తెలుగు రాష్ట్రాల్లో ఆటా సేవా కార్యక్రమాలు
అమెరికా తెలుగు సంఘం(ఆటా) తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. డిసెంబర్ 1 నుంచి 23 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో వైద్య పరమైన సేవా కార్యక్రమాలను చేపట్టనున్నట్టు ఆటా ప్రెసిడెంట్ కరుణాకర్ ఆసిరెడ్డి, ప్రెసిడెంట్ ఎలక్ట్ పర్మేష్ భీంరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆటా కార్యనిర్వాహక సభ్యులందరూ అమెరికా నుంచి భారత్ వచ్చి సేవా కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొననున్నట్టు పర్మేష్ భీంరెడ్డి పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో జిల్లాల వారీగా నిర్వహించనున్న ఈ సేవా కార్యక్రమాల తేదీల వివరాలు త్వరలోనే ప్రకటించనున్నట్టు పర్మేష్ భీంరెడ్డి తెలిపారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా మారుమూల గ్రామాల్లో ఉండే నిరుపేదలకు కంటి పరీక్షలు, దంత పరీక్షలు, వైద్య సహాయంతోపాటూ మందుల పంపిణీ కూడా చేయనున్నట్టు ఆయన చెప్పారు. ఇప్పటికే మహబూబ్ నగర్ జిల్లాలోని గట్టు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో తెలంగాణ ప్రభుత్వం సహకారంతో వివిధ కార్యక్రమాల నిర్వహణ చేపడుతున్నట్టు తెలిపారు.
ఆటా కార్యనిర్వాహక బృంద సభ్యులు కరుణాకర్ రెడ్డి ఆసిరెడ్డి(ఆటా ప్రెసిడెంట్), పర్మేష్ భీంరెడ్డి(ప్రెసిడెంట్ ఎలక్ట్), కిరణ్ రెడ్డి పాశం, అనిల్ బొద్ది రెడ్డి, వేణు పిస్కె, వెంకట్ వీరనేని, శ్రీధర్ తిరుపతి, శివకుమార్ రామడ్లులు సమావేశమై ఈ సేవా కార్యక్రమాలని ప్రజలు ఉపయోగించుకోవాలని సూచించారు.