Utnoor
-
ఈ ఇల్లు పాఠాలు నేర్పుతుంది
తల్లిదండ్రులు మడావి లక్ష్మణ్, కమలాబాయిలతో టీచరు ఉద్యోగం సాధించిన కుమార్తెలు కవిత, దివ్య, కళ్యాణి, టీచర్ కావడమే లక్ష్యమంటున్న చిన్నకుమార్తె కృష్ణప్రియ (కుడి చివర) ‘ఎంత మంది పిల్లలు?’ అనే ప్రశ్న వినిపించినప్పుడల్లా లక్ష్మణ్ గుండెల్లో రైళ్లు పరుగెత్తినంత పనయ్యేది. ఎందుకంటే...‘నాకు అయిదుగురు ఆడపిల్లలు’ అనే మాట లక్షణ్ నోటినుంచి వినిపించడమే ఆలస్యం ‘అయ్యో!’ అనే అకారణ సానుభూతి వినిపించేది. ‘ఇంట్లో ఒకరిద్దరు ఆడపిల్లలు ఉంటేనే కష్టం. అలాంటిది అయిదుగురు ఆడపిల్లలంటే మాటలా! నీ కోసం చాలా కష్టాలు ఎదురుచూస్తున్నాయి’ అనేవాళ్లు. అయితే వారి పెదవి విరుపు మాటలు, వెక్కిరింపులు తనపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపించలేకపోయాయి. ఈ ఇల్లు పిల్లలకు బడి పాఠాలు చెప్పే ఇల్లే కాదు... ఆడపిల్లల్ని తక్కువ చేసి చూసేవారికి గుణపాఠాలూ చెబుతుంది.ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌కు చెందిన మడావి లక్ష్మణ్ బాల్యమంతా పేదరికంలోనే గడిచింది. ఆదివాసీ తెగకు చెందిన లక్ష్మణ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడైన తరువాత ఆర్థిక కష్టాలు తీరాయి. లక్ష్మణ్– కమలాబాయి దంపతులకు మొదటి సంతానంగా ఆడపిల్ల పుట్టింది.‘ఆడపిల్ల ఇంటికి అదృష్టం’ అన్నారు చుట్టాలు పక్కాలు, పెద్దలు.రెండోసారి ఆడపిల్ల పుట్టింది. వాతావరణంలో కాస్త మార్పు వచ్చింది. ‘మళ్లీ ఆడపిల్లేనా!’ అన్నారు.‘ఇద్దరు పిల్లలు చాలు’ అనుకునే సమయంలో ‘లేదు... లేదు... అబ్బాయి కావాల్సిందే’ అని పట్టుబట్టారు ఇంటి పెద్దలు.మూడో సారి... అమ్మాయి. ‘ముత్యాల్లాంటి ముగ్గురు పిల్లలు చాలు’ అనుకునే లోపే....‘అలా ఎలా కుదురుతుంది....అబ్బాయి...’ అనే మాట మళ్లీ ముందుకు వచ్చింది.నాల్గోసారి... అమ్మాయి.‘ఇక చాలు’ అని గట్టిగా అనుకున్నా సరే... పెద్దల ఒత్తిడికి తలవొంచక తప్పలేదు.‘ఆరు నూరైనా ఈసారి కొడుకే’ అన్నారు చాలా నమ్మకంగా పెద్దలు. దేవుడికి గట్టిగా మొక్కుకున్నారు.అయిదోసారి... అమ్మాయి. ‘అయ్యయ్యో’ అనే సానుభూతులు ఆకాశాన్ని అంటాయి. అయితే లక్ష్మణ్, కమలాబాయి దంపతులు ఎప్పుడూ నిరాశపడలేదు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయినప్పటికీ ఖర్చులకు సరిపడా జీతం రాకపోవడంతో ఖర్చులు పెరిగాయి. ‘ఎంత ఖర్చు అయినా, అప్పు చేసైనా సరే పిల్లలను బాగా చదివించాలి’ అని గట్టిగా నిర్ణయించుకున్నాడు లక్ష్మణ్. పిల్లల్ని చదివించడమే కాదు ఆడపిల్లలు అనే వివక్ష ఎక్కడా ప్రదర్శించేవారు కాదు. ఆటల్లో, పాటల్లో వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చేవారు. పిల్లలు బాగా చదువుకోవాలంటే బెత్తం పట్టుకోనక్కర్లేదు. వారికి నాలుగు మంచి మాటలు చెబితే సరిపోతుంది. ఆ మాటే వారికి తిరుగులేని తారకమంత్రం అవుతుంది.అయిదుగురు పిల్లల్ని కూర్చోపెట్టుకొని ‘‘అమ్మా... మీ నాయిన టీచర్. మా నాయినకు మాత్రం చదువు ఒక్క ముక్క కూడా రాదు. నాకు మాత్రం సదువుకోవాలనే బాగా ఇది ఉండే. అయితే మా కుటుంబ పరిస్థితి చూస్తే... ఇంత దీనమైన పరిస్థితుల్లో సదువు అవసరమా అనిపించేది. ఎందుకంటే సదువుకోవాలంటే ఎంతో కొంత డబ్బు కావాలి. ఏ రోజుకు ఆరోజే బువ్వకు కష్టపడే మా దగ్గర డబ్బు ఎక్కడిది! అయినా సరే సదువుకోవాలని గట్టిగా అనుకున్నాను. ఎన్నో కష్టాలు పడ్డాను...’ అని నాన్న చిన్నప్పుడు చెప్పిన మాటలు పిల్లలపై బలమైన ప్రభావాన్ని చూపాయి. వారు చదువును ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. ఆ ఫలితం వృథా పోలేదు.ఇప్పుడు...రెండో కూతురు కవిత, మూడో కూతురు దివ్య, నాల్గో కూతురు కళ్యాణి ప్రభుత్వ ఉపాధ్యాయులు. చిన్న కూతురు కృష్ణప్రియ కొద్ది మార్కుల తేడాతో టీచర్ అయ్యే చాన్స్ మిస్ అయింది. అక్కలలాగే టీచర్ కావాలని కలలు కంటున్న కృష్ణప్రియకు మరోప్రయత్నంలో తన కల నెరవేర్చుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. అప్పుడు ఒకే ఇంట్లో నలుగురు టీచర్లు!ఇంటర్ వరకు చదివిన పెద్ద కూతురు రత్నకుమారి చెల్లెళ్ల స్ఫూర్తితో పై చదువులు చదవాలనుకుంటోంది. వారిలాగే ఒక విజయాన్ని అందుకోవాలనుకుంటుంది. ఇప్పుడు లక్ష్మణ్‌ను చూసి జనాలు ఏమంటున్నారు? ‘నీకేమయ్యా... ఇంటినిండా టీచర్లే!’ ‘మీది టీచర్స్ ఫ్యామిలీ’నాన్న మాటలుతల్లిదండ్రులు మమ్మల్ని ఎప్పుడూ చిన్నచూపు చూడలేదు. వారి ఆశీర్వాద బలంతోనే టీచర్ అయ్యాను. ‘చదువే మన సంపద’ అని నాన్న ఎప్పుడూ చెబుతుండే వాడు. ఆయన మాటలు మనసులో నాటుకు΄ోయాయి.– కవిత, రెండో కుమార్తెనేను టీచర్... అక్కహెడ్మాస్టర్అక్క కవితకు, నాకు ఒకేసారి ఉద్యోగాలు వచ్చాయి. ప్రస్తుతం నేను జైనూర్ మండలం జెండాగూడలో ఎస్జీటీగా పనిచేస్తున్నాను. మా స్కూలుకు అక్క కవితనే ప్రధానో΄ాధ్యాయురాలు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన మేము ఇప్పుడు ఒకే బడిలో పనిచేస్తుండటం సంతోషంగా ఉంది.– దివ్య, మూడో కుమార్తెఆరోజు ఎంత సంతోషమో!మొన్నటి డీఎస్సీలో టీచర్ ఉద్యోగం వచ్చింది. ఆదిలాబాద్ జిల్లా సిరికొండలో నాకు ΄ోస్టింగ్ ఇచ్చారు. మొన్ననే విధుల్లో చేరాను. టీచర్‌గా మొదటి రోజు స్కూల్‌కి వెళ్లినప్పుడు నాకు కలిగిన సంతోషం అంతా ఇంతా కాదు. ‘మా ముగ్గురు పిల్లలు టీచర్లే అని ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటాను’ అంటున్నాడు నాన్న.– కళ్యాణి, నాలుగో కుమార్తెటీచర్ కావడమే నా లక్ష్యంఅక్క కళ్యాణితో కలిసి నేను కూడా మొన్నటి డీఎస్సీ పరీక్ష రాశాను. కొద్ది మార్కుల తేడాతో నాకు ఉద్యోగం చేజారింది. అయితే నా లక్ష్యాన్ని మాత్రం వీడను. ఎలాగైనా టీచర్ కొలువు సాధిస్తాను.– కృష్ణప్రియ, ఐదో కుమార్తె – గోడిసెల కృష్ణకాంత్, సాక్షి, ఆదిలాబాద్ఫొటోలు: చింతల అరుణ్ రెడ్డి -
నిండా 40 లేవు, గుండెపోటుతో ఐటీడీఏ ఛైర్మన్ మృతి
సాక్షి, ఆదిలాబాద్ జిల్లా: ఉట్నూరు ఐటీడీఏ చైర్మన్ లక్కేరావు గుండెపోటుతో మృతిచెందారు. తీవ్రమైన గుండెపోటుతో ఇంట్లోనే ఆయన తుది శ్వాస విడిచారు. గతంలో ఒకసారి బైపాస్ సర్జరీ చేయించుకున్నా ఆయన.. మళ్లీ గుండెపోటుకు గురయ్యారు. లక్కేరావు మరణంతో ఆదివాసీల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆదివాసీ ఉద్యమ నేత, ప్రజా సేవకుడిని కోల్పోవడం పట్ల ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్కేరావు మృతి పట్ల ఐటీడీఏ అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మంత్రి ఇంద్రకరరణ్ రెడ్డి సంతాపం ఐటీడీఏ ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్ కనక లక్కేరావు హఠాన్మరణం పట్ల అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. లక్కేరావు గిరిజనుల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని ఆయన సేవలను కొనియాడారు. లక్కేరావు మృతి గిరిజన జాతికి తీరని లోటని ఆయన పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు సద్గతులు కలగాలని ప్రార్థించారు. చదవండి: మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు షాక్.. మధ్యంతర పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు -
ఆ సబ్జెక్టు వరకు పాస్ చేసేద్దామా?
సాక్షి, హైదరాబాద్: ఉట్నూర్ కేంద్రంలో సోమవారం మాయమైన పదో తరగతి విద్యార్థుల సమాధాన పత్రాలపై విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆ సబ్జెక్టు వరకూ వారిని పాస్ చేయడమే సరైన నిర్ణయంగా భావిస్తున్నట్టు తెలుస్తోంది. తొలిరోజు టెన్త్ పరీక్ష సందర్భంగా ఉట్నూర్ కేంద్రంగా ప్రైవేటు విద్యార్థులు (సప్లిమెంటరీ) 9 మంది పరీక్ష రాశారు. ఆ పేపర్లను ముందే నిర్ణయించిన ప్రకారం వాల్యూయేషన్ కేంద్రానికి తరలించాల్సి ఉంది. వీటిని దగ్గర్లోని పోస్టాఫీసుకు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో ఎక్కడో పడిపోయాయి. దీన్ని గుర్తించిన విద్యాశాఖాధికారులు ఈ వ్యవహారంపై విచారణ చేపట్టారు. జవాబు పత్రాలు మాయమైన ఘటనకు విద్యార్థులను బాధ్యులను చేయడం సరికాదని భావించి, ఆ సబ్జెక్టు వరకు పాస్ చేయడం మంచిదనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. -
ఆదిలాబాద్: ఊట్నూర్లో పదో తరగతి ఆన్సర్‌షీట్లు మిస్సింగ్
సాక్షి, ఆదిలాబాద్: ఉట్నూరు ootnur మండల కేంద్రంలో పదవ తరగతి ఆన్సర్షీట్ల కట్ట మిస్ అయ్యింది. తపాలా కార్యాలయం నుంచి ఉట్నూర్ బస్టాండ్‌కు తీసుకు వస్తున్న క్రమంలో ఆటో నుంచి మాయమైనట్లు పోలీసులు భావిస్తున్నారు. దాదాపు ఇరవై మంది విద్యార్థుల జవాబు పత్రాలు కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది. పోస్టల్ అధికారి ఫిర్యాదు తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పేపర్లు ఆటోలో తరలిస్తుండగా.. కిందపడిపోయి ఉంటాయా? లేదంటే ఎవరైనా కావాలని మాయం చేశారా? అనే తేల్చే పనిలో ఉన్నారు ఎస్సై భరత్. మరోవైపు అవి ఏ సెంటర్ పేపర్లు అనేది స్పష్టత లేకపోవడంతో.. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఈ వ్యవహారంపై విద్యాశాఖ స్పందించింది. సాక్షితో డీఈఓ ప్రణీత మాట్లాడుతూ.. ‘‘ఉట్నూరు పదవ తరగతి జవాబు పత్రాలు మాయం అయ్యాయి. పదిహేను మంది విద్యార్థుల తెలుగు జవాబు పత్రాలు మాయం అయినట్లు గుర్తించాం. పోస్టాఫీస్ నుంచి బస్టాండ్‌కు తరలిస్తుండగానే అవి పోయాయి. కాబట్టి, పోస్టల్ అధికారులదే బాధ్యత. వాళ్లకు ఆన్సర్‌షీట్లు అప్పగించినట్లు మా దగ్గర రిసిప్ట్ కూడా ఉంది. ఇది కేవలం వాళ్ల నిర్లక్ష్యమే. ఇందులో మా తప్పిదం ఏం లేదు. దర్యాప్తు ఆధారంగా చర్యలు తీసుకుంటాం’’ అని తెలిపారామె. ఇదీ చదవండి: పరీక్ష ప్రారంభమైన కాసేపటికే.. టెన్త్ పేపర్ అవుట్! -
అర్జీల పరిష్కారానికి అందుబాటులో ఉంటా
సాక్షి, ఉట్నూర్(ఖానాపూర్): సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారిగా నాలుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత గిరిజనుల సంపూర్ణ అభివృద్ధికి అందుబాటులో ఉంటూ గిరిజన సంక్షేమానికి కృషి చేస్తానని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి భవేశ్ మిశ్రా అన్నారు. శనివారం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ 53వ ప్రాజెక్టు అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రాజెక్టు అధికారిగా ఏజెన్సీ ప్రాంత గిరిజనులందరికీ అందుబాటులో ఉంటూ విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల గిరిజనుల అభివృద్ధి కేంద్రంగా ఉన్న ఐటీడీఏ ద్వారా గిరిజనుల సంపూర్ణ అభివృద్ధికి పాటుపడుతానని చెప్పారు. అన్నీ శాఖల అధికారుల సమన్వయంతో ముందుకు సాగుతానని చెప్పారు. గతంలో భద్రాచలం షెడ్యూల్ ప్రాంతంలో విధులు నిర్వహించిన అనుభవంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ ఫలాలు అర్హులకు అందిస్తానన్నారు. గిరిజన సమస్యలపై ఏ సమయంలోనైనా ఫోన్, వాట్సాఫ్ ద్వారా ఎవరైన సంప్రదించవచ్చన్నారు. ప్రభుత్వ ఆర్థిక చేయూత పథకాల ఫలాలు గిరిజన లబ్ధిదారులకు అందించడంతో పాటు అర్జీదారుల సమస్యలు పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఐటీడీఏలో ఆయా విభాగాల అధికారులు సమయపాలనా పాటిస్తూ విధులు సక్రమంగా నిర్వహించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఉద్యోగి బయో మెట్రిక్ పాటించడంతో పాటు తమ ఐడీ కార్డుల్లో బ్లడ్ గ్రుప్‌తో సహా వివరాలు అన్ని పొందుపర్చుకోవాలని తెలిపారు. అటవీ హక్కుల చట్టం హక్కు పత్రాలపై అధికారులతో సమీక్షా అనంతరం అర్హులకు న్యాయం జరిగేలా చర్యలుంటాయన్నారు. అనంతరం ఐటీడీఏ కార్యాలయంలోని పలు విభాగాలను పరిశీలించారు. ఆయా కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న అధికారుల పనుల తీరుపై ఆరా తీశారు. నూతన పీవో రావడంతో ఐటీడీఏ, వివిధ విభాగాల అధికారులు పీవోకు స్వాగతం పలుకుతూ పుష్పగుచ్ఛం అందించారు. -
బాంబు పేలుడు కలకలం.. ఒకరి మృతి
-
ఆదిలాబాద్‌లో బాంబు పేలుడు
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు సమీపంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఒక్కసారి ఉలిక్కిపడింది. ఈ పేలుడు ధాటికి ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి మృతుడి శరీరభాగాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. గాయపడిన క్షత్రగాత్రుడిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై స్థానికులు, పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ మీదుగా ఉట్నూరుకు ఇద్దరు వ్యక్తులు బైక్‌పై ప్రయాణిస్తున్నారు. అయితే ఉట్నూర్ ఎక్స్ రోడ్ దగ్గర గల పెట్రోల్ బంక్ వద్దకు చేరుకోగానే బైక్ నుంచి ఒక్క సారిగా పేలుడు సంభవించింది. దీంతో ఏం జరిగిందో అర్థం కాక స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. అయితే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. అంతేకాకుండా ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. పేలిన బాంబుతో పాటు బైక్‌లో మరో బాంబు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అంతేకాకుండా పేలుడు సంభవించడానికి గల కారణం నాటు బాంబు లేక గనుల్లో వాడే జిలితెన్ స్టిక్స్ అయి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఐటీడీఏను ముట్టడించిన ఆదివాసీలు
ఉట్నూర్: లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే ప్రధాన డిమాండ్‌తోపాటు తమ సమస్యలను ప్రభుత్వం వెంట నే పరిష్కరించాలంటూ ఆదివాసీ మహిళాలోకం కదంతొక్కింది. భారీగా తరలివచ్చిన ఆదివాసీలు సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లోని ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. ఐదువేలకు పైగా ఆదివాసీలు ఆందోళనలో పాల్గొన్నారు. ఉట్నూర్ ప్రధానవీధుల్లో భారీ ప్రదర్శన చేపట్టారు. మధ్యా హ్నం 2 నుంచి సాయంత్రం ఐదున్నర వరకు మూడు కి.మీ. మేర ట్రాఫిక్ స్తంభించింది. విషయం తెలుసుకున్న సబ్ కలెక్టర్ ఐటీడీఏ కార్యాలయానికి చేరుకుని వారి నుంచి వినతిపత్రం తీసుకున్నప్పటికీ అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. పోలీసులు బారికేడ్లు ఏర్పాట్లు చేయడం.. గేటుకు తాళం వేయడం తో ఆదివాసీలు కోపోద్రిక్తులయ్యారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికా రి రావాల్సిందేనంటూ.. లోపలికి చొచ్చుకెళ్లే యత్నం చేశారు. పోలీసులు అడ్డుకున్నా.. ఆదివాసీలు భారీ సంఖ్యలో ఉండటంతో చేతులెత్తేయాల్సి వచ్చింది. పలువురు ఆదివాసీలు గోడపై నుంచి దూకి కార్యాలయం లోపలికి వెళ్లారు. అదనపు ఎస్పీ రవికుమార్, డీఎస్పీ డేవిడ్ ఆదివాసీలకు నచ్చజెప్పే ప్రయ త్నం చేసినా ఫలితం లేకపోయింది. ఆదివాసీ మహిళా సంఘం నాయకులు మాట్లాడుతూ.. ఐటీడీఏ ఉన్నది ఆదివాసీల కోసమేనని, తమను ఎందుకు అనుమతించట్లేదని ప్రశ్నించారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు తమ పోరాటం ఆపబోమన్నారు. లంబాడీలకు ఏజెన్సీ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వొద్దంటూ నినదించారు. ఇప్పటికే ధ్రువీకరణ పత్రాలిచ్చిన తహసీల్లార్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. టీఆర్టీలో తప్పుడు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చిన 25 మందిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఆదివాసీ నేతలపై పెట్టిన కేసుల ను ఎత్తి వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ మహిళా సంఘం నాయకులు గోడం రేణుకాబాయి, సోయం లలితాబాయి, మర్సకోల సరస్వతి తదితరులు పాల్గొన్నారు. -
నోటికి ప్లాస్టర్ అంటించి, అగర్‌బత్తీలతో కాల్చి...
సాక్షి, ఉట్నూర్ రూరల్ : కంటికి రెప్పలా కాపాడాల్సిన ఓ వార్డెన్ చిన్నారులపై లైంగికదాడికి పాల్పడుతున్నాడు. అర్ధరాత్రి నిద్రలేపి మరీ ఈ అరాచకానికి ఒడిగడుతున్నాడు. ఈ కీచకపర్వం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాల వసతి గృహంలో వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని ఓ ఇంగ్లిష్ మీడియం ఉన్నత పాఠశాల అక్కడే హాస్టల్ నిర్వహిస్తోంది. విద్యార్థులపై హాస్టల్ వార్డెన్ కొమ్ము లింగన్న లైంగిక దాడులకు పాల్పడుతున్నాడు. ఈ విషయమై విద్యార్థుల తల్లిదండ్రులు రెండు నెలల క్రితం ప్రిన్సిపాల్‌కు వివరించినట్లు సమాచారం. అయినా సదరు వార్డెన్‌లో మాత్రం మార్పు రాలేదు. దీంతో పిల్లల తల్లిదండ్రులు గురువారం పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. పిల్లలను అర్ధరాత్రి నిద్ర లేపి లైంగిక వేధింపులకు గురిచేసేవాడని, వినకపోతే నోటికి ప్లాస్టర్ అంటించి, అగర్‌బత్తీలతో కాల్చేవాడని పిల్లలు తమకు ఏడుస్తూ విన్నవించారని తల్లిదండ్రులు పేర్కొన్నారు. గతంలో ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశామని, పిల్లల పరువుపోతుందని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఆగిపోయామని తెలిపారు. అదే సమయంలో వార్డెన్ కనిపించడంతో ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు అతడిపై దాడి చేశారు. సీఐ నరేశ్, ఎస్సై అనిల్ విద్యార్థుల తల్లిదండ్రులను సముదాయించారు. వార్డెన్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసినట్లు ఎస్సై అనిల్ తెలిపారు. -
రావణుడి బొమ్మను దహనం చేయకండి
సాక్షి, ఆదిలాబాద్: ఉట్నూర్ మండల కేంద్రంలోని రామమందిరంలో దసరా పర్వదినం రోజు రావణుడి బొమ్మను దహనం చేయకూడదంటూ ఆదివాసులు ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు స్వీకరించిన అధికారులు ఉట్నూర్ ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం హిందూ ఉత్సవ సమితి, గోండు ధరమ్ సభ్యులతో శాంతి చర్చలు జరిపారు. గతంలో మాదిరిగానే ఈ ఏడాది కూడా దసర పండుగ ఉత్సవాలు నిర్వహించుకోవాలని, అందుకు ఇరువర్గాల సహకారం అవసరమని అధికారులు సూచించారు. దీంతో ఇరువర్గాల ఆందోళనకారులు శాంతించి తమ అంగీకారం తెలిపారు. సమావేశంలో ఆదిలాబాద్ డీఎస్పీ డేవిడ్, ఆర్డీఓ వినోద్ కుమార్, హిందూ ఉత్సవ సమితి, గోండు ధరమ్ సభ్యులు హాజరైనారు. -
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో ఆర్టీసీ బస్సు బోల్తా
-
చల్లార్చేదెలా?
ఉట్నూర్(ఖానాపూర్): ఏజెన్సీ కేంద్రంగా ఉన్న ఉట్నూర్ అగ్నిమాపక కేంద్రం పరిధిలో ఎక్కడ అగ్ని ప్రమాదం సంభవించినా ఆస్తులు బుగ్గిపాలు కావాల్సిందే. అలాగని అగ్నిమాపక సిబ్బంది నిర్లక్ష్యమో.. పట్టింపులేని ధోరణి అనుకుంటే పొరపాటే. మంటలు ఆర్పడానికి అవసరమైన నీటి సౌకర్యం లేకపోవడమే ప్రధాన సమస్య. అగ్ని ప్రమాదానికి సంబంధించిన సమాచారం వస్తే చాలు ఫైరింజన్ తీసుకుని నీటి కోసం చెరువు బాట పట్టాల్సిందే. నీటి సమస్య ఒక్కటే కాదు.. అగ్నిమాపక కేంద్రానికి సొంత భవనం లేక, సిబ్బందికి మౌలిక వసతులు కరువై ఇబ్బం దులు పడాల్సి వస్తోంది. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం రెండు సార్లు నిధులు విడుదల చేసినా స్థల సమస్య కారణంగా వెనక్కి వెళ్లాయి. చెరువే దిక్కు.. అగ్నిమాపక కేంద్రం ఉన్న ప్రాంతంలో ఎలాంటి నీటి వసతులు లేవు. దీంతో ఎక్కడైన ప్రమాదం జరిగిందనే సమాచారం రాగానే నీటి కోసం వెతకాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. మంటలు ఆర్పడానికి వెళ్లే క్రమంలో ఫైరింజన్ తిరుగు ప్రయాణంలో చెరువు కనిపిస్తే నీటిని నింపాల్సిన దుస్థితి నెలకుంటోంది. 4500 లీటర్ల సామర్థ్యం గల ఫైరింజన్లో నీటిని నింపడానికి సిబ్బంది పడరాని పాట్లు పడుతుంటారు. ఈ క్రమంలో సిబ్బంది గాయాల పాలైన సంఘటనలూ ఉన్నాయి. చెరువు నీరు ఫైరింజన్లో నింపే క్రమంలో బురద రాకుండా సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కార్యాలయం వద్ద ఎలాంటి నీటి సౌకర్యం లేకపోవడంతో ఎన్టీఆర్ చౌరస్తాలో ప్రధాన రహదారి వెంట చేతిపంపు నీటితో అవసరాలు తీర్చుకోవాల్సి వస్తోంది. కేంద్రంలో కనీసం మరుగుదొడ్లు, మూత్రశాలల ఉపయోగం కోసం కూడా నీటి సౌకర్యం లేదు. అగ్నిమాపక సిబ్బంది తిప్పలు సొంత భవనం లేక తిప్పలు.. సమస్యాత్మక మండలాలైన ఉట్నూర్, నార్నూర్, జైనూ ర్, ఇంద్రవెల్లి, సిర్పూర్(యు) మండలాల్లో సంభవించే అగ్ని ప్రమాదాల నివారణకు ప్రభుత్వం 2004లో ఏజెన్సీ కేంద్రంగా కుమురం భీం ప్రాంగణంలో అగ్నిమాపక కేంద్రాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత కేంద్రాన్ని ఎంపీడీవో కార్యాలయం అధీనంలోని క్వార్టర్స్‌కు మార్చింది. నాటి నుంచి ఐదు మండలాల్లో ఎక్కడ ఏ అగ్నిప్రమా దం జరిగినా ఇక్కడి నుంచి ఫైరింజన్ వెళ్లాల్సిందే. తర్వాత కాలంలో సొంత భవన నిర్మాణానికి నిధులు మంజూరు కావడంతో ఎంపీడీవో కార్యాలయ సమీపంలో ప్రభుత్వం ఎకరం స్థలం కేటాయించింది. ఆ స్థలం కోర్టు కేసులో ఉండడంతో అగ్నిమాపక కేంద్రం నిర్మా ణం మరుగునపడింది. క్వార్టర్ శిథిలావస్థకు చేరిందని, అది వెంటనే ఖాళీ చేయాలని ఐదేళ్లుగా ఎంపీడీవో కార్యాలయం నోటీసులు జారీ చేస్తూనే ఉంది. మరోమార్గం లేక కార్యాలయం అందులోనే కొనసాగిస్తున్నారు. ఫైర్ సామగ్రి భద్రపర్చడం, సిబ్బంది విశ్రాంతి తీసుకోవడానికి పూర్తి స్థాయి సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పై కప్పు సరిగా లేక కార్యాలయం శిథిలావస్థకు చేరడంతో వర్షం వస్తే ఉరువకుండా ఉండడానికి కవర్లు కప్పారు. నిధులు మంజూరు అవుతున్నా.. అగ్నిమాపక కేంద్రం నిర్మాణం కోసం ప్రభుత్వం మూడేళ్ల క్రితం రూ.35లక్షలు విడుదల చేసింది. గతంలో ఎంపీడీవో కార్యాలయ మైదానంలో కేటాయించిన స్థలం కోర్టు కేసులో ఉండడం, ఇతర చోట్ల స్థలం కేటాయింపులో రెవెన్యూ అధికారులు విఫలం కావడంతో నిధులు వెనక్కి వెళ్లాయి. అదీగాక 2015–16 ఆర్థిక సంవత్సరంలో మరోసారి ప్రభుత్వం రూ.70 లక్షలు అగ్నిమాపక కార్యాలయ నిర్మాణానికి మంజూరు చేసింది. స్థల సేకరణలో భాగంగా ఉట్నూర్ ఆర్డీవో మండల కేంద్రంలోని ఐబీ ప్రాంతంలో ఎకరం స్థలం గుర్తించారు. ఆ స్థలాన్ని అగ్నిమాపక కేంద్రానికి కేటాయించాలని ఫిబ్రవరి 2015లో కలెక్టర్‌కు అధికారులు నివేదించారు. ఐబీ ప్రాంతంలో ఉన్న స్థలం ఆర్అండ్బీ శాఖకు చెందినదని, ఆ స్థల కేటాయింపు కలెక్టర్ పరిధిలో ఉండదని తేలడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. దీంతో మంజూరైన రూ.70లక్షలు మళ్లీ వెనక్కి వెళ్లే ప్రమాదం ఉంది. అగ్నిమాపక కార్యాలయ నిర్మాణానికి స్థలం ఎక్కడన్నది తేలకపోవడంతో బోర్‌వెల్స్ వేయడం, ట్యాంకుల నిర్మాణం కోసం రూ.10 లక్షలు మంజూరైనా ఖర్చు చేయలేని స్థితిలో కేంద్రం అధికారులు ఉన్నారు. వేసవి కాలం కావడంతో అగ్నిమాపక అధికారుల తిప్పలు నిత్యకృత్యం కానున్నాయి. స్థలం లేక నిధులు వెనక్కి.. ఇప్పటికి అగ్నిమాపక కార్యాలయం నిర్మాణానికి రెండుసార్లు నిధులు మంజురైనా స్థలం లేక వెనక్కి వెళ్తున్నాయి. ఫైరింజన్‌కు కావాల్సిన నీటి కోసం ప్రతి సారి ఎక్కడ నీటి వనరులు ఉంటే అక్కడికి వెళ్లాల్సిందే. నూతన కేంద్రం నిర్మాణానికి ఇటీవల ఐబీ ప్రాంతంలో ఆర్డీవోతో కలిసి ఎకరం స్థలం గుర్తించినా ఫలితం లేకుండాపోయింది. ఎక్కడైనా ఎకరం స్థలం లభిస్తే నూతన భవన నిర్మాణానికి అవకాశం ఉంది. నీటి సమస్య పరిష్కారానికి రూ.10 లక్షలు మంజూరైనా సొంత భవనం లేక ఖర్చు చేయలేకపోతున్నాం. – టి.పరమేశ్వర్, అగ్నిమాపక అధికారి ఉట్నూర్ -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
ఉట్నూర్ రూరల్: మండలంలోని పులిమడుగు గ్రామ సమీపంలో సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో హస్నాపూర్ పంచాయతీ పరిధి దేవుగూడ గ్రామానికి చెందిన మడావి జ్ఞానేశ్వర్ (21)అక్కడిక్కడే మృతి చెందాడు. స్థానిక ఎస్సై సాయన్న తెలిపిన వివరాల ప్రకారం.. జ్ఞానేశ్వర్, ఆయన స్నేహితుడు కుమ్ర అశోక్ ఇంద్రవెల్లి మండలం కెస్లగూడ గ్రామానికి వెళ్లి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా పులిమడుగు వద్ద వాహనం అదుపుతప్పి కింద పడగా జ్ఞానేశ్వర్ అక్కడిక్కడే మృతి చెందాడు. అశోక్‌కు తీవ్రగాయాలు కాగా 108లో ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జ్ఞానేశ్వర్ కుటుంబాన్ని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ మంగళవారం పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రూ.5 వేలు ఆర్థిక సాయం అందించారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ రాథోడ్ విమల, పలువురు ఉన్నారు. -
ఉట్నూరులో డీజీపీ, సీఎస్ పర్యటన
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల జరిగిన అల్లర్ల దృష్ట్యా శాంతి భద్రతలను పర్యవేక్షంచేందుకు డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ శనివారం జిల్లాలో పర్యటిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఉట్నూరు చేరుకుని పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఉన్నతాధికారులతో సీఎస్, డీజీపీ సమావేశమయ్యారు. అదే విధంగా ఆదివాసీ, లంబాడీ నాయకులతో కూడా చర్చలు జరిపే అవకాశం ఉంది. -
'ఉట్నూరు' వెనుక మావోలు?
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఘటన వెనుక అదృశ్యశక్తులు ఉన్నాయా? ఈ ఘటనకు మావోయిస్టు పార్టీకి సంబంధం ఉందా? ఈ ప్రశ్నలకు పోలీస్ శాఖలోని కొందరు సీనియర్ అధికారులు అవుననే సమాధానం చెప్తున్నారు. ఐదేళ్లుగా పెద్దగా కదలికలు లేని మావోయిస్టు తెలంగాణ కమిటీ మళ్లీ రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. పోలీస్ శాఖ దానికి దీటుగా బదులిస్తూ సరిహద్దులోకి రాకుండా అడ్డుకుంటోంది. అయితే రిక్రూట్మెంట్లో తెలంగాణ కమిటీ చాలా బలహీనంగా ఉంది. వీటికి తోడు రాష్ట్రంలో ఏ ఉద్యమం పెద్ద ఎత్తున ఇప్పటి వరకు జరిగిందీ లేదు. అందువల్ల ప్రస్తుతం ఆదివాసీలు, లంబాడీ ఉద్యమంపై మావోయిస్టు పార్టీ దృష్టి సారించినట్టు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అనుమానిస్తోంది. ఈ అనుమానానికి ఉట్నూర్‌లో జరిగిన విధ్వంసమే బలం చేకూర్చిందంటూ పోలీస్ శాఖ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఆర్గనైజింగ్‌గా జరిగిందేనా? ఆదివాసీలు, లంబాడీలు దాడులు చేసుకున్న పరిస్థితులను గమనిస్తున్న ఇంటెలిజెన్స్ వర్గాలు ఓ అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. రెండు వర్గాల్లో ఇంత ఆర్గనైజింగ్‌గా దాడులు చేయడం ఇప్పటివరకు జరగలేదని, దీని వెనుక అదృశ్య శక్తులు ఉండొచ్చని సీనియర్ ఐపీఎస్‌లు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఉట్నూర్, ఆసిఫాబాద్, కెరిమెరీ, ఇంద్రవెల్లి తదితర ప్రాంతాలు మావోయిస్టు పార్టీకి గతంలో కంచుకోటగా నిలిచాయి. అయితే ఇప్పుడు అంతగా ప్రభావం లేకున్నా.. ఇంతటి ఆర్గనైజింగ్‌గా దాడులు జరగడానికి మావోయిస్టు పార్టీ ప్రోద్బలమే కారణం కావొచ్చని అనుమానిస్తున్నారు. డివిజన్ కమిటీ కార్యదర్శిగా భాస్కర్ దీనికి బలం చేకూర్చేలా మావోయిస్టు పార్టీ ఇటీవల కేకేడబ్ల్యూ(కరీంనగర్, ఖమ్మం, వరంగల్) కమిటీనీ రద్దు చేసి, దాని స్థానంలో కొత్త డివిజన్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఎంఏ(మంచిర్యాల–ఆసిఫాబాద్) కేంద్రాలుగా పనిచేసేలా డివిజన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడైన మైలారపు ఆదేలు అలియాస్ భాస్కర్‌ను కార్యదర్శిగా నియమించింది. దీంతో ఆసిఫాబాద్‌లోనూ మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు, నూతన నియమకాలు వేగవంతం చేసేందుకు సిద్ధమైనట్టు స్పష్టంగా తెలుస్తోంది. అందుకే ఆ అధికారులు.. మిలిటెంట్ తరహా ఉద్యమాలు చేసే మావోయిస్టు పార్టీ కార్యాచరణలాగే ఉట్నూర్ ఘటన జరగడం పోలీస్ అధికారులను ఆందోళనలో పడేసింది. ఇలాంటి ఘటనలు ఇతర ప్రాంతాలకు పాకకుండా ముందస్తుగా భారీ బలగాల మోహరింపు.. 144 సెక్షన్ అమలు.. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసిన అనుభవం ఉన్న ఐజీలు, డీఐజీలను రంగంలోకి దించడం వెనుక కారణం ఇదే అన్న వాదన బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం డీఐజీగా నియమించిన ప్రమోద్‌కుమార్ గతంలో ఆదిలాబాద్ జిల్లా ఎస్పీగా పనిచేశారు. ఐజీ దేవేంద్రసింగ్‌చౌహాన్ కరీంనగర్ ఎస్పీగా పనిచేశారు. ఐజీ అనిల్‌కుమార్ సైతం ఆదిలాబాద్ ఎస్పీగా పనిచేసిన వారే. వారు పనిచేసిన కాలంలో మావోయిస్టు పార్టీ ఆ జిల్లాల్లో పాల్పడిన ఘటనలు, వాటి వెనకున్న కార్యాచరణ, వాటి నియంత్రణపై పూర్తి పట్టు ఉన్న అధికారులుగా పేరు సాధించారు. దీంతో వీరిని అక్కడ నియమించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. మాజీలకు స్పెషల్ టాస్క్? ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం మావోయిస్టు పార్టీ గానీ, స్థానిక దళాలు గానీ లేవు. గతంలో మావోయిస్టు పార్టీ, స్థానిక దళాల్లో పనిచేసి లొంగిపోయిన కొంతమంది ఇంకా పార్టీతో టచ్‌లో ఉన్నట్టు పోలీస్ శాఖ గుర్తించింది. మావోయిస్టు పార్టీలో కొత్త నియామకాల కోసం మాజీలను సంప్రదించి ఉంటుందా? అన్న కోణంలోనూ ఆరా తీస్తోంది. అలాగే మావోయిస్టు పార్టీకి గతంలో అనుబంధంగా పనిచేసిన గ్రామ రక్షక దళాలు మళ్లీ జీవం పోసుకుంటున్నట్టు కనిపిస్తోందని పోలీస్ అధికారులు అభిప్రాయపడ్డారు. పార్టీ కోసం పనిచేసి ఉండటం, పైగా మిలిటెంట్ పోరాటాలకు యువతను మళ్లించడంలో సిద్ధహస్తులు కావడంతో వీరికి పార్టీ ప్రత్యేక టాస్క్ ఏమైనా అప్పగించి ఉంటుందా? అన్న కోణంలోనూ ప్రత్యేక నిఘా బృందాలు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఆదివాసీ, లంబాడీ ఉద్యమాన్ని ఉపయోగించుకుని భారీగా నియామకాలు జరుపుకోవాలనే ఉద్దేశంతో మావోయిస్టు పార్టీ, దాని అనుంబంధ సంఘాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. అందుకే పరిస్థితి చేయిదాటకముందే డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్‌చంద్, ఇతర అధికారులంతా ఘటనా స్థలికి వెళ్లారని, అక్కడి అధికారులకు సలహాలు, సూచనలు ఇస్తున్నారని తెలుస్తోంది. రాజకీయ నాయకులపై నజర్.. ఆదివాసీలు, లంబాడీల్లో ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులపై నిఘా వర్గాలు నజర్ ప్రకటించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన బాబూరావు, ఆత్రం సక్కులపై నిఘా పెంచినట్టు తెలిసింది. వీరి ఆధ్వర్యంలోనే సభలు జరగడంతో వీరిని పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే టీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ తదితర పార్టీల నాయకులు, వారి కదలికలపై జిల్లా పోలీసులు ఐడీ పార్టీలను ప్రయోగించినట్టు సమాచారం. పసిగట్టలేకపోయారా? ఆదిలాబాద్, ఆసిఫాబాద్ ప్రాంతాల్లో ఆదివాసీ, లంబాడీల పోరాటం ఎటువైపు వెళ్తోంది? వారి ఉద్యమ కార్యాచరణ ఏంటి? ఆదివాసీలు, లంబాడీల ముసుగులో అదృశ్య శక్తులు చొరబడే ప్రమాదం ఉందా? అన్న అంశాలను రెండు జిల్లాల పోలీస్ అధికారులు పసిగట్టలేకపోయారన్న ఆరోపణ బలంగా వినిపిస్తోంది. దీనివల్లే ఉట్నూర్ ఘటన జరిగిందని, ముందే పసిగట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. అనుభవ లోపం, సరైన రీతిలో నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని ఉన్నతాధికారులు ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన సమాచారాన్ని పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించకపోవడం కూడా ఐపీఎస్ అధికారుల బదిలీకి కారణమైందన్న వాదన కూడా వినిపిస్తోంది. -
గిరిజనులు అప్రమత్తంగా ఉండాలి
-
ఉట్నూరులో వాట్సాప్ మంట
ఓ వర్గాన్ని కించపరుస్తూ పోస్టు చేసిన యువకుడు ► చర్యలు తీసుకోవాలంటూ మరో వర్గం ఆందోళన ► ఇరువర్గాల మధ్య రాళ్లదాడులు.. దుకాణాలు, వాహనాలు ధ్వంసం ఉట్నూర్/ఉట్నూర్‌రూరల్ (ఖానాపూర్): ఓ వర్గాన్ని కించపరుస్తూ ఓ యువకుడు వాట్సాప్‌లో చేసిన పోస్టు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో మంటపెట్టింది. ఇరువర్గాల మధ్య ఘర్షణకు, రాళ్ల దాడులకు దారితీసింది. శనివారం రాత్రి నుంచి మొదలైన ఈ ఆందోళన ఆదివారం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఆందోళన చేస్తున్న ఇరువర్గాలు దుకాణాలు, వాహనాల ధ్వంసానికీ దిగాయి. దీంతో పోలీసులు లాఠీచార్జి, బాష్పవాయు ప్రయోగం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. 144 సెక్షన్ విధించారు. సమీపంలోని నాలుగు జిల్లాల నుంచి వందలాది మంది పోలీసులను రప్పించి.. భారీ స్థాయిలో మోహరించారు. అయినా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. లాఠీచార్జి.. రబ్బరు బులెట్ల ప్రయోగం ఉట్నూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు మరో వర్గానికి చెందిన వారిని కించపరుస్తూ వాట్సప్‌లో వీడియోను పోస్టు చేశాడు. దీంతో ఆ వర్గానికి చెందిన వారు సదరు యువకుడిని అరెస్టు చేయాలంటూ శనివారం రాత్రి స్థానిక పోలీసుస్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. రహదారి వెంట పలు దుకాణాలను ధ్వంసం చేశారు. ఆదివారం ఉట్నూర్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం కూడా ఆ యువకుడిని అరెస్టు చేయాలంటూ పోలీసుస్టేషన్ ఎదుట బైఠాయించారు. ఎస్పీ ఎం.శ్రీనివాస్ వచ్చి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా పరిస్థితి అదుపులోకి రాలేదు. అయితే బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఓ దుకాణ సముదాయం వద్ద చోటు చేసుకున్న ఘర్షణ.. ఇరువర్గాల మధ్య దాడులు, ప్రతిదాడులకు దారి తీసింది. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నారు. దుకాణా లు, వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో ఇరువర్గాలను అదుపు చేసేందుకు పోలీసులు పలుసార్లు లాఠీచార్జీ చేశారు. బాష్పవాయు గోళాలను, రబ్బరు బులెట్లను ప్రయోగించారు. ఎక్కడిక్కడ ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. రాళ్ల దాడిలో ఎస్పీ శ్రీనివాస్, ఉట్నూర్ ఇన్చార్జి డీఎస్పీ లక్ష్మీనారా యణ సహా పలువురు పోలీసులు గాయపడ్డారు. శాంతి చర్యలు చేపట్టిన కలెక్టర్ కరీంనగర్ రేంజ్ డీఐజీ రవివర్మ, కలెక్టర్ జ్యోతి బుద్దప్రకాశ్, జాయింట్ కలెక్టర్ కృష్ణారెడ్డి, అధికారులు ఉట్నూర్ చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఇరువర్గాలకు చెందిన పెద్దలతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. తరతరాలుగా కలసి మెలసి జీవిస్తున్నవారంతా ఓ వ్యక్తి చేసిన అనుచిత పని కారణంగా ఘర్షణలకు దిగడం సరికాదని సూచించారు. వివాదాస్పద పోస్టు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఇరువర్గాల పెద్దలు కోరారు. పోలీసులు అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని ఓ వర్గం వారు డిమాండ్ చేశారు. మరోవైపు ప్రతి ఆదివారం ఉట్నూర్ మండల కేంద్రంలో వార సంత కొనసాగుతంది. దీంతో ఆదివారం పలు ప్రాంతాల నుంచి వ్యాపారులు ఇక్కడికి చేరుకున్నారు. ఘర్షణలు చెలరేగడంతో భయాందోళనతో తిరుగుముఖం పట్టారు. నాలుగు జిల్లాల నుంచి పోలీసులు ఉట్నూరులో ఘర్షణలను అదుపు చేసేందుకు పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఆదిలాబా ద్‌తో పాటు కుమ్రం భీం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లోని సమీప మండలాల నుంచి పోలీసు సిబ్బందిని.. ఏపీఎస్పీ బెటాలియన్ ప్రత్యేక బృందాన్ని హుటాహుటిన ఉట్నూరు రప్పించారు. సుమారు 500 మందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఐదు కేసులు నమోదు వాట్సప్‌లో అనుచిత వాఖ్యలు చేస్తూ పోస్టు చేసిన యువకుడిపై కేసులు నమోదు చేశామని కరీంనగర్ రేంజ్ డీఐజీ రవివర్మ తెలిపారు. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు, వీడియోలు పోస్టులు చేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. దుకాణ సముదాయాలను ధ్వంసం చేసిన వారిపై, ఆందోళనకారులపై ఐదు కేసులు నమోదు చేశామని తెలిపారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని, 144 సెక్షన్ కొనసాగుతుందని తెలిపారు. -
చిచ్చురేపిన వాట్సప్ మెసేజ్.. ఊరంతా ఉద్రిక్తం
- ఇరువర్గాల ఘర్షణ.. ఉట్నూరులో రణరంగం - పోలీసులపైకి రాళ్లు రువ్విన అల్లరిమూక.. టియర్ గ్యాస్ ప్రయోగం - ఎస్సీ, ఏఎస్పీ, డీఎస్పీలకు గాయాలు.. 144 సెక్షన్ విధింపు ఉట్నూరు (ఆదిలాబాద్ జిల్లా): ఉట్నూరు మండల కేంద్రంలో ఆదివారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఓ యువకుడు వాట్సప్‌లో ఓ వర్గాన్ని కించపరుస్తూ 8 నిమిషాల నిడివి గల వాయిస్ మెసేజ్ పోస్టు చేశాడు. అతడు పెట్టిన పోస్టింగ్ పెద్ద గొడవకు తెరలేపింది. తమ వర్గాన్ని కించపరిచిన యువకుడిని అరెస్టు చేయాలని ఆ వర్గం వారు రోడ్లపై ఆందోళనకు దిగారు. అదే సమయంలో అవతలి వర్గం వారు కూడా పెద్ద సంఖ్యలో గుమిగూడి ఆందోళనకు దిగారు. టియర్ గ్యాస్ ప్రయోగం.. రాళ్ల వర్షం.. పోలీసులు నచ్చజెప్పినా ఫలితం లేకపోవడంతో అల్లరిమూకలను తరిమి కొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో రెచ్చిపోయిన రెండువర్గాలూ రాళ్లు విసురుకోవడంతో కొంతమంది పోలీసులతో పాటు మరికొంత మంది ప్రజలకు గాయాలయ్యాయి. ఉన్నట్టుండి చెలిరేగిన ఈ హింసతో ఉట్నూరు మండల కేంద్రంలో దుకాణాలు మూతపడ్డాయి. ప్రస్తుతం ఉట్నూరులో 144 సెక్షన్ అమలులో ఉంది. పోలీసు ఉన్నతాధికారులకూ గాయాలు.. అల్లరి మూకలు జరిపిన దాడిలో జిల్లా ఎస్పీ, డీఎస్పీలకు కూడా గాయాలయ్యాయి. కలెక్టర్ బుద్ధ ప్రసాద్ ఆదేశాల మేరకు డీఐజీ రవి వర్మ సంఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అల్లరిమూకలు పోలీసులపైకి రాళ్లురువ్వడానికి గర్హించిన ఆయన.. తప్పు చేసిన ఎవ్వరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. -
జిల్లా మహాసభ విజయవంతం చేయండి
ఆదిలాబాద్ రూరల్ : ఈ నెల 27న పాత ఉట్నూర్‌లోని స్టార్ ఫంక్షన్ హాల్లో ఆదివాసీ పర్ధాన్ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న జిల్లా మహా సభకు పర్ధాన్ కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పర్ధాన్ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పూసం ఆనంద్‌రావ్, కోవ సురేశ్ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లాలో మొట్టమొదటి సారిగా నిర్వహిస్తున్న పర్ధాన్ సభలో సమస్యలపై చర్చించనున్నట్లు తెలిపారు. ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా కోశాధికారి మెస్రం నగేశ్వర్‌రావ్, ఉపాధ్యక్షుడు తులసీరాం, కార్యనిర్వాహక కార్యదర్శి కె. మహేందర్ పాల్గొన్నారు. -
ఆర్వీఎం నూతన భవనం ప్రారంభం
ఉట్నూర్ రూరల్ : మండలంలోని హస్నాపూర్ గ్రామపంచాయతీ పరిధి శ్యాంనాయక్‌తండాలో రూ.6.50 లక్షల వ్యయంతో నిర్మించిన ఆర్వీఎం నూతన భవనాన్ని ఎమ్మెల్యే రేఖానాయక్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. అనంతరం శంకర్‌నాయక్‌తండలోని మావోలి, హస్నాపూర్‌లోని బాలాజీ మందిరాల అభివృద్ధికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ విమల, ఉప సర్పంచ్ రౌఫ్, ఎంపీపీ రాథోడ్ విమల, జెడ్పీటీసీ సభ్యుడు జగ్జీవన్, ఎంపీటీసీ సభ్యురాలు శారద, కోఆప్షన్ సభ్యుడు ముజీబ్, టీఆర్ఎస్ నాయకులు లక్కాకుల భూపతి, అజీం, లింగాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఉట్నూర్ కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలి
పుల్లారా గ్రామంలో ఏజేఏసీ ఆధ్వర్యంలో తుడుంమోత భారీగా తరలిన ఆదివాసీ గిరిజనులు నార్నూర్ (సిర్పూర్(యు) : ఏజెన్సీ ప్రాంతాలను కలుపుతు ఉట్నూర్ కేంద్రంగా కొమురం భీమ్ జిల్లా ఏర్పాటు చేయాలని ఆదివాసీ సంఘాల ఐక్యకార్యచరణ సమితి జిల్లా అధ్యక్షుడు కనక యాదవ్‌రావు డిమాండ్ చేశారు. ఆదివారం సిర్పూర్–యు మండలంలోని పుల్లార గ్రామంలో కొమురం భీమ్ జిల్లా సాధన ఉద్యమాన్ని ప్రారంభిస్తూ తుడంమోత కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలో ఎంతో ఐక్యంగా ఉన్న ఆదివాసీ గిరిజనులను జిల్లాల పేరిట విడగొట్టడం సరికాదన్నారు. విభజనతో ఆదివాసీల సంస్కతి, సంప్రదాయాలు, వేష, భాషలు విచ్ఛినం అయ్యే ప్రమాదం ఉందన్నారు. ఆదివాసీ ప్రాంతాలను విడదీసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. ఉట్నూర్ కేంద్రంగా జిల్లా ఏర్పాటుకు అన్ని వర్గాల ప్రజలతో ఐక్య కార్యచరణ సమితి ఏర్పాటు చేసి ఉద్యమాన్ని ఉధతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో భీమ్ మనవడు సోనేరావు, తుడందెబ్బ జిల్లా కార్యదర్శి కొడప నగేశ్, జిల్లా సార్మెడి మేస్రం దుర్గు, ఏవీఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి వినాయక్‌రావు, ఆత్రం భగవంత్‌రావు, కొడప హన్ను పటేల్ పాల్గొన్నారు. -
నిండు గర్భిణికి నరకం చూపిన వైద్యురాలు
సీహెచ్‌సీలో అందని వైద్యం రిమ్స్‌లోనూ చుక్కెదురు.. ప్రైవేటు ఆస్పత్రిలో ప్రసవం.. మగశిశువు జననం ఉట్నూర్: వైద్యులు దైవంతో సమానం అంటారు.. కానీ, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ సామాజిక ఆస్పత్రిలో వైద్యురాలు నిండు గర్భిణికి ప్రత్యక్ష నరకం చూపింది. ఇటు జిల్లాకు పెద్దదిక్కయిన రిమ్స్‌లోనూ వైద్యం అందని ద్రాక్షగా మారింది. దీంతో గత్యం తరం లేక గర్భిణిని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. వైద్యులు శస్త్రచికిత్స చేయగా, ఆమె పండంటి మగశిశువుకు జన్మనిచ్చింది. జిల్లాలోని నార్నూర్ మండలం భీంపూర్కు చెందిన రాథోడ్ మాయవతికి నెలలు నిండడంతో ఆస్పత్రికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో 11 రోజుల క్రితం ఉట్నూర్‌లోని బంధువుల ఇంటికి వచ్చారు. శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఆమెకు పురిటినొప్పులు రావడంతో వరుసకు అత్తమామలైన రాథోడ్ రవీందర్, సుమితబాయి, వదిన చంద్రకళలు ఉట్నూర్ సామాజిక ఆస్పత్రి(సీహెచ్‌సీ)కి తీసుకెళ్లారు. తమ కోడలికి వైద్యం అందించాలని విధుల్లో ఉన్న వైద్యురాలు రాజ్యలక్ష్మిని సుమితబాయి వేడుకుంది. శరీరం చల్లబడిపోతోందని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతోందని చెప్పగా.. వైద్యురాలు ‘నొప్పులు వచ్చాయి కదా.. డెలివరీ కాదా..’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీసం బీపీ అయినా చూడాలని కోరగా.. ‘బీపీ చూస్తే ఏమవుతుంది.. మీకు ఏం తెలుస్తుంది..’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది. రిమ్స్ ఆస్పత్రికి రెఫర్ చేయాలని కోరగా.. ఆగ్రహంతో ఊగిపోతూ ‘మీ ఇష్టమున్నకాడ చెప్పుకోండి.. ఇక్కడ ఉంటే ఉండండి.. లేకుంటే తీసుకెళ్లండి..’ అంటూ వెళ్లిపోయింది. చివరికి విషయం ఏజెన్సీ అదనపు వైద్యాధికారి ప్రభాకర్‌రెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆయన అంబులెన్సు సౌకర్యం కల్పించి రిమ్స్‌కు తరలించారు. అక్కడ మాయవతి రిపోర్టులు పరిశీలించిన వైద్యులు ‘ప్రసవానికి సమయం ఉంది, తీసుకెళ్లండి’ అంటూ సలహా ఇచ్చారు. మాయవతి అప్పటికే ప్రసవవేదన పడుతుండడంతో ఆదిలాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు శస్త్ర చికిత్స చేయగా, మధ్యాహ్నం 1.30 గంటలకు మగ శిశువు జన్మించింది. కాగా, సీహెచ్‌సీ వైద్యురాలు రాజ్యలక్ష్మిని సంప్రదించగా.. ప్రసవానికి సమయం పడుతుందని చెప్పినా వినలేదని అన్నారు. రిమ్స్‌కు ఎందుకు రెఫర్ చేయలేదని ప్రశ్నించగా.. ఫోన్ కట్ చేశారు. -
ఏజెన్సీకి డీఈడీ..!
ఉట్నూర్ : ఏజెన్సీలో గిరిజన విద్యాభివృద్ధికి ఐటీడీఏ చర్యలు వేగవంతం చేసింది. 2003లో మూతపడ్డ టీటీసీ (డీఈడీ) కళాశాలను తిరిగి ప్రారంభించేందుకు ఐటీడీఏ పీవో గిరిజన సంక్షేమ శాఖకు ప్రతిపాదన లు పంపించారు. ప్రస్తుతం ఫైల్ ప్రిన్సిపల్ సెక్రెటరీ వద్ద ఉంది. ఆమోదం పొందితే త్వరలో ఏజెన్సీ కేంద్రంగా డీఈడీ కళాశాల ప్రారంభం కానుంది. 1986లో ప్రారంభం.. ఏజెన్సీలో గిరిజన విద్యాభివృద్ధికి అప్పటి ప్రభుత్వం హైమాన్ డార్ఫ్స్ ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం మార్లవా యి పేరుతో ఉట్నూర్‌లోని ఐటీడీఏ క్వార్టర్స్ సమీపంలో ప్రారంభించింది. అప్పటికే ప్రభుత్వం గిరిజన విద్య అభివృద్ధికి వెయ్యి ఉపాధ్యాయ పోస్టులను సృష్టించి గిరిజన అభ్యర్థులను ఉపాధ్యాయులుగా నియమించడంతో వా రికి ఇన్ సర్వీస్‌లో టీటీసీ శిక్షణ ఇస్తూ వచ్చింది. 1990లో మండలంలోని లాల్‌టెక్డిలో కళాశాలకు నూతన భవనాలు నిర్మించడంతో కళాశాల లాల్టెక్డీకి తరలివెళ్లింది. 1992లో ఉన్న కళాశాలకు సబ్డైట్ కళాశాల హోదా రావడంతో గిరిజన విద్యార్థులకు మేలు జరుగుతూ వచ్చింది. అయితే.. 2003లో ప్రభుత్వం ఇన్ సర్వీస్ డిస్టెన్స్ మోడ్‌కు అవకాశం కల్పించడం.. గిరిజన డైట్ కళాశాల ప్రభావం తగ్గడంతోపాటు అప్పటి అధికారులు నిర్లక్ష్యంతో కళాశాల మూతపడింది. నాటి నుంచి కళాశాల పునఃప్రారంభంపై ఎవరూ పట్టించుకోలేదు. దీంతో లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన భవనాలు వృథాగా మారాయి. చివరికి 2008లో గిరిజన బీఎడ్ కళాశాల ఏజెన్సీలో ప్రారంభం కావడంతో ప్రస్తుతం డీఈడీ కళాశాల భవనాల్లో బీఎడ్ కళాశాల కొనసాగుతోంది. పునఃప్రారంభానికి చర్యలు.. డీఈడీ కళాశాల పునఃప్రారంభానికి ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్ దృష్టి సారించారు. తిరి గి ప్రారంభిస్తే గిరిజన విద్య మరింత బలపడుతుందని గిరిజన సంక్షేమ శాఖకు ప్రతిపాదనలు పంపించారు. ఆయన దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో ప్రభుత్వం ఆదేశాలతో గత నెలలో ఐటీడీఏ అధికారులు మరోసారి ప్రతిపాదనలు పంపించారు. ఆ ప్రతిపాదనలు ప్రస్తుతం ప్రిన్సిపల్ సెక్రెటరీ వద్ద ఉండడంతో డీఈడీ కౌన్సెలింగ్‌కు ముందు అనుమతులు వస్తాయనే ఆశాభావం అందరిలోనూ ఉంది. గత నెలలో ప్రతిపాదనలు పంపించిన ట్లు ఇన్చార్జి డీడీటీడబ్ల్యూ పెందోర్ భీమ్ తెలిపారు. డీఈడీ కళాశాల ప్రారంభానికి అనుమతులు వస్తే గిరిజన విద్యార్థులు ఇంటర్లో సాధించిన మెరిట్ ఆధారంగానే ప్రవేశాలు కల్పించే అవకాశం ఉంది. ప్రజాప్రతినిధులు స్పందిస్తే మేలు.. జిల్లాలో 123 ఆశ్రమ పాఠశాలతోపాటు ఆరు గిరిజన గురుకుల కళాశాలున్నాయి. ప్రతి విద్యా సంవత్సరం దాదాపు 45 వేలకు పైగా గిరిజన విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. గురుకుల కళాశాలల్లో ఏటా ఇంటర్ పూర్తిచేస్తున్న వారు 1200 వరకు ఉంటున్నారు. వీరే కాకుండా జిల్లా వ్యాప్తంగా వివిధ కళాశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థుల్లో పలువురు ఇంటర్ పూర్తి కాగానే ఉపాధ్యాయ వృత్తి విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్లాలంటే వారి ఆర్థిక పరిస్థితులు సహకరించక కొందరూ ప్రైవెట్లో లక్షలు చెల్లించలేక ఉపాధ్యాయ విద్యకు దూరమవుతున్నారు. ప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి కళాశాలను తెరిపిస్తే గిరిజన విద్యార్థులకు మేలు జరుగుతుంది. -
వస్తువులు పెట్టేదెక్కడ!
ఉట్నూర్ : ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థులకు అన్ని సౌకర్యాలూ కల్పించి.. వారి విద్యాభివృద్ధికి బాటలు వేస్తున్నామని చెబుతున్న ఐటీడీఏ మాటలు క్షేత్రస్థాయిలో ఎక్కడా రుజువు కావడం లేదు. విద్యా సంవత్సరం ఆరంభమై ఏడు నెలలు గడుస్తున్నా విద్యార్థులకు ఇంతవరకు ట్రంకు పెట్టెలు అందించిన దాఖలాలు లేవు. అదీకాక ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేయలేదంటూ అధికారులు చేతులెత్తేస్తున్నారు. దీనిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆగ్రహం చెందుతున్నారు. అవసరం 11,406.. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆశ్రమ పాఠశాలల్లో దాదాపు 38,963 మంది గిరిజన విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ ఏడాది కొత్తగా చేరిన విద్యార్థులతో పాటు పెట్టెలు తీసుకుని ఐదేళ్లు దాటిన విద్యార్థులకు కొత్త ట్రంక్ పెట్టెలు అందించాల్సి ఉంది. ఇందుకోసం గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఈ విద్యా సంవత్సరంలో సుమారు 11,406 ట్రంకు పెట్టెలు అవసరమని తేల్చి ఒక్కో పెట్టెకు రూ.550 చొప్పున రూ.62 లక్షల 73 వేల 300 అవసరమని ప్రణాళికలు సిద్ధం చేసి ఆగస్టులో ప్రభుత్వానికి నివేదించారు. కానీ.. ఇంతవరకూ ప్రభుత్వం నుంచి గిరిజన సంక్షేమ శాఖకు నిధులు విడుదల కాకపోవడంతో ట్రంకు పెట్టెలకు టెండర్లు నిర్వహించలేదు. బడ్జెట్ వస్తేగానీ టెండర్లు నిర్వహించి పెట్టెలు విద్యార్థులకు అందించలేమని అధికారులు వాపోతున్నారు. విద్యార్థుల ఇబ్బందులు.. గిరిజన సంక్షేమ శాఖ అధీనంలోని 123 ఆశ్రమ పాఠశాలల్లో ఈ ఏడాది దాదాపు 4,500 మంది విద్యార్థులు కొత్తగా చేరారు. వీరందరికీ ఐటీడీఏ ఉచిత భోజన వసతితోపాటు నిత్యావసర వస్తువులు, మౌలిక వసతులు కల్పిస్తోంది. ఏటా ఆశ్రమాల్లో కొత్తగా చేరే విద్యార్థులకు, చేరి ఐదేళ్లు దాటిన విద్యార్థులకు కొత్త ట్రంకు పెట్టెలు అందిస్తోంది. ఈసారి ఇంతవరకూ ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పుస్తకాలు, ప్లేట్, గ్లాస్, బట్టలు, పెన్నులు, చద్దర్లు, ఇతర సామగ్రి ఎక్కడ భద్రపరుచుకోవాలో తెలియక బాధలు అనుభవిస్తున్నారు. ఆర్థికంగా ఉన్న విద్యార్థులు ఇళ్ల ఉంచి పెట్టెలు కొనుగోలు చేసుకున్నారు. కొందరు తోటి విద్యార్థుల పెట్టెల్లో సామగ్రి దాచుకుంటున్నారు. అలా అవకాశం లేని విద్యార్థులేమో దుకాణాల్లో లభించే అట్టపెట్టెలను కొనుగోలు చేసి అందులో సామగ్రి పెడుతున్నారు. పిల్లలకు అన్నిరకాల వసతులు కల్పించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం చెందుతున్నారు. గిరిజన విద్యార్థులకు మౌలిక సదుపాయాల కల్పనలో ఐటీడీఏ విఫలమవుతోందని గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. -
గు(బ్యా)డ్ మార్నింగ్.. ఆదిలాబాద్
పది కిలోవాట్ల ఎఫ్ఎంను ఏపీకి తరలించే కుట్ర? ఒక కిలోవాట్‌తో సరిపెడుతున్న ప్రసారభారతి స్పందించని జిల్లా ప్రజాప్రతినిధులు సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : పాలకుల నిర్లక్ష్యం.., ప్రజాప్రతినిధుల పట్టిం పులేని ధోరణి వెరసి జిల్లాకు తరచూ అన్యాయం జరుగుతోంది. ఇప్పటికే పలుమార్లు మార్కెట్ కమిటీల నిధులు ఇతర జిల్లాలకు తరలిపోగా, ప్రస్తుతం జిల్లాకు మంజూరైన అధిక సామర్థ్యం పది కిలోవాట్ ఎఫ్ఎం రేడియోస్టేషన్ ఏర్పాటు విషయంలోనూ జిల్లాకు అన్యాయం జరుగుతోంది. దీని స్థానంలో నామమాత్ర సామర్థ్యం ఉండే ఒక కిలోవాట్ ఎఫ్ఎం రేడియోస్టేషన్‌ను నెలకొల్పుతున్నారు. దీంతో మారుమూల ప్రాంతాల వాసులు ఎఫ్ఎం ప్రసారాలను విని ఆనందించే అవకాశాన్ని కోల్పోతున్నారు. పది కిలోవాట్ల స్టేషన్ సామర్థ్యం మంజూరైన స్టేషన్ స్థానంలో ఒక కిలోవాట్ సామర్థ్యం కలిగిన స్టేషన్‌ను ఏర్పాటు చేయడం వెనుక పది కిలోవాట్ల స్టేషన్‌ను ఆంధ్రప్రదేశ్‌కు తరలించే కుట్ర దాగి ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రారంభమైన పనులు ఆదిలాబాద్ రేడియో స్టేషన్‌కు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉంది. 1986లో ప్రారంభమైన ఈ స్టేషన్ దేశంలో మూడో ప్రాంతీయ రేడియో స్టేషన్‌గా, ఉమ్మడి రాష్ట్రంలో కూడా మొదటి స్టేషన్‌గా పేరుగాంచింది. గిరిజన జిల్లాగా పేరున్న ఈ జిల్లా ప్రాంతీయ అవసరాల కోసం కేంద్రం ఎఫ్ఎం స్టేషన్‌ను అప్పట్లో నెలకొల్పింది. ఈ స్టేషన్‌ను నెలకొల్పిన తర్వాతే వరంగల్, తిరుపతి, నిజామాబాద్ వంటి చోట్ల రేడియో స్టేషన్లను నిర్మించింది. ఇప్పుడు ఈ స్టేషన్ ఆవరణలోనే 10 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన ఎఫ్ఎం రేడియో స్టేషన్‌ను నెలకొల్పాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ప్రసార భారతి నుంచి రూ.2.64 కోట్లు మంజూరు చేస్తూ ఏడాది క్రితం ఉత్తర్వులు జారీ అయ్యాయి. హైదరాబాద్ తరహాలో ఎఫ్ఎం ప్రసారాలను వినవచ్చని జిల్లా వాసులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. తీరా ఇప్పుడు ఈ పది కిలోవాట్ల స్టేషన్ స్థానంలో ఒకే ఒక కిలోవాట్ సామర్థ్యం కలిగిన రేడియో స్టేషన్ పనులు జరుగుతున్నాయి. పది కిలోవాట్ల సామర్థ్యం కలిగిన స్టేషన్ ఏర్పాటుకు అవసరమైన ట్రాన్స్‌మీటర్, ఇతర పరికరాలు వస్తాయని స్టేషన్ అధికారులు భావించారు. కానీ ప్రస్తుతానికి ఒక కిలోవాట్ సామర్థ్యం కలిగిన ట్రాన్స్‌మీటర్ మాత్రమే వచ్చిందని అధికారులు పేర్కొంటున్నారు. ఉట్నూర్ వరకే ప్రసారాలు.. ఎఫ్ఎం స్టేషన్ సామర్థ్యం పరిమితం కావడంతో కేవలం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి పరిసర మండలాల వాసులు మాత్రమే ఈ స్టేషన్ ప్రసారాలను వినగలుగుతారు. లోతట్టు ప్రాంతంలో ఉన్న జిల్లా కేంద్రంలో ఏ ర్పాటు చేయనున్న ఎఫ్ఎం స్టేషన్ ద్వారా సుమారు ఉట్నూర్ వరకు ఉన్న గ్రామాల వాసులు మాత్రమే ఈ ప్రసారాలను వినగలుగుతారని రేడియో స్టేషన్ ఇంజినీరింగ్ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. పది కిలోవాట్ల సామర్థ్యం ఉన్న స్టేషన్ ఏర్పాటు చేస్తే జిల్లాలోని మారుమూల ప్రాంతాల గ్రామాల ప్రజలు కూడా ఈ ప్రసారాలను వినే అవకాశం ఉండేది. -
105 సేవలు కల
ఉట్నూర్ : జిల్లా వ్యాప్తంగా ఐటీడీఏ గిరిజన సంక్షేమశాఖ ఆధీనంలోని 123 ఆశ్రమాల్లో దాదాపు 38,821 మంది గిరిజన విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 2012 అక్టోబర్‌లో తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో ఐటీడీఏ పీవోలు, జిల్లా వైద్యాధికారులు, అదనపు వైద్యాధికారులు, డీఎంవో, మెడికల్ అధికారి, ఎంపీహెచ్వో, ఎస్పీహెచ్వో, డీఈవోలతో ప్రభుత్వం 105 వాహనాల అమలుపై వర్క్‌షాప్ నిర్వహించింది. పక్షం రోజులకోసారి గిరిజన విద్యార్థుల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ ఆశ్రమాల్లో 105 వాహన సేవలు అందుబాటులోకి తీసుకురావాలనేది నిర్ణయం. గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించి రెండేళ్లు కావస్తున్నా ఎలాంటి చర్యలు కానరావడం లేదు. 105 వైద్య సేవల కోసం ఉట్నూర్ సీహెచ్‌ఎన్‌సీవో(కమ్యూనిటీ హెల్త్ న్యూట్రీషియన్ క్లస్టర్ ఆఫీస్) పరిధిలో 14 ఆశ్రమాలు, జైనూర్ సీహెచ్‌ఎన్‌సీవో పరిధిలోని 13 ఆశ్రమాలు, ఆసిఫాబాద్, బోథ్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, సిర్పుర్-టీ సీహెచ్ఎన్సీవోల పరిధిలో ఒక్కో సీహెచ్ఎన్సీవోలో 12 ఆశ్రమ పాఠశాలల చొప్పున పెలైట్ ప్రాజెక్టు కింద ఎంపికైన 99 ఆశ్రమ పాఠశాలల్లో దాదాపు 27,861 మంది విద్యార్థులకు వైద్య సౌకర్యాలు అందించాలని ఐటీడీఏ నిర్ణయం తీసుకున్నా చర్యలు శూన్యం. నాలుగు వాహనాలతో సేవలు మొదటి విడత నాలుగు 105 వాహనాలు జిల్లాకు రానున్నట్లు అధికారులు ఆర్భాటంగా ప్రకటించారు. తర్వాత మరో నాలుగు వాహనాలు వస్తాయన్నారు. మొదటి విడత వాహనాలు ఉట్నూర్, ఆదిలాబాద్, ఆ సిఫాబాద్, తిర్యాణి లేదా ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసేలా అధికారు లు నిర్ణయం తీసుకున్నారు. వాహనాలు ఏ సమయంలో ఎక్కడ ఉన్న యో తెలుసుకునేందుకు వీలుగా ఆన్లైన్ విధానంలో జీపీఎస్ పద్ధతి ద్వారా రాష్ట్ర గిరిజన సంక్షేమ కార్యాలయం, స్థానిక ఐటీడీఏకు అనుసంధానం చేయడం నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు ఉంటాయని అధికారులు ప్రకటించారు. పీహెచ్సీ మాదిరిగా 105 ద్వారా విద్యార్థులకు వైద్య పరీక్షలు అందుతాయన్నారు. ఇందు కోసం ప్రతీ వాహనం లో వైద్యాధికారి, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్, ఏఎన్ఎం, కౌన్సిలర్, డాటా ఎంట్రీ ఆపరేటర్లు ఉండేలా చూస్తామన్నారు. పక్షం రోజులకోసారి గుర్తించిన ఆశ్రమాలకు వెళ్లి విద్యార్థుల ఆరోగ్య స్థితిని అంచనా వే సి అవసరమైతే అదే వాహనంలో ఆస్పత్రులకు తరలించేలా చూస్తామన్నారు. వైద్య పరీక్షల అనంతరం వారిఆరోగ్య స్థితిని విద్యార్థులకు ఇచ్చి న జవహర్ ఆరోగ్య రక్ష కార్డుల్లో నమోదు చేసేలా నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ప్రకటించినట్లుగా 105 వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. ఎప్పుడు వస్తాయో తెలియదు.. - ప్రభాకర్‌రెడ్డి, జిల్లా అదనపు వైద్యాధికారి ఉట్నూర్ రెండేళ్ల క్రితం ఆశ్రమ పాఠశాలల్లో 105 వాహనాలు ప్రవేశపెట్టడం జరుగుతుందని ఉన్నతాధికారుల నుంచి అదేశాలు రావడంతో నివేదికలు సమర్పించాం. అలాగే గుర్తించిన ఆస్పత్రుల్లో విద్యార్థుల కోసం ఐదు పడకలతో ప్రత్యేక వార్డులు ఉంటాయన్నారు. -
డెంగీ పంజా
ఉట్నూర్ : జిల్లా వ్యాప్తంగా 72 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్సీ) ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నాయి. మూడు నెలల కాలంలో పెంబి, మందమర్రి, భీమిని, లింగాపూర్, ఇంద్రవెల్లి, కడెం, బెల్లంపల్లి, అడ, లక్ష్మణచాంద, వెలుమలబోబ్బారం, సారంగాపూర్, ఉట్నూర్ పీహెచ్‌సీల పరిధిలోని 23 సబ్‌సెంటర్లు, 56 గ్రామాల్లో వైద్య పరీక్షలు జరిగాయి. 940 మందికి పరీక్షలు నిర్వహించగా 300మందికి పైగా అనుమానాస్పద కేసులు, 45 డెంగీ కేసులు అధికారికంగా నమోదయ్యాయి. జిల్లాలో సరైన వైద్యం అందక ప్రజలు పొరుగు ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. రోజూ జిల్లా నుంచి పదుల సంఖ్యలో డెంగీ బాధితులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కరీంనగర్, నిజామాబాద్, యావత్మాల్ వంటి ప్రాంతాలకు పోతున్నారు. అధికార యంత్రాంగం ప్రభుత్వానికి డెంగీ కేసుల సంఖ్య తక్కువ చేసి చూపిస్తుందనే ఆరోపణలు వెళ్లువెత్తున్నాయి. అధికారులు పదుల సంఖ్యలో కేసులు నమోదు చేస్తున్నా వెలుగులోకి రాని కేసులు వందల సంఖ్యలో ఉంటాయని సంబంధిత అధికారులు చర్చించుకోవడం గమనార్హం. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు డెంగీ సోకిన మామూలు జ్వరంలా భావిస్తూ పీహెచ్‌సీల్లో చికిత్స తీసుకుని ఇంటిముఖం పడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. రెండు ప్రాంతాల్లోనే డెంగీ నిర్ధారణ కిట్స్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో డెంగీ కారక దోమల వ్యాప్తి వేగంగా పెరుగుతోంది. డెంగీ వ్యాధిని నిర్ధారణ చెసే పరీక్ష కేంద్రాలు జిల్లాలో కేవలం రిమ్స్, మంచిర్యాల ఏరియా ఆస్పత్రుల్లోనే ఉన్నాయి. దీంతో స్థానికంగా వైద్యులు డెంగీ అని నిర్ధారణ చేయడమే ఆలస్యం చికిత్స కోసం కరీంనగర్ వంటి పట్టణాలకు తరలి పోతున్నారు. కాగా, ఏజెన్సీలో గిరిజనుల పరిస్థితి దయనీయంగా మారింది. అడవిబిడ్డలు డెంగీ నిర్దారణ అవుతున్నా రిమ్స్, మంచిర్యాల వంటి దూర ప్రాంతాలకు వెళ్లి వ్యాధి నిర్దారణ చేసుకునేంత స్థోమత లేక పోవడంతో పీహెచ్సీ, గ్రామాల్లోకి వచ్చే ఆర్ఎంపీలతో వైద్యం చేయించుకుని ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. గిరిజనుల సౌకర్యం కోసం డెంగీ నిర్దారణ కిట్స్ ఉట్నూర్ కేంద్రంతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని గిరిజన సంఘాల నాయకులు, గిరిజనులు కోరుతున్నారు. అధికారులు మాత్రం డెంగీ నిర్దారణ కిట్స్ ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వం అనుమతి తప్పనిసరి అని పేర్కొంటున్నారు. లోపిస్తున్న పారిశుధ్యం గ్రామాల్లో పారిశుధ్యం లోపిస్తుండటంతో పట్టించుకునే వారు కానరావడం లేదు. గ్రామ పంచాయతీలకు 13వ ఆర్థిక సంఘం, ఎస్ఎఫ్సీ నిధులు విడుదలైనా సదరు సర్పంచ్‌లు పూర్తిస్థాయిలో పారిశుధ్య నివారణకు ఖర్చుచేయడం లేదు. ఇంకా, పారిశుధ్య నివారణకు సబ్‌సెంటర్లకు వచ్చే అన్‌టైడ్, గ్రామ పంచాయతీలకు వచ్చే శానిటేషన్ నిధుల్లో ఎన్ఆర్హెచ్ఎం భారీ కోత పెట్టడంతో గ్రామాల్లో పారిశుధ్యం, క్లోరినేషన్ పట్టించుకునే వారు లేకుండా పోయారు. దోమల నివారణకు గ్రామాల్లో మొదటి విడతలో భాగంగా దాదాపు రూ.12.50 లక్షలతో ఐఆర్ఎస్ స్ప్రే చేయించామని అధికారులు చెబుతున్నారు. 866 గ్రామ పంచాయతీల్లో రూ.21.06 లక్షల వ్యయంతో 1,056 లీటర్ల బెటైక్ స్ప్రే చేయిస్తున్నామని అధికారులు చెబుతున్నా మారుమూల ప్రాంతాల్లో కానరావడం లేదు. ఫలితంగా గ్రామాల్లో దోమల వ్యాప్తి వేగంగా విస్తరిస్తూండటంతో డెంగీ కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం స్పందించి దోమల నివారణకు చర్యలు తీసుకుని, బాధితులకు సరైన చికిత్స అందించాల్సిన అవసరం ఉంది. జాగ్రత్తలు పాటిస్తే సరి.. వైరస్ వల్ల సోకే ఈ వ్యాధి ఏడిస్ రకం దోమకాటు వల్ల వ్యాపిస్తుంది. ఈ దోమలు పగలు, రాత్రి కుడుతాయి. చిన్నగా, నల్లగా ఉండే ఈ దోమలపై తెల్లని మచ్చలుంటాయి. ఈ దోమలు మురుగులో జీవించలేవు. ఇళ్లలోని ఖాళీ కుండీలు, నీటితొట్టెలు, తాగేసిన కొబ్బరి బొండాలు, వాడని వాహనాల టైర్లలో నిలిచే నీటిలో మాత్రమే పెరుగుతాయి. ఇళ్లతోపాటు పరిసరాలలో నీరు నిల్వ లేకుండా చూసుకోవడం ద్వారా డెంగీ బారిన పడకుండా ఉండవచ్చు. లక్షణాలు.. డెంగీ జ్వరం, డెంగీ హెమరేజ్, డెంగీ షాక్ సిండ్రోమ్ లక్షణాలు కల్గించే ఈ వ్యాధి హఠాత్తుగా వచ్చే తీవ్రమైన జ్వరంతో మొదలవుతుంది. కాళ్లు కదిలించలేని పరిస్థితి ఉంటుంది. ఎముకలు, కండరాలలో భరించలేని నొప్పి, శరీరంపై పొక్కులు వస్తాయి. వాంతులు, వికారం, రక్తంతో కూడిన మలవిసర్జన, బరువు వేగంగా తగ్గడం వంటివి వ్యాధి ప్రధాన లక్షణాలు. దీంతో రోగి శరీరంలో ప్లేట్లెట్స్ పడిపోయి ప్రాణాలు కోల్పోతాడు. సకాలంలో వైద్యుడిని ఆశ్రయించి చికిత్స పొందాలి. వ్యాధి తగ్గే వరకు ఆస్పత్రిలో ప్లేట్లెట్స్ ఎక్కించుకోవాలి. అశ్రద్ధ చేస్తే ప్రాణాంతకంగా మారుతోంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంగీ నివారణ అంటే... దోమలనుంచి రక్షించు కోవడమనే విషయం గుర్తుంచుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలి. సాధ్యమైనంత వరకు శరీరాన్ని పూర్తిగా కప్పేసే దుస్తులు వాడటం అవసరం. దోమతెరలు వాడాలి. ఇంటి కిటికీలు, తలుపులకు జాలీలు బిగించుకోవాలి. ఇంటి లోపల, బయట నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త వహించాలి. నీటి తొట్టెలను వారం రోజులకు ఒక సారి ఖాళీ చేసి, శుభ్రం చేసి మళ్లీ నింపుకోవాలి. తాగి వదిలేసిన కొబ్బరి బొండాలు, పాత టైర్లు, ఖాళీ డబ్బాలు, పనికి రాని వస్తువులు ఇంటితోపాటు పరిసరాల్లో లేకుండా చేసుకోవాలి. ఎయిర్ కూలర్, ఎయిర్ కండీషనరు, ఫ్లవర్‌వాజ్, ఫిష్ అక్వెరియాల్లో తరుచూ నీటిని మార్చాలి. వాటర్ ట్యాంక్‌ల మూతలను వేసి ఉంచాలి. ఇళ్లలో, పరిసర ప్రాంతాల్లో దోమల నివారణ మందులు చల్లించుకోవాలి. లార్వాలను నివారించడానికి కాల్వల్లో గంబ్యూసియా చేపలను వదలాలి. -
అంబులెన్సులు వద్దట.. ఆటోలే ముద్దట..
ఉట్నూర్ : ఏజెన్సీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు ఐటీడీఏ పీవో ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారు. ఏజెన్సీలో వ్యాధుల సీజన్ ప్రారంభం అవ్వడంతో ప్రభుత్వం పీహెచ్‌సీలకు అద్దె ప్రాతిపదికన అంబులెన్సుల ఏర్పాటుకు ఐటీడీఏ ద్వారా చర్యలు చేపట్టింది. దీనిపై ఇన్చార్జి పీవో ప్రశాంత్ పాటిల్ ప్రత్యేక దృష్టి సారించి ఆయా వైద్యాధికారులు పీహెచ్‌సీలకు ట్రాక్స్ లేదా మాక్స్‌లాంటి అంబులెన్సులను అద్దె ప్రాతిపదికన సమకూర్చుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఏజెన్సీలోని 27 పీహెచ్‌సీలకు రూ.5.78 లక్షలు జూలై 26న పీహెచ్‌సీల ఖాతాల్లో జమ చేశారు. అయినా.. సదరు వైద్యాధికారులు మారుమూల ప్రాంతాలకు అంబులెన్సులు వెళ్లలేవు అనే సాకుతో ఆటోలనే అద్దె ప్రాతిపదికన వినియోగిస్తామని మెలిక పెడుతున్నారు. ఫలితంగా గిరిజన గ్రామాల నుంచి వ్యాధిగ్రస్తులను, జ్వరపీడితులను తరలించేందుకు అంబులెన్సులు లేక గిరిజనులకు ఎండ్లబండ్లే దిక్కవుతున్నాయి. అంబులెన్సులు ఎత్తివేసి అద్దె అంబులెన్సులకు నిధులు.. 1999లో ఐటీడీఏ పరిధిలోని పీహెచ్‌సీల్లో గిరిజనులకు అత్యవసర వైద్యం అందించడానికి ఏన్ఎస్ఏఫ్డీసీ (నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబల్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్) ద్వారా ఏజెన్సీ పీహెచ్‌సీలకు ఉన్న అంబులెన్సులను ప్రభుత్వం గత అక్టోబర్ నెలలో రద్దు చేసింది. అదే సమయంలో వైద్యశాఖ ప్రత్యామ్నాయంగా ఏజెన్సీలోని 31 పీహెచ్‌సీల పరిధిలో గిరిజన గ్రామాల నుంచి పీహెచ్‌సీలకు గిరిజనులను తరలించడానికి అద్దె ప్రాతిపాదికన అంబులెన్సుల ఏర్పాటుకు రూ.80 లక్షలు విడుదల చేసింది. ఈ ఆగస్టు నెల నుంచి మూడు నెలలపాటు ఏజెన్సీలో వ్యాధుల సీజన్. దీంతో వ్యాధులు, జ్వరాల తీవ్రత అంతగా లేని దండేపల్లి, ఈజ్గాం, తాళ్లపేట, మందమర్రి పీహెచ్‌సీలు మినహా మిగతా వాటికి ఆగస్టు 1 నుంచి అంబులెన్సులు సమకూర్చుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అంకోళి, గిన్నెధరి, సిర్పూర్(యు), జైనూర్, శ్యాంపూర్ పీహెచ్‌సీలకు ప్రభుత్వ అంబులెన్సు ఉండటంతో వీటికి నెలకు పది వేల చొప్పున, అంబులెన్సులు లేని దంతన్‌పల్లి, హస్నాపూర్, ఇంద్రవెల్లి, పిట్టబొంగరం, నార్నూర్, జరి, గాదిగూడ, లింగపూర్, కెరమెరి, అడ, వాంకిడి, నే రడిగొండ, ఇచ్చోడ, బజార్హత్నుర్, నర్సాపూర్(టి), గుడిహత్నూర్, భీంపూర్, సైద్పూర్, కాసిపేట, లోన్వెల్లి, తిర్యాణి, రోంపల్లి పీహెచ్‌సీలకు నెలకు రూ.24 వేల చొప్పున చెల్లించేందుకు సిద్ధమైంది. అయితే.. పీహెచ్‌సీల వైద్యాధికారులే ట్రాక్స్ లేదా మాక్స్ లాంటి వాహనాలు సమకూర్చుకోవాలని ఆదేశాలు జారీ చేసి జూలై 26న ఆగస్టు నెలకు సంబంధించిన అద్దె రూ.5 లక్షల 78 వేలు ఆయా పీహెచ్‌సీల ఖాతాల్లో జమ చేశారు. నిధులు జమ అయి నెల గడుస్తున్నా ఇంతవరకు అద్దె అంబులెన్సులు కానరవడం లేదు. అద్దె కక్కుర్తికేనా..? పిట్టబొంగరం పీహెచ్సీ వైద్యాధికారులు మినహా ఇతర పీహెచ్‌సీల వైద్యాధికారులు అద్దె అంబులెన్సులు ఏర్పాటు చేసుకోలేదు. పైగా మారుమూల గ్రామాలకు అంబులెన్సులు వెళ్లలేవని సమాధానమిస్తున్నారు. అదీకాక రూ.24 వేల అద్దెకు ఎవరూ ముందుకు రావడం లేదని మెలికలు పెడుతున్నారు. దీనికితోడు ఆటోల ద్వారా ఏ ప్రాంతానికైనా వెళ్లొచ్చని ఉచిత సలహాలు సైతం ఇస్తున్నారు. దీనికి పై అధికారులు ససేమిరా అంటున్నారు. 20 రోజులపాటు అంబులెన్సులు గ్రామాల్లో తిప్పి మరో పది రోజులు ఆటోలో వెళ్లాలని సూచిస్తున్నారు. అయినా.. వైద్యాధికారులు పట్టించుకోవడం లేదు. అయితే.. అంబులెన్సులు కాకుండా ఆటోలు అద్దెకు పెట్టుకోవడం ద్వారా గ్రామాల నుంచి రోగులను తరలించడం సాధ్యం కాదు. ఆటోలో ఎలాంటి వైద్య సదుపాయాలు కూడా ఉండవు. దీంతో రోగులకు అత్యవసర వైద్యం అందకుండా పోతుంది. అంబులెన్సులో అయితే.. ఒకేసారి ఇద్దరు లేదా ముగ్గురు రోగులనైనా తరలించొచ్చు. ఇదిలా ఉంటే.. ఆటోలకైతే రూ.24 వేలు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఎంతో కొంత ముట్టజెప్పి మిగతా మొత్తాన్ని జేబులో వేసుకోవచ్చని ఆయా పీహెచ్సీ వైద్యాధికారులు యోచిస్తుండడం గమనార్హం. -
ట్రైకార్ నిధులేవి?
ఉట్నూర్ : జిల్లాలో ఆదివాసీ గిరిజనుల సంపూర్ణ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐటీడీఏ గిరిజనులకు అభివృద్ధి ఫలాలు అందించడంలో విఫలమైంది. 2013-14 ఆర్థిక సంవత్సరం ముగిసి ఐదు నెలలు అవుతున్నా ప్రభుత్వం అడవి బిడ్డలకు ఆర్థిక పథకాల ద్వారా చేయూత నిచ్చే ట్రైకార్ నిధులు విడుదల చేయలేదు. ఐటీడీఏలో పూర్తిస్థాయి పీవో లేకపోవడం ఒక కారణమైతే.. రాష్ట్ర విభజన కూడా మరో కారణం. కాగా, ప్రభుత్వం నిధులు విడుదల చేసి గిరిజనుల అభివృద్ధికి బాటలు వేయాల్సిన అవసరం ఉంది. రూ.23.46 కోట్లతో ప్రణాళికలు జిల్లా వ్యాప్తంగా 44 మండలాల్లో 4,95,794 మంది గిరిజన జనాభా ఉంది. వీరంతా ఐటీడీఏ అమలు చేసే ఆర్థిక అభివృద్ధి పథకాల పరిధిలోకి వస్తారు. వీరి అభివృద్ధి కోసం 2013-14 ఆర్థిక సంవత్సరంలో ట్రైకార్ యాక్షన్ ప్లాన్ ద్వారా ఐటీడీఏ వ్యవసాయం, చిన్ననీటి పారుదల, స్వయం ఉపాధి, నూతన కల్పన, రవాణా, భూమి కొనుగోలు వంటి పథకాలు, ఐఎస్బీ, పశుసంవర్థకం, మత్స్య, నైపుణ్య శిక్షణలు ఇలా ఆర్థిక సహాయ పథకాలకు రూప కల్పన చేసింది. ఈ పథకాల కింద గిరిజనులకు 3,570 యూనిట్ల ద్వారా గిరిజనులకు మేలు చేయాలని భావించింది. ఇందుకోసం కేంద్ర ప్రత్యేక సహాయనిధి, టీఎస్పీ ద్వారా రూ.5,33,85,000, గ్రాంట్ ఇన్ ఎయిడ్ (వోజీఐఏ) ద్వారా రూ.5,04,55,000, బ్యాంక్, ఎంఎంఎస్, ఇతర రకాలుగా రూ.13,08,35,000 కలిపి రూ.23,46,75,000లతో గిరిజనులకు ఐటీడీఏ ద్వారా ఆర్థిక సహాయ పథకాలు అందించాలని ఐటీడీఏ ప్రణాళికలు రూపొందించింది. లక్ష్య సాధనలో విఫలం ట్రైకార్ యాక్షన్ ప్లాన్ ద్వారా గిరిజనులకు ఆర్థిక చేకూర్పు అందించాలని ప్రభుత్వం భావించినా అనుకున్న లక్ష్యాన్ని సాధించడంలో ఐటీడీఏ విఫలమైంది. 2013-2014 ఆర్థిక సంవత్సరానికి గాను 893 యూనిట్లను 900 మంది గిరిజనులకు అందించింది. ఇందుకోసం రూ.10.51 కోట్లు రావాల్సి ఉంది. ఈ నిధులను ప్రభుత్వం విడుదల చేయలేదు. ఐటీడీఏ నిర్లక్ష్యం వల్ల మరో 2,677 యునిట్లు గిరిజనులకు అందకుండా పోయాయి. వీటికి రావాల్సిన రూ.12,95,22,000 నిధులు వచ్చే అవకాశం లేదు. కాగా, ఐటీడీఏ పూర్తిస్థాయి పీవో జనార్దన్ నివాస్ దీర్ఘకాలిక సెలవులో వెళ్లడం, ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ ఇన్చార్జి పీవోగా వ్యవహరిస్తున్నాడు. లబ్ధికోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని గిరిజనులు వాపోతున్నారు. ప్రభుత్వం ట్రైకార్ నిధులు విడుదల చేసి తమ అభివృద్ధికి బాటలు వేయాలని ఆదివాసీ గిరిజనులు కోరుతున్నారు. ప్లాన్ : ట్రైకార్ సంవత్సరం : 201314 ప్రణాళిక : రూ.23.46 కోట్లు మొత్తం యూనిట్లు : 3,570 మంజూరైన యూనిట్లు : 893 లబ్ధిపొందిన గిరిజనులు : 900 మంజూరుకాని యూనిట్లు : 2,677 విడుదల కావాల్సిన నిధులు : రూ.10.51 కోట్లు వచ్చే అవకాశం లేని నిధులు : రూ.12.95 కోట్లు -
రెండు నెలల్లో మరో ఉద్యమానికి సిద్ధం కావాలి
ఉట్నూర్ : వచ్చె రెండు నెలల్లో మాదిగలు మరో ఉద్యమానికి సిద్ధంగా కావాలని ఏ,బీ,సీ,డీ వర్గీకరణ సాధించడమే ఎమ్మార్పీఎస్ ముందున్న లక్ష్యమని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని స్టార్ ఫంక్షన్ హాల్లో జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చె రెండు నెలల్లో క్షేత్రస్థాయి నుంచి గ్రామ, మండల కమిటీలు పూర్తి చేయాలని పిలుపు నిచ్చారు.మాదిగలను ఏకం చేయడానికి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించానని గత నెల 28 నుంచి తెలంగాణ జిల్లాల్లో పర్యటిస్తున్నానన్నారు. అక్టోబర్ ఒకటి లేదా రెండు తేదీల్లో ఎమ్మార్పీఎస్ జాతీయ సమావేశం రాజమండ్రిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆ రోజు వర్గీకరణకు భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణకు సిద్ధంగా ఉన్నాయన్నారు. వర్గీకరణను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీలపై ఉందన్నారు. ఎమ్మార్పీఎస్ అంటే బయపడుతున్న సీఎం కేసీఆర్ ఎమ్మార్పీస్లో చిలికలు తేవాలని ప్రయత్నాలు తీవ్రంగా చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ తూర్పు, పశ్చిమ జిల్లా అధ్యక్షులు శరత్, శంకర్, ఉట్నూర్ మండల ఇన్చార్జి బిరుదుల లాజర్, ఎమ్మెస్పీ జిల్లా అధ్యక్షుడు విజయ్, సమావేశ అధ్యక్షుడు నాతరి రాజు, ఎంపీటీసీ బెరిగెడి మనోహర్, నాయకులు మల్లేశ్, నర్సయ్య, తుకారం, కుటికల ఆశన్న, రజీహైదర్, కేశవ్ పాల్గొన్నారు. కాంగ్రెస్ దారిలో పయనిస్తున్న టీఆర్ఎస్ మంచిర్యాల టౌన్ : సామాజిక, ఆర్థిక గణన అంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ నెల 19న చేపడుతున్న ఒక్కరోజు సర్వే మోసమని, వారం రోజులపాటు సర్వే జరపాలని మహాజన సోషలిస్టు పార్టీ(ఎంఎస్పీ) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ తేల్చి చెప్పారు. మంగళవారం మంచిర్యాల ఒడ్డెర కాలనీలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలు, యువకులు, మహిళలు ఎంఎస్పీ పార్టీలో చేరగా వారికి మంద కృష్ణమాదిగా పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా బడుగు బలహీన వర్గాలకు అండగా లేకపోయిందని, ఇప్పుడు ఎంఎస్పీ మద్దతుగా నిలిచి ప్రజల హక్కులు, సమస్యలపై నిరంతర పోరాటం సాగిస్తుందన్నారు. తెలంగాణలో మొదటి స్వాతంత్య్ర వేడుకలను గోల్కొండ కోటలో నిర్వహించడంపై గడిలో అంటే రాజరిక వ్యవస్థకు శ్రీకారం చుట్టడమేనని అన్నారు. ఈ సంస్కృతిని చూస్తే కాంగ్రెస్ దారిలో టీఆర్ఎస్ పార్టీ పయనిస్తుందన్నారు. కాంగ్రెస్ కుటుంబ పాలనను ఎవ్వరూ ప్రశ్నించే వారు లేక గోల్కొండ కోటపై జాతీయ పతాకాన్ని ఎగురవేయడం చూస్తుంటే ప్రజాస్వామ్య విలువలు పక్కనపెట్టి దొరల పాలన, కేసీఆర్ కుటుంబ పాలనలా మారేలా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ, ఎమ్మార్పీఎస్ నాయకులు గోడిసెల దశరథం, చుంచు శంకర్‌వర్మ, బోయ రంజిత్‌కుమార్, కొట్నాక విజయ్, శరత్ పాల్గొన్నారు. -
మలేరియా శాఖకు ఖాళీల సుస్తీ
ఉట్నూర్ : జిల్లా మలేరియా కార్యాలయానికి ఖాళీల గ్రహణం పట్టింది. అసలే వ్యాధుల సీజన్ కావడంతో గ్రామాల్లో మలేరియా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కార్యాలయంలోనే కాక జిల్లావ్యాప్తంగా పూర్తిస్థాయి సిబ్బంది కొరత ఉండటంతో ఉన్న సిబ్బందిపై పని భారం పడుతోంది. ప్రధాన కార్యాలయం లో 17 వరకు ఖాళీలుండగా జిల్లావ్యాప్తంగా వివిధ స్థాయిల్లో 307 వరకు ఖాళీలున్నాయి. ప్రభుత్వం ఈ ఖాళీలపై దృష్టి సారిస్తే తప్పా జిల్లాలో విస్తరిస్తున్న మలేరియా పాజిటివ్ కేసులకు అదుపులోకి తీసుకువచ్చే పరిస్థితి కానరావడం లేదు. దీనికి తోడు దోమ తెరల జాడే లేకుండా పోవడం ముఖ్యంగా ఏజెన్సీ గిరిజనుల పాలిట శాపంగా మారింది. వెక్కిరిస్తున్న ఖాళీలు జిల్లా మలేరియా ప్రధాన కార్యాలయం ఏజెన్సీ కేంద్రంగా ఉట్నూర్‌లో ఉంది. ఈ కార్యాలయం లో అన్ని స్థాయిలో కలిపి 33 పోస్టులుండాలి. కానీ ప్రస్తుతం కార్యాలయంలో 17 ఖాళీలున్నాయి. ఏఎంవోలు రెండు, హెచ్‌ఈవో, ఎస్ఎఫ్డబ్ల్యూ, ఎంవో, కార్యాలయ డ్రైవర్, క్లీనర్స్, ఫీల్డ్ వర్కర్ పోస్టులు ఒక్కొక్కటి చొప్పున ఖాళీలుండగా ల్యాబ్ టెక్నీషియన్ 03, ల్యాబ్ అటెన్డెడ్ 02, ల్యాబ్ టెక్నీషియన్ 04 ఖాళీలున్నాయి. ఇక జిల్లావ్యాప్తంగా మరో 307 ఖాళీలున్నాయి. జిల్లాలో 304 ఎంపీహెచ్ఏ(పురుష) సిబ్బందికి గానూ కేవలం 105 మంది మాత్రమే విధులు నిర్వహిస్తుండగా మరో 189 ఖాళీలున్నాయి. ఇక ఏజెన్సీ పరిధిలో 88 మంది ఎంపీహెచ్ఏ(పురుష) సిబ్బందికి గానూ ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు. జిల్లాలో 33 సబ్ యూనిట్ అధికారులకు గానూ 33 ఖాళీలున్నాయి. ఏజెన్సీ పరిధిలో 17కు గానూ ఐదు ఖాళీలున్నాయి. ఇలా దాదాపు జిల్లా మలేరియా శాఖలో 324 ఖాళీలుండటంతో దోమల నివారణకు అధికారులు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోకుండా పోతున్నారు. దోమతెరలకు ఎదురుచూపు మలేరియా నివారణకు 2008 నుంచి జిల్లాలో ప్రభుత్వం ఐటీడీఏ ద్వారా దోమతెరల పంపిణీ చేపట్టింది. అప్పట్లో దాదాపు 84 వేల తెరలను పంపినీ చేశారు. తర్వాత ఆరేళ్లు గడుస్తున్నా దోమతెరల ఊసే లేకపోవడంతో గిరిజనంతో పాటు జిల్లావాసులు దోమకాటుతో మలేరియా, డెంగీ లాంటి వ్యాధుల బారిన పడుతున్నారు. వారం క్రితం జరిగిన జిల్లా సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ జగన్మోహన్.. దోమతెరలు కొనుగోలు చేసి పంపిణీ చేస్తామని ప్రకటించారు. దీంతో జిల్లా ప్రజలు, ముఖ్యంగా గిరిజనులు దోమతెరలు అందుతాయనే ఆశతో ఎదురు చూస్తున్నారు. పెరుగుతున్న పాజిటివ్ కేసులు గతంతో పోల్చితే మలేరియా పాజిటివ్ కేసులు జిల్లాలో పెరుగుతున్నాయి. దోమతెరలు లేక జిల్లాలో ప్రజలు అల్లాడుతున్నారు. 2007లో 2,165 కేసులు, 2008లో 1,882, 2009లో 614, 2010లో 612, 2011లో 1,162, 2012లో 707, 2013లో 995 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇందులో ఏజెన్సీలో అత్యధికంగా 692 కేసులు నమోదయ్యాయి. ఈ సంవత్సరం జూలై 20 తేదీ వరకు 220 పాజిటివ్ కేసులు నమోదు కాగా 161 గిరిజన ప్రాంతాల్లోనివే కావడం కలవరానికి గురి చేస్తోంది. మలేరియా శాఖలో భారీగా ఖాళీలు ఉండటంతో పూర్తిస్థాయిలో చికిత్సలు అందించడం ఉన్న సిబ్బందికి తలకు మించిన భారం అవుతోంది. అదీ కాక జిల్లా విస్తీర్ణం పెద్దగా ఉండటంతో సిబ్బంది దూర ప్రాంతాలకు వెళ్లడం ఇబ్బందిగా మారింది. కొనసాగుతున్న ఐఆర్ఎస్ స్ప్రే జిల్లాలో గుర్తించిన 869 గ్రామాల్లో మొదటి విడుత దోమల నివారణ మందు పిచికారీ (ఐ ఆర్ఎస్-ఇండోర్ రెసిడెన్షియల్ స్ప్రే) ఆగ్టు 30 వరకు కొనసాగనుంది. రెండో విడత అక్టోబర్ ఒకటి నుంచి నవంబర్ 15 వరకు చేయనున్నా రు. ఎక్కడ మలేరియా పాజిటివ్ కేసు వచ్చినా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని అధికారు లు కోరుతున్నారు. గ్రామాల్లో అపరిశుభ్రత ని వారణకు క్షేత్ర స్థాయిలో ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ, వైద్య అధికారులు సంయుక్తంగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. -
షెడ్యూల్డ్ కులాల అభివృద్ధికి కృషి
ఉట్నూర్ : ఏజెన్సీ ప్రాంతాల్లో తరతరాలుగా జీవిస్తోన్న షెడ్యూల్డ్ కులాల సంపూర్ణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పర్యావరణ, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. ఏజెన్సీ షెడ్యూల్డ్ కూలాల ఐక్య సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఉట్నూర్ మండల కేం ద్రంలోని స్టార్ ఫంక్షన్ హాలులో సన్మాన సభ నిర్వహిం చారు. మంత్రితో పాటు కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి, ఖానాపూర్, బోథ్, ఆ సిఫాబాద్ ఎమ్మెల్యేలు అజ్మీరా రేఖ, రాథోడ్ బాపురావు, కోవ లక్ష్మి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి తదితరులను సన్మానించారు. మంత్రి రామన్న మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న షెడ్యూ ల్డ్ కులాల అభివృద్ధికి పూర్తిస్థాయిలో కృషి చేస్తానని అ న్నారు. ఏజెన్సీ చట్టాలతో ఇక్కడ నివాసం ఉంటున్న దళితులు పూర్తిస్థాయిలో హక్కులు పొందలేకపోతున్నారని వివరించారు. వారి భూములకు పట్టా, పహాణి ప త్రాలు ఇవ్వడం న్యాయమని పేర్కొన్నారు. దీనికి చర్య లు తీసుకుంటామని పేర్కొన్నారు. వేణుగోపాలాచారి మాట్లాడుతూ, షెడ్యూల్డ్ కులాల సమస్యలు జఠిలం కాకముందే పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి పక్షాలు అనవసర విమర్శలు మాని ప్రజా సమస్య ల పరిష్కారానికి ప్రభుత్వానికి కృషి చేయాలని సూచించారు. షెడ్యూల్డ్ కులాల ఐక్య సమితి జిల్లా అధ్యక్షుడు కాంబ్లే నాందేవ్, ప్రధాన కార్యదర్శి మోతె రాజన్న, ఉపాధ్యక్షుడు మోతె నర్సింగరావు, ప్రచార కార్యదర్శి దావుల రమేశ్, అదనపు కార్యదర్శి కాటం రమేశ్, లక్కారం, ఉట్నూర్ సర్పంచులు మర్సకొల తిరుపతి, బొంత ఆశారెడ్డి, ఎంపీపీ విమల, జెడ్పీటీసీ జగ్జీవన్, నాయకులు భరత్ వాగ్మారే, దాసండ్ల ప్రభాకర్ పాల్గొన్నారు. కాగా, మండల పరిషత్ కార్యలయం ఆధ్వర్యంలోనూ ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించారు. -
జ్వర వలయం
ఉట్నూర్ : ఏజెన్సీని వ్యాధులు ‘ముసురు’కున్నాయి. నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా చిరుజల్లులు పడుతుండటంతో గిరిజనులు బయటకు వెళ్లలేని పరిస్థితి. వాతావరణం ఒక్కసారిగా మారడం.. చలిగాలులు వీచడం, వర్షంతో ఈగలు, దోమలు వృద్ధి చెందడంతో వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఫలితంగా గిరిజనులు ఇంటికొకరు మంచం పడుతున్నారు. ఉట్నూర్ మండలం భీంగూడ, నాగాపూర్, అడగూడ, నర్సాపూర్-జే గ్రామాల్లో నాలుగు రోజులుగా జ్వరాలు ప్రబలడంతో ఏఎన్ఎంలు, ఇతర వైద్య సిబ్బంది వైద్యం అందించిన పరిస్థితి అదుపులోకి రావడం లేదు. జ్వరపీడితులను పీహెచ్‌సీలకు తరలిస్తామంటే అంబులెన్స్‌లు లేవు. గురువారం వర్షం తగ్గుముఖం పట్టడంతో జ్వరపీడితులను బాధిత కుటుంబ సభ్యులు ఎడ్లబండిపై పీహెచ్‌సీలకు తరలించారు. సీజనల్ వ్యాధులు పొంచి ఉన్నాయని తెలిసినా, మీడియా కోడై కూసినా, ఏటా మరణాలు సంభవిస్తున్నా ఐటీడీఏ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం స్పందించడం లేదు. ఫలితంగా గిరిజనులు పాడె ఎక్కుతున్నారు. జనవరి నుంచి అంబులెన్సులు ఎత్తివేత 1999లో ఐటీడీఏ పరిధిలోని పీహెచ్‌సీల్లో గిరిజనులకు అత్యవసర వైద్యం అందించడానికి ఏన్‌ఎస్‌ఎఫ్‌డీసీ(నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబల్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్) అంబులెన్స్‌లు ఏర్పాటు చేసింది. గత అక్టోబర్‌లో రాష్ట్రస్థాయి వైద్యశాఖలో జరిగిన మినిట్స్ అఫ్ ది మీటింగ్‌లో ఏజెన్సీ పీహెచ్‌సీల అంబులెన్సుల సాధ్యాసాధ్యాలపై యంత్రాంగం చర్చించింది. అంబులెన్సులు ఎత్తివేయ్యాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సర్కా రు ఆదేశాల మేరకు ఐటీడీఏ జనవరి నుంచి అంబులెన్స్‌లను ఎత్తివేసింది.దీంతో గిరిజన ప్రాంతాల్లో ఉన్న ఇచ్చో డ, దండేపల్లి, బజార్హత్నూర్, నర్సాపూర్(టి), నేరడిగొండ, గుడిహత్నూర్, భీంపూర్, నార్నూర్, వాంకిడి, దంతన్‌పల్లి, ఝర్రి, పిట్టబొంగరం పీహెచ్‌సీల పరిధిలోని గిరిజనులకు అంబులెన్సు సౌకర్యం దూరమైంది. రూ.80 లక్షలు వచ్చినా.. గిరిజన ప్రాంతాల్లోని 31 పీహెచ్‌సీల్లో వ్యాధుల తీవ్రత లేని మందమర్రి, లోన్వెల్లి, ఈజ్గాం పీహెచ్‌సీలు మినహాయించి మిగతా వాటిల్లో అద్దె ప్రతిపాదికన ఏడాదిపాటు అంబులెన్సులను ఏర్పాటు చేయాలని వైద్యశాఖ రూ.80 లక్షలు విడుదల చేసింది. ఈ నిధులను ఐటీడీఏ ఏజెన్సీలో ప్రసవ సమయంలో ఉన్న గర్భవతులను పీహెచ్‌సీలకు, ఇళ్లకు తరలించడానికి ఐఏపీ ద్వారా కొనుగోలు చేసిన ఆరు అంబులెన్సుల నిర్వహణకు వినియోగించారు. ఏజెన్సీలో ఎన్ఆర్హెచ్ఎంకు చెందిన మూడు అంబులెన్సులు జైనూర్, సిర్పూర్(యు), తిర్యాణి పీహెచ్‌సీల్లో ఉన్నాయి. ఐఏపీ పథకంలో కొనుగోలు చేసిన అరింటిలో కాసిపేట, అంకోళి, గిన్నెధరి పీహెచ్‌సీలకు, ఆస్రా హెచ్ఎంఆర్ఐ సంస్థ అధీనంలోని ఇంద్రవెల్లి, తిర్యాణి పీహెచ్‌సీలకు రెండు, మరొక్కటి హెల్త్ సెల్ నిర్వహణకు వాంకిడి పీహెచ్సీలో ఇలా తొమ్మిది అంబులెన్సులు మాత్రమే ఉన్నాయి. 31 పీహెచ్‌సీల్లో తొమ్మిందింటికే ఇతర పథకాల ద్వారా వచ్చిన అంబులెన్సులు ఉండటం, మిగతా పీహెచ్‌సీలకు లేకపోవడం గిరిజనులకు శాపంగా మారింది. దీంతో అత్మవసర వైద్యం అందక గిరిజనులు మృత్యుఒడికి చేరుతున్నారు. వైద్యశాఖ విడుదల చేసిన నిధులతో ప్రతి పీహెచ్‌సీకి అద్దె అంబులెన్సు సౌకర్యం కల్పించాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
మంచంపట్టిన ప్రజలు.. సకాలంలో అందని వైద్యం..
ఉట్నూర్ : ఖానాపూర్ నియోజకవర్గంలో కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో గ్రామాల్లో పారిశుధ్యం లోపించింది. దీంతో వ్యాధులు ‘ముసురు’కుంటున్నాయి. ఏజెన్సీ మండలాలైన ఉట్నూర్, ఇంద్రవెల్లిలోని గ్రామాల్లో జ్వరాల తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. నియోజకవర్గంలోని మండలాల్లో జ్వరాలు, వ్యాధులతో ఈ ఏడాది ఇప్పటివరకు 22 మంది మృత్యువాతపడ్డారు. గ్రామాల్లోని నీటి పథకాలను వారానికోసారి క్లోరినేషన్ చేయాల్సి ఉన్నా మారుమూల గ్రామాల్లో ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. మండల కేంద్రాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఔట్‌పేషంట్ల సంఖ్య రోజు 60 నుంచి 100 వరకు ఉంటోందని వైద్యులు తెలిపారు. ఉట్నూర్ పీహెచ్సీలో ఔట్‌పేషంట్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. బుధవారం ఒక్క రోజే సుమారు 250 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారంటే.. జ్వరాల తీవ్రత ఎలా ఉందో తెలుస్తోంది. వ్యాధులు ప్రబలుతుండడంతో ఇప్పటికే కళాజాత బృందాలు గ్రామాల్లో ప్రదర్శనలు ఇవ్వాల్సి ఉండగా.. అధికార యంత్రాంగం ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. పిన్ పాయింట్ కార్యక్రమం ద్వారా వైద్య సిబ్బంది గ్రామాలను సందర్శించి చర్యలు తీసుకోవాల్సిన ఉన్నా అమలు కావడం లేదు. పీహెచ్‌సీల్లో సిబ్బంది కొరత భైంసా : ముథోల్ నియోజకవర్గంలో వర్షాలు కురుస్తుండడంతో జ్వరాలు ప్రబలుతున్నాయి. కుంటాల మండలం సేవాలాల్తండాలో రెండ్రోజులుగా ఆరుగురు విషజ్వరాల బారినపడ్డారు. సూర్యంతండాలో నలుగురు, ముథోల్ మండల వ్యాప్తంగా 40 మంది జ్వరాలతో బాధపడుతున్నారు. కుభీర్‌కు చెందిన ఆశన్న చలి జ్వరంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. భైంసా పట్టణంలో జ్వరాల బారిన పడిన ప్రజలు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. విషజ్వరాలు సోకిన సూర్యంతండాలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్యసేవలు అందిస్తున్నారు. రాయపూర్కాండ్లిలో నలుగురు జ్వరాల బారినపడ్డారు. వ్యాధులకు కారణమైన పారిశుధ్య లోపంపై అధికారులు నామమాత్ర చర్యలు తీసుకుంటున్నారు. డ్రెయినేజీలు, పెంటకుప్పలు దుర్వాసన వెదజల్లుతున్నాయి. దోమలు వృద్ధి చెందుతున్నాయి. తాగునీటి పథకాలు, డ్రెయినేజీలు క్లోరినేషన్ చేయడం లేదు. అన్నింటా ఖాళీలే.. ముథోల్, కుభీర్, కుంటాల, లోకేశ్వరం, తానూర్ పీహెచ్‌సీల్లో సిబ్బంది ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. కుంటాల పీహెచ్సీ వైద్యురాలు వందన డెప్యూటేషన్‌పై ఏడాదిన్నర క్రితం ఆదిలాబాద్‌కు వెళ్లారు. ల్యాబ్టెక్నీషియన్నూ డెప్యూటేషన్‌పై పంపించడంతో ల్యాబ్‌కు తాళం పడింది. అప్పటి నుంచి వైద్య సేవలు అందడం లేదు. కాంట్రాక్టు వైద్యులు సమయానికి రాకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. రక్త పరీక్షల కోసం భైంసా ఏరియా ఆస్పత్రికి పంపిస్తున్నారు. తానూర్ పీహెచ్సీలో వైద్యులు, ఏఎన్ఎంల పోస్టులు నాలుగు చొప్పున ఖాళీగా ఉన్నాయి. లోకేశ్వరంలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల ఖాళీగా ఉంది. ముథోల్ ప్రాంతీయ ఆస్పతిలో ఐదుగురు వైద్యుల, నలుగురు నర్సుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కుభీర్‌లో ఇద్దరు డాక్టర్లు, నలుగురు ఏఎన్ఎంలు, ఇద్దరు హెల్త్సూపర్వైజర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తాగునీరు కలుషితమై.. బెల్లంపల్లి : వర్షాలతో నీరు కలుషితమై, వాతావరణంలో మార్పుల కారణంగా ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలోని తాండూర్, బెల్లంపల్లి, భీమిని, నెన్నెల మండలాల్లోని పల్లెల్లో జ్వరాలు విజృంభిస్తున్నాయి. పక్షం రోజుల క్రితం భీమిని మండలం అక్కళ్లపల్లి గ్రామానికి చెందిన ఆరేపల్లి చంద్రమౌళి జ్వరంతో చనిపోయాడు. జ్వరాల తీవ్రత ఉన్న గ్రామాల్లో వైద్య సిబ్బంది ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. జ్వరాలతో బాధపడుతూ బెల్లంపల్లి ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి వచ్చే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ నెలలో ఇప్పటివరకు 438 మందికి రక్తపరీక్షలు నిర్వహించగా.. 200 మందికి టైఫాయిడ్ జ్వరం ఉన్నట్లు తేలింది. ఐదుగురికి మలేరియా, మరో 20 మందికి వైరల్ ఫీవర్ ఉన్నట్లు వైద్యులు తెలిపారు. జ్వరంతో బాధపడుతూ రోజుకు ముగ్గురు నుంచి ఐదుగురు వరకు ఆస్పత్రిలో ఇన్‌పేషంట్లుగా చేరుతున్నారు. మరో 30 నుంచి 40 మంది ఔట్పేషంట్లుగా ఆస్పత్రికి వచ్చి వెళ్తున్నారు. భీమిని మండలం ఖర్జీభీంపూర్, అక్కళ్లపల్లి, భీమిని(బారెవాడ)లో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. పది నుంచి పదిహేను మంది వరకు జ్వరంతో బాధపడుతున్నారు. అక్కళ్లపల్లిలో 15రోజుల క్రితం జ్వరాలు విజృంభించగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జ్వరాల తీవ్రత తగ్గుముఖం పట్టింది. నెన్నెల మండలం ఘన్పూర్, జంగాల్‌పేట, నందుపల్లి గ్రామాల్లో ప్రజలు వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. నిత్యం నెన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 25 నుంచి 30 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. నెన్నెల, జంగాల్‌పేట, ఘన్‌పూర్‌లో కొందరు కలుషిత నీరు తాగ డం వల్ల వాంతులు, విరేచనాలు అవుతున్నాయి. తాండూరు మండ లం మాదారం-3 ఇంక్లైన్, అన్నారం, కాసిపేట, కొత్తపల్లి గ్రామాల్లో ప్రజలు జ్వరాల బారినపడ్డారు. తాండూర్ పీహెచ్‌సీకి ప్రతిరోజు 50 మంది వైద్యం కోసం వస్తున్నారు. మాదారం-3 ఇంక్లైన్లో వైద్య శిబిరం ఏర్పాటు చేసి రోగులకు చికిత్స అందించారు. -
తిండిలోనూ కక్కుర్తి..
ఉట్నూర్ : మండలంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పెట్టే తిండిని పలువురు గద్దల్లా దోచుకెళ్తున్నారు. వైద్యం కోసం వచ్చే రోగులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలనే నిబంధనలు ఉన్నా.. నీళ్ల సాంబార్‌తో పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. భోజనంలో గుడ్డు, అరటిపండు, పెరుగు, కూరగాయలు కనిపించడం లేదు. అదీకాక వైద్యం కోసం వచ్చే రోగి వెంట వచ్చిన మరొకరికి భోజనం పెట్టాలనే నిబంధన ఉన్నా.. ఒకరికే అందిస్తూ దోచుకుంటున్నారు. ఇదీ ఉట్నూర్ పరిధిలోని సీహెచ్‌సీ ఆస్పత్రిలో కొనసాగుతున్న తంతు. 80 వరకు ఇన్‌పేషెంట్లు.. సామాజిక ఆరోగ్య కేంద్రంలో నిత్యం 30 నుంచి 80 మంది వరకు ఇన్‌పేషెంట్లు ఉంటారు. సమస్యాత్మక మండలాల్లో నివాసం ఉండే గిరిజనులకు సీహెచ్సీనే పెద్ద దిక్కు. మండల వాసులే కాకుండా సిర్పూర్(యు), ఇంద్రవెల్లి, నార్నూర్, జైనూర్ మండలాలకు చెందిన గిరిజనులు ఇక్కడికి వైద్యం కోసం వస్తుంటారు. అలా వచ్చిన వారిలో ఇన్పేషెంట్లుగా ఉండే రోగికి, వెంబడి వచ్చే మరొకరికి ప్రభుత్వం భోజన వసతి కల్పిస్తోంది. ఇందుకు భోజనం వడ్డించే నిర్వాహకుడికి ఒక్కరికి ప్రభుత్వం రోజుకు రూ.45 చొప్పున చెల్లిస్తోంది. జరుగుతోందిదీ.. సీహెచ్‌సీలో నిత్యం అన్నం, నీళ్ల సాంబారే పెడుతున్నారని రో గులు వాపోతున్నారు. మెనూ ప్రకారం ఉదయం అల్పాహారం కింద కప్పు టీ, 50 గ్రాముల పాలు, 100 గ్రాముల బ్రెడ్తోపా టు ఇడ్లీ, కిచిడి, ఉప్మా, పొంగల్ ఇలా ఏదో ఒకటి వడ్డించాలి. కానీ.. రోజూ నీళ్ల పాటు, బ్రెడ్ మాత్రమే ఇస్తున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇడ్లీ, ఉప్మా, కిచిడి వారంలో రెండు లేదా మూడు సార్లు మాత్రమే అందిస్తున్నారని చెబుతున్నారు. ఇక మధ్యాహ్న బోజనం పుల్కలు, ఉడికిన అన్నం, కూరగాయలతో చేసిన కూర, సాంబార్, ఉడకబెట్టిన గుడ్డు, 200 మిల్లీలీటర్ల పెరుగు, అరటి పండు ఇవ్వాల్సి ఉంది. కేవలం అ న్నం, నీళ్ల సాంబార్ ఇస్తూ రోగులను పౌష్టికాహారానికి దూరం చేస్తున్నారు. గుడ్డు అదివారం మాత్రమే పెడుతున్నారు. ఇదే భోజనాన్ని గర్భిణులు, అన్ని రకాల రోగులకు అందిస్తున్నారు. పెట్టెది ఒక్కరికి.. పొందేది ఇద్దరి బిల్లులు.. ప్రభుత్వం ఒకరికి రోజుకు రూ.45 చెల్లిస్తుండగా.. నిర్వాహకులు ఒకరికి మాత్రమే భోజనం పెడుతున్నారు. కానీ.. బిల్లు లో మాత్రం రోజు వారి ఐపీ సంఖ్య, వారి వెంట వచ్చే వారి సంఖ్యతోపాటుగా బిల్లులు కాజేస్తున్నట్లు సమాచారం. ఇలా నెలకు వేలాది రూపాయాలు దోచుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా.. దీనిపై నిర్వాహకుడు ఖానాపూర్‌కు చెందిన లాలా వివరణ కోసం ఫోన్లో ప్రయత్నించగా.. ఆయన ఏం సమాధానం ఇవ్వకుండానే కట్ చేశారు. పర్యవేక్షణ కరువు... సీహెచ్‌సీకి పూర్తిస్థాయి మెడికల్ సూపరింటెండెంట్ లేకపోవడంతో ఆస్పత్రిపై పర్యవేక్షణ కొరవడింది. దీంతో రోగులకు మెనూ ప్రకారం భోజనం అందడం లేదు. ఇలాంటి భోజనం తింటే రోగాలకు తోడు కొత్త రోగాలు తయారవుతారని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోగులకు సరైన భోజనం అందేలా చూడాలని కోరుతున్నారు. ఈ విషయమై ఇన్చార్జి డీసీహెచ్ చంద్రమౌళి స్పందిస్తూ సీహెచ్‌సీని సందర్శించి విచారణ చేపడుతామని, మెనూ ప్రకారం పెట్టకుంటే కాంట్రాక్ట్ తీసుకున్న భోజన నిర్వాహకునిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. -
గిరిజన యూనివర్సిటీపై గిల్లికజ్జాలు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లా ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోని పక్షంలో గిరిజన విశ్వ విద్యాలయం ఇతర జిల్లాకు తరలిపోయే అవకాశాలు ఉన్నాయి. ప్రతిష్టాత్మకమైన ఈ యూనివర్సిటీని ముందుగా ఉట్నూర్‌లో ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం భావించింది. తాజాగా దీన్ని వరంగల్ జిల్లాకు తరలించేందుకు ప్రస్తుత సర్కారు సమాయత్తమవుతుండటం ఇక్కడి విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. గోండు, కొలాం, తోటి, మన్నేవార్.. వంటి గిరిజన తెగలున్న జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే ఆదివాసీల సంసృ్కతి, సంప్రదాయాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుంది. ముఖ్యంగా అటవినే నమ్ముకుని జీవ నం కొనసాగిస్తున్న ఈ గిరిజన తెగలకు చెందిన యువతకు ఉన్నత విద్యావకాశాలు చేరువవుతాయి. ఈ ప్రత్యేక యూనివర్సిటీ జిల్లాకు తలమానికం కానుంది. ఉట్నూర్‌లో స్థలం గుర్తింపు.. గత యూపీఏ సర్కారు రాష్ట్రానికి గిరిజన యూనివర్సిటీ మంజూరు చేసింది. ఈ యూనివర్సిటీని ఉట్నూర్‌లో ఏ ర్పాటు చేయాలనే డిమాండ్ గతంలో వెల్లువెత్తింది. గిరిజ న సంఘాలు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమిం చాయి. ఓ గిరిజన సంఘం నేత ఉట్నూర్ నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసి, గవర్నర్‌కు వినతిపత్రం అందజేశారు. దీంతో ఈ యూనివర్సిటీని ఉట్నూర్‌లో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందిం చింది. దీని ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం రెండేళ్ల కిత్రం జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించింది. ఈ మేరకు అధికారులు ఉట్నూర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో సుమారు 300 ఎకరాల సర్కారు భూమిని గుర్తించారు. ఇందులో యూనివర్సిటీ ఏర్పాటుకు అనుకూలంగా ఉందని తేల్చా రు. 44వ నెంబర్ జాతీయ రహదారికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇక్కడ యూనివర్సిటీ ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని అప్పటి కలెక్టర్ అశోక్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు. గత యూపీఏ ప్రభుత్వం లో మంత్రిగా బలరాం నాయక్ దీన్ని వరంగల్ జిల్లాకు తరలించేందుకు ప్రయత్నాలు చేశారు. తాజాగా తెలంగాణలో కొలువుదీరిన కొత్త సర్కారు కూడా దీన్ని వరంగల్ జిల్లాకు తరలించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ యూని వర్సిటీ ఏర్పాటుకు సాధ్య అసాధ్యాలు పరిశీలించాలని వరంగల్ జిల్లా అధికార యంత్రాంగానికి ఆదేశాలందడంతో జిల్లా వాసుల ఆశలపై నీళ్లు చల్లినట్లవుతోంది. అభివృద్ధికి నోచుకోని జిల్లా.. ఇక్కడి ప్రజాప్రతినిధుల అలసత్వం కారణంగా జిల్లా ఎంతో కాలంగా వెనుకబడిపోయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో సరైన ప్రాతినిథ్యం దక్కకపోవడం.. తదితర కారణాలతో జిల్లా అభివృద్ధికి బాటలు పడలేదు. ఇప్పుడు తెలంగాణలో కొలువుదీరిన కొత్త సర్కారులో జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి జోగు రామన్న, ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలచారి కీలకంగా మారారు. ఈ ప్రజాప్రతినిధులు ప్రతిష్టాత్మకమైన ఈ విశ్వవిద్యాలయాన్ని జిల్లాలోనే నెలకొల్పేలా చొరవ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
గిరిజన వర్సిటీ ఏర్పాటుపై ఆశలు గల్లంతు
ఉట్నూర్ : జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుపై ఆశలు గల్లంతు అవుతున్నాయి. తాజాగా ప్రభుత్వం వరంగల్ జిల్లా ములుగు నియోజకవర్గంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు గల అవకాశాలు పరిశీలించాలని ఆ జిల్లా యంత్రాగానికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు సర్వే పనులకు శ్రీకారం చుడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా గిరిజన యూనివర్సిటీ జిల్లాలోనే ఏర్పాటు అవుతుందన్న ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఇప్పటికైన మన జిల్లా ప్రజాప్రతినిధులు యూనివర్సిటీ కోసం పోరాడాలని గిరిజనులు కోరుతున్నారు. ఆశల పల్లకిలో ఆరేళ్లు.. 2008లో అప్పటి యూపీఏ సర్కారు జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించింది. 2008 నవంబర్ 17న జీవో నంబర్ 797, 2011 ఆగస్టు 27న జీవో నంబర్ 783ను విడుదల చేసింది. దీంతో జిల్లా, ఐటీడీ ఏ అధికారులు ఉట్నూర్‌లోని ప్రభుత్వ జూనియ ర్ కళాశాల వెనకాల ప్రభుత్వానికి చెందిన 470 ఎకరాల పరంపోగు భూమిలో 300 ఎకరాలు గుర్తించింది. అలాగే 7వ నంబరు జాతీయ రహదారికి 34 కి.మీ. దూరంలో రవాణా సౌకర్యం, హైటెన్షన్ విద్యుత్తు తదితర సౌకర్యాలు ఉన్నట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికలు పంపించారు. యూపీఏ సర్కార్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సందర్భంగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదించిన తెలంగాణ బిల్లు పదకొండో అంశంలో తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు ప్రస్తావన కూడా ఉంది. దీంతో అందరూ యూనివర్సిటీ ఏర్పాటవుతుందని భావించారు. ఇప్పుడేమో వరంగల్‌కు తరలుతున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో గిరిజనులు నిరాశకు గురవుతున్నారు. ప్రజాప్రతినిధులపైనే భారం జిల్లాలోని ఏజెన్సీ కేంద్రమైన ఉట్నూర్‌లో గిరిజ న యూనివర్సిటీ ఏర్పాటుకు అనువైన అవకాశాలున్నా రాజకీయ కారణాల వల్ల వరంగల్‌లో ని ములుగుకు తరలుతున్నట్లు తెలుస్తోంది. ప్ర స్తుతం జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు జరగాలంటే ప్రజాప్రతినిధులే కీలకమని అడవి బిడ్డలు భావిస్తున్నారు. జిల్లాలో అధికార ప్రభుత్వానికి తొమ్మిది అసెంబ్లీ స్థానాలు ఉండటం, ఒక మంత్రి పదవి, ఇద్దరు ఎంపీలు టీఆర్ఎస్ వాళ్లే ఉన్నారు. ఇందులో ఒక ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలు గిరిజన తెగకు చెందిన వారు ఉన్నారు. వీరంత ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఏజెన్సీ కేంద్రంగా గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు జరిగేలా చూడాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. మన జిల్లాలో కాకుండా వేరే జిల్లాకు యూనివర్సిటీ తరలిపోతే అది ప్రజాప్రతినిధుల వైఫల్యమే అవుతుంది. -
అంత్యక్రియలకు దూరం
తల్లికి అంత్యక్రియలు.. కొడుకు ఆస్పత్రిలో.. అగ్గిపట్టిన మరిది మరోవైపు కొడుకు అంత్యక్రియలకు తండ్రి దూరం ఇంద్రవెల్లి : ఉట్నూర్ మండలం లో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదం తీ రని విషాదాన్ని మిగిల్చడమే కాదు... సంప్రదాయ అంతిమ సంస్కారాలు, కడసారి చూ పులు కూడా దక్కకుండా చేసింది. మండల కేంద్రంలో గోండ్‌గూడలోని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా.. పలువురు తీవ్ర గాయలపాలై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నిర్మల జైస్వాల్(45), సాయి జైస్వాల్(15) మృతదే హాలను శుక్రరవారం ఇంటికి తీసుకొచ్చారు. కాంతాబాయి(54) మృతదేహాన్ని మహారాష్ట్రలోని వారి గ్రామమైన కుప్టకు పంపించారు. కాగా, నిర్మల జైస్వాల్ భర్త బాబు రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. ఆమెకున్న ఏకైక కుమారుడు పవన్, కోడలు సీతల్ జై స్వాల్ గురువారం జరిగిన రోడ్డు ప్రమాదం లో తీవ్ర గాయలపాలై హైదరాబాద్ ఆస్పత్రి లో చికిత్స పొందుతున్నారు. విధి లేని పరిస్థితిలో ఆమె మరిది అయిన జనక్ జైస్వాల్ ద హన సంస్కారాలు నిర్వహించారు. అదే వి ధంగా సాయి జైస్వాల్(15) మృతిచెందగా.. అతడి తమ్ముడు సోనుకు తీవ్రగాయాలు అయ్యాయి. వారి తల్లిదండ్రులు దిలీప్, సీతల్ జైస్వాల్ చిన్న కొడుకు సోను వెంట హైదరాబాద్‌లో ఆస్పత్రిలో ఉన్నారు. దీంతో ప్రమాదంలో మృతిచెందిన పెద్ద కొడుకు సాయికి ఆ తల్లిదండ్రులు ఆఖరి చూపులు కూడా దక్కకుండానే అంతక్రియలు నిర్వహించాల్సి వచ్చింది. ఈ సంఘటనలు గ్రామంలో తీరని విషాదాన్ని మిగిల్చాయి. -
గిరిజన విద్య.. ఫెయిల్..!
ఉట్నూర్, న్యూస్‌లైన్ : ఐటీడీఏ ఆధీనంలోని ఆశ్రమ పాఠశాలల్లో గిరిజన విద్య గాడి తప్పింది. గత పదేళ్లలో ఎన్నడూ లేనంత దారుణంగా పదో తరగతి ఉత్తీర్ణత శాతం పడిపోయింది. ఉత్తీర్ణత శాతాన్ని పరిశీలిస్తే విద్య తిరోగమన దిశలో పయనిస్తోందా అనే సందేహం వ్యక్తమవుతోంది. ఒక్కరూ ఉత్తీర్ణత సాధించని ఆశ్రమ పాఠశాలలు నాలుగు, ఒక్కరు ఉత్తీర్ణత సాధించినవి ఏడు, ఇద్దరు ఉత్తీర్ణత సాధించినవి నాలుగు, ముగ్గురు ఉత్తీర్ణత సాధించినవి ఆరు, ఇక పది మంది లోపు విద్యార్థులు ఉత్తీర్ణత సాధించిన ఆశ్రమ పాఠశాలలు 30.. ఇలాంటి ఫలితాలు గత పదేళ్ల కాలంలో గిరిజన సంక్షేమ శాఖ చూసి ఉండదు. ఫలితాలు పడిపోవడానికి కారణం ఎవరు.. ఆయా విద్యాలయాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడమా..?, విద్యాలయాల్లో విధులు నిర్వర్తించే సిబ్బంది విద్యార్థుల చదువుపై ప్రత్యేక దృష్టి సారించకపోవడమా..?, విద్యార్థులు పుస్తకాలు ముట్టకపోవడమా..? కారణమేదైనా గిరిజన సంక్షేమ శాఖ భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. పడిపోయిన ‘పది’ ఫలితాలు.. గతంతో పోల్చితే ఈ విద్యాసంవత్సరం పదో తరగతి ఫలితాలు దారుణంగా పడిపోయాయి. గిరిజన సంక్షేమ శాఖ ఆధీనంలో ఈసారి 3,929 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 1,506 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 71 ఆశ్రమ పాఠశాలల నుంచి 3,046 మందికి గాను 1,083 మంది, 13 కస్తూరిబా గాంధీ పాఠశాలల నుంచి 316 మందికి గాను 106 మంది, నాలుగు రెసిడెన్షియల్ పాఠశాలల నుంచి 483మందికి గాను 292 మంది, ఆరు వసతి గృహాల నుంచి 84 మందికి గాను 25 మంది విద్యార్థుల చొప్పున ఉత్తీర్ణత సాధించారు. పదో తరగతి వరకు ఉన్న జామ్డా, మహాగాం, రాశిమెట్ట బాలికల ఆశ్రమ పాఠశాలల్లో, మార్లవాయి ఆశ్రమ పాఠశాలలో ఒక్కరూ ఉత్తీర్ణత సాధించకపోవడం గమనార్హం. పర్డీ(బి), గూడమామడ, నార్నూర్, అర్జుని(బాలికల), దోర్డానా, కోహినూర్(కే), గుడిహత్నూర్, ఉమ్రి(బాలికల) ఆశ్రమ పాఠశాలల్లో ఒక్కరు చొప్పున, జైనూర్, గిన్నెధరి, మల్కెపల్లి, పాట్నాపూర్(బాలికల) ఆశ్రమ పాఠశాలల్లో ఇద్దరు చొప్పున ఉత్తీర్ణత సాధించారు. మాన్కపూర్, పోచంలొద్ది, ఖానాపూర్(బాలికల), కుంటాల, జన్నారం, ఖానాపూర్ ఆశ్రమ పాఠశాలల్లో ముగ్గురు చొప్పున ఉత్తీర్ణులయ్యారు. స్వర్ణ, బోథ్(బాలికల), కోర్టికల్(కే) ఆశ్రమ పాఠశాలల్లో నలుగురు చొప్పున ఉత్తీర్ణత సాధించారు. ఇక పది మంది లోపు విద్యార్థులు ఉత్తీర్ణత సాధించిన ఆశ్రమ పాఠశాలలు 30 దాటలేదు. ఇక 13 కేజీబీవీల్లో నార్నూర్, మాణిక్యకపూర్ విద్యార్థులు ఒక్కరూ ఉత్తీర్ణత సాధించకపోవడం గమనార్హం. కుస్నపల్లి, కడెం, నార్నూర్, భీంపూర్ వసతి గృహాల్లో ఒక్కరు చొప్పున, భీమారంలో పది మంది, లక్సెట్టిపేటలో 11 మంది ఉత్తీర్ణులయ్యారు. కారణాలు అనేకం.. 2013-14 విద్యాసంవత్సరంలో గిరిజన సంక్షేమ శాఖలో పదో తరగతి ఉత్తీర్ణత శాతం తగ్గడానికి కారణాలు అనేకం ఉన్నాయి. ఐటీడీఏ ఉన్నతాధికారుల మధ్య సమన్వయలోపం తీవ్ర ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. విద్యాసంవత్సరం ప్రారంభమైన నెల తర్వాత అప్పటి డీడీటీడబ్ల్యూ రషీద్ అనారోగ్యం కారణంగా చూపుతూ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. ఉన్నతాధికారులే ఆయనను సెలవుపై పంపించారని అప్పట్లో ప్రచారం జరిగింది. అప్పటి ఏపీవో(జనరల్) వెంకటేశ్వర్లుకు ఇన్చార్జి డీడీగా బాధ్యతలు అప్పగించారు. ఆయ న ఉద్యోగ విరమణ సమయం దగ్గరలో ఉండడంతో పూర్తి స్థాయిలో గిరిజన విద్యపై దృష్టి సారించలేదు. సెప్టెంబర్‌లో ఉద్యోగ విరమణ పొందగానే ఐటీడీఏ ఏవో భీమ్‌కు బాధ్యతలు అప్పగించినా ఆశించిన ఫలితం లేకుండాపోయింది. ఆశ్రమాలపై పూర్తి స్థాయిలో పర్యవేక్షణ కొరవడడంతో గిరిజన విద్య గాడి తప్పు తూ వచ్చింది. నవంబర్ 28న సెలవుపై వెళ్లిన రషీద్ డీడీగా తిరిగి బాధ్యతలు స్వీకరించినా.. నెల తిరక్కుండానే డిసెంబర్ 21న ఆయనను సస్పెండ్ చేస్తూ ప్రిన్సిపల్ సెక్రెటరీ విద్యాసాగర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో గిరిజన సంక్షేమ శాఖ ఆధీనంలోని విద్యాలయాలను పట్టించుకునే వారే లేకుండాపోయారు. ఆశ్రమ పాఠశాలల్లో 577 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండడంతో ఐటీడీఏ విద్యా సంవత్సరం ఆరంభంలో సీఆర్టీలను నియమించకుండా విడతల వారీగా నియామకాలు చేపట్టింది. ఈ ప్రక్రియ ముగిసే స రికి ఆగస్టు దాటడంతో సిలబస్ పూర్తి కాలేదు. అదీగాక సీఆర్టీలను ఏటా తొల గిస్తూ నియామకాలు చేపట్టడంతో కొత్తగా వచ్చే సీఆర్టీలకు పాఠ్యాంశాలపై పూర్తి అవగాహన లేక విద్యార్థులకు బోధించలేకపోయారనే ఆరోపణలున్నాయి. విద్యాసంవత్సరంలో సుమారు 20 మంది ఉపాధ్యాయులను ఐటీడీఏ పీవో సస్పెండ్ చేశారు. వీరికి నెలలు గడిచినా పోస్టింగ్‌లు ఇవ్వకపోవడంతో ఆశ్రమాల్లో పలు సబ్జెక్టు టీచర్ల కొరత ఏర్పడింది. పలువురికి షోకాజ్ నోటీసులు ఇవ్వడం, విద్యాసంవత్సరం మధ్యలో బదిలీలు నిర్వహించడంతో పూర్తి స్థాయిలో తరగతుల బోధన లేక విద్యార్థుల ఫలితాలపై ప్రభావం చూపింది. అధికారుల మధ్య సమన్వయ లోపం, పూర్తి స్థాయి డీడీటీడబ్ల్యూగా బాధ్యతలు నిర్వర్తించే వారు లేకపోవడంతో ఆశ్రమాల్లో విధులు నిర్వర్తించే సిబ్బంది ఆడింది ఆట పాడింది పాటగా మారింది. కొందరు ఉపాధ్యాయులు అనుమతి లేకుండా రోజుల తరబడి విధులకు ఎగనామం పెట్టారు. దూర ప్రాంతాల నుంచి ఇష్టారీతిగా రాకపోకలు సాగించడం, సీఆర్టీలపై భారం వేయడంతో నాణ్యమైన విద్య అందకుండా పోయింది. ప్రక్షాళన చేస్తేనే.. పదో తరగతి ఫలితాలను దృష్టిలో ఉంచుకుని ఈ విద్యాసంవత్సరం ఆరంభం నుంచే గిరిజన సంక్షేమ శాఖలో ప్రక్షాళన చేస్తేనే గిరిజన విద్య గాడిలో పడే అవకాశ ఉందని విద్యావేత్తలు అంటున్నారు. ఆశ్రమాల్లో పూర్తి స్థాయిలో ఫలితాలు సాధించని 50 మంది ఉపాధ్యాయులకు ఐటీడీఏ పీవో షోకాజ్ నోటీసులు జారీ చేసినప్పటికీ ప్రభుత్వం పూర్తి స్థాయి డీడీటీడబ్ల్యూను నియమించడం, పాఠశాలలు ప్రారంభానికి ముందే సీఆర్టీల నియామకం తదితర చర్యలు చేపడుతూ ప్రక్షాళన చేస్తేనే ఫలితం ఉంటుంది. ఇప్పటికైనా అధికారులు గిరిజన గాడిలో పెడతారో లేదో వేచి చూడాల్సిందే. -
ఎన్ఆర్హెచ్ఎం నిధులకు గ్రహణం
ఉట్నూర్, న్యూస్‌లైన్ : పీహెచ్సీ, సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రుల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ప్రతి ఆర్థిక సంవత్సరం ఎన్ఆర్హెచ్ఎం(జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్) విడుదల చేసే నిధులకు గ్రహణం పట్టడమే అందుకు కారణం. 2013-14 ఆర్థిక సంవత్సరం ముగిసి నాలుగు నెలలు కావస్తున్నా నిధుల విడదల జాడ లేదు. మాతృ శిశు మరణాలను కనీస స్థాయికి తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం 2005లో ఎన్ఆర్హెచ్ఎంకు శ్రీకారం చుట్టింది. జిల్లాలోని ప్రతీ పీహెచ్‌సీకి రూ.1.75లక్షలు, సీహెచ్‌సీకి రెండు లక్షలు, ఏరియా ఆస్పత్రులకు రూ.ఐదు లక్షల చొప్పున కేటాయిస్తుంది. వీటిని ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పన, వైద్యశిబిరాలు, రోగుల తరలింపు, అత్యవసర మందుల కొనుగోళ్లకు వెచ్చించాల్సి ఉంటుంది. 2013-14 ఆర్థిక సంవత్సరం నిధుల విడుదల కోసం ఆయా వైద్య కేంద్రాలు ఎదురు చూస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 72 పీహెచ్‌సీలకు గాను ఏజెన్సీలోని గిరిజన ప్రాంతాల్లో 31 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. వీటికి సుమారు రూ.1.26 కోట్లు విడుదల కావాల్సి ఉండగా.. రూ.54.25 లక్షలు ఏజెన్సీ పీహెచ్‌సీలకు విడుదల కావాలి. ఉట్నూర్, లక్సెట్టిపేట, బోథ్, ఆసిఫాబాద్, ఖానాపూర్, బెల్లంపల్లి, ముథోల్, సిర్పూర్(టి) సామాజిక ఆస్పత్రులకు రూ.రెండు లక్షల చొప్పున, నిర్మల్, మంచిర్యాల, భైంసా ఏరియా ఆస్పత్రులకు రూ.5లక్షల చొపుపన విడుదల కావాల్సి ఉంది. జిల్లాలోని 469 సబ్‌సెంటర్లకు అన్‌టైడ్ ఫండ్స్ రూ.పది వేల చొప్పున రూ.46.90లక్షలు విడుదలకు నోచుకొలేదు. ఏజెన్సీలో పలు పీహెచ్‌సీల్లో కిటికీలు, నీటి సమస్యలు, మరుగుదొడ్లు తదితర సమస్యలు తాండవం చేస్తున్నాయి. నిధులు విడుదల కాక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. అత్యవసర మందులు లేక వైద్యం కోసం వచ్చేవారిని బయటే కొనుక్కోవాలని చెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఏజెన్సీలోని గిరిజనులు గ్రామాల్లో జ్వరాలు, అతిసార తదితర వ్యాధులతో సతమతం అవుతున్నారు. సర్కారు ఆస్పత్రుల్లో మందుల్లేక.. ప్రైవేటు వైద్యం చేయించుకునే స్థోమత లేక దేవుడిపై భారం వేసి మృత్యు ఒడికి చేరుతున్నారు. యూసీ ఖర్చులు, వసతుల నివేదికలు సంబంధిత ఆస్పతులు సకాలంలో పంపించకపోవడంతోనే నిధుల విడుదలలో జాప్యమైనట్లు తెలుస్తోంది. ఈ విషయమై జిల్లా ఏజెన్సీ అదనపు వైద్యాధికారి ప్రభాకర్‌రెడ్డిని సంప్రదించగా.. నిధులు విడుదల కాలేదని స్పష్టం చేశారు. పూర్తి స్థాయిలో నివేదికలు పంపించాలని వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. నిధులు విడుదలయ్యేలా చర్యలు చేపట్టామని తెలిపారు. -
‘దేశం’ కోటకు బీటలు
ఉట్నూర్, న్యూస్‌లైన్ : టీడీపీకి ఆయువు పట్టుగా ఉన్న ఖానాపూర్ నియోజకవర్గంలో దేశం కోటకు బీటలు పడ్డాయి. సాధారణ ఎన్నికల్లో పార్టీ నుంచి ఖానాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన రితీశ్ రాథోడ్, ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేసిన రాథోడ్ రమేశ్ ఓటమి పాలు అవ్వడంతో టీడీపీ శ్రేణుల్లో నిస్తేజం అలుముకుంది. టీడీపీ నుంచి 1999లో రాథోడ్ రమేశ్ ఖానాపూర్ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో నియోజకవర్గాన్ని పార్టీకి కంచు కోటలా మార్చాడు. 2004లో ఖానాపూర్ ఎమ్మెల్యేగా రాథోడ్ రమేశ్ ఓటమి పాలైనా మరుసటి ఏడాదిలో ఆసిఫాబాద్ జెడ్పీటీసీగా గెలుపొంది జిల్లా జెడ్పీ పీఠం సాధించడం, అటు తర్వాత ఎంపీగా గెలుపొందడం, ఆయన సతీమణి రెండుసార్లు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో నియోజకవర్గంలో పార్టీని తిరుగులేని శక్తిగా తయారు చేశారు. కంచు కోట బద్దలు పంచాయితీ, ప్రాదేశిక ఎన్నికలకు ముందు ఖానాపూర్ నియోజకవర్గం టీడీపీకి కంచుకోటలా ఉండెది. తర్వాత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా టీడీపీ ప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది. పంచాయ ఎన్నికలకు ముందు నియోజకవర్గంలోని మూడు మేజర్ గ్రామ పంచాయతీలు ఉండగా రెండింట్లో టీడీపీ సర్పంచులు, ఒక పంచాయతీలో టీఆర్ఎస్ సర్పంచ్ అధికారంలో ఉండేవారు. పంచాయతీ ఎన్నికల తర్వాత ఒక మేజర్ గ్రామ పంచాయతీని టీడీపీ కైవసం చేసుకోలేకపోయింది. ఖానాపూర్, ఉట్నూర్ మేజర్ గ్రామ పంచాయతీలు టీఆర్ఎస్ కైవసం చేసుకోగా, పొన్కల్ పంచాయతీని స్వతంత్ర అభ్యర్థి కైవసం చేసుకుంది. ప్రాదేశిక ఎన్నికలకు ముందు టీడీపీ మూడు ఎంపీపీ స్థానాలు, నాలుగు జెడ్పీటీసీ స్థానాలతో బలంగా ఉండేది. అయితే మొన్న జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో సైతం టీడీపీ అనుకున్న ఎంపీటీసీ స్థానాలు కూడా సాధించలేకపోయింది. నియోజకవర్గంలో 80 ఎంపీటీసీ స్థానాలకు గాను కేవలం 22 స్థానాలు సాధించి రెండో స్థానంలో నిలువగా ఐదు జెడ్పీటీసీ స్థానాలుండగా ఒక్క దానినీ దక్కించుకోలేక చతకిలపడింది. దీంతో టీడీపీ ప్రభావం తగ్గుతూ టీఆర్ఎస్ బలంగా పుంజుకుంది. ప్రస్తుతం జరిగిన ప్రాదేశిక ఎన్నికల ఫలితాలతో నియోజకవర్గంలో ఐదింటికి ఐదు ఎంపీపీ స్థానాలు, నాలుగు జెడ్పీటీసీ స్థానాలు టీఆర్ఎస్ పార్టీ సాధించనుంది. అదీ కాక సాధారణ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి రితీశ్ రాథోడ్, ఎంపీ అభ్యర్థిగా రాథోడ్ రమేశ్ ఓటమి చెందడంతో కంచుకోటకు బీటలు వారినట్లు అయ్యింది. ఇదే సమయంలో టీఆర్ఎస్ అభ్యర్థి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో పార్టీ తన బలాన్ని పెంచుకుందని చెప్పవచ్చు. తెలంగాణ ఉద్యమ తీవ్రతతో.. 2009లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన సమయంలో ఎంపీగా ఉన్న రాథోడ్ రమేశ్, టీడీపీ శ్రేణులు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన లేకపోయారనే అపవాదును మూటకట్టుకున్నారు. తెలంగాణ ఉద్యమంతో టీఆర్ఎస్ నియోజకవర్గంలో క్రమక్రమంగా బలం పుంజుకోవడంతో పంచాయతీ, ప్రాదేశిక, సాధారణ ఎన్నికల్లో టీడీపీ అనుకున్న విజయం సాధించలేకపోయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సాధారణ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలుస్తాడని పార్టీకి పునర్వైభవం వ స్తుందని శ్రేణులు అనుకున్నప్పటికీ ఆశలు గల్లంతు అవ్వడంతో పార్టీ కంచు కోటకు బీటలు వారినట్లు అయ్యింది. -
తగ్గని ప్లాస్టిక్ వాడకం
ఉట్నూర్ రూరల్, న్యూస్‌లైన్ : ప్లాస్టిక్ కవర్లపై నిషేధం అమలు కావడం లేదు. కవర్లు వాడకూడదంటూ అప్పుడప్పుడు హడావుడిగా ప్రచారం చేసే అధికారులు తరువాత పట్టించుకోకపోవడంతో ప్లాస్టిక్ కవర్ల వాడకం తగ్గకుండా పోయింది. పరిస్థితి ఇలాగే ఉంటే వీటి ప్రభావం పర్యావరణంపై తీవ్రంగా పడే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. ఇదీ పరిస్థితి దాదాపు ప్రతి చోట ప్లాస్టిక్ కవర్ల వాడకం ఎక్కువగా కనిపిస్తోంది. ఏ చిన్న వస్తువు కొన్నా కవర్లో పెట్టి ఇవ్వండి అంటూ చెబుతున్న మాటలే వీటికి నిదర్శనం. ప్లాస్టిక్ ఉత్పత్తులు ఎక్కువగా వాడితే అనారోగ్యాలతో పాటు వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని తరచూ వైద్యులు హెచ్చరిస్తున్నా పరిస్థితుల్లో మాత్రం ఎలాంటి మార్పులు రావడం లేదు. ప్లాస్టిక్ ఉత్పత్తులు వేల సంవత్సరాలు భూమి పొరల్లో ఉండిపోవడంతో పాటు కరగక పోవడంతో భవిష్యత్తులో విపత్కరమైన పరిస్థితులు మానవాళి ఎదుర్కోబోతుందని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తూ వస్తున్నారు. అదేవిధంగా ప్లాస్టిక్ కాల్చడం ద్వారా దాని నుంచి విషపూరిత వాయువు వెలువడి ప్రజలు వ్యాధుల బారిన పడే అవకాశం లేకపోలేదు. టీ, జ్యూస్ ఇతర ఆహార పదార్థాల ప్లేట్లు, గ్లాసులో పదార్థాలు తీసుకుంటే క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని వైద్యులు సైతం హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ కారణంగా పశువులకు సైతం తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయి. జీర్ణకోశ వ్యాధులతో పశువులు వ్యాధి బారిన పడి మరణించిన సంఘటనలు సైతం విపరీతంగాపెరిగిపోతున్నాయి. చర్యలు తీసుకుంటేనే... ప్లాస్టిక్ వాడకాన్ని రెండేళ్ల క్రితమే ప్రభుత్వం నిషేధిస్తున్నట్లు ఓ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉన్న కవర్లను మాత్రమే వాడాలని హెచ్చరిస్తోంది. దీనికి తోడు కాటన్, జనపనారలతో తయారు చేసే ఉత్పత్తులకు రాయితీ సౌకర్యం ఇస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ప్రస్తుతం అధికారులు ప్లాస్టిక్ సమస్యను నివారించేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడు మాత్రమే ప్లాస్టిక్ భూతం నుంచి మానవాళి తనను తాను రక్షించుకోగలుగుతుంది. -
వర్షం దెబ్బ
ఉట్నూర్, న్యూస్‌లైన్ : జిల్లా వ్యాప్తంగా రైతులు 62,300 ఎకరాల్లో టమాటా సాగు చేశారు. మంచి ధర పలకడం, స్వల్పకాలిక పంటకావడంతో రైతులు మొగ్గు చూపారు. జిల్లాలోని ఇంద్రవెల్లి, జైనథ్, కెరమెరి, గుడిహత్నూర్, ఉట్నూర్, సిర్పూర్(యు), బజార్హత్నూర్, నార్నూర్, జైనూర్, బోథ్, తాంసి, తలమడుగు, ఇచ్చోడ, నేరడిగొండ మండలాల్లో టమాటా సాగవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంద్రవెల్లి మండలం టమాటా సాగులో పేరు గాంచింది. ఇక్కడ ఈసారి దాదాపు 5 వేల హెక్టార్లలో పంట సాగు చేస్తున్నారు. టమాటాకు మంచి ధర పలకడంతో ఆశించిన లాభాలు వస్తాయని రైతులు భావించారు. కానీ వర్షాలు, వరదలు నట్టేట ముంచాయి. నిండాముంచిన వర్షాలు.. పొగమంచు.. వర్షాలు, వరదలు టమాటా రైతులను నిండా ముంచాయి. పది రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, పై-లీన్ తుపాన్ ప్రభావంలో టమాటా సాగుపై పండింది. అధిక వర్షాలతో చేలలో నీరు నిల్వ ఉండటంతో మొక్కల వేర్లు మురిగిపోయాయి. దీనికి తోడు టమాటా కాయలు బురదలో వేలాడటంతో మురిగిపోయాయి. రైతులు చేలలోకి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో బ్యాక్టిరియా సోకి కాయలకు నల్లమచ్చలు ఏర్పడ్డాయి. ఇటువంటి టమాటాలను ఏరివేస్తున్నా ఫలితం ఉండటం లేదని రైతులు పేర్కొంటున్నారు. టమాటా దిగుబడి పెరగాలంటే పొగమంచు అదుపులో ఉండాలి. కానీ, ఆకాల వర్షాలు తగ్గినప్పటి నుంచి వేకువజామున పొగమంచు విపరీతంగా కురుస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పొగమంచు పెరగడంతో కాత, పూత రాలడం.. కాయ ఎదుగుదల లేకుండా పోయి దిగుబడి తగ్గుతోంది. పొగమంచు తగ్గుముఖం పడితే గాని దిగుబడి పెరిగే అవకాశం లేదని రైతులు తెలుపుతున్నారు. టమాటా సీజన్ కావడంతో సాధారణంగా ఈ సీజన్లో కిలో టమాటా ధర రూ. 10 నుంచి రూ.20 మధ్య ఉంటుంది. కానీ, వర్షాలు, పొగమంచు కారణంగా దిగుబడి తగ్గడంతో మార్కెట్లో ప్రస్తుతం కిలో టమాటా ధర రూ.40పైగా పలుకుతోంది. మార్కెట్లో ధర ఉండటం, పంట దిగుబడి లేక రైతులు అల్లాడుతున్నారు. నష్టాల ఊబిలో రైతులు ఎకరం టమాటా పంట సాగు చేయాలంటే రైతుకు రూ.20 వేల నుంచి రూ.25వేల వరకు పెట్టుబడికి ఖర్చవుతుంది. ఎకరం సాగులో వారానికి 20 క్యారెట్ల టామాటాను మార్కెకు తరలిస్తే రైతులకు లాభాలు వస్తాయి. ఈసారి వర్షాలు, పొగమంచు కారణంగా దిగుబడి తగ్గి ఎకరం చేనులో వారానికి మూడు లేదా నాలుగు క్యారెట్ల టమాటా కూడా మార్కెట్‌కు తరలించడం లేదు. కానీ, గతేడాది దిగుమతి పెరిగి.. ధర లేక నష్టపోయామని రైతులు పేర్కొంటున్నారు. ఈ మూడు, నాలుగు క్యారెట్ల టమాటా కాయలపై కూడా నల్లమచ్చలు ఉండటంతో ధర రావడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం క్యారెట్ ధర రూ.700 నుంచి రూ.1,300 వరకు పలుకుతుంది. ఈ సమయంలో టమాటా దిగుబడి ఆశించిన విధంగా ఉంటే లాభాలు వచ్చేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పెంచేశారు!
ఉట్నూర్, న్యూస్‌లైన్ : అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు కేంద్రాల నిర్వహణ సమయం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు ఉండేది. వేళల్లో మార్పు చేస్తూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పొడిగించింది. అంతేకాకుండా అంగన్వాడీ కార్యకర్తలకు గౌరవ వేతనం రూ. 500, ఆయాలకు రూ.250 పెంచుతూ స్త్రీ, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో 15 ఐసీడీఎస్ ప్రాజెక్టులు మహిళాభివృద్ధి శిశు, సంక్షేమ శాఖ అధీనంలో పనిచేస్తున్నాయి. వీటి పరిధిలో 3,570 మెయిన్, 798 మినీ అంగన్వా డీ కేంద్రాలున్నాయి. 0-6 ఏళ్ల పిల్లలకు పోషకాహారంతోపాటు గుణాత్మక విద్య అందించడం, అమృతహస్తం పథకం కింద బా లింతలకు, గర్భిణులకు పోషక ఆహారం అందించడం ఈ కేం ద్రాల లక్ష్యం. తాజాగా సమయం పెంచడం ద్వారా కార్యకర్తలు, ఆయాలకు పూర్తిస్థాయిలో పనిదొరకడంతోపాటు పోషకాహారం కూడా పూర్తిస్థాయిలో అందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. పెరిగిన పనిభారం : ఇంతవరకు అంగన్వాడీ కార్యకర్తలకు గౌరవ వేతనంగా రూ.3700, ఆయాలకు రూ.1,950 ప్రభుత్వం చెల్లిస్తోంది. కార్యకర్తలకు రూ.500 పెండంతో రూ.4,200, ఆ యాలకు రూ.200 పెంచడంతో రూ. 2,200 అవుతున్నాయి. ఇం తకుముందు సమయం తక్కువగా ఉండటతో వేరే పనిచేసుకునే వారమని, ఇప్పుడు సమయం పెంచడంతో వేరే పనిచేసుకునే అ వకాశం లేదని కార్యకర్తలు, ఆయాలు పేర్కొంటున్నారు. వేత నం పెంచి ఏం లాభం లేదని వారు వాపోతున్నారు. దీనికితోడు ప్రభుత్వ పథకాల పని తమకే అప్పగిస్తారని, సర్వేలు చేయిస్తూ శ్రమను దోచుకుంటున్నారని అంటున్నారు. వేతనం పెంచాలని వారు కోరుతున్నారు. కాగా, అంగాన్వాడీ కేంద్రాల నిర్వహణ సమయాల్లో మార్పులు చేయడం ద్వారా కేంద్రాల పనితీరు మా రుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మధ్యాహ్నం వరకే విధు లు నిర్వహించే ఆయాలు, కార్యకర్తలు ఇప్పుడు పూర్తిస్థాయిలో పనిచేస్తారని పేర్కొంటున్నారు. కేంద్రాల నిర్వహణ పాఠశాలల మాదిరిగా మారనుండటంతో పిల్లలకు న్యాయం జరగనుంది. ప్రభుత్వ నిర్ణయంపై పిల్లలతల్లిదండ్రులు ఆనందంగా ఉన్నారు.