చెన్నై, సాక్షి ప్రతినిధి :కాంగ్రెస్ టికెట్‌పై పోటీనా వద్దు బాబోయ్ అంటున్నారు కేంద్ర మంత్రులు. కొన్ని దశాబ్దాలుగా రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలదే హవా. కాంగ్రెస్ సైతం ప్రాంతీయ పార్టీల గొడుగు కిందే కొనసాగుతోంది. ఈ సారి కాంగ్రెస్ పరిస్థితి తారుమారైంది. బలహీనంగా ఉన్న బీజేపీ బలమైన కూటమిని ఏర్పరుకుంది.
డీఎంకేతో పొత్తుపెట్టుకుని యూపీఏ 1, 2 కాలంలో బలంగా ఉన్న కాంగ్రెస్ పూర్తిగా బలహీనపడింది. జాతీయ స్థాయిలో అనేక అప్రతిష్టలు మూటగట్టుకున్న ఫలితంగా కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకునేందుకు రాష్ట్ర స్థాయిలో ఏ ప్రాంతీయ పార్టీ కూడా ముందుకు రాలేదు. ఇక తప్పని సరై కాంగ్రెస్ ఒంటరిపోరుకు సిద్ధమైంది. అనేక ప్రాంతీయ పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడిన బీజేపీ, డీఎంకే, అధికార అన్నాడీఎంకేలు ఢీ అంటే ఢీ అంటూ ముందుకు సాగుతున్నాయి.
బలమైన ప్రాంతీయ పార్టీల నడుమ నలిగిపోయే కంటే పోటీకీ దూరంగా ఉంటేనే మేలని నిర్ణయించుకున్న కాంగ్రెస్ బడా నేతలు ముఖం చాటేయడం మొదలుపెట్టారు. అధిష్టానం వద్ద తనకున్న పరపతిని ఉపయోగించిన కేంద్ర మంత్రి చిదంబరం సైతం చల్లగా పోటీ నుంచి తప్పుకుని తన కుమారుడు కార్తీని బరిలో నిలిపారు.
సీనియర్ నేతలు పోటీ చేయాల్సిందేనని అధిష్టానం హుకుం జారీచేయడంతోపాటు ఎనిమిది మంది సిట్టింగ్ ఎంపీల్లో ఆరుగురికి టికెట్ ఖరారుచేసి జాబితాలో చేర్చింది. వద్దు వద్దంటున్నా వినిపించుకోని అధిష్టానం వైఖరితో మింగుడు పడని సిట్టింగ్ ఎంపీలు బలవంతంగానే బరిలోకి దిగుతున్నారు.
జీకే వాసన్‌కు తప్పని పోరు
రాష్ట్ర కాంగ్రెస్‌లో భిన్న ధృవాలైన కేంద్ర మంత్రులు చిదంబరం, జీకే వాసన్ ఇద్దరూ పోటీకి దూరంగా ఉంటామని ముందుగానే ప్రకటించారు. పోటీ విషయంలో సిట్టింగ్ ఎంపీల పట్ల నిఖార్సుగా వ్యవహరించిన అధిష్టానం చిదంబరం పట్ల మెతకవైఖరిని అవలంబించింది.ప్రచారానికే పరిమితం కానున్నట్లు జీకే వాసన్ ప్రకటించుకున్నారు. అధిష్టానం అందుకు ఒప్పుకోనట్లు తెలిసింది. రాజ్యసభ సభ్యుని హోదాలో నౌకాయానశాఖా మంత్రిగా పదవిని అనుభవించిన వాసన్ ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయక తప్పదని అధిష్టానం ఆదేశించినట్లు సమాచారం.
రాష్టంలో 39 లోక్‌సభ స్థానాలకు గాను 37 చోట్ల అభ్యర్థుల జాబితా వెల్లడైంది. దక్షిణ చెన్నై, విల్లుపురం స్థానాలకు ఇంకా అభ్యర్థులను ఎంపిక చేయలేదు. దక్షిణ చెన్నై నుంచి జీకే వాసన్‌ను బరిలోకి దించాలని అధిష్టానం భావిస్తున్న ట్టు సమాచారం. ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు వాసన్ అంగీకరించని పక్షంలో జాబితాలో మార్పు చేసైనా అతన్ని పోటీలో నిలపాని నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.అధిష్టానం ఆదేశాలకు వాసన్ తలొగ్గుతారా, పార్టీలోని తన ప్రత్యర్థి చిదంబరంను మినహాయించి తనను మాత్రం ఎందుకు ఒత్తిడి చేస్తున్నారని వాదించి తప్పించుకుంటారా అనేది వేచి చూడాల్సిందే.
మూడో జాబితాలో నలుగురు
రాష్ట్రంలోని 39 స్థానాల్లో అభ్యర్థులను భర్తీ చేసేందుకు తంటాలు పడుతున్న కాంగ్రెస్ ఇప్పటికి రెండు జాబితాలను విడుదల చేసింది. తొలి విడతలో 30 మంది, మలి విడతలో ఇద్దరి పేర్లను ఖరారు చేసింది. తాజాగా బుధవారం విడుదల చేసిన మూడో జాబితాలో నలుగురి పేర్లను వెల్లడించింది.ఉత్తర చెన్నై నుంచి బీజూ సాక్కో, కృష్ణగిరి నుంచి డాక్టర్ సెల్వకుమార్, కరూరు నుంచి జ్యోతిమణి, కన్యాకుమారి నుంచి వసంతకుమార్ పోటీ చేయనున్నారు. మూడో జాబితాతో 37 సీట్లకు అభ్యర్థుల ఎంపిక పూర్తవగా, మరో రెండు స్థానాలు పరిశీలనలో ఉన్నాయి.
కాంగ్రెస్ పుస్తకాలు సీజ్
యూపీఏ పాలనలో కాంగ్రెస్ చేపట్టిన అభివృద్ధిని వివరిస్తూ ముద్రించిన పుస్తకాలను ఫ్లరుుంగ్ స్క్వాడ్ అధికారులు బుధవారం సీజ్ చేశారు. కేరళ రాష్ట్రం కొట్టాయం లోక్‌సభ స్థానం నుంచి జోస్ కే మానిక్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ విజయాలను వివరిస్తూ తమిళనాడులోని శివకాశిలో ప్రింటింగ్ ప్రెస్ ద్వారా 17 లక్షల పుస్తకాలను ముద్రించారు.
కాంగ్రెస్ పుస్తకాలను వేసుకుని కేరళకు వెళుతున్న కారును నెల్లై జిల్లా శివగిరి తాలూకా పరిధిలో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీచేశారు. పుస్తకాలకు సంబంధించి ఆర్డరు, ముద్రణకు చెల్లించిన బిల్లు మరే ఆధారమూ లేకపోవడంతో కారు సహా పుస్తకాలను సీజ్ చేశారు. విరుదునగర్‌కు చెందిన కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
వామ్మో కాంగ్రెస్ టికెట్టా!
Published Thu, Mar 27 2014 12:04 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement
Advertisement