రేపే రజనీ రాజకీయ అరంగేట్రం?
అభిమానులతో ముగింపు సమావేశంలో ప్రకటిస్తారని అంచనాలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశానికి ముహూర్తం ఖరారైందా? ఇప్పుడు దీనిపై తమిళనాడులో అంచనాలు జోరందుకున్నాయి.ఈనెల 19నే కీలకమైన ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దేవుడు శాసిస్తే రాజకీయాల్లోకి వస్తానని ఇటీవల తలైవా ప్రకటించడంతో రాజకీయ వర్గాలు కూడా ఆయన అరంగేట్రంపై అంచనాలు వేస్తున్నాయి. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తర్వాత తమిళ రాజకీయాలు అస్తవ్యస్తమయ్యాయి. దీంతో రజనీ రాజకీయాల్లోకి రావాలనే డిమాండ్లు పెరిగాయి. రజనీకాంత్ ఆసరాగా అరవ ప్రాంతంలో పాగా వేయాలని చూసిన బీజేపీకి నిరాశే ఎదురైంది. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సాక్షాత్తూ నరేంద్ర మోదీ.. రజనీ ఇంటికి వెళ్లి కలసి వచ్చారు. రజనీకి బీజేపీ సీఎం అభ్యర్థిత్వాన్ని ఆశ చూపింది. అయినా తలైవా చలించలేదు.
సొంతపార్టీ పెట్టాలంటున్న అభిమానులు
అభిమానులతో సమావేశం కావడం రజనీకాంత్‌కు కొత్తకాకున్నా, ఈసమావేశంల్లో వ్యవహరిస్తున్న తీరు మాత్రం సరికొత్తగానే ఉందంటున్నారు. ఇవన్నీ చూస్తే రాజకీయాల్లోకి రావడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. మరోపక్క రజనీ రాజకీయాల్లోకి రావాలని కాంగ్రెస్, డీఎంకే, బీజేపీ తమిళనాడు శాఖలు కోరుతున్నాయి. అయితే సొంతపార్టీ పెట్టాలని అభిమానులు రజనీకాంత్‌పై ఒత్తిడి తెస్తున్నారు. సరైన సమయంలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని బుధవారం సమావేశంలో అభిమానులకు సూపర్‌స్టార్ హామీ ఇచ్చారు.