
అబ్దుల్ కలాం పేరుతో అవార్డు..
* బంగారు పతకం, రూ. 5 లక్షల నగదు బహుమతి
* తమిళనాడు సీఎం జయలలిత ప్రకటన
సాక్షి, చెన్నై: మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త దివంగత ఏపీజే అబ్దుల్ కలాం స్మారకార్థం ఆయన పేరుతో ఏటా ఆగస్టు 15న ఓ అవార్డును అందజేయనున్నట్లు తమిళనాడు సీఎం జయలలిత శుక్రవారం ప్రకటించారు. శాస్త్రీయ విజ్ఞానంలో ఉన్నత ఫలితాలు సాధించినవారు, విద్యార్థుల ఉన్నతికి శ్రమిస్తున్నవారు, మానవతావాదిగా నిలిచినవారికి ఈ ‘డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు’ను అందజేయనున్నట్లు తెలిపారు.
అవార్డు కింద 8 గ్రాముల బంగారు పతకం, రూ. 5 లక్షలు, ప్రశంసాపత్రం అందజేస్తామన్నారు. అవార్డును ఈ ఏడాది నుంచే ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా భారతరత్న అబ్దుల్ కలాం జయంతి అయిన అక్టోబర్ 15వ తేదీని యువ చైతన్య దినంగా పాటించనున్నట్లు తెలిపారు. కాగా, మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాం బొమ్మతో నాలుగు స్టాంపులను రూపొందించినట్లు తపాలా శాఖ చెన్నై డెరైక్టర్ తెలిపారు.
ఇగ్నైటెడ్ మైండ్స్ సీక్వెల్.. కలాం రచన ఇగ్నైటెడ్ మైండ్స్ సీక్వెల్ సహా ఆయన రాసిన పలు కొత్త పుస్తకాలు త్వరలో ముద్రితం కానున్నాయి. ఇగ్నైటెడ్ మైండ్స్ సీక్వెల్‌గా కలాం ప్రసంగాల సంకలనం ‘మై ఇండియా: ఐడియాస్ ఫర్ ద ఫ్యూచర్’ను పఫిన్ బుక్స్ ప్రచురించనుంది.