ఉట్నూర్, న్యూస్‌లైన్ : అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు కేంద్రాల నిర్వహణ సమయం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు ఉండేది. వేళల్లో మార్పు చేస్తూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పొడిగించింది. అంతేకాకుండా అంగన్‌వాడీ కార్యకర్తలకు గౌరవ వేతనం రూ. 500, ఆయాలకు రూ.250 పెంచుతూ స్త్రీ, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
జిల్లాలో 15 ఐసీడీఎస్ ప్రాజెక్టులు మహిళాభివృద్ధి శిశు, సంక్షేమ శాఖ అధీనంలో పనిచేస్తున్నాయి. వీటి పరిధిలో 3,570 మెయిన్, 798 మినీ అంగన్‌వా డీ కేంద్రాలున్నాయి. 0-6 ఏళ్ల పిల్లలకు పోషకాహారంతోపాటు గుణాత్మక విద్య అందించడం, అమృతహస్తం పథకం కింద బా లింతలకు, గర్భిణులకు పోషక ఆహారం అందించడం ఈ కేం ద్రాల లక్ష్యం. తాజాగా సమయం పెంచడం ద్వారా కార్యకర్తలు, ఆయాలకు పూర్తిస్థాయిలో పనిదొరకడంతోపాటు పోషకాహారం కూడా పూర్తిస్థాయిలో అందుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
పెరిగిన పనిభారం : ఇంతవరకు అంగన్‌వాడీ కార్యకర్తలకు గౌరవ వేతనంగా రూ.3700, ఆయాలకు రూ.1,950 ప్రభుత్వం చెల్లిస్తోంది. కార్యకర్తలకు రూ.500 పెండంతో రూ.4,200, ఆ యాలకు రూ.200 పెంచడంతో రూ. 2,200 అవుతున్నాయి. ఇం తకుముందు సమయం తక్కువగా ఉండటతో వేరే పనిచేసుకునే వారమని, ఇప్పుడు సమయం పెంచడంతో వేరే పనిచేసుకునే అ వకాశం లేదని కార్యకర్తలు, ఆయాలు పేర్కొంటున్నారు. వేత నం పెంచి ఏం లాభం లేదని వారు వాపోతున్నారు. దీనికితోడు ప్రభుత్వ పథకాల పని తమకే అప్పగిస్తారని, సర్వేలు చేయిస్తూ శ్రమను దోచుకుంటున్నారని అంటున్నారు.
వేతనం పెంచాలని వారు కోరుతున్నారు. కాగా, అంగాన్‌వాడీ కేంద్రాల నిర్వహణ సమయాల్లో మార్పులు చేయడం ద్వారా కేంద్రాల పనితీరు మా రుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మధ్యాహ్నం వరకే విధు లు నిర్వహించే ఆయాలు, కార్యకర్తలు ఇప్పుడు పూర్తిస్థాయిలో పనిచేస్తారని పేర్కొంటున్నారు. కేంద్రాల నిర్వహణ పాఠశాలల మాదిరిగా మారనుండటంతో పిల్లలకు న్యాయం జరగనుంది. ప్రభుత్వ నిర్ణయంపై పిల్లలతల్లిదండ్రులు ఆనందంగా ఉన్నారు.