వణుకుతున్న మాజేరు
అదుపులోకి రాని విషజ్వరాలు
244 మందికి వైద్య పరీక్షలు
35 మందికి సెలైన్‌లతో చికిత్స
మచిలీపట్నానికి ఇద్దరి తరలింపు
కొత్తమాజేరు (చల్లపల్లి) : మండలంలోని కొత్తమాజేరులో విషజ్వరాలు ఇంకా అదుపులోకి రాలేదు. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సోమవారం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించారు. 244 మందికి పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. వారిలో 45 మందికి విషజ్వరాల తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వారికి వైద్య శిబిరంలోనే చికిత్స చేశారు. వారిలో 35 మందికి సెలైన్‌లు పెట్టి చికిత్స చేస్తున్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో 108 వాహనంలో మచిలీపట్నంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఇరుకు గదుల్లో చికిత్స చేస్తుండటంతో రోగులు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఘంటసాల, ఘంటసాలపాలెం, పురిటిగడ్డ, శ్రీకాకుళం ప్రభుత్వ వైద్యశాలల నుంచి డాక్టర్లు వచ్చి చికిత్స నిర్వహించారు. డీఎంహెచ్‌వో నాగమల్లేశ్వరి, ఇన్‌చార్జి డీపీవో ఎన్‌వీవీ సత్యనారాయణతో పాటు పలువురు జిల్లా అధికారులు ఈ వైద్యసేవలను పర్యవేక్షించారు.
మంత్రుల సందర్శన
కొత్త మాజేరు గ్రామాన్ని రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర సోమవారం సందర్శించారు. బాధితులను పరామర్శించారు. అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ బాబు.ఎ సాయంత్రానికి గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి, నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు తదితరులు గ్రామంలో పర్యటించి, బాధితులను పరామర్శించారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.