sun effect
-
పిల్లల పై వడదెబ్బ ఎలా ప్రభావం చూపిస్తుందంటే..
-
నేడు ఏపీలో పెరుగనున్న ఎండ తీవ్రత
-
ఈ కన్నీటిని ఆపేదెట్లా?
ఒకపక్కన దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ఎండలు మంటెత్తుతుంటే, మరోపక్కన తూర్పు, ఈశాన్య ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్న విచిత్రమైన పరిస్థితి. వరదలు అలవాటే అయినా, మునుపెన్నడూ కనివిని ఎరుగని జలప్రళయంతో ఈశాన్య ప్రాంతం అతలాకుతలమవుతోంది. అస్సామ్, మేఘాలయల్లోని తాజా దృశ్యాలు ‘టైటానిక్’ చిత్రంలోని జలవిలయాన్ని తలపిస్తు న్నాయి. ఒక్క అస్సామ్‌లోనే ఈ నెల ఇప్పటి దాకా సాధారణం కన్నా 109 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. 35 జిల్లాలకు గాను 33 జిల్లాలు ముంపునకు గురి కాగా, 42 లక్షల మందికి పైగా ముంపు బారిన పడ్డారు. 70 పైచిలుకు మంది ప్రాణాలు కోల్పోయారు. ఈశాన్యంలో ఆరెంజ్ అలర్ట్‌తో, సహాయక చర్యలకు సైన్యం బరిలోకి దిగాల్సివచ్చింది. అస్సామ్ వరదలను జాతీయ సమస్యగా ప్రకటించాలని కొన్నేళ్ళుగా కేంద్రానికి వస్తున్న వినతిపై మళ్ళీ చర్చ మొదలైంది. సహాయక చర్యల్లోని ఇద్దరు పోలీసులు వరదల్లో కొట్టుకుపోయారంటే, అస్సామ్‌లో వరదల తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి, అస్సామ్కు వరదలు కొత్త కావు. వరదలతో ఈశాన్యంలో అల్లకల్లోలం ఏటా ఆనవాయితీ. వందల సంఖ్యలో జననష్టం, పశునష్టం. వేలమంది జీవనోపాధి కోల్పోవడం. పంటలు నాశనం కావడం. ఈసారీ అదే జరిగింది. పంట భూములు తుడిచిపెట్టుకుపోయాయి. కీలక రవాణా మార్గాలు ధ్వంసమయ్యాయి. అస్సామ్ దక్షిణ భాగంలోని బరాక్ లోయలోని తేయాకు తోటల పరిస్థితి మరీ దయనీయం. దిగువ అస్సామ్ బాగా దెబ్బతింది. బర్పేట లాంటి పట్నాలు పూర్తిగా నీట మునిగాయి. అస్సామ్‌లోని మొత్తం 78.52 లక్షల హెక్టార్ల భూభాగంలో 40 శాతం (సుమారు 31.05 లక్షల హెక్టార్లు) ఏటేటా వరద ముంపునకు గురవుతోంది. అస్సామ్ ఇలా ఏటా వరదల బారిన పడడానికి అనేక కారణాలున్నాయి. ఆ రాష్ట్రంలోని నదుల వెంట, మరీ ముఖ్యంగా బ్రహ్మపుత్రలో పల్లపు ప్రాంతాలు చాలా ఎక్కువ. దాంతో, అస్తవ్యస్తంగా మట్టి పేరుకుపోతుంటుంది. నదీ భూతలాలలో ఇలా మట్టి పేరుకుపోయినకొద్దీ, వరదలు వచ్చే అవకాశాలు మరింత పెరుగుతాయి. అలాగే, గౌహతి లాంటి ప్రాంతాల భౌగోళిక స్వరూపం సైతం తరచూ వరదల బారిన పడేలా చేస్తోంది. మన చేతిలో లేని ఈ ప్రకృతి సంబంధమైన కారణాలతో పాటు మానవ తప్పిదాలూ ఈ జల విలయానికి ప్రధాన కారణమవుతున్నాయి. మానవజోక్యంతో నదీతీరాలు క్షయమవుతున్నాయి. అస్సామ్ మొత్తం విస్తీర్ణంలో దాదాపు 8 శాతం మేర భూభాగం గడచిన ఏడు దశాబ్దాల పైచిలుకు కాలంలో నదీక్షయంతో మనిషి చెరబట్టినదేనని ఓ లెక్క. ఫలితంగా నదీప్రవాహ దిశలు మారడం, కొత్త ప్రాంతాలకు వరదలు విస్తరించడం సర్వసాధారణం. వరదలతో పేరుకొనే ఒండ్రుమట్టి భూసారానికి ప్రయోజనకరమే. కానీ, ఈ జల విలయం తెచ్చి పెడుతున్న తీరని నష్టాలు నివారించి తీరాల్సినవి. నదీతీరాల్లో అడవుల నరికివేత, బ్రహ్మపుత్రా నది ప్రవాహ ఉరవడి జత కలసి ఏయేటికాయేడు పరిస్థితిని తీవ్రతరం చేస్తున్నాయి. సాధారణంగా అధిక నీటిప్రవాహాన్ని నేలలోకి పీల్చుకొని, నష్టాన్ని నివారించేందుకు ప్రకృతి ఇచ్చిన వరంగా మాగాణి నేలలు ఉపకరిస్తాయి. కానీ, అత్యాశ ఎక్కువై మాగాణి నేలలను సైతం మానవ ఆవాసాలుగా మార్చేస్తున్నారు. అలా అస్సామ్‌లో మాగాణి తగ్గింది. వెరసి, ఆ రాష్ట్రం ప్రతిసారీ ముంపులో చిక్కుకు పోతోంది. కరకట్టల నిర్మాణంతో పాలకులు చేతులు దులుపుకుంటూ ఉంటే, అధిక వరదలతో అవీ కొట్టుకుపోతున్నాయి. పొంగిపొర్లే నీటిని కొంతైనా పీల్చుకొనేందుకు వీలుగా నదీ భూతలాల్లో అడదాదడపా పూడికలు తీస్తున్నా, బ్రహ్మపుత్ర లాంటి నదుల్లో త్వరితగతిన మట్టిపేరుకుపోతుంది గనక అదీ ఉపయోగం లేకుండా పోతోంది. భారీ ఆనకట్టల నిర్మాణంతో పర్యావరణ నష్టం సరేసరి. ఏమైనా, అస్సామ్ సహా ఈశాన్య రాష్ట్రాలకు వరదల ముప్పు తరచూ తప్పదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు, ప్రభుత్వాలు వ్యవహరించాలి. దీనిపై ఇవాళ్టికీ ఒక దీర్ఘకాలిక ప్రణాళికంటూ లేకపోవడమే విడ్డూరం. ప్రతి ఏటా వరదలు ముంచెత్తుతున్నా, పాలకులు క్షేత్రస్థాయిలో పటిష్ఠమైన ఆచరణాత్మక ప్రణాళికను సిద్ధం చేసుకోకపోవడం వరదను మించిన విషాదం. టిబెట్ నుంచి మన అస్సామ్ మీదుగా బంగ్లాదేశ్‌కు దాదాపు 800 కి.మీ ప్రవహించే బ్రహ్మపుత్రలో అడుసు తీయడానికి అయిదేళ్ళ క్రితం 2017లోనే కేంద్రం రూ. 400 కోట్ల ప్యాకేజ్ ప్రకటించింది. పూడిక తీశాక రూ. 40 వేల కోట్లతో 725 కి.మీ పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణ యోచనా చెప్పారు. కానీ వాటికి అతీగతీ లేదు. అధిక వ్యయమయ్యే కరకట్టలు, పూడికతీతలతో పెద్దగా ప్రయోజనం లేదు గనక ఇప్పటికైనా సమగ్ర ప్రణాళికకు శ్రీకారం చుట్టాలి. అస్సామ్‌తో పాటు వరద బీభత్సానికి గురవుతున్న పొరుగు రాష్ట్రాలు సైతం కలసికట్టుగా అడుగేయాలి. సమష్టిగా వనరుల సమీకరణ, సమాచార వినిమయంతో పరిష్కారం కనుగొనాలి. ఏటా కోట్లలో నష్టం తెస్తున్న వరద వైపరీత్యాన్ని అస్సామ్ ప్రభుత్వం ఎంతో కాలంగా కోరుతున్నట్టు జాతీయ సమస్యగా ప్రకటించే ఆలోచన కేంద్ర సర్కార్ చేయాలి. తక్షణ సాయం అందించడంతో పాటు రాష్ట్రాల మధ్య సమన్వయ బాధ్యతను చేపట్టాలి. సామాన్యులు సైతం మాగాణి నేలల ప్రాధాన్యాన్నీ, యథేచ్ఛగా అడవుల నరికివేతతో నష్టాన్నీ గ్రహించాలి. ప్రజానీకం, పార్టీలు, ప్రభుత్వాలు– అంతా కలసికట్టుగా ఈ వరద ముప్పుకు అడ్డుకట్ట వేయకపోతే ఏటా ఈ నష్టం తప్పదు. ప్రజల వినతులు, పార్టీల హామీలు నిష్ఫలమై, ప్రతిసారీ ఎన్నికల అజెండాలో అంశంగా అస్సామ్ వరదల సమస్య మిగిలిపోవడం ఇకనైనా మారాలి. -
Photo Feature: సీను మార్చిన సూర్యుడు
వాన చినుకులు ముద్దాడిన వేళ పుడమి తల్లి పచ్చదనాల కోక కట్టింది. పచ్చని పొలాల మధ్య రైలు కోయిలై కూత పెడుతుంటే మనసు పరవశించిపోయింది. పల్లె పల్లెంతా మెరిసిపోయింది. ఇది నిన్నటి కథ. మరి నేడు?.. భానుడి ప్రతాపానికి పల్లె కళ తప్పింది. వాగూవంకా ఎండిపోయింది. చెట్టూచేమా మాడిపోయింది. రైలు పరుగు తీస్తుంటే మది మూగబోయింది. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కోసాయి గ్రామంలోనిదీ దృశ్యం. - సాక్షి ఫొటోగ్రాఫర్/ఆదిలాబాద్ -
పట్టి తెచ్చాడులే.. నిండు సూర్యుడినే..
Astrophotographer Andrew McCarthy Sun Photo: సుడులు తిరుగుతున్న లావాలా ఉన్న అగ్నిగోళం ఉపరితలం... పసుపు, ఎరుపు కలగలిసిన ఈకలను తలపిస్తున్న భానుడి భగభగలు... అక్కడక్కడా నల్లటి చుక్కలు... సూర్యుడిని అతి సమీపం నుంచి చూస్తున్నట్టుగా ఉన్నది కదూ! ఇంతటి అద్భుతమైన చిత్రాన్ని ఆస్ట్రోఫొటోగ్రాఫర్ ఆండ్రూ మెక్ కాతీ పట్టి బంధించాడు. నిప్పులు కక్కుతున్న ఆ నిండు సూర్యుడిని... ఓ సోలార్ ఆర్బిటార్ తీసినంత స్పష్టంగా తన కెమెరాలో కట్టిపడేసిన ఆండ్రూ... సూర్యుడిని అంత సమీపంగా, అంత అద్భుతంగా చిత్రీకరించిన మొట్టమొదటి ఫొటోగ్రాఫర్. (చదవండి: అప్పుడే పుట్టిన నవజాత శిశువు పేరు ‘బోర్డర్’..ఎందుకో తెలుసా?) ఇందుకోసం 300 మెగాపిక్సల్స్ కలిగిన కెమెరాను ఉపయోగించాడు. ఇది... సాధారణ కెమెరాకంటే 30 రెట్లు అధికం. ఒక్క పర్ఫెక్ట్ చిత్రం కోసం... ఆయన లక్షా యాభైవేల చిత్రాలను తీసి, వాటిని లేయర్ చేశాడు. నల్లటి చుక్కలను ఫొటోషాప్‌తో ఎడిటింగ్ చేశాడు. సాధారణంగా ఇలాంటివి తీస్తున్నప్పుడు మంటలు వచ్చే ప్రమాదం ఉంది. కళ్లు కూడా పోవచ్చు. వీటిని నివారించడానికి రెండు ఫిల్టర్లు ఉన్న ప్రత్యేక టెలిస్కోప్ వాడాడు. ‘ఆకాశాన్ని ఆవిష్కరించాలనుకున్నప్పుడు అందరూ చంద్రుడినే బెంచ్‌మార్క్‌గా చూస్తారు. కానీ సూర్యుడిని క్యాప్చర్ చేయడం నన్ను ఉత్సాహపరిచే అంశం. ఎందుకంటే సూర్యుడెప్పుడూ బోర్ కొట్టడు. తీసిన ప్రతిసారీ కొత్తగా కనిపిస్తాడు’అని ఆండ్రూ చెబుతున్నాడు. (చదవండి: వామ్మో! ఆ దేశం కేవలం పూల వ్యాపారంతోనే.... రూ.180 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుందటా!!) -
ఈ ఎండల్లో ఆడి చావమంటారా..? స్టార్ టెన్నిస్ క్రీడాకారుడి ఆగ్రహం
టోక్యో: ఒలింపిక్స్‌కు వేదికైన టోక్యో నగరంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టెన్నిస్ మ్యాచ్‌లను మాధ్యాహ్నం వేళల్లో నిర్వహించడంపై ప్రపంచ నంబర్ 2 టెన్నిస్ క్రీడాకారుడు డేనిల్ మెద్వెదెవ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అరియాకె టెన్నిస్ పార్క్‌లో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌లో భానుడి ప్రతాపం ధాటికి మెద్వెదెవ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. జపాన్ కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ మ్యాచ్ సందర్భంగా మెద్వెదెవ్ డీహైడ్రేషన్‌కు గురయ్యాడు. ఎండ వేడిమిని తాళలేక మ్యాచ్ మధ్యలో చైర్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. నేను యోధున్ని కాబట్టి గేమ్‌ను ఎలాగైనా పూర్తి చేస్తాను. ఈ మధ్యలో నేను చనిపోతే ఎవరిది బాధ్యత అంటూ నిర్వాహకలనుద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇకనైనా మ్యాచ్‌ల నిర్వహణ సమయాన్ని మారుస్తారా లేక ఈ ఎండల్లో ఆడి చావమంటారా అంటూ నిర్వహకులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. కాగా, నిప్పులు కక్కుతున్న భానుడి ప్రతాపం కారణంగా అరియాకె టెన్నిస్ పార్క్‌లో బుధవారం ఇద్దరు ఆటగాళ్లు వడదెబ్బతో మధ్యలోనే నిష్క్రమించారు. ఇదిలా ఉంటే, క్రీడాకారుల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఒలింపిక్స్ నిర్వాహకులు స్పందించారు. మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మారుస్తున్నట్లు ప్రకటించారు. ఉదయం 11 గంటలకు (జపాన్ కాలమానం ప్రకారం) మొదలు కావాల్సిన మ్యాచ్‌లు గురువారం నుంచి మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభంకానున్నాయని పేర్కొన్నారు. కాగా, మూడో రౌండ్ మ్యాచ్‌లో రష్యా ఒలింపిక్ కమిటీ (ఆర్వోసీ) ఆటగాడు మెద్వదెవ్.. ఇటలీకి చెందిన ఫాబియో ఫోగ్నినిపై 6-2, 3-6, 6-2తేడాతో విజయం సాధించి, క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. -
మళ్లీ వేసవి తీవ్రత
భువనేశ్వర్ : రాష్ట్రంలో వడ దెబ్బ మరణాల సంఖ్య రోజురోజుకు పుంజుకుంటోంది. గత వారం రోజుల్లో ఈ పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఈ ఏడాది వేసవి కాలంలో గడిచిన 2 నెలల వ్యవధిలో 42 వడ దెబ్బ మరణాలు సంభవించాయి. గడిచిన 8 రోజుల్లో 7 వడ దెబ్బ మరణాలు నమోదయ్యాయి. అంతకుముందు రెండు నెలల్లో 35 మరణాలు నమోదైనట్లు అధికార వర్గాల సమాచారం. ఈ ఏడాది రుతు పవనాలు రాష్ట్రాన్ని ముందస్తుగా తాకి అకస్మాత్తుగా కనుమరుగు కావడంతో వేసవి తీవ్రత పునరావృతం అయింది. ఈ పునరావృతంతో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఈ వ్యవధిలో వడ దెబ్బ మృత్యు సంఘటనలు వేగంగా పెరుగుతున్నట్లు అధికార వర్గాలు కలవరపడుతున్నాయి. లోగడ అందిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో పలు చోట్ల 35 వడ దెబ్బ మృత్యు సంఘటనలు సంభవించాయి. వీటిలో 7 మరణాలు ఖరారైనట్లు ప్రత్యేక సహాయ కమిషనర్ విష్ణు పద శెట్టి బుధవారం ప్రకటించారు. వడ దెబ్బ మృత్యు సంఘటనల్లో పోస్ట్‌మార్టం అనివార్యం. ఈ నివేదికలు అందితే తప్ప నమోదైన వడదెబ్బ మృతుల్ని అధికారికంగా ధ్రువీకరించలేమని ఆయన వివరించారు. ఇతర మృతుల నివేదిక అందితే వాస్తవ వడదెబ్బ మరణాలు ఖరారవుతాయి. వాతావరణంలో ఆకస్మిక మార్పు ప్రభావంతో ఇటీవల 7 వడ దెబ్బ మరణాలు నమోదైనట్లు పేర్కొన్నారు. ఒకే రోజున 6 వడదెబ్బ మరణాలు రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో మంగళవారం 6గురు వ్యక్తులు వడదెబ్బకు గురై మరణించారు. భద్రక్ జిల్లాలోని ఒగొరొపొడా గ్రామంలో ఒకరు మరణించగా గంజాం జిల్లా భంజనగర్, పాత్రపూర్ ప్రాంతాల్లో ఇద్దరు, కేంద్రపడ జిల్లాలో ఇద్దరు, బాలేశ్వర్ జిల్లాలో ఒకరు మరణించడంతో మంగళవారం నాటి వడదెబ్బ మృతులు 6గా నమోదు కావడం కలవర పరుస్తోంది. -
మండిన సండే
సాక్షి, హైదరాబాద్ : సూర్యుడు నిప్పులు కురిపించాడు. ఈ ఎండాకాలంలో ఇప్పటివరకు అధిక ఉష్ణోగ్రతలు ఆదివారం నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి వెల్లడించారు. ఆదిలాబాద్, నిజామాబాద్‌లో అత్యధికంగా 44 డిగ్రీల సెల్సియస్ పగటి ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు. హైదరాబాద్‌లోనూ ఈ సీజన్లో మొదటి సారిగా అధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయిందని పేర్కొన్నారు. వచ్చే నెల నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని, వడగాడ్పులు తీవ్రంగా ఉంటాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు. వడదెబ్బతో ఆరుగురి మృతి సాక్షి నెట్వర్క్: వడదెబ్బతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆరుగురు మృతిచెందారు. ఇందులో ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా ముగ్గురు మృతి చెందారు. పెద్దఅడిశర్లపల్లి మండలం దుగ్యాల గ్రామానికి చెందిన మల్లెబోయిన వెంకటయ్య (45) ఆత్మకూర్–ఎస్ మండలం పాత సూర్యాపేటకు చెందిన బైరు యల్లమ్మ (80), అనంతగిరి మండలం లకారం గ్రామానికి చెందిన కూరపాటి మాణిక్యమ్మ (100) వడ గాలుల కారణంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరు ఇళ్ల వద్దనే చికిత్స పొందుతూ ఆదివారం మృత్యువాతపడ్డారు. అలాగే నిజామాబాద్ జిల్లా నవీపేట మండలకేంద్రంలోని సుభాష్‌నగర్ కాలనీకి చెందిన గాండ్ల రుక్మాబాయి(70), కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రానికి చెందిన కొర్రి ఆశన్న(60), మహబూబాబాద్ జిల్లా కురవి మండలకేంద్రానికి చెందిన రామడుగు వెంకటాచారి(55)అనే వడ్రంగి వడదెబ్బతో మృతిచెందారు. -
వడదెబ్బతో మహిళ మృతి
కోదాడరూరల్ : వడదెబ్బతో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన మండల పరిధిలోని చిమిర్యాలలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కొండ సుశీల (55)ఏపీలోని మక్కపేటకు మిరప కూలీ పనులకు వెళ్తుంది. బుధవారం రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత తీవ్ర అస్వస్థతకు గురై ఇంటి వద్ద చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తెలిపారు. మృతురాలి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ గడిపూడి శ్రీకాంత్ కోరారు. -
మండుటెండలో మాడిపోతున్నారు!
సీతంపేట:ఉపాధి హామీ పథకం పనులు జరుగుతున్నచోట మౌలిక సదుపాయాల్లేక ఇబ్బంది పడుతున్నామని వేతనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు చేసేచోట నిలువ నీడ కూడా లేకుండా పోయిందని, దీంతో ఒక్కోసారి అనారోగ్యం బారిన పడుతున్నామని వాపోతున్నారు. జిల్లాలో వేసవి ప్రారంభంలోనే ఎండలుమండిపోతున్నారు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉదయం 9 గంటలకే సూరీడు సుర్రుమంటున్నాడు. ఇలాంటి సమయంలో కూలీలకు వసతులు కల్పించాల్సిన అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో 5,65,650 వేల కుటుంబాలున్నాయి. వీటిలో 11,76,647 మంది కుటుంబసభ్యులు ఉన్నారు. వీరిలో ఎస్సీలు 58,860, ఎస్టీలు 46,762, ఇతరులు 4,64,028 మంది వేతనదారులకు జాబ్‌కార్డులు ఉన్నాయి. వీరిలో ఈ ఏడాది 5,57,923 మంది వేతనదారులకు ఉపాధి పనులు కల్పించాలని అధికారులు చర్యలు తీసుకున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఎస్టీ జనాభాకు43,318 కుటుంబాలకు జాబ్‌కార్డులు ఇవ్వగా టీపీఎంయూ (ట్రైబుల్ ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్) పరిధిలో సీతంపేట, భామిని, కొత్తూరు, హిరమండలం, మందస, మెళియాపుట్టి, పాతపట్నం మండలాల్లోని గిరిజన వేతనదారులు లక్ష మందికి పైగా ఉపాధి పనులకు వెళ్తున్నారు. పేరుకుపోయిన వేతన బకాయిలు ఉపాధి వేతనదారులకు గతేడాది జిల్లా వ్యాప్తంగా రూ.15 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి.మూడు, నాలుగేసి నెలలు బకాయిలుంటే ఎలా బతుకుతామని వేతనదారులు ప్రశ్నిస్తున్నారు. చేసిన కష్టానికి సకాలంలో ప్రతిఫలం రాకపోతే ఎలా అని ఆవేదన చెందుతున్నారు. వేసవి కాలంలో అయితే రోజువారీ వేతనంతో పాటు అదనంగా 25 నుంచి 30 శాతం కలిపి వేతనం ఇవ్వాలి. ఇదికాకుండా పనులుచేసే చోట తాగునీటి సౌకర్యం లేని పక్షంలో కూలీలు తాగునీరు తెచ్చుకుంటే రోజుకు రూ.5 ఇస్తారు. పనులు చేసేందుకు అవసరమైన గునపం పదును చేసుకునేందుకు రూ.10 ఇవ్వాలి. ఒక్కో వేతనదారుకి రూ.194 వరకు కూలి గిట్టుబాటు కావాలి. కాని ఎండ కారణంగా పని ముందుకు సాగకపోవడంతో తక్కువ వేతనమే గిట్టుబాటు అవుతోందని వేతనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం మౌలిక సదుపాయాలు కూడా లేవంటున్నారు. టెంట్లు రాలేదు ఈ ఏడాది ఇంకా టెంట్లు రాలేదు. గత ఏడాది పంపిణీ చేశాం. మందుల కిట్లు కూడా రాలేదు. ప్రస్తుతానికి వేతనదారులకు గునపాలు పంపిణీ చేశాం.–శంకరరావు, ఏపీవో, ఉపాధి హామీ పథకం -
పగలు భగభగ.. రాత్రి గజగజ
వెంకటగిరి రూరల్: మార్చి ప్రారంభమైన కొద్దిరోజుల నుంచి పగలు ఎండ తీవ్రత, రాత్రి చలితో ప్రజలు వింత పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఒక వైపు ఉదయం 11 గంటల నుంచే ఎండ ప్రభావం తీవ్రమవుతుండటంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటే ప్రజలు జంకుతున్నారు. మరో వైపు రాత్రి 10 నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు వరకు మంచు కురుస్తోంది. దీంతో వాహనచోదకులు మంచులో దారి సరిగా కనపడక ఇబ్బందులు పడుతున్నారు. మళ్లీ ఉదయం 11 గంటలు దాటితే చాలు ఎండ తీవ్రతకు రహదారులు, రద్దీ ప్రాంతాలు అంతా నిర్మానుష్యంగా మారుతున్నాయి. వేసవి ఆరంభంలోనే ఎండలు ఇలా ఉంటే రానున్న ఏప్రిల్, మే నెలల్లో ఏ స్థాయిలో ఉంటాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వాతావరణంలో మార్పుతో ఇక్కట్లు నాయుడుపేట టౌన్: ఉదయం పూట ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి, రాత్రి పూట చలి తీవ్రంగా ఉండటంతో ప్రజలు వాతవారణ మార్పునకు సతమతమవుతున్నారు. మార్చి ప్రారంభమైన కొద్ది రోజులుగా ఉదయం 9 గంటల నుంచే 35 డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే అధికంగా ఎండలు కాస్తుండటంతో ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఎప్పుడూ జనాలతో కిటకిటలాడే బజారువీ«ధి, గడియారం సెంటర్, దర్గావీధి, పాతబస్టాండు తదితర ప్రాంతాల్లో మధ్యాహ్నం 12 గంటలకే రహదారులు బోసిపోతున్నాయి. -
వేసవి తాపం..
భీమవరం: భానుడి ప్రతాపానికి పశుపక్ష్యాదులు, జలచరాలు సైతం అల్లాడుతున్నాయి. నిత్యం భూమి మీద సంచరించే జీవులు కొద్దిసేపు నీటిలో జలకాలాడేందుకు తాపత్రయ పడుతుంటే , ఎప్పుడూ నీటిలో ఉండే జలచరాలు మాత్రం గట్టుమీద సేదతీరేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రజలు వీటిని అసక్తిగా తిలకిస్తున్నారు. -
తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం..!
విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విచిత్ర వాతావరణం నెలకొంది. వడగాడ్పులు, వేడిగాలులతో పాటు అకాల వర్షాలు, ఉరుములు, మెరుపులతో ఈ భిన్న పరిస్థితి ఏర్పడింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిప్పుల వాన కురుస్తుంటే.. సాయంత్రానికి అకాల వర్షం అలజడి రేపుతోంది. దీనికి ఈదురు గాలులు కూడా తోడై జనాన్ని భయకంపితులను చే స్తూ ఆస్తి నష్టాన్ని కలిగిస్తున్నాయి. రెండ్రోజులుగా పడమర దిశ నుంచి వస్తున్న వెస్టర్న్ డిస్టర్బెన్స్ (పశ్చిమ ఆటంకాలు) ప్రభావమే ఈ పరిస్థితికి కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వెస్టర్న్ డిస్టర్బెన్స్ ప్రభావంతో క్యుములోనింబస్ మేఘాలేర్పడి ఉరుములు, మెరుపులతో కొద్దిసేపట్లోనే సుడిగాలులతో కూడిన వర్షం కురుస్తుందని రిటైర్డ్ వాతావరణ అధికారి రాళ్లపల్లి మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు. మరో రెండు, మూడు రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగుతుందని, తర్వాత మళ్లీ ఎండలు, వడగాడ్పులు విజంభిస్తాయని ఆయన విశ్లేషించారు. మరోవైపు రెండు రాష్ట్రాల్లోనూ అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులూ కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం రామగుండంలో 46.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దేశంలోకెల్లా ఇదే అత్యధిక ఉష్ణోగ్రత కావడం విశేషం. రెంటచింతల, నందిగామల్లో 44, నిజామాబాద్, తిరుపతి, కడప, అనంతపురంలలో 43, కర్నూలు, విజయవాడల్లో 42, హైదరాబాద్, నెల్లూరు, తునిల్లో 41, ఒంగోలు, ఆరోగ్యవరం, కాకినాడల్లో 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రెండు రోజులు తెలంగాణలోని ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లోనూ, ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోనూ వడగాడ్పుల తీవ్రత ఉంటుందని భారత వాతావరణ విభాగం సోమవారం రాత్రి విడుదల చేసిన నివేదికలో తెలిపింది. ఆయా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల మధ్య నమోదవుతాయని పేర్కొంది. అదే సమయంలో తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోను, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కొన్నిచోట్ల ఉరుములు, ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. -
సమస్యలు అనంతం
ఎండల తీవ్రతకు అల్లాడుతున్న జనం గ్రామాల్లో జాడలేని వైద్య శిబిరాలు ఉపాధి పనుల వద్ద నీడ కరువు అతీగతీ లేని విత్తన పంపిణీ నేడు జెడ్పీ సర్వసభ్య సమావేశం అనంతపురం సెంట్రల్ : జిల్లా ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వరుస కరువులతో పంటలు పండలేదు. తాగేందుకూ గుక్కెడు నీరు దొరకడం లేదు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను పాలకులు అటకెక్కించారు. కరువు జిల్లాను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. గ్రామాల్లో ప్రజలు ఉండలేని పరిస్థితి దాపురిస్తోంది. సోమవారం జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్యసమావేశం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా సమస్యలపై ‘సాక్షి’ ఫోకస్... కొన్ని రోజులుగా భానుడు ఉగ్రరూపాన్ని చూపుతున్నాడు. ఆదివారం శింగనమలలో రికార్డు స్థాయిలో 44.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. యల్లనూరు 42.3 డిగ్రీలు, అనంతపురం, గార్లదిన్నె 42.2 డిగ్రీలు, తాడిమర్రిలో 42 డిగ్రీలు నమోదయ్యాయి. ఎండ వేడిమికి తోడు వడగాలులు వీస్తుండడంతో పలువురు చనిపోయారు. ఎండ వల్ల కలిగే ప్రమాదంపై ప్రజలను అప్రమత్తం చేయాల్సిన వైద్య,ఆరోగ్యశాఖ నిద్రమత్తులో జోగుతోంది. కనీసం గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్న ధ్యాస కూడా ఆ శాఖ అధికారులకు లేదు. జిల్లాలో కూలీలకు గత్యంతరం లేక ఉపాధి పనులకు వెళుతున్నారు. పనులు జరిగే ప్రదేశంలో కూలీలకు ఏమాత్రమూ మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు. నీడ కోసం షామియానాలు లేవు. మంచినీరు సరఫరా చేయడం లేదు. గతంలో పంపిణీ చేసిన షామియానాలన్నీ ఎప్పడో పక్కదారి పట్టాయి. ముంగారు కాలం ముంచుకొస్తున్నా వ్యవసాయశాఖ అధికారుల్లో చలనం లేదు. ఖరీఫ్‌లో 3.28 లక్షల విత్తన వేరుశనగ అవసరం కాగా.. ఇప్పటి వరకూ 10 వేల క్వింటాళ్లు మాత్రమే జిల్లాకు చేరాయి. వేరుశనగతో పాటు అంతర పంటలుగా సాగు చేసే కంది, ఆముదంతో పాటు ప్రత్యామ్నాయ విత్తనాల పంపిణీపై కసరత్తు ప్రారంభించలేదు. రైతు, డ్వాక్రా రుణమాఫీలు గందరగోళంగా మారాయి. లక్ష మందికి పైగా రైతులు రుణమాఫీకి నోచుకోలేదు. జిల్లా వ్యాప్తంగా అన్ని ఆర్డీఓ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన రుణమాఫీ ఫిర్యాదుల స్వీకరణ కౌంటర్లు కిటకిటలాడుతున్నాయి. డ్వాక్రా రుణమాఫీదీ ఇదే పరిస్థితి. తొలుత సభ్యురాలికి రూ.10 వేలు అన్న ప్రభుత్వం ప్రస్తుతం మూడు విడతల్లో రూ. 3 వేల చొప్పున మంజూరు చేస్తోంది. ఈ మొత్తం కూడా వాడుకోవడానికి వీల్లేదని మెలిక పెట్టడంతో మహిళలు తీవ్రంగా మండిపడుతున్నారు. జిల్లాలో తాగునీటి ఎద్దడి జఠిలమవుతోంది. 300 గ్రామాలకు పైగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాలని ప్రభుత్వం నిధులు విడుదల చేసినా... ఎక్కువశాతం పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలున్నాయి.మండల స్థాయిలో రాజకీయ జోక్యం ఎక్కువ కావడంతో అధికారులు పారదర్శకంగా పనిచేయలేకపోతున్నారు. ప్రజా సంక్షేమం కోసం గతంలో జెడ్పీలో అనేక తీర్మానాలు చేశారు. పండ్ల తోటల సాగుకు 10 ఎకరాల వరకూ అవకాశం కల్పించాలని, శాశ్వత కరువు జిల్లాగా గుర్తించాలని, రూ. 100 కోట్ల ప్యాకేజీ ప్రకటించాలని, తదితర తీర్మానాలు చేశారు. ఇందులో ఏ ఒక్కటీ ఆచరణకు నోచుకోలేదు.