ఉట్నూర్ : వచ్చె రెండు నెలల్లో మాదిగలు మరో ఉద్యమానికి సిద్ధంగా కావాలని ఏ,బీ,సీ,డీ వర్గీకరణ సాధించడమే ఎమ్మార్పీఎస్ ముందున్న లక్ష్యమని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని స్టార్ ఫంక్షన్ హాల్‌లో జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చె రెండు నెలల్లో క్షేత్రస్థాయి నుంచి గ్రామ, మండల కమిటీలు పూర్తి చేయాలని పిలుపు నిచ్చారు.మాదిగలను ఏకం చేయడానికి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించానని గత నెల 28 నుంచి తెలంగాణ జిల్లాల్లో పర్యటిస్తున్నానన్నారు.
అక్టోబర్ ఒకటి లేదా రెండు తేదీల్లో ఎమ్మార్పీఎస్ జాతీయ సమావేశం రాజమండ్రిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆ రోజు వర్గీకరణకు భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణకు సిద్ధంగా ఉన్నాయన్నారు. వర్గీకరణను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత టీడీపీ, టీఆర్‌ఎస్, బీజేపీలపై ఉందన్నారు. ఎమ్మార్పీఎస్ అంటే బయపడుతున్న సీఎం కేసీఆర్ ఎమ్మార్పీస్‌లో చిలికలు తేవాలని ప్రయత్నాలు తీవ్రంగా చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ తూర్పు, పశ్చిమ జిల్లా అధ్యక్షులు శరత్, శంకర్, ఉట్నూర్ మండల ఇన్‌చార్జి బిరుదుల లాజర్, ఎమ్మెస్పీ జిల్లా అధ్యక్షుడు విజయ్, సమావేశ అధ్యక్షుడు నాతరి రాజు, ఎంపీటీసీ బెరిగెడి మనోహర్, నాయకులు మల్లేశ్, నర్సయ్య, తుకారం, కుటికల ఆశన్న, రజీహైదర్, కేశవ్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ దారిలో పయనిస్తున్న టీఆర్‌ఎస్
మంచిర్యాల టౌన్ : సామాజిక, ఆర్థిక గణన అంటూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ నెల 19న చేపడుతున్న ఒక్కరోజు సర్వే మోసమని, వారం రోజులపాటు సర్వే జరపాలని మహాజన సోషలిస్టు పార్టీ(ఎంఎస్‌పీ) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ తేల్చి చెప్పారు. మంగళవారం మంచిర్యాల ఒడ్డెర కాలనీలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలు, యువకులు, మహిళలు ఎంఎస్‌పీ పార్టీలో చేరగా వారికి మంద కృష్ణమాదిగా పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా బడుగు బలహీన వర్గాలకు అండగా లేకపోయిందని, ఇప్పుడు ఎంఎస్‌పీ మద్దతుగా నిలిచి ప్రజల హక్కులు, సమస్యలపై నిరంతర పోరాటం సాగిస్తుందన్నారు. తెలంగాణలో మొదటి స్వాతంత్య్ర వేడుకలను గోల్కొండ కోటలో నిర్వహించడంపై గడిలో అంటే రాజరిక వ్యవస్థకు శ్రీకారం చుట్టడమేనని అన్నారు. ఈ సంస్కృతిని చూస్తే కాంగ్రెస్ దారిలో టీఆర్‌ఎస్ పార్టీ పయనిస్తుందన్నారు.
కాంగ్రెస్ కుటుంబ పాలనను ఎవ్వరూ ప్రశ్నించే వారు లేక గోల్కొండ కోటపై జాతీయ పతాకాన్ని ఎగురవేయడం చూస్తుంటే ప్రజాస్వామ్య విలువలు పక్కనపెట్టి దొరల పాలన, కేసీఆర్ కుటుంబ పాలనలా మారేలా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్‌పీ, ఎమ్మార్పీఎస్ నాయకులు గోడిసెల దశరథం, చుంచు శంకర్‌వర్మ, బోయ రంజిత్‌కుమార్, కొట్నాక విజయ్, శరత్ పాల్గొన్నారు.
రెండు నెలల్లో మరో ఉద్యమానికి సిద్ధం కావాలి
Published Wed, Aug 6 2014 12:46 AM | Last Updated on Mon, Oct 8 2018 3:48 PM
Advertisement
Advertisement