాక్షి నెడుం జెలియన్, మంత్రులు పళనియప్పన్, గోకుల ఇందిర, వలర్మతి, విజయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
అమ్మకు ‘గిన్నిస్’ పట్టం
Published Mon, Mar 16 2015 1:33 AM | Last Updated on Tue, Aug 21 2018 2:34 PM
Advertisement