Lunch menu
-
మెనూ మారింది.. రుచి అదిరింది
కడప ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పేరుతో పోషక విలువలతో కూడిన భోజనాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకున్నప్పుడే విద్యార్థులు ఆరోగ్యంగా ఉండి చదువులో కూడా రాణిస్తారనే ఉద్దేశంతో రోజుకో మెనూతో విద్యార్థులకు గోరుముద్దను అమలు చేస్తోంది. ఈ కొత్త మెనూను ఈ నెల 12 నుంచి జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో అమలు చేస్తున్నారు. గతంకంటే రెట్టింపు ఉత్సాహంతో విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని తింటున్నారు. . ఇటీవలే వంట ఏజెన్సీలకు కూడా ప్రభుత్వం బిల్లులు పెంచింది. దీంతో విద్యా ర్థులతోపాటు ఏజెన్సీల నిర్వాహకులు కూడా ఉత్సా హంగా ఉన్నారు. అలాగే గతంలో నెలకు మూడు సార్లు కోడిగుడ్లను సరఫరా చేసేవారు. దీంతో కొన్ని చోట్ల గుడ్లు చెడిపోయేవి. ఫలితంగా విద్యార్థులు తినేందుకు ఇబ్బందులు పడేవారు. దానిని కూడా గమనించిన ప్రభుత్వం వాటికి చెక్ పెడుతూ నెలకు నాలుగు సార్లు గుడ్ల సరఫరాకు చర్యలు తీసుకుంది. దీంతోపాటు ఏ వారంలో ఏ రంగు ఉన్న గుడ్లను వాడాలో కూడా గుడ్లపై స్టాంప్‌ను ముద్రించి సరఫరా చేస్తున్నారు. 2,048 పాఠశాలల్లో.. జిల్లాలోని 2,048 పాఠశాలల్లో 1,48,804 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. అందులో 1621 ప్రాథమిక పాఠశాలల్లో 77,357 మంది, 171 ప్రా«థమికోన్నత పాఠశాలల్లో 43,611 మంది, 256 ఉన్నత పాఠశాలల్లో 27,836 మంది విద్యాభ్యాసం చేస్తున్నారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఒక్కొక్క విద్యార్థికి రూ. 5.45, ప్రాథమికోన్నత పాఠశాల, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. రూ.8.17 ఇస్తున్నారు. దీంతో మధ్యాహ్న భోజనం ఏజెన్సీ నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల రుచులకు అనుగుణంగా.. జగనన్న గోరుముద్దలో భాగంగా మధ్యాహ్న భోజనం పథకంపై పిల్లల నుంచి ఎప్పటికప్పుడు విద్యాశాఖ అభిప్రాయాలు సేకరిస్తోంది. విద్యార్థుల రుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మోనూను మారుస్తున్నారు. సాంబర్‌బాత్‌ను ఈ ప్రాంత విద్యార్థులు సరిగా తినడం లేదని తెలిసి దాని స్థానంలో నిమ్మకాయ పులిహోర(చిత్రాన్నం) చేర్చారు. వారంలో 5 రోజులు కోడిగుడ్లు: విద్యార్థులకు కోడిగుడ్డును వారంలో ఐదు రోజులు అందిస్తున్నారు. తాజా మార్గదర్శకాల ప్రకారం నెలలో సరఫరా చేసే గుడ్డుపై వారానికో రంగుతో గుడ్డుపై స్టాంపింగ్ చేస్తున్నారు. మొదటివారం నీలం, రెండవవారం గులాబీ, మూడవ వారం ఆకుపచ్చ, నాలుగోవారం వంగపూత రంగులో స్టాంపింగ్ చేసేలా చర్యలు తీసుకున్నారు. నెలలో ఏవారం సరఫరా అయిన గుడ్లు అదే వారంలోనే వినియోగించాలి. ఒక వేళ పాఠశాల పనిదినాల్లో సెలవులు వచ్చినా లేదా ఇతర కారణాలతో గుడ్లు మిగిలినా వాటిని తర్వాత వారంలో వినియోగించరాదు. రుచిగా ఉంటుంది మధ్యాహ్న భోజనం చాలా రుచిగా ఉంటుంది. వారంలో ఐదు రోజులు కోడిగుడ్లు ఇస్తారు. రోజు ఒక కూరతోపాటు కోడిగుడ్డు కూడా ఉంటుంది. కనుక అన్నం బాగా తింటున్నాం. – ఉజ్వల, 10వ తరగతి విద్యార్థి రోజూ తింటున్నాం గతంలో మధ్యాహ్న భోజనం సరిగా తినేవాళ్లం కాదు. ఇప్పుడు చాలా బాగా ఉంటోంది. రోజు కచ్చితంగా భోజనాన్ని తింటున్నాము. రోజూ ఒక మెనూను పెడతారు. దాంతోపాటు రుచిగా కూడా ఉంటుంది. – నవనీత్, 10వ తరగతి విద్యార్థి 12 నుంచి కొత్త మెనూ రాష్ట్ర ప్రభుత్వం జగనన్న గోరుముద్దకు సంబంధించిన కొత్త మెనూను ప్రకటించింది. ఈ మెనూను ఈ నెల 12వ తేదీ నుంచి అన్ని పాఠశాలల్లో అమలు చేస్తున్నారు. పిల్లలకు అవసరమైన పోషక విలువలు అందించే విధంగా గోరుముద్ద మోనూ అమలుకు శ్రీకారం చుట్టారు. విద్యార్థులకు పోషకాలు కలిగిన ఆహారాన్ని అందించాలనే లక్ష్యంగా జగనన్న గోరుముద్ద అమలు చేస్తున్నాం. – చెప్పలి దేవరాజు, జిల్లా విద్యాశాఖ అధికారి -
Ind vs Sa: చెట్టినాడ్ చికెన్, బ్రకోలీ సూప్.. ఫొటో వైరల్! ఏంటయ్యా నీ తిండి గోల!
Ind vs Sa 1st Test: Indian Players Lunch Menu On Day 2 Photo Goes Viral: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా రెండో రోజు టీమిండియా బ్యాటర్ల మెరుపులు చూడాలని భావించిన అభిమానులకు నిరాశ మిగిలిన సంగతి తెలిసిందే. లంచ్ బ్రేక్ తర్వాత అయినా మ్యాచ్ మొదలవుతుందని ఎదురుచూసిన వాళ్ల ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. ఈ క్రమంలో వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే సోమవారం నాటి ఆటను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో టీవీల ముందు కూర్చున్న వీరాభిమానులకు భంగపాటు తప్పలేదు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా తమదైన శైలిలో కామెంట్లు చేశారు . ‘‘ప్చ్.. మనోళ్లు మంచిగా ఆడుతున్నారని వరుణుడు పగపట్టాడేమో! పదే పదే ఆటంకం కలిగించాడు. రాహుల్ క్లాసిక్ ఇన్నింగ్స్ కొనసాగుతుందా లేదా చూడాలంటే.. మరుసటి రోజు దాకా వెయిట్ చేయాల్సిందే’’అంటూ ఉసూరుమన్నారు. ఇదిలా ఉంటే.. మఫద్దాల్ వోహ్రా అనే వ్యక్తి.. ఓ ఆసక్తికర పోస్టుతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించాడు. రెండో రోజు టీమిండియా లంచ్ మెనూకు సంబంధించిన ఫొటోను షేర్ చేశారు. ఇక ఈ ట్వీట్‌పై నెటిజన్లు తమకు తోచిన రీతిలో కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఆట వర్షార్పణమైందని మేము బాధపడుతుంటే.. నీ గోల ఏంటయ్యా. వాళ్లేం తిన్నారు... ఎలా తిన్నారు.. ఇదంతా అవసరమా’’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ టీమిండియా ఆటగాళ్ల మెనూలో ఉన్న ఆహారపదార్థాలు ఏమిటంటే.. చెట్టినాడ్ చికెన్, బ్రకోలీ సూప్, వెజిటబుల్ కడాయి, పనీర్ టిక్కా తదితరాలు. కాగా తొలిరోజు ఆట ముగిసే సరికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 272 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. కేఎల్ రాహుల్ క్లాసిక్ సెంచరీతో ఆకట్టుకోగా.. రహానే అర్ధ సెంచరీకి చేరువగా ఉన్నాడు. మంగళవారం కూడా వర్షం పడినట్లయితే... మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. చదవండి: KL Rahul: భారత వన్డే జట్టు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్! Day 2 Lunch menu for team India. pic.twitter.com/lXFuVTd1oT — Mufaddal Vohra (@mufaddal_vohra) December 27, 2021 Unfortunately, due to the large volume of rain today at Centurion, play has been called off for the day. #SAvIND pic.twitter.com/NQ5Jbc8MlJ — BCCI (@BCCI) December 27, 2021 -
వైరల్: ఈ లంచ్ బాక్స్ చూస్తే కన్నీళ్లు ఆగవు
కౌలలాంపూర్: నేటికి కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ లేని స్థితిలో బతుకీడుస్తున్నారు అనేది అక్షర సత్యం. ఓ వైపు కొందరు తినలేక ఆహారాన్ని వృధా చేస్తుంటే.. మరి కొందరు చాలినంత తిండిలేక ఆకలితో కృశించి మరణిస్తున్నారు. 21వ శతాబ్దంలో కూడా ఆకలి చావులు ఉండటం నిజంగా సిగ్గు చేటు. ఈ కోవకు చెందిన ఫోటో ఒకటి తాజాగా ఫేస్బుక్లో వైరలవుతోంది. దీని చూసిన వారంతా పాపం.. అంటూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు.. మలేషియాకు చెందిన అపిత్ లిడ్ అనే ఫేస్బుక్ యూజర్ తన అకౌంట్లో షేర్ చేసిన ఈ ఫోటోలో సెక్యూరిటీ గార్డ్ డ్రెస్ ధరించిన ఓ వ్యక్తి లంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక అతడి బాక్స్‌లో నీటిలో కలిపిన అన్నం.. ఓ ఉల్లిపాయ.. మూడు వెల్లుల్లి పాయలు మాత్రమే ఉన్నాయి. కూర, రసం, పెరుగులాంవంటివి ఏవి లేవు. అన్నాన్ని నీళ్లలో కలుపుకుని.. ఉల్లిపాయ, వెల్లుల్లి పాయ నంజుకుని తింటాడు. ఈ ఫోటోతో పాటు అతడికి సంబంధించిన వివరాలను షేర్ చేశారు అపిత్ లిడ్. ‘‘ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి నా స్నేహితుడు. చాలా కష్టపడి పని చేస్తాడు. ప్రస్తుతం కుటుంబానికి దూరంగా వేరే ప్రదేశంలో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేస్తున్నాడు. తన జీతంలో అత్యధిక భాగం కుటుంబానికే పంపిస్తాడు. చాలా తక్కువ మొత్తం తనకోసం ఉంచుకుంటాడు. అలా మిగుల్చుకున్న డబ్బులో ఇలాంటి భోజనం చేస్తాడు. ప్రతి రోజు ఇదే అతడి ఆహారం. దీని గురించి అతడు బాధపడడు. తన భోజనాన్ని ఎంతో ప్రేమిస్తాడు’’ అంటూ చెప్పుకొచ్చిన ఈ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇప్పటికే ఆరు వేల మంది ఈ స్టోరిని షేర్ చేశారు. ‘‘ఇతడి పరిస్థితి చూస్తే.. చాలా బాధగా ఉంది..ఇలాంటి ఆహారం తీసుకుంటే అనారోగ్యం పాలవుతావు’’.. ‘‘ఇతడికి సాయం చేయండి’’.. ‘‘ఇతడి జీవితం మనకు ఓ పాఠం నేర్పుతుంది’’.. ‘‘ఉన్నంతలో సర్దుకుపోయే నీ తత్వానికి గ్రేట్.. నీకు మంచి జరుగుతుంది’’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. చదవండి: వైరల్: చేప కడుపులో 10 కేజీల ప్లాస్టిక్ బ్యాగ్ -
రూ. 88 లక్షలు పలికిన మెనూ కార్డు
న్యూయార్క్: 'టైటానిక్' లంచ్ మెనూ కార్డు ఒకటి భారీ ధరకు అమ్ముడు పోయింది. లియన్ హార్ట్ ఆటోగ్రాఫ్స్ నిర్వహించిన ఆన్ లైన్ వేలంలో దాదాపు రూ. 88 లక్షలు పలికింది. ముందుగా ఊహించిన దానికంటే ఎక్కువ ధర పలకడం విశేషం. టైటానిక్ ఓడలో ఫస్ట్ క్లాస్ లో ప్రయాణించిన అబ్రహం లింకన్ సాల్మన్ అనే వ్యక్తి దీన్ని భద్రపరిచాడని లియన్ హార్ట్ ఆటోగ్రాఫ్స్ తెలిపింది. దీనిపై 1912, ఏప్రిల్ 14 తేదీ స్టాంపుతోపాటు వైట్ స్టార్ లినె లోగో ఉంది. గ్రిల్లెడ్ మటన్ చాప్స్, కస్టర్డ్ పుడ్డింగ్, కార్నెడ్ బీఫ్, బ్యాకెడ్ జాకెట్ పొటాటోస్, బఫెట్ ఆఫ్ ఫిష్, హామ్ అండ్ బీఫ్, యాపిల్ పెస్ట్రీతో పాటు 8 రకాల చీజ్ ఐటెమ్స్ వివరాలు మెనూలో ఉన్నాయి. 3 లేదా 4 టైటానిక్ మెనూ కార్డులు మాత్రమే ప్రస్తుతం మనుగడలో ఉన్నాయి. టైటానిక్ ప్రమాదం నుంచి బయట పడిన వారు వీటిని భద్రపరిచారు. అట్లాంటిక్ మహా సముద్రంలో మంచు పర్వతాన్ని ఢీకొని టైటానిక్ ఓడ మునిగిపోయింది. 1912, ఏప్రిల్ 15న జరిగిన ఈ దుర్ఘటనలో 1500 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. -
తిండిలోనూ కక్కుర్తి..
ఉట్నూర్ : మండలంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పెట్టే తిండిని పలువురు గద్దల్లా దోచుకెళ్తున్నారు. వైద్యం కోసం వచ్చే రోగులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలనే నిబంధనలు ఉన్నా.. నీళ్ల సాంబార్‌తో పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. భోజనంలో గుడ్డు, అరటిపండు, పెరుగు, కూరగాయలు కనిపించడం లేదు. అదీకాక వైద్యం కోసం వచ్చే రోగి వెంట వచ్చిన మరొకరికి భోజనం పెట్టాలనే నిబంధన ఉన్నా.. ఒకరికే అందిస్తూ దోచుకుంటున్నారు. ఇదీ ఉట్నూర్ పరిధిలోని సీహెచ్‌సీ ఆస్పత్రిలో కొనసాగుతున్న తంతు. 80 వరకు ఇన్‌పేషెంట్లు.. సామాజిక ఆరోగ్య కేంద్రంలో నిత్యం 30 నుంచి 80 మంది వరకు ఇన్‌పేషెంట్లు ఉంటారు. సమస్యాత్మక మండలాల్లో నివాసం ఉండే గిరిజనులకు సీహెచ్సీనే పెద్ద దిక్కు. మండల వాసులే కాకుండా సిర్పూర్(యు), ఇంద్రవెల్లి, నార్నూర్, జైనూర్ మండలాలకు చెందిన గిరిజనులు ఇక్కడికి వైద్యం కోసం వస్తుంటారు. అలా వచ్చిన వారిలో ఇన్పేషెంట్లుగా ఉండే రోగికి, వెంబడి వచ్చే మరొకరికి ప్రభుత్వం భోజన వసతి కల్పిస్తోంది. ఇందుకు భోజనం వడ్డించే నిర్వాహకుడికి ఒక్కరికి ప్రభుత్వం రోజుకు రూ.45 చొప్పున చెల్లిస్తోంది. జరుగుతోందిదీ.. సీహెచ్‌సీలో నిత్యం అన్నం, నీళ్ల సాంబారే పెడుతున్నారని రో గులు వాపోతున్నారు. మెనూ ప్రకారం ఉదయం అల్పాహారం కింద కప్పు టీ, 50 గ్రాముల పాలు, 100 గ్రాముల బ్రెడ్తోపా టు ఇడ్లీ, కిచిడి, ఉప్మా, పొంగల్ ఇలా ఏదో ఒకటి వడ్డించాలి. కానీ.. రోజూ నీళ్ల పాటు, బ్రెడ్ మాత్రమే ఇస్తున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇడ్లీ, ఉప్మా, కిచిడి వారంలో రెండు లేదా మూడు సార్లు మాత్రమే అందిస్తున్నారని చెబుతున్నారు. ఇక మధ్యాహ్న బోజనం పుల్కలు, ఉడికిన అన్నం, కూరగాయలతో చేసిన కూర, సాంబార్, ఉడకబెట్టిన గుడ్డు, 200 మిల్లీలీటర్ల పెరుగు, అరటి పండు ఇవ్వాల్సి ఉంది. కేవలం అ న్నం, నీళ్ల సాంబార్ ఇస్తూ రోగులను పౌష్టికాహారానికి దూరం చేస్తున్నారు. గుడ్డు అదివారం మాత్రమే పెడుతున్నారు. ఇదే భోజనాన్ని గర్భిణులు, అన్ని రకాల రోగులకు అందిస్తున్నారు. పెట్టెది ఒక్కరికి.. పొందేది ఇద్దరి బిల్లులు.. ప్రభుత్వం ఒకరికి రోజుకు రూ.45 చెల్లిస్తుండగా.. నిర్వాహకులు ఒకరికి మాత్రమే భోజనం పెడుతున్నారు. కానీ.. బిల్లు లో మాత్రం రోజు వారి ఐపీ సంఖ్య, వారి వెంట వచ్చే వారి సంఖ్యతోపాటుగా బిల్లులు కాజేస్తున్నట్లు సమాచారం. ఇలా నెలకు వేలాది రూపాయాలు దోచుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా.. దీనిపై నిర్వాహకుడు ఖానాపూర్‌కు చెందిన లాలా వివరణ కోసం ఫోన్లో ప్రయత్నించగా.. ఆయన ఏం సమాధానం ఇవ్వకుండానే కట్ చేశారు. పర్యవేక్షణ కరువు... సీహెచ్‌సీకి పూర్తిస్థాయి మెడికల్ సూపరింటెండెంట్ లేకపోవడంతో ఆస్పత్రిపై పర్యవేక్షణ కొరవడింది. దీంతో రోగులకు మెనూ ప్రకారం భోజనం అందడం లేదు. ఇలాంటి భోజనం తింటే రోగాలకు తోడు కొత్త రోగాలు తయారవుతారని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోగులకు సరైన భోజనం అందేలా చూడాలని కోరుతున్నారు. ఈ విషయమై ఇన్చార్జి డీసీహెచ్ చంద్రమౌళి స్పందిస్తూ సీహెచ్‌సీని సందర్శించి విచారణ చేపడుతామని, మెనూ ప్రకారం పెట్టకుంటే కాంట్రాక్ట్ తీసుకున్న భోజన నిర్వాహకునిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు.