సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి నుంచి చెవి, ముక్కు, గొంతు (ఈఎన్‌టీ) సహా దంత పరీక్షల నిర్వహణకు సంబంధించి తగిన కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో వైద్య, ఆరోగ్య రంగంపై సీఎస్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి శాంతికుమారి, ఆరోగ్యశ్రీ సీఈఓ మాణిక్‌రాజ్, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్పేర్ యోగితారాణా, డీఎంఈ రమేశ్‌రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శ్రీనివాస్‌రావు, అధికారులు అలుగు వర్షిణి, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. ఈఎన్‌టీ పరీక్షల నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లు, వైద్య నిపుణుల అందుబాటు, నిధుల అవసరం తదితర అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని అధికారులకు సూచించారు. డెంటల్ చైర్స్, హియరింగ్ ఏఐడీఎస్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. వైద్య శిబిరాల నిర్వహణకు సంబంధించి పైలట్ పద్ధతిలో క్యాంపులు నిర్వహించి అవగాహనకు రావాలన్నారు.
వైద్య శిబిరాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రజల అభిప్రాయాన్ని సేకరించేలా ఏర్పాట్లు ఉండాలన్నారు. వైద్య పరీక్షలకు సంబంధించి నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రజల హెల్త్ ప్రొఫైల్‌కు సంబంధించి ప్రైవేటు ఆసుపత్రులు తమ సమాచారాన్ని ఫీడ్ చేసేలా ఏర్పాట్లు ఉండాలన్నారు. వైద్య, ఆరోగ్య రంగానికి సంబంధించి వివిధ విభాగాల్లో ఇంటిగ్రేటెడ్ పోర్టల్‌ను తయారు చేయడం అభినందనీయమని కొనియాడారు. ఈ డేటా ద్వారా అవసరమైన చర్యలు తీసుకోవడానికి తగిన యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలని అధికారులకు సూచించారు. కామన్ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించుకోవాలని, వైద్య, ఆరోగ్య శాఖకు అవసరమైన నిధులపై నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలకోసం అవసరమైన నిపుణులైన డాక్టర్ల సంఖ్యను అంచనా వేయాలన్నారు. వైద్య శాఖలో రీసెర్చ్ విభాగాన్ని ఏర్పాటు చేసి ప్రభావాన్ని అంచనా వేయాలని అధికారులకు సూచించారు.
ఫిబ్రవరిలో ఈఎన్‌టీ పరీక్షలు..
Published Fri, Jan 4 2019 12:06 AM | Last Updated on Fri, Jan 4 2019 12:06 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment