Anna DMK
-
TN: ‘అన్నాడీఎంకే’కు ఫ్యూచర్ లేదు: అన్నామలై
చెన్నై:తమిళనాడులో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తోంది. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్ది నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అన్నా డీఎంకే బహిష్కృత నేత మాజీ సీఎం ఓ పన్నీర్ సెల్వంను ఎన్డీఏలోకి స్వాగతిస్తూ తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలోని అన్నా డీఎంకే పార్టీ భవిష్యత్తులో ఉనికి కోల్పోతుందన్నారు. ఎన్నికల తర్వాత అన్నా డీఎంకే క్యాడర్ మొత్తం ఆ పార్టీ మాజీ కీలక నేత టీటీవీ దినకరన్ వెనకాల నడుస్తుందన్నారు. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో ఓ పన్నీర్ సెల్వంతో పాటు టీటీవీ దినకరన్ గ్రూపులు బీజేపీకి మద్దతిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ అధికార డీఎంకే, బీజేపీ మధ్యనే ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 19న తమిళనాడులోని అన్ని ఎంపీ సీట్లకు పోలింగ్ జరగనుంది. ఇదీ చదవండి.. పల్లవి పటేల్‌తో ఒవైసీ కూటమి.. తొలి జాబితా విడుదల -
అన్నాడీఎంకే జాబితాలో కొత్త ముఖాలు
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళని స్వామి తన పార్టీ లోక్‌సభ అభ్యర్థుల జాబితాను బుధవారం ప్రకటించారు. తొలి విడతలో ప్రకటించిన 16 మంది అభ్యర్థులలో 14 మంది కొత్తవారు కావడం గమనార్హం. అలాగే మిత్రపక్షం పుదియ తమిళగం(పీటీ)కి తెన్కాశి (రిజర్వుడ్) సీటును, మరో మిత్రపక్షం ఎస్‌డీపీఐకు దిండుగల్ సీటును కేటాయించారు. అన్నాడీఎంకే నేతృత్వంలో మినీ కూటమి లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమైంది. పెద్ద పార్టీలు కలిసి రాకున్నా, చిన్న పార్టీలతో ఎన్నికలలో తన సత్తా చాట్టాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళణి స్వామి భావిస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను బుధవారం చైన్నెలో ఎంజీఆర్ మాళిగైలో ప్రకటించారు. 16 మందితో విడుదల చేసిన తొలి జాబితాలో 14 మంది కొత్త వారు కావడం విశేషం. వీరంతా ఎంబీబీఎస్, ఎంటెక్, ఎంఏ, బీఏ, పీజీ పట్టభద్రలే. ముందుగా మిత్ర పక్షం పుదియ తమిళగం, ఎస్డీపీఐలకు సీట్లను కేటాయించారు. ఇందుకు సంబంధించిన ఒప్పందాలపై పుదియ తమిళగం నేత కృష్ణస్వామి, ఎస్డీపీఐ నేత నైల్లె ముబారక్, అన్నాడీఎంకే ప్రధాన కార్యదరిశ పళణి స్వామి సంతకాలు చేశారు. అభ్యర్థుల ప్రకటన అనంతరం పళణి స్వామి మీడియాతో మాట్లాడుతూ తమ కూటమిలోని పార్టీల వివరాలను తెలియజేశారు. అలాంటి రాజకీయాలు అవసరం లేదు.. ఎన్నికలలో కూటములు అవసరమని, అయితే కూటములను మాత్రమే నమ్ముకుని రాజకీయం చేయాల్సిన అవసరం అన్నాడీఎంకేకు లేదని పళణి స్వామి వ్యాఖ్యానించారు. 16 మంది అభ్యర్థులలో 14 మంది కొత్త వారు అని, వీరంతా ప్రజలు మెచ్చిన అభ్యర్థులు అవుతారని అని ధీమా వ్యక్తం చేశారు. మిత్ర పక్షంలోని పుదియ తమిళగంకు తెన్కాశి(రిజర్వుడ్), ఎస్‌డీపీఐకు దిండుగల్ సీటును కేటాయించామని ప్రకటించారు. ప్రేమలత విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకేకు 5 స్థానాలు కేటాయించామని, గురువారం ఈమేరకు ఒప్పందం చేసుకునే అవకాశం ఉందన్నారు. పీఎంకేతో తాము చర్చలు జరపలేదని, త్వరలో తమ ఎన్నికల మేనిఫెస్టో సరికొత్త తరహాలో ప్రజల ముందుకు వస్తుందని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అన్నాడీఎంకే సొంత బలంపైనే నిలబడే పార్టీ అని, ఎవరు వచ్చినా రాకున్నా తమ బలం తనకు ఉందన్నారు. 2.06 కోట్ల మంది సభ్యులను కలిగిన అన్నాడీఎంకేకు ప్రజలే తోడు అని, పార్లమెంట్లో 3వ అతి పెద్ద పార్టీగా అవతరించిన అన్నాడీఎంకే రానున్న ఎన్నికలలో తన బలాన్ని చాటుతుందని, ప్రజలు తమ వైపే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. అభ్యర్థుల్లో ఎక్కువగా.. భ్యర్థుల తొలి జాబితాలో జయ వర్దన్ (దక్షిణచైన్నె), చంద్రకాసన్(చిదంబరం) గతంలో ఎన్నికలలో పోటీచేసి ఓటమి పాలయ్యారు. జయవర్దన్ అన్నాడీఎంకే సీనియర్ నేత జయకుమార్ వారసుడు. ఇక రాయపురం మనో(ఉత్తర చైన్నె) పార్టీ పరంగా ఓటర్లకు సుపరిచితుడే. మదురై అభ్యర్థి డాకర్ట్ శరవణన్ గతంలో డీఎంకే తరపున తిరుప్పర గుండ్రం నుంచి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇటీవల ఆయన అన్నాడీఎంకేలో చేరారు. తొలి జాబితాలోని అభ్యర్థులలో ఎక్కువ శాతం మంది అన్నాడీఎంకే అనుబంధ సంస్థ జయ పేరవైకు చెందిన వారే ఉండడం గమనార్హం. -
TN: అన్నాడీఎంకే బహిష్కృత నేతలతో బీజేపీ పొత్తు
చెన్నై: లోక్‌సభ ఎన్నికల వేళ తమిళనాడులో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. అధికార డీఎంకే ప్రధాన ప్రత్యర్థి అన్నాడీఎంకే బహిషృత నేలను బీజేపీ దగ్గరకు తీస్తోంది. ఈ క్రమంలోనే ఎఎమ్ఎమ్కే చీఫ్ టీటీవీ దినకరన్, మాజీ సీఎం పన్నీర్ సెల్వంలతో బీజేపీ అగ్రనేతలు సీట్‌షేరింగ్ చర్చలు జరిపారు. ఈ చర్చల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి బేషరతు మద్దతిస్తున్నట్లు టీటీవీ దినకరన్ ఇప్పటికే స్పష్టం చేశారు. తాము దరఖాస్తు చేసిన ప్రెషర్ కుక్కర్ గుర్తు రాకపోతే కమలం గుర్తుపై పోటీ చేసేందుకు కూడా అభ్యంతరం లేదని దినకరన్ తెలిపారు. గతంలో టీటీవీ దినకరన్ రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు. ఈయన గతంలో ఏఐడీఎంకే అగ్ర నేతగా వ్యవహరించిన శశికలకు మేనల్లుడు. ఇక పన్నీర్ సెల్వంతో బీజేపీ సీట్‌షేరింగ్ చర్చలు ఇంకా కొలిక్కిరాలేదు. మరోపక్క అధికార డీఎంకే, కాంగ్రెస్, కమలహాసన్ పార్టీ, వైకో తదతరులు కలిసి ఇండియా కూటమి గొడుగు కింద లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. అయితే ఈ ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకే కూటమికి అన్నామలై సారథ్యంలోని బీజేపీ గట్టిపోటీ ఇవ్వనుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల పీఎం మోదీ నిర్వహించిన సభలకు కూడా ఇక్కడ మంచి స్పందన రావడంతో ఈ వాదనకు బలం చేకూరుతోంది. ఈ ఎన్నికల రేసులో బీజేపీ కంటే ప్రతిపక్ష అన్నాడీఎంకే వెనుకబడిందనే వాదన వినిపిస్తోంది. ఇదీ చదవండి.. అమిత్‌షా ఎంట్రీతో మహాకూటమి పంచాయతీ కొలిక్కి -
అన్నాడీఎంకే కేసులో పళనిస్వామికి భారీ విజయం
-
మళ్లీ వస్తాను.. అన్ని చక్కదిద్దుతాను: శశికళ
సాక్షి, చెన్నై: తనతో మాట్లాడిన వాళ్లను అన్నాడీఎంకే నుంచి తొలగిస్తూ సమన్వయ కమిటీ చేసిన ప్రకటనపై చిన్నమ్మ శశికళ ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని, అన్నింటినీ చక్కదిద్దుతానని మంగళవారం ఆమె స్పష్టం చేశారు. కరోనా పరిస్థితులు సద్దుమనిగినానంతరం దూకుడు పెంచబోతున్నారు. ఇందులో భాగంగా అన్నాడీఎంకేలో దివంగత సీఎంలు ఎంజీఆర్, జయలలిత హయాంలో పార్టీ కోసం శ్రమించిన సీనియర్ నేతలతో ఫోన్లో సంప్రదించారు. కార్యకర్తలతోనూ మాట్లాడుతూ భరోసా ఇస్తున్నారు. తాను రావడం ఖాయమని, అన్నాడీఎంకేను కైవసం చేసుకుందామని ధైర్యం చెబుతున్నారు. శశికళ వ్యూహాలకు చెక్‌పెట్టేందుకు ఆమెతో ఫోన్లో మాట్లాడిన నేతలను అన్నాడీఎంకే సమన్వయ కమిటీ పార్టీ నుంచి తొలగించింది. గ్రామ పర్యటన మంగళవారం మదురై, తేని జిల్లాల్లోనే అన్నాడీఎంకే నేతలు, పార్టీ అనుబంధ ఎంజీఆర్ యూత్ విభాగం నేతలు పలువురితో చిన్నమ్మ ఫోన్లో మాట్లాడారు. పార్టీని రక్షించుకోవాల్సిన అవశ్యం ఏర్పడిందన్నారు. తనను అడ్డుకోవడం ఎవరి తరం కాదని పేర్కొన్నారు. జయలలిత ఆశయాల దిశగా తన ప్రయాణం ఉంటుందన్నారు. కార్యకర్తలు తన వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తల అభీష్టం మేరకు గ్రామాల్లో పర్యటించేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలిపారు. కాగా అన్నాడీఎంకే నుంచి ఉద్వాసనకు గురైన అధికార ప్రతినిధి పుహలేంది మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభావం చూపించలేని బీజేపీ, పీఎంకే వంటి చిన్న పార్టీలకు అన్నాడీఎంకేను తాకట్టు పెట్టారని విమర్శించారు. త్వరలో పళనిస్వామి జైలుకు వెళ్లబోతున్నారని, ఈ మేరకు తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టబోతున్నట్టు పేర్కొనడం చర్చకు దారి తీసింది. చదవండి: Tamilnadu: శశికళ ఫోన్‌కాల్ ఆడియో కలకలం -
‘ఆమెతో మాట్లాడితే పార్టీ నుంచి బహిష్కరిస్తాం’
చెన్నై: అసెంబ్లీ డిప్యూటీ లీడర్, అసెంబ్లీ విప్‌ను ఎన్నుకునే సమావేశంలో ఓ కొత్త తీర్మానాన్ని అన్నాడీఎంకే పార్టీ ప్రవేశపెట్టింది. ఈ తీర్మానం ప్రకారం.. ఇకపై శశికళతో మాట్లాడే వారిపై కఠిన చర్యలు తప్పవని తమ నేతలను హెచ్చరించింది. సోమవారం జరిగిన పార్టీ సమావేశంలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇటీవల శశికళ మాట్లాడిన ఓ ఆడియో క్లిప్ బయట పడింది. ఆ వీడియోలో.. తాను తొందరలోనే క్రీయాశీల రాజకీయాల్లోకి వస్తున్నట్లు, తర్వాత అన్నాడీఎంకేపై పార్టీపై పట్టుసాధిస్తానని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలతో మాట్లాడుతుంది. ఈ ఆడియో విన్న తర్వాత పార్టీ నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా శశికళతో మాట్లాడిన వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని అన్నాడీఎంకే నేతలు తమ పార్టీ కార్యకర్తలను హెచ్చరించారు. పార్టీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించే వారిపైన కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. కాగా శశికళతో మాట్లాడిన 16 మంది పార్టీ కార్యకర్తలను అన్నాడీఎంకే బహిష్కరించింది. అలాగే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన పార్టీ ప్రతినిధి వీ పుగజేండిని కూడా బహిష్కరించింది. చదవండి: Tamilnadu: ‘అన్నాడీఎంకే’ నా ఊపిరి: శశికళ -
Tamilnadu: శశికళ ఫోన్‌కాల్ ఆడియో కలకలం
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే తన ఊపిరి అని, దానిని వేరు చేయడం ఎవరితరం కాదు అంటూ.. దివంగత సీఎం అమ్మ జయలలిత నెచ్చెలి చిన్నమ్మ శశికళ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ అంశానికి సంబంధించిన ఫోన్‌కాల్ ఆడియో గురువారం వైరల్‌గా మారింది. అస్త్రసన్యాసం ప్రకటనను వెనక్కి తీసుకుని మళ్లీ రాజకీయ ప్రవేశానికి చిన్నమ్మ శశికళ సన్నద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తన మద్దతు దారులతో ఆమె ఫోన్ ద్వారా మాటలు కలిపే పనిలో పడ్డారు. బుధవారం అన్నాడీఎంకే మాజీ మంత్రి ఆనందన్‌తో ఫోన్లో మాట్లాడిన శశికళ, గురువారం శివగంగై జిల్లా కారైక్కుకుడి అన్నాడీఎంకే నేత ప్రభాకరన్‌తో ఐదు నిమిషాలకు పైగా మాటలు కలిపారు. ఈసందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు అన్నాడీఎంకేలో చర్చకు దారి తీశాయి. ఇప్పటి వరకు ఆమె 22 మంది నేతలతో మాట్లాడి ఉన్నట్టు సమాచారం ఉంది. ఈ సమయాల్లో ఎక్కడా ఆమె అన్నాడీఎంకే పేరును ఉచ్చరించలేదు. పార్టీని రక్షించుకోవాలని, నేను వస్తున్నాను.. అని మాత్రమే స్పందించారు. అయితే, తాజాగా, అన్నాడీఎంకే తన ఊపిరని, దానిని ఎవరూ వేరు చే యలేరని వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది. ఎంతో కష్ట పడ్డాను.. దివంగత నేత ఎంజీఆర్ తదుపరి అన్నాడీఎంకే బలోపేతం కోసం అమ్మ జయలలితో కలిసి తాను ఎంతో కష్టపడ్డానని, ఇది ఎవరికీ తెలియని విషయంగా చిన్నమ్మ ఆ ఫోన్‌కాల్‌లో పేర్కొన్నారు. అమ్మకు వచ్చే లేఖల్ని చదివి వినిపించడం, వాటికి సమాధానాలు పంపించడం తానే చేయడం జరిగేదని పేర్కొంటూ, ఇప్పుడు కార్యకర్తల నుంచి తనకు వస్తున్న లేఖలు చదివి, చూస్తూ కూర్చునే పరిస్థితి లేదన్నారు. ఆరోజు కూవత్తూరులోనూ తాను చెప్పిన విషయాలు అందరికీ గుర్తుంటాయని, అందరం ఏకం అవుదామంటూ చిన్నమ్మ ముగించారు. 14వ తేదీ భేటీలో ఎమ్మెల్యేలకే అనుమతి.. చిన్నమ్మ ఫోన్ కాల్ వ్యవహారాలు ఓ వైపు ఉన్నా, మరోవైపు పార్టీ తమ గుప్పెట్లో నుంచి జారకుండా అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కుస్తీలు పట్టే పనిలోపడింది. ఈనెల 14న పార్టీ ఎమ్మెల్యేల సమావేశానికి అనుమతి దక్కడంతో గురువారం పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం, కో కన్వీనర్ పళనిస్వామి సంయుక్త ప్రకటన చేశారు. ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రమే అనుమతి ఉందని, ఇతరులు ఎవ్వరూ రాకూడదని, కరోనా నిబంధనల్ని తప్పనిసరిగా అనుసరించాలని సూచించారు. ఈ సమావేశంలో శాసనసభాపక్ష ఉపనేత, విప్‌ను ఎంపిక చేయనున్నారు. చదవండి: దేశంలో, పార్టీలో మోదీనే టాప్: సంజయ్ రౌత్ యూపీ కేబినెట్ ప్రక్షాళన! -
ఇక ఇప్పుడు జాతీయ నేతల వంతు..!
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి జాతీయ నేతలు సిద్ధమయ్యారు. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఈనెల 27వ తేదీ నుంచి ఒకరి తర్వాత మరొకరు పర్యటించనున్నారు. అన్నాడీఎంకే కూటమిలో బీజేపీ 20 స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసింది. ఆయా అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో ఉరకలు తీస్తున్నారు. అలాగే కన్యాకుమారి లోక్‌సభ ఉప ఎన్నికల్లో కేంద్ర మాజీ మంత్రి పొన్ రాధాకృష్ణన్ పోటీలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో తమ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారానికి బీజేపీ నేతలు ప్రణాళికలు సిద్ధం చేశారు. తొలుత కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆ తర్వాత రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ చెన్నై హార్బర్ నియోజకవర్గంలో పోటీలో ఉన్న యువజన నేత వినోజ్ బి సెల్వంకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. అలాగే కేంద్రమంత్రి స్మృతి ఇరాని ధౌజండ్ లైట్స్ అభ్యర్థి కుష్భుకు మద్దతుగా ప్రచారానికి సిద్ధం అయ్యారు. 28న ఒకే వేదిక మీదకు... ఇప్పటికే పలుమార్లు ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈనెల 28న మలి విడత ప్రచారానికి సిద్ధం అయ్యారు. చెన్నై వేళచ్చేరిలో పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థి హసన్‌కు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు సేలంలో భారీ ర్యాలీతో ఓటర్ల వద్దకు వెళ్లనున్నారు. అదే రోజు సాయంత్రం సేలం సీలనాయకన్ పట్టిలో జరిగే బహిరంగ సభకు హాజరుకానున్నారు. ఇంత వరకు డీఎంకే కూటమి నేతలు ఒకే వేదిక మీదకు రాలేదు. ఈ బహిరంగ సభ వేదికగా రాహుల్, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, ఎండీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమావళవన్, మైనారీటీ పార్టీల నేతలు ఖాదర్ మొహిద్దీన్, జవహరుల్లా, తమీమున్ అన్సారీ, వామపక్ష నేతలు బాలకృష్ణన్, ముత్తరసన్లతో పాటుగా డీఎంకే మిత్రపక్షాల నేతలు అందరూ ఒకే చోట కలవనున్నారు. ఉచిత పథకాలతో పేదరికం పోదు: కమల్ వ్యాఖ్య సాక్షి, చెన్నై: ఉచిత పథకాలు అమలు చేసినంతమాత్రాన పేదరికం తొలగే ప్రసక్తి లేదని మక్కల్ నీదిమయ్యం అధినేత కమల్‌హాసన్ అన్నారు. బుధవారం కోయంబత్తూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్లను ఉద్దేశించి కమల్ మాట్లాడుతూ.. ఉచితాలు ఇచ్చేస్తున్నారు కదా..? అని ఓట్లు వేస్తే మరో ఐదేళ్లు తీవ్రసంకటం ఎదుర్కోవడం తథ్యమని హెచ్చరించారు. ఉచిత పథకాల రూపంలో ప్రతి ఒక్కరి నేత్తిన అప్పులభారం పెరగబోతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి నెత్తిన రూ. 65 వేల అప్పు ఉందన్నారు. భవిష్యత్తులో రూ. 2లక్షలకు పెరిగినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. ఓటు వేసే ముందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. తిరుచ్చిలో సాగిన ప్రచారంలో కమల్‌పై ఓ మహిళ భారతీయార్చిత్ర పటాన్ని విసరడం కలకలం రేపింది. ఇక కమల్‌కు మద్దతుగా గురువారం కోయంబత్తూరు దక్షిణం నియోజకవర్గంలో ఎస్ఎంకే నేత శరత్‌కుమార్ ప్రచారం చేయనున్నారు. -
తమిళ ఎన్నికలు: సర్వేలన్ని ఆ పార్టీకే అనుకూలం
డీఎంకే అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలన్నీ స్పష్టం చేస్తుండడంతో అన్నాడీఎంకే పార్టీ అంతర్మధనంలో పడింది. తమ ఎన్నికల వ్యూహాన్ని మార్చేందుకు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, పన్నీరుసెల్వం సిద్ధమయ్యారు. బుధవారం సేలంలోని ఓ ప్రైవేట్ హోటల్లో అర్ధగంట పాటు భేటీ అయ్యారు. సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించాలని అన్నాడీఎంకే పార్టీ ఉవ్విల్లూరుతోంది. ఈ మేరకు ఎన్నికల వ్యూహాలకు పదును పెట్టింది. ఉచిత పథకాలతో ప్రజాకర్షక మేనిఫెస్టోను ప్రకటించింది. అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కో–కన్వీనర్, సీఎం పళనిస్వామి కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో దూసుకెళుతున్నారు. ప్రచార సభలకు అనూహ్య స్పందన వస్తున్నా, ఉచిత పథకాల హామీలు ప్రజల్లో ఆసక్తిని కలిగించినా సర్వేలు మాత్రం భిన్నంగా వస్తుండడం ఆ పార్టీని కలవరంలో పడేసింది. వ్యూహాలకు పదును.. ఇప్పటి వరకు వెలువడిన నాలుగైదు సర్వేలు డీఎంకే అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశాయి. దీంతో ఆ పార్టీ పెద్దలు వ్యూహాలకు పదునుపెట్టారు. పార్టీ నాయకులు గ్రామస్థాయి నుంచి ప్రజల్లోకి వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. మేనిఫెస్టోను విస్తృతంగా ప్రచారం చేయడానికి సిద్ధమవుతున్నారు. అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరుసెల్వం, కో–కన్వీనర్ ఎడపాడి పళనిస్వామి బుధవరం సేలంలో భేటీ అయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్రణాళికలపై అరగంట పాటు చర్చించారు. కూటమి పార్టీలను కలుపుకుని సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని జిల్లా, నియోజకవర్గ నాయకులకు దిశానిద్దేశం చేశారు. నిర్లక్ష్యం ప్రదర్శిస్తే అధికారానికి దూరం అవుతామని హెచ్చరికలు పంపారు. అలాగే ప్రచారంలో డీఎంకే హయాంలో చోటుచేసుకున్న అవినీతి, కుటుంబ పాలన, తమిళులకు చేసిన ద్రోహాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. దివంగత సీఎం జయలలిత విజన్‌ను ప్రజలకు వివరించే విధంగా ప్రచార కార్యక్రమాలకు సిద్ధమయ్యారని ఓ నేత పేర్కొన్నారు. పన్నీరు ప్రచారం సీఎం పళనిస్వామి సేలం జిల్లా ఎడపాడిలో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆయనకు మద్దతుగా పన్నీరుసెల్వం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. పళనికి మద్దతు పలకాలని, అమ్మ పాలన కొనసాగాలంటే అన్నాడీఎంకే పార్టీకి మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. కరూర్‌లో పళని కరూర్‌లో పోటీ చేస్తున్న ఎంఆర్ విజయ భాస్కర్, అరవకురిచ్చి నుంచి బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి అన్నామలైలకు మద్దతుగా పళనిస్వామి ప్రచారం చేశారు. ఓపెన్ టాప్ వాహనంలో విస్తృతంగా పర్యటించారు. డీఎంకే హయాంలో సాగిన కబ్జాలను ప్రస్తావించారు. తాము అధికారంలోకి వస్తే ఆ స్థలాలను స్వాధీనం చేసుకుని లబ్ధిదారులు, బాధితులకు అందిస్తామని హామీ ఇచ్చారు. కరూర్ డీఎంకే అభ్యర్థి సెంథిల్ బాలాజీ అన్నాడీఎంకే ద్రోహి అని విమర్శించారు. అమ్మ ప్రభుత్వాన్ని కూల్చేందు విశ్వప్రయత్నాలు చేశారని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం ఉండడం వల్లే రాష్ట్రానికి రూ. లక్ష కోట్ల మేరకు నిధులు వచ్చినట్లు వివరించారు. చదవండి: నోరు జారిన పన్నీర్‌సెల్వం.. అందరూ నవ్వడంతో.. -
శశికళ వాహనంపై అన్నాడీఎంకే జెండా..
సాక్షి, బెంగుళూరు: అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ బెంగళూరు విక్టోరియా ఆస్పత్రి నుంచి ఆదివారం డిశ్చార్జ్ అయ్యారు. ఆసుపత్రి వద్ద అనుచరులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఇదిలా ఉండగా, శశికళ వాహనంపై అన్నాడీఎంకే పార్టీ జెండా ఉండటం హాట్ టాపిక్‌గా మారింది. ఆమెను ఇప్పటికే పార్టీ నుంచి బహిష్కరించిన సంగతి విధితమే. 2017లో అక్రమాస్తుల కేసులో అరెస్టయిన శశికళ.. బెంగుళూరు పరప్పన అగ్రహారం జైలుకెళ్లారు. కొన్ని రోజుల క్రితం అనారోగ్యానికి గురవడంతో బెంగుళూరులోని ఆసుపత్రికి తరలించారు. (చదవండి: ఏఐఏడీఎంకేతో పొత్తు కొనసాగుతుంది) కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షించగా, పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దాంతో విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స అందించారు. మళ్లీ కరోనా పరీక్ష నిర్వహించగా నెగిటివ్ రావడంతో ఆసుపత్రి నుంచి ఆదివారం డిశ్చార్జ్ చేశారు. అక్రమాస్తుల కేసులో ఈ నెల 27తో నాలుగేళ్ల శిక్షాకాలాన్ని ఆమె పూర్తి చేసుకున్నారు. 2016 వరకు అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీగా పనిచేసిన శశికళను అప్పటి పరిణామాలతో పదవి నుంచి తొలగించడంతో పాటు, పార్టీ నుంచి బహిష్కరించారు.(చదవండి: మోదీ మన్ కీ బాత్: ఆ ఘటన బాధాకరం) -
అన్నాడీఎంకేలో సామరస్యత
దీర్ఘకాలం రాజకీయరంగాన్ని ప్రభావితం చేసిన దిగ్గజ నాయకులు కనుమరుగైతే... ఆ వెలితిని పూడ్చేవారు కనుచూపు మేరలో కనబడకపోతే ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో తమిళనాడు చాన్నాళ్లుగా నిరూపిస్తూనే వుంది. రాష్ట్ర రాజకీయాల సంగతలావుంచితే పాలకపక్షంగా వున్న అన్నా డీఎంకేలో ఒకరకమైన అనిశ్చితి చాన్నాళ్లుగా కొనసాగుతోంది. ఆ పార్టీలో ఒక వర్గానికి ముఖ్యమంత్రి ఇ.కె. పళనిస్వామి, రెండో వర్గానికి మాజీ ముఖ్యమంత్రి ఒ. పన్నీరుసెల్వం నేతృత్వంవహిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగవలసివున్న తరుణంలో ఈ అని శ్చితికి ముగింపు పలకాలని ఇరు వర్గాలూ ఒక అంగీకారానికొచ్చాయి. బుధవారం కుదిరిన అవగా హన ప్రకారం వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తే ప్రస్తుత సీఎం పళనిస్వామే మళ్లీ సీఎం అవు తారు. అలాగే పన్నీరుసెల్వం ఆధ్వర్యంలో పార్టీ సారథ్యబాధ్యతలను చూడటానికి ఒక స్టీరింగ్ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ కోసం పన్నీరుసెల్వం కొంతకాలంగా పట్టుబడుతున్నారు. అయితే ప్రభుత్వమూ, పార్టీ తన చెప్పుచేతల్లో వుండాలన్నది పళనిస్వామి నిశ్చితాభిప్రాయం. ఈసారి తనకు ముఖ్యమంత్రి పీఠం దక్కాలని, అది కుదరకపోతే పార్టీ పగ్గాలైనా అప్పగించాలని పన్నీరుసెల్వం కోరుకుంటున్నారు. ఈ విషయంలో వచ్చిన విభేదాలు తీవ్రమై సమస్యలు మొదలయ్యాయి. ఎన్నిక లకు ఇంకా ఆరేడు నెలల వ్యవధి వున్న తరుణంలో ఇద్దరు నేతలూ రాజీపడి ఒక అంగీకారానికి రావడం ఆ పార్టీ శ్రేయస్సుకు మంచిదే. (చదవండి: అన్నాడీఎంకే సీఎం అభ్యర్థి పళని) ఎంజీఆర్ మరణం తర్వాత అన్నా డీఎంకే పార్టీకి పెద్ద దిక్కుగా వుంటూ వచ్చిన తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత 2016 డిసెంబర్లో చనిపోయాక ఆ పార్టీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. ద్వితీయ శ్రేణి నాయకుడో, నాయకురాలో లేకపోవడంతో సీఎం పదవి కోసం తీవ్ర పోటీ ఏర్పడింది. జయ ఆప్తురాలిగా వున్న వి.కె. శశికళ ఆమె బాటలోనే పన్నీరు సెల్వంను మరోసారి ఆ పదవిలో కూర్చోబెట్టారు. కానీ మరో రెండు నెలలకు తానే సీఎం కావాలనుకున్నారు. ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా నిర్ణయించుకున్నాక అదంతా బెడిసికొట్టి పదవి రావడం మాట అటుంచి ఆమెకు అవినీతి కేసులో శిక్షపడింది. ఈలోగా పన్నీరుసెల్వం తన మద్దతుదార్లతో వేరే కుంపటి పెట్టుకున్నారు. చివరకు శశికళ పళనిస్వామికి ముఖ్యమంత్రి పదవి అప్పగించారు. అయితే చాలా త్వరగానే పళనిస్వామి సైతం ఆమె నుంచి దూరం జరిగారు. బీజేపీ నాయకగణం మధ్య వర్తిత్వం ఫలితంగా అన్నాడీఎంకేలోని పన్నీరుసెల్వం, పళనిస్వామి వర్గాలు ఏకమై అప్పటినుంచీ బండి లాగిస్తున్నాయి. తమిళనాడు రాజకీయాల్లో ఒక్క ఎంజీఆర్ హయాంలో తప్ప ఎప్పుడూ ఒకే పార్టీ వరసగా మూడోసారి అధికారంలోకొచ్చిన దాఖలా లేదు. అలా చూస్తే అన్నాడీఎంకే కోటా అయిపోయినట్టే. ఆ పార్టీ అధికారంలో కొనసాగడం వరసగా ఇది రెండోసారి. ఇప్పుడు నేతలిద్దరి రాజీ ఫలితంగా ఆ పార్టీకి కొత్తగా జవసత్వాలొచ్చి మూడోసారి సైతం అధికారంలోకొచ్చి చరిత్రను తిరగరాస్తుందా అన్నది ఇంకా చూడాల్సివుంది. పై స్థాయిలో ఇద్దరి మధ్యా ఏర్పడ్డ సఖ్యత ప్రభావం కింది స్థాయి కేడర్ వరకూ వెళ్తే... పాలన సైతం జనరంజకంగా సాగితే అది అసాధ్యం కాకపోవచ్చు. ప్రతిపక్షంతో పోలిస్తే అధికార పక్షానికి ఎప్పుడూ కొంత వెసులుబాటు వుంటుంది. ఏయే అంశాల్లో ప్రభుత్వంపై అసంతృప్తి వుందో తెలుసుకుని, వాటిని చక్కదిద్దుకునే ప్రయత్నం చేయడానికి... కొత్త విధానాలతో, పథకాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేయడానికి పాలకపక్షానికే అవకాశం వుంటుంది. పాలనకు సంబంధించి ప్రజల్లో పెద్దగా అసంతృప్తి లేకపోయినా గతంలోవలే కేంద్రంతో పోరాడి దేన్నయినా సాధించే తత్వం ప్రస్తుత పాలకుల్లో కొరవడిందన్న భావన ఏర్పడింది. నీట్ విషయంలో రాష్ట్రం గట్టిగా పోరాడితే బాగుండేదన్న అభిప్రాయం వుంది. నిరుడు చెన్నైలో ఏర్పడిన మంచినీటి కొరత కనీవినీ ఎరుగనిది. దానిపై చివరకు హాలీవుడ్ నటుడు లియనార్డో డి కాప్రియో సైతం ఆందోళన వ్యక్తం చేశారు. విపక్ష డీఎంకే ఆధ్వర్యంలో తమిళనాడు అంతటా నిరుడు జరిగిన సీఏఏ వ్యతిరేక ఆందోళన దక్షిణాదిలోనే అతి పెద్దది. సహజంగానే ఈ అంశంపై పాలక అన్నాడీఎంకే మాట్లాడలేకపోయింది. అన్నా డీఎంకే సమష్టిగా పోరాడటం ఒక ఎత్తయితే... విపక్షమైన డీఎంకే రూపంలో ఎదురయ్యే సవాలును ఎదుర్కొనడం మరో ఎత్తు. నిరుడు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ ఏర్పాటుచేసి 39 స్థానాలకూ 38 సాధించుకుంది. పొరు గునున్న పాండిచ్చేరిలోని ఒకే ఒక స్థానం సైతం కూటమికొచ్చింది. అసెంబ్లీలోని 22 స్థానాలకు అంతక్రితం జరిగిన ఉప ఎన్నికల్లో 9 చోట్ల అన్నాడీఎంకే నెగ్గింది. ఆ ఎన్నికల్లో అన్నాడీఎంకే తుడిచి పెట్టుకుపోతుందని, తగిన మెజారిటీ లేక పళనిస్వామి ప్రభుత్వం కుప్పకూలుతుందని భావించిన డీఎంకేకు ఇది షాక్. దాన్నుంచి త్వరలోనే కోలుకుని లోక్‌సభ ఎన్నికల్లో స్టాలిన్ తన సత్తా చాట గలి గారు. అయితే నిరుడు అక్టోబర్‌లో జరిగిన రెండు ఉప ఎన్నికల్లో విజయం సాధించి పళనిస్వామి పరువు నిలుపుకున్నారు. సినీ నటుడు కమలహాసన్ ప్రారంభించిన మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కడా నెగ్గకపోయినా తనకంటూ వోటు బ్యాంకు వుందని నిరూ పించుకుంది. మరో నటుడు రజనీకాంత్ పార్టీ ఇంకా కళ్లు తెరవలేదు. తమ పార్టీ అసెంబ్లీలోని 234 స్థానాలకూ పోటీ చేస్తుందని మాత్రం ప్రకటించారు. కాగా, శశికళ జైలుశిక్ష పూర్తిచేసుకుని డిసెం బర్లో రాబోతున్నారు. ఆమె ఎత్తుగడలేమిటో చూడాల్సివుంది. ప్రస్తుతం ఏ జాతీయ పార్టీ అయినా అన్నాడీఎంకే, డీఎంకేల్లో ఏదో ఒకదానితో చెలిమి చేయడం తప్పనిసరి. ఇప్పుడు పన్నీరుసెల్వం, పళనిస్వామిల మధ్య ఏర్పడిన సామరస్యం ఫలితమేమిటో... కొత్త పార్టీల రాకతో డీఎంకేకు కలిగే లాభనష్టాలేమిటో, జాతీయ పార్టీల భవితవ్యమేమిటో రాగల అసెంబ్లీ ఎన్నికలు తేలుస్తాయి. -
రక్త సంబంధీకులు వారసులు కారా?
సాక్షి, చెన్నై : వేద నిలయాన్ని స్మారక మందిరంగా మారుస్తూ తీసుకొచ్చిన ప్రత్యేక చట్టాన్ని దివంగత సీఎం జయలలిత మేన కోడలు దీప తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ ఇంటిని కబ్జాచేయడమే కాదు, అందులో ఉన్న వస్తువుల్ని కొల్లగొట్టేందుకు అన్నాడీఎంకే పాలకులు సిద్ధమయ్యారని ఆరోపించారు. పోయెస్‌గార్డెన్‌లోని దివంగత సీఎం జయలలితకు చెందిన వేదనిలయాన్ని స్మారక మందిరంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పనులకు గాను సీఎం నేతృత్వంలో ఓ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. గవర్నర్ ఆమోదంతో ఈ చట్టాన్ని అమలు చేయడానికి సిద్ధమయ్యారు. ఆగమేఘాలపై చట్టం ఏంటి? ఈ పరిస్థితుల్లో జయలలిత మేన కోడలు దీప ఆదివారం ఆడియో రూపంలో స్పందించారు. జయలలితతో తనది రక్త సంబంధం అన్న విషయాన్ని ఈ పాలకులు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఆమెకు తాను మేన కోడలు అని, మేనత్త మరణంతో తాను రాజకీయాల్లోకి రావాల్సిన పరిస్థితి వచ్చిందని గుర్తు చేశారు. అయితే, రాజకీయ కుట్రలు, వెన్నంటి ఉన్న వారి రూపంలో అందులో నుంచి బయటకు రాక తప్పలేదన్నారు. ప్రస్తుతం కరోనా తాండవం రాష్ట్రంలో మరీ ఎక్కువగా ఉందని గుర్తు చేస్తూ, ఈ సమయంలో ఆగమేఘాల మీద తన మేనత్త ఇంటిని కబ్జా చేయడానికి చట్టం తీసుకు రావాల్సిన అవసరం ఈ పాలకులకు ఎందుకు వచ్చినట్టు అని ప్రశ్నించారు. కేవలం వేద నిలయాన్ని కబ్జా చేయడం, అక్కడున్న అన్ని రకాల వస్తువుల్ని అపహరించడం, కొల్లగొట్టడం లక్ష్యంగా ఈ పాలకుల చర్యలు ఉన్నాయని ఆరోపించారు. జయలలిత ఆస్తులకు ఎవరైనా వారసులు అని నిరూపించుకుని రానివ్వండి తదుపరి చూసుకుందామని న్యాయ మంత్రి సీవీ షణ్ముగం ఓ వ్యాఖ్య చేశారని గుర్తు చేశారు. రక్త సంబంధీకులు వారసులు కాలేరా అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తన మేనత్త మరణం గురించిన వివరాల్ని నిగ్గు తేల్చలేని పరిస్థితుల్లో ఈ పాలకులు ఉన్నారని ధ్వజమెత్తారు. చనిపోయిన తన మేనత్తను మళ్లీ తీసుకు రాగలరా అని ప్రశ్నిస్తూ, వేదనిలయం తమ పూర్వీకుల సొత్తు అని దాని జోలికి వెళ్లడం మంచిది కాదని హెచ్చరించారు. -
‘అమ్మ’ పథకాల అమలుపై ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ : తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత 1991, జూన్ 24వ తేదీన మొదటి సారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె ఆ రాష్ట్రానికి రెండో మహిళా ముఖ్యమంత్రి. ఆమెకన్నా ముందు ఆమె రాజకీయ గురువు ఎంజీ రామచంద్రన్ భార్య జానకి రామచంద్రన్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఓ నెలరోజులపాటు ఆ పదవిలో కొనసాగారు. 1991 నుంచి 2016లో ఆమె చనిపోయే వరకు ఆరు పర్యాయాలు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారంటే అందుకు ప్రధాన కారణం ఆమె ప్రజల కోసం, ముఖ్యంగా మహిళలకోసం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలే కారణం. తమిళనాడులో ఆడ శిశు హత్యలు పెరిగిపోతున్న నేపథ్యంలో జయలలిత 1992లో ‘క్రేడిల్ బేబీ స్కీమ్’ను ప్రవేశపెట్టారు. ఈ స్కీమ్ కింద ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక కేంద్రాలు, పిల్లల సంరక్షణాలయాల్లో ఊయలలను ఏర్పాటు చేశారు. ఆడ శిశువులు అవసరం లేదనుకున్న తల్లిదండ్రులు వారిని తీసుకొచ్చి వాటిలో వేసి పోవచ్చు. ఆ తర్వాత ఆ ఆడ శిశువులను అవసరం మున్న దంపతులకు దత్తత ఇచ్చేవారు. లేదంటే ప్రభుత్వ పిల్లల సంరక్షణాలయాల్లో చేర్చేవారు. 2011లో జరిగిన ఎన్నికల్లో ఆమె విజయం సాధించిన తర్వాత జయలలిత దాదాపు రెండు కోట్ల మంది మహిళలకు ఉచితంగా మిక్సర్ గ్రైండర్స్, ఫ్యాన్స్ పంపిణీ చేశారు. ఆమె అదే ఏడాది వద్ధులు, వితంతువుల పింఛన్లను పెంచారు. 2013, ఫిబ్రవరి నెలలో ఆమె ‘అమ్మ క్యాంటీన్లు’ స్కీమ్‌ను ప్రారంభించారు. రూపాయికి ఇడ్లీ, మూడు రూపాయలకు పెరుగన్నం, ఐదు రూపాయలకు సాంబార్ అన్నం చొప్పున నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేయడం వల్ల ఈ క్యాంటీన్లకు అమితమైన ప్రజాదరణ వచ్చింది. 2014లో ‘అమ్మ బేబీ కేర్ కిట్’ అనే స్కీమ్‌ను ప్రారంభించారు. ఈ స్కీమ్ కింద ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన పిల్లలకు 16 వస్తువులతో కూడిన వెయ్యి రూపాయల కిట్ ఇచ్చేవారు. వాటిలో సబ్బు, టవల్, నేల్కట్టర్, దోమతెర, ఓ బొమ్మ లాంటివి ఉండేవి. 2015లో అంతర్జాతీయ తల్లి పాల దినోత్సవాన్ని పురస్కరించుకొని జయలలిత, రాష్ట్రవ్యాప్తంగా బస్టాండ్లలో 350 తల్లి పిల్లలకు పాలివ్వడానికి అనువైన గదులను ఏర్పాటు చేశారు. అదే సంవత్సరం ‘అమ్మ ఆరోగ్య పథకం’ను ప్రవేశపెట్టారు. ప్రభుత్వ కేంద్రాల వద్ద 30 ఏళ్ల లోపు వారికి ఈ స్కీమ్ కింద ఉచిత వైద్య పరీక్షలు ఏర్పాటు చేశారు. మహిళలకైతే డీ విటమన్ స్థాయి, బోన్ సాంద్రత, పరథ్రాయిడ్ లాంటి ప్రత్యేక పరీక్షలు కూడా ఉచితంగా నిర్వహించేవారు. తమిళనాడులో 1962లో వద్ధాప్య పింఛన్లను ప్రవేశపెట్టారు. 1975లో దాన్ని వితంతువులకు కూడా వర్తింపచేశారు. 2011లో ఆ పింఛన్లను జయలలిత ప్రభుత్వం 1000 రూపాయలకు పెంచింది. ఆ పింఛన్లను 1500 రూపాయలకు పెంచుతామని 2016 ఎన్నికల ప్రణాళికలో జయలలిత ప్రకటించారు. దాన్ని అమలు చేయకముందే ఆమె మరణించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రులైనవారుగానీ, ప్రస్తుత ముఖ్యమంత్రి పళని స్వామి సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల జయలలిత ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాలు అంతంత మాత్రంగానే నడుస్తున్నాయని ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఆగ్రహంతో ఉన్నారు. రానున్న ఎన్నికల్లో ఇది ఏఐఏడీఎంకే ప్రభుత్వానికి ప్రతికూల అంశం. ఈ నెల 18వ తేదీన రాష్ట్రంలోని లోక్‌సభ స్థానాలతోపాటు రాష్ట్రంలోని 18 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. 234 స్థానాలు కలిగిన అసెంబ్లీలో 114 మంది సభ్యుల మద్దతు కలిగిన (స్పీకర్ మినహా) పాలకపక్షానికి ఉప ఎన్నికలు కీలకమే! -
డాన్స్‌తో ఎన్నికల ప్రచారం
తిరువళ్లూరు: ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు తమ వంతు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. తిరువళ్లూరు పార్లమెంట్ స్థానంతో పాటు పూందమల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి ఏప్రిల్ 18న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. పూందమల్లి నియోజకవర్గంలోని వదట్టూరు కోయంబాక్కం ఎగువకొండయూర్ ఆరియలూరుతో పాటు పది గ్రామాల్లో అన్నాడీఎంకే అభ్యర్థి వైద్యనాథన్ ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. తనకు ఓటు వేసి గెలిపిస్తే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండడంతో పాటు మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. ఇదే విధంగా పూందమల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న డీఎంకే అభ్యర్థి కృష్ణస్వామి పూందమల్లి పట్టణంలోనూ, ఏఎంఎంకే అభ్యర్థి ఏలుమలై ఎల్లాపురం యూనియన్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. కాగా పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న అన్నాడీఎంకే అభ్యర్థి వేణుగోపాల్ గుమ్మిడిపూండిలోనూ, కాంగ్రెస్ అభ్యర్థి జయకుమార్ తిరువేళాంగాడు యూనియన్లోనూ, ఏఎంఎంకే అభ్యర్థి పొన్‌రాజా పొన్నేరిలోనూ ప్రచారం నిర్వహించారు. ఇదిలాఉండగా గ్రామీణ ఓటర్లును ఆకట్టుకోవడానికి ఎంజీఆర్‌తో పాటు ఇతర వేషధారణలో కళాకారులతో నృత్యాలను ఏర్పాటు చేసి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. -
తలైవా.. ఒక్కసారి రావా!
సాక్షి ప్రతినిధి, చెన్నై: రాష్ట్రంలో ఎన్నికలు అనగానే భారతీయ జనతా పార్టీకి సూపర్‌స్టార్ రజనీకాంత్ గుర్తుకొస్తారు. అయితే ఈసారి వారితోపాటూ అన్నాడీఎంకే సైతం తలైవా..రావా అని ఆహ్వానిస్తోంది. మద్దతు లేదా మాట కోసం ప్రయత్నాలు చేస్తోంది. అన్నాడీఎంకే ఎన్నికల ప్రచారం అనగానే అందరికీ జయలలిత కళ్లముందు మెదులుతారు. అమ్మ కన్నుమూసిన తరువాత అన్నాడీఎంకే తొలిసారిగా ఎన్నికలను ఎదుర్కొంటోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కారణం ఆ ప్రతిష్ట నిలబడాలంటే లోక్‌సభ, ఉపఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలువకతప్పదు. ఎన్నికల ప్రచార నిమిత్తం పార్టీ ప్రధాన రథసారథులు ఎడపాడి పళినిస్వామి, పన్నీర్‌సెల్వం చెరోవైపు రాష్ట్రాన్ని చుడుతున్నారు. అయితే ప్రచార రథంలో జయలలిత లేని లోటు కొట్టొచ్చినట్లు కనపడుతోంది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో తిరుగులేని చరిష్మా కలిగిన నేత అన్నాడీఎంకేలో కరువయ్యారు. అయితే పార్టీకీ, ప్రభుత్వానికి పూర్వవైభవం కరువైన తరుణంలో డీఎంకే–కాంగ్రెస్ కూటమిని దీటుగా ఎదుర్కొనాలంటే ఆదనపు ఆకర్షణ తప్పదనే విషయం అన్నాడీఎంకే అదనపు బలం తప్పదని అన్నాడీఎంకేకు మొదట్లోనే అర్థమైంది. అందుకే బీజేపీ, ఎండీఎంకే, పీఎంకే, పుదియ తమిళగం, తమాకా, ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీలతో కూటమిగా ఏర్పడింది. కూటమికి నాయకత్వం వహిస్తున్న ఈపీఎస్, ఓపీఎస్‌లపై తమ పార్టీ అభ్యర్థులనే కాదు, మిత్రపక్షాల అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత పడింది. అడపాదడపా మిత్రపక్ష పార్టీల కోసం ఎడపాడి, ఓపీఎస్ సైతం గళం విప్పుతున్నారు. పీఎంకే తరపున రాందాస్, డీఎండీకే అభ్యర్థుల కోసం ఆ పార్టీ కోశాధికారి ప్రేమలత ప్రచారం చేస్తున్నారు. ఇక బీజేపీ తమకు కేటాయించిన స్థానాలకే పరిమితమై ఎవరికి వారుగా కూడా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రధాని మోదీ, అమిత్‌షాల పర్యటన ఇంకా ఖరారు కాలేదు. అమ్మ లేని లోటు కొట్టొచ్చినట్లు కనపడుతుండగా ఎన్నికలను సునాయాసంగా అధిగమిస్తామనే నమ్మకం అన్నాడీఎంకేలో లేకుండా పోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే ఎన్నికల్లో ఫలితాలు తారుమారు కావడం ఖాయమనే భయం అన్నాడీఎంకే నేతల్లో పట్టుకుంది. దీంతో రాష్ట్రంలోని అన్ని స్థానాలను ప్రభావితం చేయగల జనాకర్షక నేత ఎవరబ్బా అని ఆలోచనలో పడిన నేతలకు సూపర్‌స్టార్ రజనీకాంత్ స్పురించారు. బహిరంగంగా మద్దతు ప్రకటించడం లేదా ‘వాయిస్’ ఇవ్వడం ద్వారా ప్రజలను ప్రభావితం చేయడానికో రజనీని ఒప్పించాలని పట్టుదలతో ఇక ఆలస్యం చేయకుండా తెరవెనుక ప్రయత్నాలు ప్రారంభించారు. మొదటి నుంచి స్నేహపూరిత సత్సంబంధాలను నెరపుతున్న బీజేపీ నేతలు ముందుగా రజనీతో చర్చలు ప్రారంభించింది. అలాగే అన్నాడీఎంకే తరఫున రజనీ స్నేహితులైన కేంద్ర, రాష్ట్ర మంత్రులు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. నదుల అనుసంధానానికి ప్రాధాన్యత కల్పించే పార్టీలకు ఓటు వేయాల్సిందిగా అభిమానులకు రజనీకాంత్ గతంలో సూచించారు. ఆ నినాదానికి అనుగుణంగా అన్నాడీఎంకే ఎన్నికల మేనిఫెస్టోలో నదుల అనుసంధానం అంశాన్ని చేర్చింది. కొన్నిరోజుల తరువాత అన్నాడీఎంకే విడుదల చేసిన అదనపు మేనిఫెస్టోలో కావేరీ–గోదావరి అనుసంధానంపై వెంటనే ప్రయత్నాలు ప్రారంభిస్తామని స్పష్టం చేసింది. రజనీ ఆశయాలకు అనుగుణంగా అన్నాడీఎంకే మేనిఫెస్టో ఉన్న అంశాలను అవకాశంగా చేసుకుని మద్దతు లేదా కనీసం వాయిస్ అయినా రజనీకాంత్ నుంచి రాబట్టాలని ఆశిస్తున్నారు. పార్టీ పక్షాన నేరుగా నిలవకున్నా..మేనిఫెస్టోలో నదుల అనుసం«ధానాన్ని స్వాగతిస్తున్నా, ప్రధాని మోదీ గురించి రెండు మంచి మాటలు చెబితే చాలు ఇక మేము చూసుకుంటామనే రీతిలో అన్నాడీఎంకే ఆశిస్తోంది. వచ్చేనెల 10వ తేదీన రజనీకాంత్ కొత్త చిత్రం షూటింగ్ ముంబైలో ప్రారంభం కానుంది. అన్నాడీఎంకే కూటమి కోసం ఆయన ‘మాట’ సాయం చేయదలిస్తే ఈలోగానే చేయాలి. కొట్టంగా కొట్టంగా కొండరాయి కూడా కొంచెం జరుగుతుందనే తీరులో కోరంగా కోరంగా రజనీలో మార్పువస్తుందని ఆశపడుతున్నారు. రజనీకాంత్ మద్దతు కోసం కమల్‌హాసన్ బహిరంగంగానే ప్రయత్నించి భంగపడ్డారు. మరి అన్నాడీఎంకే ప్రయత్నాలు ఎంతమాత్రం ఫలిస్తాయో వేచిచూడాల్సిందే. -
నాకెవ్వరూ పోటీ కాదు: స్టాలిన్
చెన్నై: కేంద్రంలో బీజేపీని మళ్లీ గద్దెనెక్కకుండా చేయడం, రాష్ట్రంలో అన్నాడీఎంకేను ఓడించడమే తమ లక్ష్యమని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ గురువారం మీడియాకు తెలిపారు. టీటీవీ దినకరన్ ఆధ్వర్యంలో అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే) దక్షిణ చెన్నై సెక్రెటరీగా వ్యవహరిస్తున్న వీపీ కళైరాజన్ ఈ రోజు మధ్యాహ్నం డీఎంకేలో చేరారు. తిరుచ్చిలో జరిగిన ఒక సభలో కళైరాజన్‌ను పార్టీలోకి ఆహ్వానించిన స్టాలిన్ మాట్లాడుతూ బీజేపీ, అన్నాడీఎంకే ప్రభుత్వాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఏఎంఎంకేతోపాటు వివిధ పార్టీలకు చెందిన చాలామంది నాయకులు తమ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని.. బీజేపీ, అన్నాడీఎంకేలను ఎదుర్కోవడం తమతోనే సాధ్యమని మెజారిటీ ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. పార్టీలో చేరిన కళైరాజన్ మాట్లాడుతూ ‘తమిళనాడును కాపాడే సత్తా, ద్రవిడ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే తెగువ స్టాలిన్‌కే ఉన్నాయన్నారు. కళైరాజన్‌ను ఏఎంఎంకే నుంచి దినకరన్ బుధవారం బహిష్కరించారు. వీ సెంథిల్ తర్వాత ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన రెండో నేత కళైరాజన్. -
నీట్ రద్దు.. రాజీవ్ హంతకుల విడుదల!
చెన్నై: త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం తమిళనాడులో ప్రధాన పార్టీలైన అధికార అన్నాడీఎంకే, విపక్ష డీఎంకేలు మంగళవారం మేనిఫెస్టోలు విడుదల చేశాయి. రెండు వైరి పార్టీల మేనిఫెస్టోల్లోనూ పలు ఉమ్మడి అంశాలు ఉండటం ఆసక్తికరంగా మారింది. తాము అధికారంలోకి వస్తే ఎంబీబీఎస్ ప్రవేశపరీక్ష అయిన ‘నీట్’ను రద్దుచేసేందుకు కృషిచేస్తామని, అలాగే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో దోషులుగా శిక్ష అనుభవిస్తున్న ఏడుగురు తమిళులను విడుదల చేసేలా కేంద్రం, రాష్ట్రపతిపై ఒత్తిడి తెస్తామని ప్రకటించాయి. తమిళనాడులోని మొత్తం 39 సీట్లలో, పుదుచ్చేరిలోని ఒక లోకసభ స్థానానికి ఏప్రిల్ 18న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. అన్నాడీఎంకే హామీలు ►జాతీయ పేదరిక నిర్మూలన పథకం (ఏఎన్‌పీఈఐ) పేరును ‘అమ్మా జాతీయ పేదరిక నిర్మూలన పథకం (ఏఎన్‌పీఈఐ)’గా పేదలు, వితంతువులు తదితరులకు నెలకు రూ.1,500 ఆర్థిక సాయం అందిస్తాం ►మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులుగా ఉన్న ఏడుగురు తమిళులను విడుదల చేసేలా కేంద్రం, రాష్ట్రపతిపై ఒత్తిడి తెస్తాం ►జాతీయ స్థాయిలో వైద్య విద్య ప్రవేశాలకు ఉద్దేశించిన నీట్ (నేషనల్ ఎంట్రన్స్ కమ్ ఎలిజిబిలిటీ టెస్ట్) పరీక్ష రద్దు ►శ్రీలంకలో తమిళుల ఊచకోత అంశాన్ని ది హేగ్‌లోని ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకు తీసుకువెళ్లేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తాం ►నదుల అనుసంధానానికి సంబంధించి కేంద్రంపై ఒత్తిడి తెస్తాం ►విద్యార్థుల విద్యా రుణాల మాఫీతో పాటు చిన్న, సన్నకారు రైతుల పంట రుణాలను మాఫీ చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తాం ►జస్టిస్ సచార్ కమిటీ సిఫార్సుల అమలుకు కేంద్రంపై ఒత్తిడి ►దేశంలో తమిళాన్ని అధికారిక భాషల్లో ఒకటిగా గుర్తించేలా చేయడంతోపాటు కావేరీ డెల్టా ప్రాంతాన్ని ప్రొటెక్టడ్ అగ్రికల్చర్ జోన్‌గా ప్రకటించాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తాం ►పుదుచ్చేరికి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కల్పించేలా చేస్తాం ►మత్స్యకారుల సంక్షేమం కోసం జాతీయ కమిషన్ ఏర్పాటుచేసేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తాం డీఎంకే వరాలు ►రాష్ట్రంలో వైద్య విద్య ప్రవేశాలకు నీట్ పరీక్ష రద్దు ►పెద్ద నోట్ల రద్దు బాధితులకు నష్ట పరిహారం (తమిళనాడులో నోట్ల రద్దు సమయంలో బ్యాంకుల ముందు క్యూలో నిలబడి సుమారు 100 మంది ప్రాణాలు కోల్పోయారు) ►ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల అమలుకు చర్యలు ►విద్యార్థులు తీసుకున్న విద్యా రుణాల మాఫీ ►చిన్న, సన్నకారు రైతుల పంట రుణాల మాఫీ ►సబ్సిడీపై విత్తనాలు, ఎరువుల సరఫరా ►కంపెనీలకు కార్పొరేట్ పన్నును 21 శాతానికి తగ్గింపు ►మైనార్టీ, మహిళలకు ఉద్యోగాలిచ్చే కంపెనీలకు కార్పొరేట్ పన్నులో మరింత తగ్గింపు ►దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ల కోటాలోని ప్రయోజనాల కల్పన ►నీతి ఆయోగ్ రద్దు చేసి ప్రణాళిక సంఘాన్ని తీసుకురావడం ►రాజ్యాంగ సంస్థల స్వతంత్రను కాపాడటం ►మొత్తం పన్ను వసూల్లో 60 శాతం రాష్ట్రాలకు పంపిణీ చేసేలా చూడటం ►జీవిత బీమా, విద్యుత్ సరఫరాకు జీఎస్టీ మినహాయింపు ►వరికి రూ.2,500, చెరకుకి రూ.4,000 మద్దతు ధర కోసం పోరాడతాం ►ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ కోసం కృషి ►రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం పాత పింఛన్ విధానం అమలు ►గ్యాస్ సిలిండర్ల ధరల తగ్గింపు ►రాజీవ్ గాంధీ హత్య కేసు దోషుల విడుదల -
మూడో రోజూ సేమ్ సీన్
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షాల నిరసనలు కొనసాగుతున్నాయి. రఫేల్ విమానాల కొనుగోలు, రామ మందిరం నిర్మాణం, కావేరీ నది జలాల విషయంలో ఆందోళనలు చేశారు. గురువారం మూడో రోజు సమావేశాలు ప్రారంభం కాగానే.. 17 ఏళ్ల కింద పార్లమెంటులో జరిగిన ఉగ్ర దాడిలో మరణించిన వారికి రాజ్యసభ సభ్యులు నివాళులు అర్పించారు. ఆ వెంటనే కావేరీ జలాల సమస్యపై అన్నా డీఎంకే, డీఎంకే సభ్యులు ప్లకార్డులు పట్టుకుని, నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకొచ్చా రు. తమిళనాడు ప్రయోజనాలు కాపాడాలంటూ నినాదాలు చేశారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు సభ్యులను వారివారి స్థానాల్లోకి వెళ్లి కూర్చోవాలని ఎంత కోరినా వారు. వినిపించు కోలేదు. సభా కార్యకలాపాలను సజావుగా సాగని వ్వాలని విజ్ఞప్తి చేశారు. ‘పార్లమెంటును కాపాడేం దుకు 9 మంది ప్రాణత్యాగం చేశారు. ఇలా చేశారంటే మన వ్యవస్థ గురించి తప్పుడు సమాచారం వెళు తుంది’అని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. సభ్యులు ఎంతకూ వినకపోవడంతో తప్పని పరిస్థితు ల్లో శుక్రవారానికి చైర్మన్ రాజ్యసభను వాయిదా వేశారు. లోక్‌సభలోనూ ఇదే స్థితి.. లోక్‌సభ ప్రారంభం కాగానే 2001లో పార్లమెంటుపై జరిగిన ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి సభ్యులు నివాళులర్పించారు. ఆ వెంటనే ప్రశ్నోత్తరాలు ప్రారంభమయ్యాయి. ఈ సమయంలో ప్రతిపక్ష సభ్యులు పలు అంశాలపై ఆందోళనలు చేపట్టారు. ప్రశ్నోత్తరాలు జరుగుతున్న సమయంలో రెండుసార్లు సభను వాయిదావేశారు. కాంగ్రెస్, శివసేన, అన్నా డీఎంకే, డీఎంకే సభ్యులు ఆందోళనలను విరమించుకోకపోవడంతో జీరో అవర్ సమయంలో స్పీకర్ లోక్‌సభను శుక్రవారానికి వాయిదా వేసింది. రామమందిరాన్ని వెంటనే నిర్మించాలని శివసేన సభ్యులు ఆందోళన చేపట్టారు. ‘బీజేపీకి పూర్తి మెజారిటీ వచ్చింది. బీజేపీ, శివసేనల మధ్య పొత్తు కుదరడానికి ప్రధాన అంశమైన హిందూత్వాన్ని ఆ పార్టీ మరిచిపోయింది’ అని పార్టీ నేత అడ్సల్ అన్నారు. -
వెండితెరపై వీధి పోరాటాలు
తమిళనాడులో అన్నాడీఎంకే ప్రభుత్వం విజయ్ నుంచి రజనీకాంత్ దాకా ప్రజాదరణ పొందిన సినిమా స్టార్ల పని పట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు తమిళ సినిమాల్లో రాజకీయపరంగా చూపుతున్న వివాదాస్పద దృశ్యాల పట్ల ప్రభుత్వ వైఖరిని ఇది ప్రతిఫలిస్తోంది. మరొకవైపు జయలలిత జీవించి ఉండగా ఆమెను కన్నెత్తి చూడటానికి సాహసించని తమిళ చిత్ర పరిశ్రమ ఆమె లేనప్పుడు విమర్శలకు దిగడం గమనార్హం. విజయ్ తాజా సినిమా ‘సర్కార్’ లో ప్రజలు మిక్సర్లు, గ్రైండర్లు వంటి జయ ప్రభుత్వం అందించిన ఉచిత వస్తువులను నిప్పుల్లోకి విసిరేస్తున్నట్లు చిత్రించిన పాట పట్ల అన్నాడీఎంకే తీవ్ర ఆగ్రహం ప్రదర్శించింది. తమిళనాడులో ప్రస్తుతం జరుగుతున్నది నిజంగానే పరిహాసాస్పదంగా ఉంది. రాజకీయ రంగంలో ప్రతిభకు సంబంధించిన కన్వేయర్ బెల్ట్‌గా చిత్రపరిశ్రమను వ్యవహరిస్తున్న చరిత్ర ఈ రాష్ట్రానికి ఉంది. వెండితెరకు పరిచయమై తర్వాత రాజకీయ భవిష్యత్తును నిర్మించుకున్న ఇద్దరు నేతలు ఎంజీ రామచంద్రన్, జయలలితలతో అన్నాడీఎంకే బాగా లబ్ధి పొందింది. అంతకు ముందు డీఎంకే పార్టీ మాస్ మీడియా అయిన సినిమా దన్నుతో తన భావజాలాన్ని ప్రచారం చేసేది. కానీ ఈరోజు అన్నాడీఎంకే గడచిన దీపావళివారాన్ని చాలావరకు చెన్నై ఆకాశంలో రాజకీయ పటాసులను పేల్చడంలోనే గడిపేసింది. తమిళ చిత్ర పరిశ్రమలో ముగ్గురు మేటి హీరోలు విజయ్, రజనీకాంత్, కమల్ హాసన్‌లకు వ్యతిరేకంగా తుపాకులు గురిపెట్టాలని ఈ పార్టీ నిశ్చయించింది. రజనీ, కమల్ రాజకీయాల్లో ప్రవేశించనున్నట్లు ప్రకటించారు. ఇక రాజకీయాలపై విజయ్ ఆసక్తి అందరికీ తెలిసిందే. తమిళనాడులో విజయ్ నటించిన చిత్రం ‘సర్కార్’తో అన్నాడీఎంకే సర్కారుకు సమస్యలు మొదలయ్యాయి. ఊహించినట్లుగానే ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ ఓపెనింగ్స్సాధించింది. అయితే, ‘సర్కార్’ సినిమా తమ పార్టీ పరువుకు నష్టం కలిగించేందుకు పన్నిన కుట్ర అంటూ అన్నాడీఎంకే నిందించింది. విజయ్, ఈ చిత్ర నిర్మాతలను ఉగ్రవాదులుగా చిత్రించడమే కాకుండా రాజద్రోహ ఆరోపణలు చేస్తూ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇద్దరు మంత్రులు హెచ్చరించారు. విజయ్ వంటి వృద్ధిలోకి వస్తున్న నటుడికి ఇది మంచిది కాదు అని రాష్ట్ర సమాచార మంత్రి కె. రాజు అభిప్రాయపడ్డారు. ఇక న్యాయశాఖ మంత్రి సీవీ షణ్ముగం ఆరోగ్యకరమైన విమర్శకు ఆహ్వానం పలుకుతూనే, సినిమా హింసను ప్రేరేపించిందని, ఇది తీవ్ర నేరమని వ్యాఖ్యానించారు. ప్రజలు తమకు ఓటు వేసేలా ఆకర్షించడానికి వస్తువులను ఉచితంగా బహూకరిస్తామని వాగ్దానం చేయడం తమిళనాడు ఎన్నికల సంస్కృతిలో భాగం. అన్నాడీఎంకే దివంగత నాయకురాలు జయలలిత 2011 తమిళనాడు ఎన్నికల్లో ఈ వస్తువులను ఇస్తామని వాగ్దానం చేశారు. ప్రజలు ఇలాంటి ఉచిత వస్తువులను తిరస్కరిస్తున్నట్లు చూపటం ద్వారా సర్కార్ చిత్రం అన్నాడీఎంకే పార్టీని వేలెత్తి చూపుతోందని ఆ పార్టీ అర్థం చేసుకుంది. అంతటితో కథ ముగియలేదు. ఆ సినిమాలో విలన్ పాత్ర పోషించిన వరలక్ష్మి పేరు కోమలవల్లి. ఇది జయలలిత అసలు పేరు. తమ నాయకురాలి స్మృతిని అవమానించడానికి ఉద్దేశపూర్వకంగా ఆ పేరును పెట్టారని అన్నాడీఎంకే భావిస్తోంది. పైగా సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించడం రాజకీయ కుట్ర దాగి ఉన్నట్లు అన్నాడీఎంకే పసిగట్టింది. ఈ చిత్ర సమర్పకుడు కళానిధి మారన్ డిఎంకే దివంగత నాయకుడు ఎం.కరుణానిధి మునిమనవడు. కళానిధి సోదరుడు దయానిధి మారన్ డీఎంకే ఎంపీగా, యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర టెలికాం మంత్రిగా పనిచేశారు. పైగా తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకేలు రాజకీయపరంగా బద్ధశత్రువులు కూడా. అన్నాడీఎంకే కార్యకర్తలు మదురైలో సర్కార్ సినిమా ప్రదర్శనను అడ్డుకోవడమే కాకుండా సినిమా హాళ్లపై దాడి చేయడంతో పరిణామాలు మరింత వేడెక్కాయి. ఈ సినిమాపై 110 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినందున ఆర్థిక నష్టాన్ని పసిగట్టిన సర్కార్ చిత్ర నిర్మాతలు సినిమాలో కోమలవల్లి పేరును వల్లించిన దృశ్యాలను మ్యూట్ చేయడంతోపాటు ఉచిత పథకాలపై విమర్శ దృశ్యాలను సినిమాలోంచి తొలగించాలని నిర్ణయించారు కూడా.సర్కార్ సినిమాపై తమ వైఖరిని మరింత స్పష్టంగా వ్యక్తపరచిన ఆ రాష్ట్ర రెవెన్యూమంత్రి ఆర్బి ఉదయకుమార్ తమిళ సినిమాలకు విధివిధానాలను కూడా నిర్దేశించేంత పనిచేశారు. సెన్సార్ బోర్డును మించి మాట్లాడుతూ, రాజకీయ ఉద్దేశాలతో కూడిన వివాదాస్పద దృశ్యాలను సినిమాలు వదిలేయాలని ఉదయకుమార్ పేర్కొన్నారు. అమ్మ జయలలిత ప్రభుత్వ సంక్షేమ పథకాలను విమర్శించే హక్కు ఎవరికీ లేదని ప్రకటించారు. 2017 దీపావళినాడు విడుదలైన విజయ్ సినిమా మెర్సల్ (తెలుగులో ‘అదిరింది’) సైతం ఇలాంటి చిక్కులను ఎదుర్కొంది. జీఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్)ని నేరుగా విమర్శిస్తూ ఆ సినిమాలో పొందుపర్చిన ఒక సంభాషణ పట్ల తమిళనాడు బీజేపీ యూనిట్ అభ్యంతరం తెలిపింది. సినిమాలోంచి ఆ డైలాగ్‌ను తీసివేయాలని కోరుతూ బీజేపీ విజయ్‌కి వ్యతిరేకంగా ప్రచారం చేసింది కూడా. కానీ ఆ చిత్రంపై వచ్చిన వ్యతిరేకత మరింత ఆసక్తిని రేపి, మెర్సల్ని బాక్సాఫీసు వద్ద మరింత హిట్ చేసింది. నిజానికి మెర్సల్‌ను వ్యతిరేకించాలని బీజేపీ తీసుకున్న నిర్ణయం బెడిసికొట్టింది. ఒకసారి సెన్సార్ బోర్డు సినిమాకు సర్టిఫికెట్ ఇచ్చాక, అన్నాడీఎంకే ప్రభుత్వంతో సహా మరెవరికీ సినిమాను అడ్డుకునే అధికారం లేదని సర్కార్ సినిమాను సమర్థిస్తున్న వారు వాదిస్తున్నారు. ప్రభుత్వ బలాన్ని, కండబలాన్ని ఉపయోగించి తమ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై దాడిచేస్తున్నట్లుగా వీరు భావిస్తున్నారు. అయితే చిత్ర నిర్మాతలను తమ చెప్పుచేతల్లో ఉంచుకోవాలనుకోవడం సర్కార్ సినిమాతోనే మొదలు కాలేదు. 2013లో కమల్ హాసన్ సైతం ముస్లిం బృందాలు వ్యతిరేకత తెలపడంతో తన విశ్వరూపం సినిమాలో కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది. అధికారంలో ఉన్నవారి ప్రోత్సాహంతోటే అలాంటి నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయని ఈ ప్రముఖ నటుడు, నిర్మాత పదేపదే చెబుతూ వచ్చారు. అదే సంవత్సరం విజయ్ తీసిన తలైవా (నాయకుడు) ‘నాయకత్వం వహించాల్సిన సమయం’ అంటూ ట్యాగ్ లైన్‌తో వచ్చింది. ఇది అన్నాడీఎంకే నాయకత్వాన్ని కలవరపర్చింది. చిత్ర ప్రచార కార్యక్రమాల నుంచి ఆ ట్యాగ్ లైన్‌ను పూర్తిగా తొలగించాక రెండు వారాలు ఆలస్యంగా ఆ సినిమా విడుదలకు నోచుకుంది. ‘నోటా’, ‘తమిళ్‌పడమ్2’ అనే రెండు సినిమాలు కూడా అన్నాడీఎంకే పాలనను తీవ్రంగా విమర్శించాయి. కానీ పాలక పార్టీ వాటిపై ఎలాంటి వ్యతిరేకతనూ ప్రదర్శించలేదు. నిజానికి తమిళ్‌పడమ్2 సినిమా దర్శకుడు సీఎస్ అముదం గత శుక్రవారం వ్యంగ్యంగా ట్వీట్ చేస్తూ, సర్కార్ చిత్రాన్ని ప్రమోట్ చేయడంలో అన్నాడీఎంకే సాయపడుతోందన్నారు. ‘అలాంటి ప్రచారాన్ని మా సినిమాకు దక్కనివ్వలేదు, మేం సినిమాను ఉత్తమంగా తీయడానికి ప్రయత్నించాం. ఇది పూర్తిగా పాక్షిక వైఖరే‘ అనేశారు. విజయ్‌ని అన్నాడీఎంకే ప్రభుత్వం లక్ష్యంగా చేసుకోవడానికి కారణం ఉంది. విజయ్‌కి యూత్‌లో, ఫ్యామిలీ ఆడియన్స్‌లో భారీ ఫాలోయింగ్ ఉంది. తన సినిమాలో ప్రదర్శించిన అన్నాడీఎంకే వ్యతిరేక సందేశం ఆ పార్టీపై తీవ్ర ప్రభావం చూపగలదు. తమ దివంగత నాయకురాలు ప్రోత్సహించిన సంక్షేమపథకాలపై విమర్శను చూసీ చూడనట్లు వదిలివేసిన పక్షంలో తమ పార్టీని హేళన చేయడానికి కోలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థలు వరుసకట్టే ప్రమాదం ఉందని అన్నాడీఎంకే వాదిస్తోంది. అయితే మరింత వ్యూహాత్మకంగా పావులు కదిపిన అన్నాడీఎంకే పార్టీ విషయాన్ని అంతటితో ఆపివేయలేదు. ఇద్దరు తమిళ దిగ్గజ నటులు రజనీకాంత్, కమల్ హాసన్‌ల పని పట్టాలని కూడా నిశ్చయించుకుంది. సెన్సార్ బోర్డ్ ఆమోదం తెలిపిన సినిమాను దెబ్బతీయడానికి ప్రయత్నించిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ఈ ఇద్దరు నటులూ విమర్శలు గుప్పించారు. అన్నాడీఎంకే పత్రిక ‘నమదు అమ్మ’ (మన అమ్మ) రజనీకాంత్‌ని విమర్శిస్తూ, ప్రభుత్వం ఆమోదించిన ఆహారంలో బల్లి కనపడితే రజనీకాంత్ దాన్ని ఆరగించగలరా అని ఎద్దేవా చేసింది. ఈ వ్యంగ్య విమర్శను అర్థం చేసుకోవడానికి పెద్దగా కష్టపడనవసరం లేదు. అన్నాడీఎంకే రజనీకాంత్‌పై గురిపెట్టడం వాస్తవమే. ఎందుకంటే బీజేపీతో రజనీకాంత్ బంధం రహస్యమైన విషయం కాదు. దానికి రాజకీయ ప్రాధాన్యత ఉంది కూడా. రజనీకాంత్ వెంటనే తనపై విమర్శను తిప్పికొట్టడమే కాకుండా, అన్నాడీఎంకేకి బలమైన సందేశం పంపారు. నరేంద్రమోదీని దేశంలోనే అత్యంత శక్తిమంతుడైన నాయకుడిగా రజనీ ఇప్పుడు ప్రశంసిస్తున్నారు. ఇక కమల్ హాసన్‌ను తమిళనాడు ముఖ్యమంత్రి ఇ. పళనిస్వామి ఎద్దేవా చేశారు. విశ్వరూపం తొలి భాగం సినిమాకు సమస్యలు ఎదురు కానున్నట్లు సూచన వచ్చినంతనే దేశం వదిలి వెళ్లిపోవడానికి సంసిద్ధత ప్రదర్శించిన కమల్‌ను సీఎం పరిహసించారు. అన్నాడీఎంకే అనుసరిస్తున్న ఈ వ్యూహాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? లోక్‌సభ ఎన్నికలు, రాష్ట్రంలో 20 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు సమీపిస్తుండటంతో తమిళ చిత్రపరిశ్రమలో గ్లామర్ ఉన్న నటులను ఓ పట్టు పట్టాలని పాలకపార్టీ ప్రయత్నిస్తోంది. అమ్మ ప్రభుత్వంగా తనకు తాను చెప్పుకుంటున్న ప్రస్తుత నాయకత్వం తేలిపోతున్నట్లు ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారని అన్నాడీఎంకే అనుమానిస్తోంది. జయలలిత నిజమైన వారసురాలిగా అన్నాడీఎంకే నిలబడుతుందా లేదా అనే విషయాన్ని మనం 2019లో చూడబోతున్నాం. ఈలోగా విజయ్ సినిమా సర్కార్‌కి ఇది ప్రభుత్వ స్పందన అయినట్లయితే, అవినీతిపై యుద్ధం ప్రకటించిన కమల్ హాసన్ భారతీయుడు 2 సినిమాపట్ల ప్రభుత్వ వైఖరి మరీ ఘోరంగా ఉండతోతుందని కోలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు. స్పష్టంగానే, పాలక అన్నాడీఎంకేకి, సినీ రాజకీయనేతల నడుమ ఘర్షణ సమీప భవిష్యత్తులో ముగిసిపోయేలా కనిపించటం లేదు. టీఎస్ సుధీర్ వ్యాసకర్త, సీనియర్ జర్నలిస్టు -
న్యాయమూర్తికే అన్యాయమా ?
అన్నాడీఎంకేలో వర్గ రాజకీయాలు హద్దులు దాటాయి. సాక్షాత్తున్యాయమూర్తి కుటుంబాన్నే హతమారుస్తామని బెదిరించే స్థాయికి తెగించాయి.గౌరవప్రదమైన బాధ్యతల్లో ఉన్న న్యాయమూర్తినే భయభ్రాంతులకు గురిచేశాయి. సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత కన్నుమూసిన తరువాత దినకరన్, ఎడపాడి, పన్నీర్‌సెల్వం రూపంలో పార్టీ మూడు చెక్కలైంది. ఎడపాడి, పన్నీర్ యుగళగీతం ఆలపించి ఏకంకాగా రెండు వర్గాలుగా మిగిలిపోయింది. శశికళ దయాదాక్షిణ్యాలతో సీఎం పదవిని చేపట్టిన ఎడపాడి, శశికళపై తిరుగుబాటు చేసి పన్నీర్‌సెల్వం ఏకమైన తనను ఒంటరివాడిని చే యడమేగాక పార్టీ నుంచి బహిష్కరించడాన్ని దినకరన్ జీర్ణించుకోలేకపోయారు. ప్రభుత్వాన్ని కూలదోయడం ద్వారా కక్ష తీర్చుకోవాలని నిర్ణయించుకున్న దినకరన్ తనకు మద్దతిచ్చే 19 మంది ఎమ్మెల్యేల చేత ప్రభుత్వానికి ఉపసంహరించుకున్నట్లుగా గవర్నర్‌కు ఉత్తరం ఇప్పించారు. అయితే ఇంతలో వీరిలో ఒక ఎమ్మెల్యే ఎడపాడి వైపునకు మొ గ్గారు. అధికార పార్టీలో ఉంటూ ప్రభుత్వాన్ని కూ లదోసే కుట్ర పన్నారనే ఆరోపణలపై మిగతా 18 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ ధనపాల్ అనర్హతవేటు వేశారు. స్పీకర్ నిర్ణయాన్ని 18 మంది ఎమ్మెల్యేలు మద్రాసు హైకోర్టులో సవాలు చేశారు. ఈ పిటిషన్ ఫుల్ బెంచ్‌కు విచారణకు రాగా ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జి వేటు చెల్లుతుందని తీర్పు చెప్పగా, స్పీకర్ తీసుకున్న వేటు నిర్ణయం చెల్లదని న్యాయమూర్తి సుందర్ తీర్పు వెల్లడించారు. దీంతో అనర్హత వేటు అంశం మూడో న్యాయమూర్తి ముంగిటకు వెళ్లింది. న్యాయమూర్తికి బెదిరింపులు ఈ నేపథ్యంలో అనర్హతవేటు పడిన 18 అన్నాడీఎంకే ఎమ్మెల్యేల కేసులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు చెబుతారా అంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తూ మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి సుందర్‌కు ఒక ఆకాశరామన్న ఉత్తరం అందింది. చెన్నై గ్రీన్‌వేస్ రోడ్డులోని ముఖ్యమంత్రి, ఇతర మంత్రుల క్వార్టర్స్ సమీపంలో సుందర్ తన భార్య, కుమార్తెతో నివసిస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఆదివారంఅందిన ఉత్తరంలో ‘18 మంది ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ ఉత్తర్వులు చెల్లవని తీర్పు చెప్పిన నిన్ను, నీ కుటుంబ సభ్యులను హతమారుస్తాం’ అని పేర్కొని ఉంది. వెంటనే ఆయన ఈ విషయాన్ని ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జి దృష్టికి తీసుకెళ్లగా ఆమె పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి నిందితుని గాలింపు చర్యలు ప్రారంభించారు. న్యాయమూర్తి సుందర్ ఇంటికి 24 గంటలపాటు బందోబస్తుకు సాయుధ పోలీసులను నియమించారు. న్యాయమూర్తి రాకపోకలు సాగించే దారుల్లోనూ బందోబస్తు పెట్టారు. -
టీవీ చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటే పదవుల తొలగింపు
టీ.నగర్: అన్నాడీఎంకే అధికారపూర్వక వక్తలు మినహా ఇతర కార్యకర్తలు టీవీ చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని అన్నాడీఎంకే అధిష్టానం హెచ్చరించింది. ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి ఓ. పన్నీర్‌సెల్వం అంగీకారంతో అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో ఈ విధంగా పేర్కొన్నారు. టీవీలలో జరిగే చర్చా కార్యక్రమాల్లో అధికారపూర్వక వక్తలు, ప్రతినిధులు మాత్రమే పాల్గొనాలని ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను వార్తపత్రికలు, రేడియో, టీవీలకు పంపినట్లు తెలిపారు. అందువల్ల ప్రచారమాధ్యమాలు అన్నాడీఎంకే అధికార ప్రతినిధులను మాత్రమే చర్చా కార్యక్రమాలకు ఆహ్వానించాలని కోరుతున్నట్లు తెలిపారు. ఒకే రోజులో పదవుల తొలగింపు: పుదుక్కోట్టైలో సంచలనం పుదుక్కోట్టైలో ఓపీఎస్ మద్దతుదారులకు పార్టీలో పదవులు ఇచ్చిన మరుసటి రోజే వారి పదవుల నుంచి తొలగించారు. పుదుచ్చేరి మున్సిపల్ అధ్యక్షుడిగా ఉన్న కార్తిక్ తొండైమాన్ పుదుక్కోట్టై అసెంబ్లీ నియోజకవర్గంలో 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే తరఫున పోటీ చేసి గెలుపొందారు. ఖాళీగా ఉన్న మున్సిపల్ అధ్యక్ష పదవికి అన్నాడీఎంకే ఇలంజర్, ఇలంపెన్‌గల్ పాసరై జిల్లా కార్యదర్శిగా ఉన్న రాజశేఖరన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అన్నాడీఎంకేలో చీలిక ఏర్పడగా కార్తిక్ తొండైమాన్, రాజశేఖర్ ఓపీఎస్ వర్గంలో ఉన్నారు. దీంతో వీరి వద్ద ఉన్న పదవులను లాక్కున్నారు. అన్నాడీఎంకేలో పదవులను ఇవ్వాలని కార్తిక్ తొండైమాన్, రాజశేఖరన్ పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెస్తూ వచ్చారు. దీంతో కార్తిక్ తొండైమాన్‌కు ఎంజీఆర్ ఇలంజర్ జిల్లా అధ్యక్ష పదవి, రాజశేఖరన్‌కు ఎంజీఆర్ ఇలంజర్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పదవిని గత ఐదో తేదీన అప్పగించారు. దీంతో వారి మద్దతుదారులు హర్షం వ్యక్తం చేశారు. అయితే రాజశేఖర్ పదవిని మరుసటి రోజే లాక్కోవడంతో మద్దతుదారులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. -
నా కొద్దు పెంపు జీతం
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే అమ్మ నినాదం కోసం ఆర్కేనగర్ ఎమ్మెల్యే దినకరన్ ప్రయత్నాలు చేపట్టారు. బుధవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆర్కేనగర్లో ఎన్నికల ఖర్చులు, లెక్కలు తేలని దృష్ట్యా, దినకరన్‌పై అనర్హత వేటు పడేనా అన్న చర్చ ఏర్పడింది. అన్నాడీఎంకే, రెండాకుల చిహ్నం తమకు దూరం కావడంతో ఒక వేదిక కోసం దినకరన్ తీవ్రంగానే కుస్తీలు పడుతున్నారు. కొత్త పార్టీ ప్రకటనకు సిద్ధపడ్డా, చివరి క్షణంలో మనసు మార్చుకున్నారు. ఇందుకు కారణం తనకు మద్దతుగా ఉన్న 18 మంది ఎమ్మెల్యేల అనర్హత వేటుకు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ విచారణలో ఉండడమే. ఈ సమయంలో పార్టీ ప్రకటించిన పక్షంలో వారి పదవులకు సంక్లిష్ట పరిస్థితులు తప్పవన్న విషయాన్ని పరిగణించారు. ఆ ప్రయత్నాన్ని మానుకుని ప్రస్తుతం ఉన్న అన్నాడీఎంకే అమ్మ శిబిరం నినాదాన్ని కొనసాగించేందుకు సిద్ధం అయ్యారు. అయితే, వేదిక ఏర్పాటులో జాప్యంతో తన పక్షాన ఉన్న వాళ్లు మళ్లీ సొంతగూటి వైపుగా తొంగి చూస్తుండడంతో దినకరన్ అప్రమత్తం అయ్యారు. అమ్మ నినాదాన్ని సొంతం చేసుకునేందుకు తగ్గ అనుమతుల కోసం ప్రయత్నాలు చేపట్టారు. ఓ వైపు ఎన్నికల యంత్రాంగాన్ని ఆశ్రయిస్తూ, మరో వైపు కోర్టు ద్వారా అనుమతి పొందేందుకు సిద్ధం అయ్యారు. హైకోర్టులో పిటిషన్: దినకరన్ తరఫున అన్నాడీఎంకే అమ్మ శిబిరం నినాదాన్ని సొంతం చేసుకునే విధంగా ఢిల్లీ హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలైంది. అన్నాడీఎంకే, రెండాకుల చిహ్నం వ్యవహారంలో ఎన్నికల యంత్రాంగం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టును ఆశ్రయించినట్టు గుర్తు చేశారు. ఈ పిటిషన్ విచారణలో ఉన్న దృష్ట్యా, తాము అన్నాడీఎంకే అమ్మ శిబిరంగా ముందుకు సాగేందుకు నిర్ణయించినట్టు వివరించారు. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్నాయని, ఈ ఎన్నికల్లో తమ శిబిరం అన్నాడీఎంకే అమ్మ పేరుతో ముందుకు సాగేందుకు నిర్ణయించి ఉన్నామని, తమకు ఎన్నికల యంత్రాంగం ఒకే చిహ్నం కేటాయించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలాగే, అన్నాడీఎంకే అమ్మ పేరును రిజిస్టర్ చేయాలని కోరుతూ ఎన్నికల యంత్రాంగానికి లేఖను దినకరన్ తరఫున ప్రతినిధులు సమర్పించారు. వేటు పడేనా.. : దినకరన్ ఎమ్మెల్యే పదవికి వేటు పడేనా అన్న చర్చ తెర మీదకు వచ్చింది. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో నోట్ల కట్టలు తాండవం చేసినట్టుగా ఆరోపణలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఎన్నికల్లో ఆయా అభ్యర్థులు పెట్టిన ఖర్చుల వివరాల మీద లెక్కల్ని తేల్చేందుకు ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక పర్యవేక్షణ బృందం రంగంలోకి దిగింది. అయితే, ఆయన సమర్పించిన లెక్కల వివరాలు తేలనట్టు సంకేతాలు వెలువడ్డాయి. అధికారుల పరిశీలనలో సాగిన లెక్కలు, దినకరన్ సమర్పించిన లెక్కల్లో తేడాలు ఉండడంతో ఆయన ఎమ్మెల్యేగా కొనసాగేనా అన్న ఉత్కంఠ తప్పడం లేదు. డీఎంకే, బీజేపీ అభ్యర్థుల లెక్కలు తేలగా, అన్నాడీఎంకే అభ్యర్థి మదుసూదనన్ ఖర్చుల లెక్కలు కూడా తేలకపోవడంతో సమగ్ర నివేదికను కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సమర్పించేందుకు ఆ బృందం సమాయత్తం అవుతోంది. నా కొద్దు పెంపు జీతం: తన ఎమ్మెల్యే పదవికి ప్రభుత్వం అందించనున్న జీతం పెంపును దినకరన్ తిరస్కరించారు. ఈ మేరకు ఆయన అసెంబ్లీ స్పీకర్‌కు బుధవారం లేఖ రాశారు. ఎమ్మెల్యేలకు జీతాలను పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని తాను ఏకీభవించడం లేదని, ఈ దృష్ట్యా, తనకు పెంపు వద్దే వద్దు అని అందులో వివరించారు. తనకు పాత జీతాన్ని ఇస్తే చాలని పేర్కొన్నారు. -
‘రెండాకుల’ లక్ష్యం
♦ మళ్లీ ఢిల్లీకి అన్నాడీఎంకే రాజకీయం ♦ చిహ్నం కైవసానికి కసరత్తు ♦ మంత్రులు, ఎంపీల బృందం తిష్ట ♦ ఈసీతో భేటీకి కుస్తీ ♦ కేంద్ర మంత్రులతో మంతనాలు ♦ మేల్కొన్న దినకరన్ శిబిరం ♦ తమను సంప్రదించాలని ముందుస్తుగా లేఖ ♦ కోర్టుకు సర్వ సభ్య సమావేశం వ్యవహారం రెండాకుల చిహ్నం కైవసం లక్ష్యంగా అన్నాడీఎంకే రాజకీయం మంగళవారం ఢిల్లీకి చేరింది. ఓపీఎస్–ఈపీఎస్ నేతృత్వంలో ఎన్నికల కమిషన్ వద్ద సమర్పించి ఉన్న ఫిర్యాదుల్ని వెనక్కు తీసుకునే ప్రయత్నాలు వేగవంతం అయ్యాయి. ఇందుకోసం మంత్రులు, ఎంపీల బృందం దేశ రాజధానిలో తిష్ట వేసింది. న్యాయనిపుణులతో ఓ వైపు, కేంద్ర మంత్రులతో మరో వైపు ఈ బృందం చర్చల్లో మునిగి ఉంది. ఇక, చిహ్నం కైవసం లక్ష్యంగా ఓపీఎస్–ఈపీఎస్ ప్రయత్నాలకు అడ్డుకట్ట వేస్తూదినకరన్ మేల్కొన్నారు. తమను సంప్రదించకుండా, ఎలాంటి నిర్ణయం తీసుకునేందుకు వీలు లేదని ముందుగానే ఈసీని ఆశ్రయించారు. సాక్షి, చెన్నై : అన్నాడీఎంకేలో ఈపీఎస్(సీఎం పళని), ఓ పీఎస్(డిప్యూటీ సీఎం) విలీన పర్వం ముగిసినా, ఉప ప్రధాన కార్యదర్శిగా చెప్పుకుంటున్న దినకరన్ రూపంలో వివాదం రాజుకుంటోంది. దినకరన్ దూకుడు ఈపీఎస్, ఓపీఎస్‌లకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. పుదుచ్చేరిలో తిష్టవేసిన దినకరన్ మద్దతు ఎమ్మెల్యేలు రోజుకో హెచ్చరికలు, బెదిరింపులతో ఈపీఎస్‌కు షాక్ ఇచ్చే విధంగా దూసుకెళ్తున్నారు. మంగళవారం మీడియాతో దినకరన్ మద్దతు ఎమ్మెల్యే తంగతమిళ్ సెల్వన్, వెట్రివేల్ మాట్లాడుతూ, అందరి బండారాలు బయటపెట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. తమను కట్టడి చేయడం ఎవరితరం కాదు అని, చిన్నమ్మకు వ్యతిరేకంగా వ్యవహరించడం మానుకుంటే మందని హితవు పలికారు. ఎన్నికల కమిషన్ నుంచి ప్రమాణ పత్రాన్ని వెనక్కు తీసుకుంటే, కోర్టుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇక, బల పరీక్ష విషయంలో గవర్నర్ స్పందించని దృష్ట్యా, పుదుచ్చేరిలో ఉన్న దినకరన్ మద్దతు ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్లి, రాష్ట్రపతిని కలిసేందుకు తగ్గ ప్రయత్నాల్లో పడ్డారు. దినకరన్ శిబిరం నుంచి బెదిరింపుల పర్వం పెరగడంతో, చిన్నమ్మకు చెక్ పెట్టే కార్యాచరణను ఈపీఎస్, ఓపీఎస్ వేగవంతం చేశారు. రెండాకుల చిహ్నం కైవసం చేసుకున్న పక్షంలో దినకరన్ మెడలు వంచినట్టే అని నిర్ధారణకు వచ్చి అందుకు తగ్గ ప్రయత్నాల్ని వేగవంతం చేశారు. చిహ్నం దక్కించుకోవడమే లక్ష్యం ఈపీఎస్, ఓపీఎస్ వేర్వేరుగా ఉన్న సమయంలో సమర్పించిన ఫిర్యాదుల మేరకు ఎన్నికల కమిషన్ వద్ద రెండు కేసులు విచారణలో ఉన్నాయి. అందులో ఒకటి రెండాకుల చిహ్నం, మరొకటి ప్రధాన కార్యదర్శి నియామకం వ్యవహారం. ఇందులో రెండాకుల చిహ్నం దక్కించుకున్న పక్షంలో, పార్టీ సర్వ సభ్య సమావేశం ఆధారంగా ప్రధాన కార్యదర్శి ఎవరన్నది తేల్చవచ్చునన్న ప్రస్తుతం ఆ ఇద్దరు నేతలు నిర్ణయానికి వచ్చారు. దీంతో ఎన్నికల కమిషన్ వద్ద సమర్పించిన ప్రమాణ పత్రాలు, ఫిర్యాదుల్ని వెనక్కు తీసుకునేందుకు ఢిల్లీ బాట పట్టారు. పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురై సారథ్యంలో మంత్రులు జయకుమార్, తంగమణి, సీవీ షణ్ముగం, ఎంపీ మైత్రేయన్, మాజీ ఎంపీ మనోజ్ పాండియన్ ఉదయం నుంచి ఢిల్లీలో బిజీ అయ్యారు. న్యాయ నిపుణులతో ఉదయం నుంచి చర్చ సాగింది. తదుపరి కేంద్ర సహాయ మంత్రి నిర్మల సీతారామన్‌తో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. సాయంత్రం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ సాగింది. ఈ భేటీల గురించి తంబిదురై మీడియాతో మాట్లాడుతూ, మర్యాద పూర్వకమేనని సమాధానం ఇచ్చారు. అయితే, నిర్మల సీతారామన్ దర్శకత్వంలోనే రెండాకుల చిహ్నం కైవసం వ్యవహారంలో న్యాయపరంగా చర్చలు సాగుతున్నట్టు ప్రచారం సాగుతోంది. అయితే, కేంద్ర ఎన్నికల కమిషన్‌ను తొలిరోజు ఈ బృందం కలవలేదు. ‘సర్వ సభ్యం’ సభ్యుల గురి అన్నాడీఎంకేలో ప్రధాన కార్యదర్శికి మద్దతుగా సభ్యుల్ని సమీకరించే పనిలో చిన్నమ్మ శశికళ కుటుంబం రంగంలోకి దిగడం గమనార్హం. ఓవైపు దినకరన్, మరో వైపు చిన్నమ్మ సోదరుడు దివాకరన్ ఎమ్మెల్యేలను లాగేందుకు ప్రయత్నాల్లో ఉంటే, ఇతర కుటుంబ సభ్యులు సర్వ సభ్య సమావేశ సభ్యుల్ని తమవైపునకు తిప్పుకునే ప్రయత్నాలను వేగవంతం చేసినట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. ఈ పరిస్థితుల్లో ఇన్నాళ్లు దినకరన్‌కు వెన్నంటి ఉన్న మాజీ మంత్రి దళవాయి సుందరం ఈపీఎస్‌తో భేటీకి నిర్ణయించడం ఆ శిబిరంలో కలవరాన్ని రేపుతోంది. అదే సమయంలో దినకరన్‌కు మున్ముందు ముచ్చెమటలు పట్టిస్తామని నగరాభివృద్ధి శాఖ మంత్రి ఎస్పీ వేలుమణి స్పందిస్తే, చిన్నమ్మ శశికళను ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించబోమని మరో మంత్రి వెల్లమండి నటరాజన్ స్పందించడం ఆలోచించ దగ్గ విషయం. మేల్కొన్న దినకరన్ ఈపీఎస్–ఓపీఎస్ బృందం ఢిల్లీకి చేరడంతో ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ మేల్కొన్నారు. ఆగమేఘాలపై పార్టీ కర్ణాటక విభాగం నేత పుహలేందిని ఢిల్లీకి పంపించారు. ఓపీఎస్, ఈపీఎస్‌ల విలీన వ్యవహారాలను ప్రస్తావిస్తూనే, అన్నాడీఎంకే వ్యవహారాల్లో తన ప్రమేయం ఉందని, చిన్నమ్మ శశికళ, తన పేరిట ఇప్పటికే ఈసీకి అనేక వినతిపత్రాలు, ప్రమాణ పత్రాలు సమర్పించారని వివరిస్తూ ఓ లేఖను పుహలేంది ఎన్నికల కమిషన్‌కు సమర్పించారు. దినకరన్‌ను సంప్రదించకుండా, రెండాకుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకునేందుకు వీలు లేదని సూచించారు. ప్రమాణ పత్రాలను వెనక్కు తీసుకునే విధంగా ఏదేని ప్రయత్నాలు సాగినా, అందుకు తగ్గ వివరణ దినకరన్ నుంచి తీసుకోవాల్సి ఉందని, చర్చించకుండా, ఎలాంటి ఆమోదాలు తెలిపేందుకు వీలు లేదని అందులో స్పష్టంచేశారు. కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి విదేశాలకు వెళ్లడంతో, ఆయన రాకకోసం ఓపీఎస్–ఈపీఎస్ ఎదురు చూడాల్సిన పరిస్థితి. కోర్టుకు ‘సర్వ సభ్యం’ అన్నాడీఎంకే సర్వ సభ్యసమావేశం వ్యవహారం కోర్టుకు చేరింది. ఆదిత్యన్ రాంకుమార్ అనే వ్యక్తి మంగళవారం మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనంలో పిటిషన్ వేశారు. అన్నాడీఎంకేలో సాగుతున్న పరిణామాలను గుర్తుచేస్తూ, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని ఆ పిటిషన్లో వివరించారు. ప్రస్తుతం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎవరన్న వివాదం బయలుదేరి ఉందని, ఇందుకోసం సర్వసభ్య సమావేశం జరగబోతోందని వివరించారు. ఈ సమావేశాన్ని రిటైర్డ్ న్యాయమూర్తి సమక్షంలో జరిపేలా కోర్టు నిర్ణయం తీసుకుంటే, శాంతిభద్రతలకు విఘాతం కల్గకుండా ఉంటుందని పేర్కొన్నారు. అన్నాడీఎంకేలో ఉన్న శిబిరాలను ఒక చోట చేర్చి, రిటైర్డ్ న్యాయమూర్తి సమక్షంలో ప్రధాన కార్యదర్శి ఎన్నిక జరిగే విధంగా> ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు శశిథరన్, స్వామినాథన్ నేతృత్వంలోని బెంచ్ పరిశీలించింది. ఈ పిటిషన్ విచారణకు స్వీకరిస్తూ సంబంధిత శిబిరాలను ప్రతి వాదులుగా చేర్చాలని ఆదేశిస్తూ తదుపరి పిటిషన్ వాయిదా వేశారు. -
కథ క్లైమాక్స్‌కు
♦ చిన్నమ్మను సాగనంపేందుకు 12న ముహూర్తం ♦ అన్నాడీఎంకే పార్టీ సమావేశంలో కీలక నిర్ణయం ♦ న్యాయనిపుణులతో దినకరన్ అన్నాడీఎంకే కథ క్లయిమాక్స్‌కు చేరుకుంది. పార్టీకి తలవంపులు, తలనొప్పులుగా మారిన శశికళ, దినకరన్‌ల శిరోభారాన్ని దించుకునేందుకు ముహూర్తం ఖరారైంది. వచ్చేనెల 12వ తేదీన పార్టీ కార్యవర్గ, సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించాలని సీఎం ఎడపాడి నిర్ణయం తీసుకున్నారు. శశికళ స్థానంలో ప్రధాన కార్యదర్శిని ఎంపిక చేసుకోవడమే ఈ సమావేశ ప్రధాన ఉద్దేశమని ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. సాక్షి ప్రతినిధి, చెన్నై: శశికళ చలవ వల్లనే సీఎం అయిన ఎడపాడికి అదే వ్యక్తి వల్ల చిక్కులు మొదలయ్యాయి. జైలుకెళ్లే ముందు తన ప్రతినిధిగా నియమించిన ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ సీఎం ఎడపాడి పాలిట కొరకరాని కొయ్యగా మారారు. పార్టీకే పరిమితం కాకుండా ప్రభుత్వాన్ని సైతం కూల్చివేసేందుకు దినకరన్ పూనుకోవడంతో ఇక లాభం లేదనుకుని ఎడపాడి, పన్నీర్ కలిసి కొరడా ఝుళిపించారు. ప్రభుత్వాన్ని కూల్చివేసే దిశగా దినకరన్ వేగం పెంచడంతో అప్రమత్తమైన ఎడపాడి వారిని బహిష్కరిస్తూ సోమవారం జరిగిన అన్నాడీఎంకే సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అలాగే, వారి స్వాధీనంలో ఉన్న నమదు ఎంజీఆర్ దినపత్రిక, జయ టీవీని స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. సీఎం ఎడపాడి అధ్యక్షతన చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నిర్వాహకులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శశికళ, దినకరన్‌లను దెబ్బతీయడమే లక్ష్యంగా నాలుగు తీర్మానాలు చేశారు. గవర్నర్‌కు లేఖ ఇచ్చిన 19 మంది ఎమ్మెల్యేలను పార్టీ పదవుల నుంచి తొలగించి శశికళ, దినకరన్‌లపై శాశ్వత వేటు వేయాలని ఎడపాడి వర్గం నిర్ణయం తీసుకుంది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకాన్నే ఎన్నికల కమిషన్ నిర్ధారించని పరిస్థితుల్లో ఆమె నియమించిన దినకరన్ ఉప ప్రధాన కార్యదర్శి కానేరడు, ఆయన నియామకాలు, తొలగింపులు చెల్లవు. కాబట్టి జయలలిత నియమించిన వారే ఆయా పదవుల్లో కొనసాగుతారని తీర్మానించారు. జయ టీవీ, నమదు ఎంజీఆర్ దినపత్రికలను చట్టపరంగా స్వాధీనం చేసుకోవాలని తీర్మానించారు. ఈనెల 12వ తేదీన పార్టీ కార్యవర్గ, సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎంజీ రామచంద్రన్, పార్టీని బలోపేతం చేసిన జయలలిత బాటలో నడవాలని తీర్మానించారు. పెరుగుతున్న దినకరన్ బలం ఎడపాడి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తున్నట్లుగా 19 మంది దినకరన్ వర్గ ఎమ్మెల్యేలు తమిళనాడు ఇన్చార్జ్ గవర్నర్ విద్యాసాగర్‌రావుకు లిఖితపూర్వకంగా అందజేశారు. కాగా మరో నలుగురు ఎమ్మెల్యేలు కూడా చేరడంతో సోమవారం నాటికి దినకరన్ బలం 23 కు చేరుకుంది. శశికళ, దినకరన్‌లకు వ్యతిరేకంగా మాట్లాడినవారిపై వేటు తప్పదని దినకరన్ వర్గం హెచ్చరిస్తోంది. ఇంతవరకు ఐదుగురు మంత్రులను పార్టీ పదవుల నుంచి తొలగించగా, పార్టీ కార్యదర్శి పదవి నుంచి సీఎం ఎడపాడిని తొలగిస్తున్నట్లు ఆదివారం రాత్రి దినకరన్ ప్రకటించడం కలకలం రేపింది. అలాగే మంత్రులు తంగమణి, వేలుమణిలను కూడా పార్టీ నుంచి దినకరన్ సోమవారం తొలగించారు. కాగా, ఎడపాడి సోమవారం నిర్వహించిన సమావేశానికి 113 మందిలో 83 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరు కావడం గమనార్హం. గైర్హాజరైన 30 మంది దినకరన్ వైపు ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అలాగే ఇద్దరు ఎంపీలు కూడా రాలేదు. అన్నాడీఎంకేని బీజేపీలో నూరుశాతం విలీనం చేశారని దినకరన్ వర్గ ఎమ్మెల్యే తంగతమిళ్ సెల్వన్ వ్యాఖ్యానించారు. దిష్టిబొమ్మల దహనం పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశం జరుగుతుండగా ఎడపాడి వర్గీయులు దినకరన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అలాగే మదురై జిల్లా మేలూరులో సీఎం ఎడపాడి, పన్నీర్‌సెల్వం దిష్టిబొమ్మలను దహనం చేయడంతో వందమందిని అరెస్ట్ చేశారు. నేడు ఢిల్లీకి వైరి వర్గాలు సీఎం ఎడపాడి, దినకరన్ వర్గ ఎమ్మెల్యేల మధ్య రాజకీయ యుద్ధం సాగుతుండగా, ఇరుపక్షాలు మంగళవారం ఒకేసారి ఢిల్లీకి చేరుకుంటున్నాయి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకంపై ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన లేఖను వాపస్ తీసుకునేందుకు సీఎం ఎడపాడి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం సహా ఐదుగురితో కూడిన మంత్రుల బృందం మంగళవారం ఢిల్లీకి వెళుతోంది. అలాగే రాష్ట్రపతిని కలిసి ఎడపాడి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరేందుకు దినకరన్ వర్గ ఎమ్మెల్యేలు సైతం మంగళవారం ఢిల్లీ విమానం ఎక్కనున్నారు. శశికళను బహిష్కరిస్తే పార్టీనే ఉండదు శశికళను బహిష్కరిస్తే పార్టీనే ఉండదు జాగ్రత్త అంటూ ఎమ్మెల్యే బోస్ ఎడపాడిని హెచ్చరించారు. దినకరన్ వర్గ ఎమ్మెల్యేలు పుదుచ్చేరిలో క్యాంప్ పెట్టి సోమవారానికి ఏడు రోజులైంది. ఏ వర్గంలో చేరాలో త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఎమ్మెల్యే కరుణాస్ తదితర ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రకటించారు. ఎడపాడి ప్రయత్నాలను చట్టపరంగా ఎదుర్కొనేందుకు దినకరన్ న్యాయనిపుణులతో సమావేశం అయ్యారు. ఎడపాడి, టీటీవీ దినకరన్ ఎవరికి వారు బహిష్కరణలు, నియామకాలు సాగించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఇద్దరు జిల్లా కార్యదర్శులు, ఇద్దరు రాష్ట్ర కార్యనిర్వాహకులుగా తయారయ్యారు. మరోసారి పేరు మార్పు అన్నాడీఎంకే రెండుగా చీలడం వల్ల ఎన్నికల కమిషన్ నిషేధం విధించడంంతో ఎడపాడి వర్గం ‘అన్నాడీఎంకే (అమ్మ)’ అని, పన్నీర్‌సెల్వం వర్గం ‘అన్నాడీఎంకే పురట్చితలైవి అమ్మ’ అని పేరు పెట్టుకున్నారు. ఈ రెండు వర్గాలు ఇటీవల ఏకం కావడంతో అన్నాడీఎంకే (అమ్మ, పురట్చి తలైవి అమ్మ) అని పేరు మార్చుకున్నట్లుగా పార్టీ లెటర్హెడ్ల ద్వారా వెల్లడైంది. -
అన్నాడీఎంకే కార్యకర్తలు సంబరాలు