రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే ఆషామాషి విషయం కాదు. మహిళలు రాణించాలంటే అంతకు మించిన సామర్థ్యమే ఉండాలి. అలాంటి రంగంలో సినిమా హీరోయిన్లు రాణించడం అనేది అంత సులభం కాదు. సాధారణంగా సినిమా హీరోయిన్ అంటే చాలామందిలో చిన్నచూపు కనిపిస్తుంది. అందుకే కొందరు వారిపై నోటికి వచ్చిన కామెంట్లు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా రాజకీయాలంటేనే రొంపి... ఇందులోకి దిగితే దేనినైనా దిగమింగుకోవాలి. అవమానాలు, హేళనలు భరించాలి.
అందుకే అతివలు వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని కొందరు దూరంగా ఉంటారు. కానీ మరి కొందరు రాజకీయ కదనరంగంలోకి దూకుతున్నారు.. ఈ క్రమంలో సినిమా పరిశ్రమకు చెందిన హీరోయిన్లు కూడా శివంగిలా తనదైన మాటలతో రాజకీయ యుద్ధంలో పోరాడుతున్నారు. వారి పోరాటంలో అవమానాలు ఎదురైనా భూదేవి అంత సహనంతో ఓర్చుకొని అలాంటి వారి బుద్ధి చెబుతున్నారు. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజకీయాల్లో రాణించిన వెండితెర మహారాణుల కొందరి గురించి తెలుసుకుందాం.
తమిళనాడు అమ్మగా జయలలిత
తమిళ రాజకీయ ముఖ చిత్రాన్ని తలచుకుంటే ఎవరికైనా గుర్తుకు వచ్చే పేరు జయలలిత. తమిళనాడు రాజకీయాలను కంటి చూపుతోనే శాసించిన అతి కొద్ది మంది రాజకీయ నేతల్లో జయలలిత ఒకరు. 1948లో జన్మించిన ఆమె.. సినీ నటిగా తన జీవిత ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత అన్నాడీఎంకే అధినేత్రిగా.. తమిళనాడు సీఎంగా ఎదిగిన తీరు నిజంగా అద్భుతం. 1991 నుంచి 2016 మధ్య ఆమె 14 ఏళ్లపాటు తమిళనాడు సీఎంగా పనిచేశారు. 1948 ఫిబ్రవరి 24న కర్ణాటకలోని మండ్య జిల్లా పాండవవుర తాలూకాలోని మెల్కోటేలో.. తమిళ అయ్యంగార్ కుటుంబంలో జన్మించారు.
అయ్యంగార్ల సంప్రదాయం ప్రకారం తల్లిదండ్రులు ఆమెకు పెట్టిన రెండు పేర్లు కోమలవల్లి, జయలలిత. సంధ్య అనే పేరుతో తన ప్రస్థానాన్ని నాటకాలతో ప్రారంభించి.. సినీ నటి స్థాయికి ఎదిగింది. జయలలిత తమిళంతోపాటు తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడేవారు. జయలలిత 1981లో రాజకీయాల్లో అడుగుపెట్టారు. 43 ఏళ్లకే ఆమె ముఖ్యమంత్రి అయ్యారు ఆమె తమిళనాడు సీఎం అయ్యారు. దీంతో అత్యంత పిన్న వయసులోనే తమిళనాడు సీఎంగా ఎన్నికైన వ్యక్తిగా ఆమె రికార్డు నెలకొల్పారు. 2016 డిసెంబరు 5న చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో ఆమె మరణించారు.
ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా ఆర్ కే రోజా
చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటకు చెందిన రోజా 1972 నవంబర్ 17న జన్మించారు. తిరుపతి పద్మావతి మహిళా యూనివర్శిటీలో చదివారు. రాజకీయ విజ్ఞానంలో నాగార్జున యూనివర్సిటీ నుంచి పీజీ పట్టభద్రులయ్యారు. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. 2004, 2009 శాసనసభ ఎన్నికల్లో నగరి, చంద్రగిరి నియోజకవర్గాల నుంచి పోటీచేసి ఓడిపోయిన ఆమె తన పోరాటాన్ని మాత్రం ఆపలేదు. ఆ తర్వాత వరుసగా 2014, 2019 శాసనసభ ఎన్నికలలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా నగరి నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలిచారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా రోజా ఉన్నారు.
రాజకీయాల్లోకి రాక ముందు చిత్ర పరిశ్రమలో ఎంతో కాలం కొనసాగిన రోజా. తొలినాళ్లలో హీరోయిన్‌గా రాణించడం చాలా కష్టమని ఎంతో మంది ఎగతాలి చేశారని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయినప్పటికీ.. ఎంతో కష్టపడి నటన, డాన్స్ నేర్చుకుని. పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చినట్లు రోజా చెప్పారు. రాజకీయాల్లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని. విమర్శలను పాజిటివ్‌గా తీసుకుని. నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ఆమె పొలిటికల్ జర్నీ కొనసాగుతుంది.
కన్నడలో సుమలత
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన అగ్రనటి సుమలత.220 కి పైగా కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ చిత్రాల్లో ఆమె నటించారు. సినీ కెరీర్‌లో స్వీట్‌స్పాట్‌కు చేరుకొన్నాక అంబరీశ్‌ను వివాహం చేసుకున్నారు. ఆయన మరణం తర్వాత 2019 ఎన్నికల్లో కర్ణాటకలోని మండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. మాజీ సీఎం కుమారస్వామి కుమారుడు, నటుడు నిఖిల్ గౌడపై లక్ష ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో సుమలత విజయం కోసం కేజీఎఫ్ స్టార్ యశ్, దర్శన్, రాక్‌లైన్ వెంకటేశ్, దొడ్డన్న వంటి సినీ ప్రముఖులు కృషి చేశారు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్రమోదీతో కలిసి పనిచేస్తానని ఇటీవల సుమలత ప్రకటించారు. 2024 ఎన్నికల్లో బీజేపీ తరపున మాండ్య నుంచే పోటే చేస్తానని ఆమె చెప్పారు.
విజయశాంతి
సినీ నటిగానే కాదు.. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర కోసం ప్రయత్నించారు విజయశాంతి. 25 ఏళ్లకు పైగానే రాజకీయాల్లో ఆమె కొనసాగుతున్నారు. బీజేపీలో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన విజయశాంతి. ఆ తర్వాత తల్లి తెలంగాణ పార్టీ పెట్టారు. తన పార్టీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేసి.. ఆ పార్టీ తరపున మెదక్ ఎంపీగా గెలిచారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాంగ్రెస్‌లో చేరి.. మెదక్ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2019 ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌కు రాజీనామా చేసి తిరిగి బీజేపీలో చేరారు.
అమరావతిని శాసించిన తొల మహిళగా నవనీత్ కౌర్
నవనీత్ స్వస్థలం పంజాబ్. ఆమె తెలుగు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2003లో ‘శ్రీను వాసంతి లక్ష్మి’తో మొదలుపెట్టి 2010లో కాలచక్రం వరకు దాదాపు 20 తెలుగు సినిమాల్లో ఆమె నటించారు. ఆపై 2011లో ఎమ్మెల్యే రవి రాణాతో పెళ్లి జరగడంతో ఆమె రాజకీయ ప్రస్థానం మొదలైంది. రవి రానాను పెళ్లి చేసుకున్న తర్వాత, నవనీత్ అమరావతికి వచ్చేశారు. తొలిసారి ఆమె 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆమె పోటీ చేశారు. అమరావతి నియోజిక వర్గంలో శివసేన నాయకుడు అనందరావ్ అడ్సూల్‌కు విపరీతమైన పట్టు ఉంది. దీంతో ఆ ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు.
కానీ, నవనీత్ అంత తేలిగ్గా వదిలిపెట్టే వ్యక్తి కాదు. పేదల ఇళ్లకు వెళ్లి భోజనం చేసేవారు. వారి ఇంట్లోకి వెళ్లి వారి కూతురిలా కలిసిపోయారు. 2019 ఎన్నికల్లో శివసేన-బీజేపీ కలిసి మళ్లీ ఆనంద్‌రావ్‌ను ఇక్కడి నుంచి పోటీ చేయించాయి. అయితే, కాంగ్రెస్-ఎన్సీపీల మద్దతున్న నవనీత్ భారీ ఆధిక్యంతో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. మరావతి నుంచి ఎన్నికైన తొలి మహిళా ఎంపీ ఆమె కావడం విశేషం. అయితే, ఇప్పుడు ఆమె రాజకీయాలు బీజేపీకి దగ్గరగా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఓబీసీ బిల్లుపై చర్చ సమయంలో 2021లో లోక్‌సభలో ఆమె తెలుగులో మాట్లాడి తెలుగు వారందిరినీ మురిపించారు.
స్టార్ క్యాంపెయినర్‌గా నగ్మా
ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయడం లేదు కానీ.. సినీ నటిగానే కాకుండా రాజకీయ నేతగా కూడా నగ్మా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. చాలా సంవత్సరాల కిందటే కాంగ్రెస్ పార్టీలో చేరిన నగ్మా.. ఆ పార్టీ తరపున వివిధ రాష్ట్రాల వ్యవహారాలను సమీక్షిస్తున్నారు. ఎన్నికల సమయంలో స్టార్ క్యాంపెయినర్‌గా కొనసాగుతున్నారు. కానీ ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ పార్టీకి కాస్త దూరంగానే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment