SK. Joshi
-
ఫిబ్రవరిలో ఈఎన్టీ పరీక్షలు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి నుంచి చెవి, ముక్కు, గొంతు (ఈఎన్టీ) సహా దంత పరీక్షల నిర్వహణకు సంబంధించి తగిన కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో వైద్య, ఆరోగ్య రంగంపై సీఎస్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి శాంతికుమారి, ఆరోగ్యశ్రీ సీఈఓ మాణిక్‌రాజ్, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్పేర్ యోగితారాణా, డీఎంఈ రమేశ్‌రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శ్రీనివాస్‌రావు, అధికారులు అలుగు వర్షిణి, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. ఈఎన్టీ పరీక్షల నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లు, వైద్య నిపుణుల అందుబాటు, నిధుల అవసరం తదితర అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని అధికారులకు సూచించారు. డెంటల్ చైర్స్, హియరింగ్ ఏఐడీఎస్పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. వైద్య శిబిరాల నిర్వహణకు సంబంధించి పైలట్ పద్ధతిలో క్యాంపులు నిర్వహించి అవగాహనకు రావాలన్నారు. వైద్య శిబిరాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రజల అభిప్రాయాన్ని సేకరించేలా ఏర్పాట్లు ఉండాలన్నారు. వైద్య పరీక్షలకు సంబంధించి నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రజల హెల్త్ ప్రొఫైల్‌కు సంబంధించి ప్రైవేటు ఆసుపత్రులు తమ సమాచారాన్ని ఫీడ్ చేసేలా ఏర్పాట్లు ఉండాలన్నారు. వైద్య, ఆరోగ్య రంగానికి సంబంధించి వివిధ విభాగాల్లో ఇంటిగ్రేటెడ్ పోర్టల్‌ను తయారు చేయడం అభినందనీయమని కొనియాడారు. ఈ డేటా ద్వారా అవసరమైన చర్యలు తీసుకోవడానికి తగిన యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలని అధికారులకు సూచించారు. కామన్ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించుకోవాలని, వైద్య, ఆరోగ్య శాఖకు అవసరమైన నిధులపై నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలకోసం అవసరమైన నిపుణులైన డాక్టర్ల సంఖ్యను అంచనా వేయాలన్నారు. వైద్య శాఖలో రీసెర్చ్ విభాగాన్ని ఏర్పాటు చేసి ప్రభావాన్ని అంచనా వేయాలని అధికారులకు సూచించారు. -
24 నుంచి ఎల్బీనగర్ - అమీర్‌పేట్ మెట్రో పరుగులు
సాక్షి, హైదరాబాద్: నగర వాసులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎల్బీనగర్– అమీర్‌పేట్ మెట్రో ప్రారంభానికి ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 24న (సోమవారం) మధ్యాహ్నం 12.15కి ఎల్బీనగర్–అమీర్‌పేట మెట్రో రైలు మార్గం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ నరసింహన్ హాజరై మెట్రో రైళ్లను ప్రారంభించనున్నారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కె.జోషి, మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్.రెడ్డిలతో కలసి బుధవారం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు ఆహ్వానపత్రం అందించారు. ఇప్పటికే నగరంలో నాగోల్– అమీర్‌పేట్– మియాపూర్ (30 కి.మీ) మార్గంలో మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ మార్గంలో నిత్యం సుమారు 80 వేల మంది రాకపోకలు సాగిస్తున్నారు. ఆదివారం, ఇతర సెలవు దినాల్లో రద్దీ లక్షకుపైగానే నమోదవుతోంది. ఈ మార్గంలో ప్రతి ఐదు నిమిషాలకో రైలు అందుబాటులో ఉంటుంది. నవంబర్‌లో అమీర్‌పేట్–హైటెక్‌సిటీ మెట్రో.. అత్యధిక ట్రాఫిక్ రద్దీ ఉండే ఎల్బీనగర్– అమీర్‌పేట్– మియాపూర్ (29 కి.మీ) మార్గంలో నిత్యం సుమారు లక్ష మందికి పైగానే మెట్రో జర్నీ చేసే అవకాశం ఉంటుందని హెచ్ఎంఆర్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది నవంబర్‌లో అమీర్‌పేట్– హైటెక్‌సిటీ మార్గంలోనూ మెట్రో రైళ్లు పరుగులు తీస్తాయని మెట్రో వర్గాలు చెబుతున్నాయి. జేబీఎస్– ఎంజీబీఎస్ రూట్లో వచ్చే ఏడాది మార్చిలో మెట్రో రైళ్లు పట్టాలెక్కనున్నట్లు తెలిపాయి. కాగా ఎంజీబీఎస్– ఫలక్‌నుమా (5.5 కి.మీ) మార్గంలో మెట్రో పనులు మరో ఏడాది ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పార్కింగ్ అవస్థలు తప్పవు.. ఎల్బీనగర్– అమీర్‌పేట్ (16 కి.మీ) మార్గంలో 17 మెట్రో స్టేషన్లు ఉన్నాయి. అన్ని స్టేషన్ల వద్ద ద్విచక్రవాహనాలు, కార్లు పార్కింగ్ చేసుకునేందుకు అవసరమైన పార్కింగ్ స్థలాలు అందు బాటులో లేవు. దీంతో ప్రయాణికులకు పార్కిం గ్ అవస్థలు తథ్యమన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఆయా స్టేషన్ల వద్ద మెట్రో రైలు దిగిన ప్రయాణికులు తిరిగి సమీప కాలనీలు, బస్తీల్లో ని తమ నివాసాలకు చేరుకునేందుకు ఆటోలు, క్యాబ్‌లను ఆశ్రయించి జేబులు గుల్లచేసుకునే పరిస్థితి తలెత్తింది. ఇప్పటికే మెట్రో చార్జీలు అధికంగా ఉన్నాయని భావిస్తున్న సిటిజన్లకు ఇది అదనపు భారంగా పరిణమించనుంది. -
తీవ్ర నిర్ణయాలకూ వెనుకాడం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొందరు ఐఏఎస్‌లకు ప్రాధాన్యత పోస్టులు లభించకపోవడంపై తలెత్తిన వివాదం ఇంకా కొలిక్కిరాలేదు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తమకు ప్రాధాన్యత పోస్టులు ఇవ్వడంలేదని ఎస్సీ, ఎస్టీ ఐఏఎస్ అధికారులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. గత నెలాఖరులో ఈ విషయమై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషికి ఫిర్యాదు చేసినా పరిస్థితిలో మార్పు కనిపించడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోస్టింగ్‌ల విషయంలో ఒక్కొక్కరినీ ఒక్కో తీరుగా చూడటం ప్రభుత్వానికి మంచిదికాదని అంటున్నారు. ప్రభుత్వం అందరికీ అన్ని రకాల పోస్టులను కేటాయించి ప్రజలకు సమర్థ పాలన అందించేలా చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వ పెద్దలకు ఎలాంటి ఉద్దేశాలు లేకపోయినా... రిటైర్ అయిన ఓ సీనియర్ అధికారి తీరుతోనే సమస్య వస్తోందని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ తీరు ఇలాగే ఉంటే తీవ్ర నిర్ణయాలకు వెనుకాడబోమని పలువురు ఎస్సీ, ఎస్టీ ఐఏఎస్‌లు గట్టిగానే చెబుతున్నారు. అదే అసంతృప్తి... ఎలాంటి తప్పు చేయకపోయినా తమను అప్రాధాన్య పోస్టులకు పరిమితం చేస్తున్నారని, కనీస ప్రాధాన్యత ఉండటంలేదని పలువురు ఎస్సీ, ఎస్టీ ఐఏఎస్‌లు అంటున్నారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణలో ఐఏఎస్‌ల కొరత ఉందని చెబుతున్న ప్రభుత్వం... పోస్టింగ్‌ల విషయంలో మాత్రం దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తోందనే అభిప్రాయం ఉంది. ఐఏఎస్ స్థాయి అధికారుల పోస్టులను రాష్ట్ర స్థాయి అధికారులతో భర్తీ చేయడంతోపాటు రాష్ట్ర స్థాయి అధికారుల పోస్టుల్లో ఐఏఎస్‌లను ప్రభుత్వం నియమిస్తోందని, సీనియారిటీ, నిబద్ధతను పట్టించుకోకుండా పోస్టింగ్‌లలో తమకు అన్యాయం చేస్తోందని వారు చెబుతున్నారు. కొందరు ఎస్సీ, ఎస్టీ ఐఏఎస్‌లకు కలెక్టర్లుగా పనిచేసే అవకాశం రావడంలేదనే అభిప్రాయం ఉంది. సామాజిక కోణంలో తమకు అన్యాయం జరుగుతోందని, న్యాయం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషిని గత నెల 26న కలిశారు. ఆ తర్వాత రోజు లిఖితపూర్వకంగా అందజేశారు. అప్రాధాన్య పోస్టులను కేటాయించడమే కాకుండా... ఐఏఎస్ అధికారి స్థాయికి ఉండే కనీస వసతులను కల్పించడంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కనీసం ఒక్క అటెండర్, సరైన వాహనం లేని పరిస్థితుల్లో కొందరు ఐఏఎస్‌లు ఉన్నారని వాపోయారు. ఇదీ వాదన... తమను ప్రాధాన్యతలేని పోస్టుల్లో నియమించడంపై నలుగురు జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న ఓ సీనియర్ అధికారిని ఏకంగా రాష్ట్ర స్థాయి అధికారి పోస్టులో నియమించడాన్ని గుర్తు చేస్తున్నారు. గతంలో ప్రాజెక్టు డైరెక్టర్లుగా పని చేసిన వారు ఇప్పుడు ముఖ్యకార్యదర్శులుగా కొనసాగుతున్నారని... కలెక్టర్లుగా పని చేసిన తాము గ్రూప్–2 స్థాయి పోస్టుల్లో పనిచేయాల్సి వస్తోందని వాపోతున్నారు. ‘రాష్ట్రంలో 140 మంది ఐఏఎస్ అధికారులు ఉంటే అందులో 13 మంది ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు. వారిలో ఎక్కువ మంది ఇప్పటికీ కలెక్టర్ పోస్టుల్లో పనిచేయలేదు. కనీసం ఓ శాఖకు ఉన్నతాధికారి పోస్టులోనూ వారిని నియమించడంలేదు. పరిస్థితి ఇలాగే ఉంటే తీవ్ర నిర్ణయాలు తీసుకునే దిశగా ఆలోచన ఉంటుంది’అని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి ఆవేదనతో చెప్పుకొచ్చారు. -
భూపాలపల్లి నుంచి హరితహారం: సీఎస్ జోషి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం నాలుగో విడత కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ త్వరలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో లాంఛనంగా ప్రారంభిస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి తెలిపారు. తెలంగాణకు హరితహారం, ధరణి ప్రాజెక్టు, స్వచ్ఛభారత్, భూ సేకరణ అంశాలపై సీఎస్ కలెక్టర్లతో మంగళవారం సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వచ్చే ఏడాది హరితహారం కింద వంద కోట్ల మొక్కలు నాటాలని సీఎం నిర్ణయించారని, దీనికనుగుణంగా ప్రతి గ్రామం, ప్రతి మున్సిపల్ వార్డులలో నర్సరీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పట్టాదారు పాసు పుస్తకాల కోసం డిజిటల్ సిగ్నేచర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎస్ అన్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సాంకేతిక సమస్యలపై రాష్ట్ర స్థాయి అధికారులు పర్యటించి పరిష్కరిస్తారని తెలిపారు. పాస్ పుస్తకాల్లో తప్పుల సవరణలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆదేశించారు. -
లెక్క తేలింది!
కార్పొరేషన్, న్యూస్‌లైన్ : ఎట్టకేలకు నగర పాలక సంస్థ పరిధిలోని డివిజన్ల సంఖ్య ఖరారైంది. 53 డివిజన్లతో విస్తరించిన బల్దియాలో 42 పంచాయతీల విలీనంతో అదనంగా ఐదు డివిజన్లు పెరిగాయి. దీంతో డివిజన్ల సంఖ్య 58కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర మునిసిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్కే.జోషి మంగళవారం జీఓ నం.122 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. ట్రై సిటీలో ఉన్న 53 పాత డివిజన్లు, 42 విలీన గ్రామాల్లో 2011 జనాభా లెక్కల ప్రకారం 8,19,602 మంది జానాభా ఉన్నారు. లెక్కల నివేదికను కూడా బల్దియా అధికారులు రాష్ట్ర పురపాలక శాఖ అధికారులకు పంపించారు. అయితే మునిసిపల్ కార్పొరేషన్ నిబంధనల ప్రకారం 4లక్షల జనాభా దాటితే విధిగా 50 డివిజన్లు ఏర్పాటు చేయాలి. ఇంతకంటే ఎక్కువ జనాభా ఉంటే 50వేల జనాభాకు ఒకటి చొప్పన డివిజన్లను ఏర్పాటు చేయాలి. ఈ లెక్కన నగర పాలక సంస్థ పరిధిలో 58 డివిజన్లను అధికారులు ఖరారు చేశారు. 1994లో మునిసిపాలిటీ నుంచి వరంగల్ నగర పాలక సంస్థగా అప్‌గ్రేడ్ అయింది. 2005 ఏప్రిల్ 28న డివిజన్ల పునర్విభజనతో పెరిగిన జనాభా ప్రకారం 50 నుంచి 53 డివిజన్లకు పెరిగాయి. 2013 మార్చి నెలలో నగర శివారులోని 42 గ్రామ పంచాయతీలు నగర పాలక సంస్థలో విలీనమయ్యాయి. దీనిని వ్యతిరేకిస్తూ 8 పంచాయతీల ప్రజలు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రభుత్వం 53 డివిజన్లు, 34 విలీన పంచాయతీల జనాభాతో డివిజన్ల సంఖ్య 57కు చేరింది. ఈ క్రమంలో టీడీపీ నాయకులు హైకోర్టును రెండుమార్లు ఆశ్రయించడం, పురపాలక శాఖ అధికారులు దీనిపై దృష్టి కేంద్రీకరించడం లాంటి సంఘటనలతో డివిజన్ల పునర్విభజన ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. ఆరు నెలల క్రితం విలీనమైన 8 పంచాయతీలపై ఉన్న స్టేను ఎత్తివేస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు 53 డివిజన్లు, విలీనమైన 42 గ్రామాల ప్రజల వివరాలు, 2011 జనాభా లెక్కలను రాష్ట్ర పురపాలక శాఖ అధికారులకు పంపించారు. దీంతో బల్దియా పరిధిలో డివిజన్ల సంఖ్యను ఖరారు చేస్తూ పురపాలక శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. షెడ్యూల్ విడుదలే ఆలస్యం నగర పాలక సంస్థ డివిజన్ల సంఖ్య ఖరారైన నేపథ్యంలో డివిజన్ల పునర్విభజన ఆదేశాలు వి డుదల కావాల్సి ఉంది. పురపాలక శాఖ నుం చి కూడా ఉత్తర్వులు వెల్లడి కావాల్సి ఉంది. ఈ క్రమంలో బల్దియా అధికారులు పునర్విభజన కోసం డివిజన్లవారీగా డ్రాఫ్టు ముసాయిదాను తయారు చేసి ప్రభుత్వానికి సమర్పిస్తారు. పునర్విభజన షెడ్యూల్ వెల్లడి కాగానే.. డివి జన్లవారీగా నోటిఫికేషన్ విడుదల చేసి ప్రజల అభిప్రాయాలు, అభ్యంతరాలను పరిగణనలో కి తీసుకొని స్వల్ప మార్పులు చేసి ప్రభుత్వాని కి పంపించనున్నారు. దీనికి ప్రభుత్వం ఆమోదముద్ర వేయనుంది. ఈ ప్రక్రియ అంతా అ నుకున్నట్లు జరిగితే నెలన్నర రోజుల్లో పూర్తవుతుందని బల్దియా అధికారులు చెబుతున్నారు. పూర్తయిన కసరత్తు డివిజన్ల పునర్విభజనకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జీఓ విడుదల చేయకముందే టౌన్ ప్లానింగ్ అధికారులు డివిజన్ల డ్రాఫ్టు ముసాయిదాను సిద్ధం చేశారు. కమిషనర్ సువర్ణ పండాదాస్ ఆదేశాల మేరకు డివిజన్ల పునర్విభజన డ్రాఫ్టు, మ్యాపులు సిద్ధం చేశారు. 12వేల నుంచి 13వేల జనాభాకు అటు ఇటుగా ఒక్కో డివిజన్ కోసం ప్రణాళికలు తయారు చేశారు. ప్రభుత్వం నుంచి పునర్విభజన షెడ్యూల్ వెల్లడి కాగానే ప్రక్రియ మొదలుకానుంది.