నాన్ సబ్సిడీ విత్తనాలు, పురుగుమందుల విక్రయం మనపని కాదన్న ప్రభుత్వం
సాక్షి, అమరావతి: రైతుభరోసా కేంద్రాల (ఆర్బీకేల) ద్వారా సర్టిఫై చేసిన నాణ్యమైన నాన్‌సబ్సిడీ విత్తనాల పంపిణీకి ప్రభుత్వం మంగళం పాడేసింది. పురుగుమందుల సరఫరా ఇక ఉండబోదని తేల్చి చెప్పింది. ఏటా సబ్సిడీ విత్తనాలతో పాటు నాన్‌సబ్సిడీ విత్తనాలు, పురుగుమందులను కూడా ఆర్బీకేల ద్వారా గ్రామస్థాయిలో రైతులకు అందుబాటులో ఉంచేవారు. రైతుల డిమాండ్ మేరకు.. నాన్‌సబ్సిడీగా వారు కోరుకున్న కంపెనీల విత్తనాలు, పురుగుమందులను బుక్ చేసుకున్న 24 గంటల్లో నేరుగా వారి ముంగిటకు సరఫరా చేసేవారు.
ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా వీటి పంపిణీ అవసరం లేదని స్పష్టం చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతులు విత్తనాలు, పురుగుమందుల కోసం ఇబ్బందులు పడకూడదని రైతుభరోసా కేంద్రాల్లో నాన్‌సబ్సిడీ కింద వాటిని అందుబాటులో ఉంచింది.
నిఘా చాలంటున్న ప్రభుత్వం
గత సీజన్ నుంచి నాన్‌సబ్సిడీ విత్తనాల పంపిణీతో పాటు పురుగుమందుల సరఫరాను నోడల్ ఏజెన్సీగా ఏపీ సీడ్స్‌ను నియమించారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా విత్తన, పురుగుమందుల కంపెనీలతో అవగాహన ఒప్పందం కోసం ఏర్పాట్లు చేశారు. ఇంతలో ప్రభుత్వం మారింది. కూటమి ప్రభుత్వ అనుమతి కోసం అధికారులు ప్రతిపాదనలు పంపారు.
నాన్‌సబ్సిడీ విత్తనాలు, పురుగుమందుల పంపిణీ బాధ్యత ప్రభుత్వానిది కాదని, ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచనవసరం లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. మార్కెట్‌లోకి వచ్చే విత్తనాలు, పురుగుమందులపై నిఘా పెడితే సరిపోతుందని చెప్పినట్లు అధికారులు తెలిపారు. దీంతో డిమాండ్ ఉన్న కంపెనీల విత్తనాలు, పురుగుమందుల బ్లాక్ మార్కెటింగ్ పెరుగుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గత ప్రభుత్వ హయాంలో నకిలీలు, బ్లాక్ మార్కెట్‌కు చెక్
పూర్వం నాణ్యమైన విత్తనం దొరక్క మిరప, పత్తి రైతులు నకిలీల బారినపడి ఏటా రూ.వేలకోట్ల విలువైన పెట్టుబడి, ఉత్పత్తి నష్టాలను చవిచూసేవారు. పైగా డిమాండ్ ఉన్న కంపెనీల విత్తనాలకు కృత్రిమ కొరత సృష్టించి ఎమ్మార్పీకి మించి అమ్మేవారు. రైతులు బ్లాక్ మార్కెట్‌లో రెట్టింపు ధరలకు కొనుగోలు చేసి ఆర్థికంగా నష్టపోయేవారు. నకిలీ విత్తన విక్రయదారులతో పాటు బ్లాక్ మార్కెట్‌కు చెక్ పెట్టేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం డిమాండ్ ఉన్న కంపెనీలకు చెందిన విత్తనాలతోపాటు పురుగుమందులను నాన్‌సబ్సిడీగా ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచేది.
దీంతో రైతులకు అవి ఎమ్మార్పీకే లభించేవి. ఇందుకోసం ఏటా సీజన్‌కు ముందే విత్తన కంపెనీలతో ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ, పురుగుమందుల కంపెనీలతో ఏపీ ఆగ్రోస్ అవగాహన ఒప్పందాలు చేసుకునేవి. ఇలా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 305.43 క్వింటాళ్ల నాన్‌సబ్సిడీ విత్తనాలను రైతులు ఆర్బీకేల్లో కొనుగోలు చేశారు. రూ.14.25 కోట్ల విలువైన 1,39,443 లీటర్ల పురుగుమందులను 1.57 లక్షలమంది రైతులు ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment