
విమర్శలు, వ్యంగ్యాస్త్రాలను(ట్రోల్స్+మీమ్స్) పట్టించుకోకుండా తమిళ రాజకీయాల్లో సరికొత్త సంచలనం దిశగా సినీ హీరో విజయ్ అడుగులేస్తున్నారు. మీట్ ది పీపుల్ పేరిట ఈ శనివారం నుంచి రాష్ట్ర పర్యటనలు చేపట్టనున్నారు. అయితే జనాల్లోకి వెళ్లే క్రమంలో.. తమిళనాడు డీజీపీకి ఆయన ఓ లేఖ రాశారు. తన పర్యటనల రిత్యా అవసరమైన భద్రత కల్పించాలంటూ విజ్ఞప్తి చేశారాయన. ఈ క్రమంలో సంచలన ఆరోపణలకే దిగారాయన.
తన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగం (TVK)కు బలమైన పునాది వేయడం మాత్రమే కాదు.. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో అధికార కైవసమే లక్ష్యంగా విజయ్ అడుగులేయబోతున్నారు. సెప్టెంబర్ 13వ తేదీన తిరుచ్చి నుంచి ప్రత్యేక ప్రచార రథం బయల్దేరనుంది. అలా మొత్తం 38 జిల్లాల్లో పర్యటిస్తూ.. ప్రజలతో మమేకం అయ్యేలా కార్యక్రమాలతో (సభలు, సమావేశాలు, ర్యాలీలు, ముఖాముఖి, రౌండ్ టేబుల్ మీటింగ్స్) నిర్వహిస్తుంది. డిసెంబర్ 20వ తేదీన మధురైలో సభ ద్వారా టీవీకే విజయ్ మీట్ ది పీపుల్ పర్యటన ముగియనుంది. అయితే..
టీవీకే చర్యలతో అధికార డీఎంకే నేతలకు నిద్రలేకుండా పోతోందని విజయ్ అంటున్నారు. టీవీకే కేడర్‌పై వరుసగా కేసులు పెట్టడాన్ని ఖండిస్తూ ఓ బహిరంగ ప్రకటన విడుదల చేశారాయన. ఆ పార్టీ కార్యదర్శి ఆనంద్‌తో పాటు తిరుచ్చి పార్టీ విభాగం నేతలపైనా తాజాగా కేసు నమోదు అయ్యింది. అయితే.. ఈ పరిణామంపై విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీవీకేకు అధికారంలో ఉన్నపార్టీ భయపడుతోందా? అని ప్రశ్నించారాయన. డీఎంకే ఇప్పుడు టీవీకే గురించే ఆలోచించడం మొదలుపెట్టింది. 24 గంటలూ అదే ఆలోచనతో ఉంటోంది. ఆ పార్టీ నేతలకు నిద్ర కరువైంది. ఈ క్రమంలోనే పోలీసులపై ఒత్తిడి చేస్తూ కేసులు పెట్టిస్తోంది. కొంపదీసి.. టీవీకేకు డీఎంకే భయపడుతోందా? అని ప్రశ్నించారాయన.
తమిళనాడు రాజకీయాల్లో తారలకు ప్రజలు అధికారం కట్టబెట్టడం కొత్తేం కాదు. శివాజీ గణేషన్, విజయ్‌కాంత్, శరత్‌కుమార్, కమల్‌హాసన్.. ఇలా ఎందరో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. రజినీకాంత్ లాంటి భారీ ఫ్యాన్‌ఫాలోయింగ్ ఉన్న తార ఆ దిశగా అడుగు వేసినట్లే వేసి.. వెనక్కి వెళ్లిపోయారు. అయితే.. ఎంజీఆర్, జయలలిత ఏకంగా ముఖ్యమంత్రులు అయ్యారు. వీళ్లందరితో పోల్చుకుంటే.. విజయ్‌కు ఇప్పుడున్న మాస్ ఫాలోయింగ్ చాలాచాలా ఎక్కువే. ఆ అభిమానాన్నే ఓటు బ్యాంకుగా మార్చుకోవాలని విజయ్ ఉవ్విళ్లూరుతున్నారు.

తమిళనాడులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ, విజయ్ చేపట్టిన “మీట్ ది పీపుల్” పర్యటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విజయ్ గత ఏడాది రాజకీయాల్లోకి అడుగుపెట్టి, రెండు మానాడు(మహానాడు)లను విజయవంతంగా నిర్వహించారు. మదురైలో జరిగిన రెండో మహానాడులో ప్రజల మధ్యకి వస్తున్నట్టు ప్రకటించి.. రాజకీయ ప్రత్యర్థి డీఎంకే, సైద్ధాంతిక విరోధి బీజేపీ లతోనే తమ పోరాటం అని కుండబద్దలు కొట్టారు. తాను, తన టీవీకే ఏ కూటమిలో భాగం కాబోమని.. కలిసొచ్చే పార్టీలకు రేపు అధికారం గనుక దక్కితే వాటా ఇస్తామని చెప్పారు.
విజయ్ ఈ ప్రకటన అక్కడి రాజకీయాల్లో అలజడి రేపింది. పలు పార్టీలోని సీనియర్ నేతలు విజయ్ ఆఫర్‌కు టెంప్ట్ అవుతున్నారు. ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకేలో అసంతృప్త నేతలతో పాటు ఓట్ షేరింగ్ ఉన్న పార్టీలు, కుల ఓట్లను రాబట్టే పార్టీలు సైతం విజయ్ టీవీకేతో కూటమిగా ముందుకు వెళ్లాలని భావిస్తున్నాయి.

ప్రజల సమస్యలపై నేరుగా స్పందించేందుకు, వారి అభిప్రాయాలను స్వీకరించేందుకు ఈ పర్యటనను ప్రజా ఉద్యమంగా మార్చాలని విజయ్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ మీట్ ది పీపుల్‌పై అధికార డీఎంకే ఓ కన్నేసింది. విజయ్ పర్యటనను నిశితంగా పరిశీలించాలని, ప్రత్యర్థి వ్యూహానికి చెక్ పెట్టేలా పునరాలోచనలు చేయాలని ఆ పార్టీ అధినేత, సీఎం స్టాలిన్ సీనియర్లకు సూచించినట్లు తెలుస్తోంది. అయితే టీవీకే కేడర్‌పై ఈ సమయంలోనే కేసులు నమోదు అవుతుండడంతో డీఎంకేపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే విజయ్ మాత్రం ఇలాంటివాటికి వెనకడుగు వేయబోనని అంటున్నారు. 1967లో అన్నాదురై కాంగ్రెస్ ఆధిపత్యానికి గండికొట్టినట్లు.. 1977 అన్నాడీఎంకేతో ఎంజీఆర్ డీఎంకేను గద్దె దించినట్లు.. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిపోరుతో అధికారం కైవసం చేసుకుని తానూ చరిత్ర సృష్టిస్తానని చెబుతున్నారు.

జనంలోకి వెళ్తున్న విజయ్.. రెండు నెలలపాటు నాన్‌స్టాప్ పర్యటనలు చేపట్టబోతున్నారు. మొదటి విడతలో 10 జిల్లాల్లో పర్యటించేందుకు రూట్‌మ్యాప్ సిద్ధం చేశారు. శనివారం కీలక కార్యక్రమాలు జరుగుతాయి. ఆదివారం ఒకే ఒక్క కార్యక్రమం నిర్వహిస్తారు. మధ్యలో సెప్టెంబర్ 27, అక్టోబర్ 25వ తేదీన చెన్నైకి విజయ్ చేరుకుంటారు. పార్టీ ప్రకటన నుంచి మానాడు విజయవంతం దాకా.. విజయ్ వెంట నడిచింది యువతే. కాబట్టి యువత మద్దతుతోనే తన పర్యటనలను విజయవంతం చేసుకోవాలని విజయ్ భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
ఇదీ చదవండి: విజయ్ టీవీకే.. ఆ పార్టీకే ఫ్లస్