అమ్మకు సమన్లు
జయలలిత, శశికళ కోర్టుకు రండి
ఎగ్మూర్ కోర్టు ఆదేశం
విచారణకు ఐటీ రిటర్నింగ్ కేసు
సాక్షి, చెన్నై: ఆదాయపు పన్ను దాఖలు కేసు సీఎం జయలలిత, ఆమె నెచ్చెలి శశికళ మెడకు చుట్టుకునేనా? అన్న ఉత్కంఠ నెలకొంది. ఎప్పుడో దాఖలైన కేసు విచారణను వేగవంతం చేయడానికి ఎగ్మూర్ ఆర్థిక నేరాల కోర్టు నిర్ణయించింది. విచారణ కోసం కోర్టుకు రావాలంటూ జయలలిత, శశికళకు గురువారం సమన్లు జారీ చేసింది. ఏప్రిల్ మూడో తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది.
రాష్ర్ట ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితపై కేసులకు కొదవ లేదు. ఇందులో ప్రధానంగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణ బెంగళూరు కోర్టులో సాగుతోంది. మరొకటి ఆదాయపు పన్ను ఎగవేత కేసు.
1991-92,1992-93 సంవత్సరానికి గానూ, శశి ఎంటర్ ప్రెజైస్‌కు సంబంధించి గానీ, 1993-94కు గాను జయలలిత, శశికళ వ్యక్తిగతంగా తమ ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేయలేదన్న అమ్మకు సమన్లు ఆరోపణలు వచ్చారుు. డీఎంకే హయంలో ఆదాయపు పన్ను శాఖ కొరడా ఝుళిపించింది.
జయలలిత, శశికళలు ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేయలేదని గుర్తించి ఆ ఇద్దరిపై అభియోగం మోపుతూ కేసు నమోదు చేశారు.
ఎగ్మూర్ కోర్టులో: ఆదాయ పన్ను ఎగవేత వ్యవహారానికి సంబంధించిన కేసు విచారణ చెన్నై ఎగ్మూర్ ప్రధాన మేజిస్ట్రేట్ కోర్టు ఆవరణలో ఆర్థిక నేరాల విచారణ 18 ఏళ్లుగా కోర్టులో సాగుతోంది. ఈ సమయంలో ప్రభుత్వాలు మారాయి. విచారణ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంది.
ఈ కేసు నుంచి తమకు విముక్తి కల్పించాలంటూ ఇటీవల హైకోర్టును జయలలిత, శశికళ ఆశ్రయించారు. అయితే, ఆ ఇద్దరికి చుక్కెదురైంది. హైకోర్టు పిటిషన్లను తిరస్కరించడంతో సుప్రీం కోర్టుకు వెళ్లారు. అక్కడ కూడా ఎదురు దెబ్బ తగిలింది. అలాగే, ఈ కేసు విచారణను నాలుగు నెలల్లో ముగించాలని ఎగ్మూర్ కోర్టును సుప్రీం కోర్టు ఆదేశించింది.
విచారణ వేగవంతం: సుప్రీం కోర్టు ఆదేశాలతో ఎగ్మూర్ ఆర్థిక నేరాల కోర్టు విచారణ వేగవంతం చేయడానికి నిర్ణయించింది. న్యాయమూర్తి దక్షిణామూర్తి నేతృత్వంలో గురువారం విచారణ జరిగింది. ఆదాయపు పన్ను శాఖ తరపున న్యాయవాది రామస్వామి వాదన విన్పించారు.
నేరారోపణ ఎదుర్కొంటున్న జయలలిత, శశికళలపై సెక్షన్ 313 ప్రకారం చర్యలు తీసుకోవాలని విన్నవించారు. జయలలిత తరపున హాజరైన న్యాయవాదులు వివరణకు ఇవ్వడానికి కొంత సమయం ఇవ్వాలని కోరారు. నాలుగు వారాల పాటుగా విచారణను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. వాదనల అనంతరం తదుపరి విచారణను ఏప్రిల్ మూడో తేదీకి న్యాయమూర్తి దక్షిణామూర్తి వాయిదా వేశారు.
నేరారోపణలు ఎదుర్కొంటున్న జయలలిల, శశికళను నేరుగా విచారించాల్సి ఉందని పేర్కొన్నారు. అదే రోజున ఈ ఇద్దరు తప్పని సరిగా కోర్టుకు హాజరు కావాల్సిందేనని, అందుకు తగ్గ సమన్లు జారీ చేస్తూ విచారణను వాయిదా వేశారు.
చుక్కెదురు: ఎన్నికల సమయంలో తమ అధినేత్రికి వ్యతిరేకంగా కోర్టు ఆదేశాలు రావడాన్ని అన్నాడీఎంకే వర్గాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. దీనిని అస్త్రంగా చేసుకుని ఎక్కడ ప్రతి పక్షాలు తమ మీద దాడికి దిగుతాయోనన్న కలవరం మొదలైంది. తమకు విముక్తి కల్పించాలన్న పిటిషన్లు అన్నీ తిరస్కరణకు గురి కావడం, తాజాగా విచారణకు రావాలంటూ కోర్టు ఆదేశించడంతో తదుపరి కార్యాచరణపై జయలలిత, శశికళ తరపున న్యాయవాదులు సమాలోచనలో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యాన్ని అస్త్రంగా చేసుకుని, మరి కొద్ది రోజుల పాటుగా విచారణను వాయిదా వేయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు కారణం జయలలిత ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉండటమే.