Interim budget 2014
-
ఎయిర్ ఇండియాకు 5,500 కోట్లు
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరంలో మూలధన పెట్టుబడి కింద రూ.5,500 కోట్లను ఎయిర్ ఇండియా పొందనుంది. ఆర్థిక మంత్రి పి.చిదంబరం సోమవారం పార్లమెంటుకు సమర్పించిన మధ్యంతర బడ్జెట్లో ఈ విషయం వెల్లడించారు. దీంతో పౌర విమానయాన శాఖ ప్రణాళిక కేటాయింపులు రూ.5,720 కోట్లకు చేరాయి. ప్రణాళికేతర వ్యయం రూ.657.98 కోట్లుగా అంచనా. - ఏడు కొత్త విమానాశ్రయాలు నిర్మాణంలో ఉన్నట్టు చిదంబరం చెప్పారు. - ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఎఐ)కు బడ్జెటరీ మద్దతు కింద రూ.74.7 కోట్లు కేటాయించారు. ఇందులో సిక్కింలోని పాక్యోంగ్ పర్వత ప్రాంతంలో రూ.22 కోట్లతో నిర్మిస్తున్న కొత్త విమానాశ్రయం కూడా ఉంది. - శిక్షణ ప్రాజెక్టులు, ఐటీ, ఈ-గవర్నెన్స్ ప్రాజెక్టులతోసహా పలు పథకాలను కొనసాగించేందుకు వీలుగా డెరైక్టరేట్ ఆఫ్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ)కు రూ.50 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. డీజీసీఏ భవన్ నిర్మాణం, సంయుక్త శిక్షణ అకాడెమీ నిర్మాణం కూడా ఇందులో ఉన్నాయి. - బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ కోసం రూ.40 కోట్ల నిధుల కేటాయింపు. - సోనియాగాంధీ నియోజకవర్గమైన రాయబరేలిలోని ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ కోసం రూ.5.10 కోట్లు కేటాయింపు. సీబీఐకి రూ.520 కోట్లు మధ్యంతర బడ్జెట్లో సీబీఐకి ప్రభుత్వం రూ. 520.56కోట్లు కేటాయించింది. ఇది గత ఆర్థికసంవత్సరంతో పోల్చుకుంటే 17 శాతం అధికం. 2013-14 బడ్జెట్లో రూ.443 కోట్లు కేటాయించగా ఈ సారి రూ.520 కోట్లకు పెంచారు. ఈ-గవర్నెన్స్, శిక్షణ కేంద్రాల ఆధునీకరణ, సాంకేతిక, ఫోరెన్సిక్ విభాగాలను పటిష్టం చేసేందుకు సీబీఐ ఈ నిధులను వినియోగించనుంది. -
మాజీ సైనికులకు వరం
* ఇకపై ర్యాంకులవారీగా సమాన పెన్షన్ * చిరకాల డిమాండ్‌కు కేంద్రం అంగీకారం * 30 లక్షల మంది మాజీ సైనికులకు లబ్ధి న్యూఢిల్లీ: ఒక ర్యాంకుకు ఒకే రకమైన పెన్షన్ ఉండాలన్న సాయుధ బలగాల దీర్ఘకాలిక డిమాండ్‌కు కేంద్రం అంగీకారం తెలిపింది. సోమవారం మధ్యంతర బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి చిదంబరం ఈ మేరకు ప్రకటన చేశారు. దీని అమలు కోసం 2014-15లో రూ.500 కోట్లను రక్షణ బడ్జెట్ ఖాతాకు బదిలీ చేస్తున్నట్టు తెలిపారు. దాదాపుగా 30 లక్షల మంది మాజీ సైనికులకు ఈ నిర్ణయంతో లబ్ధి చేకూరనుంది. ఒకే ర్యాంకు, ఒకే సర్వీసున్న మాజీ సైనికులకు వారెప్పుడు రిటైరయ్యారన్న దానితో నిమిత్తం లేకుండా ఇకపై సమాన పెన్షన్ లభించనుంది. 2006కు ముందు రిటైరైన సైనికోద్యోగులకు ఆ తర్వాత రిటైరైన వారితో పోలిస్తే ప్రస్తుతం తక్కువ పెన్షన్ లభిస్తోంది. అది వారికంటే తక్కువ ర్యాంకుతో రిటైరైన వారికిస్తున్న పెన్షన్ కంటే కూడా తక్కువగా ఉంది! ఈ తేడాలను సరిచేస్తూ తీసుకున్న తాజా నిర్ణయం 2014-15 నుంచి అమల్లోకి రానుంది. అయితే ఈ నిర్ణయంపై మాజీ సైనికోద్యోగులు పెదవి విరుస్తున్నారు. పథకాన్ని పూర్తిగా అమలు చేసేందుకు కనీసం రూ.2,500 కోట్లు కావాల్సి ఉంటే రూ.500 కోట్లు ఏ మూలకు చాలతాయని ప్రశ్నిస్తున్నారు. పైగా ఈ నిర్ణయాన్ని 2006 నుంచి వర్తించేలా అమలు చేయకపోవడాన్ని వారు తీవ్రంగా తప్పుబడుతున్నారు. రాహుల్ వల్లే: కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల దృష్టితో తీసుకున్న ఈ నిర్ణయం తాలూకు ఘనతను సబ్సిడీ సిలిండర్ల సంఖ్య పెంపు మాదిరిగానే రాహుల్‌గాంధీకే కట్టబెట్టేలా కాంగ్రెస్ ముందే వ్యూహరచన చేసింది. అందులో భాగంగా ఆయన నోట ముందుగానే ఈ డిమాండ్‌ను విన్పించింది. ఒక ర్యాంకు, ఒకే పెన్షన్ విధానం వీలైనంత త్వరగా అమలయ్యేలా కృషి చేస్తానని ఫిబ్రవరి 14న మాజీ సైనికోద్యోగులకు రాహుల్ హామీ ఇచ్చారు. తర్వాత మూడు రోజులకే చిదంబరం నోట ఆ మేరకు విధాన ప్రకటన వెలువడింది! ఆ వెంటనే సోనియా నివాసం 10, జన్‌పథ్‌లో రాహుల్ విలేకరులతో మాట్లాడారు. ఈ నిర్ణయంపై హర్షం వెలిబుచ్చడంతో పాటు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ఇదో చరిత్రాత్మక నిర్ణయం. దేశం కోసం పోరాడేందుకు నిత్యం సన్నద్ధంగా ఉండే బలగాలకు అన్నిరకాలుగా మద్దతుగా నిలవడం మన కర్తవ్యం’’ అన్నారు. రాహుల్ చొరవ వల్లే ఈ నిర్ణయం వచ్చిందంటూ కేంద్ర మంత్రి రాజీవ్ శుక్లా స్తోత్రపాఠాలు వల్లెవేశారు. గృహావసరాల సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను ఏడాదికి 9 నుంచి 12కు పెంచాల్సిందేనని ఏఐసీసీ సదస్సు వేదికగా గత నెలలో రాహుల్ డిమాండ్ చేయడం, ఆ మేరకు పెంచేస్తున్నామంటూ అదే వేదిక నుంచి పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీ నాటకీయ ఫక్కీలో ప్రకటన చేయడం తెలిసిందే. భారత సైన్యంలో ప్రస్తుతం 14 లక్షల మంది సైనికులున్నారు. రిటైరైన సైనికుల సంఖ్య 24 లక్షలు. హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, హర్యానాల్లో వీరిది బలమైన ఓటు బ్యాంకు కావడం లోక్‌సభ ఎన్నికల్లో ఆయా చోట్ల తనకు కలిసొస్తుందన్నది కాంగ్రెస్ అంచనా. ‘రక్షణ’పై శీతకన్నే న్యూఢిల్లీ: 2014-15 మధ్యంతర బడ్జెట్లో రక్షణ శాఖకు కేటాయింపులు 10 శాతం పెరిగాయి. గతేడాది రూ.2.03 లక్షల కోట్లున్న కేటాయింపులను తాజాగా రూ.2.24 లక్షల కోట్లకు చిదంబరం పెంచారు. అయితే బలగాల ఆధునికీకరణలో భాగంగా తెర తీసిన పలు ఆయుధ సేకరణ ఒప్పందాలు కొలిక్కి వస్తున్న తరుణంలో ఈ మొత్తం ఏ మేరకు చాలుతుందన్నది సందేహమే. పైగా ఆధునికీకరణ కోసం అదనంగా రూ.40 వేల కోట్లు కేటాయించాలన్న రక్షణ శాఖ విజ్ఞప్తిని గతేడాదిలాగే ఈసారీ చిదంబరం తోసిపుచ్చారు. ఏడాది కాలంగా తెర పైకి వచ్చిన పలు రక్షణ కుంభకోణాల నేపథ్యం లో ఈ రంగాన్ని దేశీ బాట పట్టించాలని, అందులో భాగంగా సాయుధ సంపత్తి దిగుమతిని వీలైనంతగా తగ్గించాలని ఇటీవల నిర్ణయించారు. అయినా పలు దేశాలతో పలు ఆయుధ కొనుగోలు ఒప్పందాలు ఇప్పటికే తుది దశలో ఉన్నాయి. వాటిలో కొన్ని: - 126 బహుళార్థ సాధక యుద్ధ విమానాలు - 22 అపాచీ యుద్ధ హెలికాప్టర్లు - 15 చింకూ హెవీ లిఫ్ట్ హెలికాప్టర్లు - 126 రాఫెల్ యుద్ధ విమానాలు - రష్యాతో ఐదో తరం యుద్ధ విమాన ఒప్పందం తుది దశ చర్చల్లో ఉంది. దీనిపై వచ్చే 10 నుంచి 15 ఏళ్లలో ఏకంగా రూ.1.5 లక్షల కోట్లు వెచ్చించాలని సంకల్పించారు! లోక్‌పాల్‌కు రూ. 2 కోట్లే దేశంలో అవినీతి నిరోధానికి ఉద్దేశించిన లోక్‌పాల్‌కు ఈ బడ్జెట్లో నామమాత్రంగా కేవలం రూ. 2 కోట్లనే కేటాయించింది. లోక్‌పాల్ బిల్లుకు ఈ ఏడాది జనవరి 1న రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. సంస్థాగత ఖర్చులకు ఈ మొత్తాన్ని వెచ్చిస్తారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌కు ప్రణాళికేతర పద్దుల కింద రూ.20.35 కోట్లను కేటాయించింది. -
సబ్సిడీలు @ 2.46 లక్షల కోట్లు!
ఆహార భద్రతకు రూ.1.15 లక్షల కోట్లు ఇంధనానికి రూ.65 వేల కోట్లు న్యూఢిల్లీ: అటు ఆహార భద్రత చట్టం.. ఇటు ఇంధన, ఎరువుల రాయితీలు.. వెరసి వచ్చే ఆర్థిక సంవత్సరం సబ్సిడీల మోత మోగనుంది. 2014-15కుగాను సబ్సిడీల కింద ఏకంగా రూ.2.46 లక్షల కోట్లు వెచ్చిస్తామని ఆర్థికమంత్రి చిదంబరం తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఇందులో జాతీయ ఆహార భద్రత చట్టం అమలుకు రూ.1.15 లక్షల కోట్లు కేటాయించారు. ఈ చట్టం అమలుకు తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యానికి ఈ కేటాయింపులే నిదర్శనమని చిదంబరం చెప్పారు. కాగా ఎరువుల సబ్సిడీకి కిందటేడాది ఎంత ఇచ్చారో ఇప్పుడూ అంతే మొత్తాన్ని (రూ.67,970 కోట్లు) కేటాయించారు. ఇవి ఏ మూలకూ సరిపోవని భారత ఎరువుల సంఘం (ఎఫ్ఏఐ) డెరైక్టర్ జనరల్ సతీశ్ చందర్ అసంతృప్తి వ్యక్తంచేశారు. ముఖ్యాంశాలివీ.. - 2014-15 ఆర్థిక సంవత్సరంలో ప్రణాళికేతర కేటాయింపులు.. రూ.12,07,892 కోట్లు. ఇందులో ఆహారం, ఇంధనం, ఎరువుల రాయితీకి రూ.2.46 లక్షల కోట్లు కేటాయించారు. 2013-14 సవరించిన అంచనాల్లో ఈ మొత్తం రూ.2.45 లక్షల కోట్లుగా ఉంది. - ఇంధన సబ్సిడీకి రూ.65 వేల కోట్లు కేటాయించారు. - ఆహార సబ్సిడీకి 2013-14 సవరించిన అంచనాల్లో రూ.92 వేల కోట్లు కేటాయించారు. అయితే ఆ నిధులకు మరో రూ.23 వేల కోట్లు అదనంగా ఇస్తూ 2014-14కు మొత్తం రూ.1.15 లక్షల కోట్లు కేటాయించారు. - ఎరువుల సబ్సిడీకి రూ.67,970 కోట్లు కేటాయించారు. ఇందులో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే యూరి యాకు రూ.12,300 కోట్లు, దేశీయ యూరియా సబ్సిడీకి రూ.31 వేల కోట్లు, ఫాస్పేట్, పొటాషియం వంటి (డీ-కంట్రోల్డ్ ఫెర్టిలైజర్స్) ఎరువులకు రూ.24,670 కోట్లు కేటాయించారు. బియ్యంపై సేవా పన్ను మినహాయింపు బియ్యం లోడింగ్ దశ నుంచి గిడ్డంగుల్లో నిల్వ చేసే దశ వరకూ వసూలు చేస్తున్న సేవా పన్నును మినహాయించనున్నట్లు ఆర్థిక మంత్రి చిదంబరం ప్రకటించారు. ‘‘ఆర్థిక చట్టం-2012లో వ్యవసాయ ఉత్పత్తి నిర్వచనం ప్రకారం వరి నిల్వలకు మాత్రమే సేవాపన్ను నుంచి మినహాయింపు ఉంది. బియ్యాన్ని వరి నుంచి శుద్ధి చేసిన వస్తువుగా నిర్వచనంలో పేర్కొన్నందున మినహాయింపు ఇవ్వలేదు. అయితే ఈ తేడా కృత్రిమంగా ఉన్నందువల్ల బియ్యం లోడింగ్, అన్లోడింగ్, ప్యాకింగ్, నిల్వ దశ వరకూ సేవా పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నా’’ అని చెప్పారు. రాష్ట్రాలకు 3.38 లక్షల కోట్లు కేంద్రం సహాయమందించే పథకాలు (సీఎస్ఎస్)లకు రాష్ట్ర ప్రణాళిక కింద బడ్జెట్లో భారీగా నిధులు పెంచారు. రూ. 3,38,562 కోట్లను ఆ పథకాలకు కేటాయించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది సవరించిన అంచనాల కంటే రూ. 1,19,039 కోట్లు అధికంగా ఉంది. గత బడ్జెట్లో ఈ పథకాలకు రూ. 1,36,254 కోట్లు కేటాయించారు. ప్రణాళిక బడ్జెట్లో మధ్యాహ్న భోజన పథకం, గ్రామీణ ఉపాధి హామీ పథకం తదితర సీఎస్‌ఎస్‌ల అమలుకు అదనంగా సహాయం అందనుంది. ప్రస్తుతం 17 ప్రధాన పథకాల కింద అమలవుతున్న 122 స్కీంలను 66కు కుదించాలని యోచిస్తున్నట్లు ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఆ ప్రకటన ప్రకారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు.. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి రూ. 34,000 కోట్లు, సర్వశిక్ష అభియాన్‌కు రూ. 27,635 కోట్లు, మధ్యాహ్న భోజన పథకానికి రూ. 13,152 కోట్లు, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్‌కు రూ.4,965 కోట్లు కేటాయించారు. అలాగే ఐసీడీఎస్‌కు కేంద్ర సహాయం కింద రూ. 18,631కోట్లు, గ్రామీణ గృహనిర్మాణానికి రూ.16,000 కోట్లు, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనకు రూ. 13,000 కోట్లు అందించనున్నారు. సంపన్నులపై ఈ ఏడాది కూడా ఆర్థిక మంత్రి పి. చిదంబరం కనికరం చూపించలేదు. 2013-14 బడ్జెట్లో విధించిన సూపర్ రిచ్ పన్నును వచ్చే ఏడాది మార్చి వరకూ కొనసాగించాలని ఆయన తన తాజా మధ్యంతర బడ్జెట్లో ప్రతిపాదించారు. యూపీఏ పదేళ్ల హయాంలో గ్రామీణ రోడ్ల నెట్వర్క్ ఏడు రెట్లు పెరిగిందని చిదంబరం తెలిపారు. 2004లో 51,511 కిలోమీటర్లుగా ఉన్న గ్రామీణ రోడ్ నెట్వర్క్ ప్రస్తుతానికి 3,89,578 కి.మీ.కు పెరిగిందని వివరించారు. గతంతో పోలిస్తే ఈ సారి బడ్జెట్లో కేంద్ర హోంశాఖకు 16 శాతం అదనంగా రూ. 59,387 కోట్లు కేటాయించారు. ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో పోలీసు స్టేషన్ల నిర్మాణం, ఆధునీకరణకు చిదంబరం ప్రాధాన్యం ఇచ్చారు. దీంతోపాటు భద్రతాపరమైన వ్యయానికి రూ. 789.08 కోట్లు, పోలీసు దళాల ఆధునీకరణకు రూ. 600 కోట్లు, ఢిల్లీలో మహిళల భద్రతకు రూ. 2 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. -
పొలాలకు పోషక ఎరువులు!
* పెరిగిన సాగు రుణాల పరిమితి * వ్యవసాయ వృద్ధి రేటు 4.6 శాతం * రికార్డు స్థాయిలో పంటల దిగుబడి న్యూఢిల్లీ: ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో యూపీఏ ప్రభుత్వం వ్యవసాయదారులను ఆకర్షించేందుకు బడ్జెట్లో ‘పోషక ఎరువుల’ ఎర వేసింది! 2014-15 బడ్జెట్లో వ్యవసాయ రుణాల పరిమితిని రూ.8 లక్షల కోట్లకు పెంచింది. ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ ఎగుమతులు 2.80 లక్షల కోట్లకు చేరుకోనున్నట్లు ఆర్థికమంత్రి చిదంబరం తెలిపారు. యూపీఏ ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక ఆహార చట్టం ద్వారా దేశ జనాభాలో 67 శాతం మంది తిండి గింజలను చౌకగా పొందేలా చట్టపరమైన హక్కు కల్పించామన్నారు. - వ్యవసాయ రంగ వృద్ధి రేటు ఈ ఏడాది 4.6%కి చేరుకునే అవకాశం. - ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రుణాల పరిమితిని రూ.7 లక్షల కోట్లుగా నిర్దేశించగా రూ.7.35 లక్షల కోట్లకు చేరుకోవచ్చని అంచనా. - వ్యవసాయ రుణాలపై వడ్డీ తగ్గింపు పథకం వచ్చే ఏడాది కూడా కొనసాగింపు. 2006-07లో దీన్ని ప్రవేశపెట్టారు. ఇప్పటివరకు రూ.23,924 కోట్లను రుణాలుగా మంజూరు చేశారు. - పదేళ్లలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 213 మిలియన్ టన్నుల నుంచి 263 మిలియన్ టన్నులకు పెంపు. 2012-13లో 255 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరిగింది. - ఈసారి చక్కెర, పత్తి, తృణ ధాన్యాలు, నూనె గింజలు రికార్డు స్థాయిలో దిగుబడి నమోదయ్యే అవకాశం. - 2012-13లో రూ.2.54 లక్షల కోట్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి. మంచి పరిణామం: ఎంఎస్ స్వామినాథన్ వ్యవసాయ రుణాల పరిమితిని పెంచుతూ బడ్జెట్లో నిర్ణయం తీసుకోవటం మంచి పరిణామం. పెరిగిపోతున్న సాగు ఖర్చులు, వ్యవసాయంపై దేశంలోని యువత పెద్దగా ఉత్సాహం చూపని ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇది సరైన చర్య. -
కారు.. బైకు.. చవక
* తగ్గనున్న కార్లు, టూవీలర్ల ధరలు * 12 శాతం నుంచి 8 శాతానికి తగ్గిన ఎక్సైజ్ సుంకం * బియ్యం నిల్వ, లోడింగ్, అన్‌లోడింగ్‌పై సర్వీస్ ట్యాక్స్ మినహారుుంపు * ఉత్పాదక వస్తువులపైనా పన్ను * 12 నుంచి 10 శాతానికి తగ్గింపు * టీవీలు, ఫ్రిజ్‌లు, మైక్రోవేవ్ ఓవెన్లూ ఇక చవక * అన్ని మొబైల్ ఫోన్లపై 6 శాతం ఎక్సైజ్ పన్ను న్యూఢిల్లీ: మధ్యంతర బడ్జెట్‌ను పురస్కరించుకుని.. తయూరీరంగాన్ని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం కొన్ని పన్ను రాయితీలు ప్రకటించింది. దీంతో ఎస్‌యూవీలు (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్) సహా చిన్నకార్లు, ద్విచక్ర వాహనాల ధరలు తగ్గనున్నాయి. నిర్మాణపరమైన ఉత్పాదకత కూడా గత కొద్దినెలలుగా మందగమనంలో ఉంది. దీంతో కొన్ని ఉత్పాదక వస్తువులు, వినియోగదారులు ఎక్కువగా ఉపయోగించే వస్తువులపైనా ఆర్థికమంత్రి చిదంబరం పన్ను తగ్గింపును ప్రకటించారు. దీంతో టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్ల వంటి వస్తువుల ధరలూ తగ్గనున్నారుు. - అమ్మకాలు తగ్గిన ఆటోమొబైల్ పరిశ్రమకు ఉపశమనం కలిగేలా కార్లు, వాణిజ్య వాహనాలపై ప్రభుత్వం సుంకాన్ని తగ్గించింది. చిన్న కార్లు, మోటార్‌సైకిళ్లు, స్కూటర్లపై 12 శాతంగా ఉన్న ఎక్సైజ్ సుంకాన్ని 8 శాతానికి తగ్గించింది. ఎస్‌యూవీలపై పన్ను 30 శాతం నుంచి 24 శాతానికి తగ్గింది. పెద్ద వాహనాలపై సుంకం 27 శాతం నుంచి 24 శాతానికి, మధ్యతరహా కార్లపై పన్ను 24 శాతం నుంచి 20 శాతానికి తగ్గించారు. ఈ తగ్గింపు వచ్చే జూన్ 20 వరకు వర్తిస్తుంది. - బియ్యం లోడింగ్, అన్లోడింగ్, ప్యాకింగ్, నిల్వపై సర్వీస్ ట్యాక్స్‌ను (సేవాపన్ను) మినహారుుస్తూ ప్రభుత్వం ప్రతిపాదించింది. కార్డ్ బ్లడ్ బ్యాంకులందించే సేవలను కూడా సేవా పన్ను నుంచి మినహాయించారు. - అలాగే కొన్ని ఉత్పాదక వస్తువులు, వినియోగదారులు ఎక్కువగా ఉపయోగించే రిఫ్రిజిరేటర్లు, టీవీలు తదితర వస్తువులపై 12 శాతంగా ఉన్న పన్నును 10 శాతానికి తగ్గించారు. ఇది ఈ ఏడాది జూన్ 30 వరకు వర్తిస్తుంది. - దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడంతో పాటు దిగుమతులను నిరుత్సాహ పరిచే దిశగా అన్ని కేటగిరీల మొబైల్ ఫోన్ల (హ్యాండ్సెట్లు)కు సంబంధించిన ఎక్సైజ్ సుంకాలను 6 శాతానికి పునర్వ్యవస్థీకరించారు. దీంతో రూ.2 వేల లోపు ఉండే తొలిస్థారుు హ్యాండ్సెట్ల ధర పెరగనుంది. - సబ్బులు, ఓలియో రసాయనాల స్వదేశీ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు పారిశ్రామిక చమురు, సంబంధిత ఉత్పత్తులు, కొవ్వుతో కూడిన ఆమ్లాలు, కొవ్వుతో కూడిన మద్యంపై దిగుమతి సుంక నిర్మాణాన్ని 7.5 శాతం వద్ద హేతుబద్దీకరించింది. ఈఈపీసీ హర్షం ముంబై: కార్లు, టూ వీలర్లపై సుంకాన్ని తగ్గించడంపై ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతిదారుల సంస్థ (ఈఈపీసీ) హర్షం వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిర్ణయం ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతికి ఊతం ఇస్తుందని ఈఈపీసీ చైర్మన్ అనుపమ్ షా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్వదేశీ వాహన పరిశ్రమలో తిరిగి వృద్ధిని సాధించేందుకు ఇది దోహదపడుతుందని చెప్పారు. మనకు 2000 కోట్లు కోత.. తగ్గిన కేంద్ర పన్నుల వాటా - ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్నుల వాటాను రూ. 22,131.68 కోట్లకు తగ్గించిన కేంద్రం - వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి కేంద్ర పన్నుల వాటా 26,970 కోట్లు - గ్రాంట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల్లోనూ కోత సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రానికి వస్తాయనుకున్న నిధుల్లో రూ.2,000 కోట్ల మేర తగ్గనున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేటాయింపులను కూడా సవరించారు. ఈ సవరణలతో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర పన్నుల వాటా నుంచి రావాల్సిన నిధుల్లో రూ.2,000 కోట్ల మేర తగ్గనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేంద్ర బడ్జెట్ తొలి అంచనాల్లో కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రానికి రూ.24,132.36 కోట్లు కేటాయించారు. ఇప్పుడు సవరించిన అంచనాల్లో రూ.22,131.68 కోట్లు మాత్రమే రాష్ట్రానికి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రానికి రూ.27,028 కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో తెలపగా, కేంద్ర బడ్జెట్లో మాత్రం రూ.26,970 కోట్లు కేటాయించారు. అంటే రాష్ట్ర బడ్జెట్లో పేర్కొన్న దానికన్నా రూ.58 కోట్లు తగ్గుతోంది. మరోపక్క ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రాంట్ల రూపంలో రాష్ట్రాలకు రూ.77,060 కోట్లు ఇవ్వనున్నట్లు కేంద్రం గత బడ్జెట్లో పేర్కొంది. అయితే ఇప్పుడు సవరించిన అంచనాల్లో ఈ గ్రాంట్లను రూ.61,700 కోట్లకు తగ్గించారు. ఈమేరకు రాష్ట్రానికి వచ్చే గ్రాంట్లు కూడా తగ్గనున్నాయి. కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు రూ.43,776 కోట్లు ఇవ్వనున్నట్లు తొలుత కేంద్ర బడ్జెట్లో పేర్కొన్నప్పటికీ, ఇప్పుడు సవరించిన అంచనాల్లో ఈ నిధులను రూ.39,836 కోట్లకు తగ్గించింది. అంటే రాష్ట్రానికొచ్చే ప్రాయోజిత పథకాల నిధులు కూడా తగ్గిపోనున్నాయి. ఇవి తగ్గుతాయ్.. * బియ్యం, సబ్బులు * మోటార్‌సైకిళ్లు, స్కూటర్లు * చిన్నకార్లు, ఎస్‌యూవీలు * వాణిజ్య వాహనాలు * దేశంలో తయూరైన మొబైల్ ఫోన్లు * టీవీలు, రిఫ్రిజిరేటర్లు, మైక్రోవేవ్ ఓవెన్లు * కంప్యూటర్లు, ప్రింటర్లు, కీబోర్డులు, మౌజ్‌లు, హార్డ్ డిస్క్‌లు, స్కానర్లు * వ్యాక్యూమ్ క్లీనర్లు, డిష్ వాషర్లు, హెరుుర్ డయ్యర్లు * వాటర్ కూలర్లు, టార్చ్లైట్లు, డిజిటల్ కెమెరాలు * ఎలక్ట్రిక్ ఐరన్స్, ఎంపీ 3..డీవీడీ ప్లేయర్లు * బ్లడ్ బ్యాంకుల చార్జీలు తొమ్మిదోసారి... ఫిబ్రవరి 17, 2014 పి.చిదంబరం తొమ్మిదోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డు (8 సాధారణ, 2 మధ్యంతర బడ్జెట్లు) మొరార్జీ దేశాయ్ పేరున ఉంది. స్వాతంత్య్రం తరువాత ఇప్పటివరకు మధ్యంతర, ప్రత్యేకమైనవి కలిపి మొత్తం 83 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. స్టూడెంట్స్‌కు గాలం! విద్యా బడ్జెట్లో దేనికి ఎంతెంత..? ఉన్నత విద్య- రూ.16,200 కోట్లు పాఠశాల విద్య-రూ.51,198 కోట్లు న్యూఢిల్లీ: విద్యారంగానికి కాస్త ఫర్లేదు.. 2014-15 ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ.67,398 కోట్లు కేటాయించారు. ఈ నిధులు కిందటేడాదితో పోలిస్తే దాదాపు 9 శాతం అదనం. అలాగే యూపీఏ సర్కారు ఎన్నికల ముంగిట విద్యార్థులను ఆకట్టుకునే యత్నం చేసింది. 2009, మార్చి 31కి ముందు విద్యా రుణాలు తీసుకొని 2013, డిసెంబర్ 31 వరకు వడ్డీ చెల్లించని విద్యార్థులకు ఊరటనిచ్చే ప్రతిపాదనతో ముందుకు వచ్చింది. ఈ మధ్య కాలంలో వడ్డీని పూర్తిగా తామే భరిస్తామని చిదంబరం తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఈ ప్రతిపాదనతో 9 లక్షల మంది విద్యార్థులకు రూ.2,600 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది. ఈ మొత్తాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కెనరా బ్యాంకుకు బదిలీ చేయనున్నట్టు తెలిపారు. 2009-10 బడ్జెట్లో ప్రణబ్ ముఖర్జీ... విద్యార్థులు తీసుకున్న రుణాల్లో వడ్డీపై రాయితీ ఇచ్చేందుకు సెంట్రల్ స్కీమ్ ఫర్ ఇంటరెస్ట్ సబ్సిడీ(సీఎస్ఐఎస్) పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం పర్యవేక్షణ బాధ్యతలను కెనరా బ్యాంకుకు అప్పజెప్పినవిషయం తెలిసిందే. -
చిదంబరం మధ్యంతర బడ్జెట్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
2014-15 మధ్యంతర బడ్జెట్ హైలైట్స్ మొత్తం బడ్జెట్ వ్యయం రూ.17,63,214 కోట్లు {పణాళికా వ్యయం రూ.5,55,322 లక్షల కోట్లు {పణాళికేతర వ్యయం రూ.12,07,892 కోట్లు. ఇందులో ఆహారం, ఇంధనం, ఎరువుల సబ్సిడీ భారం రూ. 2,46,397 కోట్లు రక్షణ బడ్జెట్ రూ.2.24 లక్షల కోట్లు(10%పెంపు) ప్రధాన పథకాలకు శాఖలవారీగా కేటాయింపులు: 1. గ్రామీణాభివృద్ధి-రూ.82,200 కోట్లు 2. మానవ వనరుల అభివృద్ధి-రూ.67,398 కోట్లు 3. ఆరోగ్య, కుటుంబ సంక్షేమం-రూ.33,725 కోట్లు 4. మహిళా, శిశు సంక్షేమం-రూ.21,000 కోట్లు 5. తాగునీరు, పారిశుధ్యం-రూ.15,260 కోట్లు ఎస్సీ ఉప ప్రణాళికకు రూ.48,638 కోట్లు ఎస్టీ ఉప ప్రణాళికకు రూ.30,726 కోట్లు రైల్వేలకు రూ.29 వేల కోట్ల బడ్జెటరీ దన్ను 11 వేలకోట్లతో కేంద్ర సాయుధ బలగాల ఆధునీకరణ {పభుత్వ రంగ బ్యాంకులకు మరింత మూలధనాన్ని సమకూర్చేందుకు రూ.11,200 కోట్లు ఎస్సీ వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఆదాయ పన్ను శ్లాబుల్లో మార్పు లేదు. రూ.కోటి వార్షికాదాయమున్న సంపన్న వర్గాలపై 10 శాతం, రూ.10 కోట్ల టర్నోవరున్న సంస్థలపై 5 శాతం సర్‌చార్జీ కొనసాగుతుంది సాయుధ బలగాలకు ‘ఒక ర్యాంకు, ఒకే పెన్షన్’. అందుకు 2014-15లో రూ.500 కోట్లు నిర్మాణరంగానికి అన్ని ఎగుమతులపైనా పన్నుల రద్దు 2014-15లో లక్ష్యాలు రూ.8 లక్షల కోట్ల వ్యవసాయ రుణాల జారీ {పభుత్వ నికర రుణాలు రూ.4.57 లక్షల కోట్లు 50 వేల మెగావాట్ల సంప్రదాయ విద్యుదుత్పత్తి కేంద్రాల నిర్మాణం విదేశీ మారక నిల్వలను మరో 1,500 కోట్ల డాలర్ల మేరకు పెంచడం వచ్చే దశాబ్ద కాలంలో 10 కోట్ల ఉద్యోగాల కల్పన 2013-14లో సాధించినవి... {దవ్య లోటు 2013-14లో 4.6 శాతం, 2014-15 అంచనా 4.1 శాతం 2013-14లో ఎగుమతుల అంచనా 32,600 కోట్ల డాలర్లు {పస్తుత ఖాతా లోటు 4,500 కోట్ల డాలర్లు 2013-14 ఆర్థిక వృద్ధి అంచనా 4.9 శాతం {పపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ది 11వ స్థానం బలహీన వర్గాలకు 2013-14లో రూ.66,500 కోట్ల రుణాలు రూ.6.6 లక్షల కోట్ల విలువైన 296 ప్రాజెక్టులకు జనవరి చివరి నాటికి ఆమోదం 2013-14లో ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కేంద్రానికి రూ.88,188 కోట్ల డివిడెండ్. ఇది బడ్జెటరీ అంచనాల కంటే రూ.14,000 కోట్లు అదనం 2.1 కోట్ల మంది ఎల్పీజీ వినియోగదారులకు రూ.3,370 కోట్ల నగదు బదిలీ 57 కోట్ల ఆధార్ కార్డుల జారీ ఈశాన్య రాష్ట్రాలు, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లకు రూ.1,200 కోట్లు అదనపు సాయం కాలదోష రహితంగా రూ.1,000 కోట్ల నిర్భయ నిధి, అదనంగా మరో రూ.1,000 కోట్లు తాయిలాలు: స్వదేశీ మొబైల్ ఫోన్లపై ఎకై్సజ్ సుంకంలో కోత చిన్న కార్లు, ద్విచక్ర వాహనాలు, వాణిజ్య వాహనాలపై ఎకై్సజ్ సుంకం 4 శాతం తగ్గింపు. ఎస్‌యూవీలపై 6 శాతం, పెద్ద కార్లపై 3 శాతం, మధ్య తరహా కార్లపై 4 శాతం తగ్గింపు 2009 మార్చి 31కి ముందు తీసుకున్న విద్యార్థి రుణాల వడ్డీ చెల్లింపుపై మారటోరియం. 9 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి బ్లడ్ బ్యాంకులకు సర్వీస్ ట్యాక్సు మినహాయింపు శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధనలకు ఊతమిచ్చేందుకు రీసెర్చ్ ఫండింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు రూ.100 కోట్లతో కమ్యూనిటీ రేడియోకు ప్రోత్సాహం -
బడ్జెట్-2014 ముఖ్యాంశాలు
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరం సోమవారం లోక్‌సభలో 2014-15 ఏడాదికిగాను మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌కు సంబంధించిన ముఖ్య అంశాలు : * గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మందగమనం *2013లో గ్లోబల్ జీడీపీ వృద్ధిరేటు: 3 శాతం *2013-14 ఆర్థిక లోటును 4.65 శాతానికి పరిమితి చేస్తాం *2013-14లో ఆహార ధాన్యాల ఉత్పత్తి: 263 మిలియన్ టన్నులు *కరెంట్ అకౌంట్ లోటు(సీఏడీ): 45 బిలియన్ డాలర్లు *ఆహార ద్రవ్యోల్బణమే పెద్ద సమస్య *ద్రవ్యోల్బణం కట్టడికి ప్రభుత్వం, ఆర్బీఐ చర్యలు తీసుకుంటున్నాయి *ఇండియాకు రేటింగ్ డౌన్‌గ్రేడ్ భయం లేదు *ఈ ఏడాది 15 బిలియన్ డాలర్ల ఫారెక్స్ నిల్వలు జమ అయ్యాయి *వ్యవసాయ రుణాల లక్ష్యం: రూ.7.35 లక్షల కోట్లు *గతంలో వ్యవసాయ రుణాల అంచనా: రూ.7 లక్షల కోట్లు *ఎగుమతుల లక్ష్యం: 326 బిలియన్ డాలర్లు (గతం కంటే 6.4 శాతం ఎక్కువ) *పెట్టుబడుల రేటు: 34.8 శాతం, సేవింగ్స్ రేటు: 30.1 శాతం *2013-14 జీడీపీ వృద్ధిరేటు అంచనా: 4.9 శాతం *జనవరి ఆఖరుకు కేబినెట్ ప్యానెల్ క్లియర్ చేసిన ప్రాజెక్టులు: 296 *మ్యానుఫ్యాక్చరింగ్ రంగం పుంజుకోవడం లేదు *ఇన్ఫ్రా ప్రాజెక్టుల ఫండింగ్ నిబంధనల్ని సడలించాం *2013-14లో అదనంగా జమ కానున్న 29300 మెగావాట్ల విద్యుదుత్పత్తి *గడిచిన 9 క్వార్టర్లలో జీడీపీ వృద్ధిరేటు 7.9 నుంచి 4.4 శాతానికి పతనం *డిసెంబరు, మార్చి క్వార్టర్లలో 5.2 శాతం, 4.9 శాతం ఉంటుందని అంచనా *రూపాయి హెచ్చుతగ్గులను ప్రభుత్వం, ఆర్బీఐ, సెబీ నియంత్రించాయి *చక్కెరపై నియంత్రణను పూర్తిగా ఎత్తివేశాం *నిర్మాణంలో 50 వేల మెగావాట్ల థర్మల్, జల విద్యుత్ ప్లాంట్లు *2013-14లో జాతీయ సోలార్ మిషన్ రెండో దశ మొదలైంది *విధానపరమైన నిర్ణయాల్లో నిష్క్రియాపరత్వం లేదు *వచ్చే ఆర్థిక సంవత్సరంలో 4 అల్ట్రా మెగా పవర్ ప్లాంట్లు ప్రారంభం *రూ.100 కోట్ల చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం ఫండ్ *అభివృద్ధిలో యూపీఏకి సాటి వచ్చే ప్రభుత్వం లేదు *ఈశాన్య రాష్ట్రాల కోసం అదనంగా రూ.1200 కోట్ల కేటాయింపు *భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఎఫ్‌డీఐ విధానాలను సరళీకరించాం *జాతీయ సోలార్ మిషన్ కింద 2 వేల మెగావాట్ల ప్రాజెక్టులు *జనవరి నాటికి క్లియర్ చేసిన 296 ప్రాజెక్టుల విలువ: రూ.6.6 లక్షల కోట్లు *57 కోట్ల మందికి ఆధార్ కార్డులు జారీ చేశాం *బొగ్గు ఉత్పత్తి 554 మిలియన్ టన్నులకు పెరుగుతుంది *గడిచిన పదేళ్లలో సగటున బొగ్గు ఉత్పత్తి: 361 మిలియన్ టన్నులు *ప్రణాళిక వ్యయంలో మార్పు లేదు, రూ.5.55 లక్షల కోట్లే *2013-14లో ప్రణాళికేతర వ్యయం బడ్జెట్ అంచనాలను మించుతుంది *2014-15లో ప్రణాళికేతర వ్యయం : రూ.12.07 లక్షల కోట్లు *2014-15లో సబ్సిడీలు: రూ.2.65 లక్షల కోట్లు *2014-15లో ఫుడ్ సబ్సిడీ అంచనా: రూ.1.15 లక్షల కోట్లు *నిర్భయ ఫండ్‌కు అదనంగా రూ.1000 కోట్లు *2014-15లో ఇంధన సబ్సిడీ: రూ.65 వేల కోట్లు *ఈ ఏడాదికి చెందిన రూ.35 వేల కోట్ల ఇంధన సబ్సిడీని వచ్చే సంవత్సరానికి రోల్ ఓవర్ చేస్తాం *ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖకు రూ.33,725 కోట్లు * పీఎస్‌యూ బ్యాంకుల్లో క్యాపిటల్ పెట్టుబడి: రూ.11,200 కోట్లు *రక్షణ శాఖకు: రూ.2.24 లక్షల కోట్లు, గతంలో: రూ.2.04 లక్షల కోట్లు *2014-15లో వ్యవసాయ రుణాల లక్ష్యం: రూ.8 లక్షల కోట్లు *మైనార్టీ వ్యవహారాల శాఖకు: రూ.3,711 కోట్లు *ట్యాక్స్ శ్లాబులో ఎలాంటి మార్పు లేదు *క్యాపిటల్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్లకు ఎక్సైజ్ సుంకం 2 శాతం తగ్గింపు *సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలకు ఇచ్చే విరాళాలపై పన్ను మినహాయింపు *ఆటో రంగానికి ఊరట *ఎస్యూవీ వాహనా ఎక్సైజ్ సుంకం 30 నుంచి 24 శాతానికి తగ్గింపు *చిన్న కార్లపై ఎక్సైజ్ సుంకం 8 శాతానికి తగ్గింపు *పెద్ద, మధ్య తరహా కార్లపై ఎక్సైజ్ సుంకం 20 శాతానికి తగ్గింపు *2014-15లో రెవిన్యూ లోటు 3 శాతానికి తగ్గుతుంది *2014-15లో ద్రవ్యలోటు 4.1 శాతానికి తగ్గుతుంది *చిన్న కార్లపై 4 శాతం ఎక్సైజ్ సుంకం తగ్గింపు *రూ.5 లక్షల కారు రూ.20 వేల దాకా తగ్గే అవకాశం *రైస్ కంపెనీలకు సర్వీసు ట్యాక్స్ ఊరట *దేశంలో మొబైల్ ఫోన్ల తయారీని ప్రోత్సహిస్తాం *ఆహార సబ్సిడీ రూ.1.15 లక్షల కోట్లు *10 శాతం పెరిగిన రక్షణ బడ్జెట్ *రూ.2 లక్షల 24 వేల కోట్లకు చేరిన రక్షణ బడ్జెట్ *ఆహార ద్రవ్యోల్బణం ఇంకా ఆందోళనకరంగానే ఉంది *ఆహార ధాన్యాల ధరలు దిగివచ్చాయి *ఉత్పాదక రంగం ఇంకా పుంజుకోలేదు *దళిత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకోసం ప్రత్యేక ఫండ్ *ఆహార ధాన్యాల ఉత్పత్తి అంచనాలను అధిగమించాయి *విదేశీ మారక నిల్వలు పెరిగాయి *ఆధార్ అమలుకు కట్టుబడి ఉన్నాం *సమాజంలో అట్టడుగు వర్గాలకు ఆధార్ అవసరం *రక్షణ శాఖ కేటాయింపు రూ.2,24,000 కోట్లు 'రక్షణ ఉద్యోగులకు ఒక ర్యాంకు- ఒక పెన్షన్‌కు ఆమోదం '2014-15 ప్రణాళిక వ్యయం రూ.5,55,322 కోట్లు 'పాత విద్యరుణాల వడ్డీపై విద్యార్థులకు స్వల్ప ఊరట -
తగ్గనున్న కార్లు, బైకులు, మొబైల్ ఫోన్ల ధరలు
న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రి చిదంబరం సోమవారం లోక్ సభలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ నామ్‌కే వాస్తేగా ఉంది. ఒక్క ఆటో రంగం, ఎలక్ట్రానిక్ గూడ్స్ రంగాలకు కాస్త ఊరటనిచ్చే నిర్ణయాలు తీసుకున్నారు. ఇతరత్రా ఎవరికీ సంతోషం కలిగించే వార్త బడ్జెట్లో లేదు. అదే సమయంలో బాధ పెట్టే నిర్ణయం కూడా లేకపోవడమే సంతోషాన్నిచ్చే అంశమే. కార్లు, బైకులు, స్కూటర్లు, మొబైల్ ఫోన్ల ధరలు తగ్గించే నిర్ణయాలు చిదంబరం ప్రకటించారు. ఇతరత్రా నిర్ణయాలన్నీ కేటాయింపులే. కొన్ని కేటాయింపులు యథాతథంగా ఉండగా, మరికొన్ని రంగాలకు కేటాయింపులు పెంచారు. రక్షణ శాఖ బడ్జెట్‌ను 10 శాతం పెంచారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ప్రత్యేకించి ఎలాంటి కేటాయింపు లేకపోవడం విశేషం. సీమాంధ్రను సంతృప్తి పరిచే నిర్ణయం ఏదైనా ఉంటుందేమోనన్న ఆలోచనను చిదంబరం అసలు పట్టించుకోలేదు. -
సభ్యుల ఆందోళనల మధ్యే చిదంబరం బడ్జెట్
-
చిదంబరం రూటెటు!
ఎన్నికల ముందు వరాలు కురిపిస్తారా? కీలక ప్రకటనలేవీ ఉండకపోవచ్చంటున్న విశ్లేషకులు ద్రవ్యలోటు అదుపునకు కట్టుబడే అవకాశం... పరిశ్రమలు, సామాన్యులకు కొంత ఊరట కల్పించొచ్చని అంచనా ఎక్సైజ్ సుంకం, సేవా పన్నుల్లో తగ్గింపునకు చాన్స్ లోక్‌సభ ఎన్నికల ముంగిట.. యూపీఏ ప్రభుత్వం చివరి బడ్జెట్ అస్త్రాన్ని సంధించేందుకు సిద్ధమవుతోంది. పార్లమెంట్లో ఆర్థిక మంత్రి పి. చిదంబరం నేడు 2014-15 ఏడాదికిగాను మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికల్లో ప్రజలను ఆకర్షించేందుకు వరాలేమైనా కురిపిస్తారా? లేదంటే ద్రవ్యలోటు అదుపుతప్పకుండా చూస్తామన్న మాటకు కట్టుబడతారా అనేది ఆసక్తికరంగా మారింది. అసలే కుంభకోణాలు, ఆర్థిక వ్యవస్థ మందగమనం ఇతరత్రా ఎడాపెడా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న యూపీఏ సర్కారు బడ్జెట్‌ను ఎన్నికల కోణంలోనే ఆవిష్కరించే అవకాశాలూ లేకపోలేదు. సంక్షేమ పథకాలకు భారీగానే నిధులను కుమ్మరించే ఆస్కారం ఉంది. అయితే, ఇది కేవలం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కావడంతో కీలక పాలసీ నిర్ణయాలకు ఆస్కారం తక్కువే. దీంతో నేరుగా ప్రజలకు లబ్ధిచేకూర్చే కొన్ని వరాలు, ఇబ్బందుల్లో ఉన్న పారిశ్రామిక రంగానికి చేయూతనిచ్చేలా ప్రోత్సాహకాలు మాత్రమే ఉండొచ్చనే అంచనాలు ఎక్కువగా వినబడుతున్నాయి. జనరంజక బడ్జెట్లను ప్రవేశపెట్టడంలో దిట్టగా పేరొందిన చిదంబరం.. తన ఆఖరి బడ్జెట్ ఇన్నింగ్స్‌లోనూ మెప్పిస్తారా? లేదంటే ఉసూరుమనిపిస్తారా అనేది మరికొద్ది గంటల్లోనే తేలిపోనుంది. న్యూఢిల్లీ: మధ్యంతర బడ్జెట్లో కీలకమైన పాలసీ నిర్ణయాలు, చర్యలను ఆశించనక్కర్లేదని ఎక్కువమంది విశ్లేషకులు, నిపుణులు చెబుతున్నారు. నేడు(సోమవారం) విత్తమంత్రి చిదంబరం... జూలై వరకూ ప్రభుత్వ వ్యయాలకు సంబంధించి పార్లమెంట్ అనుమతి కోరుతూ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. గత సంప్రదాయాల ప్రకారం చూస్తే.. మధ్యంతర బడ్జెట్లో ప్రత్యక్షపన్నుల్లో(ఆదాయపు పన్ను ఇతరత్రా) మార్పుచేర్పులు, విధానపరమైన ప్రకటనలేవీ ఉండే అవకాశం లేదు. కొన్ని ప్రోత్సాహాలు మినహా ద్రవ్యలోటు కట్టడి లక్ష్యానికే చిదంబరం ప్రాధాన్యం ఇవ్వొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే, సామాన్యులకు, ఆర్థిక వ్యవస్థకు చేయూతనిచ్చేలా కొన్ని ఊరట చర్యలు ఖాయమంటున్నారు. ఎక్సైజ్ సుంకం, సేవా పన్నులను సమీక్షించనున్నట్లు ఇప్పటికే చిదంబరం సంకేతాలివ్వడం తెలిసిందే. ప్రధానంగా ఆర్థిక మందగమనం నేపథ్యంలో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న పారిశ్రామిక రంగాలు ఈ ప్రోత్సాహకాలను డిమాండ్ చేస్తుండటమే దీనికి కారణం. అయితే, ఇప్పుడు సుంకాలు, పన్నుల్లో చేసే మార్పులను... ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం జూన్/జూలైలో ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్లో మళ్లీ మార్చే అవకాశాలుం టాయి. దీంతో కార్పొరేట్లు, స్టాక్ మార్కెట్లు మధ్యం తర బడ్జెట్లో చర్యలను అంతగా పట్టించుకోకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సంస్కరణలకు నో చాన్స్... కీలకమైన సంస్కరణల విషయంలో రాజకీయంగా ఏకాభిప్రాయం లేనందున వీటి జోలికి ప్రభుత్వం ఇక వెళ్లనట్టే. ప్రధానంగా వస్తు, సేవల పన్ను(జీఎస్టీ), ప్రత్యక్ష పన్నుల కోడ్(డీటీసీ), బీమాలో విదేశీ ప్రత్యక్ష పన్నుల(ఎఫ్‌డీఐ) పెంపునకు సంబంధించిన బిల్లులను ప్రస్తుత యూపీఏ-2 సర్కారు ఇక పక్కనబెట్టేయనుంది. ‘ఆదాయపు పన్ను, కస్టమ్స్, ఎక్సైజ్ చట్టాల్లో సవరణలను ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో తీసుకొచ్చే అవకాశాల్లేవు. అయితే, చట్టసవరణలు అవసరం లేని ప్రతిపాదనలకు ప్రాధాన్యం ఉంటుంది. భవిష్యత్ దృక్కోణంతోనే ఎలాంటి చర్యలైనా చేపడతాం’ అని చిదంబరం ఇటీవలే వ్యాఖ్యానించారు. ఓటాన్ అకౌంట్ అంటే... సాధారణంగా లోక్‌సభ ఎన్నికల సంవత్సరంలో ప్రభుత్వం ప్రవేశపెట్టే మధ్యంతర బడ్జెట్‌నే ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌గా వ్యవహరిస్తారు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్-మే నెలల్లో జరగనున్నాయి. కొత్త ప్రభుత్వం జూన్ లేదా జూలైలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగుస్తుంది. ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఖర్చులు(వేతనాలు, నిర్వహణపరమైన ఖర్చులు, సంక్షేమ పథకాలకు వ్యయం ఇతరత్రా) యథాతథంగా కొనసాగాలంటే నిధుల కేటాయింపులకు పార్లమెంట్ ఆమోదం తప్పనిసరి. దీంతో వీటికి సంబంధించిన జమాఖర్చులతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అంటే 3-4 నెలలకు మాత్రమే ఇది పరిమితమవుతుంది. తదుపరి వచ్చే కొత్త ప్రభుత్వం 2014-15 మొత్తం ఆర్థిక సంవత్సరానికి పూర్థిస్థాయిలో బడ్జెట్‌ను తీసుకొస్తుంది. ‘సూపర్ రిచ్’ పన్ను కొనసాగిస్తారా? అత్యంత ధనిక(సూపర్ రిచ్) వర్గాలపై గత బడ్జెట్లో విధించిన పన్నును కొనసాగిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. దీనికి చట్టసవరణ అవసరం కానుండటమే దీనికి కారణం. చిదంబరం మాటల ప్రకారం చట్టసవరణలేవీ లేకపోతే దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సిందే. రూ. కోటికి మించి ఆదాయం ఆర్జించే సంపన్నులపై 10 శాతం సర్‌ఛార్జీ(సూపర్ రిచ్ ట్యాక్స్)ని విధిస్తూ 2013-14 బడ్జెట్లో చిదంబరం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు రూ.42,800 మందిని ఈ పన్ను చట్రంలోకి తీసుకొచ్చారు. సొంత డబ్బాకే పరిమితమా! ఎన్నికలు ముంచుకొస్తుండటంతో ప్రస్తుత యూపీఏ-2 హయాంలో తాము సాధించిన ఘనతలు, చర్యలను ఊదరగొట్టేందుకు బడ్జెట్ ప్రసంగంలో చిదంబరం ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అవకాశాలున్నాయి. అంతర్జాతీయంగా తీవ్ర ఇబ్బందులు నెలకొన్నప్పటికీ ద్రవ్యలోటు, కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్)ల కట్టడికి తాము తీసుకున్న చర్యలను ప్రధానంగా ప్రస్తావించనున్నారు. అంతేకాకుండా స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) మందగించడానికి కారణాలను, దీన్ని తిరిగి గాడిలోపెట్టేందుకు తాము చేపట్టిన చర్యలను కూడా ఆయన వివరించనున్నారు. జీడీపీ వృద్ధి రేటు గతేడాది దశాబ్దపు కనిష్టమైన 5 శాతానికి పడిపోగా... ఈ ఏడాది 4.9 శాతానికి పరిమితమవుతుందని ముందస్తు అంచనా. కాగా, ప్రస్తుత 2013-14లో ద్రవ్యలోటును జీడీపీలో 4.8 శాతానికి కట్టడి చేస్తామని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా 2జీ స్పెక్ట్రం వేలం విజయంతో నిధులు భారీగానే(మార్చిలోగా కనీసం రూ.20 వేల కోట్లు ఖజానాకు వస్తాయని అంచనా) రానుండటంతో ద్రవ్యలోటు లక్ష్యానికి లోబడే ఉండొచ్చని భావిస్తున్నారు. ఇక క్యాడ్ గత ఆర్థిక సంవత్సరంలో చరిత్రాత్మక గరిష్టానికి(జీడీపీలో 4.8%) ఎగబాకగా.. ఈ ఏడాది 2.5 శాతానికిలోపే పరిమితం కానుంది. బడ్జెట్‌పై ఇన్వెస్టర్ల చూపు ఆర్థిక మంత్రి చిదంబరం ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్‌పై ఇన్వెస్టర్లు దృష్టి సారిస్తారని స్టాక్ నిపుణులు పేర్కొన్నారు. సోమవారం ప్రకటించనున్న ఓటాన్ అకౌంట్ స్వల్ప కాలానికి మార్కెట్ల ట్రెం డ్‌ను నిర్దేశిస్తుందని అంచనా వేశారు. దీంతోపాటు డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) పెట్టుబడులు కీలకంగా నిలవనున్నాయని చెప్పారు. ఇక అంతర్జాతీయ సంకేతాలకూ ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. రానున్న రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలకు తెరలేవనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటాన్ అకౌంట్‌ను మార్కెట్లు క్షుణ్ణంగా పరిశీలిస్తాయని కొటక్ సెక్యూరిటీస్ ప్రైవేట్ క్లయింట్ గ్రూప్ రీసెర్చ్ హెడ్ దీపేన్ షా పేర్కొన్నారు. ద్రవ్యలోటు, తదితర పరిణామాలపై మార్కెట్లు తమదైన శైలిలో స్పందిస్తాయని విశ్లేషించారు. పరోక్ష పన్నులకు సంబంధించి ఏ రంగానికైనా ప్రోత్సాహకాలను కల్పిస్తే ఆ ప్రభావం మార్కెట్లపై ఉంటుందని వ్యాఖ్యానించారు. ద్రవ్యలోటు ఎఫెక్ట్: ద్రవ్యలోటు అంశానికి ఇన్వెస్టర్లు ప్రాధాన్యత ఇస్తారని నిపుణులు పేర్కొన్నారు. వచ్చే ఏడాది(2015)కి ప్రకటించే ద్రవ్యలోటు లక్ష్యం ఆధారంగా ప్రభుత్వ రుణ సమీకరణ కార్యకలాపాలుంటాయని, దీంతో ఈ అంశం కీలకంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. సమీప కాలంలో మార్కెట్లు పెరిగినప్పుడల్లా అమ్మకాలకు తెరలేచే అవకాశమున్నదని వివరించారు. ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీకి 6,100 పాయింట్ల స్థాయి కీలకంకానుందని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ అంచనా వేశారు. ఈ స్థాయికిపైన కొనుగోళ్లు పుంజుకుంటాయని తెలిపారు.