కుల్కచర్ల: వ్యవసాయ ఉపకరణాలపై రైతులకు ఇస్తున్న రాయితీని ప్రభుత్వం భారీగా తగ్గించింది. ప్రత్యామ్నాయ పంటలను సాగుచేసుకోవాలని, తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగుచేసేందుకు సబ్సిడీ డ్రిప్ పరికరాలను అందిస్తున్నామంటూ అధికారులు ఊదరగొట్టారు. తీరా రైతులు దరఖాస్తు చేసుకున్నాక.. సబ్సిడీని కేవలం 50 శాతానికి పరిమితం చేస్తున్నట్టు చెబుతున్నారు. గతంలో 90శాతం ఉన్న సబ్సిడీని ఈ ఏడాది 50శాతానికి కుదించడంపై రైతులు మండిపడుతున్నారు.
గతంలో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఏపీఏంఐపీ ద్వారా 90శాతం సబ్సిడీపై స్ప్రింక్లర్లను పంపిణీ చేసింది. రైతులు కేవలం 10శాతం మాత్రమే చెల్లించి స్పింక్లర్లు, పైపులను తీసుకునేవారు. వీటిని గత సంవత్సరం పంపిణీ చేయలేదు. తెలంగాణ ప్రభుత్వం మళ్లీ ఈ ఖరీఫ్ నుంచి మైక్రోఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా వీటిని పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. దీనిలో భాగంగా సన్న, చిన్నకారు, పెద్ద రైతులకు 50శాతం సబ్సిడీపై స్ప్రింక్లర్లను పంపిణీ చేస్తోంది. ఈ సారి సబ్సిడీతోపాటు యూనిట్లను కూడా తగ్గించింది. గతంలో 10శాతం మాత్రమే భరించిన రైతులు ఇప్పుడు 50శాతం భరించాలంటే వారిపై పెద్ద మొత్తంలో భారం పడుతోంది.
నామమాత్రపు కేటాయింపు
జిల్లాలో కూరగాయలు, పండ్లతోటల రైతులు, ముఖ్యంగా వేరుశనగ రైతులు తప్పనిసరిగా స్ప్రింక్లర్ల ద్వారా పంటలు పండిస్తారు. గత ప్రభుత్వం ఏటా 2,300 నుంచి 2500 వరకు స్ప్రింక్లర్ యూనిట్లను మంజూరు చేయగా ఈ ఏడాది జిల్లాకు కేవలం 500 యూనిట్లు మాత్రమే మంజూరు చేయడంపై రైతులు పెదవి విరుస్తున్నారు.
సబ్సిడీ 90 శాతం నుంచి 50శాతానికి తగ్గించడమే కాక కేటాయింపు కూడా గణనీయంగా తగ్గించేయడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్పింక్లర్ల ధర కూడా ఒక్కో కంపెనీ ఒక్కో విధంగా వసూలు చేస్తోంది. ప్రభుత్వం ఏ కంపెనీలకు అనుమతి ఇచ్చిందో తెలియడం లేదు. మార్కెట్‌లో ప్రస్తుతం స్ప్రింక్లర్ల పూర్తి ధర రూ.19,600 కాగా అందులో 50శాతం సబ్సిడీపోనూ మిగిలిన రూ.9,800లను రైతులు డీడీ రూపంలో సంబంధిత అధికారులకు ఇవ్వాల్సి ఉంది.
పరిగి నియోజకవర్గానికి 220 యూనిట్లు
పరిగి నియోజకవర్గానికి 220 స్ప్రింక్లర్ యూనిట్లు మంజూరు చేశారు. ఇందులో కుల్కచర్లకు 75, గండేడ్ -55, దోమ-50,పరిగి -30 పూడూర్- 10 యూనిట్లు మాత్రమే మంజూరు చేశారు
దరఖాస్తుకు నానా తంటాలు
ప్రభుత్వం సబ్సిడీ స్పింక్లర్ల కోసం దరఖాస్తు చేసుకునే రైతులను నానా అవస్థలు పెడుతోంది. దరఖాస్తు ఫారాలను మండల అభివృద్ధి కార్యాలయంలో ఇస్తున్నారు. రైతులు దరఖాస్తు ఫారంతోపాటు పట్టదారు పాసుపుస్తకం జిరాక్స్, కరెంట్ మంజూరు పత్రం, ఆధార్ కార్డు, ఓటర్‌ఐడీ, రేషన్ కార్డు, పొలం నక్షా, వన్‌బీ నకల్, పహణీ, బోరులో నీరు ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం, రెవెన్యూ, పంచాయితీ కార్యదర్శుల ద్వారా ధ్రువీకరణ తదితర పత్రాలను జతచేసి ఇవ్వాలి. వీటిన్నింటికి తిరగడానికే సమయం సరిపోతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చే రాయితీలో కోత విధించకుండా 90 శాతం సబ్సిడీపై స్ప్రింక్లర్లను పంపిణీ చేయాలని జిల్లా రైతులు కోరుతున్నారు.
రాయితీలో భారీ కోత
Published Sat, Aug 23 2014 11:31 PM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement