సాక్షి ప్రతినిధి, చెన్నై: రాష్ట్ర రాజకీయాల్లోకి నటులు రజనీకాంత్, కమల్‌హాసన్‌ల ప్రవేశంపై ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఒకరికొకరు ప్రత్యర్థులా, మిత్రపక్షాలా అనే చర్చ మొదలైంది. ఇరువురూ ఒకే పంథాలో ముందుకు సాగుతుండగా, రజనీకాంత్ కంటే ముందు కమల్‌హాసన్ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 26వ తేదీ నుంచి రాష్ట్రపర్యటన సాగిస్తూ ప్రజలను ముఖాముఖి కలుసుకునేందుకు సమాయత్తమయ్యారు.
జయలలిత మరణం, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి తీవ్ర అస్వస్థతతో రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయశూన్యతను పూడ్చేందుకు కమల్, రజనీ ఇద్దరూ వేర్వేరుగా ఒకేసారి పోటీపడుతున్నారు. ప్రముఖ దర్శకులు బాలచందర్ శిష్యులుగా దాదాపూ ఒకేసారి సినీరంగంలోకి వెండితెరపై పోటీపడ్డారు. నేడు రాజకీయాల్లో సైతం ఒకేసారి కాలుపెడుతున్నారు. రాజకీయ వ్యవస్థ చెడిపోయింది, ఈ వ్యవస్థను సరిదిద్దేందుకు తానే ఎందుకు పూనుకోకూడదు అంటూ రజనీ సంచలన వ్యాఖ్యలు చేయడం ద్వారా రాజకీయ ప్రవేశంపై సూత్రప్రాయ సంకేతాలు ఇచ్చారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వంలోని అన్నిశాఖలూ అవినీతిమయంగా మారిపోయాయనే విమర్శలతో తన రాజకీయ ప్రవేశానికి కమల్ నాందిపలికారు. కమల్ చేసిన విమర్శలకు సీఎం ఎడపాడి పళనిస్వామి, మంత్రులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
కమల్‌ను ఖైదు చేయాలని, పరువునష్టం దావా వేయాలని మంత్రులు విరుచుకుపడ్డారు. ప్రభుత్వ శాఖల్లో సాగుతున్న అవినీతిపై సమాచారాన్ని సేకరించి ఆయాశాఖలకు పంపాల్సిందిగా కమల్‌హాసన్ సైతం అభిమానులకు పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు ట్విట్టర్ ద్వారా మాత్రమే ప్రజాసమస్యలను ప్రస్తావిస్తున్న కమల్ ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఈనెల 26వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్త పర్యటనను ప్రారంభించనున్నారు. రాజకీయ ప్రవేశం ఖాయం, ప్రజలతో సంబంధాలు పెట్టుకునేందుకు, వారి అభిప్రాయాలు తెలుసుకునేందుకు మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టనున్నట్లు గత ఏడాది తన జన్మదినం రోజున కమల్ తెలిపారు.
‘మైయ్యం విజిల్’ అనే యాప్‌ను జనవరిలో ప్రవేశపెట్టబోతున్నట్లు గత ఏడాది తన జన్మదినం రోజున కమల్ ప్రకటించి రాజకీయ అరంగేట్రంను ఖరారు చేశారు. అలాగే రజనీకాంత్ సైతం ఇటీవల ఆరురోజులపాటు తన అభిమానులను కలుసుకుని రాజకీయ ప్రవేశం ఖాయమంటూ రజనీకాంత్ స్వయంగా ప్రకటించారు. ఈనెల పొంగల్ పండుగ రోజుల్లో రజనీకాంత్ తన పార్టీని ప్రకటిస్తారని అందరూ ఆశించగా ఇప్పట్లో లేదు అంటూ రజనీకాంత్ తెలియజేశారు. కమల్ మరలా దూకుడు ప్రదర్శిస్తూ ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా తదితరులను కలుసుకుంటూ పార్టీ పేరును ఖరారు చేసేపనిలో పడ్డారు. పార్టీ పేరును ప్రకటించే ముందు ప్రజలతో మమేకం కావాలనే ఉద్దేశంతో ఈనెల 26వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్త పర్యటన ప్రారంభించనున్నారు. పర్యటన పూర్తి వివరాలను ఈనెల 18వ తేదీన కమల్ ప్రకటిస్తారు. పర్యటన ముగిసిన తరువాత పార్టీ ప్రకటన ఉంటుందా లేక మరేదైనా కార్యక్రమాలకు రూపకల్పనా అనేది తెలియడం లేదు. కమల్ ఒక అడుగు, ఆ తరువాత రజనీకాంత్ ఒక అడుగు...ఇలా ఇద్దరూ నటులు వెండితెరపైనే కాదు రాజకీయరంగంలో సైతం చిత్రమైన వైఖరిని ప్రదర్శిస్తున్నారు. రాబోయే పార్లమెంటు లేదా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగాలని గట్టిగా భావిస్తున్న రజనీ, కమల్ వెండితెరపైనే కాదు రాజకీయ తెరపై కూడా పోటాపోటీగా బరిలో నిలిచే ప్రతిపక్షాలా లేక మిత్రపక్షాలా, అనే ఆసక్తి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment