రాజకీయం ‘అదిరింది’.. అమిత్‌ షాకు విజయ్‌ కౌంటర్‌ | Actor Vijay Political Counter To AMit Shah | Sakshi
Sakshi News home page

రాజకీయం ‘అదిరింది’.. అమిత్‌ షాకు విజయ్‌ కౌంటర్‌

Published Thu, Dec 19 2024 7:50 AM | Last Updated on Thu, Dec 19 2024 8:01 AM

Actor Vijay Political Counter To AMit Shah

చెన్నై: బీఆర్‌ అంబేద్కర్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే అమిత్‌ షా వ్యాఖ్యలకు ఇండియా కూటమి నేతలు కౌంటర్‌ ఇవ్వగా తాజాగా తమిళనాడు నేత, నటుడు విజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్‌ షాను టార్గెట్‌ చేసి సంచలన ఆరోపణలు చేశారు.

అమిత్‌ షా వ్యాఖ్యలపై తమిళగ వెట్రి కళగం నేత విజయ్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ..‘అంబేడ్కర్‌ పేరు వింటే కొందరికి అలర్జీ. ఆయన సాటిలేని రాజకీయ మేధావి. స్వేచ్ఛా వాయువులు పీల్చిన భారత ప్రజలందరూ అంబేద్కర్‌ను గౌరవించారు. అంబేద్కర్‌ అనే పేరు వింటే మనసు, పెదవులకు సంతోషంగా ఉంటుంది. ఆయనను అవమానించడాన్ని సహించబోమంటూ కామెంట్స్‌ చేశారు. దీంతో, ఆయన బీజేపీనే టార్గెట్‌ చేసి ఇలా కామెంట్స్‌ చేశారని పలువురు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా.. నటుడు విజయ్‌ తన రాజకీయ పార్టీ టీవీకే పార్టీ మొదటి ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా అంబేద్కర్‌ తన పార్టీ సైద్దాంతిక గురువు అని చెప్పుకొచ్చారు. మరోవైపు.. విజయ్‌ వ్యాఖ్యలపై తమిళనాడు బీజేపీ నేతలు మండిపడుతున్నారు. 

అంతకుముందు పార్లమెంట్‌ సమావేశాల సందర్బంగా అమిత్‌ షా క్షమాపణలు చెప్పాలంటూ విపక్షాలు నిరసనలకు దిగాయి. దీంతో, పార్లమెంటు ఉభయ సభలు బుధవారం దద్దరిల్లాయి. సభలోనే కాకుండా బయటా ప్రతిపక్షాలు నిరసనలు వ్యక్తం చేశాయి. అమిత్‌ షా రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ డిమాండు చేసింది. అయితే కాంగ్రెస్‌ పార్టీనే ఇప్పటిదాకా అంబేడ్కర్‌ను అవమానిస్తూ వస్తోందని, తామే ఆయనను సంపూర్ణంగా గౌరవిస్తున్నామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

ఇదే సమయంలో తన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ వక్రీకరించిందని అమిత్‌ షా వివరణ ఇచ్చారు. పదే పదే అంబేడ్కర్‌ పేరును జపించే బదులు.. ఏ దేవుడిని స్మరించుకున్నా ఏడు జన్మలదాకా స్వర్గ ప్రాప్తి లభించేదని అమిత్‌ షా మంగళవారం రాజ్యసభలో వ్యాఖ్యానించినట్లు కాంగ్రెస్‌ ఆరోపించింది. ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. అయితే తమకు అంబేడ్కరే దేవుడని ఆ పార్టీ స్పష్టం చేస్తూ అమిత్‌ షా క్షమాపణలు చెప్పడంతోపాటు రాజీనామా చేయాలని లేదంటే ప్రధాని ఆయనను తొలగించాలని డిమాండు చేసింది. కాంగ్రెస్‌కు బుధవారం విపక్షాలు తోడవడంతో పార్లమెంటు దద్దరిల్లింది. మరోవైపు దేశవ్యాప్తంగా అమిత్‌ షాకు వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళనలు నిర్వహించాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement