చెన్నై: సినీ నటుడు విజయ్ పొలిటికల్ ఎంట్రీతో తమిళనాట రాజకీయం హీటెక్కింది. తాజాగా టీవీకే పార్టీ అధినేత విజయ్.. స్టాలిన్ సర్కార్‌ను టార్గెట్ చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు. అలాగే, జమిలి ఎన్నికలకు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఈ మేరకు టీవీకే(తమిళిగా వెట్రి కగజం) పార్టీ తీర్మానం కూడా చేయడం విశేషం.
దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలపై తీవ్ర చర్చ నడుస్తోంది. 2027లోనే జమిలీ ఎన్నికలు వస్తాయని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నటుడు విజయ్‌కి చెందిన టీవీకే పార్టీ.. జమిలి ఎన్నికలు సహా పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. నేడు చెన్నైలో విజయ్ అధ్యక్షతన టీవీకే పార్టీ నేతల కీలక సమావేశం జరిగింది. ఈ సందర్బంగా పార్టీ ఎజెండాను ముందుకు ఎలా తీసుకెళ్లాలన్న విషయంపై చర్చించారు. ఇదే సమయంలో జమిలి ఎన్నికలకు తమ పార్టీ వ్యతిరేకమని విజయ్ ప్రకటించారు. ఈ క్రమంలోనే జమిలి ఎన్నికలకు వ్యతిరేకంగా సమావేశంలో తీర్మానం చేశారు. అలాగే, నీట్ పరీక్షపై కూడా తాజాగా తీర్మానం చేశారు.
ఇదే సమయంలో తమిళనాడులోకి స్టాలిన్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు విజయ్. రాష్ట్రంలో అబద్దపు హామీలు ఇచ్చి స్టాలిన్ అధికారంలోకి వచ్చారని అన్నారు. కులగణన ప్రక్రియ జాప్యంపై అధికార డీఎంకే వైఖరిని తప్పుబట్టారు. ఇక, తమిళనాడులో ద్విభాషా సిద్ధాంతమే అమలులో ఉండాలని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో హిందీ అమలుకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో హిందీకి రాష్ట్రంలో చోటులేదని స్పష్టం చేశారు. కేంద్రం పెత్తనం లేకుండా రాష్ట్రాలకు స్వయంప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా.. ఇటీవలే విజయ్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి రాజకీయ ప్రసంగం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా టీవీకే పార్టీ పోటీపై క్లారిటీ ఇచ్చారు. తమిళనాడు 2026లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందన్నారు. అలాగే, ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని చెప్పుకొచ్చారు. క్షేత్రస్థాయిలో మహిళలకే తమ పార్టీలో ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment