నేతల ఇంట్లో సొమ్ము.. రైతు నోట్లో దుమ్ము | Sprinklers And Pipes Grabs TDP Leaders in YSR Kadapa | Sakshi
Sakshi News home page

నేతల ఇంట్లో సొమ్ము.. రైతు నోట్లో దుమ్ము

Published Sat, Dec 8 2018 1:20 PM | Last Updated on Sat, Dec 8 2018 1:20 PM

Sprinklers And Pipes Grabs TDP Leaders in YSR Kadapa - Sakshi

మైలవరంలో ఎండుతున్న బుడ్డశనగ పంట (ఇన్‌సెట్‌) తొండూరు మండలంలో టీడీపీ నాయకుని ఇంటి ఆవరణలో ఉన్న ప్రభుత్వం అందజేసిన స్ప్రింక్లర్లు

కడప అగ్రికల్చర్‌ : పంటలు దెబ్బతినే సమయంలో స్ప్రింక్లర్లు, పైపులు, ఇంజన్లు వాడుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇందులో భాగంగా రెండేళ్ల క్రితం ఖరీఫ్‌లో  రైతులు వాటితో పంటలకు రక్షక తడులు ఇచ్చుకున్నారు. అందులో కొందరు  తెలుగు తమ్ముళ్లు మాత్రం పంటలకు రక్షక తడులు ఇచ్చుకుని ఆ తరువాత తమ సొంతమైనట్లు ఆయా స్ప్రింక్లర్లు, పైపులు వారి వారి ఇళ్లలో ఉంచుకున్నారని సాధారణ, చిన్న, సన్నకారు రైతులు ఆరోపిస్తున్నారు. ఆ స్ప్రింక్లర్లు  ఇప్పుడు ఈ రబీలో రైతులకు చాలా అవసరమయ్యాయి. ప్రధాన పంట బుడ్డశనగను జిల్లాలోని పడమటి మండలాలైన వేంపల్లె, వేముల, పులివెందుల, తొండూరు, సింహాద్రిపురం, లింగాల, ముద్దనూరు, పెండ్లిమర్రి, వల్లూరు, కమలాపురం, కొండాపురం, జమ్మలమడుగు, మైలవరం, పెద్దముడియం, రాజుపాలెం మండలాల్లో అధికంగాను, దువ్వూరు, ప్రొద్దుటూరు, పోరుమావిళ్ల మండలాల్లో తక్కువగాను మొత్తంగా 78,167 హెక్టార్లలో సాగు చేశారు. తీవ్ర వర్షాభావంతో  పంట ఎండబెట్టకు గురై వాడు ముఖం పట్టింది. కొన్ని ప్రాంతాల్లో పంట ఎండింది. ఈ పంటను రక్షించుకోవడానికి ఆయా ప్రాంతాల్లోని సాధారణ, చిన్న, సన్నకారు రైతులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. మండల వ్యవసాయాధికారులను కలిసి మొరపెట్టుకున్నా ఫలితం లేదని అంటున్నారు.

కొందరు మండల స్థాయి టీడీపీ నాయకులు వారి అనుచరులకుఆయిల్‌ ఇంజన్లు, స్ప్రింక్లర్లు, పైపులు ఇప్పించుకుని సీజన్‌లో వాడుకుని వాటిని అలానే ఇళ్లకు చేర్చుకుని తిరిగి ఇవ్వకుండా భీష్మించుకు కూర్చున్నారు. కొన్ని మండలాల్లోని నాయకులు, అనుచరుల వద్ద ఉన్నాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. వాటిని ఎలా తిరిగి మండల కేంద్రానికి తీసుకురావాలో అర్థం కావడంలేదని, తల ప్రాణం తోక కొస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుడ్డశనగకు ఒక నీటి తడి ఇస్తే పంట పండుతుందని రైతులు వ్యవసాయాధికారులను అడుగుతున్నారు. పలుసార్లు డివిజన్, మండల వ్యవసాయాధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించిన సందర్భంలో ఉన్నతాధికారులు రక్షక తడుల కోసం ఇచ్చిన రెయిన్‌గన్స్, స్ప్రింక్లర్లు, ఆయిల్‌ ఇంజన్లు, పైపులు మండల కేంద్రాల్లోని ఏఓ కార్యాలయాల గోడౌన్లకు చేర్చాలని ఆదేశిస్తూ వస్తున్నారు. దీనిపై ఎన్ని ఒత్తిళ్లు పెట్టినా నాయకుల నుంచి ఉలుకు పలుకు లేదని ఏఓలు కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నా...మా ఉన్నతాధికారులతో చాలా ఇబ్బందిగా ఉంది, ఆ స్ప్రింక్లర్లు, పైపులు మీ అనుచరుల వద్ద ఉన్న వాటిని తిరిగి ఇప్పించాలని కోరినా ఫలితం లేదని జిల్లాలోని పులివెందుల, ముద్దనూరు, ప్రొద్దుటూరు డివిజన్‌కు చెందిన కొందరు  ఏఓలు సాక్షికి ఆవేదనతో తెలిపారు. అయినా కూడా టీడీపీ నాయకులు కొందరు తమ సొంత ఆస్తి మాదిరిగా ఇళ్లలో ఉంచుకుని ఏ మాత్రం పలకడంలేదని మండల వ్యవసాయాధికారులు చెబుతున్నారు.

242 రెయిన్‌గన్స్‌....360 స్ప్రింక్లర్లు....18650 పైపులు
జిల్లాకు రెండేళ్ల క్రితం ప్రభుత్వం 242 రెయిన్‌గన్స్‌ యూనిట్లు, 360 స్ప్రింక్లర్లు యూనిట్లు, 100 ఆయి ల్‌ ఇంజన్లు,18650 పైపులు మంజూరు చేసింది. వీటి మొత్తం ధర రూ.1.42 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఇందులో కొన్ని యూ నిట్లు మండల స్థాయి అధికార పార్టీ నాయకుల అనుచరుల ఇళ్లలో ఉన్నాయని మండల వ్యవసాయాధికారులు బాహాటంగా చెబుతున్నారు. ఎంత మొత్తుకున్నా నాయకుల నుంచి స్పందన లేదని అంటున్నారు. ఏం చేయాలో అర్థం కావడంలేదని ఆయా ఏఓలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వం మాదే కదా...! మీ కేం నష్టం మీకేమైనా సమస్య వస్తే మేం పరిష్కరిస్తాంలే అని నాయకులు గద్దిస్తున్నారని పులివెందుల డివిజన్‌కు చెందిన ఏఓ ఒకరు తన బాధను వ్యక్తం చేశారు. ఇంత దారుణమైన పరిస్థితులు గతంలో ఎప్పుడు ఎదురుకాలేదని సీనియర్‌ అధికారి తెలిపారు. దివంగత సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో వ్యవసాయశాఖను ఉన్నత స్థానానికి తీసుకుపోయామని, ప్రస్తుత ప్రభుత్వంలో అన్నీ సమస్యలేనని ఓ ఉన్నతాధికారి పెదవి విరిచారు.

అవసరమున్న రైతులకు అందించేలా చర్యలు తీసుకుంటాం
ఎండుతున్న పంటలకు రక్షక తడులు ఇచ్చుకోవడానికి జిల్లాలో రెయిన్‌గన్స్, స్ప్రింక్లర్లు, పైపులు ఉన్నాయి. వాటిని రైతులు వాడుకుని మండల ఏఓ కార్యాలయాలకు చేర్చడం, అవసరమున్న రైతులు తీసుకెళ్లడం తెచ్చి పెట్టడం సాధారణంగా ఉంటుంది. మండల కేంద్రాల్లో ఉన్నాయని ఏఓలు చెబుతున్నారు. అయినా కూడా ఏఏ మండలాల్లో రక్షక తడుల సామగ్రి ఎవరెవరి దగ్గర ఉందో నివేదికలు పంపమని కోరతాం. అవసరమున్న రైతులకు అందించి పంటలు ఎండకుండా చూస్తాం.     –జె.మురళీకృష్ణ, సంయుక్త సంచాలకులు, జిల్లా వ్యవసాయశాఖ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement