Finance Minister P Chidambaram
-
మోడీ ఎన్కౌంటర్ సీఎం, అబద్ధాలకోరు
చెన్నై: కేంద్ర మంత్రి చిదంబరం, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ మధ్య మరోసారి మాటల తూటాలు పేలాయి. చిదంబరం రీకౌంటింగ్ మంత్రి అన్న మోడీ వ్యాఖ్యలకు స్పందనగా.. మోడీ ఎన్కౌంటర్ సీఎం అని చిదంబరం వ్యాఖ్యానించారు. ఓటర్లకు చిదంబరం తన ఫొటోతో కూడిన వాచీలు పంచుతున్నారని, దీనిపై ఎన్నికల సంఘం విచారణ జరిపించాలని మోడీ డిమాండ్ చేయగా.. ఆయన కలల ప్రపంచంలో బతికే అబద్ధాలకోరు అంటూ చిదంబరం ఎదురుదాడి చేశారు. తన నియోజకవర్గం శివగంగలో రీకౌంటింగ్ జరగలేదన్న సంగతి మోడీకి తెలుసునని, అయినా ఆయన అబద్ధపు ప్రకటనలు చేస్తూనే ఉన్నారని గురువారమిక్కడ ఆయన మండిపడ్డారు. -
ఆ పార్టీలకు విమర్శించే అర్హత లేదు
వేలూరు, న్యూస్‌లైన్: డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు ప్రధానిని విమర్శించే అర్హత లేదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి చిదంబరం అన్నారు. వేలూరు జిల్లా అరక్కోణం నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి రాజేష్‌కు మద్దతుగా ఆర్కాడులో ఆయన ప్రచార సభ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పదేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పాలనను అందించిందన్నారు. అయితే రాష్ట్ర పార్టీలు ఏవైనా ఏనాటికీ దేశాన్ని పరిపాలించే అవకాశం ఉండదన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి దేశ ప్రజల కోసం పాటు పడిన ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనన్నారు. పదేళ్లలో పలు సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి ప్రజల గుండెల్లో కాంగ్రెస్ పార్టీ చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. ఆర్ఎస్ఎస్ బినామిగా ఉన్న భారతీయ జనతా పార్టీకి దేశాన్ని పాలించే అర్హత లేదన్నారు. మతతత్వ పార్టీ బీజేపీకి ప్రజలు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారన్నారు. రాష్ట్రంలో నరేంద్రమోడి గాలి వీస్తోందని పలు పార్టీలు చెబుతున్నాయని, అయితే రాష్ట్ర ప్రజలకు నరేంద్రమోడి ఎవరనేది తెలియదనే విధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు లేరని కొన్ని ప్రాంతాల్లో చెబుతున్నారని, కార్యకర్తల గుండెల్లో కాంగ్రెస్ పార్టి చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. సంక్షేమ పథకాలను గుర్తించుకుని ప్రతి ఒక్కరు చేతి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే జ్ఞానశేఖరన్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
వామ్మో కాంగ్రెస్ టికెట్టా!
చెన్నై, సాక్షి ప్రతినిధి :కాంగ్రెస్ టికెట్‌పై పోటీనా వద్దు బాబోయ్ అంటున్నారు కేంద్ర మంత్రులు. కొన్ని దశాబ్దాలుగా రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలదే హవా. కాంగ్రెస్ సైతం ప్రాంతీయ పార్టీల గొడుగు కిందే కొనసాగుతోంది. ఈ సారి కాంగ్రెస్ పరిస్థితి తారుమారైంది. బలహీనంగా ఉన్న బీజేపీ బలమైన కూటమిని ఏర్పరుకుంది. డీఎంకేతో పొత్తుపెట్టుకుని యూపీఏ 1, 2 కాలంలో బలంగా ఉన్న కాంగ్రెస్ పూర్తిగా బలహీనపడింది. జాతీయ స్థాయిలో అనేక అప్రతిష్టలు మూటగట్టుకున్న ఫలితంగా కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకునేందుకు రాష్ట్ర స్థాయిలో ఏ ప్రాంతీయ పార్టీ కూడా ముందుకు రాలేదు. ఇక తప్పని సరై కాంగ్రెస్ ఒంటరిపోరుకు సిద్ధమైంది. అనేక ప్రాంతీయ పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడిన బీజేపీ, డీఎంకే, అధికార అన్నాడీఎంకేలు ఢీ అంటే ఢీ అంటూ ముందుకు సాగుతున్నాయి. బలమైన ప్రాంతీయ పార్టీల నడుమ నలిగిపోయే కంటే పోటీకీ దూరంగా ఉంటేనే మేలని నిర్ణయించుకున్న కాంగ్రెస్ బడా నేతలు ముఖం చాటేయడం మొదలుపెట్టారు. అధిష్టానం వద్ద తనకున్న పరపతిని ఉపయోగించిన కేంద్ర మంత్రి చిదంబరం సైతం చల్లగా పోటీ నుంచి తప్పుకుని తన కుమారుడు కార్తీని బరిలో నిలిపారు. సీనియర్ నేతలు పోటీ చేయాల్సిందేనని అధిష్టానం హుకుం జారీచేయడంతోపాటు ఎనిమిది మంది సిట్టింగ్ ఎంపీల్లో ఆరుగురికి టికెట్ ఖరారుచేసి జాబితాలో చేర్చింది. వద్దు వద్దంటున్నా వినిపించుకోని అధిష్టానం వైఖరితో మింగుడు పడని సిట్టింగ్ ఎంపీలు బలవంతంగానే బరిలోకి దిగుతున్నారు. జీకే వాసన్‌కు తప్పని పోరు రాష్ట్ర కాంగ్రెస్‌లో భిన్న ధృవాలైన కేంద్ర మంత్రులు చిదంబరం, జీకే వాసన్ ఇద్దరూ పోటీకి దూరంగా ఉంటామని ముందుగానే ప్రకటించారు. పోటీ విషయంలో సిట్టింగ్ ఎంపీల పట్ల నిఖార్సుగా వ్యవహరించిన అధిష్టానం చిదంబరం పట్ల మెతకవైఖరిని అవలంబించింది.ప్రచారానికే పరిమితం కానున్నట్లు జీకే వాసన్ ప్రకటించుకున్నారు. అధిష్టానం అందుకు ఒప్పుకోనట్లు తెలిసింది. రాజ్యసభ సభ్యుని హోదాలో నౌకాయానశాఖా మంత్రిగా పదవిని అనుభవించిన వాసన్ ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయక తప్పదని అధిష్టానం ఆదేశించినట్లు సమాచారం. రాష్టంలో 39 లోక్‌సభ స్థానాలకు గాను 37 చోట్ల అభ్యర్థుల జాబితా వెల్లడైంది. దక్షిణ చెన్నై, విల్లుపురం స్థానాలకు ఇంకా అభ్యర్థులను ఎంపిక చేయలేదు. దక్షిణ చెన్నై నుంచి జీకే వాసన్‌ను బరిలోకి దించాలని అధిష్టానం భావిస్తున్న ట్టు సమాచారం. ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు వాసన్ అంగీకరించని పక్షంలో జాబితాలో మార్పు చేసైనా అతన్ని పోటీలో నిలపాని నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.అధిష్టానం ఆదేశాలకు వాసన్ తలొగ్గుతారా, పార్టీలోని తన ప్రత్యర్థి చిదంబరంను మినహాయించి తనను మాత్రం ఎందుకు ఒత్తిడి చేస్తున్నారని వాదించి తప్పించుకుంటారా అనేది వేచి చూడాల్సిందే. మూడో జాబితాలో నలుగురు రాష్ట్రంలోని 39 స్థానాల్లో అభ్యర్థులను భర్తీ చేసేందుకు తంటాలు పడుతున్న కాంగ్రెస్ ఇప్పటికి రెండు జాబితాలను విడుదల చేసింది. తొలి విడతలో 30 మంది, మలి విడతలో ఇద్దరి పేర్లను ఖరారు చేసింది. తాజాగా బుధవారం విడుదల చేసిన మూడో జాబితాలో నలుగురి పేర్లను వెల్లడించింది.ఉత్తర చెన్నై నుంచి బీజూ సాక్కో, కృష్ణగిరి నుంచి డాక్టర్ సెల్వకుమార్, కరూరు నుంచి జ్యోతిమణి, కన్యాకుమారి నుంచి వసంతకుమార్ పోటీ చేయనున్నారు. మూడో జాబితాతో 37 సీట్లకు అభ్యర్థుల ఎంపిక పూర్తవగా, మరో రెండు స్థానాలు పరిశీలనలో ఉన్నాయి. కాంగ్రెస్ పుస్తకాలు సీజ్ యూపీఏ పాలనలో కాంగ్రెస్ చేపట్టిన అభివృద్ధిని వివరిస్తూ ముద్రించిన పుస్తకాలను ఫ్లరుుంగ్ స్క్వాడ్ అధికారులు బుధవారం సీజ్ చేశారు. కేరళ రాష్ట్రం కొట్టాయం లోక్‌సభ స్థానం నుంచి జోస్ కే మానిక్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ విజయాలను వివరిస్తూ తమిళనాడులోని శివకాశిలో ప్రింటింగ్ ప్రెస్ ద్వారా 17 లక్షల పుస్తకాలను ముద్రించారు. కాంగ్రెస్ పుస్తకాలను వేసుకుని కేరళకు వెళుతున్న కారును నెల్లై జిల్లా శివగిరి తాలూకా పరిధిలో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీచేశారు. పుస్తకాలకు సంబంధించి ఆర్డరు, ముద్రణకు చెల్లించిన బిల్లు మరే ఆధారమూ లేకపోవడంతో కారు సహా పుస్తకాలను సీజ్ చేశారు. విరుదునగర్‌కు చెందిన కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
చిదంబరం రూటెటు!
ఎన్నికల ముందు వరాలు కురిపిస్తారా? కీలక ప్రకటనలేవీ ఉండకపోవచ్చంటున్న విశ్లేషకులు ద్రవ్యలోటు అదుపునకు కట్టుబడే అవకాశం... పరిశ్రమలు, సామాన్యులకు కొంత ఊరట కల్పించొచ్చని అంచనా ఎక్సైజ్ సుంకం, సేవా పన్నుల్లో తగ్గింపునకు చాన్స్ లోక్‌సభ ఎన్నికల ముంగిట.. యూపీఏ ప్రభుత్వం చివరి బడ్జెట్ అస్త్రాన్ని సంధించేందుకు సిద్ధమవుతోంది. పార్లమెంట్లో ఆర్థిక మంత్రి పి. చిదంబరం నేడు 2014-15 ఏడాదికిగాను మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికల్లో ప్రజలను ఆకర్షించేందుకు వరాలేమైనా కురిపిస్తారా? లేదంటే ద్రవ్యలోటు అదుపుతప్పకుండా చూస్తామన్న మాటకు కట్టుబడతారా అనేది ఆసక్తికరంగా మారింది. అసలే కుంభకోణాలు, ఆర్థిక వ్యవస్థ మందగమనం ఇతరత్రా ఎడాపెడా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న యూపీఏ సర్కారు బడ్జెట్‌ను ఎన్నికల కోణంలోనే ఆవిష్కరించే అవకాశాలూ లేకపోలేదు. సంక్షేమ పథకాలకు భారీగానే నిధులను కుమ్మరించే ఆస్కారం ఉంది. అయితే, ఇది కేవలం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కావడంతో కీలక పాలసీ నిర్ణయాలకు ఆస్కారం తక్కువే. దీంతో నేరుగా ప్రజలకు లబ్ధిచేకూర్చే కొన్ని వరాలు, ఇబ్బందుల్లో ఉన్న పారిశ్రామిక రంగానికి చేయూతనిచ్చేలా ప్రోత్సాహకాలు మాత్రమే ఉండొచ్చనే అంచనాలు ఎక్కువగా వినబడుతున్నాయి. జనరంజక బడ్జెట్లను ప్రవేశపెట్టడంలో దిట్టగా పేరొందిన చిదంబరం.. తన ఆఖరి బడ్జెట్ ఇన్నింగ్స్‌లోనూ మెప్పిస్తారా? లేదంటే ఉసూరుమనిపిస్తారా అనేది మరికొద్ది గంటల్లోనే తేలిపోనుంది. న్యూఢిల్లీ: మధ్యంతర బడ్జెట్లో కీలకమైన పాలసీ నిర్ణయాలు, చర్యలను ఆశించనక్కర్లేదని ఎక్కువమంది విశ్లేషకులు, నిపుణులు చెబుతున్నారు. నేడు(సోమవారం) విత్తమంత్రి చిదంబరం... జూలై వరకూ ప్రభుత్వ వ్యయాలకు సంబంధించి పార్లమెంట్ అనుమతి కోరుతూ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. గత సంప్రదాయాల ప్రకారం చూస్తే.. మధ్యంతర బడ్జెట్లో ప్రత్యక్షపన్నుల్లో(ఆదాయపు పన్ను ఇతరత్రా) మార్పుచేర్పులు, విధానపరమైన ప్రకటనలేవీ ఉండే అవకాశం లేదు. కొన్ని ప్రోత్సాహాలు మినహా ద్రవ్యలోటు కట్టడి లక్ష్యానికే చిదంబరం ప్రాధాన్యం ఇవ్వొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే, సామాన్యులకు, ఆర్థిక వ్యవస్థకు చేయూతనిచ్చేలా కొన్ని ఊరట చర్యలు ఖాయమంటున్నారు. ఎక్సైజ్ సుంకం, సేవా పన్నులను సమీక్షించనున్నట్లు ఇప్పటికే చిదంబరం సంకేతాలివ్వడం తెలిసిందే. ప్రధానంగా ఆర్థిక మందగమనం నేపథ్యంలో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న పారిశ్రామిక రంగాలు ఈ ప్రోత్సాహకాలను డిమాండ్ చేస్తుండటమే దీనికి కారణం. అయితే, ఇప్పుడు సుంకాలు, పన్నుల్లో చేసే మార్పులను... ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం జూన్/జూలైలో ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్లో మళ్లీ మార్చే అవకాశాలుం టాయి. దీంతో కార్పొరేట్లు, స్టాక్ మార్కెట్లు మధ్యం తర బడ్జెట్లో చర్యలను అంతగా పట్టించుకోకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సంస్కరణలకు నో చాన్స్... కీలకమైన సంస్కరణల విషయంలో రాజకీయంగా ఏకాభిప్రాయం లేనందున వీటి జోలికి ప్రభుత్వం ఇక వెళ్లనట్టే. ప్రధానంగా వస్తు, సేవల పన్ను(జీఎస్టీ), ప్రత్యక్ష పన్నుల కోడ్(డీటీసీ), బీమాలో విదేశీ ప్రత్యక్ష పన్నుల(ఎఫ్‌డీఐ) పెంపునకు సంబంధించిన బిల్లులను ప్రస్తుత యూపీఏ-2 సర్కారు ఇక పక్కనబెట్టేయనుంది. ‘ఆదాయపు పన్ను, కస్టమ్స్, ఎక్సైజ్ చట్టాల్లో సవరణలను ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో తీసుకొచ్చే అవకాశాల్లేవు. అయితే, చట్టసవరణలు అవసరం లేని ప్రతిపాదనలకు ప్రాధాన్యం ఉంటుంది. భవిష్యత్ దృక్కోణంతోనే ఎలాంటి చర్యలైనా చేపడతాం’ అని చిదంబరం ఇటీవలే వ్యాఖ్యానించారు. ఓటాన్ అకౌంట్ అంటే... సాధారణంగా లోక్‌సభ ఎన్నికల సంవత్సరంలో ప్రభుత్వం ప్రవేశపెట్టే మధ్యంతర బడ్జెట్‌నే ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌గా వ్యవహరిస్తారు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్-మే నెలల్లో జరగనున్నాయి. కొత్త ప్రభుత్వం జూన్ లేదా జూలైలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగుస్తుంది. ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఖర్చులు(వేతనాలు, నిర్వహణపరమైన ఖర్చులు, సంక్షేమ పథకాలకు వ్యయం ఇతరత్రా) యథాతథంగా కొనసాగాలంటే నిధుల కేటాయింపులకు పార్లమెంట్ ఆమోదం తప్పనిసరి. దీంతో వీటికి సంబంధించిన జమాఖర్చులతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అంటే 3-4 నెలలకు మాత్రమే ఇది పరిమితమవుతుంది. తదుపరి వచ్చే కొత్త ప్రభుత్వం 2014-15 మొత్తం ఆర్థిక సంవత్సరానికి పూర్థిస్థాయిలో బడ్జెట్‌ను తీసుకొస్తుంది. ‘సూపర్ రిచ్’ పన్ను కొనసాగిస్తారా? అత్యంత ధనిక(సూపర్ రిచ్) వర్గాలపై గత బడ్జెట్లో విధించిన పన్నును కొనసాగిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. దీనికి చట్టసవరణ అవసరం కానుండటమే దీనికి కారణం. చిదంబరం మాటల ప్రకారం చట్టసవరణలేవీ లేకపోతే దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సిందే. రూ. కోటికి మించి ఆదాయం ఆర్జించే సంపన్నులపై 10 శాతం సర్‌ఛార్జీ(సూపర్ రిచ్ ట్యాక్స్)ని విధిస్తూ 2013-14 బడ్జెట్లో చిదంబరం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు రూ.42,800 మందిని ఈ పన్ను చట్రంలోకి తీసుకొచ్చారు. సొంత డబ్బాకే పరిమితమా! ఎన్నికలు ముంచుకొస్తుండటంతో ప్రస్తుత యూపీఏ-2 హయాంలో తాము సాధించిన ఘనతలు, చర్యలను ఊదరగొట్టేందుకు బడ్జెట్ ప్రసంగంలో చిదంబరం ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అవకాశాలున్నాయి. అంతర్జాతీయంగా తీవ్ర ఇబ్బందులు నెలకొన్నప్పటికీ ద్రవ్యలోటు, కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్)ల కట్టడికి తాము తీసుకున్న చర్యలను ప్రధానంగా ప్రస్తావించనున్నారు. అంతేకాకుండా స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) మందగించడానికి కారణాలను, దీన్ని తిరిగి గాడిలోపెట్టేందుకు తాము చేపట్టిన చర్యలను కూడా ఆయన వివరించనున్నారు. జీడీపీ వృద్ధి రేటు గతేడాది దశాబ్దపు కనిష్టమైన 5 శాతానికి పడిపోగా... ఈ ఏడాది 4.9 శాతానికి పరిమితమవుతుందని ముందస్తు అంచనా. కాగా, ప్రస్తుత 2013-14లో ద్రవ్యలోటును జీడీపీలో 4.8 శాతానికి కట్టడి చేస్తామని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా 2జీ స్పెక్ట్రం వేలం విజయంతో నిధులు భారీగానే(మార్చిలోగా కనీసం రూ.20 వేల కోట్లు ఖజానాకు వస్తాయని అంచనా) రానుండటంతో ద్రవ్యలోటు లక్ష్యానికి లోబడే ఉండొచ్చని భావిస్తున్నారు. ఇక క్యాడ్ గత ఆర్థిక సంవత్సరంలో చరిత్రాత్మక గరిష్టానికి(జీడీపీలో 4.8%) ఎగబాకగా.. ఈ ఏడాది 2.5 శాతానికిలోపే పరిమితం కానుంది. బడ్జెట్‌పై ఇన్వెస్టర్ల చూపు ఆర్థిక మంత్రి చిదంబరం ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్‌పై ఇన్వెస్టర్లు దృష్టి సారిస్తారని స్టాక్ నిపుణులు పేర్కొన్నారు. సోమవారం ప్రకటించనున్న ఓటాన్ అకౌంట్ స్వల్ప కాలానికి మార్కెట్ల ట్రెం డ్‌ను నిర్దేశిస్తుందని అంచనా వేశారు. దీంతోపాటు డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) పెట్టుబడులు కీలకంగా నిలవనున్నాయని చెప్పారు. ఇక అంతర్జాతీయ సంకేతాలకూ ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. రానున్న రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలకు తెరలేవనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటాన్ అకౌంట్‌ను మార్కెట్లు క్షుణ్ణంగా పరిశీలిస్తాయని కొటక్ సెక్యూరిటీస్ ప్రైవేట్ క్లయింట్ గ్రూప్ రీసెర్చ్ హెడ్ దీపేన్ షా పేర్కొన్నారు. ద్రవ్యలోటు, తదితర పరిణామాలపై మార్కెట్లు తమదైన శైలిలో స్పందిస్తాయని విశ్లేషించారు. పరోక్ష పన్నులకు సంబంధించి ఏ రంగానికైనా ప్రోత్సాహకాలను కల్పిస్తే ఆ ప్రభావం మార్కెట్లపై ఉంటుందని వ్యాఖ్యానించారు. ద్రవ్యలోటు ఎఫెక్ట్: ద్రవ్యలోటు అంశానికి ఇన్వెస్టర్లు ప్రాధాన్యత ఇస్తారని నిపుణులు పేర్కొన్నారు. వచ్చే ఏడాది(2015)కి ప్రకటించే ద్రవ్యలోటు లక్ష్యం ఆధారంగా ప్రభుత్వ రుణ సమీకరణ కార్యకలాపాలుంటాయని, దీంతో ఈ అంశం కీలకంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. సమీప కాలంలో మార్కెట్లు పెరిగినప్పుడల్లా అమ్మకాలకు తెరలేచే అవకాశమున్నదని వివరించారు. ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీకి 6,100 పాయింట్ల స్థాయి కీలకంకానుందని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ అంచనా వేశారు. ఈ స్థాయికిపైన కొనుగోళ్లు పుంజుకుంటాయని తెలిపారు. -
టీఎన్‌సీసీలో మళ్లీ వర్గపోరు
టీఎన్‌సీసీలో మళ్లీ వర్గపోరు రాజుకుం టోంది. ఎవరికి వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో ఫిర్యాదులు ఢిల్లీ చేరుతున్నాయి. తంగబాలు వర్గం తీరుపై అధిష్టానం చెంతకు ఫిర్యాదు చేరడంతో కొరడా ఝుళిపించేందుకు టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞానదేశికన్ సిద్ధం అవుతున్నారు. సాక్షి, చెన్నై: రాష్ట్ర కాంగ్రెస్‌లో గ్రూపులకు కొదవ లేదు. ఇందులో ప్రధాన గ్రూపులుగా కేంద్ర నౌకాయూన శాఖ మంత్రి జికే వాసన్, కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం వర్గాలు ఉన్నాయి. మాజీ అధ్యక్షుడు తంగబాలు, కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత ఈవీకేఎస్ ఇళంగోవన్, కేంద్ర మాజీ మంత్రి జయంతి నటరాజన్, రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడు కృష్ణ స్వామి గ్రూపులు ఆ తర్వాత కోవకు చెందుతాయి. కేంద్రంలో చక్రం తిప్పే స్థాయి నాయకులు పలువురు తమదైన శైలిలో గ్రూపు రాజకీయాలు సాగిస్తున్నారు. ఈ రాజకీయాల కారణంగా రాష్ట్ర పార్టీ కార్యవర్గం, జిల్లా కార్యవర్గాల ఎంపికకు పన్నెండేళ్లు పట్టింది. గ్రూపు నేతలందరూ తాము సమైక్యంగా ఉన్నామని అధిష్టానానికి చాటుకోవాల్సి వచ్చింది. దీంతో ఈ నెల రెండో వారంలో రాష్ట్ర, జిల్లా కార్యవర్గాల పదవుల్ని భర్తీ చేస్తూ, ఏఐసీసీ చిట్టా విడుదల చేసింది. దీంతో మళ్లీ గ్రూపు రాజకీయాలు తెరపైకి వస్తున్నాయి. రాష్ట్రంలో అత్యధిక శాతం మద్దతుదారుల్ని కల్గిన వాసన్ వర్గం రాష్ట్ర, జిల్లా స్థాయిలో కీలక పదవుల్ని ఎక్కువ శాతం తన్నుకెళ్లింది. ఆ తర్వాతి స్థానంలో చిదంబరం వర్గం నిలిచింది. తమకు అన్యాయం జరిగిదంటూ చిదంబరం వర్గం లోలోపల ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, తంగబాలు వర్గం మాత్రం ఎదురు దాడికి సిద్ధం అయింది. ఎదురు దాడి: రెండు రోజుల క్రితం సత్యమూర్తి భవన్లో కొత్త కార్యవర్గం పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో జికే వాసన్ వర్గం పెద్ద సంఖ్యలో పాల్గొనగా, తక్కిన గ్రూపుల వారు అంతంత మాత్రంగానే వచ్చారు. ఇందులో తంగబాలు వర్గానికి చెందిన తొమ్మిది జిల్లాల అధ్యక్షులతో పాటుగా పదమూడు మంది టీఎన్సీసీపై తిరుగు బాటు చేశారు. తమను అవమాన పరుస్తున్నారంటూ ఆ పరిచయ కార్యక్రమాన్ని వాకౌట్ చేయడం వివాదానికి దారి తీసింది. బహిరంగంగా పార్టీపై, పార్టీ అధ్యక్షుడు జ్ఞాన దేశికన్పై తంగబాలు వర్గం మాటల దాడికి దిగడాన్ని వాసన్ వర్గం తీవ్రంగా పరిగణించింది. ఇతర గ్రూపులు తమతో ఢీకి సిద్ధం కావొచ్చన్న సంకేతాలతో వాసన్ వర్గానికి చెందిన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జ్ఞాన దేశికన్ మేల్కొన్నారు. ఇక మీదట ఏ ఒక్కరూ వేలు ఎత్తి చూపని విధంగా, ఆదిలోనే చెక్ పెట్టడం లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఢిల్లీకి పంచారుుతీ: తంగబాలు వర్గం వ్యవహరిస్తున్న తీరుపై పంచారుుతీ ఢిల్లీకి చేరింది. రాష్ట్ర పార్టీని ధిక్కరించే విధంగా ఆ వర్గానికి చెందిన జిల్లా కార్యదర్శులు, ఇతర పదవుల్లో ఉన్న వాళ్లు దూసుకెళుతుండటంతో వారిపై కొరడా ఝుళిపించాలని అధిష్టానానికి జ్ఞాన దేశికన్ విజ్ఞప్తి చేశారు. తిరుగుబాటు ధోరణితో వ్యవహరించిన ఆ నాయకుల పదవుల్ని ఊడ గొట్టేందుకు సిద్ధం అవుతుండటంతో రాష్ట్ర కాంగ్రెస్‌లో చర్చకు దారి తీస్తున్నది. అధ్యక్షుడిని ధిక్కరించడం ఎంత వరకు సబబు? అన్న నినాదంతో వారి స్థానంలో కొత్త వాళ్లను చేర్చడం లక్ష్యంగా ఢిల్లీలో వాసన్ వర్గం పావులు కదుపుతోంది. ఇక, తాము తక్కువ తిన్నామా..? అన్నట్టు తంగబాలు వర్గం సైతం ఢిల్లీకి ఫిర్యాదులు చేసే పనిలో పడింది. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ గ్రూపు రాజకీయాల పంచారుుతీ ఢిల్లీకి చేరడంతో అధిష్టానం తలలు పట్టుకుంటున్నట్టు సమాచారం. ఎన్నికల వేళ ఓ గ్రూపు వివాదానికి ఆజ్యం పోయడంతో మున్ముందు మరెన్ని గ్రూపులు రాజుకుంటాయోనన్న బెంగ ఏఐసీసీ వర్గాల్ని వేధిస్తోంది. -
పాపమంతా ప్రభుత్వానిదే: దువ్వూరి
ముంబై: మరో వారం రోజుల్లో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ)గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ప్రభుత్వంపైనా, ఆర్థిక మంత్రి పీ చిదంబరంపైనా తన విమర్శనాస్త్రాలకు మరింత పదును పెంచారు. వృద్ధిని పణంగా పెట్టి మరీ కఠిన పరపతి విధానాన్ని పాటిస్తున్నారంటూ ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్న ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. ప్రస్తుత ఆర్థిక కష్టాలకు ప్రభుత్వం అసంబద్ధ ఆర్థిక విధానాలే కారణమని విమర్శించారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రకటనల వల్లే రూపాయి కుప్పకూలిందంటూ తప్పంతా ఫెడ్‌పై నెట్టేసేందుకు ప్రయత్నిస్తే తప్పుదారి పట్టించినట్లే అవుతుందన్నారు. దేశీయంగా వ్యవస్థాగత అంశాలే రూపాయి క్షీణతకు మూలకారణమని దువ్వూరి చెప్పారు. ఉద్దీపన ప్యాకేజీలు ఉపసంహరిస్తామన్న ఫెడ్ ప్రకటనలు దీనికి మరింత ఆజ్యం మాత్రమే పోశాయన్నారు. ‘సమస్యలకు మూలకారణం దేశీయంగా వ్యవస్థాగత అంశాలే అన్న విషయాన్ని అంగీకరించలేకపోతే.. వ్యాధి నిర్థారణలోను, చికిత్సలోను మనం ఘోరంగా విఫలమవుతాం’ అని దువ్వూరి వ్యాఖ్యానించారు. వృద్ధి గురించి ఆలోచించే కఠిన వైఖరి..: వృద్ధిని గురించి ఆలోచించబట్టే కఠిన పరపతి విధానం పాటించాల్సి వచ్చిందని దువ్వూరి చెప్పారు. అధిక వడ్డీ రేట్ల వల్ల వృద్ధి కాస్త మందగించినా.. అది స్వల్పకాలికమేనన్నారు. వృద్ధి మందగించడానికి ఆర్బీఐ కఠిన పరపతి విధానం కొంత వరకూ కారణం కావొచ్చని.. అయితే..సరఫరా తరఫు సమస్యలు, గవర్నెన్స్ అంశాలే ఇందుకు ప్రధాన కార ణమన్నారు. ఇవి ఆర్బీఐ పరిధిలో లేని అంశాలని దువ్వూరి చెప్పారు. 2009-12 మధ్య ప్రభుత్వం అనుసరించిన అస్తవ్యస్త ఆర్థిక విధానాలే వృద్ధి మందగమనం, అధిక ద్రవ్యోల్బణానికి దారి తీశాయన్న దువ్వూరి.. సర్కారు ద్రవ్య స్థిరీకరణ వేగంగా చేయగలిగి ఉంటే, పరపతి విధానాన్ని కఠినతరం చేయాల్సిన అవసరం వచ్చేది కాదన్నారు. క్యాడ్ కట్టడి చేస్తేనే రూపాయి చక్కబడేది.. కరెంటు ఖాతా లోటు(క్యాడ్) అదుపుచేయలేని స్థాయికి పెరిగిపోవడమే రూపాయి భారీగా పతనమవడానికి మూలకారణమని దువ్వూరి చెప్పారు. దీన్ని అదుపు చేయగలిగితే పరిస్థితి చక్కబడుతుందన్నారు. అయితే, ఇది ప్రభుత్వం తరఫునుంచి వ్యవస్థాగతమైన చర్యలతో జరగాల్సిందే తప్ప ఆర్బీఐ చేయగలిగేదేమీ లేదన్నారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఆల్‌టైమ్ కనిష్టమైన 68.80ని తాకడం, జీడీపీలో క్యాడ్ 4.8 శాతానికి ఎగియడం తెలిసిందే. రూపాయి హెచ్చుతగ్గులను కట్టడి చేసేందుకు తీసుకున్న చర్యలు గందరగోళపర్చాయన్న విమర్శలపై స్పందిస్తూ.. ఆర్బీఐ తన చర్యల హేతుబద్ధతను మరింత సమర్ధంగా తెలియజేసి ఉండాల్సిందని దువ్వూరి అభిప్రాయపడ్డారు. పెట్టుబడులపై ఆంక్షలు విధించడం ఆర్బీఐ అభిమతం కాదన్నారు. చిదంబరంపైనా విసుర్లు.. ఇటీవల అనేకసార్లు ఆర్బీఐని ప్రభావితం చేసేందుకు ప్రయత్నించిన ఆర్థికమంత్రి చిదంబరంపైనా దువ్వూరి ఈసారి నేరుగా వ్యాఖ్యలకు దిగారు. ఆర్బీఐ ఉండటం వల్లే దేశం కాస్త బతికి బట్టకట్టిందని చిదంబరం స్వయంగా అనే రోజు ఏదో ఒకనాడు వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా జర్మనీ మాజీ చాన్సలర్ గెరార్డ్ ష్రోడర్‌ని దువ్వూరి ఉటంకించారు. ‘బుండెస్‌బ్యాంక్ (జర్మనీ సెంట్రల్ బ్యాంక్) పనితీరు నాకు విసుగు తెప్పించింది. కానీ దేవుడి దయవల్ల అది ఉండటం మంచిదే అయ్యింది’ అని గెరార్డ్ అప్పట్లో వ్యాఖ్యానించారని సుబ్బారావు చెప్పారు. అదే విధంగా ఏదో ఒక రోజు చిదంబరం సైతం ‘నేను కూడా మా రిజర్వ్ బ్యాంక్‌తో విసుగెత్తిపోయాను.. ఎంతగా విసుగెత్తిపోయానంటే .. అవసరమైతే ఒంటరిగానే పోరాటం చేయాలనుకున్నాను. కానీ దేవుడి దయవల్ల రిజర్వ్ బ్యాంక్ అనేది ఒకటి ఉండటం మంచిదైంది’ అని అంటారని ఆశిస్తున్నట్లు సుబ్బారావు వ్యాఖ్యానించారు. చిదంబరానికి, దువ్వూరికి మధ్య ఉన్న బహిరంగ వైరం తెలిసిందే. వృద్ధికి ఊతమిచ్చేలా వడ్డీ రేట్లను తగ్గించాలంటూ చిదంబరం అనేకసార్లు సూచనప్రాయంగా చెప్పినప్పటికీ ద్రవ్యోల్బణ కట్టడి లక్ష్యంతో దువ్వూరి పట్టించుకోలేదు. దీంతో నిస్పృహకు లోనైన చిదంబరం వృద్ధిని మెరుగుపర్చేందుకు అవసరమైతే ఒంటరిగానైనా ప్రభుత్వం పోరాడుతుందంటూ గత అక్టోబర్‌లో నిర్వేదం వ్యక్తం చేశారు. నేను చెప్పిందీ అదే: చిదంబరం ఆర్థిక సమస్యలకి ప్రభుత్వమే కారణంటూ దువ్వూరి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన చిదంబరం.. తాను రెండు రోజుల క్రితం చెప్పినదాన్నే ఆయనా చెప్పారన్నారు. ‘నేను మొన్న పార్లమెంటులోనూ ఇదే విషయాన్ని చెప్పాను’ అని ఆయన విలేకరులతో తెలిపారు. అంతర్జాతీయ పరిణామాలే కాకుండా దేశీయంగా అంతర్గత అంశాలు కూడా ఆర్థిక కష్టాలకు కారణమయ్యాయని చిదంబరం మంగళవారం పార్లమెంటులో చెప్పారు. 2009-11 మధ్య (ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు) తీసుకున్న నిర్ణయాల వల్లే ద్రవ్య లోటు, కరెంటు ఖాతా లోటు పెరిగాయని వ్యాఖ్యానించారు. -
మరిన్ని సంస్కరణలే మందు
న్యూఢిల్లీ: రూపాయి విలువ అడ్డూ అదుపూలేకుండా పడిపోయి.. ఇప్పుడు 66 స్థాయి దిగువకు సైతం కుప్పకూలడంతో ప్రభుత్వం దిక్కుతోచని పరిస్థితుల్లో చిక్కుకుంది. ఆర్థిక వ్యవస్థ దీనావస్థపై అన్నివైపుల నుంచి విమర్శలు పోటెత్తడంతో... మరిన్ని సంస్కరణలను ప్రవేశపెట్టడం ఒక్కటే దీనికి పరిష్కారమార్గమని ఆర్థిక మంత్రి చిదంబరం పేర్కొన్నారు. బొగ్గు, ఇనుప ఖనిజం రంగాల్లో నెలకొన్న అనిశ్చితి, స్తబ్దత తొలగితేనే వృద్ధికి ఊతం లభిస్తుందని తేల్చిచెప్పారు. మంగళవారం లోక్‌సభలో దేశ ఆర్థిక పరిస్థితిపై జరిగిన చర్చకు సమాధానంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అనుసరిస్తున్న అధ్వాన, చెత్త విధానాలవల్లే ఆర్థిక వ్యవస్థ మంటగలుస్తోందని, యూపీఏ ప్రభుత్వాన్ని అధికారం నుంచి దింపేస్తేకానీ పరిస్థితులు మెరుగుపడవంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. కాగా, మందగమనంలోఉన్న ఆర్థిక వ్యవస్థను మళ్లీ 8 శాతం వృద్ధికి మళ్లించాలంటే తయారీ రంగం, ఎగుమతులకు చేయూతవంటి 10 ప్రధాన చర్యలను చిదంబరం ప్రస్తావించారు. ‘మనకు ఇప్పుడు తక్కువ నియంత్రణలు, మరిన్ని సంస్కరణల ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆర్థిక వ్యవస్థను మరింత సరళీకరించి, విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరిస్తేనే గడ్డుపరిస్థితుల నుంచి గట్టెక్కగలం’ అని పేర్కొన్నారు. కరెన్సీ మహా పతనంపై... దేశీ కరెన్సీ విలువ ఉండాల్సిన దానికంటే మరీ తక్కువగా(అండర్వేల్యూడ్) ఉందని ఆర్థిక మంత్రి చిదంబరం వ్యాఖ్యానించారు. ‘వాస్తవ విలువకంటే ప్రస్తుతం రూపాయి మరీ ఘోరంగా పతనమైంది. అయితే, ఇన్వెస్టర్లలో సెంటిమెంట్‌ను మెరుగుపరిచేందుకు, అదేవిధంగా రూపాయి బలోపేతానికి సంబంధించి ప్రభుత్వం అవసరమైన చర్యలన్నీ తీసుకుంటుందని హామీఇస్తున్నా. అయితే, కొంత ఓపికతో ముందుకెళ్లాల్సి ఉంటుంది. ముందుగా ఆర్థిక వ్యవస్థ మూలాలను మరింత పటిష్టంచేసేవిధంగా విస్తృతస్థాయిలో చర్యలపై దృష్టిపెడుతున్నాం. తగినస్థాయికి రూపాయి తిరిగికోలుకుంటుందనే విశ్వాసం ఉంది’ అని రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా చిదంబరం వివరణ ఇచ్చారు. అంతకుముందు విలేకరులతో మాట్లాడుతూ... వర్థమాన దేశాలన్నీ ప్రస్తుతం ఇదేవిధమైన కరెన్సీ పతన, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నాయన్నారు. సోమవారం డాలరుతో రూపాయి మారకం విలువ కొత్త చరిత్రాత్మక కనిష్టం వద్ద(66.24)కు జారిపోవడం... సెన్సెక్స్ 600 పాయింట్లు కుప్పకూలిన నేపథ్యంలో చిదంబరం ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, విదేశీ నిధుల సమీకరణకు సావరీన్ బాండ్ల జారీ వంటి అంశాలపై అడిగిన ప్రశ్నలకు... అన్ని అవకాశాలనూ పరిశీలిస్తున్నామని, సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఉద్దీపనలు కూడా ముంచాయ్... 2008 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడం కోసం అప్పట్లో ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలు కూడా తాజా సమస్యలకు కారణమని చెప్పారు. ద్రవ్యలోటు, కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్-మూలధన పెట్టుబడులు మినహా దేశంలోకి వచ్చే, బయటికిపోయే విదేశీ మారకం నిధుల మధ్య వ్యత్యాసం)లు ఎగబాకేందుకు ఆజ్యంపోశాయన్నారు. ఆహార భద్రత చట్టాన్ని, ఇతర సబ్సిడీలన్నింటినీ అమలు చేసిన తర్వాత కూడా ఈ ఏడాది ద్రవ్యలోటును జీడీపీతో పోలిస్తే 4.8 శాతానికి కట్టడి చేయగలమన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ ఏడాది బడ్జెట్లో మొత్తం ఆహార సబ్సిడీ కేటాయింపులు రూ.90 వేల కోట్లు కాగా, ఆహార భద్రత చట్టం అమలుకు రూ.10 వేల కోట్లను వెచ్చించనున్నట్లు వెల్లడించారు. 70 బిలియన్ డాలర్లకు క్యాడ్ కట్టడి... పెట్టుబడులు, తయారీ రంగం పుంజుకుంటే ఆర్థిక వ్యవస్థకు గడ్డుపరిస్థితులు తొలగుతాయని. క్యాడ్కూ కళ్లెం పడుతుందని చిదంబరం వివరించారు. ప్రస్తుత 2013-14 ఏడాదిలో క్యాడ్‌ను జీడీపీతో పోలిస్తే 3.7 శాతానికి(70 బిలియన్ డాలర్లు) కట్టడి చేయగలమన్న విశ్వాసం వ్యక్తం చేశారు. గతేడాది క్యాడ్ చరిత్రాత్మక గరిష్టానికి(4.8%-88.2 బిలియన్ డాలర్లు) ఎగబాకడం తెలిసిందే. ఇక ఆర్బీఐ విషయానికొస్తే.. కేంద్ర బ్యాంకులేవైనా సరే వృద్ధికి, ఉద్యోగకల్పనకు పోత్సాహం ఇచ్చేవిధంగా విధాన నిర్ణయాలను తీసుకోవాలని మరోసారి నొక్కివక్కానించారు. రూ. 1.83 లక్షల కోట్ల ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ పెట్టుబడులకు ఊతమిచ్చే దిశగా దాదాపు రూ. 1.83 లక్షల కోట్ల విలువ చేసే ఇన్ఫ్రా ప్రాజెక్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చిదంబరం తెలిపారు. పెట్టుబడుల క్యాబినెట్ కమిటీ (సీసీఐ) తాజా భేటీలో ఈ మేరకు ఆమోదముద్ర వేసినట్లు వివరించారు. క్లియరెన్స్ లభించిన ప్రాజెక్టుల్లో 18 విద్యుత్ ప్రాజెక్టులు.. అదే సంఖ్యలో రోడ్, రైల్వే, పెట్రోలియం ప్రాజెక్టులు ఉన్నట్లు విలేకరులకు చిదంబరం చెప్పారు. ఒడిశాలో జీఎంఆర్‌కి చెందిన 1,400 మెగావాట్ల కమలాంగా, ల్యాంకో నిర్మిస్తున్న బదాంధ్ పవర్ ప్లాంట్లతో పాటు మరికొన్ని ప్రాజెక్టులకు బొగ్గు సరఫరాకు అడ్డంకులు తొలగినట్లేనని వివరించారు. వచ్చే నెల 6లోగా ఆయా సంస్థలు కోల్ ఇండియాతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని మంత్రి తెలిపారు. ఇక హైదరాబాద్‌లో ఎల్అండ్టీ మెట్రో రైల్ ప్రాజెక్టు, జార్ఖండ్‌లో ఎస్సార్ పవర్ ప్రాజెక్టు మొదలైన వాటికి కూడా ఆటంకాలు తొలగినట్లేనని ఆయన చెప్పారు. -
అమెరికా డేటాపై అతి స్పందన
న్యూఢిల్లీ: అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం వల్లే దేశీ మార్కెట్లు శుక్రవారం భారీగా పతనమయ్యాయని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం చెప్పారు. అమెరికాలో డేటాపై దేశీ మార్కెట్లు మరీ అంతగా స్పందించాల్సిన అవసరం లేదని, దేశీ పరిస్థితులకు అనుగుణంగా వర్తించాలని ఆర్థిక మంత్రి పి. చిదంబరం వ్యాఖ్యానించారు. మార్కెట్లో ప్రశాంత వాతావరణం నెలకొన్న అనంతరం ఇన్వెస్టర్లు ఈ విషయాన్ని గుర్తించగలరనడంలో తనకెలాంటి సందేహమూ లేదన్నారు. ‘ఇది ప్రశాంత ంగా ఉండాల్సిన తరుణం. ఇప్పటిదాకా ఏం చేశామో ఒకసారి మననం చేసుకోవాలి. వచ్చే వారం ఎలా ఉంటుందో చూడాలి’ అని చిదంబరం చెప్పారు. జాతీయ నైపుణ్య సర్టిఫికేషన్ పథకం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. బుధవారం నుంచి శుక్రవారం ఉదయం దాకా భారత ఎకానమీలో ఎలాంటి పెనుమార్పులు లేకపోయినప్పటికీ.. మార్కెట్లు ప్రతికూలంగా స్పందించాయని, దాని ప్రభావం రూపాయిపై కూడా కనిపించిందని వివరించారు. పరిస్థితులు చక్కబడేందుకు ఇప్పటిదాకా అనేక చర్యలు తీసుకున్నామని, ఇంకా అనేకం తీసుకుంటూనే ఉన్నామని చిదంబరం పేర్కొన్నారు. తొలి త్రైమాసిక వృద్ధి రేటు ఎలా ఉందో చూసిన తర్వాత మరిన్ని నిర్ణయాలు తీసుకోవచ్చన్నారు. ఫండమెంటల్స్ మారిపోవు.. అమెరికాలో ఉద్యోగకల్పన గణాంకాల వల్ల భారత్ ఎకానమీ ఫండమెంటల్స్ ఒక్కసారిగా ఎలా మారిపోతాయని చిదంబరం ప్రశ్నించారు. అమెరికాలో ఉద్యోగాలు పెరిగినా, తగ్గినా దేశీ ఆర్థిక వ్యవస్థకు సంబంధం లేని అంశమన్నారు. అయినా సరే మార్కెట్లు మాత్రం అమెరికా నుంచి ఎలాంటి సంకేతాలు వచ్చినా స్పందించేస్తుంటాయని చిదంబరం చెప్పారు. ఇలాంటివి చూస్తుంటే అసలెందుకు రియాక్ట్ అయ్యాయన్న దానిపై కొన్ని సార్లు తనకే ఆశ్చర్యం వేస్తుంటుందని ఆయన పేర్కొన్నారు. గురువారం సెలవు కావడంతో రెండు రోజులు జరగాల్సిన పతనం ఒకే రోజున జరగడంతో ప్రభావం చాలా తీవ్రంగా ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. -
సేవా పన్ను ఎగవేతలపై కేంద్రం కొర డా
న్యూఢిల్లీ/కోల్‌కతా: సేవా పన్ను ఎగవేతదారులపై కేంద్ర ప్రభుత్వం కొరఢా ఝుళిపిస్తోంది. కోల్‌కతాకు చెందిన ఒక కొరియర్ కంపెనీ యజమానిని దాదాపు రూ.70 లక్షల పన్ను ఎగవేశారనే ఆరోపణలతో అరెస్ట్ చేశారు. ఇటువంటి కేసుల్లో కఠిన చర్యలకు అధికారాలు ఇస్తూ చట్టాల్లో సవరణ తీసుకొచ్చిన తర్వాత దేశంలో జరిగిన తొలి అరెస్ట్ ఇదే కావడం గమనార్హం. ప్రస్తుతం పలు రకాల సేవలపై 12.36 శాతం సేవా పన్ను అమలవుతోంది. కేసు పూర్వాపరాలివీ...: బ్లూబర్డ్ పేరుతో కోల్‌కతాలో కొరియర్ ఏజెన్సీని నిర్వహిస్తున్న సుదీప్ దాస్.. పలు కంపెనీల నుంచి రూ.67 లక్షల మేరకు పన్ను వసూలు చేశారు. అయితే, దీన్ని ప్రభుత్వానికి చెల్లించకపోవడంతో గతవారంలో ఆయనను అరెస్ట్ చేసినట్లు అధికారిక వర్గాలు సోమవారం వెల్లడించాయి. ఈ మేరకు కోల్‌కతాలోని సేవా పన్నుల కమిషనర్ కేకే జైస్వాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న దాస్‌కు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీచేసిందని తెలిపారు. సేవా పన్ను ఎగవేతలకు అడ్డుకట్టవేయడం కోసం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(సీఆర్పీసీ)లో నిబంధనల మార్పులకు ఆర్థిక మంత్రి పి. చిదంబరం చర్యలు తీసుకోవడం తెలిసిందే. ఈ ఏడాది ఫైనాన్స్బిల్లులో ఈ మేరకు సెక్షన్ 91లో కొత్త నిబంధనను చేర్చి ఆమోదింపజేశారు. దీనిప్రకారం సెంట్రల్ ఎక్సైజ్ పన్నుల విభాగానికి చెందిన అధికారులకు(సూపరింటెండెంట్ స్థాయికి తక్కువ కాకూడదు) సేవా పన్ను ఎగవేతదారుడిని అరెస్ట్ చేసే అధికారం లభించింది. కస్టమ్స్, ఎక్సైజ్ పన్నుల ఎగవేతలకు ఇప్పటికే సీఆర్పీసీ ప్రకారం ఈ కఠిన చర్యలు అమలవుతున్నాయి. ఇప్పుడు సేవా పన్నులకూ ఇది వర్తిస్తుంది. రూ.50 లక్షలు అంతకుమించి సేవాపన్నును ఎగవేస్తే అది శిక్షార్హమైన నేరం కిందికి వస్తుంది. ఈ కేసుల్లో ఎగవేతదారుడికి ఏడేళ్లదాకా జైలు శిక్ష పడొచ్చు.