ప్రచార హోరు | elections campaign | Sakshi
Sakshi News home page

ప్రచార హోరు

Published Fri, Mar 28 2014 12:01 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

elections campaign

సాక్షి, చెన్నై : రాష్ర్టంలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. నేతలందరూ సుడిగాలి పర్యటనలతో బిజీబిజీగా ఉన్నారు. జాతీయ పార్టీల నాయకులు సైతం రాష్ట్రంలో ప్రచారాలకు సిద్ధమయ్యారు. మదురై ఆధీనం అరుణగిరినాథర్ సైతం ప్రచార బాట పట్టారు. పుదుచ్చేరితో పాటుగా రాష్ట్రంలోని 40 లోక్‌సభ స్థానాల్లో ప్రచారం హోరెత్తుతోంది.
 
పుదుచ్చేరిని పక్కన బెడితే రాష్ట్రంలోని 30 స్థానాలకు పంచముఖ సమరం నెలకొంది. అన్నాడీఎంకే ఒంటరిగాను, వీసీకే, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్, మనిద నేయ మక్కల్ కట్చి, పుదియ తమిళగంలతో కలసి కూటమిగా డీఎంకే ఎన్నికలను  ఎదుర్కొంటున్నాయి. సీపీఎం, సీపీఐలు కలసికట్టుగా, డీఎండీకే, ఎండీఎంకే,  పీఎంకే, ఐజేకే, కొంగు పార్టీలతో కలసి బీజేపీ నేతృత్వంలో ఓ కూటమి బరిలోకి దిగి ఉంది.
 
ఇక కొన్నేళ్ల అనంతరం రాష్ట్రంలో ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి కాంగ్రెస్‌కు ఏర్పడింది. అన్ని పక్షాలు ఎన్నికల బరిలో నిలబడే అభ్యర్థుల జాబితాను దాదాపుగా ప్రకటించాయి. కాంగ్రెస్, బీజేపీ, పీఎంకేలు మాత్రం చెరో రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మిగిలిన పార్టీలు పూర్తి స్థాయిలో జాబితాల్ని ప్రకటించాయి.
 
 ప్రచార హోరు: ఆయా పార్టీల అభ్యర్థులు ఓటర్ల ను ఆకర్షించడం లక్ష్యంగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. దీంతో ఓపెన్ టాప్ జీపులకు భలే డిమాండ్ ఏర్పడింది. కొన్ని చోట్ల ఇంటింటా ప్రచారం సాగిస్తు న్నా, మరి కొన్ని చోట్ల రోడ్ షోల రూపంలో అభ్యర్థులు ప్రచారాలకు వెళ్లాల్సిన పరిస్థితి. ఉదయం నుంచి రాత్రి వరకు అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ప్రతి లోక్ సభ నియోజకవర్గానికి ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండడంతో, ఒక్కో రోజు ఒక్కో ప్రాంతాన్ని లేదా, రెండేసి ప్రాంతాల్ని ఎంపిక చేసుకుని ఓటర్లను ప్రసన్నం చేసుకుంటూ వస్తున్నారు.
 
నేతల బిజీ : అభ్యర్థులు ఓ వైపు ప్రచారంలో దూసుకెళుతుంటే, మరో వైపు ఆయా పార్టీల నాయకులు సైతం ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. అందరి కంటే ముందుగా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత శ్రీకారం చుట్టారు. హెలికాప్టర్లో చక్కర్లు కొడుతూ రోజుకు రెండు లోక్‌సభ నియోజక వర్గాల చొప్పున ఆమె ప్రచారం నిర్వహిస్తూ వస్తున్నారు.
 
 హెలిపాడ్‌ల నుంచి రోడ్ షోల రూపంలో బహిరంగ సభల వేదికకు వచ్చే ఆమె కేంద్రంలోని కాంగ్రెస్, రాష్ట్రంలోని డీఎంకే పార్టీలను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. ఇక, బీజేపీ కూటమి తరపున డీఎండీకే అధినేత విజయకాంత్, ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఆయన సతీమణి ప్రేమలత ప్రచారంలో ముందున్నారు. వేర్వేరుగా ఈ ఇద్దరు ఓ పెన్ టాప్ వాహనాల ద్వారా రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. డీఎంకే అభ్యర్థులకు మద్దతుగా ఆ పార్టీ కోశాధికారి ఎంకే స్టాలిన్ కన్యాకుమారి నుంచి ప్రచారంలో ఉన్నారు. ఆ పార్టీ అధినేత కరుణానిధి సైతం రెండు బహిరంగ సభల్లో ప్రసంగిస్తున్నారు. బీజేపీ అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్ తాను పోటీచేస్తున్న కన్యాకుమారిలో ఓటర్లను ఆకర్షిస్తునే, పార్టీ అభ్యర్థులకు మద్దతుగా రోజు మార్చి రోజు ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు.
 
సీపీఎం, సీపీఐ పార్టీల నేతలు రామకృష్ణన్, టీ పాండియన్‌లు తాము పోటీ చేస్తున్న చెరో తొమ్మిది స్థానాల్లో ప్రచారానికి సిద్ధం అయ్యారు. ఎండీఎంకే అధినేత వైగో తాను విరుదునగర్‌లో పోటీ చేస్తున్నప్పటికీ, అక్కడి బాధ్యతలను స్థానిక నాయకులకు అప్పగించి, కూటమి అభ్యర్థుల గెలుపు కోసం రోడ్ షో రూపంలో ప్రచారంలో దూసుకె ళ్తున్నారు. ఆయా పార్టీలకు మద్దతుగా ఉన్న సినీ నటులు ప్రచారంలో ఉరకలు తీస్తుంటే, మదురై ఆధీనంలోని అరుణగిరి నాథర్ అన్నాడీఎంకేకు మద్దతుగా ఆధ్యాత్మిక ప్రసంగాలతో ప్రచారం నిర్వహించే పనిలో ఉన్నారు. అన్నాడీఎంకే కు మద్దతుగా ఎస్‌ఎంకే నేత, నటుడు శరత్‌కుమార్ ప్రచార బాట పట్టారు.
 
జాతీయ నాయకులు: రాష్ట్ర పార్టీల నాయకులు ప్రచారంలో దూసుకెళ్తోంటే, జాతీయ పార్టీలు సైతం ప్రచారాలకు సిద్ధం అయ్యాయి. 18 స్థానాల్లో పోటీ చేస్తున్న తమ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారానికి సీపీఎం, సీపీఐ జాతీయ నాయకులు సిద్ధం అయ్యారు. ఏప్రిల్ పన్నెండు నుంచి కారత్, 19 నుంచి సీతారాం ఏచూరీ మూడు రోజుల పాటుగా రాష్ట్రంలో పర్యటించనున్నారు.
 
సీపీఐ జాతీయ నేతలు సురవరం సుధాకర్‌రెడ్డి, ఏపీ బర్దన్ ప్రచారానికి సిద్ధం అవుతోంటే, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు  రాహుల్ గాంధీని రాష్ట్రానికి రప్పించి నాలుగు చోట్ల ప్రచార సభల్ని ఏర్పాటు చేయడం లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహం రూపొంది స్తోంది. బీజేపీ నేత నరేంద్ర మోడీ  సభలు నిర్వహించాలని ఆ పార్టీ శ్రేణులు ఆలోచిస్తున్నారు.

భానుడి దెబ్బ: వేసవి కాలం కావడంతో ప్రచారానికి భానుడు అడ్డంకిగా మారుతుండడంతో ఉదయాన్నే తమప్రచారానికి శ్రీకారం చుట్టేస్తున్నారు. మిట్ట మధ్యాహ్నం వేళ ప్రచారాన్ని ముగించుకుని, మళ్లీ సాయం సంధ్య వేళ ప్రచార బాట పట్టే పనిలో అభ్యర్థులు, నాయకులూ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement