Sprinklers
-
నెహ్రూ జూ: చల్లందనమే..చల్లదనమే..!
బహదూర్‌పురా: నెహ్రూ జూలాజికల్ పార్కులో వేసవి తాపం నుంచి వన్యప్రాణులకు ఉపశమనం కలిగించేందుకు జూ అధికారులు చర్యలు చేపట్టారు. జంతువులు, పక్షులు ఇబ్బంది పడకుండా చల్లదనం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జూపార్కు క్యూరేటర్ వీవీఎల్ సుభద్రా దేవి తెలిపారు. వన్యప్రాణుల ఎన్క్లోజర్ల పైభాగంలో గ్రీన్ పరదాలు, ఎండుగడ్డి, కొబ్బరి పీచును ఏర్పాటు చేసి నీటితో తడిపి చల్లదనాన్ని కల్పిస్తున్నామన్నారు. అన్ని జంతువుల ఆవరణలో స్ప్రింక్లర్లు, చిన్న రెయిన్ గన్స్ ఏర్పాటు చేశారు. తుంగగడ్డిని కొన్ని ఆవరణల పైకప్పుపై ఉంచారు. కోతులు, పులులు, లయన్స్, జాగ్వార్స్, చిరుత పులి జంతువుల ఆవరణలలో 50కి ఎయిర్ కూలర్లు ఏర్పాటు చేశారు. రాత్రివేళ యానిమల్ హౌస్‌లో ఎయిర్ కండిషనర్లు ఏర్పాటు చేశారు. కోతులు, పక్షులు, ఎలుగుబంట్లకు పండ్లను అందజేస్తున్నారు. గ్లూకోన్–డీ, ఎలక్ట్రోరల్ పౌడర్, విటమిన్–సి, సప్లిమెంట్స్, బి–కాంప్లెక్స్ సప్లిమెంట్స్, థర్మోకేర్ లిక్విడ్ నీటిలో కరిగి వేసవి ఒత్తిడిని నివారించడానికి జంతువులు, పక్షులకు ఇస్తారు. -
నేతల ఇంట్లో సొమ్ము.. రైతు నోట్లో దుమ్ము
కడప అగ్రికల్చర్ : పంటలు దెబ్బతినే సమయంలో స్ప్రింక్లర్లు, పైపులు, ఇంజన్లు వాడుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇందులో భాగంగా రెండేళ్ల క్రితం ఖరీఫ్‌లో రైతులు వాటితో పంటలకు రక్షక తడులు ఇచ్చుకున్నారు. అందులో కొందరు తెలుగు తమ్ముళ్లు మాత్రం పంటలకు రక్షక తడులు ఇచ్చుకుని ఆ తరువాత తమ సొంతమైనట్లు ఆయా స్ప్రింక్లర్లు, పైపులు వారి వారి ఇళ్లలో ఉంచుకున్నారని సాధారణ, చిన్న, సన్నకారు రైతులు ఆరోపిస్తున్నారు. ఆ స్ప్రింక్లర్లు ఇప్పుడు ఈ రబీలో రైతులకు చాలా అవసరమయ్యాయి. ప్రధాన పంట బుడ్డశనగను జిల్లాలోని పడమటి మండలాలైన వేంపల్లె, వేముల, పులివెందుల, తొండూరు, సింహాద్రిపురం, లింగాల, ముద్దనూరు, పెండ్లిమర్రి, వల్లూరు, కమలాపురం, కొండాపురం, జమ్మలమడుగు, మైలవరం, పెద్దముడియం, రాజుపాలెం మండలాల్లో అధికంగాను, దువ్వూరు, ప్రొద్దుటూరు, పోరుమావిళ్ల మండలాల్లో తక్కువగాను మొత్తంగా 78,167 హెక్టార్లలో సాగు చేశారు. తీవ్ర వర్షాభావంతో పంట ఎండబెట్టకు గురై వాడు ముఖం పట్టింది. కొన్ని ప్రాంతాల్లో పంట ఎండింది. ఈ పంటను రక్షించుకోవడానికి ఆయా ప్రాంతాల్లోని సాధారణ, చిన్న, సన్నకారు రైతులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. మండల వ్యవసాయాధికారులను కలిసి మొరపెట్టుకున్నా ఫలితం లేదని అంటున్నారు. కొందరు మండల స్థాయి టీడీపీ నాయకులు వారి అనుచరులకుఆయిల్ ఇంజన్లు, స్ప్రింక్లర్లు, పైపులు ఇప్పించుకుని సీజన్లో వాడుకుని వాటిని అలానే ఇళ్లకు చేర్చుకుని తిరిగి ఇవ్వకుండా భీష్మించుకు కూర్చున్నారు. కొన్ని మండలాల్లోని నాయకులు, అనుచరుల వద్ద ఉన్నాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. వాటిని ఎలా తిరిగి మండల కేంద్రానికి తీసుకురావాలో అర్థం కావడంలేదని, తల ప్రాణం తోక కొస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుడ్డశనగకు ఒక నీటి తడి ఇస్తే పంట పండుతుందని రైతులు వ్యవసాయాధికారులను అడుగుతున్నారు. పలుసార్లు డివిజన్, మండల వ్యవసాయాధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించిన సందర్భంలో ఉన్నతాధికారులు రక్షక తడుల కోసం ఇచ్చిన రెయిన్‌గన్స్, స్ప్రింక్లర్లు, ఆయిల్ ఇంజన్లు, పైపులు మండల కేంద్రాల్లోని ఏఓ కార్యాలయాల గోడౌన్లకు చేర్చాలని ఆదేశిస్తూ వస్తున్నారు. దీనిపై ఎన్ని ఒత్తిళ్లు పెట్టినా నాయకుల నుంచి ఉలుకు పలుకు లేదని ఏఓలు కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నా...మా ఉన్నతాధికారులతో చాలా ఇబ్బందిగా ఉంది, ఆ స్ప్రింక్లర్లు, పైపులు మీ అనుచరుల వద్ద ఉన్న వాటిని తిరిగి ఇప్పించాలని కోరినా ఫలితం లేదని జిల్లాలోని పులివెందుల, ముద్దనూరు, ప్రొద్దుటూరు డివిజన్‌కు చెందిన కొందరు ఏఓలు సాక్షికి ఆవేదనతో తెలిపారు. అయినా కూడా టీడీపీ నాయకులు కొందరు తమ సొంత ఆస్తి మాదిరిగా ఇళ్లలో ఉంచుకుని ఏ మాత్రం పలకడంలేదని మండల వ్యవసాయాధికారులు చెబుతున్నారు. 242 రెయిన్‌గన్స్....360 స్ప్రింక్లర్లు....18650 పైపులు జిల్లాకు రెండేళ్ల క్రితం ప్రభుత్వం 242 రెయిన్‌గన్స్ యూనిట్లు, 360 స్ప్రింక్లర్లు యూనిట్లు, 100 ఆయి ల్ ఇంజన్లు,18650 పైపులు మంజూరు చేసింది. వీటి మొత్తం ధర రూ.1.42 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఇందులో కొన్ని యూ నిట్లు మండల స్థాయి అధికార పార్టీ నాయకుల అనుచరుల ఇళ్లలో ఉన్నాయని మండల వ్యవసాయాధికారులు బాహాటంగా చెబుతున్నారు. ఎంత మొత్తుకున్నా నాయకుల నుంచి స్పందన లేదని అంటున్నారు. ఏం చేయాలో అర్థం కావడంలేదని ఆయా ఏఓలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వం మాదే కదా...! మీ కేం నష్టం మీకేమైనా సమస్య వస్తే మేం పరిష్కరిస్తాంలే అని నాయకులు గద్దిస్తున్నారని పులివెందుల డివిజన్‌కు చెందిన ఏఓ ఒకరు తన బాధను వ్యక్తం చేశారు. ఇంత దారుణమైన పరిస్థితులు గతంలో ఎప్పుడు ఎదురుకాలేదని సీనియర్ అధికారి తెలిపారు. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో వ్యవసాయశాఖను ఉన్నత స్థానానికి తీసుకుపోయామని, ప్రస్తుత ప్రభుత్వంలో అన్నీ సమస్యలేనని ఓ ఉన్నతాధికారి పెదవి విరిచారు. అవసరమున్న రైతులకు అందించేలా చర్యలు తీసుకుంటాం ఎండుతున్న పంటలకు రక్షక తడులు ఇచ్చుకోవడానికి జిల్లాలో రెయిన్‌గన్స్, స్ప్రింక్లర్లు, పైపులు ఉన్నాయి. వాటిని రైతులు వాడుకుని మండల ఏఓ కార్యాలయాలకు చేర్చడం, అవసరమున్న రైతులు తీసుకెళ్లడం తెచ్చి పెట్టడం సాధారణంగా ఉంటుంది. మండల కేంద్రాల్లో ఉన్నాయని ఏఓలు చెబుతున్నారు. అయినా కూడా ఏఏ మండలాల్లో రక్షక తడుల సామగ్రి ఎవరెవరి దగ్గర ఉందో నివేదికలు పంపమని కోరతాం. అవసరమున్న రైతులకు అందించి పంటలు ఎండకుండా చూస్తాం. –జె.మురళీకృష్ణ, సంయుక్త సంచాలకులు, జిల్లా వ్యవసాయశాఖ -
రాయితీలో భారీ కోత
కుల్కచర్ల: వ్యవసాయ ఉపకరణాలపై రైతులకు ఇస్తున్న రాయితీని ప్రభుత్వం భారీగా తగ్గించింది. ప్రత్యామ్నాయ పంటలను సాగుచేసుకోవాలని, తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగుచేసేందుకు సబ్సిడీ డ్రిప్ పరికరాలను అందిస్తున్నామంటూ అధికారులు ఊదరగొట్టారు. తీరా రైతులు దరఖాస్తు చేసుకున్నాక.. సబ్సిడీని కేవలం 50 శాతానికి పరిమితం చేస్తున్నట్టు చెబుతున్నారు. గతంలో 90శాతం ఉన్న సబ్సిడీని ఈ ఏడాది 50శాతానికి కుదించడంపై రైతులు మండిపడుతున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఏపీఏంఐపీ ద్వారా 90శాతం సబ్సిడీపై స్ప్రింక్లర్లను పంపిణీ చేసింది. రైతులు కేవలం 10శాతం మాత్రమే చెల్లించి స్పింక్లర్లు, పైపులను తీసుకునేవారు. వీటిని గత సంవత్సరం పంపిణీ చేయలేదు. తెలంగాణ ప్రభుత్వం మళ్లీ ఈ ఖరీఫ్ నుంచి మైక్రోఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా వీటిని పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. దీనిలో భాగంగా సన్న, చిన్నకారు, పెద్ద రైతులకు 50శాతం సబ్సిడీపై స్ప్రింక్లర్లను పంపిణీ చేస్తోంది. ఈ సారి సబ్సిడీతోపాటు యూనిట్లను కూడా తగ్గించింది. గతంలో 10శాతం మాత్రమే భరించిన రైతులు ఇప్పుడు 50శాతం భరించాలంటే వారిపై పెద్ద మొత్తంలో భారం పడుతోంది. నామమాత్రపు కేటాయింపు జిల్లాలో కూరగాయలు, పండ్లతోటల రైతులు, ముఖ్యంగా వేరుశనగ రైతులు తప్పనిసరిగా స్ప్రింక్లర్ల ద్వారా పంటలు పండిస్తారు. గత ప్రభుత్వం ఏటా 2,300 నుంచి 2500 వరకు స్ప్రింక్లర్ యూనిట్లను మంజూరు చేయగా ఈ ఏడాది జిల్లాకు కేవలం 500 యూనిట్లు మాత్రమే మంజూరు చేయడంపై రైతులు పెదవి విరుస్తున్నారు. సబ్సిడీ 90 శాతం నుంచి 50శాతానికి తగ్గించడమే కాక కేటాయింపు కూడా గణనీయంగా తగ్గించేయడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్పింక్లర్ల ధర కూడా ఒక్కో కంపెనీ ఒక్కో విధంగా వసూలు చేస్తోంది. ప్రభుత్వం ఏ కంపెనీలకు అనుమతి ఇచ్చిందో తెలియడం లేదు. మార్కెట్లో ప్రస్తుతం స్ప్రింక్లర్ల పూర్తి ధర రూ.19,600 కాగా అందులో 50శాతం సబ్సిడీపోనూ మిగిలిన రూ.9,800లను రైతులు డీడీ రూపంలో సంబంధిత అధికారులకు ఇవ్వాల్సి ఉంది. పరిగి నియోజకవర్గానికి 220 యూనిట్లు పరిగి నియోజకవర్గానికి 220 స్ప్రింక్లర్ యూనిట్లు మంజూరు చేశారు. ఇందులో కుల్కచర్లకు 75, గండేడ్ -55, దోమ-50,పరిగి -30 పూడూర్- 10 యూనిట్లు మాత్రమే మంజూరు చేశారు దరఖాస్తుకు నానా తంటాలు ప్రభుత్వం సబ్సిడీ స్పింక్లర్ల కోసం దరఖాస్తు చేసుకునే రైతులను నానా అవస్థలు పెడుతోంది. దరఖాస్తు ఫారాలను మండల అభివృద్ధి కార్యాలయంలో ఇస్తున్నారు. రైతులు దరఖాస్తు ఫారంతోపాటు పట్టదారు పాసుపుస్తకం జిరాక్స్, కరెంట్ మంజూరు పత్రం, ఆధార్ కార్డు, ఓటర్ఐడీ, రేషన్ కార్డు, పొలం నక్షా, వన్‌బీ నకల్, పహణీ, బోరులో నీరు ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం, రెవెన్యూ, పంచాయితీ కార్యదర్శుల ద్వారా ధ్రువీకరణ తదితర పత్రాలను జతచేసి ఇవ్వాలి. వీటిన్నింటికి తిరగడానికే సమయం సరిపోతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చే రాయితీలో కోత విధించకుండా 90 శాతం సబ్సిడీపై స్ప్రింక్లర్లను పంపిణీ చేయాలని జిల్లా రైతులు కోరుతున్నారు.