మెనూ మారింది.. రుచి అదిరింది | Changed Lunch Menu In Andhra Pradesh Govt Schools | Sakshi
Sakshi News home page

మెనూ మారింది.. రుచి అదిరింది

Published Thu, Jan 26 2023 5:21 PM | Last Updated on Thu, Jan 26 2023 5:43 PM

Changed Lunch Menu In Andhra Pradesh Govt Schools - Sakshi

కడప ఎడ్యుకేషన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పేరుతో పోషక విలువలతో కూడిన భోజనాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకున్నప్పుడే విద్యార్థులు ఆరోగ్యంగా ఉండి చదువులో కూడా రాణిస్తారనే ఉద్దేశంతో రోజుకో మెనూతో విద్యార్థులకు గోరుముద్దను అమలు చేస్తోంది.

ఈ కొత్త మెనూను ఈ నెల 12 నుంచి జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో అమలు చేస్తున్నారు. గతంకంటే రెట్టింపు ఉత్సాహంతో విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని తింటున్నారు. . ఇటీవలే వంట ఏజెన్సీలకు కూడా ప్రభుత్వం బిల్లులు పెంచింది. దీంతో విద్యా ర్థులతోపాటు ఏజెన్సీల నిర్వాహకులు కూడా ఉత్సా హంగా ఉన్నారు.

అలాగే గతంలో నెలకు మూడు సార్లు కోడిగుడ్లను సరఫరా చేసేవారు. దీంతో కొన్ని చోట్ల గుడ్లు చెడిపోయేవి. ఫలితంగా విద్యార్థులు తినేందుకు ఇబ్బందులు పడేవారు. దానిని కూడా గమనించిన ప్రభుత్వం వాటికి చెక్‌ పెడుతూ నెలకు నాలుగు సార్లు గుడ్ల సరఫరాకు చర్యలు తీసుకుంది. దీంతోపాటు ఏ వారంలో ఏ రంగు ఉన్న గుడ్లను వాడాలో కూడా గుడ్లపై స్టాంప్‌ను ముద్రించి సరఫరా చేస్తున్నారు.   

2,048 పాఠశాలల్లో..  
జిల్లాలోని 2,048 పాఠశాలల్లో 1,48,804 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. అందులో 1621 ప్రాథమిక పాఠశాలల్లో 77,357 మంది, 171 ప్రా«థమికోన్నత పాఠశాలల్లో 43,611 మంది, 256 ఉన్నత పాఠశాలల్లో 27,836 మంది విద్యాభ్యాసం చేస్తున్నారు. ప్రాథమిక పాఠశాల  విద్యార్థులకు ఒక్కొక్క విద్యార్థికి రూ. 5.45, ప్రాథమికోన్నత పాఠశాల, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. రూ.8.17 ఇస్తున్నారు. దీంతో మధ్యాహ్న భోజనం ఏజెన్సీ నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

విద్యార్థుల రుచులకు అనుగుణంగా..  
జగనన్న గోరుముద్దలో భాగంగా మధ్యాహ్న భోజనం పథకంపై పిల్లల నుంచి ఎప్పటికప్పుడు విద్యాశాఖ అభిప్రాయాలు సేకరిస్తోంది. విద్యార్థుల రుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మోనూను మారుస్తున్నారు. సాంబర్‌బాత్‌ను ఈ ప్రాంత విద్యార్థులు సరిగా తినడం లేదని తెలిసి దాని స్థానంలో నిమ్మకాయ పులిహోర(చిత్రాన్నం) చేర్చారు.   

వారంలో 5 రోజులు కోడిగుడ్లు: విద్యార్థులకు కోడిగుడ్డును వారంలో ఐదు రోజులు అందిస్తున్నారు. తాజా మార్గదర్శకాల ప్రకారం నెలలో సరఫరా చేసే గుడ్డుపై వారానికో రంగుతో గుడ్డుపై స్టాంపింగ్‌ చేస్తున్నారు. మొదటివారం నీలం, రెండవవారం గులాబీ, మూడవ వారం ఆకుపచ్చ, నాలుగోవారం వంగపూత రంగులో స్టాంపింగ్‌ చేసేలా చర్యలు తీసుకున్నారు. నెలలో ఏవారం సరఫరా అయిన గుడ్లు అదే వారంలోనే వినియోగించాలి. ఒక వేళ పాఠశాల పనిదినాల్లో సెలవులు వచ్చినా లేదా ఇతర కారణాలతో గుడ్లు మిగిలినా వాటిని తర్వాత వారంలో వినియోగించరాదు.  

రుచిగా ఉంటుంది  
మధ్యాహ్న భోజనం చాలా రుచిగా ఉంటుంది. వారంలో ఐదు రోజులు కోడిగుడ్లు ఇస్తారు. రోజు ఒక కూరతోపాటు కోడిగుడ్డు కూడా ఉంటుంది. కనుక అన్నం బాగా తింటున్నాం.  
 –  ఉజ్వల, 10వ తరగతి విద్యార్థి

రోజూ తింటున్నాం  
గతంలో మధ్యాహ్న భోజనం సరిగా తినేవాళ్లం కాదు. ఇప్పుడు చాలా బాగా ఉంటోంది. రోజు కచ్చితంగా భోజనాన్ని తింటున్నాము. రోజూ ఒక మెనూను పెడతారు. దాంతోపాటు రుచిగా కూడా ఉంటుంది.   
 – నవనీత్, 10వ తరగతి విద్యార్థి

12 నుంచి కొత్త మెనూ  
రాష్ట్ర ప్రభుత్వం జగనన్న గోరుముద్దకు సంబంధించిన కొత్త మెనూను ప్రకటించింది. ఈ మెనూను  ఈ నెల 12వ తేదీ నుంచి అన్ని పాఠశాలల్లో అమలు చేస్తున్నారు. పిల్లలకు అవసరమైన పోషక విలువలు అందించే విధంగా గోరుముద్ద మోనూ అమలుకు శ్రీకారం చుట్టారు. విద్యార్థులకు  పోషకాలు కలిగిన ఆహారాన్ని అందించాలనే లక్ష్యంగా జగనన్న గోరుముద్ద అమలు చేస్తున్నాం.      
– చెప్పలి దేవరాజు, జిల్లా విద్యాశాఖ అధికారి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement