మంచంపట్టిన బాబిల్‌గాం | Dengue Fever In Sadasivapeta Portends A Growing Problem | Sakshi
Sakshi News home page

మంచంపట్టిన బాబిల్‌గాం

Published Wed, Sep 11 2013 1:03 AM | Last Updated on Fri, Sep 1 2017 10:36 PM

Dengue Fever In Sadasivapeta Portends A Growing Problem

సదాశివపేట, న్యూస్‌లైన్: మండల పరిధిలోని బాబిల్‌గాం గ్రామం మంచంపట్టింది. సుమారు 20 మందికి విషజ్వరా లు సోకడంతో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో కలుషితనీరు, అపరిశుభ్రత వల్లే విషజ్వరాల బారినపడుతున్నట్టు బాధితులు చెబుతున్నారు. గ్రామానికి సరఫరా చేసే తాగునీరు కలుషితమవుతోందని, పైగా గ్రామంలో చెత్త కుప్పులు ఎక్కడపడితే అక్కడా దర్శనమిస్తున్నాయని బాధితులు తెలిపారు. ఇదిలా ఉండగా వైద్యాధికారులు గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి బాధితులకు చికిత్స అందజేస్తున్నారు. కలుషిత నీరు తాగి రెండు రోజులుగా అనారోగ్యం బారిన పడిన 20 మందికి స్థానిక వైద్య శిబిరంలో వైద్యం అందించినట్టు డాక్టర్ బాలాజీపవార్ తెలిపారు. బుధవారం సాయంత్రం వరకు గ్రామంలో మెడికల్ క్యాంపు కొనసాగుతుందని, ప్రజలందరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
 
 మంగళవారం తహశీల్దార్ శంకరప్ప, ఎంపీడీఓ గౌతమ్‌కుమార్, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ చెన్నారెడ్డి, ఏఈ అప్పారావు, వర్క్ ఇన్‌స్పెక్టర్ శ్రీశైలం, సీనియర్ పబ్లిక్ హెల్త్ అధికారి  బాలాజీ పవార్, గ్రామ సర్పంచ్ వీరాంజనేయులు గ్రామంలోని అన్ని వార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్లాలకు క్యాప్‌లు ఏర్పాటు చేయకపోవడమే సమస్యకు ప్రధాన కారణమన్నారు. నల్లాగుంతల్లో నిలువ ఉన్న కలుషిత నీరు పైపుల్లోకి వెళ్లడం.. నీటిని సరఫరా చేసినప్పుడు ఆ నీరు కూడా సరఫరా కావడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. 
 
 ఇప్పటికైనా నల్లాలు ఉన్నవారందరూ తప్పనిసరిగా క్యాప్‌లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. అదే విధంగా అపరిశుభ్రత, బహిరంగ మలవిసర్జన వంటి విషయాలను అధికారులు వివరించారు. ఇంటి పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండడం వల్ల రోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వారు అవగాహన కల్పించారు. మురుగునీటి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాడంతోపాటు వ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లాలనీ ఎంపీడీఓ గౌతమ్‌కుమార్ అధికారులను ఆదేశించారు.  ప్రజలందరూ కాచి చల్లార్చి, వడబోసిన నీటిని మాత్రమే తాగాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement