ఈ ఇల్లు పాఠాలు నేర్పుతుంది | Five girls To Adilabad District Utnoor Madavi Laxman | Sakshi
Sakshi News home page

ఈ ఇల్లు పాఠాలు నేర్పుతుంది

Published Sat, Oct 19 2024 9:27 AM | Last Updated on Sat, Oct 19 2024 9:28 AM

Five girls To Adilabad District Utnoor Madavi Laxman

తల్లిదండ్రులు మడావి లక్ష్మణ్, కమలాబాయిలతో టీచరు ఉద్యోగం సాధించిన కుమార్తెలు కవిత, దివ్య, కళ్యాణి, టీచర్‌ కావడమే లక్ష్యమంటున్న చిన్నకుమార్తె కృష్ణప్రియ (కుడి చివర) 

‘ఎంత మంది పిల్లలు?’ అనే ప్రశ్న వినిపించినప్పుడల్లా లక్ష్మణ్‌ గుండెల్లో రైళ్లు పరుగెత్తినంత పనయ్యేది. ఎందుకంటే...‘నాకు అయిదుగురు ఆడపిల్లలు’ అనే మాట లక్షణ్‌ నోటినుంచి వినిపించడమే ఆలస్యం ‘అయ్యో!’ అనే అకారణ సానుభూతి వినిపించేది. ‘ఇంట్లో ఒకరిద్దరు ఆడపిల్లలు ఉంటేనే కష్టం. అలాంటిది అయిదుగురు ఆడపిల్లలంటే మాటలా! నీ కోసం చాలా కష్టాలు ఎదురుచూస్తున్నాయి’ అనేవాళ్లు. అయితే వారి పెదవి విరుపు మాటలు, వెక్కిరింపులు తనపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపించలేకపోయాయి. ఈ ఇల్లు పిల్లలకు బడి పాఠాలు చెప్పే ఇల్లే కాదు... ఆడపిల్లల్ని తక్కువ చేసి చూసేవారికి గుణపాఠాలూ చెబుతుంది.

ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌కు చెందిన మడావి లక్ష్మణ్‌ బాల్యమంతా పేదరికంలోనే గడిచింది. ఆదివాసీ తెగకు చెందిన లక్ష్మణ్‌ ప్రభుత్వ ఉపాధ్యాయుడైన తరువాత ఆర్థిక కష్టాలు తీరాయి. లక్ష్మణ్‌– కమలాబాయి దంపతులకు మొదటి సంతానంగా ఆడపిల్ల పుట్టింది.‘ఆడపిల్ల ఇంటికి అదృష్టం’ అన్నారు చుట్టాలు పక్కాలు, పెద్దలు.రెండోసారి ఆడపిల్ల పుట్టింది. వాతావరణంలో కాస్త మార్పు వచ్చింది. ‘మళ్లీ ఆడపిల్లేనా!’ అన్నారు.‘ఇద్దరు పిల్లలు చాలు’ అనుకునే సమయంలో ‘లేదు... లేదు... అబ్బాయి కావాల్సిందే’ అని పట్టుబట్టారు ఇంటి పెద్దలు.

మూడో సారి... అమ్మాయి.  ‘ముత్యాల్లాంటి ముగ్గురు పిల్లలు చాలు’ అనుకునే లోపే....‘అలా ఎలా కుదురుతుంది....అబ్బాయి...’ అనే మాట మళ్లీ ముందుకు వచ్చింది.నాల్గోసారి... అమ్మాయి.‘ఇక చాలు’ అని గట్టిగా అనుకున్నా సరే... పెద్దల ఒత్తిడికి తలవొంచక తప్పలేదు.‘ఆరు నూరైనా ఈసారి కొడుకే’ అన్నారు చాలా నమ్మకంగా పెద్దలు. దేవుడికి గట్టిగా మొక్కుకున్నారు.అయిదోసారి... అమ్మాయి. ‘అయ్యయ్యో’ అనే సానుభూతులు ఆకాశాన్ని అంటాయి. అయితే లక్ష్మణ్, కమలాబాయి దంపతులు ఎప్పుడూ నిరాశపడలేదు. 

ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయినప్పటికీ ఖర్చులకు సరిపడా జీతం రాకపోవడంతో ఖర్చులు పెరిగాయి. ‘ఎంత ఖర్చు అయినా, అప్పు చేసైనా సరే పిల్లలను బాగా చదివించాలి’ అని గట్టిగా నిర్ణయించుకున్నాడు లక్ష్మణ్‌. పిల్లల్ని చదివించడమే కాదు ఆడపిల్లలు అనే వివక్ష ఎక్కడా ప్రదర్శించేవారు కాదు. ఆటల్లో, పాటల్లో వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చేవారు. పిల్లలు బాగా చదువుకోవాలంటే బెత్తం పట్టుకోనక్కర్లేదు. వారికి నాలుగు మంచి మాటలు చెబితే సరిపోతుంది. ఆ మాటే వారికి తిరుగులేని తారకమంత్రం అవుతుంది.

అయిదుగురు పిల్లల్ని కూర్చోపెట్టుకొని ‘‘అమ్మా... మీ నాయిన టీచర్‌. మా నాయినకు మాత్రం చదువు ఒక్క ముక్క కూడా రాదు. నాకు మాత్రం సదువుకోవాలనే బాగా ఇది ఉండే. అయితే మా కుటుంబ పరిస్థితి చూస్తే... ఇంత దీనమైన పరిస్థితుల్లో సదువు అవసరమా అనిపించేది. ఎందుకంటే సదువుకోవాలంటే ఎంతో కొంత డబ్బు కావాలి. ఏ రోజుకు ఆరోజే బువ్వకు కష్టపడే మా దగ్గర డబ్బు ఎక్కడిది! అయినా సరే సదువుకోవాలని గట్టిగా అనుకున్నాను. ఎన్నో కష్టాలు పడ్డాను...’ అని నాన్న చిన్నప్పుడు చెప్పిన మాటలు పిల్లలపై బలమైన ప్రభావాన్ని చూపాయి. వారు చదువును ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. ఆ ఫలితం వృథా పోలేదు.

ఇప్పుడు...రెండో కూతురు కవిత, మూడో కూతురు దివ్య, నాల్గో కూతురు కళ్యాణి ప్రభుత్వ ఉపాధ్యాయులు. చిన్న కూతురు కృష్ణప్రియ కొద్ది మార్కుల తేడాతో టీచర్‌ అయ్యే చాన్స్‌ మిస్‌ అయింది. అక్కలలాగే టీచర్‌ కావాలని కలలు కంటున్న కృష్ణప్రియకు మరోప్రయత్నంలో తన కల నెరవేర్చుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. అప్పుడు ఒకే ఇంట్లో నలుగురు టీచర్‌లు!ఇంటర్‌ వరకు చదివిన పెద్ద కూతురు రత్నకుమారి చెల్లెళ్ల స్ఫూర్తితో పై చదువులు చదవాలనుకుంటోంది. వారిలాగే ఒక విజయాన్ని అందుకోవాలనుకుంటుంది. ఇప్పుడు లక్ష్మణ్‌ను చూసి జనాలు ఏమంటున్నారు? ‘నీకేమయ్యా... ఇంటినిండా టీచర్‌లే!’ ‘మీది టీచర్స్‌ ఫ్యామిలీ’

నాన్న మాటలు
తల్లిదండ్రులు మమ్మల్ని ఎప్పుడూ చిన్నచూపు చూడలేదు. వారి ఆశీర్వాద బలంతోనే టీచర్‌ అయ్యాను. ‘చదువే మన సంపద’ అని నాన్న ఎప్పుడూ చెబుతుండే వాడు. ఆయన మాటలు మనసులో నాటుకు΄ోయాయి.
– కవిత, రెండో కుమార్తె

నేను టీచర్‌... అక్కహెడ్‌మాస్టర్‌
అక్క కవితకు, నాకు ఒకేసారి ఉద్యోగాలు వచ్చాయి. ప్రస్తుతం నేను జైనూర్‌ మండలం జెండాగూడలో ఎస్జీటీగా పనిచేస్తున్నాను. మా స్కూలుకు అక్క కవితనే ప్రధానో΄ాధ్యాయురాలు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన మేము ఇప్పుడు ఒకే బడిలో పనిచేస్తుండటం సంతోషంగా ఉంది.
– దివ్య, మూడో కుమార్తె

ఆరోజు ఎంత సంతోషమో!
మొన్నటి డీఎస్సీలో టీచర్‌ ఉద్యోగం వచ్చింది. ఆదిలాబాద్‌ జిల్లా సిరికొండలో నాకు ΄ోస్టింగ్‌ ఇచ్చారు. మొన్ననే విధుల్లో చేరాను. టీచర్‌గా మొదటి రోజు స్కూల్‌కి వెళ్లినప్పుడు నాకు కలిగిన సంతోషం అంతా ఇంతా కాదు. ‘మా ముగ్గురు పిల్లలు టీచర్‌లే అని ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటాను’ అంటున్నాడు నాన్న.
– కళ్యాణి, నాలుగో కుమార్తె

టీచర్‌ కావడమే నా లక్ష్యం
అక్క కళ్యాణితో కలిసి నేను కూడా మొన్నటి డీఎస్సీ పరీక్ష రాశాను. కొద్ది మార్కుల తేడాతో నాకు ఉద్యోగం చేజారింది. అయితే నా లక్ష్యాన్ని మాత్రం వీడను. ఎలాగైనా టీచర్‌ కొలువు సాధిస్తాను.
– కృష్ణప్రియ, ఐదో కుమార్తె 

– గోడిసెల కృష్ణకాంత్, సాక్షి, ఆదిలాబాద్‌
ఫొటోలు: చింతల అరుణ్‌ రెడ్డి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement