సాక్షి, హైదరాబాద్ : సూర్యుడు నిప్పులు కురిపించాడు. ఈ ఎండాకాలంలో ఇప్పటివరకు అధిక ఉష్ణోగ్రతలు ఆదివారం నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి వెల్లడించారు. ఆదిలాబాద్, నిజామాబాద్‌లో అత్యధికంగా 44 డిగ్రీల సెల్సియస్ పగటి ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు. హైదరాబాద్‌లోనూ ఈ సీజన్‌లో మొదటి సారిగా అధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయిందని పేర్కొన్నారు. వచ్చే నెల నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని, వడగాడ్పులు తీవ్రంగా ఉంటాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు.
వడదెబ్బతో ఆరుగురి మృతి
సాక్షి నెట్‌వర్క్: వడదెబ్బతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆరుగురు మృతిచెందారు. ఇందులో ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా ముగ్గురు మృతి చెందారు. పెద్దఅడిశర్లపల్లి మండలం దుగ్యాల గ్రామానికి చెందిన మల్లెబోయిన వెంకటయ్య (45) ఆత్మకూర్–ఎస్ మండలం పాత సూర్యాపేటకు చెందిన బైరు యల్లమ్మ (80), అనంతగిరి మండలం లకారం గ్రామానికి చెందిన కూరపాటి మాణిక్యమ్మ (100) వడ గాలుల కారణంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరు ఇళ్ల వద్దనే చికిత్స పొందుతూ ఆదివారం మృత్యువాతపడ్డారు. అలాగే నిజామాబాద్ జిల్లా నవీపేట మండలకేంద్రంలోని సుభాష్‌నగర్ కాలనీకి చెందిన గాండ్ల రుక్మాబాయి(70), కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రానికి చెందిన కొర్రి ఆశన్న(60), మహబూబాబాద్ జిల్లా కురవి మండలకేంద్రానికి చెందిన రామడుగు వెంకటాచారి(55)అనే వడ్రంగి వడదెబ్బతో మృతిచెందారు.
Comments
Please login to add a commentAdd a comment