చర్చల జోరు
రాష్ర్టంలో లోక్‌సభ ఎన్నికల వేడి జోరందుకుంది. సీట్ల పందేరానికి డీఎంకే శ్రీకారం చుట్టింది. ఐదు సీట్లకు ఆ కూటమిలోని వీసీకే పట్టుబట్టగా, మిగిలిన వారందరికీ ఒక్కో సీటు సర్దేందుకు నిర్ణయం తీసుకున్నారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ప్రచార బాట పట్టడంతో సీట్ల కోసం వామపక్షాలు కుస్తీ పడుతున్నాయి. తమ కూటమిని బుధవారం వెల్లడిస్తామని బీజేపీ ప్రకటించింది. వీరితో డీఎండీకే అధినేత విజయకాంత్, పీఎంకే అధినేత రాందాసు చేతులు కలిపేనా అన్న ఉత్కంఠ నెలకొంది.
సాక్షి, చెన్నై:
లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ మరో రెండు మూడు రోజుల్లో వెలువడే అవకాశాలున్నాయన్న సంకేతాలతో రాష్ట్రంలో ఎన్నికల కసరత్తులు వేగం పుంజుకున్నాయి. ఇప్పటికే అన్నాడీఎంకే తమ అభ్యర్థులను ప్రకటించింది. వారికి మద్దతుగా పార్టీ అధినేత్రి, సీఎం జయలలిత ప్రచార బాట పట్టారు. మంగళవారం మీనంబాక్కం జైన్ కళాశాల వేదికగా జరిగిన బహిరంగ సభలో శ్రీ పెరంబదూరు అభ్యర్థి రామచంద్రన్‌కు మద్దతుగా జయలలిత ప్రచారం చేశారు. అన్నాడీఎంకేకు పోటీగా డీఎంకే తమ కసరత్తులు వేగవంతం చేసింది. పార్టీ తరపున పోటీకి ఉత్సాహంగా ఉన్న ఆశావహులతో ఇంటర్వ్యూలను మంగళవారంతో ముగించింది. మిత్రులకు సీట్లను పంచి పెట్టే విషయంగా డీఎంకే అధిష్టానం దృష్టి కేంద్రీకరించింది.
పందేరం: డీఎంకే కూటమిలో వీసీకే, ఇండియ యూనియన్ ముస్లిం లీగ్, మనిదనేయ మక్కల్ కట్చి, పుదియ తమిళగం ఉన్నాయి. వీరికి సీట్ల పంపకాల నిమిత్తం మంగళవారం ఉదయం అన్నా అరివాళయం వేదికగా చర్చలు ఆరంభం అయ్యాయి. తొలుత ముస్లిం లీగ్‌కు ఓ సీటును కేటాయించిన సంతృప్తి పరిచారు. అయితే, ఎక్కడి నుంచి పోటీ అన్నది గోప్యంగా ఉంచారు. ఇక, తనకు ఐదు సీట్లు ఇవ్వాల్సిందేనని వీసీకే నేత తిరుమావళవన్ పట్టు బట్టడంతో డీఎంకే అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. అన్ని సీట్లు ఇచ్చే ప్రసక్తే లేదని స్టాలిన్ నేతృత్వంలోని కమిటీ తేల్చినట్టు సమాచారం. మిగిలిన మిత్రులకు తలా ఓ సీటుతో సంతృప్తి పరుస్తు తొలి రోజు చర్చ సంతృప్తికరంగా సాగిందని చెప్పవచ్చు. మనిదనేయ మక్కల్ కట్చికి మైలాడుదురై సీటును, పుదియ తమిళగంకు తెన్‌కాశి సీటును కేటాయించారు. వీసీకే మాత్రం పట్టు వీడకుండా ఉండడంతో వారికి రెండు సీట్లను ఇచ్చేందుకు డీఎంకే అధిష్టానం నిర్ణయించినట్టు తెలిసింది. బుధవారం సాయంత్రంలోపు వీసీకేతో సీట్ల పందేరాన్ని తేల్చేసి గురు లేదా, శుక్రవారాల్లో డీఎంకే తొలి జాబితా ప్రకటనకు ఆ పార్టీ అధినేత కరుణానిధి కసరత్తుల్లో ఉన్నారు. సీట్ల పందేరం కొలిక్కి రావడంతో ఇక కాంగ్రెస్‌ను డీఎంకే దరిచేర్చడం ప్రశ్నార్థకంగా మారింది.
