చిదంబరం రూటెటు! | Chidambaram to avoid populist announcements in interim budget | Sakshi
Sakshi News home page

చిదంబరం రూటెటు!

Published Mon, Feb 17 2014 12:50 AM | Last Updated on Sat, Sep 2 2017 3:46 AM

చిదంబరం రూటెటు!

చిదంబరం రూటెటు!

ఎన్నికల ముందు వరాలు కురిపిస్తారా?
 కీలక ప్రకటనలేవీ ఉండకపోవచ్చంటున్న విశ్లేషకులు  ద్రవ్యలోటు అదుపునకు కట్టుబడే అవకాశం...
 పరిశ్రమలు, సామాన్యులకు కొంత ఊరట కల్పించొచ్చని అంచనా  ఎక్సైజ్ సుంకం, సేవా పన్నుల్లో తగ్గింపునకు చాన్స్
 లోక్‌సభ ఎన్నికల ముంగిట.. యూపీఏ ప్రభుత్వం చివరి బడ్జెట్ అస్త్రాన్ని సంధించేందుకు సిద్ధమవుతోంది. పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి పి. చిదంబరం నేడు 2014-15 ఏడాదికిగాను మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికల్లో ప్రజలను ఆకర్షించేందుకు వరాలేమైనా కురిపిస్తారా? లేదంటే ద్రవ్యలోటు అదుపుతప్పకుండా చూస్తామన్న మాటకు కట్టుబడతారా అనేది ఆసక్తికరంగా మారింది. అసలే కుంభకోణాలు, ఆర్థిక వ్యవస్థ మందగమనం ఇతరత్రా ఎడాపెడా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న యూపీఏ సర్కారు బడ్జెట్‌ను ఎన్నికల కోణంలోనే ఆవిష్కరించే అవకాశాలూ లేకపోలేదు.

 సంక్షేమ పథకాలకు భారీగానే నిధులను కుమ్మరించే ఆస్కారం ఉంది. అయితే, ఇది కేవలం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కావడంతో కీలక పాలసీ నిర్ణయాలకు ఆస్కారం తక్కువే. దీంతో నేరుగా ప్రజలకు లబ్ధిచేకూర్చే కొన్ని వరాలు, ఇబ్బందుల్లో ఉన్న పారిశ్రామిక రంగానికి చేయూతనిచ్చేలా ప్రోత్సాహకాలు మాత్రమే ఉండొచ్చనే అంచనాలు ఎక్కువగా వినబడుతున్నాయి. జనరంజక బడ్జెట్‌లను ప్రవేశపెట్టడంలో దిట్టగా పేరొందిన చిదంబరం.. తన ఆఖరి బడ్జెట్ ఇన్నింగ్స్‌లోనూ మెప్పిస్తారా? లేదంటే ఉసూరుమనిపిస్తారా అనేది మరికొద్ది గంటల్లోనే తేలిపోనుంది.
 
 న్యూఢిల్లీ: మధ్యంతర బడ్జెట్‌లో కీలకమైన పాలసీ నిర్ణయాలు, చర్యలను ఆశించనక్కర్లేదని ఎక్కువమంది విశ్లేషకులు, నిపుణులు చెబుతున్నారు. నేడు(సోమవారం)  విత్తమంత్రి చిదంబరం... జూలై వరకూ ప్రభుత్వ వ్యయాలకు సంబంధించి పార్లమెంట్ అనుమతి కోరుతూ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. గత సంప్రదాయాల ప్రకారం చూస్తే.. మధ్యంతర బడ్జెట్‌లో ప్రత్యక్షపన్నుల్లో(ఆదాయపు పన్ను ఇతరత్రా) మార్పుచేర్పులు, విధానపరమైన ప్రకటనలేవీ ఉండే అవకాశం లేదు. కొన్ని ప్రోత్సాహాలు మినహా ద్రవ్యలోటు కట్టడి లక్ష్యానికే చిదంబరం ప్రాధాన్యం ఇవ్వొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.

 అయితే, సామాన్యులకు, ఆర్థిక వ్యవస్థకు చేయూతనిచ్చేలా కొన్ని ఊరట చర్యలు ఖాయమంటున్నారు. ఎక్సైజ్ సుంకం, సేవా పన్నులను సమీక్షించనున్నట్లు ఇప్పటికే చిదంబరం సంకేతాలివ్వడం తెలిసిందే. ప్రధానంగా ఆర్థిక మందగమనం నేపథ్యంలో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న పారిశ్రామిక రంగాలు ఈ ప్రోత్సాహకాలను డిమాండ్ చేస్తుండటమే దీనికి కారణం. అయితే, ఇప్పుడు సుంకాలు, పన్నుల్లో చేసే మార్పులను... ఎన్నికల తర్వాత  కొత్త ప్రభుత్వం జూన్/జూలైలో ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్‌లో మళ్లీ మార్చే అవకాశాలుం టాయి. దీంతో కార్పొరేట్లు, స్టాక్ మార్కెట్లు మధ్యం తర బడ్జెట్‌లో చర్యలను అంతగా పట్టించుకోకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 సంస్కరణలకు నో చాన్స్...
 కీలకమైన సంస్కరణల విషయంలో రాజకీయంగా ఏకాభిప్రాయం లేనందున వీటి జోలికి ప్రభుత్వం ఇక వెళ్లనట్టే. ప్రధానంగా వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ), ప్రత్యక్ష పన్నుల కోడ్(డీటీసీ), బీమాలో విదేశీ ప్రత్యక్ష పన్నుల(ఎఫ్‌డీఐ) పెంపునకు సంబంధించిన బిల్లులను ప్రస్తుత యూపీఏ-2 సర్కారు ఇక పక్కనబెట్టేయనుంది. ‘ఆదాయపు పన్ను, కస్టమ్స్, ఎక్సైజ్ చట్టాల్లో సవరణలను ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో తీసుకొచ్చే అవకాశాల్లేవు. అయితే, చట్టసవరణలు అవసరం లేని ప్రతిపాదనలకు ప్రాధాన్యం ఉంటుంది. భవిష్యత్ దృక్కోణంతోనే ఎలాంటి చర్యలైనా చేపడతాం’ అని చిదంబరం ఇటీవలే వ్యాఖ్యానించారు.

 ఓటాన్ అకౌంట్ అంటే...
 సాధారణంగా లోక్‌సభ ఎన్నికల సంవత్సరంలో ప్రభుత్వం ప్రవేశపెట్టే మధ్యంతర బడ్జెట్‌నే ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌గా వ్యవహరిస్తారు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్-మే నెలల్లో జరగనున్నాయి. కొత్త ప్రభుత్వం జూన్ లేదా జూలైలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగుస్తుంది. ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఖర్చులు(వేతనాలు, నిర్వహణపరమైన ఖర్చులు, సంక్షేమ పథకాలకు వ్యయం ఇతరత్రా) యథాతథంగా కొనసాగాలంటే నిధుల కేటాయింపులకు పార్లమెంట్ ఆమోదం తప్పనిసరి. దీంతో వీటికి సంబంధించిన జమాఖర్చులతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అంటే 3-4 నెలలకు మాత్రమే ఇది పరిమితమవుతుంది. తదుపరి వచ్చే కొత్త ప్రభుత్వం 2014-15 మొత్తం ఆర్థిక సంవత్సరానికి పూర్థిస్థాయిలో బడ్జెట్‌ను తీసుకొస్తుంది.
 
 
    ‘సూపర్ రిచ్’ పన్ను కొనసాగిస్తారా?

 అత్యంత ధనిక(సూపర్ రిచ్) వర్గాలపై గత బడ్జెట్‌లో విధించిన పన్నును కొనసాగిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. దీనికి చట్టసవరణ అవసరం కానుండటమే దీనికి కారణం. చిదంబరం మాటల ప్రకారం చట్టసవరణలేవీ లేకపోతే దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సిందే. రూ. కోటికి మించి ఆదాయం ఆర్జించే సంపన్నులపై 10 శాతం సర్‌ఛార్జీ(సూపర్ రిచ్ ట్యాక్స్)ని విధిస్తూ 2013-14 బడ్జెట్‌లో చిదంబరం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు రూ.42,800 మందిని ఈ పన్ను చట్రంలోకి తీసుకొచ్చారు.
 
 సొంత డబ్బాకే పరిమితమా!
 ఎన్నికలు ముంచుకొస్తుండటంతో ప్రస్తుత యూపీఏ-2 హయాంలో తాము సాధించిన ఘనతలు, చర్యలను ఊదరగొట్టేందుకు బడ్జెట్ ప్రసంగంలో చిదంబరం ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అవకాశాలున్నాయి. అంతర్జాతీయంగా తీవ్ర ఇబ్బందులు నెలకొన్నప్పటికీ ద్రవ్యలోటు, కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్)ల కట్టడికి తాము తీసుకున్న చర్యలను ప్రధానంగా ప్రస్తావించనున్నారు. అంతేకాకుండా స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) మందగించడానికి కారణాలను, దీన్ని తిరిగి గాడిలోపెట్టేందుకు తాము చేపట్టిన చర్యలను కూడా ఆయన వివరించనున్నారు.

జీడీపీ వృద్ధి రేటు గతేడాది దశాబ్దపు కనిష్టమైన 5 శాతానికి పడిపోగా... ఈ ఏడాది 4.9 శాతానికి పరిమితమవుతుందని ముందస్తు అంచనా. కాగా, ప్రస్తుత 2013-14లో ద్రవ్యలోటును జీడీపీలో 4.8 శాతానికి కట్టడి చేస్తామని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా 2జీ స్పెక్ట్రం వేలం విజయంతో నిధులు భారీగానే(మార్చిలోగా కనీసం రూ.20 వేల కోట్లు ఖజానాకు వస్తాయని అంచనా) రానుండటంతో ద్రవ్యలోటు లక్ష్యానికి లోబడే ఉండొచ్చని భావిస్తున్నారు. ఇక క్యాడ్ గత ఆర్థిక సంవత్సరంలో చరిత్రాత్మక గరిష్టానికి(జీడీపీలో 4.8%) ఎగబాకగా..  ఈ ఏడాది 2.5 శాతానికిలోపే పరిమితం కానుంది.
 
 బడ్జెట్‌పై ఇన్వెస్టర్ల చూపు
 
 ఆర్థిక మంత్రి చిదంబరం ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్‌పై ఇన్వెస్టర్లు దృష్టి సారిస్తారని స్టాక్ నిపుణులు పేర్కొన్నారు. సోమవారం ప్రకటించనున్న ఓటాన్ అకౌంట్ స్వల్ప కాలానికి మార్కెట్ల ట్రెం డ్‌ను నిర్దేశిస్తుందని అంచనా వేశారు. దీంతోపాటు డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐలు) పెట్టుబడులు కీలకంగా నిలవనున్నాయని చెప్పారు.

ఇక అంతర్జాతీయ సంకేతాలకూ ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. రానున్న రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలకు తెరలేవనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటాన్ అకౌంట్‌ను మార్కెట్లు క్షుణ్ణంగా పరిశీలిస్తాయని కొటక్ సెక్యూరిటీస్ ప్రైవేట్ క్లయింట్ గ్రూప్ రీసెర్చ్ హెడ్ దీపేన్ షా పేర్కొన్నారు. ద్రవ్యలోటు, తదితర పరిణామాలపై మార్కెట్లు తమదైన శైలిలో స్పందిస్తాయని విశ్లేషించారు. పరోక్ష పన్నులకు సంబంధించి ఏ రంగానికైనా ప్రోత్సాహకాలను కల్పిస్తే ఆ ప్రభావం మార్కెట్లపై ఉంటుందని వ్యాఖ్యానించారు.

 ద్రవ్యలోటు ఎఫెక్ట్: ద్రవ్యలోటు అంశానికి ఇన్వెస్టర్లు ప్రాధాన్యత ఇస్తారని నిపుణులు పేర్కొన్నారు. వచ్చే ఏడాది(2015)కి ప్రకటించే ద్రవ్యలోటు లక్ష్యం ఆధారంగా ప్రభుత్వ రుణ సమీకరణ కార్యకలాపాలుంటాయని, దీంతో ఈ అంశం కీలకంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. సమీప కాలంలో మార్కెట్లు పెరిగినప్పుడల్లా అమ్మకాలకు తెరలేచే అవకాశమున్నదని వివరించారు. ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీకి 6,100 పాయింట్ల స్థాయి కీలకంకానుందని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ అంచనా వేశారు. ఈ స్థాయికిపైన కొనుగోళ్లు పుంజుకుంటాయని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement