సాక్షి, మంచిర్యాల(ఆదిలాబాద్): పేదల ఆకలి తీర్చే రేషన్ బియ్యం పంపిణీలో జాప్యం జరుగుతోంది. అధికారుల తీరుతో గందరగోళం ఏర్పడుతోంది. ఈ నెలలో ఒక్కో వినియోగదారుడికి 15కిలోల చొప్పున బియ్యం ఉచితంగా అందించల్సి ఉండగా.. ఇప్పటివరకు పూర్తి స్థాయిలో రేషన్ దుకాణాలకు సరఫరా చేయలేదు. జిల్లాకు తొమ్మిది వేల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం కాగా.. ఎనిమిది వేల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేశారు.
మరో రెండ్రోజుల్లో మిగతా వెయ్యి టన్నులు సరఫరా చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 15వరకు బియ్యం పంపిణీ చేయాల్సి ఉండగా.. సరఫరాలో ఆలస్యం కావడంతో గడువును 22వరకు పొడిగించారు. జిల్లా వ్యా ప్తంగా 70శాతం మాత్రమే బియ్యం పంపిణీ కావడంతో గడువు పెంచే అవకాశం ఉంది. సన్న బియ్యం, దొడ్డు బియ్యం పంపిణీ చేస్తుండడంతో ఎక్కడ సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారో ఆయా దుకాణాల వద్ద వినియోగదారులు బారులు తీరుతున్నారు.
ప్రజలకు అందని సమాచారం
రేషన్ బియ్యం పంపిణీలో గందరగోళానికి తెరదించాల్సిన జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ప్రజలకు ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మూడు రోజుల నుంచి అధికారికంగా ఉన్న ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేసి ఉండడంతో రేషన్ సమస్యలపై ఎవరికి సమాచారం ఇవ్వాలో అర్థం కావడం లేదని డీలర్లు, లబ్ధిదారులు చెబుతున్నారు. జిల్లాలోని రేషన్ దుకాణాలకు బియ్యం జిల్లా పౌరసరఫరాల మేనేజర్ ఆధ్వర్యంలో సరఫరా చేస్తుండగా, వాటి పంపిణీ విధానాన్ని పౌరసరఫరాల శాఖ అధికారి పర్యవేక్షణలో చేపడుతుంటారు. గత నెల వరకు కార్డుదారుల్లోని ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం ఇవ్వగా, ఈ నెలలో ఒక్కో 15 కిలోల చొప్పున ఇస్తున్నారు.
దీంతో ఒక్కో రేషన్ దుకాణానికి మూడింతల బియ్యం అందించాల్సిన అవసరం ఏర్పడింది. జిల్లావ్యాప్తంగా ఏ రేషన్ దుకాణాలకు విడతల వారీగా బియ్యం సరఫరా చేస్తున్నారు.. వచ్చిన బియ్యంలో ఏ బియ్యం సన్నవి, ఏవి దొడ్డువి అనే వివరాలు లేకపోవడం, సంచులను విప్పగానే సన్నబియ్యం వస్తే డీలర్లు తమకు అనుకూలంగా ఉండేవారు, తెలిసిన వారికి ఫోను ద్వారా సమాచారం ఇచ్చి పంపిణీ చేస్తున్నారు. విషయం బయటకు తెలిసిన మరికొందరు వినియోగదారులు ఆయా దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. సన్నబియ్యం పూర్తయ్యి, దొడ్డురకం బియ్యం పంపిణీ చేసే సమయంలో రేషన్ దుకాణం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి.
దీంతో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులకు వినియోగదారులు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నిస్తుండగా జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోందని చెబుతున్నారు. సన్న బియ్యం విషయమై వినియోగదారులు, డీలర్లకు మధ్య నిత్యం వాగ్వాదం జరుగుతోంది. దొడ్డు బియ్యాన్ని ప్రజలు నిరాకరించడంతో జిల్లాలో అనుకున్న రీతిలో రేషన్ బియ్యం పంపిణీ జరగడం లేదు.
బియ్యం పంపిణీ గడువు పెంపుపై వినియోగదారులకు సమాచారం లేకపోవడంతో పనులు మానుకుని రేషన్ దుకాణాల వద్ద ఉదయం నుంచే పడిగాపులు కాస్తున్నారు. సన్నబియ్యం వస్తే తీసుకెళ్తుండగా, దొడ్డు బియ్యం వస్తే వాటిని తీసుకోకుండానే వెళ్లిపోతున్నారు. దీంతో దొడ్డు బియ్యం నిల్వలు పలు రేషన్ దుకాణాల్లో మిగిలిపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment