డీఎంకే నుంచి అళగిరి బహిష్కరణ
చెన్నై : డీఎంకే అధినేత కరుణానిధి పెద్ద కుమారుడు ఎంకె అళగిరిపై బహిష్కృత వేటు పడింది. డీఎంకే పార్టీ నుంచి అళగిరిని మంగళవారం కరుణానిధి బహిష్కరించారు. పార్టీ నియమాలకు వ్యతిరేకంగా వ్యవహరించారనే కారణంతో అళగిరిని జనవరిలోనే పార్టీ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. సోదరుడు స్టాలిన్తో వారసత్వ పోరు సాగిస్తున్న అళగిరి ఇంతకుముందు తండ్రిపై కూడా తీవ్ర విమర్శలు చేశారు.
పార్టీ నుంచి బయటకు వచ్చిన అళగిరి లోక్‌సభ ఎన్నికల్లో తన మద్దతుదారులకు సీట్లు దక్కుతాయా? అని ఎదురు చూశారు. అయితే, స్టాలిన్ వర్గంపై చేయిగా నిలిచింది. దీంతో డీఎంకే అభ్యర్థులపై విమర్శలు, స్టాలిన్‌పై ఆరోపణాస్త్రాలను సంధించే పనిలో పడ్డారు. సీట్ల కోసం కోట్లు దండుకున్నారంటూ ఆరోపించడం, దక్షిణాదిలో డీఎంకే డిపాజిట్లు గల్లంతు తథ్యం అన్న హెచ్చరికలు ఇస్తుండటం, ఇతర పార్టీల్లో ఆనందాన్ని నింపినట్టు అయింది.
దాంతో అళగిరి మద్దతు ఇవ్వాలంటూ డీఎంకే, అన్నాడీఎంకే మినహా మిగతా పార్టీ నేతలు ఆయన నివాసానికి క్యూ కట్టారు. బీజేపీ, ఎండీఎంకే, కాంగ్రెస్ అభ్యర్థులు పలువురు నిన్న అళగిరిని కలుసుకుని మద్దతు ఇవ్వాలని విన్నవించారు. ఈ నేపథ్యంలో ఆయనపై డీఎంకే వేటు వేయటం గమనార్హం.