సబ్సిడీలు @ 2.46 లక్షల కోట్లు!
ఆహార భద్రతకు రూ.1.15 లక్షల కోట్లు
ఇంధనానికి రూ.65 వేల కోట్లు
న్యూఢిల్లీ: అటు ఆహార భద్రత చట్టం.. ఇటు ఇంధన, ఎరువుల రాయితీలు.. వెరసి వచ్చే ఆర్థిక సంవత్సరం సబ్సిడీల మోత మోగనుంది. 2014-15కుగాను సబ్సిడీల కింద ఏకంగా రూ.2.46 లక్షల కోట్లు వెచ్చిస్తామని ఆర్థికమంత్రి చిదంబరం తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఇందులో జాతీయ ఆహార భద్రత చట్టం అమలుకు రూ.1.15 లక్షల కోట్లు కేటాయించారు. ఈ చట్టం అమలుకు తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యానికి ఈ కేటాయింపులే నిదర్శనమని చిదంబరం చెప్పారు. కాగా ఎరువుల సబ్సిడీకి కిందటేడాది ఎంత ఇచ్చారో ఇప్పుడూ అంతే మొత్తాన్ని (రూ.67,970 కోట్లు) కేటాయించారు. ఇవి ఏ మూలకూ సరిపోవని భారత ఎరువుల సంఘం (ఎఫ్‌ఏఐ) డెరైక్టర్ జనరల్ సతీశ్ చందర్ అసంతృప్తి వ్యక్తంచేశారు.
ముఖ్యాంశాలివీ..
- 2014-15 ఆర్థిక సంవత్సరంలో ప్రణాళికేతర కేటాయింపులు.. రూ.12,07,892 కోట్లు. ఇందులో ఆహారం, ఇంధనం, ఎరువుల రాయితీకి రూ.2.46 లక్షల కోట్లు కేటాయించారు. 2013-14 సవరించిన అంచనాల్లో ఈ మొత్తం రూ.2.45 లక్షల కోట్లుగా ఉంది.
- ఇంధన సబ్సిడీకి రూ.65 వేల కోట్లు కేటాయించారు.
- ఆహార సబ్సిడీకి 2013-14 సవరించిన అంచనాల్లో రూ.92 వేల కోట్లు కేటాయించారు. అయితే ఆ నిధులకు మరో రూ.23 వేల కోట్లు అదనంగా ఇస్తూ 2014-14కు మొత్తం రూ.1.15 లక్షల కోట్లు కేటాయించారు.
- ఎరువుల సబ్సిడీకి రూ.67,970 కోట్లు కేటాయించారు. ఇందులో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే యూరి యాకు రూ.12,300 కోట్లు, దేశీయ యూరియా సబ్సిడీకి రూ.31 వేల కోట్లు, ఫాస్పేట్, పొటాషియం వంటి (డీ-కంట్రోల్డ్ ఫెర్టిలైజర్స్) ఎరువులకు రూ.24,670 కోట్లు కేటాయించారు.
బియ్యంపై సేవా పన్ను మినహాయింపు
బియ్యం లోడింగ్ దశ నుంచి గిడ్డంగుల్లో నిల్వ చేసే దశ వరకూ వసూలు చేస్తున్న సేవా పన్నును మినహాయించనున్నట్లు ఆర్థిక మంత్రి చిదంబరం ప్రకటించారు. ‘‘ఆర్థిక చట్టం-2012లో వ్యవసాయ ఉత్పత్తి నిర్వచనం ప్రకారం వరి నిల్వలకు మాత్రమే సేవాపన్ను నుంచి మినహాయింపు ఉంది. బియ్యాన్ని వరి నుంచి శుద్ధి చేసిన వస్తువుగా నిర్వచనంలో పేర్కొన్నందున మినహాయింపు ఇవ్వలేదు. అయితే ఈ తేడా కృత్రిమంగా ఉన్నందువల్ల బియ్యం లోడింగ్, అన్‌లోడింగ్, ప్యాకింగ్, నిల్వ దశ వరకూ సేవా పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నా’’ అని చెప్పారు.
రాష్ట్రాలకు 3.38 లక్షల కోట్లు
కేంద్రం సహాయమందించే పథకాలు (సీఎస్‌ఎస్)లకు రాష్ట్ర ప్రణాళిక కింద బడ్జెట్‌లో భారీగా నిధులు పెంచారు. రూ. 3,38,562 కోట్లను ఆ పథకాలకు కేటాయించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది సవరించిన అంచనాల కంటే రూ. 1,19,039 కోట్లు అధికంగా ఉంది. గత బడ్జెట్‌లో ఈ పథకాలకు రూ. 1,36,254 కోట్లు కేటాయించారు. ప్రణాళిక బడ్జెట్‌లో మధ్యాహ్న భోజన పథకం, గ్రామీణ ఉపాధి హామీ పథకం తదితర సీఎస్‌ఎస్‌ల అమలుకు అదనంగా సహాయం అందనుంది.
ప్రస్తుతం 17 ప్రధాన పథకాల కింద అమలవుతున్న 122 స్కీంలను 66కు కుదించాలని యోచిస్తున్నట్లు ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఆ ప్రకటన ప్రకారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు.. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి రూ. 34,000 కోట్లు, సర్వశిక్ష అభియాన్‌కు రూ. 27,635 కోట్లు, మధ్యాహ్న భోజన పథకానికి రూ. 13,152 కోట్లు, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్‌కు రూ.4,965 కోట్లు కేటాయించారు. అలాగే ఐసీడీఎస్‌కు కేంద్ర సహాయం కింద రూ. 18,631కోట్లు, గ్రామీణ గృహనిర్మాణానికి రూ.16,000 కోట్లు, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనకు రూ. 13,000 కోట్లు అందించనున్నారు.
సంపన్నులపై ఈ ఏడాది కూడా ఆర్థిక మంత్రి పి. చిదంబరం కనికరం చూపించలేదు. 2013-14 బడ్జెట్లో విధించిన సూపర్ రిచ్ పన్నును వచ్చే ఏడాది మార్చి వరకూ కొనసాగించాలని ఆయన తన తాజా మధ్యంతర బడ్జెట్లో ప్రతిపాదించారు. యూపీఏ పదేళ్ల హయాంలో గ్రామీణ రోడ్ల నెట్‌వర్క్ ఏడు రెట్లు పెరిగిందని చిదంబరం తెలిపారు. 2004లో 51,511 కిలోమీటర్లుగా ఉన్న గ్రామీణ రోడ్ నెట్‌వర్క్ ప్రస్తుతానికి 3,89,578 కి.మీ.కు పెరిగిందని వివరించారు.
గతంతో పోలిస్తే ఈ సారి బడ్జెట్‌లో కేంద్ర హోంశాఖకు 16 శాతం అదనంగా రూ. 59,387 కోట్లు కేటాయించారు. ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో పోలీసు స్టేషన్ల నిర్మాణం, ఆధునీకరణకు చిదంబరం ప్రాధాన్యం ఇచ్చారు. దీంతోపాటు భద్రతాపరమైన వ్యయానికి రూ. 789.08 కోట్లు, పోలీసు దళాల ఆధునీకరణకు రూ. 600 కోట్లు, ఢిల్లీలో మహిళల భద్రతకు రూ. 2 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.