ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, కాగజ్‌నగర్ (ఆదిలాబాద్): సైబర్ నేరగాళ్లు వలలో అమాయకులు మోసపోతూనే ఉన్నారు. పట్టణంలో గురువారం ఓ ఆన్‌లైన్ మోసం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే... పట్టణంలోని పెట్రోల్ పంపు ప్రాంతంలో నివాసముంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఉదయం 9.30గంటల సమయంలో స్మార్ట్‌ఫోన్ ద్వారా సన్‌డైరెక్ట్ రీచార్జ్ చేసే క్రమంలో రెండుసార్లు అయ్యింది. దీంతో ఒక రీచార్జ్ డబ్బులు రీఫండ్ కోసం గుగూల్‌లో సన్ డైరెక్ట్ కష్టమర్ కేర్ నంబరుకు ఫోన్ చేసింది. అందులో రీఫండ్ అనే దానిపై నొక్కింది.
అప్పుడే అవతలి వ్యక్తి హిందీలో మాట్లాడుతూ గుగూల్ పే, ఎనీ డెస్క్ యాప్ ఉందా లేదా అనే దానిపై ఆరా తీయగా గుగూల్ పే ఉందని, ఎనీ డెస్క్ యాప్ లేదని తెలిపింది. ఎనీ డెస్క్ యాప్ డౌన్‌లోడ్ చేయాలని అవతలి వ్యక్తి చెప్పగా బాధితురాలు డౌన్‌లోడ్ చేసుకుంది. గుగూల్ పేలో కట్ అయిన అమౌంట్, మీ సెల్‌ఫోన్ నంబర్ ఆఖరి అయిదు అంకెలు నమోదు చేయాలని అవతలి వ్యక్తి చెప్పగా ఆమె అలా పలుమార్లు ప్రయత్నం చేసినా అమౌంట్ రీఫండ్ కాలేదు.
దీంతో 15 నిమిషాల వ్యవధిలో ఆమె బ్యాంకు ఖాతా నుంచి ఐదుసార్లు మొత్తం రూ.99,655 విత్‌డ్రా అయినట్లు ఫోన్‌కు సమాచారం రావడంతో ఆందోళనకు గురై బ్యాంక్‌కు వెళ్లింది. బ్యాంకులో వివరాలు సేకరించి రాత్రి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఉపాధ్యాయురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ డి.మోహన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment