తిండిలోనూ కక్కుర్తి.. | menu not followed in community health centres | Sakshi
Sakshi News home page

తిండిలోనూ కక్కుర్తి..

Published Thu, Jul 24 2014 12:20 AM | Last Updated on Sat, Sep 2 2017 10:45 AM

menu not followed in community health centres

ఉట్నూర్ : మండలంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పెట్టే తిండిని పలువురు గద్దల్లా దోచుకెళ్తున్నారు. వైద్యం కోసం వచ్చే రోగులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలనే నిబంధనలు ఉన్నా.. నీళ్ల సాంబార్‌తో పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. భోజనంలో గుడ్డు, అరటిపండు, పెరుగు, కూరగాయలు కనిపించడం లేదు. అదీకాక వైద్యం కోసం వచ్చే రోగి వెంట వచ్చిన మరొకరికి భోజనం పెట్టాలనే నిబంధన ఉన్నా.. ఒకరికే అందిస్తూ దోచుకుంటున్నారు. ఇదీ ఉట్నూర్ పరిధిలోని సీహెచ్‌సీ ఆస్పత్రిలో కొనసాగుతున్న తంతు.

 80 వరకు ఇన్‌పేషెంట్లు..
 సామాజిక ఆరోగ్య కేంద్రంలో నిత్యం 30 నుంచి 80 మంది వరకు ఇన్‌పేషెంట్లు ఉంటారు. సమస్యాత్మక మండలాల్లో నివాసం ఉండే గిరిజనులకు సీహెచ్‌సీనే పెద్ద దిక్కు. మండల వాసులే కాకుండా సిర్పూర్(యు), ఇంద్రవెల్లి, నార్నూర్, జైనూర్ మండలాలకు చెందిన గిరిజనులు ఇక్కడికి వైద్యం కోసం వస్తుంటారు. అలా వచ్చిన వారిలో ఇన్‌పేషెంట్లుగా ఉండే రోగికి, వెంబడి వచ్చే మరొకరికి ప్రభుత్వం భోజన వసతి కల్పిస్తోంది. ఇందుకు భోజనం వడ్డించే నిర్వాహకుడికి ఒక్కరికి ప్రభుత్వం రోజుకు రూ.45 చొప్పున చెల్లిస్తోంది.

 జరుగుతోందిదీ..
 సీహెచ్‌సీలో నిత్యం అన్నం, నీళ్ల సాంబారే పెడుతున్నారని రో గులు వాపోతున్నారు. మెనూ ప్రకారం ఉదయం అల్పాహారం కింద కప్పు టీ, 50 గ్రాముల పాలు, 100 గ్రాముల బ్రెడ్‌తోపా టు ఇడ్లీ, కిచిడి, ఉప్మా, పొంగల్ ఇలా ఏదో ఒకటి వడ్డించాలి. కానీ.. రోజూ నీళ్ల పాటు, బ్రెడ్ మాత్రమే ఇస్తున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇడ్లీ, ఉప్మా, కిచిడి వారంలో రెండు లేదా మూడు సార్లు మాత్రమే అందిస్తున్నారని చెబుతున్నారు. ఇక మధ్యాహ్న బోజనం పుల్కలు, ఉడికిన అన్నం, కూరగాయలతో చేసిన కూర, సాంబార్, ఉడకబెట్టిన గుడ్డు, 200 మిల్లీలీటర్ల పెరుగు, అరటి పండు ఇవ్వాల్సి ఉంది. కేవలం అ న్నం, నీళ్ల సాంబార్ ఇస్తూ రోగులను పౌష్టికాహారానికి దూరం చేస్తున్నారు. గుడ్డు అదివారం మాత్రమే పెడుతున్నారు. ఇదే భోజనాన్ని గర్భిణులు, అన్ని రకాల రోగులకు అందిస్తున్నారు.

 పెట్టెది ఒక్కరికి.. పొందేది ఇద్దరి బిల్లులు..
 ప్రభుత్వం ఒకరికి రోజుకు రూ.45 చెల్లిస్తుండగా.. నిర్వాహకులు ఒకరికి మాత్రమే భోజనం పెడుతున్నారు. కానీ.. బిల్లు లో మాత్రం రోజు వారి ఐపీ సంఖ్య, వారి వెంట వచ్చే వారి సంఖ్యతోపాటుగా బిల్లులు కాజేస్తున్నట్లు సమాచారం. ఇలా నెలకు వేలాది రూపాయాలు దోచుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా.. దీనిపై నిర్వాహకుడు ఖానాపూర్‌కు చెందిన లాలా వివరణ కోసం ఫోన్‌లో ప్రయత్నించగా.. ఆయన ఏం సమాధానం ఇవ్వకుండానే కట్ చేశారు.  

 పర్యవేక్షణ కరువు...
 సీహెచ్‌సీకి పూర్తిస్థాయి మెడికల్ సూపరింటెండెంట్ లేకపోవడంతో ఆస్పత్రిపై పర్యవేక్షణ కొరవడింది. దీంతో రోగులకు మెనూ ప్రకారం భోజనం అందడం లేదు. ఇలాంటి భోజనం తింటే రోగాలకు తోడు కొత్త రోగాలు తయారవుతారని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోగులకు సరైన భోజనం అందేలా చూడాలని కోరుతున్నారు. ఈ విషయమై ఇన్‌చార్జి డీసీహెచ్ చంద్రమౌళి స్పందిస్తూ సీహెచ్‌సీని సందర్శించి విచారణ చేపడుతామని, మెనూ ప్రకారం పెట్టకుంటే కాంట్రాక్ట్ తీసుకున్న భోజన నిర్వాహకునిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement