‘జగనన్న ఆరోగ్య సురక్ష’ రెండో దశలో 13,818 క్యాంపులు  | 13818 camps in the second phase of Jagananna Arogya Suraksha | Sakshi
Sakshi News home page

‘జగనన్న ఆరోగ్య సురక్ష’ రెండో దశలో 13,818 క్యాంపులు 

Published Wed, Jan 3 2024 5:17 AM | Last Updated on Wed, Jan 3 2024 5:17 AM

13818 camps in the second phase of Jagananna Arogya Suraksha - Sakshi

గుంటూరు రూరల్‌: జగనన్న ఆరోగ్య సురక్ష రెండో దశ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 13,818 వైద్య శిబిరాలను నిర్వహించనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష రెండో దశ మెడికల్‌ క్యాంపులు ప్రారంభమయ్యాయి. గుంటూరు రూరల్‌ మండలం చినపలకలూరులో నిర్వహించిన క్యాంపునకు మంత్రి విడదల రజిని హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మండలాల వారీగా గ్రామా­ల్లో ప్రతి మంగళవారం, శుక్రవారం వారానికి రెండురోజుల చొప్పున వైద్య శిబిరాలు నిర్వహిస్తామని చెప్పారు. పట్టణాల్లో వార్డు సచివాలయాల పరిధిలో ప్రతి బుధవారం, గురువారం ఈ శిబిరాలు ఉంటాయని పేర్కొన్నారు.

మొత్తం 10,032 గ్రామ సచివాలయాలు, 3,786 వార్డు సచివాలయాల పరిధిలో 13,818 వైద్య శిబిరాలు నిర్వహిస్తామని వివరించారు. అనారోగ్య సమస్యలు ఉన్నవారిని వైద్య శిబిరాలకు తీసుకురావడం, ప్రభుత్వ వైద్యుల ఆధ్వర్యంలో పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. మెరుగైన వైద్యం అవసరం ఉన్నవారిని పెద్ద ఆస్పత్రులకు పంపి ఉచితంగా అందేలా చేయడం ఈ కార్యక్రమంలో ఒక భాగమని ఆమె వెల్లడించారు. రోగి పూర్తిగా కోలుకునే వరకు ఆరోగ్యమిత్ర, ఏఎన్‌ఎంల పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు.

ఇలాంటి గొప్ప కార్యక్రమాలను దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదని, ఒక్క ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రమే చేస్తోందని తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్యాన్ని ఉచితంగా, వేగంగా అందించాలనే గొప్ప లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పనిచేస్తుండటం వల్లే వైద్య, ఆరోగ్య రంగంలో కనీవిని ఎరుగని సంస్కరణలను ప్రవేశపెట్టారని రజిని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు ఆరోగ్యశ్రీ ద్వారా అందుతున్న చికిత్సల సంఖ్యను ఏకంగా 3,257కు జగనన్న పెంచారని పేర్కొ­న్నారు. వైద్య ఖర్చును రూ.25లక్షలకు పెంచారని తెలిపారు.

ఆరోగ్యశ్రీ కార్డులను కూడా కొత్తవి మంజూరు చేసి జగనన్న ఆరోగ్య సురక్ష–2లో భాగంగా ఇంటింటికీ వెళ్లి అందజేస్తున్నామని చెప్పారు. ఆరోగ్య ఆసరా అనే గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టి రోగులకు చికిత్సకాలంలో ఆర్థిక సాయం అందజేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్‌ మాత్రమే అని ప్రశంసించారు. జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సీఈవో డీకే బాలాజీ, డీఎంఈ నర్సింహం, డీఎంఅండ్‌హెచ్‌వో శ్రావణ్‌బాబు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement