ఎండల తీవ్రతకు అల్లాడుతున్న జనం
గ్రామాల్లో జాడలేని వైద్య శిబిరాలు
ఉపాధి పనుల వద్ద నీడ కరువు
అతీగతీ లేని విత్తన పంపిణీ
నేడు జెడ్పీ సర్వసభ్య సమావేశం
అనంతపురం సెంట్రల్ : జిల్లా ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వరుస కరువులతో పంటలు పండలేదు. తాగేందుకూ గుక్కెడు నీరు దొరకడం లేదు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను పాలకులు అటకెక్కించారు. కరువు జిల్లాను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. గ్రామాల్లో ప్రజలు ఉండలేని పరిస్థితి దాపురిస్తోంది. సోమవారం జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్యసమావేశం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా సమస్యలపై ‘సాక్షి’ ఫోకస్...
కొన్ని రోజులుగా భానుడు ఉగ్రరూపాన్ని చూపుతున్నాడు. ఆదివారం శింగనమలలో రికార్డు స్థాయిలో 44.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. యల్లనూరు 42.3 డిగ్రీలు, అనంతపురం, గార్లదిన్నె 42.2 డిగ్రీలు, తాడిమర్రిలో 42 డిగ్రీలు నమోదయ్యాయి. ఎండ వేడిమికి తోడు వడగాలులు వీస్తుండడంతో పలువురు చనిపోయారు. ఎండ వల్ల కలిగే ప్రమాదంపై ప్రజలను అప్రమత్తం చేయాల్సిన వైద్య,ఆరోగ్యశాఖ నిద్రమత్తులో జోగుతోంది. కనీసం గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్న ధ్యాస కూడా ఆ శాఖ అధికారులకు లేదు.
జిల్లాలో కూలీలకు గత్యంతరం లేక ఉపాధి పనులకు వెళుతున్నారు. పనులు జరిగే ప్రదేశంలో కూలీలకు ఏమాత్రమూ మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు. నీడ కోసం షామియానాలు లేవు. మంచినీరు సరఫరా చేయడం లేదు. గతంలో పంపిణీ చేసిన షామియానాలన్నీ ఎప్పడో పక్కదారి పట్టాయి.
ముంగారు కాలం ముంచుకొస్తున్నా వ్యవసాయశాఖ అధికారుల్లో చలనం లేదు. ఖరీఫ్‌లో 3.28 లక్షల విత్తన వేరుశనగ అవసరం కాగా.. ఇప్పటి వరకూ 10 వేల క్వింటాళ్లు మాత్రమే జిల్లాకు చేరాయి. వేరుశనగతో పాటు అంతర పంటలుగా సాగు చేసే కంది, ఆముదంతో పాటు ప్రత్యామ్నాయ విత్తనాల పంపిణీపై కసరత్తు ప్రారంభించలేదు.
రైతు, డ్వాక్రా రుణమాఫీలు గందరగోళంగా మారాయి. లక్ష మందికి పైగా రైతులు రుణమాఫీకి నోచుకోలేదు. జిల్లా వ్యాప్తంగా అన్ని ఆర్‌డీఓ కార్యాలయాల్లో, కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన రుణమాఫీ ఫిర్యాదుల స్వీకరణ కౌంటర్లు కిటకిటలాడుతున్నాయి. డ్వాక్రా రుణమాఫీదీ ఇదే పరిస్థితి. తొలుత సభ్యురాలికి రూ.10 వేలు అన్న ప్రభుత్వం ప్రస్తుతం మూడు విడతల్లో రూ. 3 వేల చొప్పున మంజూరు చేస్తోంది. ఈ మొత్తం కూడా వాడుకోవడానికి వీల్లేదని మెలిక పెట్టడంతో మహిళలు తీవ్రంగా మండిపడుతున్నారు.
జిల్లాలో తాగునీటి ఎద్దడి జఠిలమవుతోంది. 300 గ్రామాలకు పైగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాలని ప్రభుత్వం నిధులు విడుదల చేసినా... ఎక్కువశాతం పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలున్నాయి.మండల స్థాయిలో రాజకీయ జోక్యం ఎక్కువ కావడంతో అధికారులు పారదర్శకంగా పనిచేయలేకపోతున్నారు.
ప్రజా సంక్షేమం కోసం గతంలో జెడ్పీలో అనేక తీర్మానాలు చేశారు. పండ్ల తోటల సాగుకు 10 ఎకరాల వరకూ అవకాశం కల్పించాలని, శాశ్వత కరువు జిల్లాగా గుర్తించాలని, రూ. 100 కోట్ల ప్యాకేజీ ప్రకటించాలని, తదితర తీర్మానాలు చేశారు. ఇందులో ఏ ఒక్కటీ ఆచరణకు నోచుకోలేదు.
సమస్యలు అనంతం
Published Mon, May 25 2015 2:45 AM | Last Updated on Sun, Sep 3 2017 2:37 AM
Advertisement
Advertisement