
సబ్సిడీపై బిందు, తుంపర పరికరాలు
ఎస్సీ, ఎస్టీ సన్న, చిన్నకారు రైతులకు 100 శాతం సబ్సిడీ
ఇతరులకు 90 శాతం వర్తింపు
సాక్షి, అమరావతి: కేంద్ర రాష్ట్రీయ కృషి వికాస యోజన (ఆర్‌కేవీవై)–పెర్ డ్రాప్ మోర్ క్రాప్ (పీడీఎంసీ) స్కీమ్‌లో భాగంగా అమలు చేస్తోన్న సూక్ష్మ సాగునీటి పథకం కింద బిందు, తుంపర పరికరాలను అమర్చేందుకు 2025–26 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి సబ్సిడీలు ఖరారయ్యాయి. ఈ మేరకు సోమవారం వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు.
⇒ రాష్ట్ర వ్యాప్తంగా ఐదెకరాల్లోపు ఎస్సీ, ఎస్టీ సన్న, చిన్నకారు రైతులకు 100 శాతం సబ్సిడీపై పరికరాలు ఇవ్వనున్నారు.
⇒ ఎస్సీ, ఎస్టీ యేతర సన్న, చిన్నకారు రైతులకు 90 శాతం సబ్సిడీ (గరిష్టంగా రూ.2.18 లక్షలు) ఉంటుంది.
⇒ రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో 5–10 ఎకరాల్లోపు రైతులతో పాటు గిరిజన ప్రాంతాల్లో ఎస్టీ రైతులకు 90 శాతం సబ్సిడీ (రూ.3.14 లక్షలు) ఇవ్వనున్నారు.
⇒ కోస్తా జిల్లాల్లో 5–10 ఎకరాల్లోపు రైతులకు 70 శాతం (రూ.3.10 లక్షలు), 10 ఎకరాలకు పైబడిన రైతులకు 50 శాతం (రూ.4లక్షలు) చొప్పున సబ్సిడీ ఇవ్వనున్నారు.
⇒ఇక తుంపర పరికరాల కోసం దరఖాస్తు చేసే అన్ని సామాజిక వర్గాలకు చెందిన ఐదెకరాల్లోపు సన్న, చిన్నకారు రైతులకు 50 శాతం (రూ.19వేలు), 12.5 ఎకరాల్లోపు భూమి కలిగిన ఇతర సామాజిక వర్గాలకు చెందిన రైతులకు కూడా 50 శాతం (రూ.19వేలు) చొప్పున సబ్సిడీ ఇవ్వనున్నారు.
వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసినట్లుగానే...
కాగా, 2024–25 సీజన్ వరకు వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ధేశించిన సబ్సిడీల మేరకే బిందు, తుంపర పరికరాలు ఇస్తున్నారు. రూ.2,700 కోట్లతో 7.50 లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం విస్తరించాలని లక్ష్యంగా నిర్ధేశించగా, 7.95 లక్షల ఎకరాల్లో విస్తరణకు రైతులు తమ వివరాలను నమోదు చేసుకున్నారు. అయితే ఇప్పటి వరకు కేవలం లక్ష ఎకరాల్లో బిందు పరికరాల అమరికకు పరిపాలనా ఉత్తర్వులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment