jaya lalitha
-
రాజకీయాల్లో సత్తా చాటిన వెండితెర మహారాణులు
రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే ఆషామాషి విషయం కాదు. మహిళలు రాణించాలంటే అంతకు మించిన సామర్థ్యమే ఉండాలి. అలాంటి రంగంలో సినిమా హీరోయిన్లు రాణించడం అనేది అంత సులభం కాదు. సాధారణంగా సినిమా హీరోయిన్ అంటే చాలామందిలో చిన్నచూపు కనిపిస్తుంది. అందుకే కొందరు వారిపై నోటికి వచ్చిన కామెంట్లు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా రాజకీయాలంటేనే రొంపి... ఇందులోకి దిగితే దేనినైనా దిగమింగుకోవాలి. అవమానాలు, హేళనలు భరించాలి. అందుకే అతివలు వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని కొందరు దూరంగా ఉంటారు. కానీ మరి కొందరు రాజకీయ కదనరంగంలోకి దూకుతున్నారు.. ఈ క్రమంలో సినిమా పరిశ్రమకు చెందిన హీరోయిన్లు కూడా శివంగిలా తనదైన మాటలతో రాజకీయ యుద్ధంలో పోరాడుతున్నారు. వారి పోరాటంలో అవమానాలు ఎదురైనా భూదేవి అంత సహనంతో ఓర్చుకొని అలాంటి వారి బుద్ధి చెబుతున్నారు. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజకీయాల్లో రాణించిన వెండితెర మహారాణుల కొందరి గురించి తెలుసుకుందాం. తమిళనాడు అమ్మగా జయలలిత తమిళ రాజకీయ ముఖ చిత్రాన్ని తలచుకుంటే ఎవరికైనా గుర్తుకు వచ్చే పేరు జయలలిత. తమిళనాడు రాజకీయాలను కంటి చూపుతోనే శాసించిన అతి కొద్ది మంది రాజకీయ నేతల్లో జయలలిత ఒకరు. 1948లో జన్మించిన ఆమె.. సినీ నటిగా తన జీవిత ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత అన్నాడీఎంకే అధినేత్రిగా.. తమిళనాడు సీఎంగా ఎదిగిన తీరు నిజంగా అద్భుతం. 1991 నుంచి 2016 మధ్య ఆమె 14 ఏళ్లపాటు తమిళనాడు సీఎంగా పనిచేశారు. 1948 ఫిబ్రవరి 24న కర్ణాటకలోని మండ్య జిల్లా పాండవవుర తాలూకాలోని మెల్కోటేలో.. తమిళ అయ్యంగార్ కుటుంబంలో జన్మించారు. అయ్యంగార్ల సంప్రదాయం ప్రకారం తల్లిదండ్రులు ఆమెకు పెట్టిన రెండు పేర్లు కోమలవల్లి, జయలలిత. సంధ్య అనే పేరుతో తన ప్రస్థానాన్ని నాటకాలతో ప్రారంభించి.. సినీ నటి స్థాయికి ఎదిగింది. జయలలిత తమిళంతోపాటు తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడేవారు. జయలలిత 1981లో రాజకీయాల్లో అడుగుపెట్టారు. 43 ఏళ్లకే ఆమె ముఖ్యమంత్రి అయ్యారు ఆమె తమిళనాడు సీఎం అయ్యారు. దీంతో అత్యంత పిన్న వయసులోనే తమిళనాడు సీఎంగా ఎన్నికైన వ్యక్తిగా ఆమె రికార్డు నెలకొల్పారు. 2016 డిసెంబరు 5న చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో ఆమె మరణించారు. ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా ఆర్ కే రోజా చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటకు చెందిన రోజా 1972 నవంబర్ 17న జన్మించారు. తిరుపతి పద్మావతి మహిళా యూనివర్శిటీలో చదివారు. రాజకీయ విజ్ఞానంలో నాగార్జున యూనివర్సిటీ నుంచి పీజీ పట్టభద్రులయ్యారు. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. 2004, 2009 శాసనసభ ఎన్నికల్లో నగరి, చంద్రగిరి నియోజకవర్గాల నుంచి పోటీచేసి ఓడిపోయిన ఆమె తన పోరాటాన్ని మాత్రం ఆపలేదు. ఆ తర్వాత వరుసగా 2014, 2019 శాసనసభ ఎన్నికలలో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నగరి నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలిచారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా రోజా ఉన్నారు. రాజకీయాల్లోకి రాక ముందు చిత్ర పరిశ్రమలో ఎంతో కాలం కొనసాగిన రోజా. తొలినాళ్లలో హీరోయిన్గా రాణించడం చాలా కష్టమని ఎంతో మంది ఎగతాలి చేశారని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయినప్పటికీ.. ఎంతో కష్టపడి నటన, డాన్స్ నేర్చుకుని. పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చినట్లు రోజా చెప్పారు. రాజకీయాల్లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని. విమర్శలను పాజిటివ్‌గా తీసుకుని. నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ఆమె పొలిటికల్ జర్నీ కొనసాగుతుంది. కన్నడలో సుమలత తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన అగ్రనటి సుమలత.220 కి పైగా కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ చిత్రాల్లో ఆమె నటించారు. సినీ కెరీర్లో స్వీట్‌స్పాట్‌కు చేరుకొన్నాక అంబరీశ్‌ను వివాహం చేసుకున్నారు. ఆయన మరణం తర్వాత 2019 ఎన్నికల్లో కర్ణాటకలోని మండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. మాజీ సీఎం కుమారస్వామి కుమారుడు, నటుడు నిఖిల్ గౌడపై లక్ష ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో సుమలత విజయం కోసం కేజీఎఫ్ స్టార్ యశ్, దర్శన్, రాక్‌లైన్ వెంకటేశ్, దొడ్డన్న వంటి సినీ ప్రముఖులు కృషి చేశారు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్రమోదీతో కలిసి పనిచేస్తానని ఇటీవల సుమలత ప్రకటించారు. 2024 ఎన్నికల్లో బీజేపీ తరపున మాండ్య నుంచే పోటే చేస్తానని ఆమె చెప్పారు. విజయశాంతి సినీ నటిగానే కాదు.. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర కోసం ప్రయత్నించారు విజయశాంతి. 25 ఏళ్లకు పైగానే రాజకీయాల్లో ఆమె కొనసాగుతున్నారు. బీజేపీలో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన విజయశాంతి. ఆ తర్వాత తల్లి తెలంగాణ పార్టీ పెట్టారు. తన పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేసి.. ఆ పార్టీ తరపున మెదక్ ఎంపీగా గెలిచారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాంగ్రెస్‌లో చేరి.. మెదక్ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2019 ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌కు రాజీనామా చేసి తిరిగి బీజేపీలో చేరారు. అమరావతిని శాసించిన తొల మహిళగా నవనీత్ కౌర్ నవనీత్ స్వస్థలం పంజాబ్. ఆమె తెలుగు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2003లో ‘శ్రీను వాసంతి లక్ష్మి’తో మొదలుపెట్టి 2010లో కాలచక్రం వరకు దాదాపు 20 తెలుగు సినిమాల్లో ఆమె నటించారు. ఆపై 2011లో ఎమ్మెల్యే రవి రాణాతో పెళ్లి జరగడంతో ఆమె రాజకీయ ప్రస్థానం మొదలైంది. రవి రానాను పెళ్లి చేసుకున్న తర్వాత, నవనీత్ అమరావతికి వచ్చేశారు. తొలిసారి ఆమె 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆమె పోటీ చేశారు. అమరావతి నియోజిక వర్గంలో శివసేన నాయకుడు అనందరావ్ అడ్సూల్‌కు విపరీతమైన పట్టు ఉంది. దీంతో ఆ ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. కానీ, నవనీత్ అంత తేలిగ్గా వదిలిపెట్టే వ్యక్తి కాదు. పేదల ఇళ్లకు వెళ్లి భోజనం చేసేవారు. వారి ఇంట్లోకి వెళ్లి వారి కూతురిలా కలిసిపోయారు. 2019 ఎన్నికల్లో శివసేన-బీజేపీ కలిసి మళ్లీ ఆనంద్‌రావ్‌ను ఇక్కడి నుంచి పోటీ చేయించాయి. అయితే, కాంగ్రెస్-ఎన్సీపీల మద్దతున్న నవనీత్ భారీ ఆధిక్యంతో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. మరావతి నుంచి ఎన్నికైన తొలి మహిళా ఎంపీ ఆమె కావడం విశేషం. అయితే, ఇప్పుడు ఆమె రాజకీయాలు బీజేపీకి దగ్గరగా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఓబీసీ బిల్లుపై చర్చ సమయంలో 2021లో లోక్‌సభలో ఆమె తెలుగులో మాట్లాడి తెలుగు వారందిరినీ మురిపించారు. స్టార్ క్యాంపెయినర్‌గా నగ్మా ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయడం లేదు కానీ.. సినీ నటిగానే కాకుండా రాజకీయ నేతగా కూడా నగ్మా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. చాలా సంవత్సరాల కిందటే కాంగ్రెస్ పార్టీలో చేరిన నగ్మా.. ఆ పార్టీ తరపున వివిధ రాష్ట్రాల వ్యవహారాలను సమీక్షిస్తున్నారు. ఎన్నికల సమయంలో స్టార్ క్యాంపెయినర్‌గా కొనసాగుతున్నారు. కానీ ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ పార్టీకి కాస్త దూరంగానే ఉన్నారు. -
‘రుద్రంకోట’ మూవీ రివ్యూ
టైటిల్: రుద్రంకోట నటీనటుటు: జయలలిత, అనీల్, విభీష, అలేఖ్య ,బాచి, రమ్య తదితరులు నిర్మాత:అనిల్ ఆర్కా కండవల్లి దర్శకత్వం: రాము కోన సంగీతం: సుభాష్ ఆనంద్, నిరంజన్ నేపథ్య సంగీతం: కోటి సినిమాటోగ్రఫీ: ఆదిమల్ల సంజీవ్ ఎడిటర్: ఆవుల వెంకటేష్ విడుదల తేది: సెప్టెంబర్ 22, 2023 రుద్రంకోట కథేంటంటే.. రుద్రంకోట ఊరిలో కోటమ్మ(సీనియర్ నటి జయలలిత)చెప్పిందే వేదం. తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే. అక్రమ సంబంధాలు పెట్టుకుంటే.. స్త్రీలను కూడా శిక్ష విధిస్తుంది. ఆ ఊరికి కాపాలాగా రుద్ర(అనిల్ ఆర్కా కండవల్లి) ఉంటాడు. ఆయన కళ్లుగప్పి ఎవరూ ఊరు దాటలేరు. కోటమ్మ తప్ప మిగతా ఏ మహిళను కూడా రుద్ర కన్నెత్తి చూడడు. మాట్లాడడు. స్మశానంలోనే ఉంటూ ఊరికి కాపాలా కాస్తుంటాడు. అదే ఊరికి చెందిన శక్తి(విభీష)కు రుద్ర అంటే చచ్చేంత ప్రేమ. పట్నం నుంచి ఊరికి వచ్చిన కోటమ్మ మనవరాలు ధృతి(అలేఖ్య) రుద్రపై మోజు పడుతుంది. కానీ రుద్ర మాత్రం ధృతి కోరికను తిరస్కరిస్తాడు. ఇదిలా ఉంటే ఊరి చివర్లో కొంతమంది యువకులు ఓ అఘాయిత్యానికి పాల్పడతారు. అదేంటి? రుద్ర ప్రాణంగా ప్రేమించిన శక్తికి ఏం జరిగింది? అసలు రుద్ర నేపథ్యం ఏంటి? అమ్మాయిలంటే ఎందుకు గిట్టదు? శక్తి ప్రేమ సఫలం అయిందా లేదా? రుద్రపై పగ పెంచుకున్న ధృతి..చివరకు ఏం చేసింది? తప్పు చేసిన వాళ్లకు రుద్ర ఎలాంటి శిక్ష విధించాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. శ్మశాన వాటికలో పెరిగి పెద్దైన ఓ యుకుడి ప్రేమకథా చిత్రమిది. లవ్ అండ్ లస్ట్ తో సాగే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు రాము కోన. కామంతో కొందరు ఎటువంటి దారుణాలకు పాల్పడుతున్నారనేది ఈ చిత్రంలో చూపించారు. అయితే ఈ తరహా కథలు తెలుగు ప్రేక్షకులకు కొత్తేమి కాదు. కానీ హీరో పాత్రను తీర్చి దిద్దిన తీరు బాగుంది. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగుంది కానీ.. దాని చుట్టు అల్లుకున్న కథలో మాత్రం బలం లేదు. కోటమ్మ పాత్ర పరిచయంతో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత రుద్రగా హీరో ఎంట్రీ సీన్ బాగుంటుంది. ఎలాంటి సాగదీత లేకుండా మొదట్లోనే ముఖ్యమైన పాత్రలు..వాటి నేపథ్యాన్ని చూపించారు. దీంతో కథపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుంది. అయితే ఆ ఆసక్తిని చివరి వరకు కొనసాగించలేకపోయాడు. సినిమా ప్రారంభమైన కాసేపటికే కథనం నెమ్మదిగా సాగుతుంది. రొటీన్ సన్నివేశాలతో ఫస్టాఫ్ ముగుస్తుంది. సెకండాఫ్ కాస్త ఆసక్తికరంగా సాగుతుంది. శక్తి, రుద్ర మధ్య సాగే ప్రేమ సన్నివేశాలు బాగుంటాయి. క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. డైలాగులు పేలవంగా ఉండడం సినిమాకు మైనస్. కోటమ్మ, రుద్ర పాత్రల నేపథ్యాన్ని మరింత బలంగా రాసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. హీరోగా అనీల్‌కు తొలి సినిమా అయినా..ఎక్కడా తడబడకుండా నటించాడు. శ్మశాన వాటికలో పెరిగి పెద్దైన యువకుడు రుద్ర పాత్రలో ఒదిగిపోయాడు. కోటమ్మ పాత్రకు సీనియర్ నటి జయలలిత న్యాయం చేశారు. అమె పాత్రను తీర్చిదిద్దిన తీరు బాగుంది. పల్లెటూరి అమ్మాయి శక్తిగా విభీష చక్కగా నటించింది. తెరపై అందంగా కనిపించింది. ఇక నెగెటివ్ షేడ్స్ ఉన్న ధృతి పాత్రని అలేఖ్య న్యాయం చేసింది. తెరపై అందాలను ప్రదర్శిస్తూ ఆకట్టుకుంది. సాంకేతిక విషయాలకొస్తే.. కోటి నేపథ్య సంగీతం జస్ట్ ఒకే. సుభాష్ ఆనంద్, నిరంజన్ అందించిన పాటు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. పల్లెటూరి అందాలను చక్కగా తన కెమెరాలో బంధించాడు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. కొన్ని సన్నివేశాలను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
తమిళనాట పొలిటికల్ ట్విస్ట్.. పన్నీర్ సెల్వానికి షాక్
చెన్నై: తమిళనాట రాజకీయాల్లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఏఐడీఎంకే పన్నీర్ సెల్వానికి ఊహించని షాక్ తగిలింది. పన్నీర్ సెల్వానికి ఎన్నికల కమిషన్ బిగ్ షాక్ ఇచ్చింది. అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎడప్పాడి కే పళనిస్వామి నియామకాన్ని కేంద్రం ఎన్నికల సంఘం ఆమోదించింది. దీంతో, రెండాకుల గుర్తను పళనిస్వామి దక్కించుకున్నారు. ఇక, ఈసీ నిర్ణయంతో పన్నీరు సెల్వం వర్గానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వివరాల ప్రకారం.. అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎడప్పాడి పళనిస్వామి నియామకాన్ని కేంద్రం ఎన్నికల సంఘం ఆమోదించింది. కాగా ఈ విషయాన్నిఆ పార్టీ ధ్రువీకరించింది. ఈ క్రమంలో ఎలక్షన్ కమిషన్ పంపిన నోట్‌ను అన్నాడీఎంకే అధికార ప్రతినిధి ఆర్ఎం బాబీ మురగవేల్ గురువారం ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ఇక, అన్నాడీఎంకే చేసిన పార్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ మార్పులు, ప్రధాన కార్యదర్శి ఎన్నిక, కొత్త ఆఫీస్ బేరర్ల నియామకానికి ఈసీ ఆమోదం తెలిపినట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా.. పార్టీ అధ్యక్షురాలు, దివంగత మాజీ సీఎం జయలలిత మరణం తర్వాత ఇద్దరు నేతలు పార్టీపై పట్టుకోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య వివాదం కొనసాగుతున్నది. ఇంతకు ముందు ఈ-రోడ్ స్థానానికి ఉప ఎన్నికలు జరగ్గా.. ఇద్దరు నేతలు వేర్వేరుగా అభ్యర్థులను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక, పళనిస్వామి ప్రస్తుతం తమిళనాడు శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ నిర్ణయంతో పన్నీరు సెల్వానికి బిగ్ షాక్ తగిలింది. మరోవైపు, పన్నీర్ సెల్వం దాఖలు చేసిన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు విచారిస్తున్నది. Election Commission approves Edappadi K Palaniswami as the general secretary of AIADMK.#EdappadiPalaniswami #AIADMK pic.twitter.com/Nuobq4IVzj — Shankar (@Shankar38630530) April 20, 2023 -
తమిళనాడులో ట్విస్ట్.. జయలలిత సోదరుడినంటూ కోర్టులో పిటిషన్
తమిళనాడులో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల విషయం మరోసారి కోర్టుకు చేరింది. కర్నాకటకు చెందిన ఓ వ్యక్తి తాను జయలలితకు సోదరుడిని అని చెబుతూ కోర్టును ఆశ్రయించాడు. ఆమె ఆస్తిలో సగం వాటా తనకు ఇవ్వాలని మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. వివరాల ప్రకారం.. మైసూరులోని వ్యాసపురానికి చెందిన వాసుదేవన్ (83) తాను దివంగత తమిళనాడు సీఎం జయలతితకు సోదరుడినని చెప్పాడు. ఈ సందర్బంగా వాసుదేవన్ మీడియాతో మాట్లాడుతూ.. జయలలిత తండ్రి జయరామ్ మొదటి భార్య జయమ్మ కుమారుడిని తానేని పేర్కొన్నాడు. తర్వాత, జయరామ్.. వేదమ్మ అనే మహిళను రెండో వివాహం చేసుకున్నారని అన్నారు. వారికి పుట్టిన వారే జయలలిత, జయకుమార్ అని తెలిపాడు. తన తల్లి జయమ్మ.. 1950లో మైసూరు కోర్టులో భరణం కోసం కేసు వేశారని గుర్తు చేశాడు. ఆ కేసులో మా నాన్న రెండో భార్య వేదమ్మ, జయకుమార్, జయలలితను ప్రతివాదులుగా చేర్చామని స్పష్టం చేశాడు. కానీ, జయలలిత కంటే ముందే జయకుమార్ మరణించారని వెల్లడించారు. ఈ క్రమంలో జయలలితకు సోదరుడిగా, వారసుడిగా ఉన్న తనకు కూడా ఆస్తిలో వాటా కావాలని డిమాండ్ చేశాడు. మరోవైపు.. 2020లో మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పులో జయలలిత వారసులుగా దీపక్, దీప మాత్రమే అంటూ తీర్పునిచ్చింది. తాజాగా దీపక్, దీప పేరుతో పాటుగా తన పేరును కూడా చేర్చి తీర్పును సవరించాలని వాసుదేవన్ మరోసారి కోర్టును ఆశ్రయించాడు. ఈ విషయంలో ప్రస్తుతం తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది. -
సాక్షి కార్టూన్: 09-06-2022
జయలలిత అని పెట్టేసుకోండి మేడమ్! -
జయలలితకు నెచ్చెలి నివాళి
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సమాధి వద్ద ఆమె నెచ్చెలి శశికళ శశివారం నివాళులర్పించారు. ఇది సర్వసాధారణ విషయమైనా.. పార్టీని కైవసం చేసుకోబోతున్నట్లు శశికళ నుంచి సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో తమిళనాడులో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల శిక్ష అనుభవించి ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలయ్యారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజకీయ సన్యాసం పుచ్చుకుంటున్నట్లు ప్రకటించి ఇంటికే పరిమితమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటమి చెందడంతో రాజకీయాలపై మరలా దృష్టి సారించడం ప్రారంభించారు. ఈనెల 17న అన్నాడీఎంకే శ్రేణులంతా స్వర్ణోత్సవాలకు సిద్ధమైన తరుణంలో శనివారం ఉదయం 10.30 గంటలకు అమ్మ సమాధి వద్దకు వెళ్లి శ్రద్ధాంజలి ఘటించారు. పదినిమిషాలు మౌనం పాటించి కన్నీళ్లు పెట్టుకున్నారు. కొన్నేళ్లుగా మోస్తున్న గుండెలోని భారాన్ని ఈరోజు దించుకున్నానని మీడియా వద్ద వ్యాఖ్యానించి ఇంటికి వెళ్లిపోయారు. అన్నాడీఎంకే కార్యాలయం వద్ద హై టెన్షన్ అమ్మ సమాధి వద్ద శశికళ నివాళులర్పించిన తరువాత నేరుగా అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయానికి వస్తారనే సమాచారంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో ఉదయం 10 గంటలకే పార్టీ నేతలు ప్రధాన గేటు వద్ద అడ్డుగా కూర్చున్నారు. అమ్మ సమాధి నుంచి శశికళ ఇంటికి చేరుకున్నారని నిర్ధారించుకున్న తరువాతే వారంతా వెళ్లిపోయారు. తమిళనాడు వ్యాప్తంగా అన్నాడీఎంకే స్వర్ణోత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహిస్తున్నారు. జైలు నుంచి జయలలిత దత్తపుత్రుడు విడుదల బనశంకరి: జయలలిత దత్తపుత్రుడు వీఎన్ సుధాకరన్ శనివారం బెంగళూరులోని పరప్పన జైలు నుంచి విడుదలయ్యారు. అక్రమాస్తుల కేసులో శశికళ కంటే ముందుగానే విడుదల కావలసిన సుధాకరన్ రూ.10 కోట్లు జరిమానా చెల్లించకపోవడంతో ఏడాది అదనంగా జైల్లో ఉన్నారు. ఆయన సుమారు 4 ఏళ్ల 9 నెలలు జైలులో ఉన్నారు. గత ఏడాది శశికళ, ఆమె బంధువు ఇళవరసి అదనపు జరిమానాను చెల్లించి విడుదలయ్యారు. శశికళ విడుదలై ఇంటికి వెళ్లాక ఒక్కసారి కూడా సుధాకరన్ను కలవకపోగా కనీసం ఫోన్ కూడా చేయలేదని సమాచారం. -
Kangana Ranaut: ‘తలైవి’ మూవీ రివ్యూ
టైటిల్ : తలైవి జానర్: బయోపిక్ నటీనటులు : కంగన రనౌత్, అరవింద్ స్వామి, నాజర్, భాగ్యశ్రీ, సముద్రఖని, మధుబాలా తదితరులు నిర్మాణ సంస్థలు: విబ్రి మీడియా, కర్మ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ నిర్మాతలు : విష్ణు వర్ధన్ ఇందూరి కథ: విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం : ఏఎల్ విజయ్ సంగీతం : జీవీ ప్రకాష్ కుమార్ విడుదల తేది : సెప్టెంబర్ 10,2021 లేడి ఓరియెంటెండ్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తోంది బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్. వరుసగా నాయికా ప్రాధాన్యమున్న సినిమాలు చేస్తూ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ భామ తాజాగా నటించిన మరో లేడి ఓరియెంటెండ్ మూవీ ‘తలైవి’. నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితాధారంగా దర్శకుడు ఎ.ఎల్. విజయ్ రూపొందించిన చిత్రమిది. టైటిల్ పాత్రని కంగనా పోషించగా.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) పాత్రలో అరవింద్ స్వామి నటించారు. పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం సెప్టెంబరు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ‘తలైవి’ప్రేక్షకుల మనసును ఏ మేరకు దోచుకుందో రివ్యూలో చూద్దాం. ‘తలైవి’కథేంటంటే: దర్శకుడు ముందుగా చెప్పినట్టే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సినీ జీవితం ప్రారంభం నుంచి ఆమె సీఎంగా బాధ్యతలు చేపట్టే వరకు సాగే కథే ‘తలైవి’. ఓ పెద్దింటి కుటుంబంలో పుట్టినా జయలలిత(కంగనా రనౌత్) కొన్ని పరిస్థితుల కారణంగా పేదరికంలోకి వస్తుంది. అయితే వాళ్లమ్మ మాత్రం ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేస్తుంది. 16 ఏళ్ల వయసులోనే జయను హీరోయిన్ను చేస్తుంది. అతి చిన్న వయసులోనే ఎంజీ రామచంద్రన్ అలియాస్ ఎంజీఆర్ (అరవింద్ స్వామి) లాంటి స్టార్‌తో నటించే అవకాశం చేజిక్కించుకుంటుంది. ఆ తర్వాత కోలీవుడ్‌లో వాళ్లది సూపర్ హిట్ జోడీ అయిపోతుంది. ఈ క్రమంలో ఎంజీఆర్‌తో జయలలితకు ఎలాంటి అనుబంధం ఏర్పడుతుంది? సినీ నటిగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న జయ.. రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది? తను ఎంతో అభిమానించే ఎంజీఆర్ మరణం తర్వాత తమిళనాడు ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి? జయలలిత ముఖ్యమంత్రి పీఠం చేపట్టే క్రమంలో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? తెలియాలంటే ‘తలైవి’ చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే.. జయలలిత పాత్రలో కంగన ఒదిగిపోయారు. తెరపై జయలలిత కనిపిస్తుందే తప్ప.. కంగాన రనౌత్ ఏ మూలాన కనిపించదు. ఆమెను జాతియ ఉత్తమ నటి అని ఎందుకు అంటారో ఈ సినిమా చూస్తే అర్థమవుతంది. ఎంజీఆర్‌తో దూరమయ్యే సన్నివేశాల్లో చక్కటి భావోద్వేగాన్ని పలికించింది. ఇక కంగన తర్వాత ఈ చిత్రంలో బాగా పండిన పాత్ర అరవింద్ స్వామిది. ఎంజీఆర్ పాత్రలో ఆయన జీవించేశాడు. స్టార్ హీరోగా, రాజకీయ నాయకుడిగాను ప్రత్యేక హావభావాలను పలికించాడు. ఎంజీఆర్ అనుచరుడు వీరప్పన్ పాత్రకు సముద్రఖని ప్రాణం పోశాడు. కరుణ పాత్రలో నాజర్ మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించాడు. జయ తల్లి పాత్రలో అలనాటి నటి భాగ్య శ్రీ, ఎంజీఆర్ భార్య పాత్రలో మధుబాల, శశికల పాత్రలో పూర్ణతో మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే..? ‘అమ్మ’గా తమిళ ప్రజల గుండెల్లో పదిలమైన చోటు దక్కించుకున్న దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం తలైవి. జయ జీవితంలో అతి కీలకమైన 1965 నుంచి మొదటి సారి ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన 1991 మధ్య జరిగే కథను మాత్రమే తెరపై చూపించాడు దర్శకుడు ఏఎల్ విజయ్. ఓ సినిమాకి కథ ఎంపికతోపాటు క్యారెక్టర్ సెలక్షన్ కూడా చాలా ముఖ్యం. ఇదే సినిమా సక్సెస్‌ను నిర్ణయిస్తుంది. ఎప్పుడైతే జయలలిత పాత్రకు జాతీయ ఉత్తమ నటి కంగనాను ఎంపిక చేశారో.. అప్పుడే ఈ సినిమా సగం సక్సెస్ సాధించింది. ఫస్టాఫ్‌లో జయ లలిత సినీ జీవితాన్ని చూపించిన దర్శకుడు.. సెకండాఫ్ మొత్తం ఆమె రాజకీయ జీవితాన్ని చూపించాడు. ఎంజీఆర్ పాత్రను హైలైట్ చేస్తూనే.. అదే సమయంలో జయలలిత పాత్ర ప్రాధాన్యత తగ్గకుండా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు. జయ-ఎంజీఆర్ మధ్య ఉన్న బంధాన్ని కూడా తెరపై చాలా చక్కగా చూపించారు. రాజకీయాలే వద్దనుకున్న జయ.. పాలిటిక్స్‌లోకి ఎందుకు రావాల్సి వచ్చిందో తెలిపే సీన్స్‌ని చాలా చక్కగా డిజైన్ చేసుకున్నాడు. అలాగే జయలలితను తమిళ ప్రజలు ‘అమ్మ’అని ఎందుకు ముద్దుగా పిలుసుకుంటారో తెలియజేసే సీన్ కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఒక రాజకీయాల్లో వచ్చి తర్వాత జయ జీవితం ఎలాంటి మలుపు తిరిగిందే విషయాన్ని కూడా ఉన్నది ఉన్నట్లు చూపించారు. సొంత పార్టీ నేతలే జయపై కుట్ర చేయడం, ఆమెను రాజ్య సభకి పంపడం లాంటి సీన్స్ కూడా హత్తుకునేలా తీర్చి దిద్దారు. ఎంజీఆర్ మరణం తర్వాత చోటు చేసుకునే పరిణామాలను ఉత్కంఠభరితంగా తెరకెక్కించారు. ‘నమ్మి వస్తే అమ్మ.. లేదంటే ఆదిశక్తి’ అంటూ జయలో ఉన్న రెండో కోణాన్ని కూడా తెరపై చూపించారు. ఈ సినిమాకు మరో ప్రధాన బలం జీవి ప్రకాశ్ కుమార్ సంగీతం. పాటలు అంతగా ఆకట్టుకోలేవు కానీ, నేపథ్య సంగీతం అదిరిపోయింది. విశాల్ విట్టల్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్ పర్లేదు. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్‌కి కత్తెర పడాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్టుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
శశికళపై మరో కేసు నమోదు..
సాక్షి, చెన్నై(తమిళనాడు): తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత నెచ్చెలి, అన్నాడీఎంకే బహిష్కృత మహిళ నేత వి.కె శశికళపై మరో కేసు నమోదైంది. అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి CV షణ్ముగానికి శశికళ అనుచరులు నుంచి బెదిరింపులు వస్తున్నాయని తమిళనాడులోని విల్లుపురం జిల్లాలోని రోషనాయ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది..దీంతో ఆమె పైన పలు సెక్షన్లు కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తమిళనాడు మాజీ మంత్రి షణ్ముగంను బెదిరించిన ఆరోపణలపై శశికళ తో పాటు 501 మంది మద్దతుదారులపై కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. కొన్నేళ్ల క్రితం అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన శశికళ.. ఇప్పుడు మళ్లీ పార్టీలో చేరాలని ప్రయత్నాలు చేస్తున్నారు. జైలు నుంచి వచ్చిన తరువాత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏప్రిల్ 6న రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించింది శశికళ. ఈ మధ్య తన మద్దతుదారులతో మాట్లాడిన ఫోన్ సంభాషణలు ఆడియో వెలుగులోకి వచ్చాయి. అందరం కలిసి ఐకమత్యంలో పనిచేద్దామని తాను చెప్పిన మాటలను పెడచెవిన పెట్టడం వల్లే అన్నాడీఎంకే ఓటమిపాలైందని శశికళ అన్నారు. చదవండి: ‘దెయ్యాల గుంపు వేధిస్తుంది.. నన్ను కాపాడండి సార్’ -
తలైవి ట్రైలర్ చూస్తే గూస్‌బంప్సే.. తూటాల్లా డైలాగులు
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, నటి జయలలిత బయోపిక్ ‘తలైవి’లో కంగనారనౌత్ ప్రధానపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియన్ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకి కేఎల్ విజయ్ దర్శకత్వం వహించారు. నేడు (మార్చి23)న జయలలిత పుట్టినరోజు సందర్భంగా తలైవి ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. అమ్మ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా ఒదిగిపోయింది. ఒక సినిమా నటితో మనకి రాజకీయాలు నేర్పించాలనుకోవడం అంటూ అసహనం వ్యక్తం చేస్తున్న డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. రాజకీయాల్లోకి రమ్మంటూ ఎంజీఆర్ జయలలితను ఆహ్వానించడం..ఆ తర్వాత ఆమె తమిళ రాజకీయాల్లో తలైవీగా ఎలా మారిందన్న అంశాలు ఈ సినిమాలో చూపించనున్నారు. అసెంబ్లీలో జయలలిత చీర లాగే సన్నివేశంలో ఆమె చెప్పే డైలాగులు తూటాల్లా పేలాయి. అంతేకాకుండా జయలలిత పాత్రలో కంగనా సరిగ్గా సరిపోయిందనిపిస్తుంది. మొదట ఈ పాత్రలో కంగనాపై ట్రోల్స్ వచ్చినా, ట్రైలర్‌తో గట్టి సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ట్రైలర్ ఆద్యంతం ఎంతో ఆకట్టుకుంటుంది. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎంజీఆర్ పాత్రలో అరవిందస్వామి నటించారు. విబ్రి పతాకంపై విష్ణువర్థన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 23న ఈ సినిమా విడుదల కానుంది. చదవండి : నాలుగోసారి అవార్డు: ఫుల్ ఖుషీలో బాలీవుడ్ ఐరన్ లేడీ పరాయి దేశంతో పోరాడే వివాహిత కథ! -
బై చెప్పడం బాధాకరమే!
కొన్ని పాత్రలు చేసినప్పుడు సినిమా షూటింగ్ పూర్తయ్యాక కూడా ఆ పాత్రల్లోంచి బయటకు రాలేరు కొందరు నటీనటులు. ఇప్పుడు కంగనా రనౌత్ పరిస్థితి అదే. దివంగత నటి, తమిళనాడు మాజీ సీఎం జయలలిత జీవితం ఆధారంగా తీసిన ‘తలైవి’ (నాయకురాలు)లో ఆమె టైటిల్ రోల్ చేశారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ‘‘ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి చేసిన మా ‘తలైవి’ చిత్రాన్ని విజయవంతంగా పూర్తి చేశాం. తలైవి.. ఓ విప్లవ నాయకురాలు. ఇలాంటి పాత్రలు చేసే అవకాశం అరుదుగా వస్తుంది. ఈ పాత్రను ఎంతో ప్రేమించి చేశాను. అందుకే సినిమా చివరి రోజు ఈ క్యారెక్టర్‌కి బై చెప్పడానికి బాధపడ్డాను’’ అన్నారు కంగనా రనౌత్. ఈ చిత్రానికి ఏఎల్ విజయ్ దర్శకుడు. -
‘తలైవి’ వర్ధంతి : కంగనా స్టన్నింగ్ స్టిల్స్
సాక్షి, ముంబై: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి జయలలిత బయోపిక్కు సంబంధించిన స్టన్నింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న 'తలైవి' మూవీ సంబంధించి కొన్నివర్కింగ్ స్టిల్స్ ను ఆమె ట్విటర్లో షేర్ చేశారు. ముఖ్యంగా నేడు (శనివారం, డిసెంబరు 5) జయలలిత వర్ధంతి సందర్భంగా విప్లవ నాయకికి కంగనా నివాళులర్పించారు. మరో వారం రోజుల్లో సినిమా పూర్తికానుందని పేర్కొన్న కంగనా ఈ సందర్శంగా సూపర్ హ్యూమన్‌లా సినిమాను తెరకెక్కిస్తున్న విజయ్‌తోపాటు, తలైవి చిత్ర యూనిట్‌కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జయలలిత బయోపిక్ 'తలైవి-ది రివల్యూషనరీ లీడర్' లో కంగనా రనౌత్ లీడ్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. లాక్డౌన్ కారణంగా ఆరు నెలలపాటు వాయిదా పడిన ఈ మూవీ షూటింగ్ కార్యక్రమాలను శరవేంగా పూర్తి చేసుకుంటోంది. హితేష్ ఠక్కర్, తిరుమల్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ హిందీ, తమిళం తెలుగు భాషలలో విడుదల కానుంది. On the death anniversary of Jaya Amma, sharing some working stills from our film Thalaivi- the revolutionary leader. All thanks to my team, especially the leader of our team Vijay sir who is working like a super human to complete the film, just one more week to go 🙏 pic.twitter.com/wlUeo8Mx3W — Kangana Ranaut (@KanganaTeam) December 5, 2020 -
సెట్లోనే సంతోషంగా ఉంటా!
దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, రాజకీయ నాయకురాలు జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’. తలైవి అంటే నాయకురాలు అని అర్థం. టైటిల్ రోల్‌ను బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేస్తున్నారు. ఏఎల్ విజయ్ దర్శకుడు. ఇందులో యంజీఆర్‌గా అరవింద స్వామి, కరుణానిధిగా ప్రకాష్ రాజ్ కనిపించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే చెన్నైలో ప్రారంభం అయింది. జయలలిత సీయంగా ఉన్న సన్నివేశాలను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. చిత్రీకరణలో పాల్గొంటున్న ఫొటోలను తన ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు కంగనా. ‘‘తలైవి’ చిత్రీకరణలో భాగంగా దర్శకుడు విజయ్‌గారితో ఓ సన్నివేశం గురించి సంభాషిస్తున్నాను. ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉండొచ్చు, కానీ సినిమా సెట్లో ఉన్నంత సంతోషంగా నేనెక్కడా ఉండలేను’’ అన్నారు కంగనా. -
తలైవీ షూటింగ్ షురూ..!
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత జీవతం ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమా 'తలైవీ'. ఈ సినిమాలో జయలలిత పాత్రలో కంగనా రనౌత్ నటిస్తున్నారు. దాదాపు ఏడు నెలల తర్వాత ఈ సినిమా షూటింగ్ మళ్లీ ప్రారంభమైంది. వీటికి సంబంధించి సినిమా డైరెక్టర్ ఏఎల్ విజయ్‌తో కలిసి సెట్స్‌లో దిగిన ఫోటోను తన ట్విట్టర్లో షేర్ చేసింది. విజయ్ టాలెంట్ ఉన్న డైరెక్టరే కాకుండా మంచి వ్యక్తని కంగనా తెలిపింది. కంగనా పోస్ట్ చేసిన ఫొటోలో చీరకట్టులో కనిపించగా డైరెక్టర్ ఆమెకు సీన్ వివరిస్తున్నారు. ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నా నాకు ఇష్టమైంది మాత్రం సినిమా సెట్ అని కంగనా ట్విట్టర్లో పేర్కొన్నారు. లాక్డౌన్ కారణంగా కంగనా గత కొన్ని నెలలుగా హిమాచల్ ప్రదేశ్‌లోని తన ఇంటి వద్దే ఉంటుంది. Good morning friends, these are some stills from yesterday’s early morning scene discussion with my absolutely talented and most affectionate director A.L Vijay ji, there are many amazing places in this world but the most soothing and comforting to me is a film set #Thalaivi pic.twitter.com/qGjw0nQjRQ — Kangana Ranaut (@KanganaTeam) October 5, 2020 జయలలిత సినీ ప్రస్థానం మొదలుకొని రాజకీయాల్లో తలైవీగా ఎలా మారిందన్న అంశాలు ఈ సినిమాలో చూపించనున్నారు. గత ఏడాది నవంబర్‌లో జయలలిత జయంతి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. దివంగత ఎంజీఆర్ పాత్రలో అరవింద్ స్వామి నటిస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ భాషలో ఈ సినిమా తెరకెక్కనుంది. -
విద్యార్థులు నిలబెట్టిన తల్లిపాల బ్యాంక్
పుట్టిన వెంటనే తల్లి స్తన్యం అందిన బిడ్డ అదృష్టవంతుడు. కాని ఆ అదృష్టం అందరు పిల్లలకూ దక్కదు. కాన్పు సమయంలో కాంప్లికేషన్స్ వల్ల తల్లి నుంచి వేరైన బిడ్డలకు పాలు ఎవరు పడతారు? చెన్నైలోని ‘హ్యూమన్ మిల్క్ బ్యాంక్’ ఒక పరిష్కారం. లాక్డౌన్ సమయంలో ఈ బ్యాంక్‌కు నిరంతరం పాలు అందేలా సేకరించిన విద్యార్థులు ఇప్పుడు ప్రశంసలు పొందుతున్నారు. బ్లడ్ బ్యాంక్ అవసరం అందరికీ తెలుసు. కాని తల్లి పాల బ్యాంక్ అవసరాన్ని తమిళనాడులో ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండగా జయలలిత గుర్తించారు. కాన్పు సమయంలో తల్లికి లేదా బిడ్డకు కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు వారు విడివిడి గా చికిత్స పొందుతూ ఉంటే అలాంటి పిల్లలకు తల్లిపాలు కావాల్సి వస్తుంది. తల్లిపాలు రాని పిల్లలకు తల్లి పాలు కావాల్సి వస్తుంది. దురదృష్టవశాత్తు తల్లి కాన్పు సమయంలో చనిపోతే తల్లిపాలు కావాల్సి వస్తుంది. హెచ్ఐవి కేసుల్లో తల్లి నుంచి కాక ఇతరుల నుంచి తల్లిపాలు బిడ్డకు కావాల్సి వస్తుంది. వీరందరి కోసమని చెన్నైలోని ప్రభుత్వ ఆస్పత్రి ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్’ లో, విజయ హాస్పిటల్లో ‘హ్యూమన్ మిల్క్ బ్యాంక్స్’ మొదలయ్యాయి. ఎలా సేకరిస్తారు? ఈ బ్యాంకులకు పాలను ఇవ్వడానికి తల్లులు తమ పేర్లు నమోదు చేసుకోవాలి. వారి ఆరోగ్యాన్ని వారి నుంచి వచ్చిన పాలను పరీక్షించి, అనుమతి ఇచ్చాక వీరు రెగ్యులర్‌గా తాము ఇవ్వగలిగినంత కాలం పాలను డొనేట్ చేయవచ్చు. నేరుగా హాస్పిటల్‌కు వచ్చి ఇవ్వొచ్చు. లేదా సేకరించుకునే వ్యవస్థ కూడా ఉంటుంది. అలా తెచ్చిన పాలను శాస్త్రీయ పద్ధతులలో తగిన ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసి అవసరమైన పిల్లలకు అందిస్తారు. లాక్డౌన్లో ఏమైంది? లాక్డౌన్ దేశాన్ని స్తంభింప చేసినట్టే ఈ తల్లిపాల వ్యవస్థను కూడా స్తంభింప చేసింది. చెన్నైలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ౖచెల్డ్హెల్త్లో రోజూ యాభై అరవై మంది పసి కూనలు నియోనేటల్ విభాగంలో చికిత్స కోసం అడ్మిట్ అవుతారు. వీరి తల్లులు వేరే క్కడో ఉంటారు. వీరిలో కనీసం పది మందికి తల్లిపాల బ్యాంక్ నుంచి పాలు కావాల్సి వస్తుంది. రోజులో ఒకసారికి ఒక బిడ్డకు 100 ఎమ్.ఎల్ పాలు కావాలి. ఈ పాలు డోనర్స్ నుంచి అందకపోతే పిల్లలు పస్తులు ఉండాల్సి వస్తుంది. లేదా పౌడర్పాలతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. లాక్డౌన్ సమయంలో రాకపోకలు అన్నీ ఆగిపోయిన వేళ కొంతమంది కాలేజీ విద్యార్థులు ఈ పాల సేకరణకు ముందుకు వచ్చారు. ఏ బ్యాంక్ అయినా ఖాళీగా ఉండొచ్చు కాని తల్లిపాల బ్యాంకు ఖాళీగా ఉండరాదని చేతులు చేతులు కలిపి కదిలారు. 100 లీటర్ల పాలు లాక్డౌన్ వల్ల తల్లిపాల బ్యాంకులో పాలు నిండుకునే పరిస్థితి ఉంది అనగానే కొందరు విద్యార్థులు రంగంలోకి దిగారు. డోనర్ల లిస్టు తీసుకుని తామే వాళ్ల ఇళ్లకు వెళ్లి పాలు సేకరించి హాస్పిటల్‌కు అందజేసే పని మొదలెట్టారు. అయితే ఇది అంత సులువు కాదు. చెన్నైలో రోడ్లన్నీ మూసేశారు. పోలీసుల అడ్డంకులు. ఇళ్లల్లో తల్లిదండ్రుల గద్దింపులు. కాని విద్యార్థులు వెనుకంజ వేయలేదు. తగిన పర్మిషన్లతో రోడ్ల మీద దూసుకువెళుతూ పాలు నిరంతరం అందేలా చేశారు. ‘నేను ప్రతిసారి మా అమ్మకు ఏదో ఒక అబద్ధం చెప్పాను’ అని ఒక విద్యార్థి చెప్తే ‘మా అమ్మకు చెప్పి చెప్పి చివరకు ఒప్పించాను. అందరూ ఇళ్లల్లో కూచుంటే సహాయం పొందాల్సిన వారు ఎలా పొందుతారు అని ఆమెకు చెప్పాను’ అని మరొక విద్యార్థి అన్నాడు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఈ విద్యార్థులు గత నాలుగు నెలల్లో 100 లీటర్ల తల్లిపాలు హాస్పిటల్‌కు అందేలా చేశారు. ప్రశంసలు లాక్డౌన్ సమయంలో నీళ్లకే కటకటలాడే పరిస్థితి ఉన్నప్పుడు చెన్నైల్లో పసికూనలు కడుపునిండుగా తల్లిపాలు తాగి కోలుకునేలా చేసిన ఈ విద్యార్థులకు ప్రశంసలు దక్కుతున్నాయి. కొంతమంది కుర్రవాళ్లు ముందుతరం దూతలు అని కవి అన్నది ఇలాంటి వారి గురించే కాబోలు. – సాక్షి ఫ్యామిలీ -
తలైవికి నష్టం!
నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘తలైవి’. ఇందులో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ టైటిల్ రోల్ చేస్తున్నారు. ఏఎల్ విజయ్ దర్వకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శైలేష్ ఆర్ సింగ్, విష్ణువర్థన్ ఇందూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం హైదరాబాద్, చెన్నైలో రెండు భారీ సెట్స్ వేశారు. ప్రస్తుత లాక్డౌన్ పరిస్థితులు జూన్ వరకు పొడిగించబడినట్లయితే అది వర్షాకాలం కాబట్టి ఆ సెట్స్ పాడైపోతాయని ఆందోళన చెందుతున్నారు చిత్రబృందం. ‘‘హైదరాబాద్‌లో వేసిన సెట్లో మార్చిలో, చెన్నై సెట్లో ఏప్రిల్‌లో షూటింగ్ జరపాలనుకున్నాం. లాక్డౌన్ వల్ల కుదరలేదు. ఇంకా దాదాపు నలభైశాతం సినిమా చిత్రీకరించాల్సి ఉంది. లాక్డౌన్ తొందరగా ముగిసి షూటింగ్‌కు ఓ పది రోజుల సమయం దొరికినా హైదరాబాద్ సెట్‌కు సంబంధించిన సన్నివేశాలను పూర్తి చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఇప్పటికే ఒక్కరోజు షూటింగ్ జరపకుండానే హైదరాబాద్‌కు సెట్‌కు సంబంధించి మార్చి నెలకు సరిపడా డబ్బుని సెట్ వేసిన స్టూడియోకు చెల్లించిందట చిత్రబృందం. ఒకవేళ ఈ సెట్స్‌లో షూటింగ్ జరపడానికి కుదరకపోతే ‘తలైవి’ నిర్మాతలకు దాదాపు 5 కోట్ల నష్టం వాటిల్లుతుందని టాక్. మరోవైపు బాలీవుడ్ హీరో అజయ్‌దేవగన్ నటిస్తున్న ‘మైదాన్’ చిత్రం కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటోంది. ఫుట్‌బాల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఓ స్టేడియం సెట్ వేశారు. వర్షాకాలం వచ్చేలోపు ఆ సెట్లో షూటింగ్ పూర్తి చేయకపోతే ఇబ్బంది అవుతుందనే ఆందోళనలో ఆ చిత్రబృందం ఉంది. -
ఒకే పంథాలో ఆ ఇద్దరూ..
సాక్షి ప్రతినిధి, చెన్నై: రాష్ట్ర రాజకీయాల్లోకి నటులు రజనీకాంత్, కమల్హాసన్ల ప్రవేశంపై ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఒకరికొకరు ప్రత్యర్థులా, మిత్రపక్షాలా అనే చర్చ మొదలైంది. ఇరువురూ ఒకే పంథాలో ముందుకు సాగుతుండగా, రజనీకాంత్ కంటే ముందు కమల్‌హాసన్ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 26వ తేదీ నుంచి రాష్ట్రపర్యటన సాగిస్తూ ప్రజలను ముఖాముఖి కలుసుకునేందుకు సమాయత్తమయ్యారు. జయలలిత మరణం, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి తీవ్ర అస్వస్థతతో రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయశూన్యతను పూడ్చేందుకు కమల్, రజనీ ఇద్దరూ వేర్వేరుగా ఒకేసారి పోటీపడుతున్నారు. ప్రముఖ దర్శకులు బాలచందర్ శిష్యులుగా దాదాపూ ఒకేసారి సినీరంగంలోకి వెండితెరపై పోటీపడ్డారు. నేడు రాజకీయాల్లో సైతం ఒకేసారి కాలుపెడుతున్నారు. రాజకీయ వ్యవస్థ చెడిపోయింది, ఈ వ్యవస్థను సరిదిద్దేందుకు తానే ఎందుకు పూనుకోకూడదు అంటూ రజనీ సంచలన వ్యాఖ్యలు చేయడం ద్వారా రాజకీయ ప్రవేశంపై సూత్రప్రాయ సంకేతాలు ఇచ్చారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వంలోని అన్నిశాఖలూ అవినీతిమయంగా మారిపోయాయనే విమర్శలతో తన రాజకీయ ప్రవేశానికి కమల్ నాందిపలికారు. కమల్ చేసిన విమర్శలకు సీఎం ఎడపాడి పళనిస్వామి, మంత్రులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కమల్‌ను ఖైదు చేయాలని, పరువునష్టం దావా వేయాలని మంత్రులు విరుచుకుపడ్డారు. ప్రభుత్వ శాఖల్లో సాగుతున్న అవినీతిపై సమాచారాన్ని సేకరించి ఆయాశాఖలకు పంపాల్సిందిగా కమల్‌హాసన్ సైతం అభిమానులకు పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు ట్విట్టర్ ద్వారా మాత్రమే ప్రజాసమస్యలను ప్రస్తావిస్తున్న కమల్ ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఈనెల 26వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్త పర్యటనను ప్రారంభించనున్నారు. రాజకీయ ప్రవేశం ఖాయం, ప్రజలతో సంబంధాలు పెట్టుకునేందుకు, వారి అభిప్రాయాలు తెలుసుకునేందుకు మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టనున్నట్లు గత ఏడాది తన జన్మదినం రోజున కమల్ తెలిపారు. ‘మైయ్యం విజిల్’ అనే యాప్‌ను జనవరిలో ప్రవేశపెట్టబోతున్నట్లు గత ఏడాది తన జన్మదినం రోజున కమల్ ప్రకటించి రాజకీయ అరంగేట్రంను ఖరారు చేశారు. అలాగే రజనీకాంత్ సైతం ఇటీవల ఆరురోజులపాటు తన అభిమానులను కలుసుకుని రాజకీయ ప్రవేశం ఖాయమంటూ రజనీకాంత్ స్వయంగా ప్రకటించారు. ఈనెల పొంగల్ పండుగ రోజుల్లో రజనీకాంత్ తన పార్టీని ప్రకటిస్తారని అందరూ ఆశించగా ఇప్పట్లో లేదు అంటూ రజనీకాంత్ తెలియజేశారు. కమల్ మరలా దూకుడు ప్రదర్శిస్తూ ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా తదితరులను కలుసుకుంటూ పార్టీ పేరును ఖరారు చేసేపనిలో పడ్డారు. పార్టీ పేరును ప్రకటించే ముందు ప్రజలతో మమేకం కావాలనే ఉద్దేశంతో ఈనెల 26వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్త పర్యటన ప్రారంభించనున్నారు. పర్యటన పూర్తి వివరాలను ఈనెల 18వ తేదీన కమల్ ప్రకటిస్తారు. పర్యటన ముగిసిన తరువాత పార్టీ ప్రకటన ఉంటుందా లేక మరేదైనా కార్యక్రమాలకు రూపకల్పనా అనేది తెలియడం లేదు. కమల్ ఒక అడుగు, ఆ తరువాత రజనీకాంత్ ఒక అడుగు...ఇలా ఇద్దరూ నటులు వెండితెరపైనే కాదు రాజకీయరంగంలో సైతం చిత్రమైన వైఖరిని ప్రదర్శిస్తున్నారు. రాబోయే పార్లమెంటు లేదా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగాలని గట్టిగా భావిస్తున్న రజనీ, కమల్ వెండితెరపైనే కాదు రాజకీయ తెరపై కూడా పోటాపోటీగా బరిలో నిలిచే ప్రతిపక్షాలా లేక మిత్రపక్షాలా, అనే ఆసక్తి నెలకొంది. -
అమ్మ మృతి వెనుక కుట్ర
కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఆరోపణ పెరంబూర్: దివంగత సీఎం జయలలిత మరణం వెనుక కుట్ర దాగి ఉందని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఆరోపించారు. ఈ కుట్రల బయటకు తీసేందుకు కేంద్రం సీబీఐ విచారణను జరిపించాలని కోరారు. ఈ మేరకు శనివారం కేతిరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొంటూ జయలలిత ఆరోగ్య వివరాలు, చికిత్సలకు సంబం«ధించిన సమగ్ర సమాచారం సుప్రీం కోర్టుకు సమర్పించాలని విన్నవించారు. జయలలిత ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సమయంలో ఆస్పత్రి నుంచి తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాల ప్రకటనలపై విచారణ జరిపించాలన్నారు. ఇక, ఉప ఎన్నికల్లో ఆమె వేలి ముద్ర వేసినట్టు నిర్ధారణ కావడం గురించి ఆరా తీయాలని కోరారు. ఆస్తుల లావాదేవీలను నిలిపివేయాలని, సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసు పూర్తి అయ్యే వరకూ, ఆమెకు సంబంధించిన ఆస్తులకు ఎలాంటి క్రయ విక్రయాలు, బదిలీలు చేయ కూడదని తాను సుప్రీం కోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసినట్టు గుర్తు చేశారు. ఇక, జయలలిత మరణం వెనుక ఉన్న మిస్టరీ ఛేదించేందుకు సీబీఐ విచారణ జరిపించాలని తాను ఓ వెబ్సైట్లో పేర్కొనగానే, అందుకు నిమిషాల వ్యవధిలో 40 వేల మంది ఆమోదం తెలిపినట్టు వివరించారు. అందరూ సీబీఐ విచారణ జరిపించాల్సిందేనని పట్టుబడుతూ తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేశారన్నారు. ఇక, సీబీఐ విచారణ కోరుతూ తాను ప్రధాని మంత్రి మోదీ, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడులను ఢిల్లీలో కలిసి వినతి పత్రం సమర్పించినట్టు తెలిపారు. అలాగే, తమిళనాడు ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వంకు శనివారం తాను లేఖ రాసినట్టు పేర్కొన్నారు. జయలలిత మరణం వెనుక ఉన్న కుట్రను బయటకు తీయాలని , ప్రజల కోరిక మేరకు సీబీఐ విచారణ జరిపించేందుకు కేంద్రాన్ని కోరాలని విన్నవించినట్టు తెలిపారు. అమ్మ మీదున్న గౌరవాన్ని చాటుకోవాలని సూచించినట్టు చెప్పారు. అలాగే, తెలుగు విద్యార్థులకు గతంలో జయలలిత ఇచ్చిన హామీని నెరవేర్చాలని సూచించినట్టు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో జయలలితకు అభిమాన లోకం ఉందని, హైదరాబాద్‌లో ఆమెకు చెందిన స్థలంలో జ్ఞాపకార్థం తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం స్మారక మందిరాన్ని నిర్మించాలని ఆ లేఖలో పేర్కొనట్టు కేతిరెడ్డి వివరించారు. అలాగే, ఢిల్లీలో సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డిని సైతం కలిసి వినతి పత్రం సమర్పించినట్టు చెప్పారు. అమ్మకు రజనీ అభిమానుల నివాళి తమిళసినిమా: ఇటీవల అందరి ఆశలను నిరాశ చేసి తిరిగిరాని లోకాలకు వెళ్లిన జయలలితకు మృతికి తమిళ ప్రజలు కన్నీరు మున్నీరుగా ఏడ్చిన విషయం తెలిసిందే. ఏ విషయంలోనైనా ముందుండే సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులు శనివారం అమ్మ కు ఘన నివాళులర్పించారు. సుమారు ఐదు వేల మంది అభిమానులు మెరీనా బీచ్ వద్ద న్న జయలలిత సమాధిని శనివారం దర్శించి పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించారు. ట్రాఫిక్ రామస్వామికి అస్వస్థత టీనగర్: సామాజిక వేత్త ట్రాఫిక్ రామస్వామి శనివారం స్వల్ప అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు. ట్రాఫిక్ రామస్వామి(83) సామాజిక సమస్యలపై అనేక సార్లు కోర్టులో పలు కేసులు దాఖలు చేశారు. మద్రాసు హైకోర్టులో శనివారం ఉదయం ఓ కేసు విచారణకు హాజరైన ట్రాఫిక్ రామస్వామి హఠాత్తుగా స్పృహ తప్పి కిందపడ్డారు. దీంతో ఆయనను వెంటనే స్థానిక ఆళ్వారుపేటలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ అత్యవసర చికిత్స విభాగంలో చికిత్సలనంతరం ఆయన కోలుకోవడంతో సాధారణ వార్డుకు మార్చారు. -
చిన్నఅమ్మ
• శశికళ (60) • జన్మస్థలం : మన్నార్గుడి • జన్మదినం : 26 జనవరి 1956 • తల్లిదండ్రులు : కృష్ణవేణి, వివేకానందం ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం...తమిళనాట రెండాకులు ఎక్కువే చదివింది.అందులో ఒక ఆకు... అమ్మ. ఇంకో ఆకు... చిన్నమ్మ.ఈ ఆకుల్లోనే పార్టీ కేడర్ మొత్తం సంతోషంగాకడుపు నింపుకుంటోంది.ఇప్పుడు ఒక ఆకు రాలిపోయింది.మిగిలిన రెండో ఆకుకు ‘జయ’కళ వస్తుందా?ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ తమిళ్ క్వొశ్చన్! శశికళ ప్రస్తుతం పార్టీకి పెద్ద దిక్కుగానే కాదు, టాక్ ఆఫ్ ది కంట్రీగానూ మారారు. జయలలితను అత్యవసర స్థితిలో అపోలో ఆసుపత్రిలో చేర్పించాక ఆమెను కలుసుకుని పరామర్శించే అవకాశం ఆమె రక్త సంబంధీకులకు గానీ, గవర్నర్‌కుగానీ, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకుగానీ, కేంద్ర మంత్రులకు గానీ, మరే ప్రముఖులకు గానీ కలుగలేదు. వచ్చినవారంతా ఆసుపత్రిలోని వైద్యులతో మాట్లాడి వెనుదిరుగుతున్నారు. ‘చూడాల్సిన వాళ్లను చూసాము’ అని మాత్రమే మీడియాతో అంటున్నారు. వాస్తవానికి వైద్యులు మినహా జయలలితను నేరుగా కలుసుకున్నది కేవలం ఒకే ఒక్కరు. ఆమె శశికళ మాత్రమే! పార్టీతోనూ, ప్రభుత్వంతోనూ ప్రత్యక్షంగా సంబంధంలేని శశికళకు, జయలలితకు ఉన్న అనుబంధం అంత బలీయమైనది. కలెక్టర్ ఇంట్లో ఆయా! శశికళ జన్మస్థలం తంజావూరు జిల్లా మన్నార్‌కుడి. పాఠశాల విద్య వరకే ఆమె చదువుకున్నారు. చిన్ననాటి నుండీ సినిమా నటి కావాలని శశికళ కోరిక. సినిమాలపై ఉన్న ఇష్టంతో ఆమె చెన్నై టీటీకే రోడ్డులో సినిమా కేసెట్ల లెండింగ్ లైబ్రరీ నడిపేవారు. ఆమె భర్త నటరాజన్ అప్పటి జిల్లా కలెక్టర్ చంద్రలేఖ దగ్గర పార్ట్‌టైమ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్‌గా పనిచేసేవారు. ‘కేసెట్ లెండింగ్ లైబ్రరీ వల్ల పెద్దగా ఆదాయం రాదు, నీ భార్య చేత వీడియో కవరేజ్ షాపు పెట్టించు’ అని నటరాజన్‌కు సలహా ఇచ్చింది చంద్రలేఖేనని అంటారు. ఆ సమయంలోనే చంద్రలేఖకు బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డ ఆలనా పాలన చూసేందుకు శశికళ ఆయాగా వెళ్లారు. వాస్తవానికి శశికళకు ఆయాగా పనిచేసే అవసరం లేదు. పెద్దవాళ్లతో పరిచయాల పట్ల ఆసక్తి ఉండడం ఆమెను అటువైపుగా నడిపించింది. శశికళ దంపతులకు పిల్లలు లేరు. బహుశా ఆ లోటును తీర్చుకునేందుకు కూడా ఆమె ఆయాగా ఉండేందుకు ఒప్పుకుని ఉండాలి. జయతో తొలి పరిచయం అది 1984వ సంవత్సరం. జయలలిత అన్నాడీఎంకే ప్రచార కార్యదర్శి హోదాలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ బహిరంగ సభల్లో ప్రసంగిస్తున్నారు. తన ప్రసంగాలను వీడియోగా చిత్రీకరించి కేసెట్లుగా అందించేందుకు ఒక వ్యక్తి కావాలని జయ చంద్రలేఖను కోరడంతో తన వద్ద ఆయాగా పనిచేస్తున్న శశికళను జయకు పరిచయం చేశారు చంద్రలేఖ. ఇలా జయకు దగ్గరైన శశికళ సినిమా వీడియో కేసెట్లను కూడా జయకు ఇస్తూ ఉన్న క్రమంలో వారి పరిచయం స్నేహంగా మారింది. ఎంజీ రామచంద్రన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఆ సమయంలోనే తనపై పార్టీ వ్యతిరేకుల నుంచి వస్తున్న ఒత్తిళ్ల నుంచి శశికళ స్నేహం జయను సేదతీర్చిందని అంటారు. స్త్రీకి స్త్రీగా ఆలంబన ఎంజీఆర్ మరణం జయకు గడ్డు పరిస్థితిని తెచ్చిపెట్టింది. ఆ కష్టకాలంలో శశికళ జయకు ఆలంబనగా నిలిచారు. ఎంజీఆర్ సతీమణి జానకీ రామ చంద్రన్ ప్రవేశంతో అన్నాడీఎంకే రెండుగా చీలిపోయి ఎన్నికల పోరాటానికి దిగినప్పుడు శశికళ ఆమెకు అండగా ఉన్నారు. జయ ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టినపుడు డీఎంకే సభ్యుల నుండి భౌతికదాడులకు, చీరలాగడం వంటి అవమానాలకు గురైన సమయంలో కూడా శశికళే జయకు ఓదార్పు. ఆ తరువాత జయలలిత నివాసమైన పోయెస్ గార్డెన్‌లోనే శశికళ కూడా ఉంటూ ఆమె అంతరంగికురాలిగా మారిపోయారు. బంధువుల కేంద్ర బిందువు 1991 అసెంబ్లీ ఎన్నికల్లో జయ పార్టీ అధికారంలోకి వచ్చింది. తొలిసారిగా జయ ముఖ్యమంత్రి అయ్యారు. ఇదే సమయంలో శశికళ బంధువులూ జయకు చేరువయ్యారు. శశికళ అన్న కుమారుడు సుధాకరన్ను జయ దత్తత తీసుకున్నారు. శశికళ మరో సోదరుడు జయరామన్ హైదరాబాద్‌లోని జయకు చెందిన తోటకు మేనేజర్ అయ్యాడు. తర్వాత ఆ తోటలో జరిగిన విద్యుత్ ప్రమాదంలో జయరామన్ మృతి చెందడంతో, ఆయన భార్య ఇళవరసి తన చంటి బిడ్డతో పోయెస్ గార్డెన్‌కు మకాం మార్చారు. అలా శశికళ వల్ల ‘జయ కుటుంబం’ పెద్దదయింది! బంధుగణంతో చిక్కులు, చికాకులు ఒకవైపు జయ నీడలా శశికళ ఉన్నా, ఆమె బంధువులను మాత్రం జయ ఉపేక్షించలేదు. వారిపై క్రమశిక్షణ చర్యలను తీసుకున్నారు. ముందుగా శశికళ భర్త నటరాజన్‌ను పక్కన పెట్టేశారు. ఆయనపై అనేక కేసులు బనాయించి అరెస్ట్ చేయించారు. అప్పుడు కూడా మనసా వాచా జయతోనే ఉండిపోయారు శశికళ. పార్టీ కోశాధికారి, ఎంపీ అయిన దినకరన్‌ను పార్టీ నుండి జయ బహిష్కరించారు. దత్తపుత్రుడు సుధాకరన్‌పై కూడా గంజాయి కేసు పడింది. అలా ఒకరొకరుగా శశికళ బంధువులంతా పోయస్‌గార్డెన్ నుండి దాదాపుగా బయటికి వెళ్లిపోవలసి వచ్చింది. భర్త సహా బంధువులంతా జయ చేత తిరస్కారానికి గురైనా శశికళ మాత్రం ఆమెతోనే ఉండిపోయారు. తోడబుట్టని సోదరి.. శశి జయ ఆడంబర జీవితంలోనే కాదు అష్టకష్టాల్లోనూ శశికళ ఆమెకు భరోసాగా నిలిచారు. జయ రాజకీయ జీవితంలో 1996 తీవ్ర ఆవేదన కలిగించిన ఏడాదిగా నిలిచింది. దత్త పుత్రుడు సుధాకరన్‌కు అత్యంత ఆడంబరంగా చేసిన వివాహం, ఆదాయానికి మించిన ఆస్తుల కేసు జయ ప్రభుత్వాన్ని కుదిపివేసింది. జయ అరెస్టు అయ్యారు. ఆమెతో పాటూ శశికళ కూడా అరెస్టయ్యారు. జయపై డీఎంకే పెట్టిన ప్రతికేసులోనూ శశికళ కూడా నిందితురాలిగా ఉన్నారు. జయ పతనానికి శశికళనే కారణమనే ప్రచారం కూడా జరిగింది. అప్పుడే తొలిసారి జయ బహిరంగంగా శశికళ గురించి మాట్లాడారు. ‘శశికళ నాకు తోడబుట్టని సోదరి, అంతేగాక ఆమె నాతోనే ఉంటారు, ఆమె గురించి ఎలాంటి ప్రశ్నలు అవసరం లేదు’ అని ప్రకటించారు. అమ్మంతటి అమ్మ చిన్నమ్మ శశికళను జయలలిత ఇలా సమర్థించడంతో పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ శశికళ ప్రాధాన్యం పెరిగింది. జయను అమ్మ అంటుండే పార్టీ శ్రేణులు శశికళను చిన్నమ్మ అని సంబోధించడం ప్రారంభించాయి. 2001 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చినా కేసుల కారణంగా జయ సీఎం కాలేక పోయారు. అప్పుడు పన్నీర్‌సెల్వంను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలన్న సలహా శశికళదే. అంతేకాదు, మంత్రి వర్గాన్ని కూడా ఆమే నిర్ణయించారు. అమ్మకు జరిగే అన్ని మర్యాదలు చిన్నమ్మకు కూడా జరగడం 2001 నుంచే మొదలైంది. అన్నీ ఓర్చుకుని... అమ్మ వెంటే... 2011లో జయ మళ్లీ అధికారంలోకి వచ్చినప్పుడు శశికళ కుటుంబ సభ్యుల రాకపోకలు మొదలయ్యాయి. దీంతో జయలలిత శశికళను కూడా పోయెస్ గార్డెన్ నుండి బైటకు పంపివేశారు. శశికళ కుటుంబానికి చెందిన రావణన్, కలియపెరుమాళ్, మిడాస్ మోహన్‌లపై కేసులు పెట్టించారు. శశికళతో గానీ ఆమె కుటుంబ సభ్యులతో గానీ ఎవరూ ఎలాంటి సంబంధాలు పెట్టుకోకూడదని పార్టీ శ్రేణులను హెచ్చరించారు. ఈ సందర్భంలో కూడా జయపై శశికళ ఎలాంటి ప్రతిఘటన ధోరణిని ప్రదర్శించలేదు. తన వారినీ ప్రదర్శించనీయలేదు. బహిరంగ సభల్లో విమర్శలు చేయలేదు. ఇతర పార్టీ నేతలతో కూడా సంబంధాలు పెట్టుకోలేదు. అందుకేనేమో... శశికళను విడిచి జయలలిత ఎక్కువకాలం ఉండలేకపోయారు. శశికళ మళ్లీ పోయెస్ గార్డెన్‌కు పిలిపించుకున్నారు. ‘నన్ను చూసుకోవడం శశికళ వల్లనే సాధ్యం, ఆమె లేకుండా నేను ఒంటరిగా ఉండలేను’ అని బహిరంగంగానే చెప్పుకున్నారు. ఈ బాంధవ్యమే.. కడవరకూ జయతోనే ఉండే భాగ్యాన్ని శశికళకు కల్పించింది. – కొట్రా నందగోపాల్, సాక్షి ప్రతినిధి, చెన్నై -
తంగచ్చి తలైవి
ఒకటి మాత్రం నిజం. ఏడుపుతో మోసం చెయ్యొచ్చు కానీ, ఏడుపు మోసం చెయ్యదు. జయలలిత భౌతికకాయం దగ్గర నిలుచుని ఉన్నప్పుడు శశికళ అనేకసార్లు దుఃఖిస్తూ కనిపించలేదు. ఆమెలో దుఃఖం కనిపిస్తూనే ఉంది. అయితే ఆ దుఃఖం శశికళ కళ్లల్లో కనిపించలేదు. ఆమె నిలబడి ఉన్న తీరులో, చేతులు కట్టుకుని ఉన్న ఆ మౌనంలో.. దుఃఖం పైపైకి ఉబుకుతూనే ఉంది. అన్ని వేళల్లో దుఃఖాన్ని కన్నీళ్లతో కొలవడం సరికాదు. జయ మరణించిన ఈ వేళలో ఆమె నెచ్చెలి శశికళను జయ నుంచి వేరు చేసి మాట్లాడుకోవడమూ సరికాదు. రాజకీయంగా ఎన్నో వస్తుంటాయి. విమర్శలు, ఆరోపణలు, దూషణలు, విపరీత విశ్లేషణలు! అవన్నీ ఇప్పుడు శశికళను కూడా అత్యంత సహజంగా చుట్టుముట్టాయి. తంపులమారి సుబ్రహ్మణ్యస్వామి.. శశికళను, ఆమె చేరదీసి తెచ్చుకున్న ఆమె ఊరివారిని కలిపి ‘మన్నార్గుడి మాఫియా’గా చేసిన విష పదప్రయోగం కూడా ఇప్పుడు శశికళ ఉద్దేశాలపై దుష్ప్రచారానికి బాగా ఉపయోగపడితే పడుతుండవచ్చు. అయితే ఈ ప్రచారం ఆమెను – జయ ఆత్మ ఎప్పటికీ శయనిస్తూ, సంచరిస్తూ ఉండే ఆమె అంతఃమందిరం ‘పోయెస్ గార్డెన్’ నుంచి – కూకటి వేళ్లతో సహా పెకిలించగలిగేంత బలమైన ఈదురుగాలిగా ఎప్పటికీ మారలేదు. జయ అనే లత అంతగా పెనవేసుకుపోయిన ఆలంబన వృక్షం.. శశికళ! ‘‘జయ దక్షతపై రెండు అభిప్రాయాలు లేవు’’ అని ఆమె బద్ధ విరోధి కరుణానిధి శ్రద్ధాంజలి ఘటిస్తూ అన్నారు. సాహసి, నిర్ణయశీలి అని కీర్తించారు. జయ రాజకీయ వారసురాలిగా శశికళకు కూడా అలాంటి కీర్తే దక్కుతుంది. జయ దగ్గర తన స్థానాన్ని చివరి వరకు ఆమె నిలబెట్టుకున్నారు. అదే స్థానం పార్టీ ముఖ్య నాయకులలో, ఎమ్మెల్యేలలో కూడా శశికళకు ఉంది. అమ్మ తర్వాత అమ్మగా ఎమ్మెల్యేలు శశికళను కొలుస్తున్నారు. పూమాల వేసి ఉన్న జయ చిత్రపటానికి ముకుళిత హస్తాలతో దివ్యాంజలి అర్పించిన నాయకులు.. ఆ వెంటనే, శశికళకు పాదాభివందనం చేస్తున్నారు! ‘అమ్మ.. పార్టీని అనా«థగా వదిలి వెళ్లలేదు’ అనే సంకేతం ఇది. సంతాప ఉద్వేగాలు పూర్తయ్యాక పార్టీ శశికళను తన పెద్దదిక్కుగా చేసుకున్నా, చిన్నమ్మగా చూసుకున్నా.. పార్టీలో శశికళ స్థానం ఎప్పటికీ పార్టీ సంరక్షకురాలిగానే ఉంటుందన్న భావన కు అదొక స్పష్టమైన అంతర్లీనత. దీనర్థం.. కాంగ్రెస్‌కు ఎలాగైతే సోనియాగాంధీ ‘సుప్రీం’గా ఉన్నారో, తమిళనాడులో అన్నాడీఎంకేకు శశికళ అలా సుప్రీంలా ఉంటారు. దీనర్థం.. ప్రస్తుత ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం.. నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌లా ఉండిపోతారు. అయితే కాంగ్రెస్ వారసత్వంగా దేశ ప్రజలు సోనియాగాంధీని స్వీకరించిన విధంగా తమిళ ప్రజలు శశికళను అంగీకరిస్తారా?! జయ భౌతికకాయాన్ని ఖననం చేశాక, ఆ మర్నాడు ఆమె సమాధి దగ్గరికి చేరుకున్న దక్షిణాది జిల్లాల తమిళ గ్రామీణులు గుండెలు అవిసిపోయేలా విలపించారు. అమ్మ కనుమరుగవడం ఒక్కటే వారికి కనిపిస్తోంది. భవిష్యత్తు కనిపించడం లేదు. నాయకులకు అలా కాదు. ఇంకో అమ్మ దొరుకుతుంది. దొరికింది కూడా. కానీ ఆ అమ్మను వీరు తమ అమ్మగా భావించడానికి ఇష్టపడడం లేదు. ‘‘జయలలిత లోటును శశికళ తీర్చగలరు కదా’’ అని అక్కడున్న ఓ మహిళను మా ‘సాక్షి’ చెన్నై ప్రతినిధి అడిగినప్పుడు ఆమె పెద్దగా రోదించారు. ‘‘ఇల్ల, ఇల్లై’’ (లేదు.. లేదు) అని గుండెలు బాదుకుంటూ అన్నారు. రాజకీయాలతో నిమిత్తం లేకుండా జయను ఆరాధించే సామాన్య తమిళ ప్రజల మనోభావాలనైతే ఈ సమాధానంలోంచి మాత్రమే ఎవరైనా సంగ్రహించవలసి ఉంటుంది. మూడు దశాబ్దాల జయ–శశిల స్నేహంలో.. శశికళను వారు జయకు నీడగా చూశారో లేదో కానీ, నీడను మిగిల్చి వెళ్లిపోయిన జయకు సజీవరూపంగా శశికళను చూడాలనుకోవడం లేదు. అసలు శశికళను ఎలా చూడాలి? ఎలాగైనా చూడొచ్చు. విలన్‌గా కూడా చూడొచ్చు. ఎలా చూసినా ఆమెను జయ చూసిన కళ్లతోనే చూడాలి. శశితో పడింది జయే కాబట్టి! కానీ జయ అలా అనుకోలేదు. ‘శశి నన్ను అమ్మలా చూసింది. మా అమ్మే ఉండి ఉంటే నన్ను శశి చూసినట్లే చూసి ఉండేది’ అని జయ తనతో అన్నట్లు 71 ఏళ్ల సీనియర్ జర్నలిస్టు ఎన్.రామ్ ఓ సందర్భంలో రాశారు. జయకు జగమంత కుటుంబం ఉండొచ్చు. కుటుంబం లేదు. ఆ లోటును శశి తీర్చారు. తన కుటుంబాన్ని వదులుకుని వచ్చి మరీ జయకు బాసటగా ఉన్నారు. ఆమె కష్టాల్లో, ఇష్టాల్లో జయ వెంటే ఉన్నారు. ఆమెతో కలిసి జైలుకు వెళ్లారు. వెళ్లి పొమ్మంటే వెళ్లి, రమ్మనగానే మళ్లీ వచ్చేశారు. శశి జయకు ఆదరణగా ఉన్నారే కానీ, ఏనాడూ ఆత్మాభిమానాన్ని చూపించుకోలేదు. ఆ విధేయత, ఆ మనోనిబ్బరం, ఆ రాజకీయ సూక్ష్మగ్రాహ్యత పార్టీలో శశికి తప్ప మరెవరికీ లేనివి. అన్నిటినీ మించి శశి.. జయకు ఆత్మసఖి. మరణించేంత వరకు జయ జీవితంలోని అర్థవంతమైన అనుబంధం కూడా ఒక్క శశికళే. శశికళను తక్కువచేసి మాట్లాడ్డం అంటే.. జయ కోరుకున్న అనుబంధాన్ని తక్కువ చేయడమే. జయ వేరొక అనుబంధాన్ని కోరుకోలేదు. పార్టీలో వేరొక ప్రత్యామ్నాయాన్ని ఎదగనివ్వలేదు. అంటే ఏమిటర్థం? సినిమాలపై ఇష్టంతో జయలలితకు దగ్గరై, ఆమెకు తన జీవితాన్నే అర్పించిన ఈ ‘ప్రతినాయకురాలు’ త్వరలోనే ‘తలైవీ’ కాబోతున్నారని. తంగచ్చి (సోదరి) తలైవి కాబోతున్నారని. • మాధవ్ శింగరాజు -
'అమ్మ' మొక్కు చెల్లించిన మాజీ ఎమ్మెల్యే
శ్రీకాళహస్తి: దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తి ఆలయంలో అన్నాడీఎంకే పార్టీ నార్త్-సౌత్ తిరువాతినాగర్ దిగాల్ మాజీ ఎమ్మెల్యే వడివేలు నీలకంఠం మొక్కు తీర్చుకున్నారు. జయలలిత తమిళనాడు సీఎం కావడంతో తన మొక్కు తీర్చుకునేందుకు శనివారం శ్రీకాళహస్తి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా 'అమ్మ' మొక్కును చెల్లించుకున్నారు. 66 కేజీల 543 గ్రాముల 860 మిల్లీల బరువు గల వెండి పూజా సామాగ్రిని స్వామివారి మూలమట్టం వెండి హారతి పళ్లెంలు, వెండి తాంబూలం తట్టలు, వెండి బిందెను ఆలయ కార్యనిర్వహణాధికారికి అందజేశారు. గతంలో తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీ అధినేత జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని వడివేలు నీలకంఠం శ్రీకాళహస్తి ఆలయంలో మొక్కుకున్నారు. అనంతరం ఆలయ ఈవో మాట్లాడుతూ.. సుమారు వీటి విలువ రూ. 32 లక్షల 66వేల 439 ఉంటుందని వెల్లడించారు. అనంతరం ఆయనకు శ్రీకాళహస్తి ఆలయ ఈవో.. స్వామి, అమ్మవార్ల దర్శనం ఏర్పాటు చేసి దక్షిణామూర్తి వద్ద వేద పండితులచే ఆశీర్వాదం ఇప్పించి వారికి తీర్ధప్రసాదాలు ఇచ్చారు. -
కొత్త దేవతల వరాల జల్లులు
జాతిహితం ద్రవిడ సాధికారతా మహోద్యమాన్ని ప్రజ్వలింపజేసిన నాస్తికత్వం నేడు పాతకాలపు ఉద్వేగంగా మారిపోయింది. ద్రవిడ పార్టీలు నాస్తికత్వాన్ని వదిలేయడంతో తాయిలాల పంపకం కొత్త దేవునిగా అవతరించింది. హేతువాదం క్షీణించి, ద్రవిడ రాజకీయాలు చీలి పోవడంతో ఏర్పడ్డ రెండు పార్టీలూ నేడు పూర్తి భావజాలరహితమైనవిగా మారాయి. కాబట్టి ఈ ఎన్నికల్లో పెద్ద సమస్యలూ లేవు, ఒకరినొకరు అవినీతిపరులని ఆరోపించుకునే అవకాశమూ లేదు. రెండు పార్టీల ఉమ్మడి విశ్వాసం తాయిలాల పంపకమే. మన దేశంలో పర్యటిస్తున్నప్పుడు కనిపించే గోడల మీద రాతలు కొత్త పరిణామాల ఆవిర్భావాన్ని సూచిస్తుంటాయి. ప్రత్యేకించి ఎన్నికల సమ యంలోననే కాదు, ఎప్పుడైనా జరిగేదే. నగరాలు, వేగంగా పట్టణీకరణ చెందుతున్న గ్రామాలతో కూడిన పల్లెపట్టున పర్యటిస్తున్నప్పుడు మనం పూర్తిగా కళ్లు విప్పార్చి, చెవులు రిక్కించి గోడల మీద ఏమి రాసున్నదో లేదా మన చెవుల్లో ఏమి మారుమోగుతున్నదో గమనించాలి. మన దేశంలో ఏది మారుతోందో, ఏది మారడం లే దో అనివార్యంగా మీకు తెలుస్తుంది. భారత ఉపఖండం తన హృదయాన్ని గోడల మీద పరుస్తుంది. తమిళనాడు రాజ కీయాలు ప్రత్యేకమైనవి అయినంత మాత్రాన ఆ రాష్ట్రం అందుకు మినహా యింపనడానికి హేతువేమీ కనిపించదు. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు, పేరెన్నికగల పట్టు వస్త్రాలకు పేరుమోసిన కాంచీపురం నాకు దేశంలోకెల్లా అత్యంత ఇష్టమైన స్థలం. చెన్నైకి వంద కిలోమీటర్ల దూరంలోని ఆ పాత పట్టణం శివారున పురాతనమైన శంకర మఠం ఉంది. అది శంకారాచార్యుల నివాసస్థానం. సనాతన హిందూవాద ఆధ్యాత్మిక అధికారానికి అతి ప్రముఖ కేంద్రం. అక్కడ మీరు తగినంత ఎక్కువ కాలమే గడిపేట్టయితే, నేను అక్కడికి వెళ్లిన మొదటిసారి చేసినట్టే మీరూ శంకరాచార్యులను సందర్శించడానికి వెళ్లేట్టయితే... ఆయన ‘‘జూని యర్’’ రాక కోసం వేచి చూస్తున్న శ్రోతలకు వినిపించే రికార్డు చేసిన సంస్కృత శ్లోకాలూ, మఠానికి బయట పక్కనే ఉన్న జుమా మసీదు నుంచి వినిపించే అజాన్ (ప్రార్థనకు పిలుపు) అనుద్దేశపూర్వకంగానే కలగలసి జుగల్ బందీలా ధ్వనించడాన్ని వినకుండా ఉండలేరు. మతతత్వం, నాస్తికత్వాల సహవాసం సరిగ్గా ఆ వీధి కూడలిలో శంకరాచార్యుల కోసం పూలు, పళ్లు కొనడానికి దిగే చోట... 20వ శతాబ్దపు అత్యంత సుప్రసిద్ధ విగ్రహ విధ్వంసకుడైన పెరియార్ బస్ట్ సైజు విగ్రహం కనిపిస్తుంది. ఆయనను మరచిపోయిన తరాలవారు సునీల్ ఖిలానీ తాజాగా రాసిన ‘ఇన్కార్నేషన్స్’ను త్వరత్వరగా తిరగేసి చూడొచ్చు. బ్రాహ్మణవాదం, కులవాదం, సామాజిక అసమానత, మూఢ నమ్మకాల వ్యతిరేక పోరాటంతో దేశంలోనే అత్యంత శక్తివంతమైన, వివాదాస్పదమైన సామాజిక-రాజకీయ పరివర్తన ఉద్యమాన్ని పెరియార్ ప్రారంభించారు. ఆయన వీటన్నిటినీ హేతువాదం, నాస్తికత్వం అనే ఒకే భావజాల ఛత్రం కింద చేపట్టారు. ఇప్పుడాయన మఠం, మసీదులను చూస్తూ ఉన్నారు. అంతేకాదు విగ్రహానికి కింద దేవుడిని, దైవత్వాలను ఖండిస్తూ చేసిన ఆయన వ్యాఖ్యలు పెద్ద పెద్ద అక్షరాలతో చెక్కించుకుని మరీ పరివేష్టితులై ఉనారు. దేవుడు లేడు/దేవుడు లేడు/దే వుడు లేనే లేడు/దేవుణ్ణి కనిపెట్టివవాడు మూర్ఖుడు/దేవుణ్ణి ప్రచారం చేసేవాడు వంచకుడు/దేవుణ్ణి పూజించేవాడు ఆటవికుడు: దేశంలోని మరే ప్రజా నాయకుడు దేవుణ్ణి ఖండించి, ధిక్కరించి ఎరుగని రీతిలో ఆయన... గొప్ప హిందూ సాంస్కృతిక కేంద్రం, ప్రముఖ మసీదులతో పాటూ ఆ వ్యూహాత్మక ప్రదేశాన్ని పంచు కుండటమే ముఖ్యమైన విషయం. గాఢమైన, సనాతన మతతత్వం, అత్యంత సూటియైన హేతువాదం కలసి ఒకే రెండు వందల చదరపు గజాల స్థలాన్ని పంచుకోవడాన్నిమరే దేశంలో చూడగలం? హిందూ గ్రూపులు దీన్ని అపచారమంటూ సవాలు చేశాయి. కానీ మద్రాసు హైకోర్టు 1979 తీర్పులో ఒక వ్యక్తి విగ్రహంతో పాటూ అతని అభిప్రాయాలను లిఖించడంలో తప్పేమీ లేదని తీర్పు చెప్పింది. ఆ ఆదేశాల సారాంశం సైతం కళ్ల జోడు పెట్టుకున్న పెరియార్‌కు దిగువన మరో నల్ల రాతిపై కనిపిస్తుంది. సుప్రసిద్ధ విగ్రహ విధ్వంసకుడే నల్ల రాతి ప్రతిమ అవతారమెత్తి దేవుళ్లను వెక్కిరించడం, అది నల్ల రాతిపై తెల్ల అక్షరాలతో చెక్కి ఉండ టానికి మించిన వ్యంగ్య పరిహాసం ఇంకేమంటుంది? నాస్తికత్వానికి ద్రవిడ పార్టీల చెల్లు చీటి ఒకప్పడు ద్రవిడ సాధికారతా మహోద్యమాన్ని ప్రజ్వలింపజేసిన నాస్తికత్వం నేడు పాతకాలపు ఉద్వేగంగా మారిపోయింది. బ్రాహ్మణ కులానికి చెందిన జయలలిత తన మతతత్వాన్ని ఎన్నడూ దాచుకున్నది లేదు. ఇక క రుణానిధి, ప్రముఖ రాజకీయ శాస్త్రవేత్త యోగేంద్ర యాదవ్ (నా వాదనకు మద్దతు కోసం ఆధారపడుతున్నది ఆయనపైనే) అన్నట్టు... పాత హేతువాదపు చివరి ప్రముఖ స్వరంగా ఇంకా కొనసాగుతూనే ఉన్నా, ఆయన తర్వాత ఇప్పట్లో అలాంటి వారు ఆవిర్భవించరు. ఆయన కుమారుడు స్టాలిన్ కుటుంబం తరచుగా దేవాలయాలను సందర్శిస్తుంది. పురావస్తు, చారిత్రకపరమైన ఆసక్తితోనే వెళుతున్నామనేదే వారు చెప్పే ప్రధానమైన సాకు. ఎన్నికలు జరగ నున్న తమిళనాడులో నేను గడిపిన ఐదు రోజుల్లో దేవుడులేడనే తత్వం గుర్తున్న ఒక్క ఓటరు కూడా నాకు కనబడలేదు లేదా నా దృష్టికి రాలేదు. ఆలయాల నిండా భక్తులున్నారు. పెద్ద సంఖ్యలో బ్రాహ్మణేతర పురోహితు లున్నారు. దక్షిణాదిలోని ప్రముఖ దైవాంశ సంభూతులైన బాబాలు, గురు వుల అనుయాయులు ఆ రాష్ట్రంలోనే ఎక్కువగా ఉన్నారు. సద్గురు జగ్గీ వాసుదేవ్, శ్రీశ్రీ రవిశంకర్‌లు సైతం వారిలో ఉన్నారు. కరుణానిధి భార్య లలో ఒకరు పెద్ద కుంకుమ బొట్టును పెట్టుకుంటారని డీఎండీకే నేతగా మారిన సినీ నటుడు విజయ్‌కాంత్ చెబుతున్నారు. తమిళ రాజకీయాలు, సంస్కృతికి సంబంధించిన ప్రముఖ చరిత్రకారులలో ఒకరైన ఏఆర్ వెంకటాచలపతి నేను కనుగొన్న విషయాలతో ఏకీభవిస్తూనే... సీఎన్ అన్నాదురై సైతం 1940ల చివర్లో పెరియార్‌తో విడిపోయినప్పుడు ఆయన నాస్తికత్వానికి దూరంగా జరిగారనే విషయాన్ని నొక్కి చెప్పారు. ఎన్నికల రాజకీయాల్లో పాల్గొనే సమస్యపై అన్నాదురై, పెరియార్‌కు దూరమయ్యారు. ఏడు దశాబ్దాల తర్వాత సరిగ్గా అదే విషయంపై కేజ్రీవాల్, అన్నా హజారే నుంచి విడిపోయారు. సామాజిక అసమానతపై దాడి చేయడానికి హేతు వాదాన్ని ఉపయోగించుకోవడం, అందుకు వ్యతిరేకులుగా ఉన్న ఓటర్లను ఆక ట్టుకోవడం పూర్తిగా భిన్నమైనవని అన్నాదురై గుర్తించారని వెంకటాచలపతి గుర్తుచేశారు. తమిళనాడులోకెల్లా అత్యంత జనాదరణగల దేవుడు గణేశుడు. అంతేకాదు పెరియార్ పగలగొట్టిన దేవుళ్ల విగ్రహాల్లో గణేశుని విగ్రహాలే ఎక్కువ. ‘‘నేను పిళ్లయ్యార్కు కొబ్బరికాయలూ కొట్టను, ఆయన విగ్రహాలూ పగులగొట్టను’’ అని అన్నాదురై 1954లో చెప్పిన సుప్రసిద్ధ వాక్యాలను ఆయన గుర్తుకు తెచ్చారు. అమ్మ, స్టాలిన్ల నడుమ ఆ ఎడబాటు ఇప్పడు పరిపూర్ణమైంది. జనాకర్షణ కోసం పాట్లే భావజాలం బ్రాహ్మణాధిపత్య క్షీణత కూడా ఇందుకు తోడ్పడింది. పీకే సినిమాలోని అమీర్‌ఖాన్ అంగారక గ్రహవాసి బాబాలకు ‘‘దేవుని మేనేజర్లు’’ అని పేరు పెట్టడానికి చాలా ముందే ద్రవిడ ఉద్యమ వ్యవస్థాపకులు ఆ విషయాన్ని గుర్తించారు. ఇప్పుడా మేనేజర్లు ధైర్యంగా మాట్లాడుతుండగా... నాటి ద్రవిడ ఉద్యమ నేతల పిల్లలకు దేవలతో అలాంటి పేచీయే లేకుండా పోయింది. ఆ పార్టీల్లోని కరడుగట్టిన నాస్తికులు దీనికి చుట్టుదారిని కనుగొన్నారు. వృద్ధ కరుణానిధిలాగే నేనూ కొంతకాలం ప్రముఖ యోగా బోధకుడు టీకేవీ దేశి కాచార్ (కృష్ణమాచార్య యోగా మందిరం) వద్ద యోగాభ్యాసం చేశాను. ఆయన ఎన్నడూ ‘‘ఓం’’ అని పలికి ఎరుగరు. ‘‘సూర్యుడు, ఎంతైనా మా పార్టీ గుర్తే కదా’’ అంటూ ఆయన తనకు సూర్య నమస్కారాలతో సమస్యేమీ లేదని చెప్పారు. హేతువాదం క్షీణించిపోయి, ద్రవిడ రాజకీయాలు చీలిపో వడంతో దాదాపు ఒకే భావజాలంగల రెండు పార్టీలు ఏర్పడ్డాయి. అయితే ఆ రెండు పార్టీలూ నేడు పూర్తి భావజాలరహితమైనవిగా మారిపోయాయి. కాబట్టి ఈ ఎన్నికల్లో శ్రీలంక సహా పెద్ద సమస్యలంటూ ఏమీ లేవు. తమిళ రాజకీయాల్లోని ఆ రెండు ధ్రువాలను సూచించే ప్రత్యేక సూత్రాలు, భావాలు లేదా నినాదాలు ఏవీ లేవు. ఒకరు మరొరిని అవినీతిపరులని ఆరోపించే అవకాశమైతే అసలుకే లేదు. ఉన్నవల్లా యుద్ధానికి దిగిన కుటుంబాలే. అవి కరుణానిధి కుటుంబం, ఎమ్జీఆర్ కుటుంబం. రెండు పార్టీల ఉమ్మడి విశ్వాసం ఓటర్లకు తాయిలాల పంపకమే. అమ్మ ఓటరుకు పూర్తి వంటగది సామాను, కుటుంబ వినోదం, కొంత బంగారం కూడా ఉచితంగా ఇచ్చేస్తారు. డీ ఎంకే ఆమె ఇచ్చే ఉచిత కానుకలను దుమ్మెత్తి పోస్తుందనిగానీ, అదీ విద్యార్థుల, రైతుల రుణాలను మాఫీ చేస్తానంటుంది. ఇక విజయకాంత్ ఈ అర్థరాహిత్యాన్ని మరో స్థాయికి లేవ నెత్తి ఉచితంగా రేషన్ సామానంతా ఇంటికే సరఫరా చేస్తామంటారు. దేవుడు పూర్తిస్థాయిలో పునఃప్రవేశం చేయడంతో తాయిలాల పంపకమే నూతన రాజకీయ భావజాలంగా మారింది. అయినా ద్రవిడవాద పునరు ద్ధరణ మొలకలు కొన్ని కనిపిస్తున్నాయి. అతి చిన్న పట్టణాలలో పుస్తకాలు, పేపర్ల దుకాణాల్లో పెరియార్ రచనలు అత్యధికంగా అమ్ముడు పోతున్నాయి. ‘‘ఒక రాజకీయ మతాన్ని దాని అనుచరులు వదులుకున్నాక దాని అంచులలో మనుగడ సాగిస్తున్నవారు మరింత గట్టి భావజాలవాదులుగా మారారు’’ అని వెంకటాచలపతి అన్నారు. నేటి తమిళనాడులో పెరియార్వాదులైన యువత, విద్యార్థులు పెరగడం, విద్యావంతులైన దళిత యువత ఆయనపట్ల ఆకర్షితులు కావడం పెరగడం దాన్నే ప్రతిబింబిస్తోంది. ఈ నూతన కేంద్రీ కరణ ఎంత శక్తివంతమైనదో మనం ఇప్పటికే మద్రాసు ఐఐటీలో అంబేడ్కర్-పెరియార్ గ్రూపు ఏర్పాటు ద్వారా చూశాం. భారత రాజ కీయాలు ఎప్పుడూ విస్మయకర అంశాలను బయటపెడుతుంటాయి. అదే మన రాజకీయాలకున్న ప్రబల ఆకర్షణ శక్తి. - శేఖర్ గుప్తా Twitter@ShekarGupta -
'జయతో వారం క్రితం మాట్లాడా'
-
అబ్దుల్ కలాం పేరుతో అవార్డు..
* బంగారు పతకం, రూ. 5 లక్షల నగదు బహుమతి * తమిళనాడు సీఎం జయలలిత ప్రకటన సాక్షి, చెన్నై: మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త దివంగత ఏపీజే అబ్దుల్ కలాం స్మారకార్థం ఆయన పేరుతో ఏటా ఆగస్టు 15న ఓ అవార్డును అందజేయనున్నట్లు తమిళనాడు సీఎం జయలలిత శుక్రవారం ప్రకటించారు. శాస్త్రీయ విజ్ఞానంలో ఉన్నత ఫలితాలు సాధించినవారు, విద్యార్థుల ఉన్నతికి శ్రమిస్తున్నవారు, మానవతావాదిగా నిలిచినవారికి ఈ ‘డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు’ను అందజేయనున్నట్లు తెలిపారు. అవార్డు కింద 8 గ్రాముల బంగారు పతకం, రూ. 5 లక్షలు, ప్రశంసాపత్రం అందజేస్తామన్నారు. అవార్డును ఈ ఏడాది నుంచే ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా భారతరత్న అబ్దుల్ కలాం జయంతి అయిన అక్టోబర్ 15వ తేదీని యువ చైతన్య దినంగా పాటించనున్నట్లు తెలిపారు. కాగా, మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాం బొమ్మతో నాలుగు స్టాంపులను రూపొందించినట్లు తపాలా శాఖ చెన్నై డెరైక్టర్ తెలిపారు. ఇగ్నైటెడ్ మైండ్స్ సీక్వెల్.. కలాం రచన ఇగ్నైటెడ్ మైండ్స్ సీక్వెల్ సహా ఆయన రాసిన పలు కొత్త పుస్తకాలు త్వరలో ముద్రితం కానున్నాయి. ఇగ్నైటెడ్ మైండ్స్ సీక్వెల్‌గా కలాం ప్రసంగాల సంకలనం ‘మై ఇండియా: ఐడియాస్ ఫర్ ద ఫ్యూచర్’ను పఫిన్ బుక్స్ ప్రచురించనుంది. -
చెన్నైలో మెట్రో రైలు పరుగులు
-
చెన్నైలో మెట్రో రైలు పరుగులు
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై మహానగరంలో మైట్రో రైలు పరుగులు తీసింది. ముఖ్యమంత్రి జయలలిత వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా కోయంబేడు - ఆలందూరు మార్గంలో మెట్రో రైలును సోమవారం ప్రారంభించారు. మెట్రో రైలు ప్రారంభోత్సవ వేడుకను నిరాడంబరంగా నిర్వహించారు. సచివాలయం నుంచే జెండా ఊపారు. కోయంబేడు, ఆరుంబాక్కం, వడపళని, అశోక్‌నగర్, ఈక్కాడుతాంగల్, ఆలందూరు రైల్వే స్టేషన్లను సీఎం ప్రారంభించారు. తొలి రోజు పట్టాలెక్కే రైళ్లు ప్రత్యేక ఆకర్షణగా కన్పించే రీతిలో పుష్పాలతో అలకరించేందుకు రూ.28 లక్షలు కేటాయించడం గమనార్హం. -
జయపై పోటీ చేయట్లేదు: కరుణ
-
జయపై పోటీ చేయట్లేదు: కరుణ
హైదరాబాద్: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితపై పోటీకి డీఎంకే దూరంగా జరిగింది. ఆమె పోటీ చేయనున్న ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థులను నిలబెట్టడం లేదని డీఎంకే అధినాయకుడు కరుణానిధి తెలిపారు. జయలలితపై అక్రమాస్తుల కేసును కర్ణాటక హైకోర్టు కొట్టేసిన తర్వాత.. ఆమె మళ్లీ ఎన్నికయ్యేందుకు వీలుగా ఆర్కేనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఆరు నెలల్లోగా ఏదో ఒక సభకు ప్రాతినిధ్యం వహించడం తప్పనిసరి. దాంతో.. ఆమె త్వరలోనే ఆర్కేనగర్ నుంచి పోటీ చేస్తారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ తాము తమ అభ్యర్థిని బరిలోకి దించడంలేదని కరుణానిధి ప్రకటించడం గమనార్హం. అక్కడ పోటీ చేస్తే బాగుండదేమో అని భావించిన డీఎంకే సారథి కరుణానిధి తమ పార్టీ నుంచి అభ్యర్థులను పోటీలో ఉంచబోమని స్పష్టం చేశారు. ఇంకా వేరే పార్టీల అభ్యర్థలు పోటీలో ఉంటారా.. లేదా ? అన్న విషయం తెలియరాలేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం ఖుష్బూ పోటీ చేయొచ్చని చెబుతున్నారు. ఒకవేళ ఏ పార్టీ నుంచి అభ్యర్థులు బరిలో లేకుంటే 'అమ్మ' ఎన్నిక ఏకగ్రీవమే కావచ్చు. -
నేడు సీఎంగా జయలలిత ప్రమాణస్వీకారం
-
జయ ప్రమాణం నేడే
ఐదోసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు మద్రాస్ యూనివర్సిటీ ఆడిటోరియంలో ప్రమాణస్వీకారం శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన పురుచ్చితలైవి సీఎం పదవికి పన్నీర్‌సెల్వం రాజీనామా.. గవర్నర్ ఆమోదం అభిమానుల జయజయధ్వానాల మధ్య రాజ్‌భవన్‌కు పయనం గవర్నర్ రోశయ్యతో భేటీ.. 28 మందితో కూడిన మంత్రుల జాబితా అందజేత చెన్నై: అన్నాడీఎంకే అధినేత జయలలిత ముఖ్యమంత్రి పీఠం అధిష్టించేందుకు ముహూర్తం ఖరారైంది. శనివారం ఉదయం 11 గంటలకు మద్రాస్ యూనివర్సిటీ ఆడిటోరియంలో ఐదోసారి తమిళనాడు సీఎంగా ఆమె ప్రమాణం చేయనున్నారు. 28 మంది మంత్రులు కూడా ప్రమాణం చేస్తారు. శుక్రవారం తమిళనాట కీలక పరిణామాలు చకచక చోటుచేసుకున్నాయి. ఉదయం ఏడు గంటలకే పార్టీ ప్రధాన కార్యాలయంలో 148 మంది ఎమ్మెల్యేలు సమావేశమై జయను శాసనసభా పక్ష నేత(ఎల్పీ)గా ఎన్నుకున్నారు. అదే సమావేశంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఒ.పన్నీర్ సెల్వం ప్రకటించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయ దోషిగా తేలడం, ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పుకోవడంతో కిందటేడాది సెప్టెంబర్ 29న ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో జయ పేరును పన్నీర్ సెల్వమే ప్రతిపాదించగా.. ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ భేటీకి విజయ్‌కాంత్ నేతృత్వంలోని డీఎండీకేకు చెందిన ఏడుగురు రెబల్ ఎమ్మెల్యేలు కూడా హాజరై జయకు మద్దతు పలకడం గమనార్హం. ఈ భేటీ తర్వాత పన్నీర్ సెల్వం తన రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించారు. మధ్యాహ్నం 2.15 గంటలకు జయలలిత రాజ్‌భవన్‌కు వెళ్లారు. గవర్నర్ కె.రోశయ్యకు కొత్త మంత్రుల జాబితాను అందజేశారు. తర్వాత రాజ్‌భవన్ నుంచి నేరుగా మౌంట్‌రోడ్డుకు వెళ్లి ఎంజీఆర్, అన్నాదురై, పెరియార్ విగ్రహాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. పన్నీర్ సెల్వం రాజీనామాతోపాటు కొత్త మంత్రుల జాబితాను ఆమోదించినట్లు రాజ్‌భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిర్దోషిగా బయటపడి ఎనిమిది నెలల తర్వాత జనంలోకి వచ్చిన జయకు జనం బ్రహ్మరథం పట్టారు. రాజ్‌భవన్‌కు వెళ్లే మార్గం అభిమానులు, కార్యకర్తలతో కిక్కిరిసిపోయింది. నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా వేలాది మంది జయకు జేజేలు పలికారు. ఆమెపై పూలవర్షం కురిపించి తమ అభిమానం చాటుకున్నారు. నగరంలో ఎక్కడ చూసినా అన్నాడీఎంకే ఫ్లెక్సీలు, జెండాలు, తోరణాలే కనిపించాయి. జయ నివాసం వద్ద కూడా సంబరాలు మిన్నంటాయి. భారీ సంఖ్యలో చేరుకున్న మహిళా కార్యకర్తలు రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకున్నారు. వారందరికి అభివాదం చేస్తూ జయ తన కారులో ముందుకు సాగారు. మంత్రివర్గంలో పాత ముఖాలే! జయ సారథ్యంలో కొత్తగా కొలువుదీరబోయే ప్రభుత్వంలో ముగ్గురు మినహా పాత మంత్రులే కొనసాగనున్నారు. 2011-14 మధ్య తాను సీఎంగా ఉన్న సమయంలో మంత్రులుగా ఉన్నవారిని అలాగే కొనసాగించేందుకు ఆమె మొగ్గుచూపారు. ఆర్థికమంత్రిగా పన్నీర్ సెల్వం, విద్యుత్ మంత్రిగా నాథమ్ ఆర్ విశ్వనాథన్, గృహ నిర్మాణశాఖ మంత్రిగా ఆర్.వైదిలింగం ప్రమాణం చేయనున్నారు. కీలకమైన హోం, పోలీసు, పబ్లిక్, ఆల్ ఇండియా సర్వీసెస్, సాధారణ పాలన వంటి శాఖలను జయ తన వద్దే ఉంచుకున్నారు. ఈనెల 11న ఆదాయానికి మించి ఆస్తుల కేసులో కర్ణాటక హైకోర్టు జయను నిర్దోషిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. నిర్ణయం తీసుకోవాల్సి ఉంది: కర్ణాటక సీఎం బెంగళూరు: జయ కేసులో అప్పీలుకు వెళ్లే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చెప్పారు. ‘ఈ అంశాన్ని న్యాయశాఖ పరిశీలిస్తోంది. తీర్పును వారు అధ్యయనం చేస్తున్నారు. న్యాయశాఖ, ఈ కేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీవీ ఆచార్య, అడ్వొకేట్ జనరల్ అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటాం’అ ని విలేకరులకు చెప్పారు. కాగా, అప్పీలుకు వెళ్లాల్సిందిగా తాను ఇప్పటికే సలహా ఇచ్చినట్లు అడ్వొకేట్ జనరల్ రవివర్మ కుమార్ తెలిపారు. -
తమిళనాట ముందస్తు లేనట్లే
జయ కోసమే ఆర్కేనగర్ సిద్ధం చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళనాడులో తాజాగా మారిన రాజకీయ పరిణామాలను విశ్లేషిస్తే ముందస్తు ఎన్నికలు లేనట్లేనని తెలుస్తోంది. ఉప ఎన్నిక లేకుండా ముందస్తుకు జయ సిద్ధమవుతారని అన్నాడీఎంకేలో జోరుగా సాగిన ప్రచారానికి విరుద్ధంగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఈనెల 22వ తేదీన పార్టీ ఎమ్మెల్యేల సమావేశాన్ని నిర్వహించనున్నారు. అదే సమయంలో జయను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుని సీఎం పీఠం ఎక్కిస్తారని తెలుస్తోంది. అయితే, ఈనెల 23వ తేదీలోగా ఏదేని అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీ అయితేనే ఉప ఎన్నిక సాధ్యమని ఎన్నికల కమిషన్ నిబంధన వల్ల ఆర్కేనగర్ ఎమ్మెల్యే వె ట్రివేల్ చేత హడావుడిగా రాజీనామా చేయించారు. స్వల్ప అనారోగ్యం తో బాధపడుతున్న జయలలిత దూరప్రాంతాలకు వెళ్లి ప్రచారంచేసే స్థితిలో లేనందునే ఆర్కేనగర్‌ను ఎన్నుకున్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సందీప్ సక్సేనా సైతం ఆరు నెలల్లో ఆర్కేనగర్లో ఉపఎన్నిక నిర్వహించనున్నట్లు సోమవారం ప్రకటించారు. ఉప ఎన్నికకు జయ సిద్ధమయినట్లు తేలటంతో ముందస్తు ఎన్నికలు లేనట్లేనని భావిస్తున్నారు. అప్పీలుకు మరికొన్ని రోజులు: మరోవైపు జయలలితను నిర్దోషిగా విడుదల చేస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో సవాలు చేసే అంశంపై నిర్ణయం తీసుకోవటానికి మరికొద్ది రోజులు పట్టవచ్చని ఆ రాష్ట్ర శాసనసభా వ్యవహారాల మంత్రి టీబీ జయచంద్ర సోమవారం తెలిపారు. ‘జయ’తీర్పుపై సుప్రీం కోర్టులో అప్పీలు చేయాలని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీవీ ఆచార్య ఇప్పటికే ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. ఇక నిర్ణయం తీసుకోవలసింది ప్రభుత్వమేనని ఆయన అన్నారు. -
అమ్మ విలువ... ఉన్నప్పుడు తెలియలేదు!
‘నీ నవ్వే చాలు చామంతీ, పూబంతీ...’ అని పాడాలనిపించే నవ్వు రోజాది. చామంతి సినిమాతో మొదలైన ఈ పూబంతి రీల్ సమరాన్ని, రియల్ సమరాలను ఎదుర్కొంటూ నగరి నియోజకవర్గానికి ఎంఎల్ఎ అయ్యారు. ఆమె తొలి సినిమా ప్రేమతపస్సు, తొలి ప్రసంగం తిరుపతిలో శంఖారావం సదస్సు. ఇక టీవీ షోల విషయానికి వస్తే జల్సా ప్రోగ్రామ్‌కి న్యాయనిర్ణేతగా, మోడరన్ మహాలక్ష్మి కార్యక్రమంతో యాంకర్‌గా పరిచయం అయ్యారు. ఆమెకు మంచి పేరు తెచ్చిన టీవీ షో జబర్దస్త్. సినిమాల్లో రోజా, రాజకీయాల్లో రోజా సెల్వమణిగా మారిన శ్రీలత అంతర్వీక్షణం ఇది. మీరు ఎప్పుడు పుట్టారు? ఎక్కడ పుట్టారు? నవంబర్ 16వ తేదీ, కడపలో పుట్టా. సొంత ఊరు తిరుపతి దగ్గర చింతపర్తి. మీలో మీకు నచ్చే లక్షణం, అలాగే నచ్చని లక్షణం... నచ్చే లక్షణం... ఎంత పెద్ద టెన్షన్ అయినా త్వరగా ఓవర్‌కమ్ కాగలగడం. నచ్చని లక్షణం... అందర్నీ నమ్మడం. ఎదుటి వారి నుంచి ఏమాశిస్తారు ? నిజాయితీని ఆశిస్తా. ముందు ఒకమాట వెనుక మాట లేని కచ్చితత్వాన్ని కోరుకుంటా. ఎలాంటి వ్యక్తులను ఇష్టపడతారు ? నేనంటే ఇష్టపడే వారిని. మిమ్మల్ని ఎలా గుర్తు పెట్టుకోవడం ఇష్టం ? నటిగానా, రాజకీయ రంగంలో ధీర వనితగానా... రెండూనూ. మనీ మేనేజ్మెంట్లో మీరు నిష్ణాతులా ? అవును, ఇంటి నిర్వహణ నేనే చూసుకుంటాను. ఏ కోర్సు చదవాలనుకున్నారు? ఎయిర్ హోస్టెస్ కావాలనుకున్నాను. ఇంట్లో వాళ్లు డాక్టర్ని చేయాలని బైపిసిలో చేర్పించారు. తర్వాత హోమ్‌సైన్స్‌లో జాయిన్ అయ్యాను. సినిమాల్లోకి వచ్చాను. ఎక్కడ స్థిరపడాలనుకున్నారు? ఎక్కడ స్థిరపడ్డారు ? చెన్నైలో స్థిరపడాలనుకున్నాను. రాజకీయాలతో హైదరాబాద్‌కి వచ్చాను. కానీ ఎక్కడి ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నానో వారికి దగ్గరగా ఉండాలనుకుంటున్నాను. మీరు ఎక్కువగా ఇష్టపడే వ్యక్తి ఎవరు? తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత. మిమ్మల్ని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి? వ్యక్తి కాదు, వ్యక్తులు. మా పెద్దన్నయ్య కుమారస్వామి రెడ్డి, భర్త సెల్వమణి. మిమ్మల్ని కెరీర్ దిశగా ప్రభావితం చేసిన సందర్భం... ఎంపి శివప్రసాద్ గారు 1998లో నాన్నగారిని అడిగి ప్రచారం కోసం నన్ను తీసుకెళ్లారు. అప్పుడాయన సత్యవేడు ఎంఎల్ఎగా గెలిచి మంత్రయ్యారు. తొలి సంపాదన ఎప్పుడు? 1991లో. చామంతి సినిమాకి అడ్వాన్స్ ఐదు వేలిచ్చారు. చాలా గ్రేట్‌గా అనిపించింది. అత్యంత సంతోషపడిన సందర్భం కూడా అదేనా? అత్యంత సంతోషం అంటే... నా పేరు స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు, నా పేరు పక్కన ఎంఎల్ఎ అని వేసినప్పుడు. మిమ్మల్ని అత్యంత బాధ పెట్టిన సందర్భాలు! అమ్మాయి... అన్న తర్వాత అలాంటివి తప్పవు. ిసినీనటి అయినప్పుడు బంధువుల మాటలు నొప్పించాయి. అలాగే తెలుగుదేశం పార్టీలో ఆ పార్టీ వాళ్లే నా ఓటమికి ప్రయత్నించడం. ఇవి మానసికంగా. భౌతికంగా అయితే ‘సమరం’ సినిమా షూటింగ్ సమయంలో కాలికి ఫ్రాక్చర్ అయినప్పుడు బాధపడ్డాను. మీకు విచిత్రం అనిపించే విషయాలు? సినిమాల్లో డబ్బు తీసుకుని నటిస్తాం. అప్పుడు ప్రజలకు చేసేదేమీ ఉండదు. కానీ బ్రహ్మరథం పడతారు. రాజకీయాల్లో వందమందిలో పదిమందికైనా మేలు చేయడానికి అవకాశం ఉంటుంది. చేతనైన మంచేదో చేద్దాం అని వస్తే... ఏం చేసినా విమర్శిస్తారు. మీరు ఎవరికైనా క్షమాపణ చెప్పుకోవాల్సి ఉందా మమ్మీ ఉన్నప్పుడు ఆమె విలువ తెలియలేదు. అమ్మ ఏం చెప్పినా సీరియస్‌గా తీసుకోకుండా ఆమెను ఏడిపించేవాళ్లం. మా అమ్మ ఎప్పుడూ ‘నీకు పెళ్లయి కూతురు పుడితే నా విలువ తెలుస్తుంది’ అనేవారు. అమ్మ గుర్తొచ్చినప్పుడంతా ఆమె పట్ల మరింత అక్కర చూపి ఉంటే బావుండేదనిపిస్తుంటుంది. సహాయం పొంది... ద్రోహం చేశారనే ఆరోపణ? చాలామంది ఉన్నారు. అదీ బంధువుల్లోనే. సొంతవాళ్లే అలా చేస్తే బాధనిపిస్తుంది. డబ్బే పరమావధి కాదు. అలాంటిది వాళ్లు డబ్బే ప్రధానం అన్నట్లు ఉంటే కష్టంగా ఉంటుంది. తల్లిగా రోజా గురించి ఒక్కమాటలో... పిల్లలు మెచ్చుకునే విధంగా ఉన్నాను. షూటింగులు, మీటింగుల కారణంగా వాళ్లు నన్ను మిస్ కాకూడదని నా శక్తికి మించి ప్రయత్నిస్తున్నాను. కుటుంబ జీవితంలో ఆనందపడిన క్షణాలు! పాప (అన్షు మాలిక) పుట్టినప్పుడు... సంతృప్తినిచ్చిన పాత్ర? భైరవద్వీపంలో యువరాణి పాత్ర. ఎప్పుడైనా అబద్ధం చెప్పాల్సిన అవసరం వచ్చిందా? అబద్ధం చెప్పాల్సి వస్తే నవ్వేసి సరిపెడతాను. మీ నవ్వుతో అవతలి వాళ్లు అన్నీ మర్చిపోతారేమో? (మళ్లీ పెద్దగా నవ్వు) దేవుడు వరమిస్తానంటే... కుటుంబంతో సంతోషంగా ఉండాలి. పేదలకు సహాయం చేసే అవకాశం ఇవ్వమంటాను. మీ గురించి మీరు ఒక్కమాటలో... ఏదైనా విషయంలో ఎంత గట్టిగా పోరాడతానో. బంధాలు, బంధుత్వాల దగ్గర అంతటి సున్నిత మనస్కురాలిని. - వాకా మంజులారెడ్డి -
కాశ్మీర్ బాధితులకు అండగా..
సాక్షి, బళ్లారి : జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన వారిని ఆదుకునేందుకు బళ్లారి వాసులు ముందుకురావాలని ఉపమేయర్ జయలలిత, కార్పొరేటర్లు వెంకటరమణ తదితరులు విజ్ఞప్తి చేశారు. జమ్ము కాశ్మీర్ బాధితులు కోసం విరాళాలు సేకరణకు సిటీ కార్పొరేషన్ కార్యాలయ సిబ్బంది మంగళవారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు నగర వాసులు కూడా సాయం చేస్తే బళ్లారికి మంచి పేరు వస్తుందన్నారు. అన్ని రాజకీయ పార్టీల నేతలు, స్వచ్చంధ సంస్థలు జమ్ము కాశ్మీర్ బాధితుల కోసం విరాళాలు సేకరించేందుకు నడుం బిగించారని కొనియాడారు. అనంతరం నగరంలో పలు వీధుల్లో తిరుగుతూ విరాళాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. కారటగిలో.. కారటగి : కనకగిరి, కారటగి బ్లాక్ కాంగ్రెస్, యువ ఘటక ఆధ్వర్యంలో జమ్ముకాశ్మీర్ బాధిత కుటుంబాలకు విరాళాల సేకరణకు చిన్న నీటి పారుదల, జిల్లా ఇన్చార్జి మంత్రి శివరాజ్ తంగడిగి మంగళవారం శ్రీకారం చుట్టారు. తమ నివాసం నుంచి ఆరోగ్య కేంద్రం వరకు పాదయాత్ర చేస్తూ మొత్తం రూ.77,120లను విరాళంగా సేకరించారు. మంత్రి వెంట తాలూకా పంచాయతీ అధ్యక్షురాలు ఈరమ్మ, ఉపాధ్యక్షుడు శరణప్ప, గ్రామ పంచాయతీ అధ్యక్షుడు బీ.శరణయ్యస్వామి, సభ్యులు అయ్యప్ప ఉప్పార, సిద్దప్ప, గద్దెప్ప నాయక్, కనకగిరి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్, యువ ఘటక అధ్యక్షుడు శరణ బసవ రాజరెడ్డి ఉన్నారు. -
'లుంగీ' వివాదంపై జయలలిత కన్నెర్ర!
చెన్నై: 'లుంగీ' వివాదంపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కన్నెర్ర చేశారు. తమిళనాడు సంస్కృతికి వ్యతిరేకంగా జరిగే సంఘటనలను అరికట్టేందుకు కొత్త చట్టాన్ని రూపొందిస్తామని జయలలిత హామీ ఇచ్చారు. క్లబ్బు, రిసార్టులు, ఇతర సంస్థలు ఇలాంటి చర్యలకు దిగితే సహించేది లేదని జయలలిత వార్నింగ్ ఇచ్చారు. భవిష్యత్ లో ఇలాంటి చర్యలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని, లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరించారు. లుంగీ ధరించారనే కారణంతో మద్రాస్ హైకోర్టు జడ్జిలు, న్యాయవాదులను తమ క్లబ్ లోకి అనుమతించకుండా తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం తమిళనాడును కుదిపేసింది. -
జయ కొరడా
చెన్నై, సాక్షి ప్రతినిధి: మద్రాస్ క్రికెట్ క్లబ్లో జరిగిన ఓ కార్యక్రమానికి ఈనెల 11వ తేదీన న్యాయమూర్తి హరి పరంధామన్, మరికొందరు సీనియర్ న్యాయవాదులు పంచెకట్టుతో హాజరయ్యూరు. అయితే ఇది తమ క్లబ్ డ్రెస్‌కోడ్‌కు విరుద్ధమంటూ వారిని లోపలికి అనుమతించలేదు. ఈ సంఘటనపై సంప్రదాయ తమిళులు మండిపడ్డారు. క్లబ్ నిర్వాహకులపై చర్య తీసుకోవాలంటూ అనేక రాజకీయ పార్టీలు ధ్వజమెత్తాయి. తమ క్లబ్ డ్రెస్‌కోడ్‌ను ప్రశ్నించే హక్కు లేదంటూ సమర్థించుకున్న నిర్వాహకులు ప్రజాప్రతిఘటనకు తలొగ్గి పరిశీలిస్తామని చెప్పారు. పంచెకట్టు వివాదం చిలికి చిలికి గాలివానగా మారడంతో బుధవారం నాటి అసెంబ్లీ సమావేశంలో సీఎం జయలలిత స్పందించారు. ఆంగ్లేయుల పాలన అంతమై దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 67 ఏళ్లు దాటినా నిషేధాజ్ఞలు అమలులో ఉండటం శోచనీయమన్నారు. విదేశాల్లో జరిగే సమావేశాలకు తమిళులు పంచెకట్టుతో హాజరైనా అక్కడి వారు అభ్యంతరం తెలపలేదు, అలాంటిది తమిళనాడులోనే పంచెకట్టుకు పరాభవమా అని ఆందోళన వ్యక్తం చేశారు. పంచెకట్టుపై అభ్యతరం తెలపడమంటే తమిళ ఆచార సంప్రదాయాలను అడ్డుకోవడమేనని ఆమె అభిప్రాయపడ్డారు. మద్రాస్ క్రికెట్ క్లబ్ మాత్రమే కాదు మరి కొన్ని క్లబ్బులు సైతం ఇటువంటి నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. పంచెకట్టును అడ్డుకున్న క్రికెట్ క్లబ్‌కు సంజాయిషీ నోటీసు జారీచేయాలని రిజిస్ట్రారును ఆదేశించినట్లు ఆమె తెలిపారు. అలాగే ఇతర క్లబ్‌ల నిర్వహణపై నిబంధనలు పునఃపరిశీలించాలని ఆదేశించారు. పంచెకట్టు వివాదం పట్ల స్పష్టమైన వైఖరి అవలంభించిన ముఖ్యమంత్రి జయలలితను శాసన సభలో సొంత పార్టీ సభ్యులతోపాటు ప్రతి పక్షాల సభ్యులు కూడా అభినందించారు. డ్రెస్‌కోడ్ క్లబ్‌ల ఇష్టం : కోర్టు ఇదిలా ఉండగా, పంచెకట్టును అడ్డుకున్న క్లబ్‌పై చట్టపరమైన చర్యలకు ఆదేశించాలని కోరుతూ కార్తిక్ అనే న్యాయవాది వేసిన పిటిషన్ బుధవారం మద్రాస్ హైకోర్టు ముందుకు వచ్చింది. పిటిషనర్ వాదనను విన్న న్యాయమూర్తులు అగ్నిహోత్రి, ఎంఎం సుందరం మాట్లాడుతూ, డ్రెస్‌కోడ్‌ను అమలు చేసుకునే హక్కు ప్రైవేటు క్లబ్బులకు ఉందని అన్నారు. ఏదైనా అభ్యంతరాలుంటే శాసనసభలో చర్చించుకోవాలేగానీ కోర్టు పరిధిలోకి ఈ అంశం రాదని వ్యాఖ్యానించారు. ఈ కారణంగా పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు. -
పేలుళ్ల విచారణ వేగవంతం
* ఊహా చిత్రాలు సిద్ధం * జాతీయ భద్రతా దళాల రాక * బెంగళూరు, పాట్నాలకు సీబీసీఐడీ * నకిలీ చిరునామాతో రిజర్వేషన్లు చెన్నై, సాక్షి ప్రతినిధి: దేశ ప్రజలందరినీ దిగ్భ్రాంతికి గురిచేసిన బెంగళూరు- గువాహటి ఎక్స్‌ప్రెస్ రైలులో పేలుళ్ల ఘటన దోషులను పట్టుకునేందుకు విచారణను వేగవంతం చేశారు. సీబీసీఐడీ పోలీసులు బెంగళూరు, పాట్నాలకు బయలుదేరి వెళ్లారు. కేంద్రం నుంచి జాతీయ భద్రతా దళం కూడా శుక్రవారం చెన్నైకి చేరుకుంది. రైలులోని రెండు బోగీల్లో జరిగిన పేలుళ్లలో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన స్వాతి (24) అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృత్యువాతపడగా, 14 మందికి గాయాలైన సంగతి తెలిసిందే. సంఘటన జరిగిన గురువారం నుంచే విచారణ ప్రారంభమైంది. ఈ పేలుళ్ల కుట్రను ఛేదించేందుకు ముఖ్యమంత్రి జయలలిత ఆదేశాల మేరకు ఏర్పాటైన సీబీసీఐడీ విచారణ బృందం రెండుగా ఏర్పడి బెంగళూరు, పాట్నాలకు శుక్రవారం వెళ్లింది. సంఘటన జరిగి 24 గంటలు దాటినా ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ ఇది తమ చర్య అని చాటుకోలేదు. అయితే ఐఎస్ఐ, ఇండియన్ ముజాహిద్దీన్, అల్ ఉమా సహా పలు తీవ్రవాద సంస్థల పనేనని పోలీసులు గట్టిగా నమ్ముతున్నారు. పేలుళ్లు జరిగిన సమయంలో విధుల్లో ఉన్న రైల్వే కార్మికులను, ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న ప్రయాణికులను విచారిస్తున్నారు. పాట్నాలో మోడీ ఎన్నికల సభ నిర్వహించినపుడు పేలిన బాంబులు, బోగీల్లో పేలిన బాంబులు ఒకే రకమని గుర్తించారు. ఈ కారణంగానే ఒక విచారణ బృందం పాట్నాకు వెళ్లింది. ప్రైవేటు ట్రావెల్స్ ఏజన్సీల ద్వారా నకిలీ అడ్రసుతో తత్కాల్ టికెట్ రిజర్వు చేసుకున్న వారికోసం గాలిస్తున్నారు. రాష్ట్రం నుంచి తత్కాల్ రిజర్వేషన్ చేసుకున్నవారి వివరాలు సేకరించేందుకు రిజర్వేషన్ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. దీంతో అనేక ప్రైవేటు ట్రావెల్స్ వారు తాళాలు వేసి పారిపోయారు. బాంబులు పేలిన బోగీలో రిజర్వేషన్ చేసుకున్న ఒక వ్యక్తి ఎస్-6లో ప్రయాణం చేశాడు. అతని ఫోన్ నెంబరు కూడా తప్పుగా ఉండడంతో అతన్ని కూడా అనుమానిస్తున్నారు. పేలుళ్లు జరిగిన రైలులో చెన్నై వరకు ప్రయాణించిన వారి ఇళ్లకు వె ళ్లి తనిఖీలు చేస్తున్నారు. శుక్రవారం చెన్నైకి చేరుకున్న జాతీయ భద్రత దళం అధికారులు పేలుళ్లు జరిగిన ప్రాంతాన్ని, బోగీలను తనిఖీ చేశారు. సెంట్రల్ స్టేషన్, 9వ నెంబరు ప్లాట్‌ఫాంలోని సుమారు 80 సీసీ కెమెరాల పుటేజీని పరిశీలిస్తున్నారు. విచారణకు ఇబ్బందులు తలెత్తకుండా 9వ నెంబరు ఫ్లాట్‌ఫాంకు సీల్‌వేసి సాయుధ పోలీసులతో బందోబస్తు పెట్టారు. పేలుళ్లు జరిగిన బోగీల్లోని ప్రయాణికుల సహకారంతో కంప్యూటర్ ద్వారా నిందితుల ఊహాచిత్రాలను సిద్ధం చేసినట్లు తెలిసింది. -
‘జయ’కేతనమే..!
* తమిళనాట అధిక స్థానాలు అన్నాడీఎంకే ఖాతాలోకే! * రెండో స్థానం కోసం డీఎంకే, బీజేపీ హోరాహోరీ * కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో గల్లంతే సి. నందగోపాల్, సాక్షి ప్రతినిధి-చెన్నై: తమిళనాడులో ప్రచార హోరు మంగళవారం నాటితో ముగిసింది. తమిళనాడులోని 39, పుదుచ్చేరిలోని ఒక స్థానం కలుపుకొని, మొత్తం 40 స్థానాలకు గురువారమే పోలింగ్ జరగనుంది. తాజా అంచనాల ప్రకారం తమిళనాట ‘జయ’కేతనమే రెపరెపలాడనుంది. అత్యధిక స్థానాలు అన్నాడీఎంకే ఖాతాలోకే చేరే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. రెండో స్థానం కోసం డీఎంకే, బీజేపీ కూటముల మధ్య హోరాహోరీ పోటీ నెలకొని ఉంది. ప్రజాబలం ఉందనే ధైర్యంతో అన్నాడీఎంకే ఒంటరిగానే బరిలోకి దిగింది. అధికార పార్టీకి ఏకైక ప్రత్యామ్నాయమనే ధీమాతో కొన్ని చిన్నా చితకా పార్టీలతో పొత్తు పెట్టుకుని డీఎంకే రంగంలోకి దిగింది. మరోవైపు ప్రధాన పార్టీలైన అన్నాడీఎంకే, డీఎంకేలు లేని బలమైన కూటమిని బీజేపీ ఏర్పాటు చేసుకోగలిగింది. ప్రాంతీయ పార్టీలను ప్రసన్నం చేసుకునేందుకు చివరిక్షణం వరకు కాంగ్రెస్ విఫలయత్నాలు చేసింది. చిన్న పార్టీలు సైతం కాంగ్రెస్‌ను కన్నెత్తి చూడకపోవడంతో గత్యంతరం లేక ఒంటరి పోరాటానికే సిద్ధపడింది. నలభై మనవే... ‘అమ్మ’ ఆత్మవిశ్వాసం అభ్యర్థుల జాబితా ప్రకటన మొదలుకొని, ప్రచార ప్రారంభం వరకు అన్నింటా ముందంజలో ఉన్న అన్నాడీఎంకే అధినాయకురాలు, ముఖ్యమంత్రి జయలలిత ‘నాళై నమదే... నార్పదుం నమదే’ (రేపు మనదే... నలభై స్థానాలూ మనవే) నినాదంతో కార్యకర్తలకు ఆత్మవిశ్వాసాన్ని నూరిపోశారు. ప్రధాని పీఠమే లక్ష్యంగా ప్రచారం ప్రారంభించిన ఆమె, ప్రతి ప్రచారవేదికను ఎర్రకోటను లేదా పార్లమెంటు భవనాన్ని నమూనాగా చేసుకున్నారు. తొలిరోజుల్లో అన్ని స్థానాల్లోనూ అన్నాడీఎంకే ప్రాభవమే కనిపించింది. బీజేపీ, డీఎంకే కూటములు సైతం ప్రచారం ప్రారంభించడంతో పరిస్థితులు మారాయి. అన్నాడీఎంకే అంతర్గత అంచనా 30 నుంచి 20-25 స్థానాలకు పడిపోయింది. అన్నాడీఎంకేకు జయలలిత మాత్రమే ఏకైక స్టార్ క్యాంపెయినర్ కావడం ప్రతిబంధకంగా మారింది. డీఎంకేకు ఇంటిపోరు ప్రభావం అంతంత మాత్రమే... డీఎంకే 35 స్థానాల్లో అభ్యర్థులను నిలిపి, 5 స్థానాలను మిత్రపక్షాలకు ఇచ్చింది. డీఎంకే అధినేత కుమారుడు అళగిరి తొలుత ఇబ్బందులు సృష్టించినా, దాని ప్రభావం కేవలం మధురకే పరిమితమైంది. కరుణానిధి 90 ఏళ్ల వార్ధక్యాన్ని సైతం లెక్క చేయకుండా, తన వాగ్ధాటితో ఓటర్లను కొంతవరకు ఆకట్టుకోగలిగారు. కరుణానిధి చిన్న కుమారుడు స్టాలిన్, కూతురు కనిమొళి, సినీనటి ఖుష్బూ వంటి స్టార్ క్యాంపెయినర్ల బలం కూడా డీఎంకేకు తోడైంది. అయితే, ‘అవినీతి’ మరకలున్న కేంద్ర మాజీ మంత్రులు దయానిధి మారన్, రాజాలను బరిలో నిలపడం ద్వారా కరుణానిధి ప్రతిష్ట మసకబారింది. అయినా, డీఎంకే కూటమికి 6-9 స్థానాలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడో శక్తిగా ‘కాషాయ’కూటమి ఎన్నికలకు రెండు మూడు నెలల కిందటి వరకు తమిళనాడులో బీజేపీ ప్రభావం నామమాత్రంగానే ఉండేది. బీజేపీ తన ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని ప్రకటించడం, రాష్ట్రంలో ఆయన వరుసగా ప్రచార సభలు నిర్వహించడంతో ఆ పార్టీ పుంజుకుంది. ప్రధాన పార్టీలైన అన్నాడీఎంకే, డీఎంకే మినహా ఎండీఎంకే, పీఎంకే, ఐజేకే వంటి ప్రాంతీయ పార్టీలన్నీ వరుసగా బీజేపీ కూటమిలో చేరాయి. దీంతో బీజేపీ కూటమి రాష్ట్రంలో మూడో శక్తిగా మారింది. బీజేపీ ఎనిమిది స్థానాలకే పరిమితమై, ఎక్కువ స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించింది. మోడీ ప్రభావంతో పాటు మిత్రపక్షాల నేతలైన విజయకాంత్, వైగో, డాక్టర్ రామదాస్లకు స్థానికంగా గల ప్రాబల్యమూ ఈ కూటమికి కలసి వచ్చే అంశమే. మరోవైపు సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో మోడీ భేటీ కూడా ఈ కూటమికి సానుకూలత పెంచింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆరేడు స్థానాలను బీజేపీ కూటమి గెలుచుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌కు ఒక్కసీటైనా అనుమానమే... డీఎంకేతో పొత్తు పెట్టుకుని యూపీఏ-1, యూపీఏ-2 హయాంలో రాష్ట్రంలో చక్రం తిప్పిన కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో ఒక్క సీటు దక్కడమైనా అనుమానమే. ఓటమి తథ్యమయ్యే పరిస్థితుల కారణంగా కేంద్ర మంత్రులు చిదంబరం, నాచియప్పన్, జీకే వాసన్లు పోటీకి దూరంగా ఉన్నారు. చిదంబరం తన కుమారుడిని బరిలోకి దించారు. యూపీఏ రెండు ప్రభుత్వాల్లో కేంద్ర మంత్రి పదవులను దక్కించుకున్న డీఎంకే అధినేత కరుణానిధి, శ్రీలంక అంశాన్ని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేశారు. దీంతో సీబీఐ కేసులను ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రులు, తమ పార్టీ అభ్యర్థులు దయానిధి మారన్, రాజాలు నిర్దోషులని, అసలు దోషి ప్రధానేనని చెప్పుకొనేందుకు కరుణానిధికి అవకాశం కలిగింది. రాజీవ్ హంతకులకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన క్షమాభిక్షను కాంగ్రెస్ అడ్డుకోవడం కూడా బెడిసికొట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప కాంగ్రెస్‌కు ఒక్కస్థానమైనా దక్కే అవకాశాలు కనిపించడం లేదు. ఆటలో అరటిపండులా వామపక్షాలు రెండూ చెరో తొమ్మిది స్థానాల నుంచి పోటీ చేస్తున్నాయి. -
అమ్మకు సమన్లు
జయలలిత, శశికళ కోర్టుకు రండి ఎగ్మూర్ కోర్టు ఆదేశం విచారణకు ఐటీ రిటర్నింగ్ కేసు సాక్షి, చెన్నై: ఆదాయపు పన్ను దాఖలు కేసు సీఎం జయలలిత, ఆమె నెచ్చెలి శశికళ మెడకు చుట్టుకునేనా? అన్న ఉత్కంఠ నెలకొంది. ఎప్పుడో దాఖలైన కేసు విచారణను వేగవంతం చేయడానికి ఎగ్మూర్ ఆర్థిక నేరాల కోర్టు నిర్ణయించింది. విచారణ కోసం కోర్టుకు రావాలంటూ జయలలిత, శశికళకు గురువారం సమన్లు జారీ చేసింది. ఏప్రిల్ మూడో తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది. రాష్ర్ట ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితపై కేసులకు కొదవ లేదు. ఇందులో ప్రధానంగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణ బెంగళూరు కోర్టులో సాగుతోంది. మరొకటి ఆదాయపు పన్ను ఎగవేత కేసు. 1991-92,1992-93 సంవత్సరానికి గానూ, శశి ఎంటర్ ప్రెజైస్కు సంబంధించి గానీ, 1993-94కు గాను జయలలిత, శశికళ వ్యక్తిగతంగా తమ ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేయలేదన్న అమ్మకు సమన్లు ఆరోపణలు వచ్చారుు. డీఎంకే హయంలో ఆదాయపు పన్ను శాఖ కొరడా ఝుళిపించింది. జయలలిత, శశికళలు ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేయలేదని గుర్తించి ఆ ఇద్దరిపై అభియోగం మోపుతూ కేసు నమోదు చేశారు. ఎగ్మూర్ కోర్టులో: ఆదాయ పన్ను ఎగవేత వ్యవహారానికి సంబంధించిన కేసు విచారణ చెన్నై ఎగ్మూర్ ప్రధాన మేజిస్ట్రేట్ కోర్టు ఆవరణలో ఆర్థిక నేరాల విచారణ 18 ఏళ్లుగా కోర్టులో సాగుతోంది. ఈ సమయంలో ప్రభుత్వాలు మారాయి. విచారణ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంది. ఈ కేసు నుంచి తమకు విముక్తి కల్పించాలంటూ ఇటీవల హైకోర్టును జయలలిత, శశికళ ఆశ్రయించారు. అయితే, ఆ ఇద్దరికి చుక్కెదురైంది. హైకోర్టు పిటిషన్లను తిరస్కరించడంతో సుప్రీం కోర్టుకు వెళ్లారు. అక్కడ కూడా ఎదురు దెబ్బ తగిలింది. అలాగే, ఈ కేసు విచారణను నాలుగు నెలల్లో ముగించాలని ఎగ్మూర్ కోర్టును సుప్రీం కోర్టు ఆదేశించింది. విచారణ వేగవంతం: సుప్రీం కోర్టు ఆదేశాలతో ఎగ్మూర్ ఆర్థిక నేరాల కోర్టు విచారణ వేగవంతం చేయడానికి నిర్ణయించింది. న్యాయమూర్తి దక్షిణామూర్తి నేతృత్వంలో గురువారం విచారణ జరిగింది. ఆదాయపు పన్ను శాఖ తరపున న్యాయవాది రామస్వామి వాదన విన్పించారు. నేరారోపణ ఎదుర్కొంటున్న జయలలిత, శశికళలపై సెక్షన్ 313 ప్రకారం చర్యలు తీసుకోవాలని విన్నవించారు. జయలలిత తరపున హాజరైన న్యాయవాదులు వివరణకు ఇవ్వడానికి కొంత సమయం ఇవ్వాలని కోరారు. నాలుగు వారాల పాటుగా విచారణను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. వాదనల అనంతరం తదుపరి విచారణను ఏప్రిల్ మూడో తేదీకి న్యాయమూర్తి దక్షిణామూర్తి వాయిదా వేశారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న జయలలిల, శశికళను నేరుగా విచారించాల్సి ఉందని పేర్కొన్నారు. అదే రోజున ఈ ఇద్దరు తప్పని సరిగా కోర్టుకు హాజరు కావాల్సిందేనని, అందుకు తగ్గ సమన్లు జారీ చేస్తూ విచారణను వాయిదా వేశారు. చుక్కెదురు: ఎన్నికల సమయంలో తమ అధినేత్రికి వ్యతిరేకంగా కోర్టు ఆదేశాలు రావడాన్ని అన్నాడీఎంకే వర్గాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. దీనిని అస్త్రంగా చేసుకుని ఎక్కడ ప్రతి పక్షాలు తమ మీద దాడికి దిగుతాయోనన్న కలవరం మొదలైంది. తమకు విముక్తి కల్పించాలన్న పిటిషన్లు అన్నీ తిరస్కరణకు గురి కావడం, తాజాగా విచారణకు రావాలంటూ కోర్టు ఆదేశించడంతో తదుపరి కార్యాచరణపై జయలలిత, శశికళ తరపున న్యాయవాదులు సమాలోచనలో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యాన్ని అస్త్రంగా చేసుకుని, మరి కొద్ది రోజుల పాటుగా విచారణను వాయిదా వేయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు కారణం జయలలిత ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉండటమే. -
అమ్మ ఓకే బొమ్మ వద్దు
చెన్నై, సాక్షి ప్రతినిధి: అమ్మ క్యాంటీన్లు, అమ్మ వాటర్ బాటిల్, అమ్మ మార్కెట్లు రాష్ర్టంలో నడుస్తుండగా, అమ్మ థియేటర్ కూడా రాబోతోంది. అమ్మ పేరున అధికార దుర్వినియోగం సాగుతోందంటూ అన్నాడీఎంకేపై ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా చెన్నై సచివాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్నికల అధికారి ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ, సీఎం ఫొటోలు ఎక్కడ ఉన్నా తొలగిం చడమో లేక కప్పిఉంచడమో చేయాలని అదేశించారు. అయితే కొందరు ఆరోపిస్తున్నట్లుగా అమ్మ అనే పదా న్ని తొలగించాల్సిన అవసరం లేదనిన్నారు. అమ్మ అనేది ప్రతి ఒక్కరూ వాడే పదం, అందులో ఎటువంటి రాజకీయమో, తప్పిదమో లేదని వివరించారు. ఈనెల 5న ఎన్నికలపై అధికారిక ప్రకటన వెలువడగా ఆనాటి నుంచి 17వ తేదీ వరకు మొత్తం 54,976 ఫిర్యాదులు అందగా వాటిల్లో 52,258 ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో పోస్టర్లు, ఫ్లెక్సీలపై 34,254 ఫిర్యాదులు, గోడలపై పార్టీల రాతలపై 20,722 ఫిర్యాదులు అందాయని చెప్పారు. వాహనాల తనిఖీల్లో 10 కోట్ల 25లక్షలా 69 వేల 324 స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అలాగే *10 లక్షలా 41 వేల విలువైన బంగారు, వెండి నగలు పట్టుబడినట్లు అమ్మ ఓకే.. బొమ్మ వద్దు చెప్పారు. తగిన ఆధారాలతో వ్యాపారులు 10లక్షలు, రాజకీయ నాయకులు 50వేలు తీసుకెళ్లవచ్చని అన్నారు. ఆధారాలు చూపినా పట్టుబడిన నగదును ఇచ్చేందుకు నిరాకరించిన అధికారులపై కఠిన చర్య తీసుకుంటామని హెచ్చరించారు. ఒక మహిళా అధికారిపై ఇప్పటికే క్రమశిక్షణ చర్యను తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఆలయాల్లో ఉత్సవాలు చేసుకోవచ్చు, అయితే అక్కడి వేదికలపై రాజకీయ నాయకులు ఆశీనులు కారాదని చెప్పారు. అన్నాడీఎంకే, డీఎంకేలు ఇంటర్నెట్ ద్వారా ప్రచారానికి ఈసీ నుంచి అనుమతి పొందారని తెలిపారు. నోటాకు చిహ్నంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. మంత్రిపై విచారణ ఓటర్లకు నగదు పంపిణీ చేసినట్లు అందిన ఫిర్యాదును పురస్కరించుకుని మంత్రి సంపత్‌పై విచారణకు ఆదేశించినట్లు ఆయన చెప్పారు. కడలూరు నియోజకవర్గంలో అన్నాడీఎంకే అభ్యర్థికి ప్రచారం చేస్తున్న మంత్రి ఎంసీ సంపత్ ఓటర్లకు నగదు పంపిణీ చేస్తుండగా ఒక దినపత్రికలో ఫొటోతో సహా వార్త వచ్చినట్లు డీఎంకే ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టాలని కడలూరు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించినట్లు తెలిపారు. నివేదికను అనుసరించి చర్యలు చేపడతామని తెలిపారు. మంత్రిపై నేరం రుజువైన పక్షంలో ఎఫ్ఐఆర్, చార్జిషీటు దాఖలు చేస్తామని వివరించారు. -
‘అమ్మ’ బొమ్మలు తొలగించండి
ఎన్నికల కమిషన్‌కు డీఎంకే ఫిర్యాదు సచివాలయంలో అఖిలపక్ష సమావేశం చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రం నలుమూలల విస్తరించి ఉన్న ముఖ్యమంత్రి జయలలిత చిత్ర పటాలను, రెండాకుల చిహ్నాలను ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా తొలగించాలని డీఎంకే సహా అన్ని ప్రతిపక్ష పార్టీల నాయకులు ఎన్నికల కమిషన్‌ను కోరారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలు అనుసరించాల్సిన విధి విధానాలను చర్చించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రవీణ్‌కుమార్ సచివాలయంలో శుక్రవారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంకే తదితర ప్రతిపక్ష నేతలు అధికార పార్టీ పై అనేక ఫిర్యాదులు చేశారు. అమ్మ వాటర్ బాటిళ్లు, ప్రభుత్వ మినీ బస్సులపై రెండాకుల చిహ్నం, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, భవనాల్లో ఉంచిన సీఎం జయలలిత ఫొటో లు, మెరీనాబీచ్ అన్నా సమాధి ప్రవేశద్వారం వద్దనున్న రెండాకుల చిహ్నంను కప్పివేయాలని, రోడ్ల వెంబడి ఉన్న అమ్మ ఫ్లెక్సీలను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. అన్నాసమాధి విషయంపై ప్రధాన ఎన్నికల కమిషన్‌కు ఉత్తరం రాశామని, మిగిలిన అంశాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ప్రవీణ్‌కుమార్ తెలిపారు. రాష్ట్రంలో గుర్తింపు పొంది, ఆహ్వానం అందుకున్న పార్టీలను మాత్రమే సమావేశానికి అనుమతించారు. అన్నాడీఎంకే తరపున పొల్లాచ్చి జయరామన్, సేతురామన్, డీఎంకే నుంచి ఆలందూర్ భారతి, పరంధామన్, కాంగ్రెస్ నుంచి కోవై తంగం, సేలంబాలు, బీజేపీ నుంచి శరవణ పెరుమాళ్, డీఎండీకే తరపున ఎమ్మెల్యేలు చంద్రకుమార్, పార్థసారథి, సీపీఐ తరపున పళనిసా మి, సేతురామన్, సీపీఎం తరపున రమణి, బహుజన సమాజ్ పార్టీ నుంచి రజనీ సమావేశానికి హాజరయ్యూరు. ఆమ్ ఆద్మీ నుంచి ఖాజీమెహిద్దీన్, హబీ సచివాలయం వద్దకు చేరుకున్నారు. వారిని అనుమతించలేదు. తమను అనుమతించకపోవడంపై ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తామని మీడియాకు తెలిపారు. -
జయకు లెఫ్ట్ ఝలక్
లోక్‌సభ సీట్ల కేటాయింపులో కుదరని పొత్తు సాక్షి, చెన్నై: తమిళనాట గురువారం నాటి రాజకీయ పరిణామాలు జాతీయ స్థాయిలో మూడో కూటమి (థర్డ్ ఫ్రంట్)కి బీటలు వారే పరిస్థితికి దారి తీస్తున్నాయి. లోక్‌సభ సీట్ల పందేరం కొలిక్కిరాక పోవడంతో అన్నాడీఎంకే కూటమి నుంచి వైదొలగాలని సీపీఎం, సీపీఐ నిర్ణయించాయి. లోక్‌సభ ఎన్నికల ద్వారా కేంద్రంలో చక్రం తిప్పాలని ఆశిస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఇది పెద్ద షాకేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వామపక్షాలు, అన్నాడీఎంకే గతంలో 2009 పార్లమెంట్ ఎన్నికలలో, 2011 శాసనసభ ఎన్నికలలో కలసి పోటీ చేశాయి. ఈ నేపథ్యంలో ఇటీవల సీపీఎం, సీపీఐ జాతీయ నేతలు ప్రకాశ్ కారత్, బర్ధన్, సుధాకర్‌రెడ్డి జయలలితతో భేటీ కావడం, జాతీయ స్థాయిలో మూడో కూటమి ఏర్పాటు చేయనున్నట్టు చెన్నైలో ప్రకటించడం తెలిసిందే. వచ్చే సాధారణ ఎన్నికలలో అన్నాడీఎంకేతో సీపీఎం, సీపీఐ కలసి పనిచేస్తాయని చెప్పారు. గత నెల తన జన్మదినం సందర్భంగా పుదుచ్చేరితో పాటు తమిళనాడులోని 40 స్థానాల్లోనూ అభ్యర్థులను నిలబెడుతున్నట్లు జయలలిత ప్రకటించారు. రెండ్రోజుల క్రితం ఎన్నికల ప్రచారానికీ శ్రీకారం చుట్టారు. మరోవైపు సీపీఎం, సీపీఐలతో సీట్ల పంపకాలు కొలిక్కివస్తే, తమ అభ్యర్థులు కొందర్ని వెనక్కు తీసుకుంటామని చెప్పారు. సీపీఎం, సీపీఐ తొలుత నాలుగేసి చొప్పున సీట్లు ఆశించినప్పటికీ జయలలిత అంగీకరించలేదు. చెరో సీటుతో సర్దుకోవాలంటూ ఆమె సూచించినట్టు తెలిసింది. పలు దఫాలుగా చర్చలు సాగినా జయలలిత మాత్రం మెట్టు దిగకపోవడంతో గురువారం సాయంత్రం చెన్నై టీ నగర్‌లోని కార్యాలయంలో వామపక్ష నేతలు సమావేశమయ్యారు. అనంతరం ఆ పార్టీల రాష్ట్ర కార్యదర్శులు జి.రామకృష్ణన్, డి.పాండ్యన్ మీడియాతో మాట్లాడారు. అన్నాడీఎంకే కూటమి నుంచి వైదొలగుతున్నామని ప్రకటించారు. సీపీఎం, సీపీఐ కలసి ఎన్నికల్లో పోటీ చేస్తాయని చెప్పారు. బీజేపీతో పొత్తుకు డీఎండీకే, పీఎంకే సై కేంద్రంలో అధికారంపై కన్నేసిన బీజేపీకి తమిళనాడులో రెండు పార్టీలు స్నేహహస్తాన్ని అందించేందుకు ముందుకు వచ్చాయి. డీఎండీకే, పీఎంకే బీజేపీతో పొత్తు విషయమై చర్చలు నిర్వహించనున్నట్లు గురువారం ప్రకటించాయి. -
చర్చల జోరు
రాష్ర్టంలో లోక్‌సభ ఎన్నికల వేడి జోరందుకుంది. సీట్ల పందేరానికి డీఎంకే శ్రీకారం చుట్టింది. ఐదు సీట్లకు ఆ కూటమిలోని వీసీకే పట్టుబట్టగా, మిగిలిన వారందరికీ ఒక్కో సీటు సర్దేందుకు నిర్ణయం తీసుకున్నారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ప్రచార బాట పట్టడంతో సీట్ల కోసం వామపక్షాలు కుస్తీ పడుతున్నాయి. తమ కూటమిని బుధవారం వెల్లడిస్తామని బీజేపీ ప్రకటించింది. వీరితో డీఎండీకే అధినేత విజయకాంత్, పీఎంకే అధినేత రాందాసు చేతులు కలిపేనా అన్న ఉత్కంఠ నెలకొంది. సాక్షి, చెన్నై: లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ మరో రెండు మూడు రోజుల్లో వెలువడే అవకాశాలున్నాయన్న సంకేతాలతో రాష్ట్రంలో ఎన్నికల కసరత్తులు వేగం పుంజుకున్నాయి. ఇప్పటికే అన్నాడీఎంకే తమ అభ్యర్థులను ప్రకటించింది. వారికి మద్దతుగా పార్టీ అధినేత్రి, సీఎం జయలలిత ప్రచార బాట పట్టారు. మంగళవారం మీనంబాక్కం జైన్ కళాశాల వేదికగా జరిగిన బహిరంగ సభలో శ్రీ పెరంబదూరు అభ్యర్థి రామచంద్రన్‌కు మద్దతుగా జయలలిత ప్రచారం చేశారు. అన్నాడీఎంకేకు పోటీగా డీఎంకే తమ కసరత్తులు వేగవంతం చేసింది. పార్టీ తరపున పోటీకి ఉత్సాహంగా ఉన్న ఆశావహులతో ఇంటర్వ్యూలను మంగళవారంతో ముగించింది. మిత్రులకు సీట్లను పంచి పెట్టే విషయంగా డీఎంకే అధిష్టానం దృష్టి కేంద్రీకరించింది. పందేరం: డీఎంకే కూటమిలో వీసీకే, ఇండియ యూనియన్ ముస్లిం లీగ్, మనిదనేయ మక్కల్ కట్చి, పుదియ తమిళగం ఉన్నాయి. వీరికి సీట్ల పంపకాల నిమిత్తం మంగళవారం ఉదయం అన్నా అరివాళయం వేదికగా చర్చలు ఆరంభం అయ్యాయి. తొలుత ముస్లిం లీగ్‌కు ఓ సీటును కేటాయించిన సంతృప్తి పరిచారు. అయితే, ఎక్కడి నుంచి పోటీ అన్నది గోప్యంగా ఉంచారు. ఇక, తనకు ఐదు సీట్లు ఇవ్వాల్సిందేనని వీసీకే నేత తిరుమావళవన్ పట్టు బట్టడంతో డీఎంకే అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. అన్ని సీట్లు ఇచ్చే ప్రసక్తే లేదని స్టాలిన్ నేతృత్వంలోని కమిటీ తేల్చినట్టు సమాచారం. మిగిలిన మిత్రులకు తలా ఓ సీటుతో సంతృప్తి పరుస్తు తొలి రోజు చర్చ సంతృప్తికరంగా సాగిందని చెప్పవచ్చు. మనిదనేయ మక్కల్ కట్చికి మైలాడుదురై సీటును, పుదియ తమిళగంకు తెన్కాశి సీటును కేటాయించారు. వీసీకే మాత్రం పట్టు వీడకుండా ఉండడంతో వారికి రెండు సీట్లను ఇచ్చేందుకు డీఎంకే అధిష్టానం నిర్ణయించినట్టు తెలిసింది. బుధవారం సాయంత్రంలోపు వీసీకేతో సీట్ల పందేరాన్ని తేల్చేసి గురు లేదా, శుక్రవారాల్లో డీఎంకే తొలి జాబితా ప్రకటనకు ఆ పార్టీ అధినేత కరుణానిధి కసరత్తుల్లో ఉన్నారు. సీట్ల పందేరం కొలిక్కి రావడంతో ఇక కాంగ్రెస్‌ను డీఎంకే దరిచేర్చడం ప్రశ్నార్థకంగా మారింది. వామ పక్షాల మల్లగుల్లాలు: అన్నాడీఎంకే కూటమిలో సీపీఎం, సీపీఐలు ఉన్నాయి. వారికి ఇంకా సీట్ల పంపకాలు జరగలేదు. అయితే, వారికి తెలియకుండానే 40 స్థానాల బరిలో అభ్యర్థుల్ని జయలలిత ప్రకటించారు. ఇది సీపీఎం, సీపీఐల వర్గాల్ని అయోమయంలో పడేశాయి. తాము కోరినన్ని సీట్లు ఇచ్చేందుకు అన్నాడీఎంకే అంగీకరించని దృష్ట్యా, తదుపరి కార్యాచరణపై సీపీఎం దృష్టి కేంద్రీకరించింది. మంగళవారం చెన్నై టీనగర్‌లోని పార్టీ కార్యాలయంలో సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఆరంభం అయ్యాయి. రెండు రోజుల ఈ సమావేశంలో లోక్‌సభ ఎన్నికల్ని ఎదుర్కొనే రీతిలో పలు అంశాలతో కూడిన మేనిఫెస్టోను సీపీఎం ప్రకటించబోతున్నది. అన్నాడీఎంకేపై ఒత్తిడి తెచ్చే కసరత్తుల్లో ఉంది. ఈ విషయంగా ఆ పార్టీ నాయకులు రామకృష్ణన్, రంగరాజన్, వరదరాజన్ మీడియాతో మాట్లాడుతూ, తాము అన్నాడీఎంకే కూటమిలోనే ఉన్నామని స్పష్టం చేశారు. చర్చలు సంతృప్తికరంగా సాగుతోందని, త్వరలో తమకు సీట్ల పంపకాలు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి టీ పాండియన్ తిరువారూర్‌లో సంచలన ప్రకటన చేశారు. నాగపట్నం సీటు తమదేనని ప్రకటించుకున్నారు. అన్నాడీఎంకే అభ్యర్థి రేసులో ఉన్నా, జయలలిత ప్రచారానికి సిద్ధపడ్డా, ఆ సీటు తమ ఖాతాలో చేరడం ఖాయం అని ధీమా వ్యక్తం చేయడం గమనార్హం. బీజేపీ కూటమి: బీజేపీ కూటమిలో ఐజేకే, కొంగునాడు తదితర పార్టీలు ఉన్నారుు. అయితే, విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకే, రాందాసు నేతృత్వంలోని పీఎంకేను తమ వైపు తిప్పుకునేందుకు ఆ పార్టీ వర్గాలు ప్రయత్నాలు చేశాయి. తమ కూటమిలోకి డీఎండీకే వచ్చినట్టేనన్న సంకేతాన్ని బీజేపీ నేతలు ఇచ్చారు. తమ కూటమి పార్టీలను బుధవారం సాయంత్రం ప్రకటించేందుకు ప్రయత్నాల్లో ఉన్నారు. నిర్ణయం తీసుకోలేదన్న కెప్టెన్ : ఇదే విషయాన్ని చెన్నైలో ప్రచార బాటలో బిజీగా ఉన్న ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వానతీ శ్రీనివాసన్ స్పష్టం చేశారు. విజయకాంత్ తమ కూటమిలోకి చేరినట్టేనని ప్రకటించిన బీజేపీ నేతలు, పీఎంకే విషయంలో సందిగ్ధతను వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో సింగపూర్ నుంచి చెన్నైకు వచ్చిన విజయకాంత్ తాను ఇంకా కూటమిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రకటించడం కొసమెరుపు. -
ఐటీ మినహాయింపు 5 లక్షలు
జయలలిత ‘జాతీయ’స్థాయి ఎన్నికల హామీ చెన్నై: ప్రధాని పదవిపై కన్నేసిన అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను జాతీయ స్థాయి హామీలతో తీర్చిదిద్దారు. కేంద్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వంలో తాము భాగమైతే ప్రస్తుతం రూ. 2లక్షలుగా ఉన్న ఆదా య పన్ను మినహాయింపు పరిమితిని రూ.5 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చారు. పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయించడానికి చమురు కంపెనీలకు కట్టబెట్టిన అధికారాలను వెనక్కి తీసుకుంటామని ప్రకటించారు. అన్నాడీఎంకే మేనిఫెస్టోను జయ మంగళవారమిక్కడి పార్టీ ప్రధాన కార్యాలయంలో విడుదల చేశారు. తమిళనాడు అభివృద్ధి కోసమే కాకుండా మొత్తం దేశాభివృద్ధి కోసం చేపట్టాల్సిన పథకాలకు సంబంధించి ఎన్నో విధానాలను, వాగ్దానాలను ఇందులో పొందుపరచామన్నారు. మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు. - రాష్ట్రాల అభివృద్ధి.. కేంద్ర ఆర్థిక, విదేశీ విధానాలపై ఆధారపడి ఉంటుంది కనుక తమిళనాడు హక్కుల పునరుద్ధరణ, రాష్ట్రాలకు కేంద్ర నిధుల్లో దక్కాల్సిన వాటా, అదనపు అధికారాల కోసం కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వంలో అన్నాడీఎంకే భాగం కావాల్సిన అవసరముంది. - తమిళనాడులో ప్రజాదరణ పొందిన ఉచిత మిక్సీలు, గ్రైండర్లు, పేదలకు పాడి ఆవులు, మేకల పథకాలను దేశమంతా విస్తరిస్తాం. - చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల కోసం ఉద్దేశించిన బిల్లును చట్టంగా తీసుకొస్తాం. విదేశాల్లోని భారతీయుల నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తాం. -
‘యావజ్జీవ’ వివాదం!
సంపాదకీయం: అన్నీ అయినట్టుగానే తమిళనాడులో రాజీవ్ హత్యకేసు దోషుల విడుదల అంశం కూడా అత్యంత వివాదాస్పదంగా మారింది. ఈ కేసులోని ఏడుగురు దోషులూ గత 23 ఏళ్లనుంచి జైళ్లలో ఉన్నారు. వీరిలో ముగ్గురికి పడిన ఉరిశిక్షపై కేంద్ర ప్రభుత్వం గత పదకొండేళ్లుగా ఏమీ తేల్చిచెప్పనందున మానవతా దృక్పథంతో ఆ ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మారుస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఎన్నడో 2000 సంవత్సరంలో తమిళనాడు గవర్నర్ తమ క్షమాభిక్ష పిటిషన్లను తోసిపుచ్చిన తర్వాత ఈ ముగ్గురూ రాష్ట్రపతికి విన్నవించుకున్నారు. ఆ పిటిషన్లు కేంద్ర హోంశాఖ నుంచి రాష్ట్రపతికి చేరడానికి మరో అయిదేళ్లు పట్టింది. ఆ పిటిషన్లను పరిశీలించి తిరస్కరించడానికి రాష్ట్రపతికి మరో ఆరేళ్లుపట్టింది. ఇంత అహేతుకమైన జాప్యం జరిగిన నేపథ్యంలో సుప్రీంకోర్టు నిర్ణయం ఏరకంగా చూసినా సబబే. కానీ, ఆ తీర్పు వెలువడిన కొన్ని గంటల్లోనే తమిళనాడు రాజకీయాలు పెను వేగంతో కదిలాయి. రాష్ట్ర కేబినెట్ సమావేశమై ఆ ఏడుగురు దోషుల్నీ విడుదలచేయాలని తీర్మానించింది. మూడురోజుల్లోగా అందుకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది కూడా. ఈ చర్య ద్వారా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తన రాజకీయ ప్రత్యర్థి డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిపై ఆధిక్యత సంపాదించే ప్రయత్నం చేశారనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అనుకున్నట్టే కరుణానిధి ఈ చర్యను అభినందించడంతోపాటు...2011లో వీరి ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలని కేంద్రాన్ని కోరినప్పుడు జయలలిత తప్పుబట్టిన సంగతిని గుర్తుచేశారు. మరికొన్ని రోజుల్లో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతున్నందున తమిళ జాతీయవాద పరిరక్షకులుగా కనబడేందుకు అన్నా డీఎంకే, డీఎంకేలు తహతహలాడటంలో వింతేమీ లేదు. కానీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈ వివాదంలో తలదూర్చి చేసిన వ్యాఖ్యానాలు ఆసక్తికరమైనవి. ఎల్టీటీఈ పొట్టన బెట్టుకున్న రాజీవ్‌గాంధీ కుమారుడు గనుక జయలలిత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆయన వ్యతిరేకత వ్యక్తంచేయడం తప్పేమీ కాదు. అయితే, ఈ దేశంలో మాజీ ప్రధానికే న్యాయం జరగకపోతే...ఆయనను చంపినవారినే స్వేచ్ఛగా వదిలేస్తే ఇక సామాన్యుడికి న్యాయం ఎక్కడుంటుందని రాహుల్ ప్రశ్నించారు. అలా అనేముందు ఇందులో తమ బాధ్యత ఎంతో రాహుల్ ఆత్మ విమర్శ చేసుకుని ఉంటే బాగుండేది. రాజీవ్‌గాంధీ దోషులు ముగ్గురూ రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్లు దాఖలుచేసిన నాలుగేళ్లకు యూపీఏ ప్రభుత్వం అధికారంలోకొచ్చింది. కానీ, ఆ పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడానికి దానికి ఏడేళ్లుపట్టింది. రాహుల్ అన్నట్టు ‘మాజీ ప్రధానికే న్యాయం జరగకపోతే...’ ఎలా అని యూపీఏ సర్కారు భావిస్తే ఏదో ఒక నిర్ణయాన్ని వేగిరం తీసుకొని ఉండేది. వారి పిటిషన్లను తిరస్కరించి ఉరిశిక్షలను అమలుచేయడమో లేక ఉరిశిక్షలపై రాహుల్గాంధీకున్న అభిప్రాయాన్ని గౌరవించి ఆ శిక్షలను యావజ్జీవ శిక్షలుగా మర్చడమో చేసేది. దేశాన్ని పట్టిపీడిస్తున్న అనేకానేక కీలక సమస్యలపై నిర్ణయాలను నాన్చి... కేవలం తనకు ఎన్నికల ప్రయోజనాలు చేకూర్చగలవాటినే పరిగణనలోకి తీసుకోవడం అలవాటైన యూపీఏ సర్కారు ఎందుకనో రాజీవ్‌గాంధీ హత్య కేసు విషయంలో కూడా సాచివేత ధోరణినే అవలంబించింది. అందువల్ల ‘మాజీ ప్రధానికే న్యాయం జరగకపోవడం’ అనేది తప్పయితే, ఆ తప్పు చేసింది యూపీఏ ప్రభుత్వమేనన్న సంగతి మరవరాదు. ఇప్పుడు ఆ దోషులను వదలాలని నిర్ణయించడం మాత్రమే తప్పని రాహుల్ చెబితే నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు. రాజీవ్ కేసు దోషుల్లో మురుగన్, శంతన్, పెరారివళన్, నళినిలకు 1999లో ఉరిశిక్ష విధించినప్పుడు బెంచ్‌లోని జస్టిస్ కేటీ థామస్ మెజారిటీ తీర్పుతో విభేదించారు. మురుగన్, నళినిలు దంపతులు గనుక వారిని ఉరితీస్తే వారిద్దరి కుమార్తె అనాథ అవుతుందని చెబుతూ నళిని ఈ కుట్రలో తెలియకుండానే భాగస్వామి అయిందని అభిప్రాయ పడ్డారు. ఆమెకు యావజ్జీవ శిక్ష సరిపోతుందని తీర్పునిచ్చారు. అనం తరకాలంలో సోనియాగాంధీ జోక్యంతో నళినికి విధించిన మరణశిక్ష 2007లో యావజ్జీవ శిక్షగా మారింది. ఉరిశిక్ష పడిన ముగ్గురూ దాని సం గతి తేలకుండానే 23ఏళ్లనుంచి జైల్లో ఉన్నారు గనుక...యావజ్జీవ శిక్ష పడివుంటే రెమిషన్లన్నీ కలిసొచ్చి వీరంతా ఎప్పుడో విడుదలయ్యేవారు గనుక వారి విడుదల సబబేనని జస్టిస్ థామస్ నిరుడు వ్యాఖ్యానించారు. ఆ రకంగా చూస్తే జయలలిత సర్కారు ఇప్పుడు తీసుకున్న నిర్ణయంలో తొందరపాటు ఉండొచ్చు... రాజకీయ ప్రయోజ నాలుంటే ఉండొచ్చుగానీ అది పూర్తిగా అహేతుకమని చెప్పలేం. అయితే, యావజ్జీవ శిక్ష పడిన ఖైదీల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ముందు అనుసరించాల్సిన నియమాలను తమిళనాడు ప్రభుత్వం ఉల్లంఘించిందన్నది వాస్తవం. నేర విచారణ స్మృతి ప్రకారం ఆరుగురు సభ్యులుండే సలహా బోర్డు సిఫార్సు అనంతరం మాత్రమే రాష్ట్ర కే బినెట్ నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా తమిళనాడు ప్రభుత్వం దాన్ని పాటించలేదు. కనుకనే ఏడుగురి విడుదలకూ సుప్రీంకోర్టు గురువారం బ్రేక్ వేసింది. ఇదంతా సరేగానీ...1984లో ఇందిరాగాంధీని కొందరు దుండగులు పొట్టనబెట్టుకున్న తర్వాత జరిగిన సిక్కుల ఊచకోతలో మరణించినవారికి కూడా ఇంతవరకూ న్యాయం జరగలేదు. బాధిత కుటుంబాలు దోషులుగా ఆరోపిస్తున్నవారంతా అధికారం అండతో స్వేచ్ఛగా జీవనం కొనసాగిస్తున్నారు. సామాన్యులు దాన్ని కూడా ప్రశ్నిస్తారని, ఇన్ని దశాబ్దాలు గడిచినా న్యాయం జరగలేదని భావిస్తారని రాహుల్ గ్రహించాలి. -
అన్నాడీఎంకేలోకి బన్రూటి
