state tour
-
Tamil Nadu: పార్టీ బలోపేతానికి కమల్ హాసన్ కీలక నిర్ణయం
సాక్షి, చెన్నై: మక్కల్ నీది మయ్యంను బలోపేతం చేయడం లక్ష్యంగా రాష్ట్ర పర్యటనకు విశ్వనటుడు కమల్ సిద్ధమవుతున్నారు. ఇందుకు తగ్గ రూట్ మ్యాప్ సిద్ధమవుతోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందుగా విశ్వనటుడు కమల హాసన్ నేతృత్వంలో మక్కల్ నీది మయ్యం ఆవిర్భవించిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతైనా తమకంటూ ఓటు బ్యాంక్ ఉందని కమల్ చాటుకున్నారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ డిపాజిట్లు గల్లంతయ్యాయి. కమలహాసన్ సైతం ఓటమి పాలయ్యారు. అలాగే, ఇటీవలి నగర పాలక సంస్థల ఎన్నికల్లోనూ ఆ పార్టీకి నిరాశే మిగిలింది. దీంతో పార్టీని సంస్థాగత స్థాయి నుంచి బలోపేతం చేసి, లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కమల్ నిర్ణయించారు. ఇందుకోసం రాష్ట్ర పర్యటనకు రెడీ అవుతున్నారు. కమల్ తన పర్యటనలో ప్రజాగళాన్ని తన గళంగా వినిపించే విధంగా ప్రత్యేక కార్యచరణ సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం ఆయా గ్రామాలు, పట్ట ణాలు, నగరాల్లోని పార్టీ వర్గాల ద్వారా స్థానిక సమస్యలపై అధ్యయానికి నిర్ణయించారు. దీంతో రేషన్ దుకాణాలు, గ్రామీణ ప్రజలు ఏకమయ్యే రచ్చ బండల వద్దకు చేరుకుని స్థానిక సమస్యలను తెలుసుకునే పనిలో మక్కల్ నీది మయ్యం వర్గా లు నిమగ్నమయ్యాయి. ఇప్పటి నుంచే ప్రజల్లో మమేకమయ్యే విధంగా కమల్ కార్యక్రమాలు ఉంటాయని, 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి బలమైన పార్టీగా తీర్చిదిద్దుతామని నాయకులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. -
బీజేపీకి షాకివ్వనున్న యడియూరప్ప? బల నిరూపణకు సై
బెంగళూరు: కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు తర్వాత పరిస్థితులు చక్కబడతాయనుకుంటే ఏం మారలేదని తెలుస్తోంది. ఇప్పటికే మంత్రులు తమ శాఖలపై అసహనంతో ఉన్నారు. అప్రాధాన్య శాఖలు ఇచ్చారని సీనియర్ నాయకులు అసంతృప్తిలో ఉండగా.. మరికొందరు సీఎం బసవరాజు బొమ్మైకు వ్యతిరేకంగా ఉన్నారు. అయితే పదవి నుంచి అకారణంగా పంపించి వేసిన వైనంపై మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. తనతో బలవంతంగా రాజీనామా చేయించిన పార్టీ తీరుపై మండిపడుతున్నారు. వాటితోపాటు కొత్త ప్రభుత్వంలో తన కుమారుడికి, అనుచరులకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం కూడా మరో కారణంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తన బలం చూపించేందుకు యడియూరప్ప సిద్ధమయ్యారని కర్ణాటకలో వార్తలు వస్తున్నాయి. పదవి నుంచి దిగిన అనంతరం కొన్నాళ్లు ఎవరితో మాట్లాడకుండా ఉన్న యడియూరప్ప వారం కిందట మాల్దీవులుకు వెళ్లి వచ్చారు. రావడంతోనే మళ్లీ రాజకీయంగా క్రియాశీలకంగా మారుతాననే సంకేతాలు పంపారు. ఈ క్రమంలోనే శివమొగ్గలో పంచాయతీ, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప యడియూరప్పను కలిశారు. వీరిద్దరి భేటీ రాజకీయంగా చర్చనీయాంశమైంది. తన కుమారుడు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయేంద్రకు సహకరించనున్నట్లు సమాచారం. త్వరలోనే కుమారుడితో రాష్ట్రవ్యాప్త యాత్ర చేపట్టే ఆలోచనలు ఉన్నాయని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి కుమారుడికి బలం చేకూర్చాలని యడ్డియూరప్ప లక్ష్యమని పార్టీలోని ఓ నాయకుడు చెప్పారు. (చదవండి: తొందరపడుతున్న నవ జంటలు: అలా పెళ్లి.. ఇలా విడాకులు) అయితే సోమవారం పార్టీ కర్ణాటక ఇన్చార్జి అరుణ్‌సింగ్ మూడు రోజుల పర్యటనకు మైసూర్ చేరుకున్నారు. పార్టీలో ఇంకా సద్దుమణగని విబేధాలు, లుకలుకలపై దృష్టి సారించనున్నారు. ముఖ్యమంత్రి మార్పు తర్వాత జరిగిన పరిణామాలపై చర్చించనున్నారు. ఈ క్రమంలోనే యడియూరప్ప తన బలం చూపించాలని భావిస్తున్నారట. ఈ సందర్భంగా తన అనుచరులకు ఈ మేరకు ఆదేశాలు పంపారంట. త్వరలోనే తన మద్దతుదారులతో కలిసి ప్రత్యక్ష కార్యాచరణ రూపొందించుకుని ఎన్నికలకు వెళ్లనున్నారని ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే తెలుస్తోంది. తనకు తన వర్గానికి అప్రాధాన్యం ఇవ్వడంపై యడియూరప్ప వర్గం ఎప్పటి నుంచో గుర్రుగా ఉంది. త్వరలోనే యడియూరప్ప వర్గం పార్టీలోనే ఉంటూనే తమ బలం నిరూపించుకునే మార్గాలు అన్వేషిస్తోంది. తనే బీజేపీకి పెద్ద దిక్కు అనిపించేలా యడ్డి వర్గం కార్యాచరణ ఉండనుందని సమాచారం. జూలై 26వ తేదీన ముఖ్యమంత్రి పదవికి యడియూరప్ప రాజీనామా చేయగా జూలై 28న బొమ్మై సీఎంగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. చదవండి: పుట్టింటికి వస్తానన్న కుమార్తె.. తల్లి వద్దనడంతో -
ఒకే పంథాలో ఆ ఇద్దరూ..
సాక్షి ప్రతినిధి, చెన్నై: రాష్ట్ర రాజకీయాల్లోకి నటులు రజనీకాంత్, కమల్హాసన్ల ప్రవేశంపై ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఒకరికొకరు ప్రత్యర్థులా, మిత్రపక్షాలా అనే చర్చ మొదలైంది. ఇరువురూ ఒకే పంథాలో ముందుకు సాగుతుండగా, రజనీకాంత్ కంటే ముందు కమల్‌హాసన్ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 26వ తేదీ నుంచి రాష్ట్రపర్యటన సాగిస్తూ ప్రజలను ముఖాముఖి కలుసుకునేందుకు సమాయత్తమయ్యారు. జయలలిత మరణం, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి తీవ్ర అస్వస్థతతో రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయశూన్యతను పూడ్చేందుకు కమల్, రజనీ ఇద్దరూ వేర్వేరుగా ఒకేసారి పోటీపడుతున్నారు. ప్రముఖ దర్శకులు బాలచందర్ శిష్యులుగా దాదాపూ ఒకేసారి సినీరంగంలోకి వెండితెరపై పోటీపడ్డారు. నేడు రాజకీయాల్లో సైతం ఒకేసారి కాలుపెడుతున్నారు. రాజకీయ వ్యవస్థ చెడిపోయింది, ఈ వ్యవస్థను సరిదిద్దేందుకు తానే ఎందుకు పూనుకోకూడదు అంటూ రజనీ సంచలన వ్యాఖ్యలు చేయడం ద్వారా రాజకీయ ప్రవేశంపై సూత్రప్రాయ సంకేతాలు ఇచ్చారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వంలోని అన్నిశాఖలూ అవినీతిమయంగా మారిపోయాయనే విమర్శలతో తన రాజకీయ ప్రవేశానికి కమల్ నాందిపలికారు. కమల్ చేసిన విమర్శలకు సీఎం ఎడపాడి పళనిస్వామి, మంత్రులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కమల్‌ను ఖైదు చేయాలని, పరువునష్టం దావా వేయాలని మంత్రులు విరుచుకుపడ్డారు. ప్రభుత్వ శాఖల్లో సాగుతున్న అవినీతిపై సమాచారాన్ని సేకరించి ఆయాశాఖలకు పంపాల్సిందిగా కమల్‌హాసన్ సైతం అభిమానులకు పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు ట్విట్టర్ ద్వారా మాత్రమే ప్రజాసమస్యలను ప్రస్తావిస్తున్న కమల్ ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఈనెల 26వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్త పర్యటనను ప్రారంభించనున్నారు. రాజకీయ ప్రవేశం ఖాయం, ప్రజలతో సంబంధాలు పెట్టుకునేందుకు, వారి అభిప్రాయాలు తెలుసుకునేందుకు మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టనున్నట్లు గత ఏడాది తన జన్మదినం రోజున కమల్ తెలిపారు. ‘మైయ్యం విజిల్’ అనే యాప్‌ను జనవరిలో ప్రవేశపెట్టబోతున్నట్లు గత ఏడాది తన జన్మదినం రోజున కమల్ ప్రకటించి రాజకీయ అరంగేట్రంను ఖరారు చేశారు. అలాగే రజనీకాంత్ సైతం ఇటీవల ఆరురోజులపాటు తన అభిమానులను కలుసుకుని రాజకీయ ప్రవేశం ఖాయమంటూ రజనీకాంత్ స్వయంగా ప్రకటించారు. ఈనెల పొంగల్ పండుగ రోజుల్లో రజనీకాంత్ తన పార్టీని ప్రకటిస్తారని అందరూ ఆశించగా ఇప్పట్లో లేదు అంటూ రజనీకాంత్ తెలియజేశారు. కమల్ మరలా దూకుడు ప్రదర్శిస్తూ ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా తదితరులను కలుసుకుంటూ పార్టీ పేరును ఖరారు చేసేపనిలో పడ్డారు. పార్టీ పేరును ప్రకటించే ముందు ప్రజలతో మమేకం కావాలనే ఉద్దేశంతో ఈనెల 26వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్త పర్యటన ప్రారంభించనున్నారు. పర్యటన పూర్తి వివరాలను ఈనెల 18వ తేదీన కమల్ ప్రకటిస్తారు. పర్యటన ముగిసిన తరువాత పార్టీ ప్రకటన ఉంటుందా లేక మరేదైనా కార్యక్రమాలకు రూపకల్పనా అనేది తెలియడం లేదు. కమల్ ఒక అడుగు, ఆ తరువాత రజనీకాంత్ ఒక అడుగు...ఇలా ఇద్దరూ నటులు వెండితెరపైనే కాదు రాజకీయరంగంలో సైతం చిత్రమైన వైఖరిని ప్రదర్శిస్తున్నారు. రాబోయే పార్లమెంటు లేదా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగాలని గట్టిగా భావిస్తున్న రజనీ, కమల్ వెండితెరపైనే కాదు రాజకీయ తెరపై కూడా పోటాపోటీగా బరిలో నిలిచే ప్రతిపక్షాలా లేక మిత్రపక్షాలా, అనే ఆసక్తి నెలకొంది. -
కీలక నిర్ణయం తీసుకున్న కమల్
సాక్షి, చెన్నై : రాజకీయ అరంగ్రేటంలో సీనియర్ నటుడు కమల్ హాసన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ప్రకటన కంటే ముందే రాష్ట్రవ్యాప్తంగా పర్యటించేందుకు సిద్ధమైపోయాడు. ఈ మేరకు కమల్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘తమిళనాడులో ప్రస్తుతం అవినీతి పాలన నడుస్తోంది. ప్రస్తుత పరిణామాలను ప్రజలకు వివరించి.. వారి సమస్యలను తెలుసుకునేందుకే నా పర్యటన. జనవరి 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తా. పర్యటన వివరాలను ఆనంద్ వికటన్ తదుపరి సంచికలో వెల్లడిస్తా’’ అని కమల్ పేర్కొన్నాడు. మైయామ్ విజిల్ యాప్ ద్వారా ఇప్పటికే చాలా ఫిర్యాదులు అందాయని.. త్వరలోనే అవినీతి తిమింగలాల బండారం బయటపెడతానని ఆయన అన్నారు. జయలలిత మరణం తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై 63 ఏళ్ల కమల్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించాడు. అన్ని వర్గాల వారిని కలుపుకుని ముందుకు సాగి అంతిమంగా విజయం సాధించటమే తన లక్ష్యమని కమల్ చెబుతున్నారు. -
త్వరలో జగన్ రాష్ట్ర పర్యటన: కొణతాల
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి త్వరలోనే రాష్ట్ర పర్యటన చేస్తారని పార్టీ నాయకుడు కొణతాల రామకృష్ణ తెలిపారు. అఖిలపక్ష సమావేశం కంటే ముందుగానే శ్రీకృష్ణ కమిటీ నివేదికను బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మపై దాడిని ప్రతి ఒక్కరు ఖండించాలని కొణతాల అన్నారు. మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌లు తమ పదవుల పరువు తీసేలా ప్రవర్తించారని విమర్శించారు. వైఎస్ విజయమ్మను పోలీసులు అడ్డుకోవడాన్ని తాము మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.