ఉట్నూర్, న్యూస్‌లైన్ : పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రుల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ప్రతి ఆర్థిక సంవత్సరం ఎన్‌ఆర్‌హెచ్‌ఎం(జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్) విడుదల చేసే నిధులకు గ్రహణం పట్టడమే అందుకు కారణం. 2013-14 ఆర్థిక సంవత్సరం ముగిసి నాలుగు నెలలు కావస్తున్నా నిధుల విడదల జాడ లేదు. మాతృ శిశు మరణాలను కనీస స్థాయికి తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం 2005లో ఎన్‌ఆర్‌హెచ్‌ఎంకు శ్రీకారం చుట్టింది. జిల్లాలోని ప్రతీ పీహెచ్‌సీకి రూ.1.75లక్షలు, సీహెచ్‌సీకి రెండు లక్షలు, ఏరియా ఆస్పత్రులకు రూ.ఐదు లక్షల చొప్పున కేటాయిస్తుంది. వీటిని ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పన, వైద్యశిబిరాలు, రోగుల తరలింపు, అత్యవసర మందుల కొనుగోళ్లకు వెచ్చించాల్సి ఉంటుంది. 2013-14 ఆర్థిక సంవత్సరం నిధుల విడుదల కోసం ఆయా వైద్య కేంద్రాలు ఎదురు చూస్తున్నాయి.
జిల్లా వ్యాప్తంగా 72 పీహెచ్‌సీలకు గాను ఏజెన్సీలోని గిరిజన ప్రాంతాల్లో 31 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. వీటికి సుమారు రూ.1.26 కోట్లు విడుదల కావాల్సి ఉండగా.. రూ.54.25 లక్షలు ఏజెన్సీ పీహెచ్‌సీలకు విడుదల కావాలి. ఉట్నూర్, లక్సెట్టిపేట, బోథ్, ఆసిఫాబాద్, ఖానాపూర్, బెల్లంపల్లి, ముథోల్, సిర్పూర్(టి) సామాజిక ఆస్పత్రులకు రూ.రెండు లక్షల చొప్పున, నిర్మల్, మంచిర్యాల, భైంసా ఏరియా ఆస్పత్రులకు రూ.5లక్షల చొపుపన విడుదల కావాల్సి ఉంది.
జిల్లాలోని 469 సబ్‌సెంటర్లకు అన్‌టైడ్ ఫండ్స్ రూ.పది వేల చొప్పున రూ.46.90లక్షలు విడుదలకు నోచుకొలేదు. ఏజెన్సీలో పలు పీహెచ్‌సీల్లో కిటికీలు, నీటి సమస్యలు, మరుగుదొడ్లు తదితర సమస్యలు తాండవం చేస్తున్నాయి. నిధులు విడుదల కాక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. అత్యవసర మందులు లేక వైద్యం కోసం వచ్చేవారిని బయటే కొనుక్కోవాలని చెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఏజెన్సీలోని గిరిజనులు గ్రామాల్లో జ్వరాలు, అతిసార తదితర వ్యాధులతో సతమతం అవుతున్నారు.
సర్కారు ఆస్పత్రుల్లో మందుల్లేక.. ప్రైవేటు వైద్యం చేయించుకునే స్థోమత లేక దేవుడిపై భారం వేసి మృత్యు ఒడికి చేరుతున్నారు. యూసీ ఖర్చులు, వసతుల నివేదికలు సంబంధిత ఆస్పతులు సకాలంలో పంపించకపోవడంతోనే నిధుల విడుదలలో జాప్యమైనట్లు తెలుస్తోంది. ఈ విషయమై జిల్లా ఏజెన్సీ అదనపు వైద్యాధికారి ప్రభాకర్‌రెడ్డిని సంప్రదించగా.. నిధులు విడుదల కాలేదని స్పష్టం చేశారు. పూర్తి స్థాయిలో నివేదికలు పంపించాలని వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. నిధులు విడుదలయ్యేలా చర్యలు చేపట్టామని తెలిపారు.
ఎన్‌ఆర్‌హెచ్‌ఎం నిధులకు గ్రహణం
Published Thu, May 22 2014 1:51 AM | Last Updated on Sat, Sep 2 2017 7:39 AM
Advertisement