ప్రతీకాత్మక చిత్రం
డీఎంకే అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలన్నీ స్పష్టం చేస్తుండడంతో అన్నాడీఎంకే పార్టీ అంతర్మధనంలో పడింది. తమ ఎన్నికల వ్యూహాన్ని మార్చేందుకు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, పన్నీరుసెల్వం సిద్ధమయ్యారు. బుధవారం సేలంలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో అర్ధగంట పాటు భేటీ అయ్యారు.
సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించాలని అన్నాడీఎంకే పార్టీ ఉవ్విల్లూరుతోంది. ఈ మేరకు ఎన్నికల వ్యూహాలకు పదును పెట్టింది. ఉచిత పథకాలతో ప్రజాకర్షక మేనిఫెస్టోను ప్రకటించింది. అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కో–కన్వీనర్, సీఎం పళనిస్వామి కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో దూసుకెళుతున్నారు. ప్రచార సభలకు అనూహ్య స్పందన వస్తున్నా, ఉచిత పథకాల హామీలు ప్రజల్లో ఆసక్తిని కలిగించినా సర్వేలు మాత్రం భిన్నంగా వస్తుండడం ఆ పార్టీని కలవరంలో పడేసింది.
వ్యూహాలకు పదును..
ఇప్పటి వరకు వెలువడిన నాలుగైదు సర్వేలు డీఎంకే అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశాయి. దీంతో ఆ పార్టీ పెద్దలు వ్యూహాలకు పదునుపెట్టారు. పార్టీ నాయకులు గ్రామస్థాయి నుంచి ప్రజల్లోకి వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. మేనిఫెస్టోను విస్తృతంగా ప్రచారం చేయడానికి సిద్ధమవుతున్నారు. అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరుసెల్వం, కో–కన్వీనర్ ఎడపాడి పళనిస్వామి బుధవరం సేలంలో భేటీ అయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్రణాళికలపై అరగంట పాటు చర్చించారు. కూటమి పార్టీలను కలుపుకుని సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని జిల్లా, నియోజకవర్గ నాయకులకు దిశానిద్దేశం చేశారు. నిర్లక్ష్యం ప్రదర్శిస్తే అధికారానికి దూరం అవుతామని హెచ్చరికలు పంపారు. అలాగే ప్రచారంలో డీఎంకే హయాంలో చోటుచేసుకున్న అవినీతి, కుటుంబ పాలన, తమిళులకు చేసిన ద్రోహాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. దివంగత సీఎం జయలలిత విజన్‌ను ప్రజలకు వివరించే విధంగా ప్రచార కార్యక్రమాలకు సిద్ధమయ్యారని ఓ నేత పేర్కొన్నారు.
పన్నీరు ప్రచారం
సీఎం పళనిస్వామి సేలం జిల్లా ఎడపాడిలో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆయనకు మద్దతుగా పన్నీరుసెల్వం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. పళనికి మద్దతు పలకాలని, అమ్మ పాలన కొనసాగాలంటే అన్నాడీఎంకే పార్టీకి మద్దతు పలకాలని పిలుపునిచ్చారు.
కరూర్‌లో పళని
కరూర్‌లో పోటీ చేస్తున్న ఎంఆర్ విజయ భాస్కర్, అరవకురిచ్చి నుంచి బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి అన్నామలైలకు మద్దతుగా పళనిస్వామి ప్రచారం చేశారు. ఓపెన్ టాప్ వాహనంలో విస్తృతంగా పర్యటించారు. డీఎంకే హయాంలో సాగిన కబ్జాలను ప్రస్తావించారు. తాము అధికారంలోకి వస్తే ఆ స్థలాలను స్వాధీనం చేసుకుని లబ్ధిదారులు, బాధితులకు అందిస్తామని హామీ ఇచ్చారు. కరూర్ డీఎంకే అభ్యర్థి సెంథిల్ బాలాజీ అన్నాడీఎంకే ద్రోహి అని విమర్శించారు. అమ్మ ప్రభుత్వాన్ని కూల్చేందు విశ్వప్రయత్నాలు చేశారని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం ఉండడం వల్లే రాష్ట్రానికి రూ. లక్ష కోట్ల మేరకు నిధులు వచ్చినట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment