తగ్గనున్న కార్లు, బైకులు, మొబైల్ ఫోన్ల ధరలు
న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రి చిదంబరం సోమవారం లోక్ సభలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ నామ్‌కే వాస్తేగా ఉంది. ఒక్క ఆటో రంగం, ఎలక్ట్రానిక్ గూడ్స్ రంగాలకు కాస్త ఊరటనిచ్చే నిర్ణయాలు తీసుకున్నారు. ఇతరత్రా ఎవరికీ సంతోషం కలిగించే వార్త బడ్జెట్‌లో లేదు. అదే సమయంలో బాధ పెట్టే నిర్ణయం కూడా లేకపోవడమే సంతోషాన్నిచ్చే అంశమే.
కార్లు, బైకులు, స్కూటర్లు, మొబైల్ ఫోన్ల ధరలు తగ్గించే నిర్ణయాలు చిదంబరం ప్రకటించారు. ఇతరత్రా నిర్ణయాలన్నీ కేటాయింపులే. కొన్ని కేటాయింపులు యథాతథంగా ఉండగా, మరికొన్ని రంగాలకు కేటాయింపులు పెంచారు. రక్షణ శాఖ బడ్జెట్‌ను 10 శాతం పెంచారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ప్రత్యేకించి ఎలాంటి కేటాయింపు లేకపోవడం విశేషం. సీమాంధ్రను సంతృప్తి పరిచే నిర్ణయం ఏదైనా ఉంటుందేమోనన్న ఆలోచనను చిదంబరం అసలు పట్టించుకోలేదు.