వామ పక్షాల మల్లగుల్లాలు: అన్నాడీఎంకే కూటమిలో సీపీఎం, సీపీఐలు ఉన్నాయి. వారికి ఇంకా సీట్ల పంపకాలు జరగలేదు. అయితే, వారికి తెలియకుండానే 40 స్థానాల బరిలో అభ్యర్థుల్ని జయలలిత ప్రకటించారు. ఇది సీపీఎం, సీపీఐల వర్గాల్ని అయోమయంలో పడేశాయి. తాము కోరినన్ని సీట్లు ఇచ్చేందుకు అన్నాడీఎంకే అంగీకరించని దృష్ట్యా, తదుపరి కార్యాచరణపై సీపీఎం దృష్టి కేంద్రీకరించింది. మంగళవారం చెన్నై టీనగర్‌లోని పార్టీ కార్యాలయంలో సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఆరంభం అయ్యాయి. రెండు రోజుల ఈ సమావేశంలో లోక్‌సభ ఎన్నికల్ని ఎదుర్కొనే రీతిలో పలు అంశాలతో కూడిన మేనిఫెస్టోను సీపీఎం ప్రకటించబోతున్నది.
అన్నాడీఎంకేపై ఒత్తిడి తెచ్చే కసరత్తుల్లో ఉంది. ఈ విషయంగా ఆ పార్టీ నాయకులు రామకృష్ణన్, రంగరాజన్, వరదరాజన్ మీడియాతో మాట్లాడుతూ, తాము అన్నాడీఎంకే కూటమిలోనే ఉన్నామని స్పష్టం చేశారు. చర్చలు సంతృప్తికరంగా సాగుతోందని, త్వరలో తమకు సీట్ల పంపకాలు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి టీ పాండియన్ తిరువారూర్‌లో సంచలన ప్రకటన చేశారు. నాగపట్నం సీటు తమదేనని ప్రకటించుకున్నారు. అన్నాడీఎంకే అభ్యర్థి రేసులో ఉన్నా, జయలలిత ప్రచారానికి సిద్ధపడ్డా, ఆ సీటు తమ ఖాతాలో చేరడం ఖాయం అని ధీమా వ్యక్తం చేయడం గమనార్హం.
బీజేపీ కూటమి: బీజేపీ కూటమిలో ఐజేకే, కొంగునాడు తదితర పార్టీలు ఉన్నారుు. అయితే, విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకే, రాందాసు నేతృత్వంలోని పీఎంకేను తమ వైపు తిప్పుకునేందుకు ఆ పార్టీ వర్గాలు ప్రయత్నాలు చేశాయి. తమ కూటమిలోకి డీఎండీకే వచ్చినట్టేనన్న సంకేతాన్ని బీజేపీ నేతలు ఇచ్చారు. తమ కూటమి పార్టీలను బుధవారం సాయంత్రం ప్రకటించేందుకు ప్రయత్నాల్లో ఉన్నారు.
నిర్ణయం తీసుకోలేదన్న కెప్టెన్ : ఇదే విషయాన్ని చెన్నైలో ప్రచార బాటలో బిజీగా ఉన్న ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వానతీ శ్రీనివాసన్ స్పష్టం చేశారు. విజయకాంత్ తమ కూటమిలోకి చేరినట్టేనని ప్రకటించిన బీజేపీ నేతలు, పీఎంకే విషయంలో సందిగ్ధతను వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో సింగపూర్ నుంచి చెన్నైకు వచ్చిన విజయకాంత్ తాను ఇంకా కూటమిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రకటించడం కొసమెరుపు.