
రాయలసీమలో తొలిసారి వెలుగులోకి..
అక్కదేవతల కొండపై 15 శాసనాలు
నిత్యపూజకోన నుంచి గోపాలస్వామికోన అటవీ మార్గంలో గుర్తింపు
బి.కొత్తకోట : వైఎస్సార్ జిల్లా సిద్దవటం అటవీ రేంజ్ పరిధిలోని శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యంలో భారతీయ పురావస్తుశాఖ బృందం రెండో రోజు శుక్రవారం జరిపిన పరిశీలనల్లో 15 లేబుల్ శాసనాలు (పేర్లతో చెక్కిన శాసనాలు) లభ్యమయ్యాయి. ఇవి అరుదైన శంఖులిపి శాసనాలుగా గుర్తించగా అందులో ఒకటి మాత్రం బ్రాహ్మిలిపిలో ఉంది.
ఈ శంఖు లిపి శాసనాలు రాయలసీమలో వెలుగులోకి రావడం ఇదే తొలిసారి కావడం పురావస్తుశాఖ బృందానికి ఆశ్చర్యం కలిగించింది. లభ్యమైన శాసనాలు చెక్కిన చోటును పరిశీలిస్తే రెండు ప్రముఖ శైవ క్షేత్రాల మధ్య అప్పటి తీర్థ యాత్రికుల ప్రాచీన యాత్రా మార్గంగా కనిపిస్తోందని నిర్ధారించారు.
అన్నీ శంఖులిపి శాసనాలే..
సిద్దవటం నుంచి నిత్యపూజకోన ఆలయానికి సమీపంలో అక్కదేవతల ఆలయం ఉంది. రెండు వాగుల ప్రవాహం కలిసే చోటు ఉన్న కొండ నిటారుగా ఉంది. పురావస్తుశాఖ బృందానికి చెందిన డైరెక్టర్ మునిరత్నంరెడ్డి, యేసుబాబు, రాఘవేంద్రవర్మ, ఎఫ్ఆర్ఓ కళావతితో పాటు అటవీ, పురావస్తుశాఖ సిబ్బంది అతికష్టం మీద కొండపైకి చేరుకున్నారు. కొండపైనుంచి గోపాలస్వామి కోన ఆలయానికి వెళ్లే మార్గంగా గుర్తించిన ఈ కొండపై దారి వెంబడి 15 శాసనాలను గుర్తించారు. బండలపై చెక్కిన వీటిలో వ్యక్తుల పేర్లు ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.
నడుచుకుంటూ వెళ్లే మార్గంలో ఈ శాసనాలు చెక్కి ఉన్నాయి. నిత్యపూజకోన ఆలయం నుంచి గోపాలస్వామి కోన ఆలయానికి వెళ్లే ఈ మార్గం 9 కిలోమీటర్ల దూరం ఉంటుంది. లభ్యమైన శాసనాల్లో ఒక రాతి బండపై 4వ శతాబ్దానికి చెందిన బ్రహ్మిలిపిలో చంద్రహాస అని ఒక పేరు, దాని పక్కనే ఆరో శతాబ్దానికి చెందిన శంఖులిపిలో మరో పేరు చెక్కి ఉంది. 6వ శతాబ్దం నుంచి సిద్దమాతృ లిపి పరిణామ క్రమంలో ఈ శంఖు లిపి మొదలైంది.
దెబ్బతిన్న అక్షరాలు
శంఖులిపితో లభ్యమైన 14 శాసనాల్లో కొన్నింటి విశ్లేషణ పురావస్తుశాఖ అధికారులకు కొంత క్లిష్టంగా మారింది. కళాత్మక రీతిలో చెక్కిన ఈ పేర్లకు సంబంధించి మధ్యలో ఒక్కో చోట ఒక్కో అక్షరం దెబ్బతింది. దీన్ని విశ్లేషించాలంటే అర్థాలు మారిపోయే అవకాశం ఉంది. దీనితో పూర్తిగా అ«ధ్యయనం చేశాక విశ్లేషించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
మార్గంలో ఎన్నో శాసనాలు
ఉత్తర భారతానికి చెందిన తీర్థ యాత్రికులు నిత్యపూజకోన–గోపాలస్వామి కోన మధ్య దట్టమైన రిజర్వు ఫారెస్టు అయిన శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యంలో రాకపోకలు సాగించినట్లు ఇప్పటికే నిర్ధారణ అయింది. అక్కదేవతల కొండపై లభించిన 15 శాసనాలతోపాటు అదే మార్గంలో ఊహించని విధంగా ఎన్నో శాసనాలు వెలుగుచూసే అవకాశం ఉందని భావిస్తున్నారు. 4–6వ శతాబ్దాలకు చెందిన రెండు శాసనాలు ఒకే బండపై చెక్కి ఉన్నాయి.
లోతైన అధ్యయనానికి ఆధారం
శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యంలో 4 నుంచి 16వ శతాబ్దం వరకు మానవ మనుగడ, లిపి పరిణామ క్రమానికి సంబంధించి లోతైన అధ్యయనానికి ఆధారాలు లభ్యమయ్యాయి. రెండు రోజుల పరిశోధనలో 27 లేబుల్ శాసనాలు వెలుగులోకి వచ్చాయి. వీటిని చెక్కిన మార్గం వెంబడి ఇంకా అన్వేషణ కొనసాగిస్తే చాలా శాసనాలు వెలుగులోకి వస్తాయని అంచనా.
అతి కష్టంతో సేకరణ
పురావస్తుశాఖ, అటవీశాఖ సంయుక్తంగా శుక్రవారం చేపట్టిన శాసనాల సేకరణ అతికష్టంతో జరిగింది. అక్కదేవతల ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలోని కొండపైకి 600 మీటర్లు ఎక్కాల్సి వచ్చింది. ఇది నిటారుగా ఉండటం, దారిలేకపోవడంతో ఎక్కే సమయంలో చిన్న పొరపాటు జరిగినా ప్రమాదం చోటుచేసుకునేది. అక్కడ సెల్‌ఫోన్ సిగ్నల్స్ కూడా లేవు. ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే సమాచారం ఇచ్చేందుకు కూడా వీలు లేదు. ఎంతో సాహసంతో మొత్తంగా 12 కిలోమీటర్ల నడక, కొండ ఎక్కడం ద్వారా ఈ శాసనాలను సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment