అళగిరి ఇంట క్యూ
సాక్షి, చెన్నై:
అయ్యా... మద్దతు ఇవ్వండి అంటూ అళగిరి ఇంటి వద్ద క్యూ కట్టే పనిలో రాజకీయ పక్షాలు పడ్డాయి. బీజేపీ, ఎండీఎంకే, కాంగ్రెస్ అభ్యర్థులు పలువురు అళగిరిని కలుసుకుని మద్దతు ఇవ్వాలని విన్నవించారు. డీఎంకే, అన్నాడీఎంకే మినహా తక్కిన పార్టీల వాళ్లంతా అళగిరి మద్దతు కోసం క్యూ కడుతుండడంతో మదురై రాజకీయం ఆసక్తికరంగా మారింది.
మదురై అంటే ఆధ్యాత్మికంగా అరుుతే అందరికీ గుర్తుకు వచ్చేది మీనాక్షి అమ్మవారి ఆలయం.రాజకీయంగా అయితే, అళగిరి అడ్డా. ఇక్కడి నుంచే దక్షిణాది జిల్లాల్లో డీఎంకే కింగ్ మేకర్‌గా అళగిరి అవతరించారు. డీఎంకే అధికారంలో ఉన్నా,లేకున్నా సరే మదురై అడ్డాగా అళగిరి చక్రం తిప్పేవారు.
అయితే, ఇప్పుడు ఆయన అవసరం డీఎంకేకు లేదు. అళగిరి కోటను దాదాపుగా దళపతి, పార్టీ కోశాధికారి ఎంకే స్టాలిన్ చీల్చేయడం ఇందుకు ఓ ఉదాహరణ. దక్షిణాదిలో సగం మంది అళగిరి వెంట, మిగిలిన వారు స్టాలిన్ వెంట సాగుతున్నారు. ఈ ఆధిపత్య రాజకీయమే కరుణానిధి కుటుంబంలో చిచ్చు రేపుతూ వ చ్చింది. చివరకు ఇటీవల పార్టీ నుంచి అళగిరిని బిహ ష్కరించారు.
ఆరోపణాస్త్రం: పార్టీ నుంచి బయటకు వచ్చిన అళగిరి లోక్‌సభ ఎన్నికల్లో తన మద్దతుదారులకు సీట్లు దక్కుతాయా? అని ఎదురు చూశారు. అయితే, స్టాలిన్ వర్గంపై చేయిగా నిలిచింది. దీంతో డీఎంకే అభ్యర్థులపై విమర్శలు, స్టాలిన్‌పై ఆరోపణాస్త్రాలను సంధించే పనిలో పడ్డారు. సీట్ల కోసం కోట్లు దండుకున్నారంటూ ఆరోపించడం, దక్షిణాదిలో డీఎంకే డిపాజిట్లు గల్లంతు తథ్యం అన్న హెచ్చరికలు ఇస్తుండటం, ఇతర పార్టీల్లో ఆనందాన్ని నింపినట్టు అయింది.
డీఎంకే అభ్యర్థులను అళగిరి వ్యతిరేకిస్తున్న దృష్ట్యా, ఆయన్ను ప్రసన్నం చేసుకుని, ఆయన మద్దతుదారుల ఓటు బ్యాంక్‌ను కొల్లగొట్టేందుకు రాజకీయ పక్షాలు సిద్ధం అయ్యాయి. ఇందులో భాగంగా ఆదివారం అళగిరిని ఎండీఎంకే నేత వైగో కలిశారు. అనధికారికంగా అళగిరిని అనేక మంది కలుస్తున్నా, అధికారికంగా వైగో భేటీ కావడం చర్చకు దారితీసింది.
దీంతో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అళగిరి వర్గం మద్దతు ఎటో? అన్న ప్రశ్న బయలు దేరింది. డీఎంకేను, అధినేత కరుణానిధిని మాత్రం రక్షించుకుంటానని అళగిరి తేల్చిన దృష్ట్యా, ఆ పార్టీ అభ్యర్థులకు ఆయన ఆశీస్సులు ఇక లేనట్టేనని తేలింది.
మద్దతు కోసం...: అళగిరిని కలిసి వైగో మద్దతు కోరారో లేదో ఉదయాన్నే అళగిరి ఇంటి వద్ద క్యూ పెరిగింది. వాతావరణం అంతా సందడి సందడిగా మారింది. సినీ తరహాలో అయ్యా...తమకంటే, తమకు మద్దతు ఇవ్వాలన్నట్టుగా రాజకీయ పక్షాల అభ్యర్థులు బారులు తీరారు. ఉదయాన్నే బీజేపీ రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు, శివగంగై అభ్యర్థి హెచ్ రాజా అళగిరిని కలుసుకుని ఆశీస్సులు అందుకున్నారు.
శివైగంగైలో తన గెలుపు లక్ష్యంగా సహకారం అందించాలని విన్నవించారు. దక్షిణాది జిల్లాల్లోని లోక్ సభ బరిలో ఉన్న ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించే రీతిలో మద్దతు సంకేతం ఇవ్వాలని విన్నవించారు. వెలుపలకు వచ్చిన హెచ్ రాజా మీడియాతో మాట్లాడుతూ, అళగిరిని మర్యాద పూర్వకంగా కలిసినట్టు తెలిపారు.
తమ అధినేత రాజ్ నాథ్ సింగ్‌తో ఆయన ఢిల్లీలో సమావేశం అయ్యారని, మోడీ పీఎంగా వస్తే ఆహ్వానిస్తామని అళగిరి గతంలో ప్రకటించిన విషయూన్ని గుర్తు చేశారు. అందుకే ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవడంతో పాటుగా, తమ గెలుపున కు మద్దతు ఇవ్వాలని వేడుకున్నట్టు తెలిపారు. అనంతరం ఎండీఎంకే తేని అభ్యర్థి అలగు సుందరం అళగిరితో భేటీ అయ్యారు.
తన గెలుపునకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రెండు పార్టీలకు చెందిన పలువురు నేతలు అళగిరిని కలిసిన వారిలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు సైతం అళగిరిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.
కాంగ్రెస్ ప్రసన్నం: డీఎంకే అభ్యర్థులను ఓడించడం లక్ష్యంగా అళగిరి కంకణం కట్టుకున్న దృష్ట్యా, ఆయన్ను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ సిద్ధం అయింది. టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞాన దేశికన్ మదురైకు పయనం అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. స్థానికంగా మీడియాతో మాట్లాడిన ఆయన అళగిరి మద్దతు కోరే విషయాన్ని మదురైలో ప్రకటిస్తానన్నారు. మదురై కాంగ్రెస్ అభ్యర్థి సీఎన్ భరత్‌నాచ్చియప్పన్ మధ్యాహ్నం అళగిరిని కలిశారు.
యువతకు పెద్ద పీట వేయాలని యువకుడైన భరత్ నాచ్చియప్పన్ అళగిరిని విజ్ఞప్తి చేశారు. దక్షిణాదిలో కాంగ్రెస్ అభ్యర్థులు అత్యధిక శాతం మంది యువకులే ఉన్నారని మీడియాతో మాట్లాడుతూ భరత్ వివరించారు. కేంద్ర కేబినెట్‌లో పనిచేసిన మంత్రుల్లో అళగిరి ప్రత్యేకమైన వ్యక్తిగా కొనియాడారు.
తాను మంత్రి పదవిలో లేనప్పటికీ, తనకు అవకాశం ఇచ్చినందుకు గాను ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ప్రత్యేకంగా కలసి కృతజ్ఞతలు తెలియజేయడం ఆయన మనస్సుల్లో మంచితనానికి నిదర్శనంగా పేర్కొన్నారు. మదురైలో తన గెలుపు కోసం అళగిరి మద్దతు తప్పని సరిగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. అళగిరికి మద్దతు వినతుల తాకిడి రోజు రోజుకూ పెరుగుతున్నారుు.మదురై వేదికగా కింగ్ మేకర్ రాజకీయం రక్తికట్టిస్తోంది మరి.
అళగిరి వార్తకు కలుపుకోవాలి
మళ్లీ ఫైర్: డీఎంకే అభ్యర్థులపై అళగిరి మళ్లీ విరుచుకు పడ్డారు. ఉదయం నుంచి అళగిరిని పలు పార్టీల నాయకులు కలవడంతో సాయంత్రం ఆయన్ను మీడియా కలిసింది. ఎవరికి మద్దతు ఇస్తున్నారో అని ప్రశ్నించగా, ముందే చెప్పానుగా మద్దతుదారుల భేటీ అనంతరం వెల్లడిస్తానన్నారు.
డీఎంకే అభ్యర్థులు కోట్లు చల్లి మరీ సీట్లు తెచ్చుకున్నారని, వీరందరికీ ఓటర్లు గుణపాఠం చెప్పడం తథ్యమన్నారు. తెన్‌కాశి బరిలో నిలబడ్డ పుదియ తమిళగం నేత కృష్ణ స్వామిని ఉద్దేశించి తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి పనికి రాని ఆయనకు ఒక పదవి చాలదా? అని విమర్శించారు.
ఎమ్మెల్యేగా ఉన్న ఆయన మరొకరికి అవకాశం ఇవ్వొచ్చుగా అని ప్రశ్నించారు. పార్టీ తన చేతిలో ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరించడం మానుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు డిపాజిట్లు గల్లంతయ్యే విధంగా చేస్తానని హెచ్చరించడం గమనార్హం.