
తంగచ్చి తలైవి
ఒకటి మాత్రం నిజం. ఏడుపుతో మోసం చెయ్యొచ్చు కానీ, ఏడుపు మోసం చెయ్యదు. జయలలిత భౌతికకాయం దగ్గర నిలుచుని ఉన్నప్పుడు శశికళ అనేకసార్లు దుఃఖిస్తూ కనిపించలేదు. ఆమెలో దుఃఖం కనిపిస్తూనే ఉంది. అయితే ఆ దుఃఖం శశికళ కళ్లల్లో కనిపించలేదు. ఆమె నిలబడి ఉన్న తీరులో, చేతులు కట్టుకుని ఉన్న ఆ మౌనంలో.. దుఃఖం పైపైకి ఉబుకుతూనే ఉంది. అన్ని వేళల్లో దుఃఖాన్ని కన్నీళ్లతో కొలవడం సరికాదు. జయ మరణించిన ఈ వేళలో ఆమె నెచ్చెలి శశికళను జయ నుంచి వేరు చేసి మాట్లాడుకోవడమూ సరికాదు.
రాజకీయంగా ఎన్నో వస్తుంటాయి. విమర్శలు, ఆరోపణలు, దూషణలు, విపరీత విశ్లేషణలు! అవన్నీ ఇప్పుడు శశికళను కూడా అత్యంత సహజంగా చుట్టుముట్టాయి. తంపులమారి సుబ్రహ్మణ్యస్వామి.. శశికళను, ఆమె చేరదీసి తెచ్చుకున్న ఆమె ఊరివారిని కలిపి ‘మన్నార్‌గుడి మాఫియా’గా చేసిన విష పదప్రయోగం కూడా ఇప్పుడు శశికళ ఉద్దేశాలపై దుష్ప్రచారానికి బాగా ఉపయోగపడితే పడుతుండవచ్చు. అయితే ఈ ప్రచారం ఆమెను – జయ ఆత్మ ఎప్పటికీ శయనిస్తూ, సంచరిస్తూ ఉండే ఆమె అంతఃమందిరం ‘పోయెస్ గార్డెన్’ నుంచి – కూకటి వేళ్లతో సహా పెకిలించగలిగేంత బలమైన ఈదురుగాలిగా ఎప్పటికీ మారలేదు. జయ అనే లత అంతగా పెనవేసుకుపోయిన ఆలంబన వృక్షం.. శశికళ!
‘‘జయ దక్షతపై రెండు అభిప్రాయాలు లేవు’’ అని ఆమె బద్ధ విరోధి కరుణానిధి శ్రద్ధాంజలి ఘటిస్తూ అన్నారు. సాహసి, నిర్ణయశీలి అని కీర్తించారు. జయ రాజకీయ వారసురాలిగా శశికళకు కూడా అలాంటి కీర్తే దక్కుతుంది. జయ దగ్గర తన స్థానాన్ని చివరి వరకు ఆమె నిలబెట్టుకున్నారు. అదే స్థానం పార్టీ ముఖ్య నాయకులలో, ఎమ్మెల్యేలలో కూడా శశికళకు ఉంది. అమ్మ తర్వాత అమ్మగా ఎమ్మెల్యేలు శశికళను కొలుస్తున్నారు. పూమాల వేసి ఉన్న జయ చిత్రపటానికి ముకుళిత హస్తాలతో దివ్యాంజలి అర్పించిన నాయకులు.. ఆ వెంటనే, శశికళకు పాదాభివందనం చేస్తున్నారు! ‘అమ్మ.. పార్టీని అనా«థగా వదిలి వెళ్లలేదు’ అనే సంకేతం ఇది.
సంతాప ఉద్వేగాలు పూర్తయ్యాక పార్టీ శశికళను తన పెద్దదిక్కుగా చేసుకున్నా, చిన్నమ్మగా చూసుకున్నా.. పార్టీలో శశికళ స్థానం ఎప్పటికీ పార్టీ సంరక్షకురాలిగానే ఉంటుందన్న భావన కు అదొక స్పష్టమైన అంతర్లీనత. దీనర్థం.. కాంగ్రెస్‌కు ఎలాగైతే సోనియాగాంధీ ‘సుప్రీం’గా ఉన్నారో, తమిళనాడులో అన్నాడీఎంకేకు శశికళ అలా సుప్రీంలా ఉంటారు. దీనర్థం.. ప్రస్తుత ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం.. నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌లా ఉండిపోతారు. అయితే కాంగ్రెస్ వారసత్వంగా దేశ ప్రజలు సోనియాగాంధీని స్వీకరించిన విధంగా తమిళ ప్రజలు శశికళను అంగీకరిస్తారా?!
జయ భౌతికకాయాన్ని ఖననం చేశాక, ఆ మర్నాడు ఆమె సమాధి దగ్గరికి చేరుకున్న దక్షిణాది జిల్లాల తమిళ గ్రామీణులు గుండెలు అవిసిపోయేలా విలపించారు. అమ్మ కనుమరుగవడం ఒక్కటే వారికి కనిపిస్తోంది. భవిష్యత్తు కనిపించడం లేదు. నాయకులకు అలా కాదు. ఇంకో అమ్మ దొరుకుతుంది. దొరికింది కూడా. కానీ ఆ అమ్మను వీరు తమ అమ్మగా భావించడానికి ఇష్టపడడం లేదు. ‘‘జయలలిత లోటును శశికళ తీర్చగలరు కదా’’ అని అక్కడున్న ఓ మహిళను మా ‘సాక్షి’ చెన్నై ప్రతినిధి అడిగినప్పుడు ఆమె పెద్దగా రోదించారు. ‘‘ఇల్ల, ఇల్లై’’ (లేదు.. లేదు) అని గుండెలు బాదుకుంటూ అన్నారు. రాజకీయాలతో నిమిత్తం లేకుండా జయను ఆరాధించే సామాన్య తమిళ ప్రజల మనోభావాలనైతే ఈ సమాధానంలోంచి మాత్రమే ఎవరైనా సంగ్రహించవలసి ఉంటుంది. మూడు దశాబ్దాల జయ–శశిల స్నేహంలో.. శశికళను వారు జయకు నీడగా చూశారో లేదో కానీ, నీడను మిగిల్చి వెళ్లిపోయిన జయకు సజీవరూపంగా శశికళను చూడాలనుకోవడం లేదు.
అసలు శశికళను ఎలా చూడాలి? ఎలాగైనా చూడొచ్చు. విలన్‌గా కూడా చూడొచ్చు. ఎలా చూసినా ఆమెను జయ చూసిన కళ్లతోనే చూడాలి. శశితో పడింది జయే కాబట్టి! కానీ జయ అలా అనుకోలేదు. ‘శశి నన్ను అమ్మలా చూసింది. మా అమ్మే ఉండి ఉంటే నన్ను శశి చూసినట్లే చూసి ఉండేది’ అని జయ తనతో అన్నట్లు 71 ఏళ్ల సీనియర్ జర్నలిస్టు ఎన్.రామ్ ఓ సందర్భంలో రాశారు.
జయకు జగమంత కుటుంబం ఉండొచ్చు. కుటుంబం లేదు. ఆ లోటును శశి తీర్చారు. తన కుటుంబాన్ని వదులుకుని వచ్చి మరీ జయకు బాసటగా ఉన్నారు. ఆమె కష్టాల్లో, ఇష్టాల్లో జయ వెంటే ఉన్నారు. ఆమెతో కలిసి జైలుకు వెళ్లారు. వెళ్లి పొమ్మంటే వెళ్లి, రమ్మనగానే మళ్లీ వచ్చేశారు. శశి జయకు ఆదరణగా ఉన్నారే కానీ, ఏనాడూ ఆత్మాభిమానాన్ని చూపించుకోలేదు. ఆ విధేయత, ఆ మనోనిబ్బరం, ఆ రాజకీయ సూక్ష్మగ్రాహ్యత పార్టీలో శశికి తప్ప మరెవరికీ లేనివి. అన్నిటినీ మించి శశి.. జయకు ఆత్మసఖి. మరణించేంత వరకు జయ జీవితంలోని అర్థవంతమైన అనుబంధం కూడా ఒక్క శశికళే.
శశికళను తక్కువచేసి మాట్లాడ్డం అంటే.. జయ కోరుకున్న అనుబంధాన్ని తక్కువ చేయడమే. జయ వేరొక అనుబంధాన్ని కోరుకోలేదు. పార్టీలో వేరొక ప్రత్యామ్నాయాన్ని ఎదగనివ్వలేదు. అంటే ఏమిటర్థం? సినిమాలపై ఇష్టంతో జయలలితకు దగ్గరై, ఆమెకు తన జీవితాన్నే అర్పించిన ఈ ‘ప్రతినాయకురాలు’ త్వరలోనే ‘తలైవీ’ కాబోతున్నారని. తంగచ్చి (సోదరి) తలైవి కాబోతున్నారని.
• మాధవ్ శింగరాజు