జయ సమక్షంలో పార్టీ తీర్థం అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తా డీఎండీకేలో వలసల బెంగ సాక్షి, చెన్నై : సీనియర్ నాయకుడు బన్రూటి రామచంద్రన్ అన్నాడీఎంకేలో చేరారు. కుటుంబంతో కలసి పోయేస్ గార్డెన్లో సీఎం జయలలిత సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ గెలుపు లక్ష్యంగా కృషి చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని సీనియర్ రాజకీయ నాయకుల్లో బన్రూటి రామచంద్రన్ ఒకరు. తొలుత డీఎంకేలో, అనంతరం ఎంజీయార్ నేతృత్వంలోని అన్నాడీఎంకేలో రాజకీయ పయనం సాగించారు. ఎంజీయార్‌కు అత్యంత విధేయుడిగా ఉన్న ఆయన అనంతరం ఆ పార్టీకి దూరం అయ్యారు. 2005లో విజయకాంత్ నేతృత్వంలో డీఎండీకే ఆవిర్భవించినప్పటి నుంచి ఆ పార్టీకి వెన్ను దన్నుగా ఉంటూ వచ్చారు. విజయకాంత్‌ను ప్రధాన ప్రతి పక్ష నేత స్థాయికి తీసుకెళ్లడంలో బన్రూటి కీలక పాత్ర పోషించారన్నది జగమెరిగిన సత్యం. ఆ పార్టీలో సాగుతున్న కుట్ర పూరిత రాజకీయాలు బన్రూటిలో ఆవేదనను రగిల్చాయి. రాజకీయాల నుంచి తప్పుకుంటూ: గత ఏడాది చివరల్లో తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టుగా బన్రూటి హఠాత్ ప్రకటన చేశారు. డీఎండీకే ప్రిసీడియం చైర్మన్ పదవికి, ఎమ్మెల్యే, శాసన సభా పక్ష ఉప నేత పదవులకు రాజీనామా చేశారు. వయోభారం, అనారోగ్య కారణాలతో రాజకీయూల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఎవరినీ నిందించకుండా డీఎండీకే నుంచి బయటకు వచ్చిన బన్రూటి సేవలను తమ పార్టీకి ఉపయోగించుకునేందుకు సీఎం జయలలిత వ్యూహ రచన చేశారు. తిరువళ్లూరు దినోత్సవాన్ని పురస్కరించుకుని బన్రూటికి దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి అన్నా బిరుదును ప్రకటించారు. దీంతో తన రాజకీయ సెలవు నిర్ణయాన్ని బన్రూటి పునః సమీక్షించే పనిలో పడ్డారు. అన్నాడీఎంకే తీర్థం: రాజకీయాలకు ఇక సెలవు అని ప్రకటించిన బన్రూటి అన్నాడీఎంకే గూటికి చేరే రీతిలో వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. విజయకాంత్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుబెట్టే పనిలో పడ్డారు. దీంతో అన్నాడీఎంకేలోకి బన్రూటి చేరినట్టేనన్న ప్రచారం వేగం పుంజుకుంది. అయితే, తానెప్పుడు పార్టీలో చేరబోతున్నానో అన్న వివరాలను మద్దతుదారులకు సైతం తెలియకుండా గోప్యంగా ఉంచారు. గురువారం ఉదయాన్నే సతీమణి శాంతి, తనయుడు సంపత్‌కుమార్‌తో కలసి పోయేస్ గార్డెన్ మెట్లు ఎక్కారు. పార్టీ అధినేత్రి, సీఎం జయలలిత సమక్షంలో అన్నాడీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలోకి వచ్చిన బన్రూటికి సభ్యత్వాన్ని అందజేసిన జయలలిత కాసేపు ముచ్చటించారు. లోక్‌సభ ఎన్నికల ద్వారా ఢిల్లీలో అన్నాడీఎంకే ఖ్యాతి ఎలుగెత్తి చాటడం లక్ష్యంగా తన వంతు కృషి చేస్తానని బన్రూటి మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. అన్నాడీఎంకే అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా తన పయనం ఉంటుందన్నారు. వలసల బెంగ: బన్రూటి అధికారికంగా అన్నాడీఎంకే తీర్థం పుచ్చుకోవడంతో డీఎండీకేలో వలసలు మొదలయ్యే అవకాశాలున్నారుు. పార్టీ ప్రిసీడియం చైర్మన్‌గా, సీనియర్ నాయకుడిగా వ్యవహరించిన బన్రూటికి ఆ పార్టీ నాయకులందరూ సన్నిహితులే. అనేక జిల్లాల్లోని డీఎండీకే నాయకులు పెద్ద దిక్కు లేని దృష్ట్యా, బయటకు వెళ్లలేక కాలం నెట్టుకు వస్తున్నారు. తాజాగా అన్నాడీఎంకేలోకి బన్రూటి వెళ్లడంతో ఆయన మద్దతుదారులుగా ఆ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సమాయత్తం అవుతున్నారు. లోక్‌సభ ఎన్నికల వేళ బన్రూటి పార్టీ మారడంతో వలసల బెంగ డీఎండీకే అధిష్టానాన్ని పట్టుకుంటోంది. ఇప్పటికే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు రెబల్స్ అవతారం ఎత్తిన దృష్ట్యా, మరి కొందరు త్వరలో అమ్మకు జై కొట్టే అవకాశాలు ఎక్కువే. -
క్షమాభిక్ష
రాజీవ్ హంతకుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మూడురోజుల్లో విడుదల చేస్తామన్న సీఎం కాంగ్రెస్ మినహా సర్వత్రా హర్షం చెన్నై, సాక్షి ప్రతినిధి: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న ఏడుగురికి క్షమాభిక్ష పెట్టాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బుధవారం నాటి అసెంబ్లీ సమావేశంలో ఆమె ప్రకటించారు. 23 ఏళ్లుగా జైలు జీవితం అనుభవిస్తున్న ఏడుగురికి మరో మూడు రోజుల్లో విముక్తి కలగనుంది. ముగ్గురి ఉరిశిక్షను రద్దు చేస్తూ సుప్రీం కోర్టు ప్రకటించిన మరుసటి రోజే వారందరినీ విడుదల చేయాలని తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రాహర్షం వ్యక్తమవుతోంది. ఖైదీలు మురుగన్, శాంతన్, పేరరివాళన్, రవి, రాబర్ట్, జయకుమార్, నళినీ వేలూరు జైలు నుంచి త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం 1991 మే 21న శ్రీపెరంబుదూరు సభకు హాజరైన రాజీవ్ గాంధీ ఎల్టీటీఈ చేతిలో దారుణహత్యకు గురయ్యారు. ఈ కేసుకు సంబంధించి 26 మందికి ఉరిశిక్ష విధిస్తున్నట్లు టాడా కోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పుపై నిందితులు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. తదనంతరం మురుగన్, శాంతన్, పేరరివాళన్, నళినికి ఉరి శిక్ష సమంజసమేనంటూ సుప్రీంకోర్టు సమర్థించింది. మిగిలిన వారిలో ముగ్గురికి యావ జ్జీవం, 19 మందిని విడుదల చేయాలని తీర్పు చెప్పింది. ఉరిశిక్ష పడిన నలుగురు 1999 అక్టోబరు 8వ తేదీన సుప్రీంకోర్టులో మరో పిటిషన్ వేయగా కొట్టివేసింది. దీంతో తమకు క్షమా భిక్ష పెట్టాలని కోరుతూ అదే ఏడాది అక్టోబరు 17న రాష్ట్రపతికి విన్నవించుకున్నారు. అదేనెల 27న రాష్ట్రపతి సైతం నిరాకరించారు. రాష్ట్రపతి నిర్ణయాన్ని సవాల్ చేస్తూ చెన్నై హైకోర్టులో పిటిషన్ వేయగా రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీగా ఏర్పడి శిక్షను మరోసారి విశ్లేషించుకోవాలని 1999 నవంబరు 25న కోర్టు అదేశించింది. ఈ ఆదేశాల మేరకు అప్పటి సీఎం కరుణానిధి నాయకత్వంలో 2000 ఏప్రిల్ 19న కమిటీ సమావేశమైంది. రాజీవ్ హత్యకేసు నిందితుల్లోని నళినికి ఆడశిశువు ఉన్నందున బిడ్డ అనాథ కాకూడదన్న ఉద్దేశంతో ఉరిశిక్ష నుంచి ఆమెను మినహాయిస్తూ తీర్మానం చేశారు. మిగిలిన ముగ్గురికి యథావిధిగా ఉరిశిక్షను అమలు చేయాలని తీర్మానించారు. దీంతో ముగ్గురు 2000 ఏప్రిల్ 21న మళ్లీ క్షమాభిక్ష కోసం రాష్ట్రపతి పరిశీలనకు పంపగా నిరాకరించారు. దీంతో అదే నెల 28వ తేదీన మరోసారి రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసుకోవడంతోపాటూ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా విన్నవించుకున్నారు. అయితే ప్రభుత్వం ద్వారా వెళ్లిన విజ్ఞప్తులపై కేంద్రం 11 ఏళ్లుగా స్పందించలేదు. దీంతో చొరవతీసుకున్న సుప్రీం కోర్టు వారికి పడిన ఉరిశిక్షను రద్దుచేస్తున్నట్లుగా ఈనెల 18న ప్రకటించింది. జైలు నుంచి విడుదల చేసే అంశాన్ని రాష్ట్రప్రభుత్వానికే అప్పగిస్తున్నట్లు సుప్రీం కోర్టు పేర్కొంది. ఉరిశిక్ష రద్దుతో ఆనందోత్సాహాలు జరుపుకున్న నిందితుల బంధువులు వారిని విడుదల చేయాలనే డిమాండ్‌ను వెంటనే లేవనెత్తారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఈ అంశం తెరపైకి రావడం అన్నాడీఎంకేకు అనుకూలమైంది. దీంతో సీఎం జయ వెంటనే విడుదలపై నిర్ణయాన్ని తీసుకున్నారు. ఐపీసీ సెక్షన్ 432 ప్రకారం ప్రభుత్వ విచక్షణాధికారాలను వినియోగించి వారిని విడుదల చేయనున్నట్లు ఆమె సభలో ప్రకటించారు. చట్టంలోని నిబంధనలకు లోబడి తమ నిర్ణయాన్ని ఐపీసీ 435 ప్రకారం కేంద్రానికి పంపుతూ మూడోరోజుల్లో అభిప్రాయం తెలపాలని కోరినట్లు ఆమె చెప్పారు. గడువులోగా కేంద్రం స్పందించిన పక్షంలో ఆ ఏడుగురిని విడుదల చేసే అధికారం యథావిధిగా తమకు వస్తుందని ఆమె చెప్పారు. కాంగ్రెస్ మినహా సర్వత్రా హర్షం రాజీవ్ నిందితులకు జైలు నుంచి విముక్తి కల్పిస్తూ సీఎం జయ తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమైంది. అయితే అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులు ప్రిన్స్, రంగరాజన్, జాన్‌జాకబ్ నిరసనగా వాకౌట్ చేశారు. డీఎంకే అధినేత కరుణానిధి మీడియాతో మాట్లాడుతూ, ఇదే నిర్ణయాన్ని 2011లో తన హయాంలో వ్యక్తం చేసినపుడు జయ అభ్యంతరం పలికారని విమర్శించారు. అయితే ఈ రోజు తాను మాత్రం జయకు హర్షం తెలపుతున్నానని అన్నారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయపార్టీలు, తమిళ సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. -
రక్తదానానికి గిన్నిస్ రికార్డు
సాక్షి, చెన్నై : తమిళనాడు సీఎం జయలలిత జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన రక్తదాన శిబిరం గిన్నిస్ రికార్డుకు ఎక్కింది. ఈ నెల 24న జయలలిత 66వ వసంతంలోకి అడుగు పెట్టనున్నారు. ఈ సందర్భం గా తమిళనాడు రవాణా శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ నేతృత్వంలో ఈ నెల 14న చెన్నై సహా 10 ప్రాంతాల్లో ఏక కాలంలో రక్తదాన శిబిరాలు నిర్వహించారు. వీటిలో 58,129 మంది రక్తదానం చేశారు. గతంలో హర్యానాలో జరిగిన వైద్య శిబిరంలో 40 వేల మంది రక్తదానం చేసి గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. ఆ రికార్డును తమిళనాడులో నిర్వహించిన రక్తదాన శిబిరం తిరగ రాసింది. గిన్నిస్ రికార్డుకు సంబంధించిన గుర్తింపు పత్రాలను సోమవారం తమిళనాడు సీఎం జయలలితకు ఆ సంస్థ ప్రతినిధి లూసియూ అందజేశారు. -
వ్యతిరేకం కాదు.. అనుకూలమూ కాదు
సాక్షి, చెన్నై : తెలంగాణ ఏర్పాటుకు తాము వ్యతిరేకమూ కాదు, అనుకూలమూ కాదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు చెన్నైలో పాతపాటే పాడారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, డీఎంకే అధినేత కరుణానిధిలను గురువారం చంద్రబాబు చెన్నైలో కలుసుకున్నారు. జయతో 45 నిమిషాలు, కరుణానిధితో 30 నిమిషాలు సమాలోచనలు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా, ఇంతకూ మీరు తెలంగాణకు అనుకూలమా.. ప్రతికూలమా, పార్లమెంటులో బిల్లుపెడితే మీ పార్టీ మద్దతు పలుకుతుందా? అంటూ మీడియా ప్రశ్నించగా ‘వాట్ అయామ్ సేయింగ్, అయామ్ వెరీ క్లియర్’ అంటూ పొంతన లేని ఇంగ్లిష్ ముక్కలను చెప్పారు. ఇంతకూ మీరు దేనికి మద్దతు ఇస్తున్నారని ఒక మహిళా విలేకరి సూటిగా ప్రశ్నించగా సమాధానం ఇవ్వాల్సిందిపోయి ‘నీవు చాలా తెలివిగలదానివి. అదే చెబుతున్నా’ అంటూ మరోసారి దాటవేశారు. ఇరుప్రాంతాల వారికీ న్యాయం జరగాలి అని బాబు అనగానే, న్యాయం అంటే మీ దృష్టిలో ఏమిటని మరో విలేకరి ప్రశ్నించగా, ఐ యామ్ వెరీ క్లియర్ అంటూ తప్పించుకున్నారు. తాను తెలంగాణకు అనుకూలం కాదు, అలాగని వ్యతిరేకం కూడా కాదని, రాజ్యాంగం దుర్వినియోగం అవుతోందని అంటున్నాను.. అంటూ పాతపాట పాడారు. ఇంతకూ మీ వైఖరి ఏమిటో చెప్పలేదని మరో విలేకరి ప్రశ్నించగా, ‘‘నేను ఒకవైపు ఎలా నిలబడగలను. తెలుగువారందరి కోసం ఎన్టీఆర్ ఈ పార్టీని స్థాపించారు, మా పార్టీ రెండు ప్రాంతాల్లోనూ బలంగా ఉంది.’’ అని చెప్పారు. తాను అధికారంలోకి వస్తే ఆరునెలల్లోగా ఈ సమస్యను పరిష్కరిస్తానని బదులిచ్చారు. ఇంకా ఆయన మాట్లాడిన అంశాలు.. - రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ దుర్వినియోగం చేస్తోందని చెప్పడానికే జయలలితను, కరుణానిధిని కలుసుకున్నాను. - ఇప్పుడు తెలంగాణ అంశం జాతీయ సమస్యగా మారిందని. దీనిపై కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని, ఓట్లు సీట్లుకోసమే విభజన చేస్తోందని విమర్శించారు. - ఇప్పటికైనా భారత రాష్ట్రపతి చొరవతీసుకుని ఇరు ప్రాంతాలవారు చర్చలు జరిపి, అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారానికి వచ్చేలా చూడాలని కోరారు. - మరో 15-20 రోజుల్లో సాధారణ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనున్న తరుణంలో కీలకమైన విభజన అంశాన్ని ఎలా చేపడతారని ప్రశ్నించారు. - రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ని కాంగ్రెస్ దుర్వినియోగం చేస్తోందన్న విషయంపై వై.ఎస్. జగన్మోహన్రెడ్డి మాట్లాడడం లేదని, ఆయన రాష్ట్ర విభజననే కోరుకుంటున్నారని విమర్శించారు. -
స్నేహభావంతోనే శాంతిభద్రతలు
చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రజలతో స్నేహంగా మసలుకుంటూ శాంతిభద్రతలను కాపాడాలని పోలీసులను ముఖ్యమంత్రి జయలలిత ఆదేశించారు. చెన్నైలో శుక్రవారం నిర్వహించిన ఐపీఎస్ అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అనుమానంపై అరెస్టు చేసిన వారిలో కొందరు లాకప్‌డెత్‌కు గురవడం దురదృష్టకరమన్నారు. వివిధ కేసుల్లో లక్షలాది మందిని అరెస్ట్ చేస్తే వారిలో ఒక్కరు లాకప్‌డెత్‌కు గురైనా సీరియస్‌గా పరిగణించాలన్నారు. అనుమానితులను అరెస్ట్ చేయడం, పోలీస్ స్టేషన్లో వారు అనారోగ్యానికి గురికావడం, కొందరు ఆత్మహత్యలకు పాల్పడడం వంటి సంఘటనలు రాష్ట్రంలో చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు. ఒక మనిషి ప్రాణాల విలువ అతనిపై ఆధారపడి బతికే ఆ కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుస్తుందని చెప్పారు. ఇకపై రాష్ట్రంలో లాకప్‌డెత్‌లు జరగరాదని హెచ్చరించారు. విచారణలో నిర్లక్ష్యం వద్దు నిందితులను పట్టుకుంటే సరిపోదని, వారిపై వచ్చిన ఆరోపణలను రుజువు చే సి శిక్ష పడేలా చూడడం ఎంతో అవసరమని జయలలిత చెప్పారు. ఎందరో నిందితు లు బెయిల్‌పై విడుదలై స్వేచ్ఛా జీవితాన్ని అనుభవిస్తున్నారని తెలిపారు. అరెస్ట్, బెయిల్‌తోనే పోలీసులు సరిపెట్టుకోకుండా సకాలంలో చార్జిషీటు దాఖలు చేస్తే నిందితులు శిక్ష నుంచి తప్పించుకోలేరని పేర్కొన్నారు. పోలీసులపై పని భారం ఉందని, అలాగని సమాజ శ్రేయస్సు, శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ఉదాసీనంగా వ్యవహించ రాదన్నారు. ప్రజలతో పోలీసులు స్నేహితుల్లా మెలగడం వల్ల ఎంతో మేలు చేకూరుతుందని వివరించారు. తన ప్రభుత్వం పోలీసు శాఖకు అవసరమైన మేరకు స్వేచ్ఛను ప్రసాదించిందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తీవ్రవాదులను తెగించి పట్టుకోవడం ద్వారా తమిళనాడు పోలీసులు వృత్తిపై అంకింతభావాన్ని చాటుకున్నారని తెలిపారు. అందుకే 260 మంది పోలీసులకు నగదు బహుమతులు అందజేసి, పదోన్నతులు కల్పించామని తెలిపారు. నేరాల అదుపు, ట్రాఫిక్ నియంత్రణ, వీవీఐపీలకు బందోబస్తు, ప్రముఖ ప్రదేశాల్లో భద్రత తదితర అన్ని అంశాల్లోనూ పోలీసులు తమ కర్తవ్యాన్ని విడనాడరాదని అన్నారు. జాతీయ, అంతర్జాతీయ తీవ్రవాదులు రాష్ట్రంలోకి ప్రవేశించడం ఆందోళనకరమని పేర్కొన్నారు. ఎటువంటి పరిస్థితులనైనా తమిళనాడు పోలీస్ శాఖ సమర్ధవంతంగా ఎదుర్కొంటుందన్న నమ్మకం తనకు ఉందన్నారు. నేరాల అదుపు, శాంతిభద్రతల పరిరక్షణ తదితర అన్ని బాధ్యతల్లో జిల్లా కలెక్టర్లతో సమన్వయంతో పనిచేయాలని హితవు పలికారు. -
సీడీల్లో రిజిస్ట్రేషన్ పత్రాలు
టీ.నగర్, న్యూస్‌లైన్: రిజిస్ట్రేషన్ పత్రాలను సీడీల రూపంలో అందచేసే కొత్త పథకాన్ని ముఖ్యమంత్రి జయలలిత శుక్రవారం ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. స్థల దస్తావేజుల రిజిస్ట్రేషన్, వివాహాల రిజిస్ట్రేషన్ వంటి పనులకు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రజలు అధిక సంఖ్యలో ఆశ్రయిస్తుంటారు. ఇటువంటి ప్రాముఖ్యత కలిగిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అద్దె భవనాల్లో పని చేస్తున్నారుు. స్థల సౌకర్యం లేకుండా సిబ్బంది ఇబ్బందులు పడడాన్ని దృష్టిలో ఉంచుకుని సొంతంగా భవనాలు నిర్మించాలని ముఖ్యమంత్రి జయలలిత ఉత్తర్వులిచ్చారు. దీని ప్రకారం నామక్కల్ జిల్లా పల్లిపాళ యం, పుదుసత్రం, వేలూరు జిల్లా జోలార్‌పేట, వాలాజా, ఆర్కాడు, కాలనై, తిరువణ్ణామలై జిల్లా దూసి, కీల్కొడుంగాలూరు, కాంచీపురం జిల్లా కుండ్రత్తూరు, పెరియకాంచీపురం, తూత్తుకుడి జిల్లా పుదూర్, కడంబూరు, ఈరోడ్ జిల్లా కవుందపాడి, కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చి, కృష్ణగిరి జిల్లా ఊత్తం గరై, దిండుగల్ జిల్లా గుజిలియం పారై రామనాథపురం జిల్లా కడలాడి, కడలూరు జిల్లా కమ్మాపురం, పుదుకోటై జిల్లా ఇలుపూర్, తిరువూర్ జిల్లా పల్లడం వంటి 20 ప్రాంతాల్లో రిజిస్ట్రార్ కార్యాలయూలకు కొత్త భవనాలను రూ.9.83 కోట్ల ఖర్చుతో నిర్మించారు. చెన్నై లో రూ.49 లక్షలతో సబ్ రిజిస్ట్రార్ శిక్షణ కేంద్రాన్ని నిర్మించారు. వీటితోపాటు కొత్త హాస్టల్ భవనాలను ముఖ్యమంత్రి జయలలిత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. పత్రాల రిజిస్ట్రేషన్లను సీడీల రూపం లో అందచేసే పథకాన్ని కూడా ఈ సందర్భంగా ప్రారంభించారు. ప్రజలు రూ.50 చార్జీ చెల్లించి ఈ సీడీలను అందుకోవచ్చని తెలిపారు. తంజావూరు చిత్ర కళలో శిక్షణ రాష్ట్రంలో హస్తకళలను ప్రోత్సహించే విధంగా వంద మంది మహిళలకు ఏడాదిపాటు శిక్షణ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి జయలలిత చర్యలు తీసుకున్నారు. దీని ప్రకారం తిరుచిరాపల్లి జిల్లా శ్రీరంగంలో వంద మంది మహిళలకు తంజావూరు చిత్రకళలో శిక్షణ ఇప్పించే విధంగా రూ.5 వేల విలువైన ముడిసరుకులతో కూడిన కిట్లు శుక్రవారం అందజేశారు. వీరికి రాష్ట్ర, జాతీయస్థాయిలో తంజావూరు చిత్ర కళలో అవార్డులు పొం దిన వారితో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. -
తాంబరంలో కొత్త బస్‌స్టేషన్ ప్రారంభం
టీనగర్, న్యూస్‌లైన్: చెన్నై, తాంబరంలో కొత్తగా ఏర్పాటైన బస్ స్టేషన్‌ను ముఖ్యమంత్రి జయలలిత బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ బస్టేషన్ రూ.4 కోట్ల 95 లక్షలతో నిర్మింతమైంది. అదే విధంగా కోయంబత్తూరు తమిళనాడు నగర శిక్షణ కేంద్రంలో రూ.75 లక్షలతో అదనపు వసతి గృహాలు, నాగపట్టణం జిల్లా నాగపట్టణం మునిసిపాలిటీలో రూ.కోటి 15 లక్షలతో ఏర్పాటైన కొత్త కార్యాలయ భవనం, తేని మావట్టం చిన్నమనూరు మునిసిపాలిటీలో రూ.కోటితో ఏర్పాటైన వారపు సంత భవనాన్ని చెన్నై సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి జయలలిత ప్రారంభించారు. భూగర్భ డ్రైనేజీ పథకం ప్రారంభం పెరంబలూరు మునిసిపాలిటీలో 31 కోట్ల 91 లక్షలు, రామనాథపురం మునిసిపాలిటీలో రూ.31 కోట్ల 51 లక్షలు, తేని జిల్లా చిన్నమలూరు మునిసిపాలిటీలో రూ.14 కోట్ల 52 లక్షలు, దిండుగల్ మునిసిపాలిటీలో రూ.46 కోట్ల 15 లక్షలు, ధర్మపురి మునిసిపాలిటీలలో 24 కోట్ల ఐదు లక్షల రూపాయలతో నిర్మించిన భూగర్భ డ్రైనేజీ పథకాలను ముఖ్యమంత్రి జయలలిత ప్రారంభించారు.